గత రెండు దశాబ్దాలుగా దేశంలోని గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకం ఆసరగా నిలిచింది . ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోనే పేదరికంలో మగ్గుతున్న పేదలు ఉపాధి పొంది ఆకలినీ, నిత్యావసరాలను తీర్చుకొంటున్నారు. దేశంలోని గ్రామీణ పేదలకు ఓ మేరకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని క్రమంగా బలహీనపరచి చివరికి రద్దు చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కొంత కాలంగా నిధులు పెంచకుండా చేసి ఇప్పుడు ఆ పథకాన్నే రద్దు చేసే విధానాలు అమలు చేస్తున్నది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ (ఎంజిఎన్ఆర్ఇజిఎ) పేరు తో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) (విబి జిఆర్ఎఎం జి) అని పేరు మార్చింది. పేరులోని మహాత్మాగాంధీ పేరును తొలగించింది. కేంద్ర ప్రభుత్వం కేవలం ఈ చట్టం పేరు మాత్రమే మార్చలేదు, మొత్తం పథకాన్ని నీరుగార్చింది. ఇప్పటి వరకూ ఉన్న ఎంజిఎన్ఆర్ఇజిఎ అనేది హక్కు ఆధారిత పథకం. దీని ద్వారా ప్రతీ గ్రామీణ కుటుంబానికి కనీసం వేతనంతో కనీసం వంద రోజులు పని ఉండటం ప్రాథమిక హక్కుగా ఉంది. అయితే ఇప్పుడు దీన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. హక్కుగా ఉన్నదాన్ని బడ్జెట్ ఆధారిత పథకంగా మార్చి వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కాయకష్టం చేయగలిగేవారికి ఏడాదికి కనీసం వంద రోజుల పని దినాలు కల్పించేందుకు ఇరవయ్యేళ్ల (2005) క్రితం తీసుకొచ్చిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కనుమరుగు చేయటానికి మోడీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దాని స్థానంలో తీసుకురా దల్చిన ‘వికసిత భారత్ రోజ్‌గార్ అజీవికా మిషన్ గ్రామీణ్’ (విబి-జీ రాం జి) బిల్లు పార్లమెంటులో డిసెంబర్ 18న ఆమోదం పొందింది.
ప్రజానుకూల ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల ప్రొద్భలంతో ఎంజిఎన్ఆర్ఇజిఎ పథకం తయారైనది. దేశంలో గ్రామీణ ప్రాంతాలలో భూమిలేని నిరుపేదలు, చిన్న, సన్నకారు రైతులు ఏడాదికి కనీసం రెండు వందల రోజులు ఉపాధి దొరకని స్థితిలో ఉన్నారని, వ్యవసాయ పనులు లేని రోజుల్లో వారికి ప్రత్యామ్నాయ ఉపాధి దొరకడం కష్టంగా ఉందని గుర్తించి, ఉపాధి పొందడం గ్రామీణ పేదల హక్కు అని ఆ పథకం నిర్ధారించింది. ఏడాదికి కనీసం వంద రోజుల ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని భావించింది. అలా 2005లో చట్టబద్ధంగా తయారయిన ఈ పథకం 2006 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ పథకం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడంలో పూర్తి లక్ష్యం సాధించలేకపోయినా పెద్ద ఉపశమనంగా ఉండింది. మొదట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఉన్న ఈ పథకానికి 2009లో మహాత్మా గాంధీ పథకంగా పేరు చేర్చారు. ఈ పథకం నైపుణ్యం లేని గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించి, జీవన భద్రత ఇవ్వడంతో పాటు, గ్రామీణ ప్రాంతాలలో చిరకాలం ఉపయోగపడే సామాజిక ఆస్తులను, మౌలిక సాధన సంపత్తిని కల్పిస్తుందని ఆశించారు. ప్రతి వ్యక్తికీ జాబ్ కార్డ్ ఇచ్చి, గ్రామీణ, రాష్ట్ర స్థాయి నుంచి పనుల అవసరాన్ని గుర్తించి, తద్వారా ఉపాధి పొందడం పేదల, నిరుద్యోగుల హక్కుగా పరిగణించారు.
