ఊరుకు దూరంగా ఒంటరిగా ఉండే గూనపెంకుల ఇల్లు. మూడొంతుల రాతి కట్టడం గోడలు. ఆ గోడలకు ఎర్రమన్ను అలుకుపూతలు. ఎర్రటి మీద పోతపోసినట్టుగా తెల్లటి నిలువు గీతలు. ఆ మనుషుల మనసులు కూడా ఎరుపెక్కిన అలుకుపూతలు. బండలనే కండరాళ్ళుగ మలుసుకున్న గట్టి మట్టి మనుషులు. ఎవ్వలకు ఏ ఆపదొచ్చినా గూడెంకు గూడెం… గుండెకు గుండె… గూడుకు గూడు ఆసరయి కదులుతరు. బండ్లగూడెంలో వొడ్డెరోల్ల తెరువు రావాలంటేనే మిగతా కులాలకు ఒక జడుపు. తమది తప్పు ఉంటే నలుగుట్ల తలొంచుకుని నిలబడుతరు. ఎదుటి వారిది తప్పుంటే శిలుం వొదిలేదాక తరిమి తరిమి కొడ్తరని ఆ ఊరోళ్ళే తమ అనుభవాలు చెప్పుకుంటరు. ఊరికి దూరంగా ఇసిరేసినట్టుగా అక్కడొకటి ఇక్కడొకటి పదిహేను ఇరవై ఇండ్లతో వొడ్డెరోల్ల వాడకట్టు. కంపచెట్ల మధ్యలో అన్ని ఇండ్లకు కాలినడక బాటలే దిక్కుదారులు చూపుతాయి.
“అవ్వ… ఎవలో మనింటి దిక్కే వత్తున్నరే”
“ఎవరే”?!… అంటూనే రాధమ్మ తన వంటపని లోకంలోనే ఉంది. బండకాడికి యాల్ల పొద్దుగాల పోవాలని తొందర. రోకలితో బలం కూడ తీసుకొని రోటిలో పుంటికూర తొక్కు సప్ప సప్ప నూరుతున్నది.
ఐదేండ్ల తన బిడ్డ అరుణ చెప్పే మాటను పెద్దగా పట్టించుకోకుండానే తల్లి పనిలో మునిగింది.
“ఎట్ల వొత్తుండె పోరి…? మనింటిదిక్కు వొచ్చెటోడు ఎవడే?” అంటూ తల్లి గద్దించి దీర్ఘాలు తీసింది.
ఇంటి సుట్టూర ఎత్తయిన మోటు పరుపు బండనే గోడలాగ నిలబెట్టి ప్రహరీలా నిర్మించి ఉంది. మనుషులు ఎవలొచ్చేది ఇంటి ముందు వంట కొట్టంలో పని చేసుకుంటున్న రాధమ్మకు కనిపించ లేదు. ఆమె ఒక పనిమంతురాలు. ఒంటరి బతుకయినా ధైర్నం గల్లది.
ఇల్లు, పిల్ల, బండ గొట్టుడు, గొడ్డు చాకిరె తన లోకంగా బతుకుతున్నది.
బండ రాళ్ళ ప్రహరీ ఇంటి బయట నుండి లోపలకు అరుణ గిదగిద ఉర్కొచ్చింది. “మనింటికే వొత్తున్నడే అవ్వా”… అన్నది.
“ఎవ్వడే…. ఒత్తండు ఒత్తండని ఒకటే జెప్తన్నవు” తల్లి
“ఏమ్మోనే… భుజానికి బ్యాగు, చేతిలో సందుకపెట్టె పట్టుకొని దబదబ నడుసుకుంట ఇటే వత్తున్నడే” బిడ్డ అరుణ, తల్లి రాధమ్మతో మళ్ళీ చెప్పింది.
