తల్లికి చేరని ఉత్తరం

కడుపులో పేగు కదిలినట్లు
కళ్ళలో నీరు ఉబికినట్లు
గుండెల్లో దాచుకున్న రహస్యం పురివిప్పినట్లు
నడుస్తున్న బాటలో పరిచయమున్న
చిరునవ్వు ఎదురైనట్లు
ఙ్ఞాపకాల వెదురు వనంలో
చిక్కటి గాలి పాటలా
నా మనసు యవనిక పైకి
ఏ అర్ధరాత్రో నిద్రపట్టని ఒంటరితనంలోకి
తల నిమిరే చల్లని హస్తమై నువు కనిపిస్తావు
నీతోపాటు మన ఇల్లు మన ఊరూ
ఊరులోని మనుషులూ నా చుట్టూ గుమిగూడుతారు
ఇంత కాలం ఊహలతో అల్లుకున్న సంబంధాలు
ఒక్కసారిగా మానవరూపం తీసుకున్నట్లు
అనుభూతి చెందుతాను
ఎప్పుడో మూతిమీద మీసంకట్టు మొలిచిన వయసులో
అందరినీ చూసిన ఙ్ఞాపకం
అలానే మనసులో నాటుకుపోయింది
ఇప్పుడందరూ పెద్ధవాళ్ళైపోయి
ఎవరి జీవితంలో వాళ్ళు
ఎవరి కష్టసుఖాలలో వాళ్ళు తలమునకలై ఉండొచ్చు

అమ్మా! మొదట్లో నా కోసం
నా ఉనికి తెలుసుకోవడం కోసం
మన కుటుంబాన్ని
మన ఊరునీ పోలీసులు
అల్లకల్లోలం చేసారు కదా
కానీ ఇప్పుడు వేరమ్మా!
బహుశా నా లొంగుబాటు కోసమై
మీ దగ్గరకు ఎప్పుడూ
ఎవరో ఒకరు వస్తున్నారనుకుంట
నీ ఆరోగ్యం గురించీ
నీ పేదరికం గురించీ
ముఖ్యంగా నీ వృద్ధాప్యం గురించి వ్యాఖ్యానిస్తూ
నీ మాటలుగా పేపర్లలో
ప్రకటనలు ఇస్తున్నారు కదా
ఇప్పుడు వాళ్ళకి కావలసింది
నా బ్రతుకు కాదు
నేను వాళ్ళ కాళ్ళ దగ్గర లొంగిపోవడమో లేక
చేసే పోరాటంలో నేను చావడమో అంతే!
నేను ఎందుకు ఈ ఉద్యమంలోకి వచ్చానన్నది
వాళ్ళకు అనవసరం
ఇప్పుడంతా యుద్ధకాలమమ్మా
దిగజారిన వాళ్ళంతా
గుండెజారిన వాళ్ళంతా
ఉద్యమాన్ని మధ్యలో వదిలేసి
వాని పంచన చేరారు
చేయగలిగినంత ద్రోహాన్నీ నష్టాన్ని చేసి వెళ్ళారు
కానీ నేను నీ కడుపున పుట్టిన వాన్నమ్మా
మన ఊరి నేలగంధం పూసుకొని పెరిగినవాన్ని
నాడు చేపట్టిన పోరాటాన్ని
కాని కాలం వచ్చిందని
నా బొందిలో ప్రాణముండగా నేను విడిచి పెట్టను
ఇప్పుడు నడుస్తున్నదంతా రక్తఋతువు
వాడు మా అంతం చూస్తానంటూ పంతం పట్టాడు
మా నమ్మకమంతా ప్రజలపైననే
జనం కోరుకున్నంత కాలం
విజయం దరి చేరేవరకు
ఈ యుద్ధం ఏదో ఒక రూపంలో
కొనసాగుతూనే ఉంటుంది
యుద్ధం కొనసాగినంత కాలం
నేను ఈ పోరాటంలోనే ఉంటాను

అమ్మా! నీ గురించి ఎప్పుడో ఒకసారి
శత్రువు నోటి నుంచో లేదా
అయినవాళ్ళ ఆప్యాయతలనుంచో వింటూనే ఉంటాను
నీ కష్టసుఖాలలో నీ దగ్గర లేనందుకు
నన్ను క్షమించు తల్లీ!
కానీ నీ లాంటి కొన్ని కోట్లమంది తల్లుల
వెతలు తీర్చడానికే నీ కొడుకు
పోరాడుతున్నందుకు గర్వించు
ఇంకా చాలా చాలా రాయాలని ఉందమ్మా
ఎన్నో విషయాల గురించి
మళ్ళీ ఎప్పుడైనా ఇలానే
కొంత సమయం చేతికి చిక్కినప్పుడు

అమ్మా! నా కోసం ఎదురుచూసే నీ కళ్ళకు
ఈ లేఖ కొంత స్వాంతన చేకూర్చుతుందనుకుంటాను
మన ఇంట్లో
మన ఊరిలో
ప్రతీ ఒక్కరిని పేరు పేరున
గుర్తుచేసినట్లు చెప్పు
నీకు ఉత్తరం రాస్తూ పరిసరాలనే మరిచిపోయాను
ఏదో అలజడి వినబడుతూంది
శత్రువు మమ్మల్ని చుట్టుముట్టినట్లున్నాడు
లేవాలి జరగబోయే యుద్ధంలోకి నడవాలి
ఈ ఉత్తరం నీకు చేరుతుందో లేదో తెలియదు
ఏ వార్త అయినా
తెల్లవారేలోపు నీకు చేరుతుంది
అమ్మా!జాగ్రత్త!
సెలవా మరి!

పుట్టింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముత్తారం గ్రామంలో. పెరిగిందీ విద్యాబుద్ధులు నేర్చిందీ హన్మకొండ పట్టణంలోని కుమార్ పల్లి వీదుల్లో.
అప్పుడప్పుడూ కవిత్వం రాస్తుంటాను. ప్రగతిశీల విప్లవ సాహిత్యాలంటే వల్లమాలిన ప్రేమ.

Leave a Reply