తూటాల మోతలే
గుండె లయలాయే
డ్రోనుల నాదములే
శ్వాస లై పాయెనో
పచ్చని అడివంతా
నెత్తుటి మడుగుగ
పురుటి మంచమై
సెగలు గక్కవట్టెనో
ఒరిగిన బిడ్డలంతా
మళ్ళి జనమమెత్తి
వొడిల కెదిగి వస్తరో
ఎదలల్ల వెల్గుతారో..
నేర్పిన ఆ విద్యలు
ఆ కమ్మని పాటలు
మరపు రావెన్నడూ
చెదరని పోరులూ..
నరకబడ్డ కొమ్మలూ
గాయాల మానులూ
అసమాన త్యాగాల
ఓటమెర్గని గుర్తులు
చిట్లిన ఈ చిగురులూ
నేల రాలిన ఆకులూ
చిందిన కొన్నె త్తురూ
కావెన్నడు ఆగమూ..
మొగులెల్ల కమ్ముకొచ్చి
ఉర్ము మెరుపు లయ్యి
మల్లొచ్చి అల్లు కుంటై
జడివాన జండలయ్యి
అంతమైంది అడవనీ
ఈలలేసి ఎగురుడేమి
వేలవేలు మందగూడి
కూల్చేస్తే గెల్పుగాదు..
తిరగేసి చూడు చరిత
పడిలేసిన కెరటమోలే
పోటెత్తి సముద్రాలెల్లా
పరుగెత్తె ఫోర్సులన్నీ..!!
పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)