పెంగ్విన్ ఆత్మహత్య

ఎందుకలా చేశావు? ఎందుకో అలా మౌనంగా దారి మళ్లిపోయావు!
చేపలు దొరికే సముద్రాల్ని వదిలి, నీళ్ళు దొరకని పర్వతాల దాటుకొని,
మృత్యువు వైపుకి నువ్వు చేసిన మార్మిక యాత్ర
కరకు పర్వతాలను కూడా కదిలించింది
శీతల హిమ సానువులని, మంచులోయ
లని, సముద్రాలను కూడా కొత్త కన్నీటితో నింపేసింది.
**
ఏం చెప్పాలనుకున్నావు చెప్పు ఈ ధూర్త లోకానికి?
మహా ఒంటరితనంతో
ఏకాంతాన్ని  వెతుక్కుంటూ, కుమిలిపోతూ
ఎవరూ ఆపలేని మృత్యువుని ఎన్నుకుని వెళ్ళిపోయావు?
**
ఏమి నడక నీది?
ఎక్కడి అనంతమైన ప్రయాణం నీది?
ఎంత సాహస ప్రయత్నం ఇది?
నీ మరణ నిశ్చయం ఎంత దృఢమైనది ?
**
అవునుగానీ నా ప్రియమైన పెంగ్విన్
ఎవరు నీకు నమ్మక ద్రోహం చేశారో చెప్పు?
ప్రియురాలు ఇక ప్రేమించనన్నదా?
మనుషులు నమ్మక ద్రోహం చేశారా?
సముద్రం నీ ఆకలి తీర్చడానికి చేపలను ఇవ్వనన్నదా?
నీ పాదాల కింది మంచు శీతల స్పర్శని కోల్పోయి మంటైపోయిందా?
నీ సమూహం నిన్ను వెలివేసిందా?
జీవితం ఇక విసుగేసిందా?
ఏదో చెప్పు?
**
ఏ మంచు కౌగిలి నీలో ఇంత వైరాగ్యాన్ని నింపింది?
దుఃఖాన్ని ఒంపింది?
సహచరులను, బంధు మిత్రువులను, శత్రువులని, కడకు జీవితాన్ని ఒక్క సారి పరిపరి తరచి, తరచి వెనక్కి తిరిగి చూసుకుని,
వెక్కెక్కి ఏడ్చే ఉంటావు
మమకారపు వియోగ దుఃఖంతో
మృత్యువు వైపు నిస్త్రాణగా పడుతూ, లేస్తూ నువ్వు చేసిన మార్మిక యాత్ర ఒట్టిదా మరి?     మహత్తరమైనది కాదూ?
మనుషుల్ని, మొత్తం ఈ భూగోళాన్ని పీపీలికమంత చేసి విషాదంగా నవ్వుకుంటూ ఎంత ఠీవీగా వెళ్లిపోయావు?
చెప్పు! ఏం ఇవ్వాలనుకున్నావు ఈ కనికరం లేని లోకానికి?
**
పెంగ్విన్ ఏమైంది నీకు?
ఆకలి, కోపం, చిరాకు రాగాలను గొప్పగా పాడీ, పాడీ అలిసిపోయావా?
విరహమూ, ఒంటరితనపు పిలుపులను పిలిచి, పిలిచి మూగబోయావా?
నీ సహచరి, నీ ప్రేయసి మోహోన్మత్తమైన ‘ఎక్సోటిక్ డిస్ప్లే సాంగ్’
పాడనన్నదా?
నీతో పారవశ్యపు నృత్యం చేయనన్నదా ?
ఏమన్నదో చెప్పు?
**
గతి తప్పిన ఋతువునొకదాన్ని పట్టుకుని అలా గొప్ప మృత్యు నమ్మకంతో వెళ్ళిపోవడం ఏమిటి చెప్పు?
అవును కానీ ఒకటి చెప్పు పెంగ్విన్
ఎందుకంత నిరసన?
దేనికీ ధిక్కారం?
ఈ లోకం మీద ఎందుకంత అలక? 
ఎందుకలా రుస రుసలాడుతూ వడి వడిగా వెళ్ళిపోయావు?
ఏం అందలేదు నీకు?
ఏం గుంజుకున్నారు నీ నుంచి?
**
చూడలా వెళ్ళిపోకు
పోనీ ఉన్న చోటనే ఉండు
నా ప్రియమైన పెంగ్విన్
మళ్ళీ ఒక్కసారలా
ఇందాక చూసావే,
అలా వెనక్కి తిరిగి చూడు
చూడు నేనున్నాను
నిన్ను ప్రేమిస్తున్నాను
రా! నీకు జీవన లాలసను నింపుకున్న నా అధర చుంబనాన్ని ఇస్తాను
నా దేహమనస్సులలో నిండి ఉన్న సమస్త జీవ శక్తి ధారలతో నిన్ను కౌగిలించుకుంటాను
వెనక్కి రా!  
నువ్వు ప్రియురాలివి అయితే
నేను నీకు ప్రియుణ్ణి అవుతాను
నువ్వు ప్రియుడివి అయితే
నేను నీకు ప్రేయసినవుతాను
నేను నీకు వాదా చేస్తున్నా
నేను నీ ప్రేమనవుతాను
రా! వెళ్ళిపోకు
అలా మాత్రం చచ్చిపోకు

Leave a Reply