బొగ్గు బతుకుల గని – ‘నల్ల బంగారం’ కథలు

సింగరేణి మానవాళికి మహోపకారి. తెలుగునేల వికాసానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రదేశం. “పదుగురు కూడితే అది దారవుతుంది” అని సినారె అన్నట్లు, సింగరేణి వివిధ కులాలు, మతాల సంగమంగా నిలుస్తుంది. గని కార్మికుల జీవన పరిస్థితులు మిగిలిన ప్రాంతాలతో పోల్చితే ప్రత్యేకంగా ఉంటాయి. బొగ్గును నల్ల బంగారం అని పిలుస్తారు.

మనసు ఉంటే మార్గం ఉంటుందని, మర్చిపోవడం కూడా ఒక ప్రతీకార చర్య అవుతుందని తెలిపే కథ “దిలిసే”. రేఖ, అమ్ములు స్నేహితులు. ఒక పెళ్లిలో కలుసుకున్నప్పుడు సుప్రియ ఉద్యోగం ఎందుకు ఇచ్చావని ప్రశ్నించగా, అసలు విషయాన్ని అమ్ములు వివరిస్తుంది. సుప్రియ కు ఉద్యోగం ఇచ్చిన అమ్ముల తండ్రి మోహన్‌రావు. విద్యుత్ చౌర్యం చేసిన ఇన్నయ్యపై ఫిర్యాదు చేయడంతో పాత కక్ష పెంచుకున్న ఇన్నయ్య, మోహన్‌రావును హత్య చేశాడు. మోహన్‌రావు మరణంతో కుటుంబం రోడ్డున పడింది. అమ్ముల కుటుంబం ఊరు వదిలి హైదరాబాద్‌కు వెళ్లింది. ఇన్నయ్య అరెస్టై పద్నాలుగు సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. అతని కుటుంబం కూడా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంది. తర్వాత అమ్ములు ఎన్జీవో స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తుంది. సుప్రియ కు కూడా ఉద్యోగం ఇస్తుంది. నిజం తెలుసుకున్న సుపియ, తాను ఇన్నయ్య కూతురినని చెప్పి తన తండ్రి చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తుంది. “తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో అప్పులు ఉండవచ్చు కానీ నేరం ఉండకూడదు” అనే ఆమె మాటల్లో సామాజిక నైతికత ప్రతిఫలిస్తుంది. ఈ కథలో ప్రతీకారాన్ని పరిమళంగా మలిచిన తీరు ప్రత్యేకం.

మరణం తప్పదని తెలిసినా ఆశ చావదు. మృత్యువును తప్పించుకోవాలనే తపనలో కుటుంబ సభ్యులు అనుభవించే అంతర్గత సంఘర్షణను హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించిన కథ “జీవగర్ర పుల్ల”. రచయిత్రి తల్లికి క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది. తల్లిని రక్షించుకోవాలనే ప్రయత్నంలో జ్యోతి టీచర్ ఇచ్చిన చిరునామాకు ఉత్తరం రాసి ప్రార్థన కోరుతుంది. రాబర్ట్ గారి నుంచి వచ్చిన ఉత్తరం ఆశను నింపుతుంది. పోస్టుమాన్ రహీమ్ కూడా దువా చేస్తానని ధైర్యం చెబుతాడు. అయినా తల్లి మరణం తప్పదు. “కులం, మతం, దేవుడు అన్నీ అబద్ధాలు. చావు ఒక్కటే నిజం” అని తల్లి చెప్పిన మాట కథకు తాత్త్విక గాఢతను ఇస్తుంది.

పేదలకు ఆస్తులు లేకపోయినా ఆత్మగౌరవం ఉంటుంది. ధనవంతుల తప్పిదాల వల్ల బలహీనులు ఎలా బాధపడతారో చూపిన కథ “ఎల్లి”. పనిమనిషి ఎల్లి పర్సును దొంగిలించిన వజ్రవ్వను నిలదీస్తుంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారినప్పుడు బైండ్ల ఈరయ్య మధ్యవర్తిత్వం చేస్తాడు. అయినా ఎల్లికి అవమానం తప్పదు. ఆమె గాయపడిన యోధురాలిలా ముందుకు సాగుతుంది.