బిడ్డ చెప్పినట్టే, రాధమ్మ ఇంటి ఆవరణలోకి ఆ వ్యక్తి రానే వచ్చిండు. బ్యాగు కింద పెట్టి నవ్వుతూ రెండు చేతులు సాపుతూ ఇటు రమ్మంటూ అరుణను పిలిచిండు. అతనెవరో తెల్వక బిత్తరపోతూ అందకుండా దూరంగా ఉరికింది. తొక్కు నూరుతున్న రాధమ్మ చేతిలోంచి రోకలి వదిలేసింది. ఆమె కళ్ళలో మెరుపు ఒలికింది. ముఖంలో ఆశ్చర్యం కలిగింది. నోటి నుండి మాటరాక ఒక్కసారి దబ్బున లేశి నిలబడ్డది. అతను అమాంతం ఉరుకొచ్చి రాధమ్మను పైకిఎత్తి కౌగిలించుకున్నడు. వలవల ఏడుపు అందుకోబోయి ఆగింది. వెంటనే తల్లిని జూసి బిడ్డ బెదురు మొఖంతో ఉరుకొచ్చి తల్లి చీరసింగులను పట్టుకొని ఏడ్చింది.
“ఎందుకు ఏడుస్తున్నవ్ బిడ్డా! ఏడువకు… ఏడవకు… ఎవరీనే?!
బాపు! బాపూ…అని పిలువు బిడ్డా” అంటూ అతనికి బిడ్డ చేయి అందిచ్చింది. అతని కళ్ళలో నీలిమేఘాలు కమ్ముకుని తన బిడ్డ వైపు తదేకంగా చూస్తున్నడు.
బిడ్డ పెదవుల్లో నవ్వల పూవులు పూసినయి. బిడ్డను తండ్రి చేతుల్లోకి తీసుకున్నడు. ఒక్కటయిన ముగ్గుర్లో అవధుల్లేని ఆనందం ఉప్పొంగింది.
భర్త శివరాత్రి స్వామితో రాధమ్మకు పెండ్లయిన ఆరు నెలలకే అరుణ కడుపుల పడ్డది. పెండ్లయితేనన్న ఇంటి పట్టున ఉంటడని ఒక్కగానొక్క కొడుక్కు ఇరవై ఏండ్లకే తల్లిదండ్రులు దగ్గరి సుట్టం పిల్ల రాధను పెండ్లి చేసిండ్రు. బండ్లగూడెం, లింగాలఘనపురం సుట్టు పక్కల ఊర్లల్ల రైతు కూలీలు, వ్యవసాయ కార్మికుల పోరాటాల్లో చూపిన తెగువకు స్వామి పేరు అందరికి ఎరుకయింది. ఊరులో పెత్తందార్ల ఆగడాలకు కళ్ళెం ఏసి గుంజుతున్నట్లు స్వామి మీద భూసాముల కన్నుపడ్డది. తన కొడుకును లేపడానికి బండ్లగూడెం చిన్నదొర నర్సిరెడ్డి పట్నం నుండి ఐదుగురు గుండగాళ్ళను రప్పించి గడీల రోజు మేపుతున్నడని తండ్రి రాజయ్యకు తెల్సింది. ఈ కుట్రెనుక జనగాం అమీన్ సాబ్ ఉన్నడని తెల్సుకున్నడు. కొడుకు స్వామి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని బతిమిలాడి గుట్టుగా దుబాయ్ ఇమానం ఎక్కించిండు. బుడ్డ పొల్ల పుట్టిన ఐదేండ్లు దాటినంకనే ఊర్లే అడుగు పెట్టిండు.
“ఏందీ ఒక్క కారటు ముక్క రాయకుండా, ఎవలితోని మాట మతులబు లేకుండా మొగులు నుంచి సుక్కోలే తెగిపడ్డవేంద”ని నవ్వకుంటన్నది రాధమ్మ
“నా డూటి కంపెనీలో ఐదేండ్ల అగ్రిమెంట్ అయిపోయింది. ఇంకో కంపెనీల కొలువు దొరికింది. మల్లెపుడు దేశానికి వచ్చుడు అయితదోనని, కొత్త నౌకర్ల చేరకముందే సూశిపోదామని వచ్చిన్నే” ప్రేమతో చెప్పుకొచ్చిండు.
