Res Publica అనే లాటిన్ పదం నుంచి వచ్చిన రిపబ్లిక్ పదానికి ‘పబ్లిక్ విషయం’ అనే అర్థం ఉంది. అంటే ఎవరో ఒక రాజో, రాణో కాకుండా దేశ పుత్రులు /పుత్రికలు తమ ఇచ్ఛానుసారం (వోటు రూపంలోనే కావచ్చు) తమ ప్రతినిధులను ఎన్నుకోవడం అనే ప్రజాస్వామిక పాలనా ప్రక్రియే రిపబ్లిక్. అటువంటి రిపబ్లిక్ ప్రభుత్వం విశాల ప్రజల ప్రయోజనం కోసం తప్ప ఎటువంటి ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనం కోసం పాలించకూడదు. ఇది 1950లో భారత రాజ్యాంగంలో ప్రజలుగా తమకు తాము పొందుపరచుకున్న పాలనా విధానం మాత్రమే కాదు, ఒక ఆధునిక పాలనా విలువ.
అయితే భారత స్వాతంత్య్రానంతరం విశాల ప్రజా శ్రేణుల ప్రయోజనం కోసం అటువంటి రిపబ్లిక్ పాలనా విధానాలు దేశంలో కొనసాగడం లేదని, రెండు దశాబ్దాల తర్వాత 1967లో దేశ రాజ్యాంగంపై, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ఒక శాస్త్త్రీయ విమర్శను ఎక్కుపెడుతూ నక్సల్బరీ తిరుగుబాటు జరిగింది. (1970లో సాయుధ సైనికులకు సూచనల పేరుతో వెలువడిన కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఒకవేళ శాంతి భద్రతలకు భంగం కలిగితే విదేశీ శత్రువుల విషయంలో తప్ప పాలకులు తమ సొంత ప్రజలపై ఆయుధాలు వినియోగించడం, వైమానిక మారణాయుధాలతో దాడులు చేయకూడదు.) కానీ గత అన్ని ప్రభుత్వాల కంటే మోడీ నేతృత్వంలోని బిజెపి కేంద్ర ప్రభుత్వం మరింత బరితెగించి 1970ల నాటి కేంద్ర ఉత్తర్వులను బేఖాతరు చేసి తూర్పు, మధ్యభారతంలో సరిహద్దు సైనిక బలగాలను దించింది. వాటితో పాటు స్థానికులతో కూడిన డిస్ట్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (సల్వాజుడుంకు నూతన రూపం)ను , బస్తర్ ఫైటర్స్ ను ఉపయోగించి ఆపరేషన్ కగార్ దాడి చేపట్టి ‘దేశ అంతర్గత ప్రమాదం మావోయిజం’ అంతమే తమ లక్ష్యం అనే పేరుతో వేలాదిమంది ఆదివాసులను, ఆదివాసీ నాయకులను విచ్చలవిడిగా అత్యంత అమానుషంగా చంపుతోంది.
రాజ్యాంగ వ్యతిరేకంగా పరిగణించబడుతున్న సాయుధ మావోయిస్టు విప్లవోద్యమాన్ని అదే రాజ్యాంగ వ్యతిరేకమైన, పోలీస్ నియమావళికి వ్యతిరేకమైన సాయుధ సైనిక దాడులతో అణచివేస్తూ ఫాసిస్టు మోడీ ప్రభుత్వం గణతంత్ర వాదాన్ని కాదు, తన షడ్యంత్రవాదాన్ని నిస్సిగ్గుగా చాటుకుంటోంది.
ఇటువంటి మూకుమ్మడి జాతిహత్యకు, భారీ స్థాయి జనహననానికి భారత పాలకులు పాల్పడుతుండడమే ఆనాడు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బూటకమని ప్రకటించిన నక్సల్బరీ విమర్శనాత్మక దృక్పథానికి గల నిత్య ప్రాసంగికతను రుజువు చేస్తున్నది.
