‘మౌనం’ కథ : సామాజికార్థిక విశ్లేషణ

భువనచంద్ర కవి. కథకుడు. గీత రచయిత. తనచుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించి అనేక కథలు రాశారు. ఈ కథల్లోనివన్నీ సజీవ పాత్రలే. వాస్తవ సంఘటనల ఆధారంగా రాసిన కథలు కాబట్టే వీటిలో ఇంత గుండెతడి ఉన్నది. భువనచంద్ర సమాజ సాహిత్య సంబంధాలను లోతుగా అధ్యయనం చేశారు. అందుకే కథల్ని ఇంత వాస్తవికంగా రాశారు. భువనచంద్ర రాసిన ‘మౌనం’ కథలో సామాజికార్థిక విశ్లేషణ చేయడం ఈ వ్యాస ప్రధాన ఉద్దేశం.

‘మౌనం’ కథ`ఇతివృత్తం :

ఇది`ఓ మనిషి కథ. ఆ మనిషి జీవిత కథ. ఈ కథ అతని జీవితమే కాదు, కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనందరి కథ. వేలఏళ్లుగా ఒక తరం నుంచీ మరో తరానికి మారుతున్న కథ. ఇది నీదీ. నాదీ. మనందరిదీ. బాల్యం నుంచీ ముది వయసు దాకా అనేకానేక సందర్భాలను ప్రస్తావిస్తూ చెప్పిన కథ. ఉత్తమ పురుషలో సాగిన ఈ కథ సమాజంలోని ‘హిపోక్రసీ’ నగ్న స్వరూపాన్ని విప్పి చెప్పింది. మనిషి జీవితం చుట్టూ అల్లుకున్న కుటుంబ బంధాలు, వాటి వెనక ఉన్న ఆర్థిక సంబంధాల గురించి సూక్ష్మ స్థాయిలో చర్చించిన కథ ఇది. ప్రేమలూ, ఆప్యాయతల వెనక అడుగడుగునా ఆర్థిక సంబంధాలు ఎట్లా వ్యాపించి ఉంటాయో చిత్రించాడు, భువనచంద్ర. ఈ కథలో పాత్రలకు పేర్లు లేవు. ‘మౌనం’ కథ ‘నది’ పత్రిక (2014)లో ప్రచురితమైంది. 

ఈ కథ`బాల్యంలో అమ్మ గోరుముద్దలు తినిపించే సందర్భం నుంచి మొదలైంది. బాల్యలో అన్నం తినని మారాం చేస్తే అమ్మ, చందమామను చూపిస్తూ ఊరడిరచిన సందర్భం ప్రతీఒక్కరి జీవితంలోనూ అనుభవమే. అమ్మ పాటల్లో చందమామ, రెక్కల గుర్రం దృశ్యాలు దృశ్యాలుగా కనుపాపల్లో ముద్రితమైన సంగతి అందరి జీవితంలోనూ ఉన్నదే. మనలో చిన్నతనం నుంచే ఆశలు మొదలవుతాయి. వాటి కోసం అనేక కలలుకంటాం. వాటి సాకారం కోసం ఎదురుచూస్తుంటాం. కానీ, అనుకున్నదేదీ జరగదు. జీవితం ఓ ప్రవాహం. ప్రవాహమే దాని పని. ఎక్కడా ఆగదు. అనుకున్న గమ్యమెప్పటికీ చేరలేం.

మౌనం కథలో కూడా అలాంటి సందర్భాలు అనేకం ఎదురవుతాయి. సమాజంలో యథేచ్ఛగా కొనసాగుతున్న ద్వంద్వ విలువల్ని ప్రశ్నించాడు, కథకుడు.

