రోజూ కాకపోయినా
అప్పుడప్పుడైనా సరే
లోపలి మనిషితో మాట్లాడుతూ ఉండాలి.
బయటి మనుషులు కృత్రిమత్వాన్ని
ప్రదర్శిస్తారేమో కాని
లోపలి మనిషి అలా కాదు.
అతనిది లోతైన స్వభావం.
పాదరసంలా జారిపోయే
ఐస్ క్రీంలా కరిగిపోయే మనస్తత్వం.
నిర్మలత్వానికి, నిజాయితీకి
నిబద్ధతకు నిదర్శనంగా
నాకు లోపలి మనిషి కనిపిస్తాడు.
నేను..
ఏమీ తోచనప్పుడు..
మనశ్శాంతి దొరకనప్పుడు
కాసేపు లోపలి మనిషితో
ముచ్చటిస్తాను.
చిరుగాలికి తేలిపోయే
పూలరెక్కల్లాగా
నేను చెప్పినదానికల్లా అలా అలా
తలలూపేస్తూ మాట్లాడతాడు..
దొరకనిది దొరికేదాకా
వెతుకులాడే
మొండి స్వభావం అతనిది.
లోపలిదంతా బయటపడేసే
లోపలి మనిషంటే
నాకు లోపలినుంచి తన్నుకొచ్చే
చచ్చేంత ప్రేమ…
నేను కాసేపు అతనితో అలా
మాట్లాడుతుంటే
కాలం తన చేతుల్తో
అలా నన్ను తోసేసి
ముందుకెళ్ళిపోతుంటుంది.