ఇక ఫెలోట్రావెలర్ వ్యాసాలను విశ్లేషించుకునే సందర్భంలో 75 ఏళ్ల భారత రిపబ్లిక్ ఏ పాటి ప్రజాస్వామ్యంతో నడుస్తున్నదో చూద్దాం. చాలా సుదూర గతంలోకి వెళ్లకుండా 1980 ల కాలం నుంచే పరిశీలిద్దాం. 1983 లో నక్సలైట్లే దేశభక్తులని, తనతో చేతులు కలిపితే ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరవేస్తానని అధికారానికి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ ప్రభుత్వం అనతి కాలంలోనే చింతపల్లి అడవుల్లో గుత్తి కోయలకు చెందిన 600 గుడిసెలను తగలబెట్టింది. శ్రీకాకుళ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన 1/70 చట్టాన్ని కూడా రద్దు చేయాలని చూసింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు అయితే చింతపల్లి అడవులను గ్రానైట్ తవ్వకాల కోసం దుబాయ్ కంపెనీకి అనుమతి ఇవ్వ చూపి, ఎస్టీలకు ఉన్న రాజ్యాంగ రక్షణలను తొలగించడానికి సైతం వెనుకాడలేదు.ఆ గ్రానైట్ తవ్వకాలను అడ్డుకునే క్రమంలో భల్లగూడలో ఆదివాసీ మహిళలపై సీఆర్పీ ఎఫ్ జవానులు చేసిన అత్యాచారాలు, వారి ప్రతిఘటన అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత 2004లో నక్సలైట్లతో చర్చలు జరిగి ఫెయిల్ అయిన ఫలితంగా రాజ్య నిర్బంధం తీవ్రమై రాష్ట్రమంతా హింసాదౌర్జన్యాలతో అట్టుడికింది. విప్లవోద్యమం, ఇతర ప్రజా సంఘాలపై నిషేధం విధించడమే కాకుండా కోవర్ట్ హత్యలు కూడా మొదలయ్యాయి. 2009 ఎన్నికల సందర్భంలో మహబూబ్ నగర్, కర్నూల్, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఉన్న 25 వేల మంది చెంచులను ఎన్నికల్లో ఓటు వేయడానికి అనుమతించలేదు. దీన్ని చర్చల ప్రతినిధులు ఆనాటి హోం మంత్రి దృష్టికి తీసుకెళ్తే రాష్ట్ర జనాభాలో 25,000 మంది వోట్లు వేయనంత మాత్రాన మన ప్రజాస్వామ్యానికి ప్రమాదమేం లేదని దబాయించాడు.
అలాగే కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కూడా మావోయిస్టు ఎజెండానే అమలు చేస్తానని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటానని భద్రాచలంలో వేలాదిమంది ఆదివాసుల సభలో ప్రగలాÄ్భలు పలికాడు. అధికారం లోకి వచ్చి మూడు నెలలయినా గడవకముందే వివేక్, శృతి, సాగర్ ల ఎన్ కౌంటర్ తో మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయడం ప్రారంభించాడు. ఇక పోలవరాన్ని అడ్డుకోవడం కాదు కదా అదే గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి 23 గ్రామాల ఆదివాసులను నిర్వాసితులను చేశాడు. తెలంగాణలో ముఖ్యంగా అదిలాబాద్ జిల్లాలో లంబాడాలకు, గోండులకు మధ్య చిచ్చుపెట్టి వర్గీకరణ ఉద్యమాన్ని దౌర్జన్యంగా అణిచివేసి తెలంగాణ అంతటా రాజకీయపరంగా మతతత్వ శక్తులు (బిజెపి) బలపడడానికి తోడ్పడ్డాడు.
పైన పేర్కొన్న పోరాటాలన్నింటికీ భిన్నంగా 40 ఏళ్లకు పైగా బస్తర్ లో జరుగుతున్న ఆదివాసుల పోరాటం మాత్రం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పూర్తి భిన్నమైన ప్రజా ప్రత్యామ్నాయ రాజకీయ ప్రతిఘటనా పోరాటం. నిజమైన ప్రజల సార్వభౌమ అధికారం కోసం ఆదివాసులు చేస్తున్నదే ఈ పోరాటం. ఈ పోరాటాన్ని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలు వివిధ అభియాన్ల ద్వారా అర్థ సైనిక బలగాలతో అణిచివేస్తున్నాయి. 2014 కు ముందు కాంగ్రెస్ పాలనలోనైనా, 2014 తర్వాత మోడీ పాలనలోనైనా విప్లవోద్యమం కొనసాగిన తూర్పు మధ్యభారతాల్లో అర్థ సైనిక బలగాలు దాడి చేయని రోజు ఒక్కటైనా లేదు. 2019 లో మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దండకారణ్యం లోని ఆదివాసీ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయి. గతంలోనైనా వాయుసేన డైరెక్టర్ జనరల్ గానీ, ఎయిర్ మార్షల్ చీఫ్ గాని వైమానిక దాడుల ప్రతిపాదనను వ్యతిరేకించారనే వార్తలు విన్నాం గానీ, రెండోసారి మోడీ పాలనలో అటువంటివేమీ వినబడలేదు. సాల్వజుడుంకు కొత్త రూపమైన డిఆర్జీలను రూపొందించి వారి సాయంతో మావోయిస్టు ఉద్యమ స్థావరాలపై వైమానిక దాడులు చేశారు.
