తప్పిపోయిన నవ వధువులు

(మన భారతదేశం గర్వించదగిన ముగ్గురు అద్భుతమైన మహిళా దర్శకులు! అనే శీర్షికతో రాస్తున్న సినిమాలలో ఇది మూడో చిత్రం.)

“లాపాతా లేడీస్” (లాస్ట్ లేడీస్) అనే సినిమా భారతీయ హిందీ-భాషా హాస్య-నాటక చిత్రంగా అంతర్జాతీయంగా 2023లో విడుదలైంది. దీని దర్శకురాలు కిరణ్ రావు. ఈ చిత్రాన్ని కిరణ్ రావు, ఆమిర్ ఖాన్, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా నిర్మించారు. బిప్లాబ్ గోస్వామి రచన ఆధారంగా స్నేహా దేశాయ్ స్క్రిప్ట్ రచన చేశారు. ఈ సినిమా నిడివి 124 నిమిషాలు.

కథాంశం: ఇద్దరు నవ వధువులు ఫూల్ కుమారి (నితాన్షి గోయెల్), పుష్పా రాణి (ప్రతిభా రాంటా) రైలు ప్రయాణంలో అనుకోకుండా ఒకరి స్థానంలోకి మరొకరు చేరతారు. అందువల్ల సమస్యలు తలెత్తుతాయి. ఫూల్ భర్త దీపక్ కుమార్ (స్పర్ష్ శ్రీవాస్తవ్) అవినీతిపరుడైన పోలీసు అధికారి శ్యామ్ మనోహర్ (రవి కిషన్) సహాయం కోరతాడు, ఇది గందర గోళాన్ని మరింత పెంచుతుంది.

వివరాల్లోకి వెళ్తే 2001లో, నిర్మల్ ప్రదేశ్‌ (కల్పిత గ్రామం పేరు) కి చెందిన దీపక్ కుమార్ అనే రైతుకి ఫూల్ కుమారితో ఒక శుభముహూర్తంలో పెళ్ళవుతుంది. అదే రోజు అదే ముహూర్తానికి ఆ ప్రాంతాల గ్రామాలలో మరి కొన్ని జంటలకు కూడా పెళ్ళిళ్ళవుతాయి. దీపక్ తన కొత్త వధువు ఫూల్ కుమారితో తన గ్రామానికి ప్రయాణమవుతాడు. అనేక మంది నూతన జంటలు వారి వధువులతో రద్దీగా ఉన్న ప్యాసింజర్ రైలులో వరుళ్ళ ఇళ్ళకు వెళ్ళడానికి రైలు ఎక్కుతారు. ఆ ప్రాంతపు సంప్రదాయం ప్రకారం, వధువులందరూ ఒకే రంగు పెళ్లి దుస్తులను ధరిస్తారు, వారి ముఖాలు పూర్తిగా ఘూన్‌ఘాట్ (ముసుగు)తో కప్పబడి ఉంటాయి. రాత్రంతా పెళ్ళి వల్ల అలసిపోయి, నిద్రకొరిగిన దీపక్ అకస్మాత్తుగా నిద్రనుంచి లేచి తాను తన గమ్యస్థానానికి చేరుకున్నానని గ్రహిస్తాడు. బయలుదేరే తొందరలో చీకటి, ముసుగులు ధరించిన వధువులు ఒకేరకంగా ఉండడంతో దీపక్ పొరపాటున వేరే అతని ‘భార్య’ చేయి పట్టుకుని రైలు దిగుతాడు. ఫూల్‌ కుమారి రైలులోనే మిగిలి పోతుంది. ఆ తర్వాత, ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి దీపక్, అతని కుటుంబం, తప్పిపోయిన అతని భార్య ఫూల్ కుమారి, జయ అలియాస్ పుష్ప (దీపక్ పొరపాటుగా తీసుకు వచ్చిన మరో నూతన వధువు) లకు ఎదురైన ప్రమాదాలు, అవమానాలు, పరిణామాలను ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది.

