శాంతి గూర్చి మాట్లాడినప్పుడల్లా
నన్ను ఆయుధాలు క్రిందకు దించి రమ్మని షరతు విధిస్తావు
నిజానికి ఎవరు ముందుగా
ఆయుధాలు క్రిందకు దించాలి
చుట్టూ ఆయుధాలు లేకపోతే
అడుగు ముందుకు కదపలేని వాడివి
ఇంటి చుట్టూ సిసి కెమరాలు పెట్టుకొని
నిరంతరం డ్రోన్ల నిఘా లేకపోతె
ఇంట్లో కంటి నిండా నిద్రపోని వాడివి
నెత్తుట్లో ముంచిన చెతులతో
అధికార పీఠాన్ని అందుకున్న వాడివి
నీ జీవితమంతా ఆయుధాలమయం
నా ప్రజలపై ఆయుధాలు ఎక్కుపెట్టి
నన్ను ఆయుధాలు కింద పెట్టి రమ్మంటున్నావు
నిజానికి ఎవరు ఆయుధాలు ముందుగా కిందపెట్టవలసింది
నీ అధికారాన్ని కాపాడుకోవడానికి
పెట్టుబడిదారులకు ఊడిగం చేయడానికి
సహజ సంపదను దోచుకోవడానికి
నిన్ను ఎదిరించే వాళ్ళను అణచడానికి
నువ్వు సైన్యమూ పోలీసులూ ఆయుధాలను
ఏర్పాటు చేసుకున్నావు
నీ అణచివేత నుండి నా ప్రజలను రక్షించుకోవడానికి
ప్రజల సంపదను కాపాడడానికి
నేను ఆయుధధారినయ్యాను
నవ సమాజ నిర్మాణ ఆశయ బద్దుడనైన నేను
అనాదిగా పోరాడుతూనే అడుగులు ముందుకు వేస్తున్నాను
నన్నాపడానికీ
నా స్వేచ్చా కాంక్షను అణచడానికీ
నాపై నా ప్రజలపై ఆయుధాలు ఎక్కుపెట్టిన వాడివి నువ్వు
ఆయుధాలు పట్టడంలో
నీకూ నాకూ పోలికెక్కడిది
నువ్వు శాంతి సూత్రాలు వల్లించినప్పుడల్లా
పెద్ధల మాటలు గౌరవించి
ఆయుధాలు పక్కకు పెట్టి
నీతో చర్చించడానికి వచ్చినప్పుడల్లా
నిజానికి మోసపోయింది నేనే
నన్ను చూసి నా ఆనవాల్లు పట్టుకొని
నా శరీరం నిండా నువు చేసిన గాయాలు
ఇంకా సలుపుతూనే ఉన్నాయి
నీ బుజ్జగింపు మాటల వెనుక
కోరలు చాచిన రక్త దాహం నాకు తెలియనిది కాదు
నీ శాంతి ప్రవచనాల అంతరంగంలో నువ్వు పన్నిన
పావురాల గొంతులు కోసే వ్యూహాలు నా ఊహకందనివి కావు
నువ్వు అహింసా పరమోధర్మః అని అన్నప్పుడల్లా
నమ్మి దెబ్బతిన్న వాడను నేనే
నీవన్నీ ముసలి పులి వల్లించే ధర్మ సూత్రాలు
నువ్వు ఎక్కుపట్టిన ఆయుధాలు దించకుండా
నేనెలా ఆయుధాలు పక్కకు పెట్టి
వట్టి చేతులతో నీ ముందుకు ఎలా వస్తాననుకుంటున్నావు
నన్ను నిర్మూలించడమే నీ లక్ష్యమైనప్పుడు
ఏ శాంతి మాటలకు కట్టుబడి ఉంటావు నువ్వు
నన్ను నేను రక్షించుకోవడానికి
నిన్ను ఎదిరించకుండా ఎలా ఉంటాను నేను
అందుకే అడుగుతున్నాను నిన్ను
ఆయుధాలు ముందు క్రింద పెట్టవలసింది
నువ్వా నేనా!
అసలు ఆయుధమంటే నాకేమి తెలుసు?
ఉత్తచేతులతోనే ఉద్యమించిన వాణ్ణి
ఉన్న గొంతు తోనే గళమెత్తిన వాణ్ణి
ఆయుధాలను చూపించినదీ
సాయుధమై పోరాడక తప్పని స్థితి
కల్పించినదీ నీవే కదా ?
_ ____________
వెంకట్ నాగిళ్లకు షెహభాస్