‘‘బాగా చదివి పరీక్షలు పాసైపోతే ‘పేద్ద’ కలెక్టరువి అయిపోతావు. ఆ తరువాత హాయిగా బతకొచ్చు.’’ అని తన అమ్మ చెప్పింది. డిగ్రీ ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యాడు. ఐనా కలెక్టరు కాలేకపోయాడు. కలెక్టరు ఆఫీసులో గుమస్తాగా చేరాడు. చిన్నపుడు అమ్మ పాటకు చందమామ దిగిరాలేదు. కష్టపడి చదివిన పట్టాతో కోరుకున్న ఉద్యోగమూ రాలేదు. దీంతో కథకునిలో ప్రశ్న మొదలైంది.

‘‘కలెక్టరు గార్ని చూసినప్పుడల్లా మా అమ్మ ‘కల’, చందమామని చూసినప్పుడల్లా ‘రెక్కల గుర్రం’ జ్ఞాపకం వస్తాయి. ఎందుకిన్ని ఆశలు చూపిస్తారూ?’’ (భువనచంద్ర కథలు; 2014, పుట: 94)

ఈ ప్రశ్న జీవితంలో ప్రతీ సందర్భంలోనూ ఎదురవుతుంది. అతని జీవితమంతా రాజీ దారిలోనే నడిచింది. ప్రేమ, పెళ్లి, సంసారం, సంతానం.. అన్నిట్లోనూ రాజీపడటంతోనే సాగింది. చిన్నతనం నుంచే పెద్దలు మన మెదడును సూక్తులతో నింపేశారు. వాటి ఆధారంగానే బతకాలని బోధించారు. సూక్తుల దారుల్లో నడుస్తూ చివరికి మన వ్యక్తిత్వం మనది కాకుండా పోతుంది. సమాజం విధించిన విలువల చట్రంలో బందీ అయి సొంత వ్యక్తిత్వం లేకుండా పోతుంది. వీటన్నిటినీ ఎదిరిస్తూ సొంత వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంటే మనల్ని రాడికల్‌గా చూస్తారు. వాళ్ల దృష్టిలో మనం తీవ్రవాదులం. సంఘాన్ని ధిక్కరించేవాళ్లం. తిరుగుబాటుదారులం. దీంతో మనపై సంఘ విద్రోహ ముద్ర వేస్తారు. 

‘‘వచ్చే జన్మ కోసం ఈ జన్మలో పుణ్యం చెయ్యమన్నారు. చచ్చాక ‘స్వర్గం’ కోసమో, ‘నరకం’లో పడకుండా ఉండటం కోసమో పూజలన్నారు. వ్రతాలన్నారు… దీక్షలన్నారు…. ఉపవాసాలన్నారు…. మనిషి మనిషిగా బతకటానికి ఏం చెయ్యాలో ఎందుకు చెప్పలేదు? అసలు మనిషిని మనిషిగా గుర్తించి ఎన్ని యుగాలైంది?’’ (అదే; పుట: 94)

ఇట్లా కథకుని జీవితంలో సమాజం గురించి తీవ్ర మథనం మొదలైంది. సంఘం విధించిన కట్టుబాట్ల కట్టుగుంజలపై నిరసన పెరిగింది. ఈ కట్టుగుంజలు మనిషిని ఎట్లా బందీగా మారుస్తుందో అర్థంచేసుకున్నాడు. ప్రతీ క్షణం స్వేచ్ఛ కోసం తండ్లాడు. ఐనా ఎక్కడా వాటిని ధిక్కరించే సాహసం చేయలేదు.  

సరైన ప్రేమనివ్వట్లేవని ప్రేమించిన భార్య కంప్లయింటు. అడిగింది ఇవ్వలేదని పిల్లల కంప్లయింటు. వీళ్లందరూ అడిగిందివ్వడానికే నేను పుట్టానా? అని లోలోపల దిగులు పడ్డాడు. రక్త సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన మనుషుల స్వభావాలను చూసి కలతచెందాడు. ‘‘నా ‘బాల్యం’ నాది కాదు. నా ‘యవ్వనం’ నాది కాదు. నా ‘చావూ’ నాది కాదు. ఎవరితో స్నేహం చెయ్యాలో నిర్ణయించేదీ చెప్పేదీ వాళ్లే… అంటే ‘పెద్దలే’. ఎవర్ని పెళ్లి చేసుకుంటే ఇంటి పరువు`ప్రతిష్ట నిలుస్తాయో నిర్ణయించేదీ వాళ్లే. ఆ పెద్దలే’’ (అదే; పుట: 95)  