దీపక్ జంటను అతని కుటుంబం స్వాగతిస్తుంది, కానీ అతనితో వచ్చిన వధువు దీపక్ భార్య కాదని గ్రహించిఆ కుటుంబమంతా దిగ్భ్రాంతికి గురవుతారు. ఆమె వారికి తన పేరు మార్చి పుష్ప అని, ఊరి పేరు కూడా మార్చి వేరే పేరు చెప్తుంది. ఇంతలో, వేరే స్టేషన్‌లో, ఫూల్ తాను తప్పిపోయానని తెలుసుకుంటుంది. కానీ ఆమెకు దీపక్ గ్రామం పేరు గానీ, అత్తమామలు, కుటుంబం గురించి గానీ, ఇతర వివరాలు ఏమాత్రం తెలియవు. కాబట్టి స్టేషన్ మాస్టర్ కూడా ఆమెకు ఏ రకంగానూ సహాయం చేయలేకపోతాడు. పెళ్ళి కాని మారుమూలల గ్రామాల్లో ఉండే ఆడపిల్లలు ఎంత అమాయకగా ఉంటారో అచ్చం అలాగే ఉంటుంది ఫూల్. పైగా వాౡ పాటించే సాంప్రదాయాల ప్రకారం పుట్టింటికి వెళ్తే తలితండ్రులకు, కుటుంబానికి అవమానంగా భావించి ఇంటికి తిరిగి వెళ్ళకూడదని మనసులో నిర్ణయించుకుంటుంది. ఎప్పటికైనా దీపక్ తనను వెతుక్కుంటూ వస్తాడనే ఆశతో స్టేషన్‌లోనే ఉండాలనుకుంటుంది. ఆమెకు ప్లాట్‌ఫామ్‌పై టీ స్టాల్ నడుపుకుంటున్న మంజు మాయి తనతో పాటే ఉంచుకొని సహాయం చేస్తుంది.

దిక్కు తోచని పరిస్థితిలో దిగులుగా, అశాంతితో ఫూల్ కోసం వెతుకుతున్న దీపక్ ఆ ఊరి సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ మనోహర్‌కు ఫిర్యాదు చేస్తాడు. అతను దీపక్ ఇంటికి వధువుగా వచ్చిన పుష్ప మీద నిఘా పెట్టి ఆమెను అనుసరిస్తుంటాడు. పుష్ప నగలు అమ్మడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం, బస్సు టిక్కెట్లు కొనడం చూస్తాడు. ఆమె ఒక దొంగ అయి ఉండవచ్చని భావిస్తాడు.

ఈలోగా ఫూల్, స్టేషన్‌లో టీ కొట్టు నడుపుకునే మంజు మాయికి సహాయంగా తనకి వచ్చిన పనులు చేస్తూ ఉంటుంది. మంజు మాయి స్ఫూర్తితో చక్కగా వంటలు చేయడం, కలాకండ్ అనే తీపి వంటకాన్ని అద్భుతంగా తయారుచేసి, కొంత సంపాదించగలగడం, ధైర్యంగా ఉండడం నేర్చుకుంటుంది. అందరి మన్ననలను అందుకుంటూ, స్వతంత్రంగా ఆలోచించడం మొదలుపెడుతుంది.

పుష్ప అసలు పేరు జయ అని సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ మనోహర్‌ తన పరిశోధన ద్వారా తెలుసుకుంటాడు. ఆమె ఒక దొంగల ముఠాకు చెందినదని భావించి అరెస్టు చేస్తాడు. పుష్ప తాను దొంగను కానని, సేంద్రీయ వ్యవసాయంపై డెహ్రాడూన్‌లో ఒక కోర్సులో చేరి చదవుకోవాలనుకుంటున్నానని, కానీ ఆమె కుటుంబం ప్రదీప్‌తో బలవంతంగా వివాహం జరిపించిందని చెప్తుంది. ప్రదీప్ ఆమె వ్యక్తిత్వం గురించి దుర్భాషలాడుతూ తనని కించపరిచాడని, తిరిగి అతని దగ్గరకు వెళ్ళకూడదని నిశ్చయించుకున్నానని జయ ఇన్స్పెక్టర్ శ్యామ్ మనోహర్‌కు తెలియజేస్తుంది.

ప్రదీప్, తన భార్య జయకోసం పోలీస్ స్టేషన్‌కు వస్తాడు. పోలీసుల ముందే ఆమెను చెంపదెబ్బలు కొడతాడు. ఆమె గనక అతనితో రాకపోతే ఆమె తల్లినుండి పూర్తి కట్నం వసూలు చేస్తానని బెదిరిస్తాడు. ఇన్స్పెక్టర్ శ్యామ్ మనోహర్‌ అతని చేష్టలు నేరపూరితంగా ఉన్నాయని చెప్తాడు. జయ మేజర్ కాబట్టి ఆమెను ఎవరితోనూ బలవంతంగా పంపలేమని చెప్పి అతనినుండి జయకు విముక్తి కలిగిస్తాడు. ప్రదీప్ ఎప్పుడైనా జయపై చేయి గనక వేస్తే, అతనిమీద గృహహింస నేరం బుక్ చేస్తానని అధికారికంగా చెప్పటమే కాదు, ఇంతకుముందు అతని భార్యను సజీవ దహనం చేసినందుకు అరెస్టు చేస్తానని కూడా గట్టిగా హెచ్చరిస్తాడు.

