మద గజాన్ని నిలువరిస్తున్న గడ్డిపోచలు

(ఈ వ్యాసం నవంబర్ 2016లో అమెరికన్ ఆదివాసీల చరిత్ర, వాళ్ళ జీవితాల గురించి రాసింది. వాళ్ళ మీద జరిగిన, జరుగుతున్న హింస, వాళ్ళు భాగమై బతికే ప్రకృతి విధ్వంసం గురించి రాసింది. చరిత్ర పొడువునా వాళ్ళు చేసిన పోరాటాల గురించి రాసింది. ముఖ్యంగా “అభివృద్ది” పేరిట కార్పోరేట్ ప్రయోజనాల కోసం అమెరికన్ రాజ్యం నిర్మించతలపెట్టిన ప్రకృతి విధ్వస ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి సంబంధించింది. “మేము ఈ నేల మూలవాసులం. ప్రకృతిలో ప్రకృతిగా బతికినోళ్ళం. ఈ ప్రకృతిని కాపాడుకుంటం. కేవలం మా కోసమే కాదు, మీ కోసం మీ పిల్లల భవిష్యత్ కోసం కూడ మేము పోరాడుతం” అని గడ్డిపోచలు చేతుల్లో పట్టుకుని ప్రమాణం చేస్తూ మదపుటేనుగులాంటి అమెరికన్ రాజ్యంతో తలపడిన చరిత్రను మరోసారి గుర్తుచేసుకోవాలనిపించిది.

బస్తర్లో ఆదివాసీలను చంపుతుంటే పొగబారిన డిల్లీ గేట్ దగ్గర విద్యార్థులు చేసిన నినాదాలు ఈ వ్యాసాన్ని నాకు మళ్ళీ గుర్తుచేశాయి. దేశానికి ఊపిరిత్తుల వంటి మధ్య భారత అడవులను కార్పోరేట్లకు అప్పగించడానికి అక్కడ ఉన్న ప్రకృతి సంరక్షకులను (ఆదివాసులను, విప్లవకారులను) అంతం చెయ్యడానికి పాలక వర్గ పార్టీలు రోజులు లెక్కపెడుతున్నాయి. ప్రతిరోజు హింసను కొనసాగిస్తున్నారు. కాని మైదానానికి, అడవికి మధ్య ఉండే పర్యావరణ సమతుల్యత దెబ్బతిని  (మార్క్స్ మాటలో చెప్పాలంటే “metabolic rift” మూలంగా) మైదానం గాలి పీల్చలేని పరిస్థితి వచ్చినప్పుడు మొత్తం సమాజం అనివార్యంగా అడవివైపే చూడాల్సి వస్తుంది. ఈ రోజు నిరసనకారులు ఊపిరాడని పరిస్థితిని ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు మీద కాలుబెట్టి రాజ్యం తొక్కుతుండొచ్చు. కాని ఏదో ఒక రోజు తన మనుగడకోసమైనా అడవి, మైదానం ఏకమవుతాయి. ఊపిరాడని వ్యవస్థలో పోరాట రూపం ఏదైనా ప్రకృతి, ప్రజలు విముక్తి మార్గం పట్టాల్సిందే! )

***

ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ పండితులు, మేధావులు, మీడియా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను, జరగబోయే పరిణామాలను విశ్లేషిస్తుంటే అమెరికన్ ఆదివాసులు (Native Americans) మాత్రం ఎవరు గెలిచినా, ఓడినా మాకేంటి అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే, వాళ్ళు తరతరాలుగా అమెరికన్ రాజ్య వ్యవస్థతో మోసగించబడి, తిరస్కరించబడి బతుకుతున్నవాళ్ళు.  ఇప్పటికీ నిత్య వివక్ష,  అణిచివేత అనుభవిస్తున్న వాళ్ళు. మార్టిన్ లూథర్ కింగ్ అన్నట్లు “అమెరికా మారణహోమం నుండి పుట్టిన దేశం.” ఆ దేశ  నిర్మాణంలో తెగిన తలలన్నీ ఆదివాసులవీ, నల్లజాతి బానిసలవే. అంతేకాదు, వాళ్ళ జీవితాలలో చూసిన ఎంతోమంది కౄరమైన నరహంతుకులతో పోల్చుకుంటే ట్రంప్ ఒక లెక్కా కాదు, సరికొత్త పరిణామం అంతకన్నా కాదు.  అలాగని ఎన్నో వర్గాలకి, సమూహాలకి ట్రంప్ గెలుపు తెచ్చిన భయం అర్థరహితమూ కాదు.

