ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి నిర్మాణంలో నేలవిడిచి, సాము చేస్తున్నామన్న విమర్శలకు సమ్మక్క సారలమ్మల స్మృతి నుండి వారి అస్థిత్వ పోరాటం నుండి ప్రజా సాంస్కృతిక ఉద్యమ నిర్మాణానికి దారులు వేసుకోవచ్చనే ప్రతిపాదన ఆలోచనాపరులైన ఉస్మానియా విద్యార్థుల నుండి మొదలయ్యింది. మేడారం వనజాతర జనజాతరగా విస్తరిస్తున్న క్రమాన్ని ఒడిసిపట్టుకుని మేడారం పోదామన్న వారి పాటల సిడీ ఆవిష్కరణకు నేను ఓయుకు వెళ్లలేకపోయినా ఉస్మానియా ప్రతినిధిగా నలిగింటి శరత్ అరుణోదయ కార్యాలయానికి వచ్చి తమ ఆర్తిని ప్రకటించిన తర్వాతనే నేనీ ప్రతిపాదనతో ప్రజల ముందుకు వస్తున్నాను. గతం నుండి గుణపాఠాలు తీసుకుని, వర్తమానాన్ని పాఠంగా నేర్చుకుంటూ భవిష్యత్తు సాంస్కృతికోద్యమానికి బాటలు వేసుకోవడానికి ఇదొక మంచి సందర్భం.
మాతృస్వామ్యానికి ఆనవాల్లుగా ఉన్న తెలంగాణ గ్రామ లోగిళ్ళను కమ్మివేస్తున్న పితృస్వామ్య ఆర్య సంస్కృతిలో ఏడుగురు అక్క చెల్లెల్లయిన గ్రామ దేవతలు (village diets) కనుమరుగవుతున్న క్రమానికి భిన్నంగా మేడారంలో అమ్మల కొలుపు పెరుగుతూ వస్తుంది. వనజాతర జనజాతరగా విస్తరిస్తుండగా మేడారంలో సమ్మక్క సారలమ్మల విగ్రహాలు చేయించి, అక్కడో గుడి నిర్మాణం చేపట్టి, శాశ్వత పూజారులను నియమించి నిత్య పూజలతో ఆదివాసుల సాంప్రదాయాలను కనుమరుగు చేయాలన్న కుట్రలు జరిగాయి. ఆ సమయంలో జనశక్తి నాయకుడు కామ్రేడ్ శంకరన్న (కృష్ణారెడ్డి) నాయకత్వంలో సాంస్కృతిక రంగంలో జరిపిన వర్గ పోరాటానికి ముందు వరుసలో ఉన్నవాళ్లలో సీతక్క కూడా ఒకరు. యాదృచ్చికంగా ఇప్పుడు ఒక మహిళగా వారు మంత్రిగా ఉంటూ సమ్మక్క-సారలమ్మల గద్దెలను బ్రాహ్మణీకరించకుండా ఆధునికరించడంలో కూడా ముందున్నారు. అక్కడే జన సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “సమ్మక్క-సారక్కల ధీరత్వమే దైవత్వంగా కొలువబడుతున్నదని” అభివర్ణించారు. 1946లో వరంగల్ సుబేదార్లో ఉన్న అమీర్ అలీఖాన్ పర్యవేక్షణలో కూడా ఆదివాసి సాంప్రదాయాలకు ఘనమైన గౌరవం దక్కిందంటారు. 1996లో దీనిని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కొన్ని అకడమిక్ పరిశోధనలు జరిగాయి. ఇటీవల పలు వ్యాసాలు వెలువడ్డాయి. తెలంగాణ ఉద్యమం నుండి పాటల పరంపర మొదలయింది, ప్రగతిశీల శిబిరం మెచ్చేలా ఈ ఏడు ఉస్మానియా విద్యార్థులు సమ్మక్క-సారక్కల సాంస్కృతిక పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దాం. అడవులను, ఆదివాసులను, మాతృస్వామిక ప్రేమలను కాపాడుకుందామన్న” పిలుపుతో నూతన కార్యక్రమానికి నాంది పలికారు. ఇది దశాబ్దాల క్రితమే “సమ్మక్క- సారమ్మ గద్దెల పైన / స్వయం పాలన ఆన” అంటూ కామ్రేడ్ మిత్ర కవిత్వానికి ఆచరణ రూపంగా ముందుకు వచ్చింది. విప్లవ ప్రజాస్వామిక శిబిరం దీనిని సృజనాత్మకంగా అభివృద్ధి చేస్తూ, కరువులో కప్పం కట్టలేమన్న ఆదివాసుల తిరుగుబాటును, స్వయం పాలనా ఆకాంక్షలను ఎత్తిపట్టాలని కోరుతున్నాను. ఇదొక సాంస్కృతిక అస్తిత్వ పోరాటంగా దండోరా వేద్దామని ప్రతిపాదిస్తున్నాను. ఆదివాసి క్షేత్రాల్లో గుళ్ళు గోపురాలతో వారి ప్రకృతి ఆరాధన సంస్కృతిని పరాయీకరించకుండా కాపాడుకుందామని కోరుతున్నాను.
