మన చుట్టూ ఎన్నో జరుగుతూనే ఉంటాయి. కొన్నింటిని మనం వింటాం, మరికొన్నింటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతాం. కానీ ఎక్కడో ఒక అడవిలో ఒక మనిషి తన నేల కోసం నిలబడినప్పుడు, ఎక్కడో ఒక దేశంలో పిల్లలు యుద్ధాల మధ్య పెరుగుతున్నప్పుడు, అవి మన వరకు చేరితే మనం ఏమి చేస్తాం? మౌనంగా ఉంటామా? లేక మన హృదయం కదులుతుందా? హథీరామ్ సభావట్ రాసిన “నీలం రంగు నది” అలాంటి ప్రశ్నల మధ్య మనల్ని నిలబెడుతుంది. ఇది కేవలం కవితల సమాహారం కాదు మన కాలం గురించి మనల్ని ప్రశ్నలు అడిగే కవిత్వం.
ప్రపంచం ఎంత పెద్దదైనా, కొన్ని బాధలు ఎక్కడైనా ఒకేలా ఉంటాయి. ఒక గూడెంలో వినిపించే నిశ్శబ్దం, ఒక తాండాలో కనిపించే ఆందోళన, ఒక నగరంలో వినిపించే పేలుళ్ల ప్రతిధ్వని ఇవన్నీ చివరికి ఒకే మనిషి జీవితాన్ని తాకే అనుభవాలుగా మారుతాయి. అందుకే ఈ కవితలు ఒక ప్రాంతానికి పరిమితం కావు. అవి అడవుల నుంచి గ్రామాల దాకా, అక్కడి నుంచి ప్రపంచ రాజకీయాల దాకా విస్తరిస్తాయి.
అడవి గురించి ఈ కవిత్వం మాట్లాడినప్పుడు అది కేవలం ప్రకృతి అందం గురించి కాదు, అక్కడ జీవించే ప్రజల జీవితం గురించి ఒక చెట్టు కూలిపోతే అది కేవలం ఒక కొమ్మ విరగడం మాత్రమే కాదు ఒక కుటుంబం నిలబెట్టుకున్న జ్ఞాపకాలూ విరిగిపోతాయి.
ఒక దారి మూసుకుపోతే అది అడవిలోని మార్గం మాత్రమే కాదు, ఒక సమాజం భవిష్యత్తుకి కూడా తలుపు మూసినట్టే. ప్రకృతితో కలిసి జీవించే ప్రజల ప్రపంచాన్ని ఈ కవిత్వం మన ముందుంచుతుంది. అభివృద్ధి అనే పేరుతో అడవులు కూలిపోతున్నప్పుడు, నేల మీద గాయాలు ఆవున్నప్పుడు, అక్కడి ప్రజల కళ్లలో కనిపించే బాధను ఎవరు వింటారు? చెట్లు, నేల, నీరు ఇవి కేవలం వనరులు కాదు ఒక జీవన విధానాన్ని నిలబెట్టే మూలాలు. అవి పోతే కేవలం ప్రకృతి మాత్రమే కాదు, జ్ఞాపకాలు, జీవితం కూడా పోతుంది.
ఈ కవిత్వం యుద్ధం గురించి మరో కోణంలో ఆలోచించేలా చేస్తాయి . వార్తల్లో మనం యుద్ధాన్ని ఒక సంఘటనగా వింటాం. కానీ ఈ కవిత్వం యుద్ధం మధ్య జీవించే మనుషుల జీవితాన్ని మనకు తెలియజేస్తుంది .
పాలస్తీనా, గాజా గురించి చదివినప్పుడు యుద్ధం అనేది కేవలం వార్తల్లో వినిపించే పదం కాదని అర్థమవుతుంది. ఒక బాంబు పడినప్పుడు కూలిపోవేవి కేవలం గోడలు కాదు, ఒక ఇంట్లో పెరిగిన నవ్వులు, ఒక చిన్నారి బాల్యం, ఒక కుటుంబం జ్ఞాపకాలు కూడా శిథిలాల కింద చేదిరిపోతాయి.
గాజా గురించి వచ్చిన వాక్యాలు యుద్ధం ఎలా ఒక మనిషి జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తుందో చూపిస్తాయి. ఒక ఇల్లు కూలిపోవడం అంటే గోడలు మాత్రమే పోవడం కాదు,అక్కడ జీవించిన ప్రతీ జ్ఞాపకం కూడా చెదిరిపోతుంది. అయినప్పటికీ అక్కడి ప్రజలు తమ నేలపై ఉన్న అనుబంధాన్ని వదలకుండా నిలబడతారు. అదే సమయంలో కాశ్మీర్ గురించి రాసిన కవిత్వం కూడా అక్కడి ప్రజలు భయం మధ్య ఎలా జీవిస్తున్నారో చూపిస్తాయి.
మంచుతో కప్పుకున్న పర్వతాలు, అందమైన ప్రకృతి ఉన్నా, అక్కడి జీవితం నియంత్రణ మధ్య నడుస్తూనే ఉంటుంది.
