జీవచ్ఛవంలా 

మొక్కుల కొలుపులో
ఎగబడే కలుపు మానసిక రుగ్మత
తీరునో తీరవో తెలియని తనం
బడా చోరుల చేతుల్లో బందీ గావించబడిన
శృంగార రస బొమ్మల నెలవులో రద్దీ

ఎన్నెన్ని వర్ణాలో
రంగు రుచి వాసన పసిగట్టే దైన్యం
ముఖం చూసి బొట్టు పెట్టే విచిత్ర వైకల్యం నీడన
ఒకే విగ్రహ రూపం దర్శనమే మహాభాగ్యమై
రూపాయి విదిల్చితేనే దక్కే దౌర్భాగ్యం

గుడిలో సైతం సామాజికార్థిక అంతస్థుల కైంకర్యం
వరుస వరుసకి వెలగట్టి వేలంపాట వస్తువై
భక్తి మాటున దోపిడీకి పరచబడిన బాటల్లో
కుల పెత్తనం వూరూరా తాండవిస్తుంది

ముందు ముందు ఇంకెన్ని వివక్షలనెదుర్కోవాలో తెలియని పసికందు
తాను బలిసిన కులం కాళ్ళ మీద ఎందుకు పడేయబడ్డానో తెలియకుండానే ఏడ్చిన కళ్ళల్లో కాటుక కన్నీరై ఇంకిన ప్రాంగణం
మదమెక్కిన కాళ్ళ ధాటికి సొమ్మసిల్లి దవాఖానలో కన్నుమూసేదాకా బుగ్గ మీద దిష్టి చుక్క అమ్మెందుకు పెట్టిందని నెమరు వేసుకునే వుండివుంటుంది
తన చుట్టూ వున్న కంచెలన్నింటినీ ఈసడించుకుంటూ
అమ్మ మూఢ నమ్మకాన్ని ఒకడు సొమ్ము చేసుకునే వేట లో రాబందై తనను చంపేసిన
తాను పుట్టిన సమాజంపై కాండ్రించి ఉమ్మేసి పోయింది

లజ్జ తో బక్కచిక్కి పోవాల్సిన సంఘం
ఏమాత్రం చలించక ప్రశ్నింవక
రోజువారీ ప్రయాణ బడలికల నేపథ్యంలో అలసి
తనకు తాను రేపటికి సమాధిని నిర్మించుకుంటుంది
గొంతులు కలవవు
కులాలు కలవనీయవు
కలాలు నెత్తురు కక్కవు
కళలు తూర్పు పొద్దు వైపు పొడవవు
వెరసి ఈ సమాజమో జీవచ్ఛవం!!

పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. విద్యార్థి దశలో ఎస్. ఎఫ్. ఐ. లో పని చేశారు. సామాజిక ఆర్థిక సమస్యలను కవితా వస్తువులు గా తీసుకుని  కవిత్వం రాస్తున్నారు.  వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

Leave a Reply