చారిత్రాత్మక ఆక్స్‌ఫర్డ్ సమావేశంలో మాల్కం ఎక్స్ అన్నట్లు “ఒకడు దైవదూత రూపంలో వచ్చి దయ్యంలా పడుతాడు. మరొకడు తన దయ్యం రూపాన్ని ముందే ప్రకటించి వస్తాడు.” రూపాలు వేరైన సారంలో ఇద్దరూ ఒక్కటే. అందుకే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచినా, హిల్లరీ గెలిచినా వాళ్ళ పరిస్థితి ఏమీ మారదని ఆదివాసులకు స్పష్టత వుంది. అమెరికన్ రాజ్యానికున్న దురాక్రమణ, అణిచివేత, సామ్రాజ్యవాద స్వభావాన్ని మార్చలేని ఏ రాజకీయ ప్రక్రియల మీద వాళ్ళకు నమ్మకం లేదు. ఇది వాళ్ళకు పుస్తక జ్ఞానం కాదు. అనుభవ సారం. వాళ్ళ చరిత్ర నిండా కన్నీళ్లే. వాళ్ళను పలకరిస్తే మాయని గాయాలను తడిమినట్లుంటది. మొత్తం మానవ చరిత్రలోనే మరే జాతి అనుభవించనంత హింసను, నరమేధాలను అనుభవించిన ఈ జాతులు, ఇప్పుడు మళ్ళీ పునర్జీవనం పొంది అమెరికన్ రాజ్యంతో, అది కాపాడే బహుళజాతి సంస్థలతో పోరుచేస్తున్నాయి. గడిచిన ఐదు వందల ఏండ్లలో సర్వం కోల్పోయి సహితం ఇప్పుడు మళ్ళీ పోరాట మార్గం ఎంచుకున్న ఈ ఆదివాసులు, ట్రంప్ ను చూసి భయపడే అన్ని వర్గాలకు ఏమిచేయాలో చేసి చూపిస్తున్నారు. 

