గోడలు…
అవును గోడలే…
కొన్ని ఏళ్ళ తరబడి బిగించినవి!
మనిషిలోని మానవత్వాన్ని ఒంచకుండా కట్టిన అడ్డుకట్టలవి!
మనుషుల మధ్య గోడలు…
గోడల మధ్య మనుషులు…
కొన్ని గోడలు సున్నితం, మరికొన్ని కఠినం…
అయినా స్పృశించుకోవడానికి ఏ మాత్రం నోచుకోవు పాపం!
ముసుగేదైనా ఈ గోడలన్నీ మనిషి రక్తంతో తడిసినవే!
ఇవి కేవలం గోడలే కావు,
మన హృదయాల శవపేటికలు!
దారులన్నీ పరుచుకునేందుకు గోడల్ని కూల్చాలి!
గోడల్ని కూల్చేందుకు మనుషుల్ని కదిలించాలి!
గోడల్నే కాదు,
కుదిరితే…
మన చుట్టూ నాటుకున్న కంపల్ని తొలగించాలి!
గోడలే కదా అని కొట్టిపారేసేరు…
ఒక్కసారి ఆ గోడలకి చెవివొగ్గి వింటే,
వాటి వెనకాల కొనఊపిరితో కొట్టుమిట్టాడే కొన్ని ఊపిరులుంటాయి
సంకెళ్లు తొడుక్కున్న వేల శ్వాసలుంటాయి!
మన చేతుల్లో ఉబ్బితబ్బిబయ్యే ప్రేమలుంటే సరిపోదు,
ఆ ప్రేమలకి గోడల్ని ఇసుకలా జారివిడిచే తత్వం ఉండాలి!
మనిషిని మనిషి గుర్తించే కాంతి మళ్ళీ పుడితేనే ఈ గోడలు ధూళిగా మారతాయి!
నిజానికి గోడలు గోడలేం కావు కేవలం నీడలే!
అవి మనలోని విషపు కోరలు…
మరి నువ్వు నేను అనుకుంటే
ఆ నీడలదెంత పని?
అవసరమైతే గోడల్ని కూల్చడానికి అక్షరాన్ని నాటుదాం…
విడదీయడానికి కాదు, ముడివేయడానికి!
చీల్చడానికి కాదు, చేరువ చేయడానికి!
అమానవత్వపు గోడల్ని కూల్చి,
నీడల్ని తుడిచి,
సమూహంగా అక్షరసేద్యం చేద్దాం రండి!
మనిషిని మనిషికి ముడివేసే మృదువైన ఆప్యాయతని పంచడానికి మీరంతా వస్తారు కదూ!!