పుష్ప, దీపక్ కుటుంబ సభ్యులందరితో చాలా స్నేహంగా ఉంటుంది. దీపక్ వదినకి చిత్రలేఖనంలో మంచి ప్రావీణ్యముంది. ఆమెతో ఫూల్ ఫోటో స్కెచ్ వేయించి జయ ఒక పోస్టర్ తయారు చేస్తుంది. ఆమె తప్పిపోయిందని, ఆచూకీ తెలిసిన వాళ్ళు ఫలానా అడ్రస్ కి తెలిపితే వచ్చి తీసికెళ్తామనే వివరాలతో చుట్టు పక్కల పరిసరాలలో గోడలకు అంటిస్తారు. దీని ఫలితంగా చివరికి ఫూల్ – దీపక్ స్టేషన్లో సంతోషంగా కలుసుకుంటారు. జయ తన చదువును కొనసాగించడానికి డెహ్రాడూన్‌కు బయలుదేరుతుంది.
హాస్యం, వినోదాల సమ్మేళనంతో ఇచ్చిన సందేశం; ఇది సరళమైన కథే గానీ కిరణ్ రావు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ధోబీ ఘాట్’ ముంబైలో చెదిరిపోయిన ఆశలు, కలలను వెంటాడే, వాయరిస్టిక్ చిత్రం అయితే ‘లాపతా లేడీస్’, గ్రామీణ భారతదేశంలో రూపొందించిన ఒక పదునైన వ్యంగ్య చిత్రం. 14 సంవత్సరాల తర్వాత ఆమె దర్శకత్వానికి తిరిగి రావడం, అందులో చిత్రీకరించిన నాటకీయత, తెలివైన సామాజిక వ్యాఖ్యానాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఆహ్లాదకరమైన దృశ్యీకరణతో కిరణ్ రావు ఇచ్చిన సందేశం లోతుగా పాతుకుపోయిన పితృస్వామ్యం, దాని పరిణామాలను ప్రతిబింబిస్తూ ఆలోచింపజేస్తాయి. ముసుగుతో మొఖమంతా కప్పబడిన ఘుంఘాట్ ను కిరణ్ రావు, వినియోగించడం వల్ల అది హాస్యంతో పాటు వినోదాన్ని కూడా అందిస్తుంది. అంతేకాదు, సంప్రదాయవాదులైన మహిళా ప్రేక్షకులకు కూడా ఈ దృశ్యం చాలా వాస్తవికంగా తోస్తూ “అయ్యో, ఈ ముసుగు వల్లే ఇన్ని కష్టాలు వచ్చాయి కదా” అని ఆ దిశగా స్పందించేలా చిత్రీకరించారు.

మహిళా సాధికారత, విద్య, స్త్రీ-పురుష సమానత్వం; ఈ ఆశయాలకు అనుగుణంగా ఆమె చిత్రించిన జీవితాల కథనాలు దృఢమైన చర్చలు చేస్తాయి. అలాగని ఎటువంటి పక్షపాతానికీ లొంగవు. పురుషులను తక్కువచేసి మాట్లాడవు. “కట్నం నహీ లియా తో లడ్కే మే ఖోట్ హోగీ”, అంటూ ఫూల్ కి ఆశ్రయమిచ్చిన మంజు మాయి(ఛాయా కదమ్), ఉదారవాద పురుషుడిని ఎగతాళి చేస్తూ వ్యాఖ్యానిస్తుంది. భార్యగా, తల్లిగా గృహ హింసకు బాధితురాలైన ఆమె, మహిళల ఉనికి పురుషులలోనే పాతుకుపోయిందని నమ్మేలా వారిని బ్రెయిన్‌వాష్ చేస్తారని, అందుకే వారు ఆ సంకెళ్ల నుండి విముక్తి పొందడానికి చాలా భయపడతారని తన చేదు అనుభవాన్ని ఫూల్‌తో పంచుకుంటూ – “నిన్ను ప్రేమించే మనిషికి నిన్ను కొట్టే హక్కు ఉంటుందా?” అని ఒక పదునైన పంచ్ డైలాగ్ వేస్తుంది. ఈ చిత్రంలో విషపూరిత పురుషాధిక్యతను ఎగతాళి చేసే ఇతర సన్నివేశాలు కూడా ఉన్నాయి.

చివరికి, ఫూల్ తన భర్తను గాఢంగా ప్రేమించడం వల్లే అతని వద్దకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అతని చేయి పట్టుకుని, అతని పక్కనే తన పని చేస్తూ, ఆర్థికంగా, స్వతంత్రంగా ఉండటంలోనే ఆమె తన సాధికారతను కనుగొంటుంది!

