ఆమె చిన్నపిల్లా కాదు
లోకం పోకడ తెలియని చిట్టితల్లీ కాదు
పూలనూ ముళ్ళనూ గుర్తుపట్టలేనంత అఙ్ఞానీ కాదు
నడుస్తున్న దారిలో దెబ్బలు తినీ తినీ
గాయపడ్డ పాదాలతోనే అడుగులు వేస్తున్న అనుభవఙ్ఞురాలు
అయినా తెలిసి తెలిసి
అతని విషపు కౌగిళ్ళలోకి ఎలా నడిచి వెళ్ళింది
చివరకు బాధ్యతను మరిచి మరణాన్ని ఎలా ఆశ్రయించగలిగింది
సహజీవనం కోరుకుంటున్నది కాలసర్పమని తెల్సింతర్వాత
అది కాటు వేయకుండా ఉంటుందా
ఏ అనుబంధాన్ని పెనవేసుకోవడం కోసం
ఇంకొక బంధాన్ని తెంపాలనుకున్నావు తల్లీ!
కళ్ళపై కమ్ముకొన్న దుఃఖపు తరగలు
దాగిన వాస్తవాలను ఎంత కాలమని మరుగుపరుస్తాయి
కురుస్తున్న సానుభూతి వర్షంలో
నిజానిజాలను వెతికి పట్టుకోవడం మరిచిపోలేం కదా
నువ్వు ఇష్టపడ్డావో ప్రేమించావో స్నేహించావో కానీ
చేస్తున్న పని సమాజ హితం కానప్పుడు
జరిగిన జీవన విధ్వంసానికి సంజాయితీలనవసరం
గమ్యం లేని గమనాలను
జీవితంలోకి ఆహ్వానించడమూ అపరాధమే
సందేహం లేదు
కచ్చితంగా వాడు శిక్షార్హుడే
ఒళ్ళంతా ముళ్ళున్న బ్రహ్మజెముడు చెట్టు వాడు
నిర్మూలించవలసిందే
కళ్ళ నిండా కామపు పొరలు కమ్ముకొని తిరుగుతున్న ఖడ్గమృగం వాడు
అడ్డు తొలగించవలసిందే
పచ్చగా ఉన్న దగ్గర మేసి
వెచ్చగా ఉన్న దగ్గర పడకేసే వాడు
దరి చేరనియ్యకూడదు
రాజకీయ అండదండల కండలు పెంచి
ఆంబోతులా రంకెలు వేస్తున్న వాడు
కట్టడి చేయవలసిందే వాన్ని
కాదనను కానీ
నీ కన్నీళ్ళకు పరిష్కారంగా మృత్యువును ఎంచుకోవడాన్ని
ఎలా సమర్థించగలను తల్లీ!
ప్రతి రోజూ
ఎందరో స్వేచ్చలు నేల రాలుతున్న ఈ భూమిలో
మనం ఏ సంస్కృతిలో జీవిస్తున్నాం
ఏ సంస్కృతికి తెలిసి తెలిసి జీవిత గమనాన్ని ముడి వేస్తున్నాం
ఏ సంస్కృతి దేశంలో వికసించాలని కోరుకుంటున్నామో
నిష్పక్షపాతంగా మనల్ని మనం
ప్రశ్నించుకోవలసిన సందర్భమిది!