నార్త్ డకోట రాష్ట్రంలోని చమురు నిక్షేపాలనుండి ముడి చమురును నాలుగు రాష్ట్రాల గుండా ఇలినాయి రాష్ట్రానికి తరలించడానికి Energy Transfer Partners  అనే ఆయిల్ కంపనీ దాదాపు 1800 మైళ్ళ దూరం పైప్ లైన్ వేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రోజూ 5.7 లక్షల బ్యారెల్స్ ముడి చమురును సరఫరా చేయవచ్చని అంచనా. దీనికంతటికి కాబోయె వ్యయం 370 కోట్ల డాలర్లు. ఈ ప్రాజెక్ట్ కు రాజ్యం మద్దతు పలకడంతో అన్ని అనుమతులు వెనువెంటనే వచ్చేసినవి. పైప్ లైన్ పని మొదలయ్యి నార్త్ డకోట కు చేరే సరికి “స్టాండింగ్ రాక్” అనే చిన్న ఊరిలో వుండే లకోట తెగ ఆదివాసులు (లకోట అంటే సుయన్ భాషలో “స్నేహితులు” అని అర్థం. లకోట వాళ్ళ మండలికం కూడ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి కారణాలు: మొదటిది, ప్రతిపాదిత పైప్ లైన్ ఆదివాసులు “పవిత్ర భూమి”గా పిలుచుకునే వాళ్ళ పూర్వీకుల బొందల గడ్డలు తొవ్వుకుంటూ పోతుంది. ఇది వాళ్ళ చారిత్రిక, సాంస్కృతిక విధ్వంసానికి సంబంధించింది. ముఖ్యంగా చరిత్రలో డాక్యుమెంట్ కాబడిన “వూండెడ్ నీ మారణకాండ” (Wounded Knee Massacre) లో చంపబడిన దాదాపు 300 మంది లకోట ఆదివాసులను పూడ్చి పెట్టిన “Wounded Knee” అనే  ప్రాంతం ఇక్కడే వుంది. (ఈ మారణకాండ ఆధారంగా డీబ్రౌన్ అనే నవలా రచయిత 1970లో “Bury My Heart at Wounded Knee” అనే పుస్తకాన్ని ప్రచురించిండు. అదే పేరుతో, ఈవ్స్ సిమనోవ్ అనే ఫ్రెంచ్ కనేడియన్ దర్శకుడు 1976 లో సినిమాగా కూడ తీశాడు.) ఇక రెండోది, పైప్ లైన్ వాళ్ళకు తాగునీరు అందించే మిజోరి నది మరియు ఇతర నీటి వనరుల గుండా పోతుంది. ఒకవేళ, నీళ్ళలో పైప్ లైన్ ప్రమాదం జరిగితే లక్షలాది మందికి నీటి సమస్య ఎదురవుతుంది. వాళ్ళు అనుమానిస్తున్నట్లుగా, అలాంటి ప్రమాదాలు ఇప్పటికే చాలా జరిగాయి. వాళ్ళ ప్రాంతంలోనే 2012-2013 సంవత్సరంలో 300లకు పైగా పైప్ లైన్స్ ప్రమాదానికి గురైనవి. అంతేకాదు ఒక్కసారి పైప్ లైన్ వేసిన తరువాత వాటి మీద నిఘా కాని, నియంత్రణ కాని చేసే పటిష్టమైన యంత్రాంగం, విధానం ఏది లేదు. 

ఆదివాసులు చెప్పిన అభ్యంతరాలను కాదని, కంపనీ పనులు మొదలు పెట్టింది. దానికి వ్యతిరేకంగా, ఆదివాసులు గత అగస్ట్ లో ప్రత్యక్ష పోరాటంలోకి దిగిండ్రు. వాళ్ళు ప్రేమకి, శక్తికి, ఆధ్యాత్మతకి చిహ్నంగా భావించే గడ్డిపోచలను (sweetgrass) చేతపట్టుకొని ఒంటరయి పోయి ఇంకా మిగిలివున్న 300 తెగలు ఏకమై ఐక్యపోరాటం మొదలుపెట్టిండ్రు. కంపనీ తన ప్రైవేట్ సైన్యంతో అణిచివేత కొనసాగించింది. కుక్కలతో దాడి చేయించింది. (ఆదివాసులపై, నల్లజాతి వాళ్ళపై కుక్కలతొ దాడి కొత్తేమి కాదు). గుర్రాలతో తొక్కించింది. రాజ్యం కంపనీలకు సాయంగా వందల సంఖ్యలో సాయుధ బలగాలను పంపింది. వందలాది ఆదివాసులను నిర్భందించారు. “డెమోక్రసీ నౌ” వంటి ప్రత్యామ్నాయ మీడియా  ఆ “కుక్కల” దాడిని చిత్రించి సెప్టెంబర్ 3న ప్రపంచానికి చెప్పేవరకు, ప్రధాన స్రవంతి మీడియాలో ఎలాంటి చలనం కలగలేదు. ఎంత హింస ప్రయోగిస్తున్నా, ఆదివాసులు వెనకడుగు వేయకుండా పోరాడుతున్నారు. దాదాపు వందకు పైగా పెద్దలు, పిల్లలు పైప్ లైన్ కు అడ్డంగా టెంట్లతో క్యాంప్ వేసుకొని అక్కడే వుంటున్నారు. ఎముకులు కొరికే చలిలో (దాదాపు జీరో డిగ్రీస్ సెంటిగ్రేడ్స్) ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుంటే, వాళ్ళు గడ్డ కట్టుకు పోయేలా పోలీస్ బలగాలు అతిచల్ల నీళ్ళను నీటి ఫిరంగులతో కొడుతున్నారు. దీని మూలంగా హైపోతెర్మియా (అంటే శరీర ఊష్ణోగ్రత త్వరగా తగ్గిపోయి ప్రాణాంతక పరిస్థితి రావడం) వచ్చి క్యాంప్ ఖాళీచేసి పోతారని ఒక కౄర ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు, రబ్బర్ బుల్లెట్లు, పెప్పర్ స్ప్రేలు, చివరికి హ్యాండ్ గ్రనేడ్లు కూడా ప్రయోగిస్తున్నారు. నిమోనియా వంటి వ్యాధులు రావడానికి రాత్రుళ్ళు హెలిక్యాప్టర్స్ ద్వారా కొన్ని రసాయనాలను చల్లుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు అక్కడి నుండి కదలడం లేదు. ఇప్పటి వరకు జరిగిన విధ్వంసం ఇక సాగనియ్యమని తెగేసి నిలబడ్డారు. “Enough is enough” అని నినదిస్తున్నారు. వాళ్ళకు ప్రజాస్వామిక శక్తులు, పర్యావరణ కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు.

