మీది పరగడుపు ఆకలి కాదు
రుచులు కోసం వెంపర్లాడే ఆకలి
మీ ఆకలి తీర్చడానికి కొన్ని తడవలు మేము
వేశ్యలం అయితే వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ..
సూటి ప్రశ్న ఒకటి.
వేశ్యలకు మనసు వుండదా? నిజం చెప్పండి
ఒక వేశ్య కు మనసు ఇవ్వడం చాతవునా మీకు?
ధైర్యం వుందా మీకు? మీ గౌరవాలను పణంగా పెట్టగలరా!
ఆమెతో జన్మాంతం జీవించగలరా?
మీదైనదేది యేది ఒదులుకోను ఇచ్చగించరు
భద్రజీవితంలో మిమ్మల్ని మీరు ఇముడ్చుకుని
ఒంకర మనసుతో పక్క చూపులు చూస్తారు..
ఎరగా ఏం వేయాలో మీకు బాగా తెలుసు
మీ నైపుణ్యానికి వలలో పడని చేపలు చాలా.
ఆ పడని చేపలను మీ ఉక్రోషపు మాటల్లో రాతల్లో
వేశ్యలగా సమర్థవంతంగా చిత్రీకరిస్తారు.
అలవాటుగా మీ బహు ప్రియాలోలత్వం నిత్యం
సంక్షిప్త సందేశాల సేవలతో వర్ధిల్లుతుంది
మీరూ మీ రంగు జుట్టూ కాట్లో తగలబడే దాకా
అయినా…
మీ కృష్ణావతారానికి సోషల్ మీడియాలో కనబడే
స్త్రీలందరూ రాధలా గోపికల్లా కనబడతారేమో!
ప్రతి రాత్రి వారి దేహాలకు భార్య ముఖాన్ని అతికించుకుని
రోజుకొక రకంగా మానసిక వ్యభిచారం చేస్తారేమో కదా!
చిత్తం ఒకటే! రూపాలు అనేకం,
మీరు అనుకున్నంత అమాయకంగా
ఎవరో అరుదుగా వుంటూంటారు.
మాలో చాలా మందికి లోకాన్ని చూసిన అనుభవం
జాగురుకత వుందని మర్చిపోకండి.
తాడే పామై కాటేస్తుందని మరువకండి.
ఇందిరా గోస్వామి కలం కత్తి ఝళిపించిన విషాద కామరూపలో
బృందావనమనే వధ్య శాల గురించిన
వాస్తవిక సృహ మాకూ వుందనే సంగతి మర్చిపోకండి.
శరీరాలను పీక్కుతినడానికి వ్యాపారం చేయడానికి
ఆకలితో అలమటించే మహిళలే కావాలన్న సత్యాన్ని
మేడిపండు సమాజాన్ని పొట్ట విప్పి ప్రపంచానికి
చూపించిన అలెగ్జాండర్ కుప్రీన్ యమా ది పిట్
సంగతి మర్చిపోకండి.
మాలో కూడా మీలాంటి కామరూపాలను సర్కస్ లో
కోతిని చేసి ఆడించడం తెలిసిన వారు వుంటారు
కుక్క కాటుకు చెప్పు దెబ్బ లాగా
మీ సర్వాధికారాలను చేజార్చి మిమ్మల్ని బానిసలుగా మార్చి
మీ చేజేతులా భార్యని చంపించే, బిడ్డలను దూరం చేసే
దుర్మార్గ స్త్రీలు వుంటారు జాగ్రత్త!
మీ భాషలోనే చెబుతున్నాం వినండి గోముఖ వ్యాఘ్రాల్లారా!
ఎదురైన ప్రతి స్త్రీని కెలక్కండి, కావాలంటే కొనుక్కోండి.
దేహాలు వస్తువులే కదా! స్త్రీలు మాత్రమే వేశ్యలు కదా!
పతితుల పావనోద్దరణకు పురుషులు నడుం బిగించారా?
దేహ రాజకీయాల్లో పురుషుడికి మాత్రమే ఉంటాయ్
వ్యక్తిగత అవయవాలు
స్త్రీల కి మాత్రం ఉండవు
బహుశా
మీ దృష్టిలో మీ కుటుంబ స్త్రీలవి మినహా మిగతా వాళ్ళందరివి
సమాజంలో పురుషజాతి కంతటికీ చెందినవి అవి.
స్త్రీలను అవయవాల లెక్కలతోనో దేహం ఒంపులతోనో
మీ దృక్కోణంతోనో కాదు చూడాల్సింది
హృదయంతో చూసి మనిషిగా గౌరవించండి
మీతో సమానంగా నడవనీయండి.
సమానంగా సమాజంగా నడవనీయండి.