కనుక అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఆ తర్వాత బిజెపి మోడీ ప్రభుత్వం అయినా ఆదివాసులపై దాడుల విషయంలో ఎటువంటి తేడా చూపలేదు. కానీ మోడీ పాలనలో ప్రత్యేకత ఏమిటంటే గుజరాత్ నుంచి మణిపూర్ దాకా హిందూ- ముస్లింలకు, హిందూ – క్రైస్తవులకు, హిందూ -హిందూయేతర తెగలకు మధ్య విద్వేష భావాన్ని, వ్యతిరేకతను రెచ్చగొట్టి ప్రజలను విడగొడుతూ దేశంలో ఒక అంతర్యుద్ధ పరిస్థితిని తీసుకొచ్చారు. ఇందుకు మణిపూర్ యే ఒక దారుణమైన పాలకవర్గాల ప్రయోగశాలగా మన కళ్ళ ముందున్నది.
2022 లో చత్తీస్ గడ్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ అయితే స్థానికులైన 2100 మంది ఆదివాసీ యువకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి బస్తర్ ఫైటర్ ఫోర్స్ అనే సైన్యాన్ని తయారుచేసి విప్లవోద్యమాన్ని అణచివేయడానికి ఉపయోగించాడు. నిజానికి ప్రజలు చేసే పోరాటాలన్నీ సాయుధమైనవేమీ కాదు. ఉదాహరణకు 2020-21లో బిజెపి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢల్లీి సరిహద్దులలో, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో 15 నెలల పాటు శాంతియుతంగా కిసాన్ ఆందోళనలు జరిగాయి. దాదాపు అదే కాలంలో సిలింగేర్ లో కూడా అంతే శాంతియుతంగా ఆదివాసులు సడక్ రోకో, ఠానా రోకో, కంపెనీ రోకో పోరాటం ప్రారంభించారు. రెండేళ్లలో ఆ పోరాటం పూర్వ బస్తర్ అంతటా, హస్దేవ్ అడవుల దాకా విస్తరించింది. రాజ్య హింసకు వ్యతిరేకంగా ప్రజలు శాంతియుతంగా ఇంత పెద్ద ఎత్తున ప్రత్యామ్నాయ రాజకీయ ప్రతిఘటనా పోరాటం జరిపితే, దాన్ని ఏ ఒక్క ప్రధాన స్రవంతి మీడియా కూడా కవర్ చేయలేదు.
ఇలా ప్రత్యామ్నాయంగా ప్రజలు చేస్తున్న ప్రజాస్వామిక రాజకీయ ఉద్యమాలను అణచివేయడానికి సైనిక వ్యూహంతో పాటు వనవాసీ ఆశ్రమాల పేరుతో సంఘపరివార్ ఆదివాసీ ప్రాంతాల్లోకి ప్రవేశించి హిందూ మత ప్రచారం చేస్తూ ప్రజలను మతపరంగా విడగొడ్తోంది. ఇంద్రవెల్లి మారణకాండ కాలం నుంచి కూడా ఆదివాసులు హిందూ సమాజంలో భాగమేనని కుటిల ప్రచారం చేస్తోంది. అలాగే ఆదివాసులు జరుపుకునే కేస్లాపూర్ జాతరతో పాటు అతి ప్రాచీనమైన మేడారం జాతరను కూడా బ్రాహ్మణీయ తంతుగా మార్చుతూ ఆదివాసీ సంస్కృతిని బ్రాహ్మణవాద హిందుత్వలో భాగం చేసే కుటిల ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాల వివక్ష నుంచి బయట పడడానికి ఒకవేళ ఆదివాసీలు అన్య (క్రైస్తవ) మతంలో చేరితే, వాళ్లు ఆదివాసీ సంప్రదాయాలను విచ్చిన్నం చేస్తున్నారని వాళ్ల మీద దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మోడీ అధికారం లోకి వచ్చినప్పటి నుండి కార్పొరేట్ మార్కెట్ దేశం అన్నా, హిందూ జాతి అన్నా హిందుత్వ అనే బ్రాహ్మణవాద ఆధిపత్య భావజాలాన్ని తన మోనోపలీ మార్కెట్‌కు, ద్రవ్య పెట్టుబడి వాదానికి చాలా వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం వాడుకుంటున్నది.