కిరణ్ రావు అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ; ఇది ఒక సృజనాత్మకమైన దర్శకురాలు సౌందర్యాత్మకంగా చెప్పిన సున్నితమైన, పూర్తిగా సమకాలీనమైన ఒక భారతీయ కథ. గొప్ప సందేశాన్ని ఇంతటి నైపుణ్యంతో చెప్పడం నిజంగా మనసును కదిలించే అద్భుతం. హృదయం, మేధస్సు, హాస్యాల సమ్మేళనమైన ఈ చిత్రాన్ని మనోహరమైన ఒక సంపూర్ణ విజేతగా రూపొందించింది కిరణ్ రావు. ఈ సినిమాలో ఎన్నో మరచిపోలేని సన్నివేశాలున్నాయని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ చిత్రంలోని ఇతివృత్తాలను స్పష్టంగా తెలియజేసే మూడు కీలకమైన సన్నివేశాలున్నాయి.

మొదటి సన్నివేశంలో దీపక్ అన్న దూరదేశంలో ఉండగా అతని వదినకు చిత్రలేఖనంలో ప్రవేశం ఉందని గ్రహించిన పుష్ప ఆమెను ఉద్దేశించి, “కళ నిరుపయోగమైనది కాదు, దానిని ఎప్పుడూ తేలికగా తీసుకోకు, కళ అనే వరం పొందినవారు అదృష్టవంతులు” అని చెప్పి, ఆమెలోని కళా ప్రతిభను కొనసాగించమని పుష్ప ప్రోత్సహిస్తుంది. ఇంకో సీన్ లో, దీపక్ తల్లి వంటలోని నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ, మాటల మధ్యలో కుటుంబంలోని మహిళలు అందర్నీ స్నేహితులుగా ఉండమని అని అడుగుతుంది. ఒక యింట్లోనే ఉంటున్న స్త్రీలను ఒకరికొకరు కష్ట సుఖాల్లో తోడుగా ఉండమని సలహా ఇస్తుంది పుష్ప. ఇక మూడో సన్నివేశంలో రైల్వే స్టేషన్‌లో అమాయకురాలైన ఫూల్కుమారి టీ స్టాల్ యజమాని మంజుమాయిని మహిళలను పని చేయడానికి ఎందుకు అనుమతించరని అడుగుతుంది. మరీ ముఖ్యంగా ఇంకొక అత్యంత చిరస్మరణీయ సన్నివేశం సినిమా అసలైన ఉద్దేశ్యాన్ని సంపూర్ణంగా సంగ్రహించే అవగాహననిస్తుంది. జీవితంలో ఎన్నో కష్టాలతో ఢక్కామొక్కీలుతిని రాటుదేరిపోయిన మధ్య వయస్కురాలైన టీ స్టాల్ యజమాని మంజు మాయి (ఛాయా కదమ్) గృహహింసను సహిస్తూ, గౌరవం లేనిచోట జీవఛ్చవంలా బతుకు వెళ్ళదీసే బదులు, ఒంటరిగా, స్వేఛ్చగా, స్వతంత్రంగా జీవించడం ఉత్తమం అని దృఢంగా చెప్తుంది. “నిన్ను ప్రేమించేవ్యక్తికి నిన్ను కొట్టే హక్కు ఉంటే, ఒకరోజు నేను నా హక్కునుకూడా ఉపయోగించుకున్నాను” అని ఫూల్ కుమారితో చెప్పిన చాలా కఠినమైన డైలాగులు ఉన్నాయి. రచనలో వ్యక్తమైన ఇటువంటి గొప్ప శక్తిమంతమైన ప్రతిభ, పితృస్వామ్యానికి గట్టి సవాలుగా పనిచేస్తుంది. ప్రేమ ఉన్నచోట మనం పోరాడుతాం, ఎందుకంటే మనం ఆ సంబంధానికి ఎంతో విలువ ఇస్తాం, అంతేగాక దానిని మనం కొనసాగించాలనుకుంటాం. కానీ దానికికూడా ఒక హద్దు ఉంటుంది, పురుషులు శారీరక/మానసిక దాడులు చేస్తే ఆ ప్రేమను దుర్వినియోగం చేయడమే అవుతుంది. “ఒక అమ్మాయి ఎప్పుడూ తెలివైనది కాదు, ఆమె అతి తెలివైనది. ఒక స్త్రీ తెలివైనది కాదు, ఆమె మోసపూరితమైనది” అంటూ సమాజం సృష్టించిన ఈ పాతకాలపు బూజుపట్టిన కథనాలను మంజు మాయి గట్టిగా, స్పష్టంగా ఖండిస్తుంది. “సమాజంలో ఒక ‘మర్యాదగల కుటుంబంనుంచి వచ్చిన అమ్మాయి’ అని చెప్పడం అతిపెద్ద మోసం, ఎందుకంటే అది ప్రస్తుత స్థితిని ప్రశ్నించకుండా ఆమెను కండిషన్ చేస్తుంది” అని చెబుతుంది.