ఇట్లా మన పెద్దలు బాల్యం నుంచే మనపై అతిశ్రద్ధ తీసుకుంటారు. మన ఆలోచనలన్నీ వాళ్లే నియంత్రిస్తారు. దీంతో స్వతంత్రంగా ఆలోచించలేని స్థితిలోకి వెళ్లిపోతాం. దీంతో లోలోపల ఘర్షణ ఏర్పడుతుంది. బయటి పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోలేని అశక్తులుగా మిగిలిపోతాం. ఈ సంఘర్షణను కథకుడు అద్భుతంగా కథనం చేశాడు. పెద్దల్ని ధిక్కరించి, కులం కాని అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అందరికీ దూరమయ్యాడు. ఇంటా బయటా వెలివేతలు. హేళనలు. ధూషణలు. పెళ్లయిన మరుక్షణం నుంచే భార్య నుంచి సాధింపులు. ఎన్నెన్నో ఊహించుకొని పెళ్లి చేసుకున్నాననీ, తానూహించిన జీవితం ఇది కాదనీ ఆమె ప్రతీక్షణం అనేది. ఈ మాటలు అతని మనసును బాధించేవి. అయినా ప్రేమించి పెళ్లి చేసుకున్న సహచరి మనసును ఎక్కడా నొప్పించకుండా మెలిగాడు. ‘‘చిన్నప్పుడు నన్ను పెద్దలు దిద్దితే, పెళ్లయిన మరుక్షణం నించీ ఈవిడ దిద్దటం మొదలు పెట్టింది. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో. ఏది తినాలో, ఏది తినకూడదో… ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో`ఇవన్నీ ఆవిడే నిర్ణయించాలి. కాదంటే యుద్ధం. ‘ప్రేమించిన’ ఒక్క నేరానికి జీవితాంతం నన్ను ‘దిద్దే’ హక్కు తనకుందిట. తను నన్ను దిద్దేది నా ‘బాగు’ కోసమేనట.

ఈ జీవితం ‘మౌనం’ పాలైంది.’’ (అదే; పుట: 96) అంటూ మౌనాల్లోకి కూరుకుపోయాడు. ఏది మాట్లాడినా తప్పు తీసే కుటుంబం, సమాజం నుంచి దూరంగా జరిగినట్లనిపించింది. ఇంతలో ‘తండ్రి ఆస్తిలో కూతురికీ హక్కుంది. ఇస్తావా? కోర్టుకెళ్లమంటావా?’ అంటూ కూతురూ, అల్లుడూ కలిసి బెదిరించారు. ‘నన్ను కన్నారు కనుక పెంచే బాధ్యత మీది. ముసలితనంలో మీ బాధ్యత నేనెందుకు తీసుకోవాలి? అంటున్న కొడుకు. దీంతో అతనిలో రక్తసంబంధాల వెనక ఉన్న ఆర్థిక కోణం లోతుగా అర్థమైంది. ఇంకా మౌనంలోకి వెళ్లిపోయాడు. తనకు ఏ ఆస్తీ లేదు. ఉన్నదల్లా యిల్లు మాత్రమే. ఒకప్పుడు పదివేలకు కొన్న యిల్లు ఇప్పుడు రెండు కోట్ల విలువ చేస్తుంది. అందుకే అందరూ ఆ ఆస్తి కోసమే ఎదురుచూస్తున్నారు. వాటా కావాలని అడుగుతున్నారు. ‘మీ బాధ్యత నేనెందుకు తీసుకోవాలి అన్న కొడుకు, ఇప్పుడు ఇల్లు అమ్మేద్దా నాన్నా…మంచి ఆఫర్‌. మిమ్మల్ని నెత్తిమీద పెట్టుకొని చూసుకుంటాగా’ అంటూ ప్రేమగా మాట్లాడుతున్నాడు. పెళ్లి కాగానే తల్లిదండ్రుల్నిద్దర్నీ వదిలివెళ్లిన వాడు ఇప్పుడు అత్యంత ప్రేమగా మాట్లాడుతున్నాడు. తన భార్య కూడా ‘కొడుకు మాట కాదనకండీ’ అంటున్నది. కొడుకూ, కూతురూ, అల్లుడూ మొదట్లో ప్రేమను వ్యక్తం చేశారు. ఇప్పుడు కోర్టుకు లాగుతామన్నారు.

