కథలు ఎలా రాస్తారండీ అని నన్ను కొంతమంది అడుగుతూ వుంటారు. లోకం అంతటికీ ఒక్క మనిషే ఏకవచనంగా ఉండిపోతే “నీతి” అనే మాటే ఉండదని సైనోజా అనే మహాశయుడు అన్నాడని నేను విన్నాను. మనిషి బహువచనంగా ఉంటూ, సంఘజీవిగా ఉన్నాడు కాబట్టి నీతి నియమాలకి అవసరం ఏర్పడింది. ఆ మాటలు పుట్టడం జరిగింది.
అలాగే కథలు కూడా లోకంలో ఒకడే మానవుడుంటే పుట్టి ఉండవని నేననుకుంటాను. మానవులంటూ ఉండడం వల్లనే వారు సంఘజీవులుగా ఉండటం చేతనే కథలంటూ పుట్టేయని నేననుకొంటున్నాను. మానవ జీవితంలోంచే మహిలో కథలు పుడతాయి. (నా ఉద్దేశం ప్రకారం).
కథలు ఎలా రాయడం? అని నేననుకొంటున్న రోజుల్లో ఓ చిన్న సంఘటన జరిగింది. నేను చెన్నపట్నంలో లా కాలేజీలో చదువుతూ సేన్హోమ్లో ఓ హాస్టల్లో ఉంటూండేవాణ్ని. లా కాలేజీ మాకు చాలా దూరం. వెళ్తే బస్సులో వెళ్ళాలి. లేకపోతే ట్రాములో వెళ్ళాలి. ట్రాములు చీమ నడకల్తో వెళ్ళేవి. బస్సులో పది గంటలకి సీట్లు దొరకడం చాలా కష్టంగా ఉండేది. ఆలస్యంగా వెళ్ళినా ఫరవాలేదు కాబట్టి మేమంతా నెలవారీ పాసులు కొనుక్కొని ట్రాములమీద కాలేజీకి వెళ్తూండేవాళ్ళం.
మామూలు రోజుల్లో అయితే ఆలస్యంగా వెళ్ళినా ఫరవాలేదు కాని పరీక్షలకి వెళ్తే మాత్రం ఠంచన్ గా టైముకి వెళ్ళాలి కదా! అటువంటపుడు చాలా వేగిరంగా బయల్దేరనైనా బయల్దేరేవాళ్ళం. లేదా, నలుగురైదుగురం చేరి టాక్సీమీదైనా వెళ్ళే వాళ్ళం.
మా హాస్టల్లో మా క్లాస్మేట్ ఒకాయన ఉండేవాడు. పై పేరాల్లో ఒకదానిలో ఒక “చిన్న సంఘటన” అని చెప్పేను కదా. ఆ సంఘటన ఆయన విషయంలో జరిగింది. అందులోనుంచి నేను రాసిన “మెరుపు మెరిసింది” అనే కథ వచ్చింది.
“మెరుపు మెరిసింది” చాలా చిన్న కథ. అందులో నీరజ అనే ఓ స్కూలు టీచర్ వుంటుంది. ఆమెకి ముప్పయ్యయిదేళ్లు వెళ్లేయి. పెళ్ళి మాత్రం కాలేదు. అది ఆమెకు చాలా చింతగా ఉంటుంది. అందులోనూ ఆవిడ చాలా అనాకారి. తనకి పెళ్ళికావాలనీ, పిల్లలు పుట్టాలనీ ఆమెకి చాలా కోరికగా ఉంటుంది. ఆ కోరిక తీరదని ఆమెకి చాలా నిరాశగా ఉంటుంది. ఇలా ఉంటుండగా హెచ్చుగా వర్షాలు పడే రోజుల్లో ఓ రోజున ఆమె స్కూల్కి వెళ్ళడానికి బస్సుకోసం చాలాసేపు నిరీక్షిస్తూ బస్సుల్లో సీట్లు లేక స్టాండులో బాధపడుతూ ఉండిపోయిన సమయంలో ఓ నడికాలపు సుందరాంగుడు తన కార్ ఆపి అందులో ఆమెకి లిస్ట్ ఇచ్చి స్కూల్ దగ్గర విడుస్తాడు. దాన్తో ఆమె పులకరించి పోతుంది. ఆ చిన్న సంఘటన మీద ఆమె బరువైన కలల భవనాలు కట్టేసుకొంటుంది. ఆ చిన్న స్నేహం పెద్దదయి పెళ్ళిగా పరిణమించకూడదా అని ఆశలు పెట్టుకొంటుంది. ఆ మర్నాడు కూడా వర్షం కుండపోతగా కురుస్తూండడంతో అదే టైంకి అదే బస్సు స్టాండు దగ్గిర అదే కారుకోసం ఆమె ఆశలన్నీ మూటకట్టుకుని నిరీక్షిస్తుండగా అదేకారులో అదే సుందరాంగుడు అదే దారంట వెళ్తూ ఆమెని చూసికూడా చూడనట్లు నటించి, వయసులోనూ అందంగానూ ఉన్న మరి నలుగురు ఆడపిల్లలకి లిస్ట్ ఇచ్చి ఈమెను మాత్రం వర్షానికీ నిరాశకీ వదిలేసి వెళ్ళిపోతాడు.