రాత్రిళ్లు ఇళ్ల నుంచి తీసుకెళ్లబడే యువకులు, ఎప్పటికీ ముగియని ఎదురు చూపుల్లో జీవించే కుటుంబాలుఇవన్నీ యుద్ధం యొక్క మౌన వాస్తవాలను మనకు తెలియజేస్తాయి
ఈ కవిత్వం చివరికి ఒక నిజాన్ని గుర్తు చేస్తుంది. యుద్ధం ఎక్కడ జరిగినా చివరికి బాధపడేది మనుషులే. సంఖ్యలుగా చెప్పబడే మరణాల వెనుక అసలు కథలు ఉంటాయి అమ్మలు, నాన్నలు, పిల్లలు, స్నేహితులు. ఒక్క క్షణంలో పూర్తిగా చెదిరిపోయిన జీవితాలు.
ఈ కవిత్వంలో ప్రేమ కూడా కనిపిస్తుంది. కానీ అది సులభమైన ప్రేమ కాదు. ఒక పువ్వు ఇవ్వడానికి కూడా నేల దొరకని పరిస్థితుల్లో ప్రేమ ఎలా బతుకుతుందో ఈ కవితలు చూపిస్తాయి. అయినప్పటికీ మనుషులు శాంతి కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఆ ఆశ వారిని నిలబెడుతుంది.
మన సమాజంలో కూడా మనుషుల మధ్య దూరం పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. మతం, రాజకీయాలు, భాష ఇవన్నీ మన మధ్య గోడలుగా మారుతున్నాయి. ఒకరి బాధను మరొకరు అర్థం చేసుకోవడం తగ్గిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో మనం ముందుగా మనుషులమే అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మనిషి తన నేలతో, తన భాషతో, తన జ్ఞాపకాలతో బలంగా ముడిపడి ఉంటాడు. ఆ బంధం తెగిపోతే అతని జీవితం కూడా చెదిరిపోతుంది. తన గుర్తింపును నిలబెట్టుకోవడానికి ఒక సమాజం చేసే పోరాటం ఎంత లోతైనదో ఈ కవితలు చెబుతాయి. అడవుల్లో జరిగే దాడులు, ఆదివాసి గూడాల మీద పడే ఒత్తిడులు, వారి జీవనంపై జరుగుతున్న అన్యాయాలు ఇవన్నీ ప్రశ్నలుగా మన ముందుకొస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మౌనంగా ఉండటం కూడా ఒక సమాధానమే కాదా?
భాష గురించి వచ్చే ఆలోచనలు కూడా మనసును తాకుతాయి. ఒక మనిషికి తన మాతృభాష అంటే కేవలం మాటలు కాదు అది అతని స్వరం, అతని గుర్తింపు. తన భాషలోనే తన బాధను చెప్పగలడు. ఆ స్వరాన్ని నిలబెట్టుకోవడం కూడా ఒక పోరాటమే.
మనుషుల మధ్య ప్రేమ కూడా ఈ ప్రపంచంలో ఎంత ముఖ్యమో కొన్ని కవితలు గుర్తు చేస్తాయి. ద్వేషం పెరుగుతున్న కాలంలో ప్రేమ కూడా ఒక ప్రతిఘటనగా మారుతుంది. ఒక చిరునవ్వు, ఒక చిన్న అనుబంధం ఇవే మనిషి జీవితాన్ని నిలబెడతాయి. అమ్మ గురించి వచ్చే చిన్న చిన్న దృశ్యాలు కూడా మనసును తాకుతాయి. పెద్ద రాజకీయాల మధ్య కూడా ఒక సాధారణ ఇంట్లో దాగి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అవి గుర్తు చేస్తాయి.
మన చుట్టూ ఎన్నో సంఘటనలు నిశ్శబ్దంగా జరుగుతూనే ఉంటాయి. వాటిలో చాలా సంఘటనలు మన దృష్టికి రావు. కానీ అవి కూడా ఎవరో ఒకరి జీవితాలే. మనం గమనించకపోయినా అవి ఆగిపోవు. వాటిని నిశ్శబ్దంగా మన కాలం రాస్తూనే ఉంటుంది.
“నది ప్రవహించడం ఆగదు
ప్రశ్నలు కూడా అలాగే ఆగవు”
చివరికి “నీలం రంగు నది” ఒక ప్రశ్నను అడుగుతుంది . ఎక్కడైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం మౌనంగా ఉండాలా? లేక మనం కూడా ఒక స్వరం కావాలా? ఆ ప్రశ్నను మన చేతుల్లో పెట్టి ఈ కవిత్వం నిశ్శబ్దంగా నిలబడుతుంది. సమాధానం మాత్రం మనమే చెప్పాలి.
ఆర్తనాదాలు బాగానే చెప్పారు. ఆకాశం ఎక్కించారు. అక్షర దోషాలు కూడా సరి చేస్తే బాగుండేది.