“లాపతా లేడీస్” చిత్రం మహిళలను బాధితుల పాత్ర పోషించడానికి కూడా అనుమతించదు. “మూర్ఖురాలిగా ఉండటం సిగ్గుచేటు కాదు, కానీ తన అజ్ఞానం గురించి గర్వపడటమే సిగ్గుచేటు” అని కఠినంగా మంజు మాయి పాత్రతో చెప్పిస్తుంది కిరణ్ రావు! ఈ సినిమాను సూక్ష్మమైన కథనశైలి ద్వారా ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపించేలా దృశ్యీకరించింది కిరణ్ రావు.

తన భార్య కోసం వెతుకుతున్న గ్రామంలోని దిగ్భ్రాంతికి గురైన భర్తగా దీపక్, తాను నిజంగా ఏమి ఇష్టపడుతుందో కూడా మర్చిపోయిన అతని తల్లి, తనకే తెలియని తనలో దాగి ఉన్న ప్రతిభ ఉన్న అతని సిగ్గరి మరదలు, మాట్లాడటానికి ఒక స్నేహితురాలి కోసం వెతుకుతున్న వృద్ధురాలు, నిరాశకు గురైనప్పటికీ సహాయపడే స్టేషన్‌లోని మంజు మాయి, ప్రేమగా టీ అందించే చిన్నారి చోటు, కొంత అవినీతిపరుడైన పోలీసు అధికారి, అతనితో పాటు అమాయకుడు, కానీ మంచి హృదయం ఉన్న కానిస్టేబుల్, స్పోర్ట్స్ కోటా ద్వారా వచ్చిన మహిళా కానిస్టేబుల్ మొదలైన సినిమాలోని అన్ని పాత్రలను చాలా ప్రేమతో నిజాయితీతో సృష్టించింది కిరణ్ రావు. వాటిని అంతే ప్రేమతో, నిజాయితీతో అద్భుతంగా పోషించారు. వారందరినుంచి ఇంత అద్భుతమైన నటనను రాబట్టగలిగిన కిరణ్ రావు ఎంతో ప్రశంసనీయురాలు!

మానవ స్వభావంలోని మంచిని, చెడును ఇంత సున్నితమైన, వెచ్చని స్పర్శతో చిత్రీకరించిన కిరణ్ రావుకు అభినందనలు!

మానవ సహజమైన లోపాలు; ప్రతి పాత్రలో మానవ సహజమైన లోపాలు ఉంటాయి కానీ మన సినిమాని మనమే చూస్తున్నామా అన్నట్లుగా ఉండి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. హృదయపూర్వకంగా ఆకర్షించి, ఆశ్చర్య పరుస్తాయి. ఈ సినిమా పాత్రలను మానవీయ కోణంలో చూపిస్తుంది. జయ తన చర్యల వల్ల దీపక్, అతని కుటుంబానికి కలిగిన బాధకు ఆమె క్షమాపణ కూడా చెబుతుంది.

సామాన్యమైన మానవుల జీవితాలను ప్రతిబింబించే సినిమా; పాత న్యాయపు కాలానికి తీసుకెళ్లే, అద్భుతమైన జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక ప్రయాణంలాంటి చిత్రం. ఇది తన పాత్రల పట్ల ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించి, వారితో భావోద్వేగంగా మమేకమయ్యేలా చేసే సినిమా. ప్రపంచంలో మంచి ఇంకా ఉందని ప్రేక్షకులను నమ్మించే సినిమా ఇది. ఫూల్ కుమారిని మంచివారైన రైల్వే బిచ్చగాళ్ల ముఠా హృదయపూర్వకంగా ఆదరిస్తుంది. వారితో కలిసి పనిచేస్తూ ఆర్థిక స్వావలంబన గురించి తెలుసుకుంటుంది. ప్రగతిశీల భావాలున్న పుష్ప దీపక్ ఇంట్లోని వారికి సేంద్రీయ వ్యవసాయం, మహిళల మధ్య స్నేహభావం, స్త్రీల స్వీయ నిర్ణయాధికారం గురించి అవగాహన కల్పిస్తుంది. ఈ సినిమా ప్రేక్షకులను సినిమా చూడాలని కోరుకునేలా చేస్తుంది. చూసిన తర్వాత ప్రేక్షకులు తమ ముఖాలపై చిరునవ్వుతో, సంతృప్తి చెందిన హృదయంతో, ప్రశాంతమైన ఆహ్లాదంతో థియేటర్ నుండి బయటకు వచ్చేలా చేస్తుంది. “పెద్ద హృదయం ఉన్న చిన్న సినిమా” అంటే ఇదే!

