దల్లీ రాఝరా ఎలా వెళ్లాలి

అనువాదం: మమత కొడిదెల

దల్లీ రాఝరాకు వెళ్లేదారేది అని
ఒక చాయ్ వాలాను అడుగు
ఉచితంగా ఓ కప్పు ఎర్రని చాయ్ నీకు అందించి చెప్తాడు:
నేరుగా వెళ్లి ఎడమవైపుకి తిరుగు

దల్లీ రాఝరాకు వెళ్లేదారేది అని
ఒక కార్మికుడిని అడుగు
మరోప్రపంచాన్ని నీకు గుర్తుచేసే
పాట ఒకటి పాడతాడు నీకోసం

దల్లీ రాఝరాకు వెళ్లేదారేది అని
ఒక రైతును అడుగు
ఆ రోజు నువ్వు ఆకలితో అలమటించకుండా
నీకు కొంచం ధాన్యం ఇస్తాడు

దల్లీ రాఝరాకు వెళ్లేదారేది అని
ఒక ఆదివాసిని అడుగు
అతను నిన్ను తన ఇంటికి అహ్వానించి
మహువా మత్తులో నిద్రపుచ్చుతాడు

దల్లీ రాఝరాకు వెళ్లేదారేది అని
ఒక సంచారిని అడుగు
అతను నీకు ఒక టికెట్ అందిస్తాడు
ఎంత పురాతనమైనదంటే, దాని ట్రైన్ వెళ్లిపోయి చాలా కాలమైంది

దల్లీ రాఝరాకు వెళ్లేదారేది అని
ఒక ఫాసిస్టును అడుగు
అలాంటిదేదీ లేదు పొమ్మని
నిన్ను తుపాకీతో అదిలిస్తాడు

దల్లీ రాఝరాకు వెళ్లేదారేది అని
ఒక యూనియన్ వ్యక్తిని అడుగు
పోరాడేందుకు పనిముట్లు అందిస్తాడు
నీకు నువ్వే వెళ్లి, కనుక్కో అని చెబుతాడు

దల్లీ రాఝరాకు వెళ్లేదారేది అని
ఒక కవిని అడుగు
అరుదైన పసుపుపచ్చ పువ్వులను చూపించి
అదిగో అది నీ గుండెలోనే ఉందని అంటాడు

పుట్టింది అనంతపురంలో.  అక్కడి వింతైన, విచిత్రమైన గాథలను వింటూ పెరిగాడు.  వృత్తి రీత్యా డాక్టర్. తెలుగు నుండి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుండి తెలుగుకు అనువాదాలు చేయటం, ఇంగ్లిష్ లో కవిత్వం రాయటం చేస్తుంటాడు.  కవిత్వాన్ని చాలా వరకు ఫేస్బుక్ లో పెడుతుంటాడు.  తన కవిత్వం The Bombay Literary Magazine, The Punch, Sunflower Collective తదితర పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

Leave a Reply