పులి బతుకు

కొత్త ప్రపంచాన్ని స్వప్నించడం చేతగాని వాడే
వీరుల కలలను నిషేధిస్తాడు
దొంగలకెపుడూ ప్రభాకరుడు అస్తమించిన తర్వాత
బాలచంద్రుడు ఉదయిస్తాడన్న భయమే!
బిస్కెట్లు చాక్లెట్లు తినిపించినంత సులభంగా
వాడు పసిగుండెల మీద బుల్లెట్లు కురుపిస్తాడు
శునకాలు సింహాసనాలను ఆక్రమించుకున్న వేళ
పులులు తమ చరిత్రను తామే రాసుకునే వేళ వేటగాళ్లకు నిదురరాదు
ప్రజల ఎదురు చూపుల్లో బతికిన వాడు
రాజ్యానికీ, ప్రజలకూ మధ్య
తుపాకీతో సరిహద్దును గీసి ధైర్యంగా నిలబడ్డవాడు
పేదోళ్ల గుండెల్లో ఆత్మగౌరవ జెండానెగరేసివాడు
తన జాతి రక్షణ కోసం
హిందూ మహా సముద్రంలో చండ్రనిప్పులు కురిపించిన వాడు
చావునెప్పుడూ మెడచుట్టే ధరించి
మృత్యువును సైనైడ్ గుళిక వలె మింగినవాడు
రావణ కాష్టం లోంచి ఎత్తిన పదకొండవ శిరస్సు ప్రభాకరన్
జాతి రక్షకుని మీద వేసిన రాక్షస రాజముద్ర రాజపక్షే!
ఆకలితో బతుకుతున్న అమాయక జనాన్ని కాపాడుకున్న వానిది
ఏనాటికైనా పులి బతుకే!
ఎప్పుడైనా శత్రువే ఎక్కువ సార్లు గెలుస్తాడు
మంచి వైపున పోరాడే యోధుడు
మరణించైనా కలకాలం బతుకుతాడు !

పుట్టింది కరీంనగర్ జిల్లా కోహెడ మండలం, నాగసముద్రాల. కవి, రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు. రచనలు: పునాస, ఎర్రమట్టి బండి(కవితా సంకలనాలు). చిక్కనవుతున్న పాట, పొక్కిలి, మత్తడి, మునుం, ఎడపాయలు, మొగులైంది, దూదిపూల దు:ఖం, నూరు అలల హోరు(ప్రజా సాహితి)లాంటి సంకలనాల్లో పలు కవితలు ప్రచురితమయ్యాయి.

One thought on “పులి బతుకు

Leave a Reply