ఈ వ్యాసం రాస్తున్న సమయానికి,  ఆశ్చర్యంగా 2000 మంది మాజీ సైనికులు ఆదివాసులకు రక్షణ కవచంగా నిలబడుతమని స్టాండింగ్ రాక్ కు బయలుదేరి పోతుండ్రు.  అది ఇప్పుడు కేవలం ఆదివాసి అస్తిత్వ పోరాటమే కాదు, మనిషిని ప్రకృతిని ఏకం చేసే పెట్టుబడిదారి వ్యతిరేక పోరాటమయ్యింది. ఆదివాసులు “నీటి రక్షకులుగా” మారారు. వాళ్ళు కేవలం ఈ భూమి మాది, నది మాది అనడంలేదు. మేము ఈ నదికి, భూమికి చెందినోళ్ళము. మమ్ముల ప్రకృతి నుండి వేరుచెయ్యొద్దంటున్నరు. ఈ పోరాటం చేయడం అంటే “మా గాయాలను మేమె నయం చేసుకోవడం” అంటుండ్రు. నిజమే, ఆ గాయాలకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. కొలంబస్ వాళ్ళను “కనిపెట్టి”నప్పటి నుండే ఆ చరిత్ర మొదలయ్యింది.      

ఈస్ట్ ఇండియాకు పోవాలని బయలుదేరిన కొలంబస్ సముద్రమార్గంలో దారితప్పి చివరికి 1492లో అమెరికన్ ఆదివాసుల “కొత్త ప్రపంచం”లోకి అడుగుపెట్టిండు. అక్కడున్న ఆదివాసులు ఇండియన్లను పోలివున్నారని వాళ్ళకు “రెడ్ ఇండియన్ల”ని పేరు పెట్టిండు. అక్కడున్న బంగారు గనులు కొల్లగొట్టడానికి తనతో తీసికెళ్ళిన మందిని, మందుగుండును, గుర్రాలను, వేటకుక్కలను ఉపయోగించి ఆదివాసులను బానిసలుగ మార్చుకున్నడు. (కొలంబస్ వారసులు ఇవే అణిచివేత పద్ధతులు ఇప్పటికి వాడుతుండ్రు!) ఆదివాసుల అమాయకత్వం, మంచితనం గురించి యూరప్ లో ప్రచారం కావడంతో అక్కడి నుండి వలసలు మొదలయినవి. యూరప్ లో కొన్ని మత విశ్వాసాల మీద దాడి జరిగినప్పుడు, రాజకీయ అభద్రత పరిస్థితి వచ్చిన ప్రతి చారిత్రిక సందర్భంలోనూ, అమెరికన్ ఆదివాసుల “కొత్త ప్రపంచమే” యురోపియన్లకు సురక్షిత ప్రాంతమయ్యింది. (ఈ వలసల కాలంలోనే refuge, refugee అనే పదాలు బాగ వాడుకలోకి వచ్చాయి. సరిగ్గ అదే కారణాలతో ఇప్పుడు రావాలనుకునే refugees ను రానివ్వనని ట్రంప్ శపధం చేస్తుండు). 