‘‘మనసులు కలవడానికి అక్కరలేని చట్టం, ఆస్తి పంపకానికి కావాలి. విడగొట్టుకోవడానికి కావాలి.

నేనేం చెయ్యనూ?

ఆ డబ్బుతో నాకు పనిలేదు… ఆ విషయం వాళ్లకీ తెలుసు.

వాళ్లకి నేనక్కరలేదు… ఆ విషయం నాకు తెలుసు’’ (అదే; పుట: 98) చట్టాలూ, కోర్టులూ ఆస్తి పంపకాల్లో ఎట్లా పనిచేస్తాయో అతనికి తెలుసు. ఇంటినుంచి దూరంగా వెళ్లిపోయాడు. ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా కూర్చున్నాడు. తన జీవితం ఇట్లా ఎందుకయిందో ఆలోచిస్తున్నాడు. తన సుఖాలన్నీ వదులుకొని పిల్లలకోసం అనేక త్యాగాలు చేస్తే, ఇవాళ వాళ్లు ఆస్తి కోసం కోర్టుకు లాగుతానంటున్నారు. ఇదే అతన్ని నిద్ర నుంచి దూరం చేసింది. మానసిక వ్యాకులత పెంచింది. లోలోపల కల్లోలం చెలరేగుతున్నది. అందుకే ఇంటి నుంచీ, బంధువుల్నించీ దూరంగా వెళ్లిపోయాడు. దిగులుగా ఉన్నాడు. ఎన్నాళ్లుగానో లోలోపల గూడుకట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా పొంగుకొచ్చింది. ఇంతలో అతనికి పెద్దలు గుర్తొచ్చారు. వాళ్ల హద్దులు గుర్తొచ్చాయి. ‘‘వద్దు. ఏడవకూడదు. మగవాడు ఏడవటానికి అనర్హుడు. 

ఆడవాళ్లే ఏడవాలిట. అది వాళ్ల జన్మహక్కట. నవ్వే ఆడదాన్ని, ఏడ్చే మగాడ్ని నమ్మకూడదట. ఆఖరికి ఏడవటానిక్కూడా ‘హద్దులు’ నిర్ణయించారు ‘పెద్దలు’.

అసలు ‘పెద్దలు’ నిర్ణయించంది ఏముందీ?

నా ‘పేరు’తో సహా నిర్ణయించింది వాళ్ళే. నా పేరనే ఏమిటీ, ఎవరి ‘పేరై’నా నిర్ణయించేది వాళ్ళే.