“వొత్తె వచ్చినవ్ కానీ మళ్ళా దుబాయ్ కి పోయేదాక తిని జర్ర ఇంట్లనే కూసొని ఉండు. మునుపటి లెక్క ఎక్కడికి పడితే అక్కడకు బయట తిరుగకు” అని భర్త గదుమ పట్టుకొని భార్య మెత్తగ బతిలాడింది.
“ఎందుకే? ఊర్లే ఏమైందే? మంచిగ లేదా?” భర్త అడిగిండు.
“అస్సలు మంచిగా లేదయ్యా! పోయిన ఆదివారంనాడు మీతోటి సోపతిగాడు కురుమోల్ల శ్రీనివాసును రాత్రిపూట పిల్లిగుండ్ల కాడ ఎవరో నరికి సంపిండ్రట?!”.
ఆ రాత్రిపూట నిద్ర పట్టకుండా మనుసులో కురుమోల్ల శ్రీనివాస్ ను సంపిన ముచ్చట ఇన్నంక అతని మనసు అల్లకల్లోలంగున్నది. ‘వాళ్ళ’ కు పాణమసుంటి మనిషిని ఎవలు సంపుతరని మనుసులో ప్రశ్నలు. ఇందులో ఏదో తిరకాసుందని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుండు స్వామి.
ఎగిలివారంగనే రాధమ్మ ఇంటిపనుల్లో మునిగింది. పక్కల నుండి లేశి బిడ్డ చెప్తున్న చిలక పలుకులు ఇనుకుంట ముసిముసిగా నవ్వుతున్నడు తండ్రి.
రాధమ్మ వేడి వేడి ఛాయ గ్లాసు భర్తకు అందిచ్చింది. తను కూడా అతనికి ఎదురుగా దర్వాజకు ఒరిగి కూసొని ఛాయ్ తాగుతున్నది.
“రాధ!…ఊరిలో మనం ఎవలెవలకు ఎంత బాకిచ్చేది ఉందో మొత్తం అస్సలు, మిత్తితో దేకిల్గా బాకీలు కట్టేద్దం. నా నెత్తి మీదున్న పెద్ద బరువు దిగిపోతది” అన్నడు.
“ముందుగాల ఆ మంచి పని జేత్తె, మల్ల ఎవలైన ఆపతికి ఆదుకుంటరు.” అన్నది రాధమ్మ.
దుబాయ్ నుండి స్వామి వొచ్చిండని నాలుగు రోజుల్లో ఊరంతా ఎరుకయింది. కొందరు దోస్తులు కలిసి ముచ్చట పెట్టిపోతున్నరు. శ్రీనివాస్ కుటుంబాన్ని కలిసి పలుకరిచ్చిండు. సర్కారు పోరంబోకు భూముల్లో గొల్లకుర్మలు జీవాలను మేపుకోవడంతో పెత్తందార్లకు కన్నుకుట్టింది. గొల్లకుర్మల సంఘం వెనక శ్రీనువాస్ పాత్ర దొరలకు తెల్సింది. ఓ రోజు రాత్రిపూట జనగాంకు పోయి వొస్తుండగా నర్సిరెడ్డి మనుషులు సంపిండ్రని శ్రీనివాస్ తల్లి శోకం బెట్టింది.
వర్షాలు కురువక మండలంలోని ఊర్లలో కరువు మబ్బులు కమ్ముకున్నయి. కార్మికులకు కూలీ పనుల్లేక బతుకులు భారంగున్నయి. భూమిలేని వొడ్డెరోల్ల బతుకుల నిరాశలు కమ్మినయి. పసుపు బట్టల నాయకులకు జనం బాధలు పట్టలేదు. బండబారిన బతుకుల్లో మార్పు కోసం ఆలోచన చేసిండు స్వామి.
ఊర్లో రాత్రికి రాత్రె తెల్లటి గోడలు ఎర్రజాజు చేతులతో మాటలు నేర్చుకొని తెల్లారెసరికి జనాలతో మాట్లాడుతున్నయి. “దున్నేవాడిదే భూమి”, ” తాడు ఎక్కెవాడిదే చెట్టు”, “బండగొట్టే వాడిదే గుట్ట”ని గోడలు మాట్లాడుతుంటే భూసాముల గుండెల్లో గుబులు సురువైంది.