అలా మొదలయిన వలసలు సమూహాలుగా సమీకృతమై రాజ్యాలను నిర్మాణం చేసుకోవడం మొదలుపెట్టారు. 1607లో వర్జీనీయాలో మొదటి వలస రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక అది మొదలు, వలస రాజ్యాల సంఖ్య పెరుగుతూ పోయింది. ఇదే క్రమంలో వలసదారులు వాళ్ళ ఉత్పత్తి అవసరాల కోసం,  బానిసల కోసం ఆఫ్రికా నుండి నల్లజాతి వాళ్ళను బలవంతంగా తీసుకొచ్చారు. బ్రిటిష్ రాచరిక పెత్తనం దాని 13 వలస రాజ్యాలపై పెరగటంతో, దానికి వ్యతిరేకంగా వలసవాదులు తిరుగుబాటు చేశారు. అదే అమెరికన్ విప్లవం. పేరులో విప్లవం వుంది కాని అందులో ఎలాంటి సామాజిక న్యాయం లేదు. ఎందుకంటే అది కేవలం వలస రాజ్యాల అధిపతుల స్వేచ్ఛ కోసమే. వాళ్ళందరూ  బానిస యజమానులే. వందలాది బానిసలను సొంత ఆస్తిగా కల్గివుండి, వాళ్ళనే వ్యాపార వస్తువుగా చేసినవాళ్ళు. అందుకే ఆ తిరుగుబాటులో ఆదివాసులను, నల్ల బానిసలను కూడా సైనికులుగా వాడుకున్నరు. “విప్లవం” తర్వాత వాళ్ళకు విముక్తి కల్పిస్తమని నమ్మించి మోసం చేసిండ్రు.  చివరగా, 1776లో 13 వలస రాజ్యాలు కలిసి కొత్తగా అమెరికా రాజ్యం పుట్టుకొచ్చింది. స్వాతంత్ర్య ప్రకటన రాసిన  (మూడవ అమెరిక అధ్యక్షుడు)  థామస్ జెఫర్సన్ “మానవులంతా సమానంగా సృష్టించబడ్డారు” అని ప్రకటించాడు. కాని ఆదివాసులు, నల్ల జాతీయులు కూడ మానవులే అని మరిచిపోయిండు. ఆ ప్రకటన చేసేనాటికే ఆయన 175 మంది బానిసలకు యజమాని.  