వాస్తవికత, సంక్లిష్టతల మిశ్రమం; సినిమాలోని ప్రతి అంశం వాస్తవికంగా ఉంటుంది. కథనం సరళంగా ఉన్నప్పటికీ సంక్లిష్టంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎలాంటి ప్రసంగాలు చేయకుండానే అనేక సామాజిక సమస్యలపై చాలా సున్నితంగా వ్యాఖ్యానిస్తుంది. హాస్యం వ్యంగ్యంగా ఉంటుంది కానీ ఎగతాళి చేసేలా ఉండదు. కథ కొత్తగా ఉంది. దానిలోని అన్ని పాత్రలకు ఊపిరి పీల్చుకోవడానికి, సరైన రూపాన్ని సంతరించుకోవడానికి, వాటి వాటి ప్రయాణాలను పూర్తి చేయడానికి తగినంత అవకాశం ఇస్తుంది. ప్రతి పాత్రను శ్రద్ధగా తీర్చి దిద్దడానికి అవసరమైన శ్రద్ధ తీసుకున్నారు.

ఇప్పుడు, ముంచెత్తుతున్న పుస్తకాలు, టీవీ షోలు, సినిమాల సముద్రం మధ్యలో కూడా, ఎక్కడో ఒకటి ప్రత్యేకంగా అద్భుతంగా హృదయానికి హత్తుకుపోయి నిలిచిపోతుంది. ఇది అటువంటి కథ, స్క్రీన్‌ప్లే, నటన, దర్శకత్వం, సందర్భోచిత హాస్యం, మహిళల గొప్ప ప్రాతినిధ్యం, మరెన్నో విషయాలలో అన్ని ప్రమాణాలకు దీటుగా నిలుస్తుంది. అంతేకాకుండా, ఇక్కడ నేర్చుకోవడానికి పాఠాలు ఉన్నాయని మీరు గ్రహించకముందే మీకు ఒకటి రెండు పాఠాలను నేర్పించేస్తుంది!

ప్రతీకాత్మకంగా పెట్టిన పేర్లు; తప్పిపోయిన ఇద్దరు మహిళలలో ఒకరి పేరు ఫూల్ కుమారి అంటే పువ్వు. ఇంకొకరి పేరు పుష్పా రాణి అంటే వికసించే పువ్వు అని అర్థం. ఈ పేర్లు సినిమాలో పదేపదే పునరావృతమవుతాయి. దీపక్ గ్రామం పేరు సూరజ్‌ముఖి అంటే కూడా ఒక పువ్వుఅని అర్ధం. దీపక్ తన గ్రామానికి వెళ్ళే బస్సు పేరు పుష్పా ట్రావెల్స్. ఫూల్ భర్త దీపక్ అంటే దీపం. ఫూల్, పుష్పలకు చీకటి సమయాల్లో దీపక్ ఆశాకిరణంగా ఉన్నాడు. పుష్ప భర్త పేరు ప్రదీప్ అంటే కూడా దీపమే. అయితే ఇది కాల్చివేసే దీపం. ప్రదీప్ అహంకారంతో తన మాజీ భార్యను సజీవ దహనం చేశాడు. ఒక దీపం దారి చూపితే, మరొకటి నిండు జీవితాన్ని కాల్చివేసింది. పుష్ప అసలు పేరు జయ అంటే అని అర్థం విజయం సాధిస్తుంది అని అర్థం. శ్యామ్ మనోహర్ పాత్ర ద్వారా అధికారం న్యాయవ్యవస్థల ద్వంద్వ స్వభావాన్ని చూపిస్తుంది.
జయది ఎదురుతిరిగే స్వభావం. కానీ, సామాజిక లింగ అసమానతల అంచనాల కారణంగా, ఆమె పువ్వు(పుష్ప). లాగా మృదువుగా ఉండవలసి వస్తుంది. జయ ముఖ్యంగా తామర కాండాలతో చేసిన వంటకం గురించి ప్రస్తావిస్తుంది. ఆమె పూలతో చేసిన వంటకాన్ని (కమల్ కక్డి) తింటుంది. ఆమె తన సున్నితత్వాన్ని, మృదుత్వాన్ని, ఆమె పాత్ర పుష్పించడానికి ప్రతీకగా తింటుంది. ఆమె తన భర్తను ఎదిరించి విద్యను కొనసాగించడానికి, వివాహం నుంచి విముక్తి చెందడం వంటి సామాజిక నిబంధనలు, అంచనాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది. జయ (విజయం) చివరికి విజయం సాధిస్తుంది. పదునైన ఎడిటింగ్ తో, పాత్రల పేర్లను అర్థవంతంగా స్ఫురింపజేసే ఒక కళాఖండంగా రూపొందించారు.

