నా విప్లవ జీవితంలో ఒకే ఒక్కసారి తారసపడ్డ సి.పి.ఐ. (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ అది చర్చల కాలం కావడంతో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలాడు. గాజర్ల రవిగా తెలుగు నేలకు, ఉదయ్ గా భారత ప్రజలకు పరిచయమైన కామ్రేడ్ గణేష్ మరణ వార్త జూన్ 18, 2025 ఉదయం నుండే టీవీల్లో ప్రసారమయ్యింది. ఆయనతో పాటు మరణించారని చెబుతున్న అరుణ, అంజు లతో పాటు ఏ ఒక్కరి మృతదేహం, ఫోటోలు కూడా విడుదల చేయబడలేదు. కామ్రేడ్ గణేష్ ఎన్కౌంటర్ తో మావోయిస్టు చర్చల ప్రతినిధులు ముగ్గురు ఇక భౌతికంగా లేనట్లే. 2005 జూలై 1న కరీంనగర్ జిల్లా బదనకల్ లో చంపబడ్డ జనశక్తి శాంతి దూత కామ్రేడ్ రియాజ్ తో కలిపితే ఆ విలక్షణ కాలపు శాంతి దూతలు-సమరయోధులైన కామ్రేడ్ రామకృష్ణ అనారోగ్యంతో దండకారణ్యంలో అక్టోబర్ 14, 2021న అమరుడు కాగా, కామ్రేడ్ సుధాకర్ జూన్ 5, 2025న ప్రపంచ పర్యావరణ దినం నాడు ఇంద్రావతి నేషనల్ పార్క్ లో మరణించినట్లు ప్రకటించారు. ప్రభుత్వాలు శాంతి చర్చలను గుడ్డిగా నిరాకరిస్తున్న కాలంలో రెండు వారాల తేడాతో జరిగిన కామ్రేడ్స్ సుధాకర్, గణేష్ ల మరణాలు అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. లెక్క లేనన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఏది ఏమైనా ఈ సందర్భంగా శాంతికి-సమరానికి సంకేతం గా నిలిచిన నలుగురు కామ్రేడ్స్‌కు వినమ్రంగా విప్లవ జోహార్లర్పిద్దాం. మావోయిస్టులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య శాంతి చర్చలు జరగాలని విషయం ప్రజా ఉద్యమంగా మారిన సందర్భాన్ని కామ్రేడ్ గణేష్ అమరత్వం సందర్భంగా ఎత్తిపడదాం.
ఓరుగల్లు విప్లవ యోధుడు-వెలిశాల వీర పుత్రుడు :
దాదాపు 57 సంవత్సరాల వయస్సు గల గాజర్ల రవికి జన్మనిచ్చిన ఓరుగల్లు ఎంతోమంది విప్లవ యోధులను తీర్చిదిద్దింది. అలాంటి ఓరుగల్లు జిల్లా వెలిశాల వీర పుత్రుడైన గణేష్ కుటుంబంలోనే ఆరుగురు ఉద్యమంలో నేలకొరగగా అందులో ఒకరు మాత్రమే అనారోగ్యంతో మరణించగా గణేష్ అన్న, వదినలు, గణేష్ జీవిత సహచరి, ఆమె సోదరుడు, కామ్రేడ్ గణేష్ తో సహా అంతా రాజ్యం చేతిలో ఎన్కౌంటర్లో అమరులైన వాళ్లే. ఎన్నో ఆపదల్లో బతికి బయటపడ్డ కామ్రేడ్ గణేష్ కగార్ దాడికి చిక్కి అమరుడైనాడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లిలో జరిగిందన్న ఎన్కౌంటర్ నిజమైతే, రంపచోడవరం హాస్పిటల్లో పార్థివ దేహం స్వాధీనానికి వెళ్ళిన తమ్ముడికి నాటకీయ ఫక్కీలో చాలా ఆలస్యంగా మృతదేహాన్ని చూపించారు. అప్పటికే కుళ్ళి కంపు కొడుతున్న దేహాన్ని చూసి అది అంతకుముందే జరిగిన హత్యా అని అతను నిర్ధారణకు వచ్చాడు. ఎంతో ఉద్వేగ వాతావరణంలో వెలిశాలకు గణేష్ పార్థివ దేహం వస్తుందన్న ఆశాభావంతో ఆయన మరణ వార్త తెలియగానే “త్యాగాల నెత్తుటి ముద్దయి గణేషన్న వస్తుండో” అంటూ రాసిన పాటను వేలాదిమంది కన్నీళ్ళతో గొంతే కోరస్ ఇస్తుండగా విమలక్క పాట ఆలపించింది. పార్టీలు, సంస్థలకతీతంగా విప్లవ లాంచనాలతో కామ్రేడ్ గణేష్ అంతిమయాత్రలో పాల్గొని కామ్రేడ్ గణేష్ కు అంతిమ వీడ్కోలు పలికాను.