పుట్టుకతో నా కులాన్ని, నా మతాన్ని, నా పేరుని, నా చదువుని, నా పెళ్ళిని, నా సుఖాన్ని, నా దుఃఖాన్ని, నా పరువునీ, నా ప్రతిష్టనీ, సర్వాన్ని వాళ్ళే నిర్ణయించారు. ఆ ‘చెలియలి కట్ట’ దాటకూడదు. దాటరానిది. మరి నేనేం చేసేందుకు పుట్టానూ?’’ (అదే; పుట: 101) ఇదంతా మనసులో చెలరేగుతున్న ఆలోచనలు. సమాజం, సంఘం, బంధువులూ, కుటుంబమూ… ఇవన్నీ ఎట్లా మోరల్‌ పోలీసింగ్‌ చేస్తున్నాయో ఒక్కొక్కటీ గుర్తుచేసుకున్నాడు. తన నిర్ణయానికి విలువే లేకుండా పోయింది. స్వతంత్రంగా ఏదీ ఆలోచించవద్దని సమాజం విధించిన కట్టుబాట్లు గుర్తొచ్చాయి. జీవితాంతం పెద్దలు చెప్పింది అనుసరించడమేనా? వాళ్లు చెప్పినట్టు నడుచుకోవడమేనా? ఏమీటీ ఈ బతుకు? అనిపించింది. తనపై తనకే జాలి. కోపం. దుఃఖం. ఈ దుఃఖం ఏనాటిదో? తరతరాలుగా తరలివస్తున్న దుఃఖం. కెరలివస్తున్న దుఃఖం. కెరటమై దూసుకువస్తున్న దుఃఖం. ఎక్కడికీ పారిపోలేడు. ఏం చేయాలి మరి. ఈ వెతుకులాటలో, తండ్లాటలో నిద్ర దూరమైంది.

‘‘నా నెత్తిమీద కత్తుల్లా ‘శాస్త్రాలూ, ఉపనిషత్తులూ, వేదాలూ’

మాట్లాడకు మూర్ఖుడా… మాట్లాడకు.

చెప్పింది చెయ్‌… ప్రశ్నలడక్కు. వాళ్ల దగ్గర ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. చచ్చింతరువాత నీకు ‘స్వర్గ’ ప్రాప్తి కలిగించే కోటానుకోట్ల కిటుకులు వాళ్లు పరిశీలించి పరిశోధించి కనిపెట్టారు. నీ పని వినడం మటుకే. ప్రశ్నించడం తగదు గాక తగదు.’’ (అదే; పుట:102)

ఇంటినుంచి ఎక్కడికో దూరంగా వెళ్లాడు. చుట్టూ చిమ్మచీకటి. కనుచూపుమేరలో శ్మశానం. నిశ్శబ్దం. పక్కనుంచే పారాడుతూ పోతున్న పాములు. ఏది చూసినా భయం లేకుండా పోయింది. మనుషులకంటే ప్రమాదకరమైనవేవీ అతనికి కన్పించలేదు. మనుషుల విషతుల్య ఆలోచనల కంటే ఈ లోకం విషపూరితమైనవేవీ లేవని అతని నమ్మకం. చాలా రోజులుగా నిద్రలేదు. ఈ ఆర్థిక బంధాల విధ్వంసం గురించి ఆలోచిస్తున్నాడు. సమాజం గుర్తొచ్చింది. అది ఎంతటి క్రూరమైందో తెలిసింది. విలువలు, సంఘం అంటూ మనిషిని మనిషిగా కాకుండా చేసిన దుర్మార్గం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. కులాన్నీ, మతాన్నీ, దేశాన్నీ కాపాడటం కోసం చావమని చెప్పిన సమాజమంటే అసహ్యం కల్గింది. 

‘‘కులం’ కోసం చచ్చిపో…

‘మతం’ కోసం చచ్చిపో…

‘దేశం’ కోసం చచ్చిపో…

‘మనిషి’గా మాత్రం బతకొద్దు. ‘మనిషి’ బతుకు ‘మాయ’. ‘కులం’ నిజం. ‘మతం’ నిజం… నీ మనుగడే అబద్దం. సందేహమా?’’ (అదే; పుట: 102)

వీటిని కాపాడటం కోసం ప్రాణాలివ్వాలని చెప్పింది సమాజం. మనిషి బతుకును మాయగా తేల్చింది. వాస్తవ జీవితాన్ని మాయ అని తీర్పులిచ్చింది. నువ్వూ మాయ, ఈ ప్రపంచమే మాయ అని మాయావాదాన్ని నరనరానా నింపింది. మనిషి జీవితంలో మాయను నింపి, దేని గురించీ ఆలోచించకుండా చేసింది. మనిషిని యంత్రంగా మార్చేసింది. రక్తమాంసాలున్న రోబోగా మార్చింది. స్పందించే హృదయానికీ సంకెళ్లు వేసింది. ఎవర్ని ప్రేమించాలో, ఎవరితో జతకట్టాలో, ఎవర్ని పెళ్లి చేసుకోవాలో శాసనం వేసింది. ఈ శాసనం వేల ఏళ్లుగా అమలవుతున్నది. ధిక్కరించినవాళ్లను వెంటాడి వేధించింది. ప్రాణాలూ తీసింది. ఇంత దుర్మార్గమైన లోకం గురించి పరిపరివిధాలా ఆలోచిస్తున్నాడు. ఎక్కడా దారి దొరకలేదు. మళ్లీ వాళ్ల మత గ్రంథాలు గుర్తొచ్చాయి.