అమలులో ఉన్న పాత పథకం కన్నా మోడీ తెచ్చిన కొత్త విబి జిఆర్ఎఎం జి పథకం అనేక రెట్లు మేలైనదని కేంద్రం చెబుతోంది. ఆ మాటెలా ఉన్నా ప్రతి పథకమూ హిందీ భాషా పదాల మేళవింపుతో ఉండటం, పదాది అక్షరాలతో గుర్తుండిపోయే పదం వచ్చేలా రూపొందించటం ఎన్డీయే ప్రభుత్వ ప్రత్యేక త. ఈసారైతే గ్రామాల్లో ప్రతి పేద కుటుంబమూ ‘జీ రాం జీ’ అని స్మరించుకునేలా పథకం పేరును రూపు దిద్దారు. మహాత్మా గాంధీ పేరు తొలగించారు. పార్టీల మధ్య వాదప్రతివాదాల సంగతెలా ఉన్నా సాధారణ జనం పథకం పేరు కన్నా ప్రయోజనం ఏమేరకన్నదే ప్రధానంగా చూస్తారు. ‘జీ రామ్ జీ’ అంటూ బిజెపి తన కొత్త పథకంలో గాంధీ పేరుతో పాటు, మొత్తం ఉపాధికే ఎసరు పెట్టింది.
వలస పాలన అనంతరం గ్రామీణ పేదల కోసం వచ్చిన అతి కొద్ది చట్టాల్లో ఉపాధి హామీ చట్టం ఒకటి. ఈ చట్టం బాగా అమలు జరిగిన చోట పేదల వలసలు బాగా తగ్గాయి. కొనుగోలు శక్తి పెరిగింది. భూస్వామ్య వర్గాలతో పేదలకు బేరమాడే శక్తి వచ్చింది. వెరసి భారత ఆర్థిక వ్యవస్థను కుదేలు కాకుండా కొంతమేరకు నిలబెట్టగలిగింది. ఈ చట్టం యొక్క ప్రాధాన్యతను భారతదేశంలో అనేకమంది ఆర్థికవేత్తలు, మేధావులు కొనియాడారు. గ్రామీణ పేదలకు పని లేని సమయంలో పని చూపించి పస్తుల నుంచి కాపాడడానికి ఉపాధి హామీ చట్టం దోహదపడింది. మన రాష్ట్రంలో లక్షలాది ఎకరాల సన్న, చిన్న కారు రైతుల భూములు అభి వృద్ధి కావడానికి ఉపకరించింది. చదువుకున్న లక్షలాది మంది గ్రామీణ యువతీ యువకులకు కొంత ఉపాధి చూపించగలిగింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన చట్టాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన పాలకులే పీక నొక్కడానికి పూనుకున్నారు. 2005లో చట్టం రూపుదిద్దుకున్నప్పుడు పేదలకు ఉపయోగపడే అనేక అంశాలను చేర్చారు. గ్రామీణ ప్రాంతంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా ఈ జాబు కార్డు పొందవచ్చు. కార్డు పొందిన ప్రతి కుటుంబం ఏడాదికి వంద రోజులు పని చేయవచ్చు. చేసిన పనికి వారం వారం వేతనాలు చెల్లించాలి.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చిన నేపథ్యం ఒకింత విషాదకరమైనది. వరస కరువులతో, ఆర్థిక సంస్కరణలతో కుదేలై గ్రామీణ భారతం తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న రోజులవి. రైతుల ఆత్మ హత్యలు, ఉపాధి కరువై వలసలు ఎక్కువయ్యాయి. చేతివృత్తులు దెబ్బతిని పోయాయి. దేశంలో అనేక జిల్లాలు ఆకలితో అలమటించాయి. అప్పుడు కేంద్రంలో అధికారంలోకొచ్చిన యూపీఎ ప్రభుత్వం ‘జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం’ తీసుకొచ్చింది. 