అలాగే 2023 సెప్టెంబర్ లో దంతెవాడలో జరిగిన ఒక ఎన్ కౌంటర్లో కుమారి లాఖే అలియాస్ మాడ్వి, పడోమ్ మంగ్లీ అనే ఇద్దరు ఆదివాసీ మహిళలు చనిపోయినప్పుడు ఆ ఎన్ కౌంటర్ నిజమైనదేనని, అందులో కేంద్ర సైనిక బలగాలు పాల్గొనలేదని ఆనాటి కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, పోలీసులూ ప్రచారం చేశారు. తాము రాజ్యాంగబద్ధంగా, పోలీసు నియమావళికి కట్టుబడే వ్యవహరించామని గొప్పలు పోయారు. ఇంకా లోహాండిగూడా లోని ఆదివాసీ రైతులకు 42 ఎకరాల భూమి వాపస్ ఇచ్చామని, అటవీ చట్టం ప్రకారం ఆదివాసుల భూములకు పట్టాలిచ్చామని, దీంతో వాళ్ల భూమి సమస్య పరిష్కారమైనట్లేనని ఆనాటి ఛత్తిస్‌గఢ్ ప్రభుత్వం పేర్కొన్నది. ఇంకా పండిరచిన ధాన్యం సేకరణ, ముఖ్యంగా జొన్నలు, రాగులు, సజ్జలు వంటి వరియేతర చిరుధాన్యాల సేకరణ విషయంలో ఆదివాసీ రైతులకు సాయం చేస్తున్నామని, అందుకోసం ‘వనాచల్’ లోనే పెద్ద మిల్లు నిర్మించామని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చెప్పుకుంది. కానీ భూమిలేని ఆదివాసుల గురించేమీ మాట్లాడనే లేదు. పోనీ వాపస్ ఇచ్చిన భూముల విషయంలోనైనా – ఆ భూములకు నిజంగానే సంబంధిత ఆదివాసుల పేర్ల మీద పట్టాలిచ్చారా లేదా అన్న విషయాన్ని మాత్రం స్పష్ట పరచలేదు.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోడీ కూడా 1966లో మిజోరాంలో ఒక తిరుగుబాటు చర్యను అణచి వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎయిర్ ఫోర్స్‌ను వాడిరదని, 1984 లో కూడా అమృత్సర్ స్వర్ణమందిరంలో ఖలిస్థానీ వాదులైన బింద్రన్‌వాలా అనుచరులపై దాడి చేయడానికి భారత సైన్యాన్ని వాడిరదని కాంగ్రెస్ పార్టీని విమర్శించాడు. అదే స్వర్ణదేవాలయ సముదాయం లోపల ప్రధాన మందిరానికి ఎదురుగా ఉన్న అకల్ తక్త్ పై కూడా భారత సైన్యం దాడి చేసిందని తప్పుపడుతూ, ఆ దాడి సిఖ్కు ప్రజల మత విశ్వాసాలపై, పవిత్ర స్థలాలపై చేసిన మానని మానసిక గాయమని కూడా అన్నాడు. అట్లా అన్న మోడీయే 2020-21 లో రైతులకు వ్యతిరేకమైన మూడు వ్యవసాయచట్టాలు తీసుకొచ్చాడు. వాటికి వ్యతిరేకంగా జరిగిన కిసాన్ ఆందోళనలో ఖలిస్తానీవాదులు, మావోయిస్టులు ఉన్నారని ఆరోపణ చేశాడు. అదే మోడీ అంతకుముందు 18 ఏళ్ల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింల మీద దారుణమైన మారణకాండకు పథక రచన చేసి అమలుచేశాడు.
