దేశం రాసుకున్న అశ్రులేఖ

‘ఆధునిక రాజ్యాల ప్రభుత్వాలు పెట్టుబడిదారి వర్గపు పనులు చక్కబెట్టే ఏజంట్లు’అని మార్క్స్ అన్న విధంగా అభివృద్ధి చెందుతున్న వర్తమాన దేశాలు కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో నడుస్తున్నాయి. తత్ఫలితంగా సమాజ పురోభివృద్ధి కుంటుబడి అన్నీ రంగాల్లో దోపిడి కొనసాగుతూ పౌర సమాజం అన్నిటా బాధిత వర్గంగా మారిపోతావుంది. ఇందుకు మనదేశమేమి మినహాయింపు కాదు. విపత్తు ఆపద సంభవించినపుడు ప్రజల్ని రక్షించాల్సిన పాలకులు కార్పొరేట్ శక్తుల కొమ్ముకాస్తున్న దౌర్భాగ్యం నడుస్తున్న కాలమిది. ఈ కాలాన్ని నిబద్ధత గల కవులు రచయితలు రికార్డు చేస్తున్నారు. సమాజాన్ని సత్యం వైపు నడిపించే పనికి పురికొల్పుతున్నారు. కవి వి. ఆర్. తూములూరి గారి ‘దేశానికో అశ్రులేఖ’ అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు.

“కవీ
నువ్వేమీ…
మంత్రాలు చదవొద్దు
మాయలు చేయొద్దు
అక్షరాన్ని అర్థవంతంగా అక్షరీకరిస్తే చాలు
అక్షరాన్ని సవ్యదిశలో నడిపిస్తే చాలు” అంటూ కవుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తున్నారు. దేశం, ప్రజలు నిస్సహాయతలోకి పడిపోయిన వర్తమానాన్ని మేల్కొల్పుతున్నాడు కవి.

‘దేశానికో అశ్రు లేఖ’ కవితలో కొన్ని వాక్యాలు చదివితే వాస్తవం బోధపడుతుంది.

“నా దేశమా !
నువ్వో విభిన్న జాతుల సమూహానివి
షడ్రుచుల సమ్మేళనానివి భిన్న భాషలు,
ఆహార్యాలు, ఆహారపు అలవాట్లు ఎన్నున్నా
భారతీయత ఆత్మగా నిలుచున్న దానివి

ఎన్ని మతాల పుట్టుకకు కేంద్రానివి నువ్వు!
మరెన్ని ఆలోచనల వికాస సింధువి నువ్వు!

సింధూ నాగరికత విలసిల్లనది ఇచ్చోటనే కదా
వేదం జీవన నాదంగా మారింది ఈ జనులకే
సదా అహింసను ఆవాహనం చేసింది ఈ గడ్డనే కదా
దోపిడీలు, దాడులు, యుద్ధాలు, క్రూర పరిహాసాలు
నీ చరిత్ర గతిలో రుథిరం అంటని కాల
మొకటుందా నీ ఎదపై కాలిడని జాతి ఏదైనా మిగిలిందా !

నా దేశమా !
సంకట కాలాలను ఈదావు నువ్వు
ఢీలాపడ్డ సామాన్యుల్ని తట్టి లేపావు నువ్వు” అని చాలా స్పష్టంగా వర్తమాన దేశ స్వరూపాన్ని ఆవిష్కరిస్తారు.

ఎన్నికలు ఎన్ని హామీలు ఇచ్చినా ఆచరణ లో శూన్యం అయిన రాజకీయాలు ప్రజల్ని ఏవిధంగా బందీ చేస్తున్నాయో కవి వి. ఆర్. తూములూరి గారు తన కవితల్లో ఆవిష్కరించారు. వర్తమాన సామాజిక స్వరూపాన్ని తెలియజేసే ఇటువంటి సాహిత్యం కాలం గుండెచప్పుడుగా అభిప్రాయపడటం సముచితం కదా!

“దేశమంటే మనుషులన్న” గురజాడ అప్పారావు గారి మాటలు మనం అర్ధం చేసుకుంటే దేశం లోని నిస్సహాయులైన ఎందరో నిర్భాగ్యులు కంటికి కానవస్తారు. ఇటీవలే ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కాలాన్ని, ఆ దుర్మార్గపు రోజుల్లో ఏరులై పారిన దుఃఖాన్ని మనచెవులతో విన్నాం. కళ్ళతో చూశాం. కవి తూములూరి విని చూసి ఊరుకోలేదు.

“తుదిపలుకు” పేరుతో కవితగా మలిచారు. కవిత చదువుతుంటే అప్పుడు నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా పాలకులు ప్రవర్తించిన తీరుని ఎండగట్టారు. ఆ కవితను చదివితే పాలకుల డొల్లతనం బయటపడుతుంది.

౹౹ తుది పలుకు ౹౹

ఏలికా !
మాక్కొంచెం నమ్మకమివ్వు
వేసుకునేందుకు మందుల నివ్వు
హాస్పిటల్ లో ఇంత చోటును ఇవ్వు
బ్రతికేందుకు ఒక్క అవకాశమివ్వు

ఓ పాలికా !
ఊపిరి నిలిచేందుకు ఆక్సిజన్ ఇవ్వు
లేకుంటే స్మశానంలో చోటునైనా ఇవ్వు
శవాల్ని తరలించేందుకు వాహనాల్ని ఇవ్వు
కాల్చేందుకు కట్టెలో, విసిరేందుకు నదులనో ఇవ్వు

ఓ విశ్వ గురువా !
ఎగిసిన నీ ప్రతిష్టను మసక బార్చే
అనాధ మరణాలకు క్షమాపణ నివ్వు
ముప్పిరిగొన్న కమురు వాసనతో నైనా
మిగిలిన దేశ ప్రజలను బ్రతకనివ్వు”

*

దేశమంటే మట్టికాదు దేశమంటే మనుషులన్నది నిజమైతే ఆ మనుషులు రాసుకున్న బాధల గాధలు ఈ కవితలు. తరాలుగా పాలకుల చేతల్లో చేతుల్లో మోసపోతున్న మనుషుల దేశం రాసుకున్న దుఃఖపులేఖ, దుఃఖం రగిల్చిన దుఃఖానంతరం పాడే చర్యాగీతం ఈ కవితా సంపుటి. సామాజిక అభ్యున్నతికి నేల పాడుకునే సామూహిక విముక్తి గానం ఈ కవి గొంతులో, కవితా సంపుటిలో మనం వింటాం. పిడికెడు చైతన్యాన్ని పులుముకుంటాం.

పూర్తిపేరు ప‌ల్లిప‌ట్టు నాగ‌రాజు. చిత్తూరు జిల్లా ‘అరవై నాలుగు పెద్దూరు’లో తెలుగు ఉపాధ్యాయుడు. శ్రీ వెంకటేశ్వర విశ్వ‌విద్యాల‌యంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆరువంద‌ల‌కు పైగా కవితలు, మినీ కవితలు, 6 కథలు రాశారు. చిత్తూరు జిల్లా ‘అభ్యుదయ రచయితల సంఘం’, ‘ఈ తరం కవితా వేదిక’లో కార్యవర్గ స‌భ్యుడిగా ప‌నిచేస్తున్నారు.

Leave a Reply