‘‘భగవద్గీత చదువు. బైబిల్‌ చదువు. ఖురాన్‌ చదువు… ఇంకా ఎన్నెన్నో పవిత్ర గ్రంథాలు చదువు. నీ బతుకు నీది కాదు. పవిత్ర గ్రంథాలదీ, పండితులదీ’’ ఇట్లా మత గ్రంథాలు చదివించి, మనిషిలో అసలైన మనిషి జాడలేకుండా చేశారు. ఆలోచిస్తూ ఆలోచిస్తూ అతనికి నిద్ర లేకుండా పోయింది. చాలా కాలంగా నిద్రకోసం ఎదురు చూస్తున్నాడు. చిన్నప్పుడు అమ్మ పాడిన జోల పాట గుర్తుచేసుకున్నా జాడ లేని నిద్ర. ‘‘చక్కని నిద్రో, శాంతో మనిషికి లభించేది రెండు చోట్లే. ఒకటి అమ్మ కడుపులో వుండగా, రెండోది నేలతల్లి ఒడిలో చేరినప్పుడు. ఒకదానిలోకి తిరిగి వెళ్లలేము. రెండవదానిలోకి వెళితే మరలిరాలేము. ఓప్‌ా…’’ అంటూ శాశ్వతమైన శాంతి కోసం అన్వేషిస్తున్నాడు. ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేకుండా, కేవలం ప్రేమ, ఆప్యాయత వెల్లివిరిసే సమాజం కోసం కలగంటున్నాడు. ఎదురుచూస్తున్నాడు. సాధ్యమేనా?

సామాజికార్థిక విశ్లేషణ :

‘మౌనం’ కథ కుటుంబ సంబంధాల ద్వంద్వ విలువల గురించి చిత్రించింది. మానవ జీవితంలోని ప్రతీ సంబంధమూ ఏదో ఒక రకంగా ఆస్తులు, అంతస్తులు, ఆర్థిక లావాదేవీల పునాదిగా కొనసాగుతున్నదని చెప్పిన కథ. 

ఈ కథ చెప్పే పాత్రకు పేరులేదు. ఇందులో ఏ పాత్రకూ పేరులేదు. అతనికి భార్య, ఒక కూతురు, ఒక కొడుకు. బాల్యం నుంచే అతనిలో ప్రశ్నించే తత్వం ఉన్నది. ప్రతీదాన్నీ ప్రశ్నించకుండా ఉండలేడు. సమాజాన్ని నిశితంగా పరిశీలించాడు. సమాజంలో కొనసాగుతున్న ద్వంద్వ విలువలంటే అతనికి కోపం. ఈ వంచనను ఎదిరించాలనుకున్నాడు. 