2024 లో లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో చూసి ప్రధాని మోడీ దాన్ని ముస్లిం లీగ్ మ్యానిఫెస్టో అని, అంతకుమించి అది అర్బన్ మావోయిస్టుల మేనిఫెస్టో అని అన్నాడు. ఆస్తి పునః పంపిణీ (జిత్నే ఆబాదీ ఉత్ నే హక్ ) అనేది అంబేద్కరైట్లు, వామపక్ష మేధావులు కుల ప్రాతిపదిక మీద అమలు కావాలని కోరుతున్నారన్నాడు. పైగా ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన డిమాండ్ అని, కుల ప్రాతిపదికపై, జనాభా ప్రాతినిధ్య ప్రాతిపదికపై ఆస్తి పంపిణీ జరగాలనేది 1947కు పూర్వం ముస్లిం లీగ్ డిమాండ్ చేసిందని అన్నాడు. అప్పుడు కాంగ్రెస్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం వల్లనే రాజ్యాంగం కూడా కుల ప్రాతిపదికపై గానీ, జనాభా దామాషా, మైనారిటీ మతాలుగా గుర్తించి గానీ రిజర్వేషన్లు ఇవ్వలేదని అన్నాడు. ఇప్పుడీ పనిని కాంగ్రెస్ పార్టీ చేస్తే అది మళ్లీ సామాజిక ఘర్షణకు దారి తీస్తుందని తప్పుపట్టాడు. నిజానికి కాంగ్రెస్ తన మానిఫెస్టోలో కుల గణన జరగాలని పేర్కొంటే, దాన్ని వక్రీకరించి మోడీ రాద్ధాంతం చేస్తున్నాడని వారు విమర్శించారు.
ఇక ముస్లింలవిషయానికొస్తే వారు చొరబాటుదారులని, ఎక్కువ మంది పిల్లలను కంటూ ఈ దేశ జనాభాలో హిందువులను మైనార్టీలోకి నెట్టివేస్తున్నారన్న అర్థం వచ్చేట్లు ఎన్నికల సభలలో మోడీ ప్రస్తావించాడు. అసలు ఈనాటికీ ముస్లింల జనాభా హిందువుల జనాభాలో సగం కంటే చాలా తక్కువే ఉన్నది. మరి హిందువులకొచ్చే ప్రమాదమేంటో ఎవరికీ అర్థం కాదు. ఇక చొరబాటుదార్ల విషయానికొస్తే – చరిత్రకారులెందరో చెప్పినట్టు ముస్లింలు నిస్సందేహంగా ఈ దేశ భూమి పుత్రులే. 2005లో రాజేంద్ర సచార్ కమిషన్ నివేదిక పేర్కొన్నట్లు ఒక్క అస్పృశ్యత మినహా దేశంలో ముస్లింల జీవన స్థితిగతులు దళితులకన్నా చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఉన్న రిజర్వేషన్లను కొందరు దళితులైనా పూర్తిగా వినియోగించుకుని విద్యావంతులై ఉద్యోగాలకు వచ్చి రాజకీయాల్లో కూడా ఒక నిర్ణాయకశక్తి అయినట్టుగా ముస్లింలు అలా కానే కాలేదు.
ముఖ్యంగా 1992 బాబ్రీ మసీదు విధ్వంసకాలం నుండి (ఈశాన్య రాష్ట్రంలోనైతే నెల్లీ మారణకాండ కాలం నుంచే) ముస్లింలు బయట నుంచి వచ్చిన చొరబాటుదారులుగా వివక్షకు గురయ్యారు. ఆ తర్వాత గుజరాత్ మారణకాండతో, సంఘపరివార్ ప్రచారంతో వాళ్లు అన్యులుగా చూడబడుతూ హిందూ జీవన విధానాన్ని అంగీకరించి దిగువ స్థాయిలో ఉంటే తప్ప ముస్లింలకు బతుకు లేని దుర్భరమైన స్థితి వచ్చింది. ఇప్పుడైతే ఉత్తరప్రదేశ్, ఢల్లీి తదితర ప్రాంతాలలో స్వంతానికి ఒక ఇల్లు కూడా లేని ముస్లింల సంగతి సరేసరి, ఇల్లు వంటి స్వంత ఆస్తి కలిగి ఉన్న ముస్లిం కుటుంబాలు సైతం నేరస్తులుగా చూడబడుతూ ‘బుల్ డోజర్ న్యాయానికి’ బలి అవుతున్నారు.