వైవిధ్య భరితమైన తెలంగాణ చరిత్రలో దక్షిణ భారతంలోని బలమైన తొలి రాజ్యం కాకతీయ సామ్రాజ్యం, పితృస్వామిక సంకెళ్లను తెంచుకుని రాణి రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యానికి పట్టపురాని అయింది. సమ్మక్క-సారలమ్మల పోరాటాన్ని నెత్తుటేరుల్లో ముంచిన ప్రతాప రుద్రున్ని ఢిల్లీ పాదుషాలు బందీగా తీసుకుపోతున్నప్పుడు ఆయన క్రీ.శ. 1332లో నర్మదా నదిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నాడు. ప్రొ. కేశవరావు ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి నాంది పలికిందంటారు. కానీ రాజ్యం కోసం ఆత్మార్పణ చేసుకున్న రాజు చరిత్ర శిలా శాసనాల్లో ఉంటే ఆదివాసుల కోసం పోరాడిన సమ్మక్క సారక్క పగిడి ద్దరాజుల సాహనం ప్రజల విశ్వాసాల్లో నిలిచి ఉంది. జంపన్న ఆత్మార్పణ సంపెంగ వాగును జంపన్న వాగుగ మార్చింది. యుద్ధంలో గాయపడి శత్రువు చేతికి చిక్కని సమ్మక్క నెత్తుటి బొట్లను కుంకుమ వర్ణంలో ప్రజలు నేటికీ ఆరాధిస్తున్నారు. ఇది ధీరత్వమా? దైవత్వమా? ఆదివాసి కోణం నుండి నిర్వచించుకుని ప్రగతిశీల శిబిరం కదిలి రావాలి. చరిత్ర మేడారంతోనే ఆగిపోతే అది దైవత్వం. కానీ మేడారం నుండి భూంకాల్ తిరుగుబాటుకు, ఇంద్రవెల్లి నుండి దండకారణ్యం వరకు ఆదివాసుల స్వయంపాలన ఆకాంక్షలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఆదివాసుల రక్షణగా 1970 లోనే వచ్చిన 1/70 భూ బదలాయింపు చట్టం, 1996లో నాటి పిసా చట్టం కార్పొరేట్ల దాడిలో నలిగిపోతున్న సమయంలోనే ఆదివాసుల స్వయం పాలన ఆన (ప్రతిజ్ఞ) సమ్మక్క- సారక్కల గడ్డల దగ్గర ప్రతిధ్వనిస్తుంది. ఆదివాసి వాయిద్యాలను అది ధ్వని గా వినిపిస్తూ, వారి పనిముట్లను ఆధ్య కళగా నిక్షిప్తం చేసి భావితరాలకు అందించాలన్న ఆచార్య జయధీర్ తిరుమలరావు కృషి మనకు తెల్సిందే.
ఈ సందర్భంగా ఎక్కడో న్యూజిలాండ్‌లో సరిగ్గా 13వ శతాబ్దిలో స్థిరపడ్డ మావోరి (Maori) తెగ ప్రజలు మేడారం జాతరకు కదిలి వచ్చారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆహ్వానంతో సి.డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మావోరి తెగవారి సాంప్రదాయ హాకా నృత్యం రవీంద్ర భారతిలో జనవరి 28 నాడు ప్రదర్శితమైంది. 162 ఏళ్ల న్యూజిలాండ్ పార్లమెంటు (పారమెట అవోటియారోవా) చరిత్రలో మావోరి తెగ ప్రజల హక్కులను హరించే బిల్లును వ్యతిరేకిస్తూ 14 అక్టోబర్ 2025 న 22 ఏళ్ల పార్లమెంటు సభ్యురాలు హాన రెపెట్టి బిల్లు కాగితాలను చింపి వేస్తూ మొదలు పెట్టిన హాకా నృత్యం నా కళ్ళ ముందు కదలాడింది. అనుమతి లేకుండా పార్లమెంటులో హాకా నృత్యం ప్రదర్శించారన్న సాకుతో నలుగురు మావోరి పార్లమెంటు సభ్యులలో ముగ్గురిని 21 రోజులపాటు సస్పెండ్ చేశారు. దీనికి నిరసన పార్లమెంటు బయట పదివేల మంది మావోరి తెగ ప్రజలు నిరసన ప్రదర్శన చేశారు. హాన రెపెట్టిలో మనకు సమ్మక్క-సారక్కలు కనిపిస్తున్నారు.