2006 నుంచి దశలవారీగా అమలు ప్రారంభించింది. పని చూపాలని కోరితే పక్షం రోజుల్లో పని కల్పించటం లేదా నిరుద్యోగ భృతి కల్పించటం, ఉపాధిని హక్కుగా గుర్తించటం, కూలీల్లో మూడోవంతు మంది తప్పనిసరిగా మహిళలుండాలనే షరతు తదితర ప్రగతిశీల అంశాలున్నాయి. నివాస స్థలానికి అయిదు కిలోమీటర్ల లోపునే పనిచూపటం, అంతకు మించితే అదనపు వేతనం చెల్లించటం దాని ప్రత్యేకతలు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఉపాధి కల్పనా పథకంగా పేరుగాం చింది. పల్లెసీమల్లో ఈ పథకం కింద రహదారులు, చెరువుల్లో పూడిక తీయటం, భూసార పరిరక్షణ, నీటి పారుదల సదుపాయాల మెరుగు వగైరా పనులు చేయటానికి ఈ పథకాన్ని వినియోగించారు.
మోడీ పాలనలో దేశ ప్రజాస్వామ్యానికి పాడు కాలం దాపురించింది. మరీ ముఖ్యంగా గ్రామీణ పేదల కు చెడు రోజులు వచ్చాయి. రెండు దశాబ్ధాలుగా మాహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ జీవనోపాధుల భద్రతకు మూలస్తంభంగా ఉన్నది. గ్రామీణ పేదల పనిహక్కుకు చట్టబద్ధ మైన హామీనిచ్చిన, స్థానిక ప్రజాస్వామ్యానికి సాధికారత కల్పించిన, ఉపాధి కల్పనను ఒక హక్కుగా గుర్తించిన అరుదైన చట్టమది. అలాంటి చట్టాన్ని నీరుగార్చటంపై ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పక్కన పెట్టాలని బిజెపి ప్రభుత్వం నిర్ణయించడం పేదలపై కేంద్ర ప్రభుత్వం చేసిన క్రూర దాడిగా పేర్కొన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం పాతదానికంటే కొత్తది అత్యంత పారదర్శకమైనదనీ, గ్రామీణ పేదలకు మరిన్ని ఎక్కువ పనిదినాలు కల్పించడమే కాకుండా తాగు, సాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం దక్కుతుం దనీ మోడీ ప్రభుత్వం చెబుతోంది. కానీ అసలు ఈ చట్టాన్ని ఎందుకు మార్చవలసి వచ్చిందో మాత్రం చెప్పటం లేదు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగంగా పాత చట్టం పని హక్కును కల్పిం చింది. కానీ మోడీ తెచ్చిన కొత్త బిల్లు ఆ హక్కును నిరాకరిస్తోంది. పేదరికం, నిరుద్యోగం విస్తరిస్తున్న ఈ తరుణంలో ఈ బిల్లు గ్రామీణ నిరుద్యోగాన్ని మరింతగా పెంచి, వెట్టిచాకిరి వైపు నడిపిస్తుంది. ఈ కొత్త బిల్లు సామాజిక పురోగమనానికి కాకుండా, భూస్వామ్య సంస్కృతికి జీవం పోయనుంది. ఉపాధికి హామీపడిన పాతచట్టాన్ని ఉపసంహరించడం వెనుక అనేక సరికొత్త లక్ష్యాలూ ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. మారిన సామాజికార్థిక వాస్తవాలకు అనుగుణంగా బిల్లును తీర్చిదిద్దామని ప్రభుత్వం అంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగు, సాగునీటి వనరులను మెరుగుపరుస్తుందని, ఉమ్మడి వసతులు, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం దక్కుతుందని ప్రభుత్వం చెబుతోంది. కొత్త బిల్లులో ఈ పథకం మీద కేంద్ర ప్రభుత్వం నియంత్రణ పెరిగిందని, ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులన్న అంశం సహా చాలా అధికారాలు కేంద్రం దఖలుపరచుకోవడం ప్రమాద సంకేతాలని విపక్షాలు విమర్శించటం గమనార్హం.