గుట్టలపై వొడ్డెర్లకు క్వారీ హక్కులు ఇయ్యాలని సంఘం పెట్టిండు. తహసిల్ ఆఫీసుల ముందు బండ బతుకులు ధర్నాలకు దిగినవి. ఆందోళనలు రోజు రోజుకు జిల్లా మొత్తం పాకింది. బడా క్వారీ గుత్తెదార్లకు అడ్డుపడకుండా సర్కారు మీద ఒత్తిడి.
“నమస్తే…స్వామి అన్న, మన ఎమ్మెల్యే లక్ష్మణ్ సర్ రమ్మన్నరు” ఎమ్మెల్యే అనుచరులు.
“ఎందుకు?… మీ ఎమ్మెల్యే సారుకు నాతోనేంపని” ఎదురు అడిగిండు.
“మీ వొడ్డెర సంఘం సమస్య మీద మాట్లాడేదుందట” అన్న…
స్వామి మొఖంలో ఒకింత సంతోషం… మరొకింత అనుమానం. అయినా కలుద్దామని బండకొట్టె కార్మిక నాయకులను వెంట తీసుకొని వెళ్ళిండు.
“హాల్లో… స్వామి గారు… బాగున్నారా ? మీ వోళ్ళ కోసం బాగా కొట్లాడుతున్నవు సంతోషం.” ఎమ్మెల్యే స్వాగతించిండు.
“భూములు, జాగలు లేకుండా కష్టం నమ్ముకున్నోళ్ళం సార్… బతకడానికి బుక్కెడు బువ్వ కోసమే అడుగుతున్నం సార్” స్వామి
“స్వామి… ఆ గుట్టలను పెద్ద పారిశ్రామిక వేత్తలకు ఇస్తూ గతంలోనే అగ్రిమెంట్ జరిగింది. ఇప్పుడు మీకియ్యడం కదురదు.” ఎమ్మెల్యే అన్నడు.
“ఒక్కడు కోట్లకు పడగెత్తడానికి…మా వందల మంది పేదల నోట్లో మట్టి కొడుతరా సర్.” ఆవేదనగా స్వామి ప్రశ్నించిండు.
“అర్థం చేసుకోవాలి…కార్మికులకు వేరే ఉపాధి పనులు చూద్దాం, ఓ క్వారీలో నీకు సూపర్వైజర్ జాబ్ ఇస్తం గమ్మున ఉండరాదయా!” అంటూ ఎమ్మెల్యే హుకూం జారీ చేసిండు.
స్వామిలో కోపం కట్టలు తెగింది. “ఈనేల మీదున్న చెట్టు, పుట్ట, గుట్టలు మాలాంటి ప్యాదలు బతకడానికే కదా! బలిసిన బడా కాంట్రాక్టర్ల కోసం కాదు సార్” స్వామి చీత్కరించుకుంటూ నిప్పులు చెరిగిండు.
“కార్మికుల ఐక్యత వర్దిల్లాలి, బండ కొట్టెవాడికే గుట్టలు” పిడికిలెత్తి ముక్తకంఠంతో నినాదాలు మారుమోగాయి. పోలీసులు గబగబా ఎమ్మెల్యే ఆఫీస్ లోకి వచ్చిండ్రు. కార్మికులతో కలిసి స్వామి బయటకు వొచ్చిండు.
ఎమ్మెల్యే లక్ష్మణ్ కు లోపల భగభగ ఉడుకుతున్నది. “డిఎస్పీ గారు ఇక సమస్యను మీరే సాల్వు చేయాలంటూ” కాంట్రాక్టర్లకు కన్ను సైగ చేసిండు.
“ఎమ్మెల్యే గారు మీరు ‘ఊ’ అంటే నేను చూసుకుంటానంటూ” డిఎస్పీ కుడి చేయి ఎత్తి సాల్యుట్ చేసిండు.