స్వీయ మార్పు కోసం రచన ఎలా సాధన అవుతుందో చూపిన కథ “మాఫ్ కరో దోస్త్”. అపర్ణ, సమీరాల స్నేహం జీవితంలో వచ్చిన అసమానతలతో మారిపోతుంది. అంతర్గత సంఘర్షణను రచయిత్రి సహజంగా ప్రతిబింబించింది. చివరికి క్షమాపణ భావన మనసును తేలికపరుస్తుంది.

మనుషుల కపటత్వాన్ని బహిర్గతం చేసే కథ “చందమామతో ఒక మాట చెప్పాలి”. బినయ్ ముఖర్జీ అనే వ్యక్తి నీచ స్వభావాన్ని రచయిత్రి బలంగా చిత్రించింది. మహిళల భద్రతపై స్పష్టమైన సందేశాన్ని కథ అందిస్తుంది.

“నల్ల సింగిడి” కథలో రూపంపై ఉన్న అసంతృప్తిని అధిగమించి ఆత్మగౌరవాన్ని పొందే ప్రయాణాన్ని చూపింది. తాత చెప్పిన మాటలు ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి.

అనాథ బాలుడైన సైదయ్య జీవితం ద్వారా మనుషుల సంబంధాల సంక్లిష్టతను చూపిన కథ భావోద్వేగపూరితం. గత జ్ఞాపకాలు ఎలా మనసును కుదిపేస్తాయో ఈ కథ తెలియజేస్తుంది.

ప్రేమ, మతం, నమ్మకాల మధ్య సంబంధాలను చూపిన కథ “దో పహలే ప్రేమ్ పత్ర”. ముగ్గురు వ్యక్తుల జీవితాల ద్వారా ప్రేమపై భిన్న దృక్కోణాలను చూపింది.

గని కార్మికుల ఆర్థిక, సామాజిక సమస్యలను ప్రతిబింబించిన కథ “జల్సా”. అప్పుల భారంతో జీవితం ఎంత కఠినమవుతుందో స్పష్టంగా చూపింది.

“నల్లబంగారం” కథలో గని ప్రమాదాలు, కార్మికుల కుటుంబాల బాధలు హృదయాన్ని కదిలిస్తాయి. ముఖ్యంగా కూతుళ్లకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం ఒక సామాజిక సమస్యగా నిలుస్తుంది.

“ఓపెన్ కాస్ట్ సర్జరీ” కథలో అభివృద్ధి పేరుతో ఊర్ల నాశనాన్ని హృదయ విదారకంగా చిత్రించింది. పాత జ్ఞాపకాలన్నీ కాలగర్భంలో కలిసిపోవడం బాధను కలిగిస్తుంది.

కథల నిర్మాణంలో కొన్నిచోట్ల అనవసర వర్ణనలు కనిపించినప్పటికీ, భాష సహజంగా ప్రవహిస్తుంది. చిన్న వాక్యాలతో భావవ్యక్తీకరణలో వైవిధ్యం కనిపిస్తుంది. సింగరేణి జీవనాన్ని సజీవంగా చూపడంలో రచయిత్రి విజయవంతమైంది.

తెలంగాణ భాషా ప్రత్యేకతను పలుకుబడులు, సామెతలు, జాతీయాల ద్వారా చక్కగా వినియోగించింది. “ఓటిపోయిన కుండలు లెక్కున్నరు”, “చేతగానోనికి ఏతులెక్కువ” వంటి ప్రయోగాలు జీవన వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి.

ఇయ్యరమయ్యార, అంజాన, వాగొడ్డు, ఐసత, రుశి, జల్దీ, హర్కీజ్, నశం రంగు, అల్కగ వంటి పదాలను సందర్భానుసారంగా వినియోగించింది.

జ‌న‌నం: గోనెప‌ల్లి, సిద్ధిపేట జిల్లా. క‌వి, రచ‌యిత, ఉపాధ్యాయుడు. 'మా తొవ్వ‌'(క‌విత్వం), 'బ‌తుకు పాఠం'(క‌విత్వం), 'త‌ప్ష‌'(క‌థ‌) ప్ర‌చురించారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుంచి 'తెలంగాణ‌ పాట‌ల్లో సామాజిక చిత్ర‌ణ' అనే అంశంపై ప‌రిశోధ‌న చేశారు. ప్ర‌స్తుతం వేముల‌ఘాట్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో స్కూల్ అసిస్టెంట్‌(తెలుగు)గా ప‌నిచేస్తున్నారు.

Leave a Reply