ఈ సినిమా ప్రత్యేకతలు; విదేశీ లొకేషన్లు, కార్లు, జీపులు ఫైట్లు ఏమీ లేవు. మానవ భావోద్వేగాలతో సులభంగా ఊహించదగిన క్లైమాక్స్‌ తో కూడిన కథ. కానీ వాస్తవికంగా, నిర్మలమైన స్క్రీన్‌ప్లేతో అద్భుతంగా రూపొందించారు. ఈ సినిమాలోని చాలా భాగాలు ఇప్పటికీ గ్రామాలలో ఆ మాటకొస్తే పట్టణాలు, నగరాలలో సైతం మహిళలు అనుభవిస్తున్న వివక్షను కళ్ళకు కడుతుంది. వాళ్ళందరికీ ఇది ఒక పాఠం. అన్నిటికీ మించి ఎటువంటి అశ్లీల సన్నివేశాలు లేని కుటుంబంతో కలిసి చూడదగ్గ విలువైన సినిమా!

ప్రపంచమంతా ప్రతికూల భావాలు, దుర్మార్గపు వ్యక్తులు, దురదృష్టకర పరిస్థితులతో నిండిపోయినట్లు కనిపిస్తున్న సంక్షుభిత సమయంలో ‘లాపతా లేడీస్’ చిత్రంలో మనుషులలోని సహజమైన మంచితనం, దయ గొప్ప భరోసాతో ప్రకాశిస్తాయి. దీనికి హృదయం కావాలి, అదే ‘లాపతా లేడీస్’ చిత్రంలో పుష్కలంగా ఉంది.

జయ పరిస్థితి మన తల్లుల తరం వారిలో 90%మంది, మన తరం మహిళల్లో 60%-70% మంది జయ ఎదుర్కొన్న పరిస్థితిని మహిళలు నేటికీ ఎదుర్కొంటున్నారు. వారి నిర్ణయాలు వారినే తీసుకోనివ్వండి. వారిని బాధ్యత వహించనివ్వండి. వాటి పర్యవసానాలను వారినే ఎదుర్కోనివ్వండి. వారిని విజయం సాధించనివ్వండి. వారిని ఆపడానికి మీరెవరు? అని ఈ చిత్రం అన్యాపదేశంగా జయ పాత్ర ద్వారా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తుంది.

ఈ సమాజంలోని ప్రజలు తమ పక్షపాత భావనల నుండి తమను తాము పూర్తిగా విముక్తం చేసుకోలేరు. అందువల్ల, ఇది మన దేశంలోని మారకుండా ఉన్న వాస్తవికతను కళ్లకు కట్టినట్లు చూపించే, ప్రత్యేక దృక్పథం ఉన్న చిత్రం.

కుటుంబాలను స్నేహపూర్వకంగా, నిశితంగా గమనించిన బిప్లాబ్ గోస్వామి (Biplab Goswami) కథ, స్నేహ దేశాయ్ (Sneha Desai) స్క్రిప్ట్ రచన భావస్ఫోరకంగా ఉన్నాయి. రామ్ సంపత్ (Ram Sampath) సంగీత దర్శకత్వం ఆకర్షణీయంగా ఉంది.

ఈ కథ మిమ్మల్ని నవ్విస్తూనే, భావోద్వేగంగా స్పృశిస్తుంది. ఆనంద ఆనందబాష్పాలను తెప్పిస్తుంది. ప్రతి పాత్రకు ఒక నిర్దిష్ట స్థానం ఉండి 2 గంటల పాటు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేస్తుంది.
ఈ సినిమా మనకు అందించే మనోహరమైన సంతృప్తి, సంతోష భావనలకోసం మనం ఊహించిన దానికంటే చాలా కాలం పాటు నిలిచి ఉంటుంది. అది నిజం కూడా! ఇక్కడ నేను చూసిన ఒక సంగతి చెప్పాలి. ప్రతి అక్టోబర్ జయంతి నాడు హైదరాబాద్ లో “మంతన్ సంవాద్” అనే సంస్థ దేశంలోని మేధావులతో, ప్రత్యామ్నాయ సినీ దర్శకులతో ఉపన్యాసాలను ఇప్పించే ఏర్పాటు చేస్తుంది. దానికి 1500 మంది యువతీయువకులు రిజిస్టర్ చేసుకుని హాజరవుతారు. ఈసారి అంటే 2025, అక్టోబర్ 2 వ తేదీన కిరణ్ రావును ఆహ్వానించింది. ఆమె “లాపతా లేడీస్” చిత్రాన్ని ఎంత మంది చూశారు? అని ప్రశ్నిస్తే, దాదాపు అందరూ చేతులెత్తి చూపించారు. “ఉయ్ లవ్ యూ కిరణ్ రావ్” అని అరిచి చెప్పారు! యువత ఏది మంచో ఏది చెడో తెలుసుకుంటున్నారు. చెత్తను పోగేసి, మురికి సినిమాలు తీసే మన తెలుగు సినీ దర్శకులు “కొన్ని సినిమాలను ప్రేక్షకులు చూడడం లేదు” అని చెప్పేవన్నీ అసత్యాలే! కాబట్టి అందరూ తప్పక చూడవలసిన సినిమా!