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా మావోయిస్టులతో చర్చలు జరుపుతామన్నది. గెలిచిన తర్వాత 2024 జనవరిలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోం మంత్రి కూడా అయినా విజయ్ శర్మ బహిరంగంగా చర్చలు జరుపుతామని ప్రకటించాడు. మావోయిస్టు పార్టీ కూడా దానికి సమ్మతి తెలిపిన తర్వాత కూడా శాంతి చర్చలకు బదులు నెత్తుటేరులు ప్రవహిస్తున్నాయి. మావోయిస్టులు తుపాకులు వదిలి పెడితేనే చర్చలు అని తెగేసి చెప్పిన ప్రభుత్వానికి బదులుగా మావోయిస్టులు, మీరు అడవిలో ఖనిజల తవ్వకాలు ఆపాలని గానీ, పోలీసు క్యాంపులు అడవుల నుండి ఎత్తివేయాలని గాని షరతులు విధించలేదు. తామే స్వచ్ఛందంగా కాల్పులు విరమించి, ప్రభుత్వం కూడా కాల్పుల విరమణకు అంగీకరించి తమ సాయుధ బలగాలను క్యాంపులకే పరిమితం చేయాలని మాత్రమే కోరారు. కానీ కేంద్ర హోం మంత్రి ఛత్తీస్గఢ్ లో పర్యటించి 2026 మార్చి కల్లా మావోయిస్టులను అంతం చేస్తామని ప్రకటించారు. ఫలితంగా ఆరు మాసాల పసిపాపతో కలిపి సుమారు 560 మందిని కగార్ దాడుల్లో బలితీసుకున్నారు. శాంతి చర్చలు జరగాలని ఒకవైపు పాలక ప్రతిపక్ష పార్టీలతో సహా విప్లవ పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులు, దేశభక్తులు ముక్తకంఠంతో నినదిస్తుండగానే రెండు వారాల తేడాతో ఇద్దరు శాంతి చర్చల ప్రతినిధులను కాల్చి చంపబడడం యాదృచ్ఛికం కాకపోవచ్చును. ఈ విధంగా ప్రజలక అన్నిటి సంద్రాలు విప్లవ ఆవేశాలు ఏకకాలంలో పొంగుతుండగా ఒక కిలోమీటర్ దూరం కూడా లేని దహన సంస్కార స్థలానికి మూడు గంటల దాకా సమయం పట్టింది. చిన్ననాడే తండ్రి మరణం తర్వాత తల్లి గాజర్ల కనకవ్వ ఐదుగురు కొడుకులు ఉన్న ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దిన తీరు గాజర్ల అశోక్ చెబుతూ విప్లవోద్యమంలో ఆ కుటుంబం నిర్వహించిన పాత్రను సోదాహరణగా వివరించారు. పోరాటం తప్ప మార్పు జరగాలంటే మరే ఇతర కొలమానం లేదని తన అన్న గణేష్ మాటగా ఆయన స్పష్టం చేశాడు.
