దుఃఖం ఆగినట్లే వుండదు
తొవ్వల ఉరికిన అడుగుల చప్పుళ్ళు
గోగుపూల చెట్ల మీద ఎర్రెర్రని పాటలే
పాట వేకువ చుట్టూ ప్రదక్షిణే మిగిలినా
అదీ గుడ్లల్ల నీళ్ళు కుక్కుకునే
ఇల్లిడిచి, వూరిడిచి, అడవి చాటున
ఎవ్వల్ల కోసరమో యుద్దం
నువ్వు నేను ఎందుకు చేయలేమో
వాళ్ళకే నోటికొచ్చిన ప్రాణ విద్య
కష్టాల్ నష్టాల్ పక్కల నుంచి
దూసుకు పోయేవే
గమ్యాలు ఆయుష్షులు
పొంతన లేనివే
ఏది ముందో ఏది తర్వాతో
బాయెనెట్ కి బాయెనెట్ సమాధానం
నియంత వాదం
ప్రజాస్వామ్య వాదం
పరిష్కార ఆవిష్కరణలే
వాతావరణం అనుకూలమో ప్రతికూలమో
సిద్దాంతం అవసరమో కాలదోషమో
కాలం నిప్పుల మీద నడుస్తూ మాట్లాడాలె
విప్లవం అరుణారుణ పుష్పం
అది వాడదు
జనం యెదల్లో నిత్య వికసితం
న్యాయం రెక్కలు తెగిపడ్డప్పుడల్లా
జ్వాలాయుధమై హెచ్చరిల్లుతది
ప్రశ్న అయితే బతికే వుంటది
కాలాంతం కానిదదే
రూపం రాబోయే శిశువు స్వప్నిస్తదేమో
అందాకా ప్రశాంతత ముసుగులో
అంతరంగాలు మడత పెట్టిన
బతుకుతో, స్వేచ్ఛగా,
జనం అడుగుల్లో కొత్తగ