అయితే 17వ శతాబ్దం నుండే వలస రాజ్యాలు ఆదివాసులతో అనేక ఒప్పందాలు చేసుకున్నాయి. వాళ్ళు నివసించే భూబాగంపై వాళ్ళకే హక్కులు ఇవ్వబడ్డాయి.  కాని, ఆ ఒప్పందాలను తుంగలో తొక్కి వాళ్ళ కాళ్ళకింది భూమిని లాగే ప్రయత్నం మొదటినుండి జరుగుతూనే వచ్చింది. ముఖ్యంగా ఏడవ అమెరికన్ అధ్యక్షుడు (డెమొక్రాటిక్ పార్టీ వ్యవస్తాపకుడు కూడ అయిన) ఆండ్ర్యూ జాక్సన్ 1830లో  తెచ్చిన “ద ఇండియన్ రిమూవల్ ఆక్ట్” మూలంగా భూమిని గుంజుకునే ప్రయత్నం చట్టబద్దమయ్యింది. అతను సాగించిన నరమేధానికి వలసవాదులు అతనిని “పదునైన కత్తి” అని పొగిడితే, ఆదివాసులు మాత్రం “ఇండియన్ కిల్లర్” గానే గుర్తుపెట్టుకున్నారు. ఈ కొత్త చట్టంతో 80 వేల మంది ఆదివాసులను వాళ్ళ విశాల భూభాగం నుండి తొలగించి కొన్ని నిర్దేశిత “ఇండియన్ ప్రాంతాలకు” (వాటినే రిజర్వేషన్స్ అంటారు) బలవంతంగా నెట్టివేశారు. ఈ ఒక్క చట్టం ద్వారానే 1.5 కోట్ల ఎకరాల భూమిని వలసవాదులు తమ ప్రాంతంలో కలుపుకున్నారు. ఆండ్ర్యూ జాక్సన్ కొనసాగించిన మారణహోమాన్ని మరవని ఆదివాసులు అమెరికన్ 20 డాలర్ నోట్ పై వున్న అతని బొమ్మని తొలిగించాలని చాలా  కాలంగా డిమాండ్ చేస్తున్నారు. (చివరిగా, 2020 నుండి అండ్ర్యూ జాక్సొన్ బొమ్మ తొలిగించి బానిస తిరుగుబాటు నాయకురాలు హర్రియత్ టబ్మన్ (1820-1913) బొమ్మను ముద్రిస్తమని ఒబామ ప్రభుత్వం ప్రకటించింది. హర్రియత్ టబ్మన్ బానిసత్వం నుండి తప్పించుకొని వందలాది బానిసల విముక్తికై పోరాటం చేసింది. నేరమయమైన రాజ్యాన్ని సాయుధంగానే ఎదిరించాలని ప్రతిపాదించి, ఆచరించిన  జాన్ బ్రౌన్ తో కలిసి పనిచేసింది. బ్రౌన్ ను రాజ్యం డిసెంబర్ 02, 1859 లో ఉరి తీసినప్పుడు అతను అమరుడని కీర్తించింది. మరో బానిస తిరుగుబాటు నాయకుడు ఫ్రెడెరిక్ డగ్లస్ తో కూడ కలిసి పనిచేసిన చరిత్ర టబ్మన్ కు వుంది.)  