ఇక ఆస్తి పంపిణీ విషయానికొస్తే- ఆస్తి పునః పంపిణీ కాదు కదా అసలు పంపిణీయే జరగలేదని ఎవరికైనా అర్థమయ్యే నిజం. సంపద అంతా రోజు రోజుకూ అదానీ, అంబానీ వంటి సామ్రాజ్యవాద కార్పొరేట్ శక్తుల దగ్గరే పోగుబడి దానిని కాపాడుకోవడానికే సైనికీకరణను పెంచుతూ, కొత్త కొత్త చట్టాల ద్వారా అంతకన్నా ఎక్కువగా రాజ్యాంగేతర సంఘ పరివార శక్తుల ద్వారా ఫాసిస్టు అణచివేతను అమలు చేస్తున్నారనేది అక్షర సత్యం. ఫాసిస్టు మోడీ రాజకీయ బ్లాక్ మెయిలింగ్‌కు, అధికారోన్మాద, మతోన్మాద హింసా వ్యూహానికి ఎదురొడ్డి పాలకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో తెలియదు గానీ దళిత, బహుజనులతో పాటు ముస్లింలకు కూడా విద్యా, ఉద్యోగ, రాజకీయ ప్రాతినిధ్యం, లబ్ది, జనాభా ప్రాతిపదికన జరగాలనేది మావోయిస్టుల ఎజెండా అనేది అందరికీ తెలిసిందే.
అసలు మావోయిస్టు పార్టీ మాత్రమే కాదు, అంతకుముందు అవిభక్త కమ్యూనిస్టు పార్టీ కూడా సాయుధ రైతాంగపోరాట కాలంలో రాజ్యాంగ చట్టాలను అమలుచేయమనే పాలకవర్గాలను డిమాండ్ చేసింది. ఉదాహరణకు 1953 భూ సంస్కరణలు చట్టం ప్రకారం వారసత్వ ఆస్తి రద్దు అనేది రక్షిత కౌలుదారీ రైతులకు ఇచ్చే భూమి హక్కు. అలాగే 1973లో జగిత్యాల జైత్రయాత్ర సందర్భంగా ఆనాటి ప్రధాని పివి నరసింహారావు చేసిన భూసంస్కరణల చట్టాన్ని ( 1 కుటుంబానికి 6 ఎకరాల తరి, 16 ఎకరాల ఖుష్కీ, లేదా అంతా ఖుష్కీ అయితే 54 ఎకరాల భూమి ప్రతి నిరుపేద రైతుకు ఇవ్వాలి) అమలు చేయమనే విప్లవోద్యమం డిమాండ్ చేసింది. ఇప్పుడైతే అది కాస్తా ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలనే డిమాండ్ దాకా వచ్చింది.
ఇంతకు ఆదివాసీలు ఎవరు అన్న ప్రశ్నకు 2011లో భారత సుప్రీంకోర్టు ఒక అపూర్వమైన తీర్పు ఇచ్చింది:
‘‘ భారతదేశంలో మూలవాసులు ద్రవిడులు కారు. ద్రవిడపూర్వ ముండా ఆదివాసులు. వారి వారసులు ప్రస్తుతం ఛోటా నాగపూర్ (జార్ఖండ్), ఛత్తీస్‌గఢ్,ఒడిశా, పశ్చిమబెంగాల్ మొదలైన ప్రాంతాల్లోనూ, తమిళనాడు లోని నీలగిరి కొండల్లో ఉండే తోడాలు, అండమాన్ దీవులలోని ఆదిమవాసులు, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా అడవులు, కొండ ప్రాంతాలలో ఉండేవారు. ఉదాహరణకు గోండులు, సంతాలులు, భిల్లులు మొదలైన వారు. భారతదేశంలోని ఆదివాసీ ప్రజలకు జరిగిన అన్యాయం దేశ చరిత్రలో ఒక సిగ్గుపడే అధ్యాయం. ఆదివాసీలను రాక్షస్ (రాక్షసులు) ‘అసురులు’ అని పిలిచారు. వారిని పెద్ద సంఖ్యలో హత్య చేశారు. మిగిలిన వారిని, వారి వారసులను నీచంగా చూశారు. అవమానించారు. శతాబ్దాలుగా వారిపై అన్ని రకాల దారుణాలు జరుగుతున్నాయి. వారు తమ భూములను కోల్పోయి పేదరికం,నిరక్షరాస్యత, వ్యాధులతో అడవులు, కొండల్లో దయనీయమైన అస్తిత్వానికి నెట్టబడ్డారు. వారు నివసిస్తున్న అడవులు, కొండల భూమిని జీవనాధారమైన అటవీ ఉత్పత్తులను కూడా లాక్కోవడానికి ఇప్పుడు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని పేర్కొన్నది.