ఈ బిల్లును విస్తృత పరిశీలన కోసం జెసిపి, లేదా స్టాండింగ్ కమిటీకి పంపాలనే ప్రతిపక్షాల అభ్యర్థ నలను, సూచనలను మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల పార్లమెంట్ ఆవరణలో డిసెంబర్ 18న ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎ అనే భారీ బ్యానర్‌తో ప్లకార్డులు చేబూని పార్లమెంట్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం నుండి మకర్ ద్వార్ వరకు ప్రతిపక్షాల ప్రదర్శన సాగింది. కేంద్ర ప్రభుత్వ చర్య ను పార్లమెంట్‌లోనూ, దేశంలోని గ్రామ గ్రామాన తిప్పికొట్టాలని ప్రతిపక్ష నేతలు పిలుపు ఇచ్చారు. కేంద్రం ప్రతిపాదించిన ఈ కొత్త బిల్లు ఉపాధి పొందడం హక్కు అనే భావనను పూర్తిగా తుడిచి పెట్టేస్తుంది. చట్టాన్ని పథకంగా పరిమితం చేయడం ద్వారా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై పేదలను ఆధారపడేలా చేస్తుంది. ఇప్పటి వరకు కూలీల డిమాండ్ బట్టి ఉపాధిని కల్పించే విధానాన్ని మార్చివేసి స్థానికంగా అవసరం ఉంటేనే పనులు కేటాయించే పద్ధతిని అమలు చేయనున్నారు.
నూటికి 60 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడిన దేశం మనది. నూటికి 70 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు అనేక లెక్కలు చెబుతున్నాయి. దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఏడాదికి 100 రోజులు హక్కుగా పని కల్పించిన చట్టం ద్వారా పేదలకు అనేక విధాలుగా మేలు జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఎకరాల సన్న, చిన్నకారు రైతుల భూములు అభివృద్ధి కావడమే కాకుండా పంట కాలువలు, చెరువుల పూడికలు తీయడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు వచ్చినపడు మన దేశంలో వాటిని తట్టుకుని నిలబడటానికి గ్రామీణ ఉపాధి హామీ చట్టం తోడ్పడింది. రెండు దశాబ్ధాలుగా వ్యవసాయ కూలీలకు ఆత్మస్థైర్యాన్ని, ఆర్థిక స్వావలంబనను, భూస్వామ్య బంధనాల నుండి స్వాతం త్య్రాన్ని కల్పిస్తూ గ్రామీణ ఆర్థిక, సామాజిక ముఖచిత్రాన్ని మార్చిన చట్టాన్ని ఎటువంటి బాధ్యతలూ లేని, పరిమిత బడ్జెట్ వథకంగా మార్చివేయటం ప్రజావ్యతిరేకమే కాదు, ప్రజా ద్రోహం.