ఆండ్ర్యూ జాక్సన్ తెచ్చిన చట్టానికి కొనసాగింపుగా, 1851లో “ఇండియన్ అప్రోప్రియేషన్స్ ఆక్ట్” ను తీసుకొచ్చి ఆదివాసులను రిజర్వేషన్లకు పరిమితం చేసి, వాళ్ళు అనుమతి లేకుండా తెల్లవాళ్ళ భూబాగంలోకి అడుగుకూడా పెట్టవద్దనే నిబంధనలు విధించిండ్రు. అంతటితో ఆగకుండా 1887లో “ది జెనెరల్ అలాట్మెంట్ ఆక్ట్” ని తీసుకొచ్చిండ్రు. దాని ముఖ్య ఉద్దేశం సామూహిక జీవనం చేసే ఆదివాసి జీవితాలలోకి వ్యక్తిగత ఆస్తిని ప్రవేశపెట్టి, వివిధ తెగల సంస్కృతిని, అస్తిత్వాన్ని, ఐక్యతను దెబ్బతీయడం. అందులో భాగంగానే వాళ్ళ రిజర్వేషన్ భూములను చిన్న చిన్న పార్సల్స్ గా చేసి తెగ సభ్యులను హక్కుదార్లు చేసిండ్రు. సభ్యులు ఆ భూమిని 25 ఏండ్ల తరువాత ఎవరికైన అమ్ముకోవచ్చు. ఈ దుర్మార్గ చట్టాల మూలంగా 1776 నుండి 1887 నాటికి, 150 కోట్ల ఎకరాల భూమి ఆదివాసుల చేతుల నుండి వెళ్ళిపోయింది.  ప్రతి చట్టం ఆదివాసుల ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తూనే వచ్చాయి. హక్కుల కోసం పోరాడిన ప్రతిసారీ మారణకాండ జరుగుతూనే వచ్చింది. గొప్ప ప్రజాస్వామికవాదని లోకమంతా పొగిడే అబ్రహం లింకన్ 1862లో తమ హక్కుల కోసం డకోట యుద్దంలో వీరోచితంగా పోరాడిన వందలాది ఆదివాసులను నిర్బంధించి, మొత్తం అమెరికా చరిత్రలోనే ఎప్పుడూ జరుగని విధంగా ఒకేసారి 38 మంది ఆదివాసులను తెల్లప్రజల హర్ష్యధ్వానాల మద్య బహిరంగంగా ఉరితీయించిండు.

అలాగే ఇప్పుడు బడిపిల్లల పుస్తకాలలో  “టెడ్డీ బేర్” గా పిలువబడే తియొడోర్ రూజ్వెల్ట్ తన అధ్యక్ష పదవీ కాలంలో (1901-1909) ఒకవైపు సామ్రాజ్యవాద విస్తరణ చేస్తూనే మరోవైపు ఆదివాసుల అన్ని హక్కులూ అణచివేసిండు. “చనిపోయిన ఇండియన్స్ మాత్రమే మంచి ఇండియన్స్” అని ఆదివాసి జాతిని అంతరింపచేసే తన కోరికను ప్రకటించిండు. అంతేకాదు, మేలైన మానవజాతే (అంటే తెల్లజాతే) మిగలాలని లక్షలాది ఆదివాసులకు సంతానోత్పత్తి కలగకుండా బలవంతపు శస్త్ర చికిత్సలు చేయించిండు. (సరిగ్గా హిట్లర్ కూడా ఇదే జాత్యహంకార యుజెనిక్స్ పద్దతులు వాడాడు). కోట్లాది ఎకరాల ఆదివాసి భూములను దురాక్రమణ చేసి వాటిని నేషనల్ పార్కులుగా మార్చి గొప్ప “ప్రకృతి సంరక్షకుడిగా” పేరు తెచ్చుకుండు. అందుకే, మౌంట్ రష్మోర్ నేషనల్ పార్క్ లో గ్రనైట్ కొండపై చెక్కిన “జాతిపితలలో” రూజ్వెల్ట్ ఒకడయ్యాడు. ఆశ్చర్యంగానే, ఆ నెత్తురంటిన చేతులతోనే 1906 నోబెల్ శాంతి పురష్కారం కూడ అందుకున్నాడు.     

వీటన్నింటికి పరాకాష్ట 1953లో తెచ్చిన “ది ఇండియన్ టెర్మినేషన్ పాలసి.” దీనితో ఆదివాసి రిజర్వేషన్లకు ఇవ్వబడిన నామమాత్రపు స్వయంప్రతిపత్తి కూడ రద్దు చేయబడి, వాళ్ళను “అమెరికనైజ్” చేయాలని ఒక సాంసృతిక విధ్వంసం కొనసాగించిండ్రు. ఆదివాసి ఆచార సాంప్రదాయాలను, జీవిత విధానాలను అనాగరికమని వ్యతిరేకించిండ్రు. “వాళ్ళలో వున్న అనాగరికతను చంపి, నాగరిక మానవుడిని నిలబెట్టాలని” వందలాది పిల్లలను బలవంతంగా బోర్డింగ్ స్కూల్స్ లోకి నెట్టివేసిండ్రు. వాళ్ళ భాషను, అలవాట్లను, తినేతిండిని, కట్టేబట్టను పూర్తిగా మార్చేసిండ్రు. ఆ పిల్లలను తమ సాంసృతిక సంపదకి దూరం చేసి తమ సమూహాల మధ్యే ఒంటరి అయ్యేలా చేసిండ్రు.  వాళ్ళ గతమంతా చెరిపేసి, భవిష్యత్తంతా తెల్లవాళ్ళతో ఎలా బ్రతకాలో బలవంతంగానైనా నేర్పించాలనుకున్నరు.

