వంద హత్యలు చేసిన వాడు
కాలరెగురేసుకొని దర్జాగా వీదుల్లో తిరుగుతాడు
వంద అత్యాచారాలు చేసిన వాడు
న్యాయస్థానాలలో నిర్ధోషిగా ప్రకటించబడతాడు
హంతకులంతా అధికార పీఠాలపై కూర్చొని
ప్రజాస్వామ్యం గూర్చి ప్రసంగాలు చేస్తారు
ఆర్థిక నేరస్తులంతా దేశభక్తులుగా
పాలకులచే నీరాజనాలు అందుకుంటుంటారు
నియంతలే పాలకులై ప్రజస్వామ్యం పేరుతో
నియంతృత్వం అమలు చేస్తుంటారు
స్వేచ్చ గూర్చో చట్టం గూర్చో మాట్లాడిన వారంతా
దేశద్రోహులుగా పరగణించబడతారు
నిజాలు మాట్లాడే వాళ్ళకు
నిలబడడానికెక్కడా చోటుండదు
ఇప్పుడు వాడు చేసేదేదీ పైకి కనపడదు
ప్రశ్నించే వాళ్ళందరికీ
చట్టం పేరుతో సరిహద్దులు గీయబడతాయి
దెబ్బ పైకి కనపడకుండా ఎలా గాయపరచాలో
వానికిప్పుడు బాగా తెలుసు
నెత్తురు చిమ్మకుండా ప్రాణాలెలా తీయాలో
ఇప్పుడు వానికి బాగా తెలుసు
ఎదురు తిరిగిన వాన్ని దేశభక్తి పేరుతో ఎలా అణచాలో
ఇప్పుడు వానికి బాగా తెలుసు
ప్రజల నిర్ణయంతో పనిలేకుండా
ప్రభుత్వ పగ్గాలు ఎలా అందుకోవాలో
ఇప్పుడు వానికి బాగా తెలుసు
కోట్లాది మంది ఆకలి చావులతో నా దేశం
ఇప్పుడు అభివృద్ధిలో
ఆకాశం వైపు దూసుకుపోతుంది
కోట్లాది మంది పేదలతో నా దేశం
ఇప్పుడు సిరిసంపదలతో తులతూగుతుంది
కోట్లాది మంది నిరుద్యోగులతో నా దేశం
ఇప్పుడు సాంకేతికతలో రాకెట్ స్పీడుతో
చంద్రమండలం పైకి ఎగబాకుతుంది
ఆర్థిక అసమానతలతో
కుల వివక్షలతో మత వివక్షలతో నా దేశం
ఇప్పుడు అప్రతిహతంగా పురోగమిస్తోంది
ప్రజలారా!
ఎనిమిది దశాబ్ధాల స్వతంత్ర భారతానికి
సంతోషంతో నీరాజనాలు పట్టండి
ప్రపంచ దేశాలలో వెలిగిపోతోందని
పాలకులు చెబుతున్న ప్రజాస్వామ్య దేశానికి
చేతులెత్తి జేజేలు పలకండి