మోడీ ప్రభుత్వం జాతిపిత మహాత్మా గాంధీని అవమానించడమే కాకుండా, దేశంలోని గ్రామాల్లో సామాజిక, ఆర్థిక పరివర్తన తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించిన పని హక్కును కూడా అణచి వేస్తోందని విపక్షాలు విమర్శించాయి. ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందని, ఉపాధి హామీ చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంతో ప్రజాస్వామ్య విలువలను, జాతిపిత భావాజాలాన్ని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీ, ఎంపి కెసి వేణుగోపాల్, డిఎంకె ఎంపిలు కనిమొళి, టిఆర్ బాలు, ఎ.రాజా, సిపిఎం ఎంపిలు అమ్రారామ్, కె.రాధాకృష్ణన్, జాన్ బ్రిట్టాస్, వి.శివదాసన్, ఎఎ రహీమ్, శివసేన ఎంపి అరవింత్ సావంత్, ఎస్పి ఎంపి ధర్మేంద్ర యాదవ్, ఐయుఎంఎల్ ఎంపి ఈటీ మహమ్మద్ బషీర్, ఆర్ఎస్పి ఎంపి ఎన్‌కె ప్రేమచంద్రన్ తదితరులు మోడీ తెస్తున్న ఉపాధి పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పాత చట్టం ప్రకారం, కార్మికుల వేతనాలకు 100 శాతం, మెటీరియల్‌కు 75 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కొత్త చట్టం ప్రకారం ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 90:10, ఇతర రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో భరించాలి. దీనివల్ల రాష్ట్రాలపై భారం పడుతుంది. పేద, వలస కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు నష్టపోతాయి. నిధుల భారం పెరిగితే రాష్ట్రాలు కార్మికుల డిమాండ్‌ను నమోదు చేయకుండా తప్పించుకునే ప్రమాదం ఉంది. లక్షల కోట్లు అప్పులు తెచ్చి రోజువారీ పబ్బం గడుపుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు నిదులు లేవనే పేరుతో చట్టానికే చరమగీతం పాడే ప్రమాదం ఉంది. పాత చట్టంలో పనుల ప్లానింగ్ గ్రామ సభల స్థాయిలో జరిగేది. కానీ, ఈ చట్టం పనుల ప్లానింగ్‌ను కేంద్రీకృతం చేస్తోంది. దీనివల్ల పంచాయితీల అధికారాలు హరించుకుపోతాయి. ఉపాధి హామీ చట్టం అమలు గ్రామాల ఆర్థిక, సామాజిక స్థాయిల్లో ఆశ్చర్యకరమైన మార్పును తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే గ్రామీణాభివృద్ధికి ఇది గొప్పగా దోహదపడింది. గ్రామీణ నిరుద్యోగానికి కొంతవరకు పరిష్కారంగా నిలిచింది. ఇది మహిళా సాధికారతకు మార్గం వేసింది. ఉపాధి కోసం నగరాలకు వలస వెళ్లా ల్సిన పరిస్థితి నుంచి గ్రామీణులను కొంత మేరకు కాపాడింది. కరువు కాటకాలు విరుచుకుపడినప్పుడు అండగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో, వ్యవసాయ పనుల్లో కూలీ రేట్లకు స్థిరత్వాన్ని తీసుకువచ్చింది. అనేక రాష్ట్రాల్లో ‘ఉపాధి’ పనుల ద్వారా నీటి పారుదల సౌకర్యాలు కల్పించారని, చెరువులు, బావులు, రోడ్లు నిర్మించారని నివేదికలు చెబుతున్నాయి.
యంత్రాలు ఉపయోగించరాదన్న రాజీ లేని సూత్రాన్ని ఎత్తేసి నూతన చట్టంలో యంత్రాలను ప్రవే శపెట్టింది. సిమెంటు రోడ్లు, పక్కా భవనాలు పేరుతో కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు దోచుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ పనిలో రోజువారీ వేతనం కాకుండా క్యూబిక్ మీటర్ రేటు ప్రకా రం (పీస్ రేటు) ఎంత పని చేస్తే అంత వేతనం వచ్చేది. ఎండాకాలంలో నేల గట్టిగా ఉండడం వల్ల 20 నుంచి 40 శాతం అదనంగా సమ్మర్ అలవెన్స్ కల్పించి కూలీలకు వేతనాలు గిట్టుబాటు అయ్యేవి. పీస్ రేటు వల్ల కూలీలు తెల్లవారకముందే ఉపాధి హామీ పనులకు వెళ్లి చేయగలిగినంత చేసి ఇంటికొచ్చిన తర్వాత తమ సొంత పొలంలోనూ లేదా తమ జీవనం కోసం ఇతర పనికి వెల్లి పొట్ట పోసుకునేవాళ్లు. తద్వారా రెండు రకాల ఉపయోగం జరిగేది. గత మూడేళ్ళుగా మోడీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు తగ్గించింది.