ముఖ్యంగా అదానీ, అంబానీ వంటి కార్పోరేట్ల ప్రయోజనం కోసమే అధికారంలోకి వచ్చిన మోడీ షా ల పాలన మొదలైన 2014 తర్వాత ఇటువంటి సుప్రీంకోర్టు తీర్పులను మనం చూడలేదు. స్వయంగా ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వమే వేసిన జుడిషియల్ కమిషన్లచే రుజువైన హత్యాచారాలు, అత్యాచారాలనే తీసుకొని ఆ ఆదివాసులనే పిటిషనర్లుగా ఢల్లీి లోని సుప్రీం కోర్టుకు హిమాంశు కుమార్ వెళ్తే, ఇటువంటి కేసులు తీసుకుని వచ్చి కోర్టు సమయం వృధా చేసినందుకు ఆయనకు ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది. అంటే – ఫాసిస్టు బిజెపి ప్రభుత్వం అసలైన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఎలక్షన్ కమిషన్ వంటి అన్ని రాజ్యాంగ సంస్థలను కబ్జా చేసి తన మనువాద రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది.
2024 ఎన్నికల సందర్భంగానే మోడీ మావోయిస్టు రహిత భారత్‌లో ఎన్నికలని అన్నాడేమోనని అనుకున్నాం గానీ, ఇప్పుడైతే భారత దేశమే మావోయిస్టు రహితంగా ఉండాలని అంటున్నాడు. ఒకవైపు మావోయిస్టు పార్టీ రెండు వైపులా కాల్పుల విరమణను ప్రతిపాదిస్తూ శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటిస్తే, సాయుధ పోరాట విరమణ చేస్తే గాని చర్చలేం లేవని బిజెపి ప్రభుత్వం అంటోంది.
‘చెరువులోని నీళ్లను ఆసాంతం తోడేస్తే చేపలన్నీ అవే బయటికొస్తాయి’ అనే వ్యూహాన్ని రచించి లక్షలాది సైనిక బలగాలతో దండకారణ్యాన్ని బయటినుంచి దిగ్బంధించి, ఆధునాతన టెక్నాలజీ ని ఉపయోగించి అడుగడుగునా కదలికల్ని పసిగట్టి లోపలినుంచీ ఏకకాలంలో విప్లవోద్యమంపై దాడి చేస్తోంది. అయితే ఈ సారి అనూహ్యంగా విప్లవోద్యమం లోపలి నుండే ఆయుధాలతో కొందరు అగ్ర స్థాయి నుండి కింది స్థాయి నాయకుల దాకా ప్రభుత్వం ముందు లొంగిపోయి సాయుధ ప్రతీఘాతుకానికి పాల్పడ్డారు.
మరో వైపేమో బయట ప్రజలు చైతన్యవంతులవుతూ తమ స్వేచ్ఛ కోసం పోరాడడానికి సిద్ధపడుతూ ముందుకు వస్తున్న కాలంలో ఇక్కడి పాలకులు, ముఖ్యంగా మతతత్వవాద పాలకులు ప్రజలను మరింత దూకుడుగా చీల్చడం ప్రారంభించారు. దేశం మొత్తానికి ఒకే ఒక శత్రువును అన్యమతంలో, అన్య భావజాలంలో, బయట పొరుగు దేశాల్లో చూపెడుతూ, అదే సమయంలో అంతర్గతంగా ప్రజల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొడుతూ దేశం లోపలనే ఒక అంతర్ యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారు. అంతేగాదు, రాజ్యమే ప్రజలకు శత్రువుగా మారిన దుస్థితిని కూడా మనం చూస్తున్నాం.