కానీ భారత్‌లో దిలీప్ సింగ్ బూరియా కమిషన్ సిఫార్సులనే ఏమార్చిన ఏలికలతో మన ఆదివాసి గిరిజన పార్లమెంటు సభ్యులు ఇట్లా తలపడగలరా? 5,6 షెడ్యూల్లలోని ఆదివాసుల రాజ్యాంగ హక్కులు ప్రశ్నార్ధకమవుతున్న స్థితిలో కార్పొరేట్ కంపెనీలు అడవులను చెరబడుతున్నాయి. ఆదివాసుల జీవితాల పరాయికరణ విస్తాపన శరవేగంగా జరుగుతుంది. ఈ స్థితిలో నమ్మక్క- సారలమ్మల త్యాగం సాంస్కృతిక అస్తిత్వం పార్లమెంటు పార్టీల శిబిరాన్ని కదిలించకపోవచ్చును. కానీ ప్రగతిశీల శిబిరంలోని మేము ఏనాడు ప్రజా వేదికలపై సమ్మక్క సారక్కల సాహసాన్ని ప్రదర్శించలేకపోయాము, న్యూజిలాండ్ మావోరి బృందంలోని హాకా నృత్యం కొత్త ఆలోచనకు బీజం వేసిందని చెప్పవచ్చును.
ఈ సందర్భంగా హాకా నృత్య కార్యక్రమంలో పరిచయమైన దాఎఎ సుగలి సుధారాణి ఇచ్చిన “గోండ్వానా ల్యాండ్ ఎంత ప్రాచీనమైనది- తెలుగు అంతే కూడా అంతే ప్రాచీనమైనదే” ఆమె స్వీయ పరిశోధన పుస్తకం ఒక్కసారిగా సమస్త భూమండలాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసింది. దాదాపు 500 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన అఖండిత భూమండలం (పెంజియా) రెండుగా చీలిన దక్షిణ ప్రాంతాన్ని గోండ్వానా లాండ్ అంటారని ఆమె పేర్కొంది. అంటే లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఆసియా ఖండాల నేల మీద మన సహజీవనం కొనసాగింది. ప్రొ. కొల్లాపురం విమల చెబుతున్నట్లు నాగరికత నదుల అంచున కాదు, అడవిలోనే పుట్టిందన్న విషయం స్ఫురణకు వచ్చింది. ఆదివాసుల గోండ్వానా ఉనికి నేటిది కాదని ఈ ఆదివాసుల నేలపైన భారతదేశ పనిముట్లు మడగాస్కర్ పనిముట్లకు ఉన్న పోలికలు చిత్రాల (illustration) ద్వారా ఆమె వివరించింది. “మావోరి” తెగ పేరు “కూపీ” అనే పదం న్యూజిలాండ్ లోనే ఉన్న “ఒక్కటైన నది” లాంటి అనేక పేర్లు తెలుగును పోలి ఉన్నాయి. చరిత్ర పరిశోధనకు ఉపయోగపడే ఎన్నో ఆదివాసి భాషలు (రాజ్యాంగం గుర్తించినవి సైతం) అంతర్ధానమవుతున్న స్థితిలో మనం కోల్పోతున్న చరిత్ర, భాష- సంస్కృతులన్నీ ఒక మేడారం జాతరలోనే కాదు దేశమంతా జరుగుతున్న ఆదివాసుల మేళాల నుండి మనం గ్రహించాల్సిందే. సమ్మక్క-సారక్కల తిరుగుబాటు నుండి సాంస్కృతిక అస్తిత్వ ప్రకటనను ఎగరేయాల్సిన రోజే మన దిద్దుబాటుకు నాంది పలకాలి. ఈ ఆత్మీయ అనుబంధంతో సమ్మక్క-సారక్కల గద్దెల్ని సందర్శించి ప్రజా సాంస్కృతిక పతాకాన్ని ఎగిరేద్దాం..
28-01-2026
అరుణోదయ విమలక్క
(న్యూజిలాండ్ మావోరి తెగ హాకా నృత్యం చేసే సాంస్కృతిక బృందం మేడారం సందర్శించి రవీంద్రభారతిలో ప్రదర్శించిన తర్వాత…) గద్దెల్ని సందర్శించి ప్రజా సాంస్కృతిక పతాకాన్ని ఎగిరేద్దాం.