నటీనటులు; కథానాయికలైన ఇద్దరు ‘లాపతా లేడీస్’, పాత్రలలో నితాన్షి గోయెల్ (Nitanshi Goel), ప్రతిభా రాంటా (Pratibha Ranta) సహజమైన, వాస్తవిక నటన ఎలా ఉంటుందో చూపించారు. వాళ్ళు ప్రధామంగా నటిస్తున్నట్లుగా లేనే లేరు. సుశిక్షితులైన నటులలాగా ప్రశంసనీయంగా తమ తమ పాత్రలలో ఒదిగిపోయారు.

దీపక్ కుమార్ గా, స్పర్శ్ శ్రీ వాత్సవ (Sparsh Shrivastava), మంజు మాయిగా ఛాయాకదమ్ (Chaaya kadam) తమను తాము పాత్రలలో ఆవాహన చేసుకున్నారు. ప్రధానంగా కొత్తగా నటించిన నటులందరూ కూడా ప్రశంసనీయమైన పని చేసారు.

మరీ ముఖ్యంగా అవినీతిపరుడుగా ఇన్‌స్పెక్టర్ జయ భర్త ఇచ్చిన లంచాన్ని స్వీకరించడానికి సిద్ధపడతాడు. అయినప్పటికీ, జయపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాడు. దురాశ – న్యాయం సమపాళ్ళలో ఉన్న వ్యక్తిగా, మనస్సాక్షితో వ్యవహరించే పోలీసు అధికారిగా శ్యామ్ మనోహర్ పాత్రలో రవి కిషన్ (Ravi Kishan) అద్భుతంగా నటించాడు.

సాధించిన అవార్డులు
* ఈ సినిమా మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది.
* 97 వ అకాడమీ అవార్డులకు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కు భారతీయ ఎంట్రీగా ఎంపికైంది.
* 70 వ ఫిల్మ్ ఫేర్ అవార్డులలో రికార్డు స్థాయిలో లాపతా లేడీస్ 24 నామినేషన్లను సాధించింది.
ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ మహిళా ప్రప్రధమ ప్రదర్శనతో (గోయల్) సహా 13 అవార్డులను గెలుచుకుంది.
* ఈ చిత్రం 8 సెప్టెంబర్ 2023న ఈ చిత్రాన్ని 48వ టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు. 2024, మార్చి 1న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచ సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుండి ఎన్నో సానుకూల సమీక్షలను అందుకుంది. ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే, నటీనటులు అనేక ప్రశంసలు పొందారు.

పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన “All we imagine as light”, శుచి తలాటి దర్శకత్వం వహించిన “Girls will be Girls”, కిరణ్ రావు” దర్శకత్వం వహించిన Laapataa Ladies” పితృస్వామ్యాన్ని తమదైన రీతిలో ధిక్కరిస్తున్నాయి. మొత్తానికి మన సినిమాని ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన, ప్రత్యామ్నాయ సినిమాలను వీక్షించే సినీ విజ్ఞానుల, విమర్శకుల దృష్టిలో నిశ్శబ్దంగా, కానీ అంతే దృఢంగా నిలిచిపోయేలా దృశ్యీకరించిన ఈ ముగ్గురు మహిళా దర్శకులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుదాం!

పూనమ్ కౌశిక్ “A Comment on Three Award Winning Films” అంటూ తన కామెంట్స్ “Equality” పత్రికలో రాసింది. నేను ఈ మూడు సినిమాలనూ అంతకుముందే చూసేశాను. మూడిటిమీదా నా సమీక్షా వ్యాసాలను రాయడానికి ప్రేరణ నిచ్చిన పూనమ్ కౌశిక్ కి కృతజ్ఞతలతో.

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

Leave a Reply