‘ఉపాధి హామీ’ పనులకు వేతనాలు చెల్లించే బాధ్యత నూటికి నూరుశాతం కేంద్ర ప్రభుత్వానిది కాగా ఇప్పుడు ఆ భారాన్ని కేంద్ర, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో పంచుకోవలసి ఉంది. ఈ అనివార్యత ఉపాధి పనుల డిమాండ్‌ను ఉపేక్షించేందుకు దారితీయనున్నది. అరకొర నిధులను ఇతర అత్యవసర సేవల నుంచి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మూలధన వ్యయాలకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడుతున్న రాష్ట్రాలు ఈ అదనపు ఆర్థిక భారాన్ని భరించలేవు. పర్యవసాన మేమిటి? పనిదినాలు తగ్గిపోతాయి, వేతన చెల్లింపులు ఆలస్యమవుతాయి, నిరుపేదలు ఈ పనుల నుంచి మినహాయింపునకు గురవుతారు! మరింత స్పష్టంగా చెప్పాలంటే మోడీ ప్రభుత్వ జీ-రామ్-జీ బిల్లు వల్ల నష్టపోయేది తమ మనుగడకు ఉపాధి హామీ పనులపై ఆధారపడిన గ్రామీణ శ్రామిక కుటుంబాలే. ఈ వాస్తవం తెలిసి కూడా ఎన్డీఏ భాగస్వామ్య, మిత్రపక్షాలు కొత్త బిల్లుకు మద్దతునివ్వడం గర్హనీయం.
వికేంద్రీకరణకు ప్రాధాన్యమిస్తున్న డిమాండ్-ఆధారిత ఉపాధి హామీ చట్టం స్థానిక స్వపరిపాలనను పటిష్టపరిచింది. స్థానిక అవసరాలకు ప్రాధాన్యమిచ్చి, వాటి ప్రాతిపదికన ‘ఉపాధి హామీ’ పనులకు ప్రణా ళికలు రూపొందించి, వాటి అమలును పర్యవేక్షించడం వల్ల గ్రామ పంచాయత్‌ల పాలనా సామర్థ్యాలు మెరుగుపడ్డాయి. పాలనా వ్యవహారాలలో పారదర్శకత కూడా పెరిగింది. సామాజిక తనిఖీలు దృఢంగా ఉన్నచోట పాలనా వికేంద్రీకరణ మరింత మెరుగైన ఫలితాలను సాధించింది. కరువు పీడిత మండలాల్లో నీటి సదుపాయాలు మెరుగుపడ్డాయి. వ్యవసాయ ఉత్పత్తులను పొలం నుంచి మార్కెట్‌కు చేరవేసేం దుకు రహదారుల నిర్మాణం జరిగింది. ఊరుమ్మడి అవసరాలను తీర్చే ఆస్తులు పెంపొందాయి. మోడీ సర్కార్ ప్రతిపాదించిన కొత్త చట్టం ఈ పునాదులను కూల్చివేసింది. ఉపాధి పనులను హక్కుల ఆధారి తం నుంచి పథకం ఆధారితం చేసింది. పరిమిత కేటాయింపులతో రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని మోపింది. దీనివల్ల ‘ఉపాధి హామీ’ డిమాండ్ ఆధారిత స్వభావాన్ని కోల్పోయింది.