గ్రామ పంచాయతీ, మండల పరిషత్ లో కూడా “బండగొట్టె వాడికే గుట్టలు” మీద హక్కంటూ ప్రభుత్వానికి తీర్మానం చేస్తు ఉద్యమం దావనంలా విస్తరించింది.
తన గూడులో భార్యా బిడ్డతో కలిసి స్వామి నిద్రిస్తుండు. నడిరాత్రి వేళ ఖాకీ గద్దలు వచ్చి కోడి పిల్లను తన్నుకుపోయినట్లుగా అమాంతం ఎత్తుకొని పోయిండ్రు.
అది- 15 మార్చ్, 1993 ఉదయం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తలు… ‘‘జనగాం సమీపంలో యశ్వంతపురం వాగులో నక్సలైట్ల సమావేశంపై పోలీసుల దాడి.”. “పరస్పరం ఎదురు కాల్పులు”…
‘‘గుర్తు తెలియని ఒకరి మృతి’’….
“పారిపోయిన దళం కోసం పోలీసుల గాలింపు”….
నక్సల్స్ తో కలిసి ప్రజావ్యతిరేక చర్చల్లో పాల్గొనడం వల్లనే శివరాత్రి స్వామి ప్రాణాలు కోల్పోయిండని డీఎస్పీ ప్రకటించిండు.
అనాథలైపోయిన ఆడ బిడ్డల రోదనలు ఆకాశాన్నంటినయి. ఖాకీల కట్టు కథల ముందు నిజానిజాలు సమాధి అయినవి. యశ్వంతాపురం వాగు వద్దకు చుట్టుముట్టు ఊర్ల ప్రజలు చేరుకొని ఆగ్రహంతో ఊగిపోతున్నరు.
గుమికూడిన జనంలోంచి…. “జోహార్ స్వామి అన్న”… “లాల్ సలామ్ స్వామి అన్న”…. నినాదాలు ఒకరిని చూసి మరొకరు సింహనాధాలై గర్జించారు. నినాదాల ఆగ్రహం ఉగ్రరూపమై కట్టలు తెంచుకుంది. వాగులో చేతికందిన రాళ్ళు, రప్పలు, ఇసుక తుఫానులా లేచి పోలీసులను చుట్టుముట్టింది.
**
Super anna gaaru congratulations 💐💐💐🙏🙏🙏
గుడ్ స్టోరీ… కంగ్రాట్యులేషన్స్ టు కోడం కుమార్ 🌹🌹🌹🌹💐
నెత్తుటి సంతకం.. ఈ ‘తొలి పొద్దు’
– భూక్యా గోపినాయక్
*****
మట్టి మనుషుల గుండె చప్పుడు వినాలంటే ఆ మట్టిలో నుంచే వచ్చిన కలం కావాలి. అక్షరం అక్షరంలోనూ చెమట వాసన, కన్నీటి తడి కనిపించాలి. ‘కొలిమి’లో వచ్చిన కోడం కుమారస్వామి కథ “తొలి పొద్దు” చదివినప్పుడు సరిగ్గా అదే అనిపిస్తుంది. ఇది కేవలం ఒక కథ కాదు, తెలంగాణ పల్లెల్లోని అట్టడుగు వర్గాల అస్తిత్వ పోరాటానికి, రాజ్యం చేసే కుట్రలకు మధ్య నలిగిన ఒక నెత్తుటి సాక్ష్యం.
కథలోకి వెళ్తే… బతుకు బరువును మోస్తూ, అప్పుల ఊబిలోంచి బయటపడేందుకు దుబాయ్ వెళ్ళిన శివరాత్రి స్వామి ఐదేళ్ల తర్వాత సొంతూరికి తిరిగొస్తాడు. భార్య రాధమ్మ, ఐదేళ్ల కూతురు అరుణలతో కలిసి ప్రశాంతంగా బతకాలని కలలు కంటాడు. కానీ, ఊరు అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. తన బాల్యమిత్రుడు శ్రీనివాస్ దారుణ హత్య, కరువు కోరల్లో చిక్కుకున్న ఊరు, బండరాళ్లను నమ్ముకున్న వడ్డెర కులస్తుల దయనీయ స్థితి స్వామిని కుదిపేస్తాయి. “దున్నేవాడిదే భూమి – బండ గొట్టేవాడిదే గుట్ట” అనే నినాదం అతడి గుండెలో రగిలి, ఆ ఊరి గోడల మీద ప్రతిధ్వనిస్తుంది. చివరకు, పేదల పక్షాన నిలబడినందుకు రాజ్యం (పోలీసులు, రాజకీయ నాయకులు) అతన్ని ఎలా బలి తీసుకుందన్నదే ఈ “తొలి పొద్దు” ఇతివృత్తం.