ఇది కథ. ఇది జరగని విషయం.
ఇక జరిగిన విషయం ఏమిటయ్యా అంటే,
నా క్లాస్మేట్ అని చెప్పేను కదా. అతను నెమ్మదైనవాడు. మంచివాడు. ఎవరి జోలికి పోయేవాడు కాడు. అలా అన్చెప్పి ఒంటిపిల్లి రాకాసిలా ఉండేవాడు కాడు. పలకరిస్తే సరదాగా పలికేవాడు. డబ్బు దగ్గిర మాత్రం కొంత పిసినారిగా ఉండేవాడేమోనని నేననుకొనే వాణ్ణి. అతను సిగరెట్లు కాల్చేవాడు కాదు, పేకాట ఆడేవాడు కాడు. చాలా సినిమాలు చూసేవాడు కాడు. హాస్టల్లో దొరికిన మేరకే భోజనం చేస్తూ ఇంటినించి అందిన మేరకి డబ్బు జాగ్రత్తగా వాడుకొంటూ అతను చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేసేవాడు.
ఇలా ఉండగా పరీక్షలొచ్చేయి. పరీక్షలకి మేమంతా ఏవిధంగా సకాలానికి చేరుకున్నామో గుర్తులేదు కాని ఇతను మాత్రం బస్సులో వద్దామని బయల్దేరేడట. తొమ్మిది గంటలకే బస్సు స్టాండుకి వచ్చి నిల్చున్నా అతనికి ఏబస్సులోనూ సీటు దొరకలేదట. తొమ్మిదిన్నరకి అతను బస్సు ఎక్కగలిగితే అతను పరీక్షవేళకి కాలేజీకి రాగలడు. తొమ్మిది నలభై అయిపోయినా అతనికి బస్సులో సీటు దొరకలేదు. మరింక అప్పుడు ట్రాం దొరుకుతుందికాని, అందులో వస్తే కాలేజీకి అరగంట ఆలస్యంగా చేరుకుంటాడు. బస్సులో సీటు దొరక్క ఆపరీక్ష తప్పుతాననే బాధతో, ఏడాది పొడుగుకాలం, ఏడాది పొడుగు డబ్బు అన్నీ వేస్టు అయిపోతున్నాయనే వేదనతో అతను బస్సుస్టాండు దగ్గిర నిల్చుండిపోతే….
ముక్కూ మొహం తెలియని పెద్దమనిషెవరో అతనికి తన కారులో కాలేజీ దాకా లిఫ్ట్ ఇచ్చేడు. అందువల్ల అతను పరీక్ష రాయగలిగాడు.
అందుకతను భగవంతునికి వెయ్యి వేల నమస్కారాలు పెట్టుకున్నాడను కుంటాను. ఆ కష్ట సమయంలో ఆలిస్ట్ పొందగలిగినందుకు అతను త్రిల్ అయిపోయేడను కుంటాను. జీవితంలో మొదటిసారిగా ఆడదాన్ని పొందినవాళ్ళా, పుట్టిన పదహారేళ్ళకి తొలిసారి సినీమా చూసిన వాళ్ళా అతను పులకరించిపోయేడు. ఆకలి చావుని కేకులుతిని తప్పించుకున్న వాళ్ళా అతను పొంగిపోయేడు.
ఆవిషయం అంతా అతను అడిగిన వాడితోనూ, అడగని వాడితోనూ ఇద్దరితోనూ చెప్పేడు. ఇంతా చేస్తే మేం వెళ్ళిన పరీక్షలు యూనివర్శిటీ పరీక్షలు కావు. సెలక్షన్ పరీక్షలు, పరీక్షల్లో అందరం సెలెక్ట్ అయిపోతాం అని దాదాపు అందరికీ తెలుసు, అతనికి మాత్రం తెలిసి ఉండకపోవచ్చు. కాని,
అంత చిన్న లిఫ్ట్ గురించి అతనంత పెద్దగా పొంగిపోవడం నాకు చాలా వింతగా తోచింది. ఆవిషయం గురించి ఆలోచిస్తూ,
” కారులో ఓ మొగోడు లిస్ట్ ఇస్తేనే ఈ కుర్రోడింత పొంగి పోతున్నాడు! మరింక వయసులో వున్న ఆడదేకాని లిస్ట్ ఇస్తే కుర్రోడింకెంత పొంగిపోనో!” అని నేననుకున్నాను.
అలా అనుకోగానే ”అహాయ్! అదో కథవుతుందే” అని నాకు అనిపించింది.
అది మెరుపు మెరిసింది కథకు నాంది.
కథ ఎలా పూర్తయిందో తరవాత చెప్తాను.
(అనామిక మాసపత్రిక; జనవరి, 1975)