మోడీ అనుయాయులకు మహాత్మా గాంధీ పేరు కూడా తీవ్ర అసహనాన్ని కలిగించింది. అందుకే, అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ చట్టాన్ని నీరుగార్చే కుట్రలు ఎన్నో చేశారు. నిధులు కోత పెట్ట డంతో పాటు, చేసిన పనికి కూలీ ఇవ్వకపోవడం, అనేక ఆంక్షలు విధించడం వంటి చర్యలకు దిగారు. చివరకు ఉపాధి హామీ చట్టం లక్ష్యాన్నే ధ్వంసం చేస్తూ, దానితో ఏ మాత్రం పోలిక లేని ‘విబిజి-ఆర్ఎఎంజిస ని రూపొందించారు. దీని ద్వారా చట్టం అమలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువస్తున్నారు. బిల్లులో పేర్కొన్న అంశాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రాల వాటాగా ఉన్న 10 శాతం మొత్తాన్ని 40 శాతానికి పెంచారు. ఈ ఒక్క చర్య వల్లే మన రాష్ట్రంపై నాలుగు వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అంచనా! ఇది 11 కోట్ల మంది కూలీల ఉపాధికి గండి కొడుతుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఎంత నిధి ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కేటా యింపును మించి ఖర్చు చేస్తే (పేదలకు పనులు కల్పిస్తే) ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అదేవిధంగా ఉపాధి కల్పించలేకపోతే పరిహారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాలి! దీని అర్ధం నిధులు సమకూర్చే బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం చట్టపరంగా తప్పుకోవడమే!
2022 నుంచి ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకానికి నిధుల కేటా యింపు తగ్గింది. పశ్చిమ బెంగాల్‌కు ఈ పథకం క్రింద నిధులే ఇవ్వలేదు. తమిళనాడు, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు అరకొర నిధులే అందాయి. ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ గణాంకాలు ఆ సంగతి చెబుతు న్నాయి. రాష్ట్రాలపై అదనపు భారం మోపితే పథకం నీరసిస్తుంది. రాష్ట్రాలకు కేటాయింపుల్లో కేంద్రం అనుసరించబోయే గీటురాళ్లేమిటో ఇంకా తెలియాల్సి ఉంది. తమకేం అవసరమో రాష్ట్రాలు నిర్ణయించు కోవటానికి బదులు ఎక్కడెక్కడ ఖర్చు చేయాలో కేంద్రం నిర్దేశిస్తుంది. వికేంద్రీకరణ అవసరం నానాటికీ పెరుగుతుండగా అందుకు భిన్నమైన కేంద్రీకృత మార్గం సమర్థనీయం కాదు. మొత్తానికి దీనివల్ల ఒరిగే దేమిటో, కష్టనష్టాలేమిటో మున్ముందు తెలుస్తాయి. బిల్లు ఉపసంహరించుకోవాలన్న విపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించుకున్నా, స్టాడింగ్ కమిటీకి పంపి అది తన చిత్తశుద్ధిని రుజువుచేసుకోవచ్చు. సభా ముఖంగా విస్తృతమైన చర్చలు జరిపి, తదనుగుణమైన మార్పుచేర్పులు చేసి, అన్ని పార్టీల మద్దతుతో బిల్లును గట్టెకించినప్పుడే ఈ భారీ ప్రజాసంక్షేమ పథకం విలువ, గౌరవం నిలబడతాయి. అసలు ఈ పథ కాన్నే రద్దు చేసి, అర్థం పర్థం లేని పేరుతో కొత్త పథకం తేవడం అప్రజాస్వామికమే కాదు, ప్రజా వ్యతిరేకం కూడా. ఈ పథకంలో ప్రజల్ని మభ్య పెట్టేందుకు 100 రోజుల పనిని 125 రోజులుగా మార్చామని చెబుతు న్నారు కాని అది మసిబూసి మారెడు కాయ చేయటమే. మోడీ తెస్తున్న పథకం ప్రకారం.. పని పొందటం పేదల హక్కు కాదు, కేంద్ర ప్రభుత్వపు దయాధర్మం కాదు. ఇది పేదల పట్ల, నిరుద్యోగుల పట్ల మనువాద హిందుత్వ ఫాసిస్టు సంఘ్ పరివార్ దృక్పథమని గ్రహించాలి.