రచయిత కుమారస్వామి కథను నడిపించిన తీరు అద్భుతం. కథ మొదట్లో వచ్చే స్వామి, రాధమ్మల కలయిక సన్నివేశం, కూతురు అరుణ తండ్రిని గుర్తుపట్టలేక బెదిరే సీన్ గుండెను పిండేస్తాయి. ప్రవాస జీవితం నుంచి వచ్చిన తండ్రికి, బిడ్డకు మధ్య ఉండే ఆ తెలియని దూరాన్ని, ఆ తర్వాత కలిగే దగ్గరితనాన్ని రచయిత చాలా సహజంగా చిత్రించారు. “నా డూటి కంపెనీలో ఐదేండ్ల అగ్రిమెంట్ అయిపోయింది” అని స్వామి చెప్పే మాటల్లో వలస కూలీల వ్యధ వినిపిస్తుంది.
కథనం ఎక్కడా తడబడకుండా సాగింది. ముఖ్యంగా వడ్డెర కులస్తుల భాష, యాసను పట్టుకోవడంలో రచయిత సఫలమయ్యారు. “ఎవరే?!… అంటూనే రాధమ్మ తన వంటపని లోకంలోనే ఉంది” వంటి వాక్యాలు ఆ వాతావరణాన్ని కళ్ళకు కడతాయి. ఇక, కథ మలుపు తిరిగే సందర్భం… ఎమ్మెల్యే లక్ష్మణ్ స్వామికి సూపర్ వైజర్ ఉద్యోగం ఆశచూపినప్పుడు, స్వామి దాన్ని తిరస్కరించి “ఈ నేల మీదున్న చెట్టు, పుట్ట, గుట్టలు మాలాంటి ప్యాదలు బతకడానికే కదా!” అని గర్జించిన తీరు రోమాలు నిక్కబొడిచేలా ఉంది.
కథాంతం విషాదమే అయినా, అది ఒక కొత్త పోరాటానికి నాంది అని చెప్పకనే చెప్పారు. స్వామిని ఎన్కౌంటర్ పేరిట చంపేసినా, జనం గొంతుకలై “జోహార్ స్వామి అన్న” అని నినదించడం ద్వారా ఒక విప్లవానికి ‘తొలి పొద్దు’ పొడిచిందని సింబాలిక్ గా చెప్పడం బాగుంది. మార్చి 15, 1993 నాటి ఎన్కౌంటర్ సంఘటనను గుర్తు చేస్తూ రాసిన ఈ కథ, చరిత్రలోని చీకటి కోణాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది.
అయితే, కథలో రాజకీయ నాయకులు, పోలీసుల పాత్రలు కొంత రొటీన్ గా, సినిమాటిక్ గా అనిపించినా, కథలోని ఎమోషన్ ఆ లోపాన్ని కప్పేసింది. స్వామి పాత్ర చిత్రణలో ఉన్న నిజాయితీ పాఠకుడిని కంటతడి పెట్టిస్తుంది.
మొత్తంగా… “తొలి పొద్దు” ఒక ఆవేదన, ఒక ఆగ్రహం, ఒక ఆశ. గుండెను బరువు ఎక్కించే ఈ కథ, చదివిన తర్వాత కూడా చాలాసేపు మనల్ని వెంటాడుతుంది. కోడం కుమారస్వామి కలం నుంచి మరిన్ని మంచి కథలు రావాలని కోరుకుందాం.
***