ఒక వైపున రాజ్యం నరమేధం చేసుకుంటూ పోతుంటే, మరోవైపు మిషినరీలు మిగిలివున్న ఆదివాసులను క్రైస్తవీకరించే పనిలోపడ్డవి. ఆదివాసుల జీవితాలలో వ్యక్తిగత ఆస్తి, వ్యవస్తీకృత రాజ్యము, కట్టుబాట్ల కంచె వేసే మతము ఎప్పుడూ లేవు. కాని చివరికి అవే వాళ్ళ కుతికలకు బిగుసుకున్నవి. ఆదివాసుల పోరాటాల ఫలితంగా, 1975లో “టెర్మినేషన్” పాలసీని రద్దుచేసి రిజర్వేషన్లకు కొంత స్వయంప్రతిపత్తి ఇచ్చినప్పటికీ, సాంస్కృతిక సామ్రాజ్యవాదం చేసిన గాయం తరాలు దాటినా ఇంకా సలుపుతూనే వుంది. వందల ఏండ్లుగా ఇంతటి హింస కొనసాగుతుంది కాబట్టే చేగువేరా “అమెరికా మానవ జాతికే శత్రువని” ప్రకటించిండు.   

మొత్తంగా అమెరికన్ రాజ్యం ఆదివాసులతో చేసుకున్న దాదాపు 700 ఒప్పందాలలో దేనికీ కట్టుబడి వుండలేదని చరిత్ర, వర్తమానం చెప్తూనేవున్నాయి. ఇప్పుడు చేపట్టిన పైప్ లైన్ ప్రాజెక్ట్ కూడా ఆ ఉల్లంగనలో భాగమే. దానిని వ్యతిరేకిస్తే రాజ్యము, పెట్టుబడి హింసను ప్రయోగిస్తాయని తెలిసి కూడా, ఆదివాసులు పోరులో నిలబడి వున్నారు. “మేము ఈ నేల మూలవాసులం. ప్రకృతిలో ప్రకృతిగా బతికినోళ్ళం. ఈ ప్రకృతిని కాపాడుకుంటం. కేవలం మా కోసమే కాదు, మీ కోసం మీ పిల్లల భవిష్యత్ కోసం కూడ మేము పోరాడుతం” అని గడ్డిపోచలు చేతుల్లో పట్టుకుని ప్రమాణం చేస్తుండ్రు. అంతరించి పోతుందనుకున్న జాతి చూపుతున్న తెగువ పోరాడే శక్తులన్నింటికి సంక్షోభ సందర్భంలో ప్రాణవాయువుగా మారనుంది. గెలుపూ, ఓటముల అంచనాలు ఏవైనా, రాజ్యం అండతో తెగబలిసిన కార్పొరేట్ మద గజాన్ని ఇప్పుడు నిలువరిస్తున్నది ఏకమైన గడ్డిపోచలే!  

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

2 thoughts on “మద గజాన్ని నిలువరిస్తున్న గడ్డిపోచలు

  1. “అమెరికా మానవ జాతికే శత్రువు” సంక్షోభ కాలంలో ఎంత గొప్ప స్ఫూర్తి నిచ్చే రచన! ధన్యవాదాలు అశోక్ గారూ

Leave a Reply