యుక్త వయసులో ఒకమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరివీ వేరువేరు కులాలు. ఐనా పెద్దల్ని ఎదిరించాడు. చుట్టాల్ని ఖాతరు చేయలేదు. తనను నమ్మి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లిని కుటుంబ సభ్యులందరూ నిరసించారు. ఐనా అదరలేదు. బెదరలేదు. ప్రేమను బతికించుకోవడానికి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఐతే, పెళ్లయిన మరుసటి రోజు నుంచే ఆమె నుంచి సాధింపులు ఎక్కువయ్యాయి. ‘ఏదేదో ఊహించుకొని నిన్ను పెళ్లి చేసుకంటే, నువ్వు సరిగా ప్రేమనందించట్లేవు’ అంటూ పొట్లాడేది. క్షణక్షణం అతని బతుకు దుర్భరంగా మారింది. గుమస్తాగా పనిచేస్తూనే కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఉద్యోగం చేస్తున్నపుడే కూడబెట్టుకున్న డబ్బుతో కొంత స్థలం కొన్నాడు. కాలక్రమంలో ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్లను కష్టపడి చదివించాడు. పెళ్లి చేశాడు. కొద్ది కాలంలోనే వాళ్లింటి ముందే ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మించారు. దీంతో అది సంపన్న ప్రాంతంగా మారింది. అక్కడ భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఎప్పుడో పదివేలకు కొన్న స్థలం ఇప్పుడు రెండు కోట్లకు పైగా ధర పలుకుతున్నది. దీంతో కొడుకు, కూతురు, అల్లుడు ఆస్తి కోసం వచ్చారు. ఏనాడూ పట్టించుకోని వాళ్లు, ఇంతకాలానికి వచ్చి అతనిపై ప్రేమను చూపిస్తున్నారు. ఇదంతా అతనికి అర్థమైంది. వాళ్లంతా కేవలం ఆస్తి కోసమే వచ్చారనే సంగతి తెలుసుకున్నాడు. ప్రేమ, ఆప్యాయతలు ఉండాల్సిన చోట ఆస్తి పంపకాల పంచాయితీ ఆక్రమించినందుకు దుఃఖపడ్డాడు. ‘ఇలాంటివాళ్లకోసమా? నేనింత కష్టపడిరది. వీళ్లను పైసా పైసా కూడబెట్టి చదించాను. పెళ్లయ్యాక ఏనాడూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆస్తి కోసం వచ్చి కోర్టుకు లాగుతామంటున్నారు. ఈ కోర్టుకు లాగుతామన్న సంగతే అతణ్ని నిలువనీయట్లేదు. అతలాకుతలం చేస్తున్నది. 

ప్రేమలు అంతరించిన చోట క్షణ కాలం కూడా ఉండలేకపోయాడు. ఈ వేదన నుంచి దూరం పోవాలనుకున్నాడు. తనివితీరా ఏడ్చే అవకాశం కూడా లేదు. మగవాడు ఏడవొద్దని సమాజం, కుటుంబం చిన్నప్పట్నించీ తనను ట్యూన్‌ చేసిన సమాజమంటే కోపం వచ్చింది. మత గ్రంథాలు, ఆధ్యాత్మిక సూక్తులతో మనిషి మరయంత్రంగా మార్చిన సమాజమంటే అసహ్యం కలిగింది. మనిషిని మనిషిగా ఆలోచించనీయకుండా చేసిన వంచనపై నిరసన ప్రకటించాడు. 

‘మౌనం’ కథ మనుషుల మధ్య ఉన్న సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మార్క్స్‌ చెప్పిన సత్యాన్ని ఆవిష్కరించింది.  

సంప్రదించిన పుస్తకాలు :

1. భువనచంద్ర : భువనచంద్ర కథలు; సాహితి ప్రచురణలు, విజయవాడ, ఏప్రిల్‌, 2017.

2. భువనచంద్ర : భువనచంద్ర కథలు; సాహితి ప్రచురణలు, విజయవాడ, ఏప్రిల్‌, 2017.

**  **

(మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖ 28, 29 ఆగస్టు, 2025న నిర్వహించిన ‘భువనచంద్ర సాహితీ సాగరం`సృజనాత్మక హరివిల్లు’ అంతర్జాతీయ సదస్సులో సమర్పించిన పరిశోధన పత్రం)

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. అధ్యాపకుడు. 'కొలిమి' వెబ్ మేగజీన్ సంపాదకవర్గ సభ్యుడు. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ); సంపాదకత్వం : ఎరుక (ఆదిమ అర్ధసంచార తెగ ఎరుకల కథలు). ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Reply