ఈ 20 వ్యాసాలను ఫెలో ట్రావెలర్ ప్రధానంగా విరసం ఆన్ లైన్ పత్రిక వసంతమేఘం లో రాశారు. తెలుగు నేలపై విస్ఫోటించిన నక్సల్బరీ మేఘ గర్జన కాలం నుండి నేటి దాకా సహ ప్రయాణికుడిగా ఉన్న ఈ రచయిత తన వ్యాసాల్లో ఇంగ్లిష్ సాహిత్యానికి పితామహుడైన జాఫ్రీ చాసర్ వలె కళ్లకు కట్టినట్టుగా వందలాది మందిని కోట్ చేస్తూ, వేలాది సంఘటనలను గతితార్కిక సంబంధాల కోణంలో విశ్లేషించారు. ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే- ఐదున్నర దశబ్దాలకు పైగా కొనసాగుతున్న విప్లవోద్యమ నాయకత్వంలో ప్రజలు చేసిన, చేస్తున్న సుదీర్ఘ వర్గపోరాటాన్ని చాలా సునిశితంగా సాధికారికంగా విశ్లేషించి వివరించడమే కాదు డాక్యుమెంట్ చేసిన అద్భుత చారిత్రక కథనం ఇది.
అంతిమ సారాంశంగా చెప్పాలంటే – మోడీ షా ల బిజెపి ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన రిపబ్లిక్ గా కాకుండా సర్వాధికార నిరంకుశ కగార్ రిపబ్లిక్ గా నడుస్తోంది. ఇందుకు మతోన్మాద ఫాసిస్టు పాలకులు చూపిస్తున్న మావోయిస్టుల సాయుధ పోరాటం అనే బూచికి భయపడకుండా ప్రతి ఒక్కరూ తమదైన చైతన్యంతో, వ్యక్తిత్వంతో ఆలోచించాలి. మానవ అస్తిత్వ, చైతన్యాలను విడి విడి అంశాలుగా చూడకుండా, వాటి మధ్య ఉండే పరస్పర గతితార్కిక సంబంధాన్ని గుర్తించి తదనుగుణంగా వ్యవహరించాలి. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా సమాజంలో నిరంతరం కొనసాగుతున్న వర్గపోరాటంలో ప్రతి ఒక్కరమూ భాగస్తులుగానే ఉంటాం. మన మౌనం ద్వారానో, మాట ద్వారానో, చర్య ద్వారానో ఏదో విధమైన వైఖరిని మనం ప్రకటిస్తాం. చాలామందికి కాన్షియస్ గా ఆ ఎరుక ఉండకపోవచ్చు. అయితే నేటి ప్రమాదకర ఫాసిస్టు రాజకీయ సామాజిక సందర్భంలో మనం కాన్షియస్ గా ఆ ఎరుకను కలిగి ఉండి నిర్మాణాత్మకంగా సామూహిక కార్యకర్తృత్వం లోకి దిగడమే అత్యంత కీలకమైన ఆవశ్యకమైన విషయం.
ప్రపంచ చరిత్రలో పాలకులు బరితెగించి ముందుకు తీసుకొచ్చిన రకరకాల ఫాసిజాలతో విశాల ప్రజాశ్రేణులు, ఎందరో బుద్ధిజీవులు విప్లవ కమ్యూనిస్టు స్ఫూర్తితో నిర్మాణాత్మక సామూహిక కార్యాచరణ ద్వారానే పోరాడి మట్టికరిపించి ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్యాన్ని (దాని) నిజార్థంలో కాపాడారు. కాబట్టి పాలకుల ఫాసిస్టు నిరంకుశత్వాన్ని రూపుమాపడానికి నిర్మాణాత్మకమైన సామూహిక ఐక్య పోరాటాలు మినహా ప్రజలకు వేరే దగ్గరి దారేదీ లేదు.
డిసెంబర్ 7, 2025
(ఫెలో ట్రావెలర్ పుస్తకం ‘కగార్ రిపబ్లిక్’ కు రాసిన ముందుమాట)