కామ్రేడ్ గణేష్ తో శాంతి చర్చల కాలం నాటి అనుబంధం :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004 మేలో జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా నక్సలిజానికి వ్యతిరేకంగా తనకు ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. అప్పుడే వైయస్ సారధ్యంలోనే కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో “నక్సలైట్ల తూటాలకు పోలీసు తూటాలు జవాబు కాదని, నక్సలైట్ సమస్య ఆర్థిక-సామాజికాంశాలతో కూడిన రాజకీయ సమస్య” అని ప్రకటించింది. ఎన్నికల్లో తాము గెలిస్తే నక్సలైట్లతో శాంతి చర్చలు జరుపుతామని ప్రకటించింది. ఎన్నికలు నక్సల్స్ సమస్యపై రెఫరండంలాగా మారాయి. అప్పటికే తెలుగుదేశంతో ఆనాటి పీపుల్స్ వార్ చర్చలు జరపాలని చూసిన అవి విఫలం అయినాయి. అందుకే ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ సిటిజన్స్ కన్సర్న్ కమిటీ (పౌర స్పందన వేదిక) నాయకులైన ఎస్.ఆర్.శంకరన్ చోరవతో శాంతి చర్చలు సాకారమయ్యాయి. ముందుగా పీపుల్స్ వార్ తో జరిగిన సంప్రదింపుల్లో ఆ తర్వాత జనశక్తి కూడా భాగమై ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి, నిర్దిష్ట ఎజెండా, విధివిధానాలు, సేఫ్ ప్యాసేజ్ లతో పాటు మావోయిస్టు పార్టీపై నిషేధం-తలలపై వెలలు ఎత్తేసిన తర్వాతనే ఈ చర్చలు జరిగాయి. ఆయుధాల సమస్య, కాల్పుల విరమణ ఒప్పందం దగ్గర కొంత పేచీ వచ్చినా, ఆయుధాల సమస్యను ఒక ఎజెండాగా చర్చించుటకు అంగీకరించడం, కాల్పుల విరమణ పై రెండు వేర్వేరు కాగితాలపై సంతకాలు చేసిన పత్రాలను ఒక దగ్గర పెట్టి ఈ చర్చలు ప్రారంభమైనాయి. దీనికి ముందు పీపుల్స్ వార్-జనశక్తిల మధ్య చర్చలు కొనసాగాయి. సరిగ్గా చర్చల కోసం నల్లమల ఫారెస్ట్ లోని చిన్న ఆరుట్ల నుండి బయటకు వచ్చేకంటే ముందే కామ్రేడ్ గణేష్ తో పరిచయం ఏర్పడ్డది. ఐదుగురు ప్రతినిధులం వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నా, ఐదుగురిలో మేమిద్దరం తెలంగాణ ప్రాంతానికి చెందిన వాల్లము.
పగిడేరు ప్రతిఘటన యాత్ర – మణుగూరు సభ :
నల్లమల చిన్న ఆరుట్ల నుండి గుంటూరు జిల్లా గుత్తికొండ బిలం బహిరంగ సభకు హాజరైన రెండు పార్టీల శాంతి బృందం తర్వాత నేరుగా హైదరాబాద్ మంజీరా గెస్ట్ హౌస్ కు చేరుకున్నాము. అక్కడి నుండి మేమిద్దరం 1969 ఏప్రిల్ 16న ఖమ్మం జిల్లా పగిడేరు ప్రతిఘటన జరిగిన చారిత్రిక గ్రామంలో అమరుల స్మారక స్తూపం ఆవిష్కరణ, మణుగూరు బహిరంగ సభ కోసం బయలుదేరాము. నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం మొదలగు అనేక పట్టణాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆటాపాటలతో విప్లవ స్వాగతాలు ఇస్తుండగా మా ప్రయాణం సాగింది. మణుగూరులో ఓపెన్ టాప్ జీబులో వేలాదిమంది ప్రజలు డప్పు చప్పులతో ఎదుర్కొన్నారు. మణుగూరు నుండి పగిడేరుకు, పగిడేరు నుండి మణుగూరు సభకు ప్రజల జాతరలా సాగింది. 50 వేల మందికి పైగా హాజరైన సభలో దాదాపు గంటసేపు గణేష్ ప్రసంగం ఏకధాటిగా సాగింది. చర్చలకు మధ్యవర్తులుగా ఉన్న వరవరరావు, చంద్రన్న, శ్రీనివాస రావుల మాటలు, విప్లవ సాంస్కృతిక కార్యక్రమాలతో చర్చల ఏజెండాను ప్రజా ఏజెండాగా మార్చాము.”దున్నే వారికే భూమి-శాంతి-అభివృద్ధి” లక్ష్యంగా జరిగిన శాంతి చర్చలను ప్రజలు సొంతం చేసుకున్నారు. నిజమైన ప్రజాస్పందన వెల్లువెత్తగా మంజీరా గెస్ట్ హౌస్ దృశ్యం పాలకులకు కంటగింపయ్యింది. చర్చల పర్యవసానం ఏమైనప్పటికీ ప్రభుత్వం ఆరు రోజుల చర్చాకాలంలో భూమి సమస్య, కుల సమస్య, ప్రజాస్వామిక హక్కులు, తెలంగాణ రాష్ట్రం మొదలగు ఎజెండా అంశాలన్నీ ప్రజల మధ్య చర్చనీయాంశమయినాయి. నక్సలిజం హింస కాదు, అన్ని రకాల హింసా-ధ్వంసాలు, దోపిడి-పీడనలకు పరిష్కారం అనే సందేశమే ఆనాటి శాంతి చర్చల సారాంశం.
ముప్పయ్యవ వడిలో శాంతి చర్చల్లో పాల్గొన్న కామ్రేడ్స్ రియాజ్, గణేష్ లు మా ముగ్గురి కంటే చాలా చిన్నవాళ్లు. ప్రజా యుద్ధ వీరుడుగా, తీవ్రమైన షుగర్ వ్యాధితో 21 సంవత్సరాలు పోరాడుతూ 35 సంవత్సరాల్లో ఏనాడు కూడా ఇంటి ముఖం చూడాలని కోరుకొని దృఢచిత్తుడు. అందుకే వెలిశాల ఆయన కోసం ఎదురు చూడడమే కాదు, రాష్ట్రం నలుమూలల నుండి ఆయనను చూడాలని జనం ఎంతో ఆత్రంగా వచ్చారు. కామ్రేడ్ గణేష్ భౌతికంగా లేకపోవడం మావోయిస్టు పార్టీకి, విప్లవోద్యమానికి నష్టమే కావచ్చు, కానీ ఆయన త్యాగం లక్షలాది మందికి గొప్ప ప్రేరణనిస్తుంది. కామ్రేడ్ గణేష్ ను అది సజీవం చేస్తుంది. చర్చల్లో భాగమైన నలుగురి వీరయోధుల త్యాగం వారిని అజరామరం చేస్తుంది. ప్రకటిత-అప్రకటిత ఎమర్జెన్సీ లను ఎదుర్కొంటూ విప్లవోద్యమం ముందుకు సాగుతుంది. శాంతి చర్చలకు వచ్చిన ఐదుగురిలో నలుగురు అమరులై మీరొక్కరే మిగిలారని కొంతమంది జర్నలిస్టులు అన్నారు. ఇదొక యాదృచ్ఛిక పరిణామం. కానీ ఈ నలుగురి త్యాగం పార్టీలకు అతీతంగా ఎంతోమందిని శాంతి-సమరయోధులుగా తీర్చిదిద్దుతుంది. లక్షలాది ప్రజల ముందు నేనొక్కడిని ఎంత!?
లాల్ సలాం కామ్రేడ్ గణేష్
శాంతి సమరయోధులు కామ్రేడ్స్ రియాజ్, రామకృష్ణ, సుధాకర్, గణేష్ లకు విప్లవ జోహార్లు.
27 జూన్, 2025
-విప్లవాభినందనలతో
అమర్ (జనశక్తి)
(28 జూన్, 2025న వెలిశాలలో కామ్రేడ్ గణేష్ సంస్మరణ సభ సందర్భంగా… )