ఈ రంజాన్ ఉపవాస మాసంలో మూడు నాలుగు ఇఫ్తార్ విందులకు పిలుపు వచ్చింది. అన్నిచోట్లా చిన్న చిన్న ఉపన్యాసాలు కూడా చేయవలసి వచ్చింది. అక్కడ నేను ‘ఈద్ ముబారక్’ అనడం కొంత చర్చకు దారి తీసింది. రెండు చోట్ల ఉపన్యాసానికి తోడుగా నేను ఎప్పుడో, సిఎఎ – ఎన్ఆర్ సి ఉద్యమం సందర్భంగా 2020 ఫిబ్రవరి 25న అనువాదం చేసి, నా ఫేస్ బుక్ వాల్ మీద పోస్టు చేసిన ఒక కవిత కూడా చదివాను. నిఖిల్ సచాన్ అనే ఉత్తరప్రదేశ్ కు చెందిన హిందీ కవి కవిత అది. ఐదు సంవత్సరాలుగా ఆ కవిత ఫేస్ బుక్ మీద ఉంది, రెండు మూడుసార్లు మళ్లీ పోస్ట్ కూడా అయింది. మొన్న 2024 డిసెంబర్ లో వెలువడిన నా అనువాద కవితా సంపుటం ‘నా ఆయుధం కవిత్వమే’ లో కూడా అచ్చయింది. కాని ఐదు సంవత్సరాలుగా జరగని సంచలనం ఈసారి జరిగింది.
మన సామాజిక వాతావరణంలో అసహన సంస్కృతి ఐదు సంవత్సరాల కిందటికీ ఇప్పటికీ పెరిగిపోయిందనడానికి ఈ రెండు అనుభవాలూ సూచనలు. ఈ రెండు సందర్భాల మీద మాట్లాడవలసి ఉంది. సంజాయిషీనో, వివరణో కాదు, వ్యక్తిగత సందర్భం నుంచి విడదీసి, విస్తరించి కొంత సామాజిక స్థితి, చరిత్ర, కొన్ని అవసరమైన విషయాలు చెప్పవలసి ఉంది.
*
‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అనీ, అన్ని మతాలూ దుర్మార్గమైనవే, దోపిడీ పీడనల మీద మేలి ముసుగులు కప్పేవే అనీ నమ్మేవాడినే అయినప్పటికీ, ప్రత్యేకంగా నాస్తికుడినీ మార్క్సిస్టునూ అయినప్పటికీ, ‘ఈద్ ముబారక్’ అని ఒక మత విశ్వాస ప్రకటన చేసే సామాజిక సందర్భంలో ఉన్నాను’ అని ఒక వివరణ అక్కడ వాచ్యంగానే చెప్పాను. నిజానికి ఈద్ ముబారక్ (పండుగ శుభప్రదంగా జరుగుగాక) అనేది మత విశ్వాస ప్రకటన కన్నా ఎక్కువగా ఒక సాంస్కృతిక సౌహార్ద చిహ్నం. అది ఎదురుగా ఉన్నవారిని, వారి అమాయక విశ్వాసాలను గౌరవించే ప్రకటన. ఒక మతస్తుల పండుగ సందర్భంగా వాడుకలో ఉన్న మాట కాబట్టి ఆ మతానికి చెందిన విశ్వాస ప్రకటన అనుకున్నా ఫర్వాలేదు.
దేనికైనా స్థల కాలాలుంటాయి. స్థల కాలాతీతమైనదేదీ లేదు. ఇవాళ ఒక మత విశ్వాసం ఉన్నవారిని ఆదరించడం, గౌరవించడం, సమానంగా చూడడం, వారి బాధిత స్థితిలో ఓదార్పు ఇవ్వడం, వారిలో విశ్వాసం కలిపించడం అత్యవసరమైన పనులు. హృదయం ఉన్న ఎవరైనా, తనను తాను మనిషిగా గుర్తించుకునే ఎవరైనా చేయవలసిన చేయగలిగిన పనులు. అందుకే ‘ఈద్ ముబారక్’ అన్నాను. ఇవాళ్టి భారత సమాజంలో ఒక మత విశ్వాసులకు ప్రత్యేకంగా ఆశ్వాసం ఇవ్వడానికి, ఇవ్వవలసి రావడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి.
ఒకటి, ఆ మతాన్ని, ఆ మత చరిత్రను, ఆ మతం భారత సమాజ చరిత్రకు అందించిన కానుకలను తుడిచేయడానికి ప్రభుత్వం వైపు నుంచి అధికారికంగానూ, సమాజంలో అనధికారికంగానూ పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ మతస్తుల మీద అనుమానమూ సందేహమూ భయమూ విషమూ విద్వేషమూ నింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన దేశ జనాభాలో పద్నాలుగు శాతంగా ఉన్న ప్రజలను మొత్తంగా అనుమానితులుగా, అస్పృశ్యులుగా, రెండో స్థాయి పౌరులుగా మార్చదలచుకున్న కుట్ర ఇది.
ఈ కుట్రకు ఇప్పుడు పాల్పడుతున్న బ్రాహ్మణ్యం అంతకు ముందు నుంచే మన సమాజంలోనే అత్యధిక సంఖ్యాకులను అస్పృశ్యులుగా, సేవకులుగా, బైటివారుగా చూసింది, చూపింది. నిచ్చెనమెట్ల వ్యవస్థ ఏర్పాటు చేసి వారిని అట్టడుగున పెట్టింది. ఆ చారిత్రక కుట్రకు కొనసాగింపే ఇవాళ్టి ప్రయత్నాలు. సమాజంలో సకల రంగాలలో పెరుగుతున్న సంక్షోభం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, పెరిగిపోతున్న ప్రజల సమస్యలకు కారణంగా ఏదో ఒక బూచిని చూపి, ఒక శత్రువును తయారు చేసి, ప్రజల అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది.
ఈ ప్రయత్నంలో భాగంగానే “వాళ్లు” “మనము” అనే విభజన తెచ్చి, ప్రచారం చేసి, “వాళ్ల” గురించి విషం నింపుతున్నారు. “వాళ్లను” భారత చరిత్ర నుంచి తొలగిస్తున్నారు. సమాజం నుంచీ, సంస్కృతి నుంచీ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
నిజానికి భారత సమాజపు బహుళత్వానికి, సహజీవన సౌహార్దానికి “వాళ్లు” ఒక నిదర్శనం. కనీసం వెయ్యి సంవత్సరాలుగా వాళ్లు భారత సమాజాలకు అందించిన కానుకలెన్నో ఉన్నాయి. ఒక అందమైన కవితామయమైన భాష, సంగీత, గాన, నృత్య సంప్రదాయాలు, అద్భుతమైన శిల్ప, వాస్తు కళలు, సున్నితమైన హస్తకళలు, రకరకాల ఆహారపదార్థాలు వంటి ఎన్నో అంశాలను “వాళ్లు” లేకుండా “భారత సంస్కృతి”లో ఊహించలేం.
కాని ఆ మతానికి చెందిన కొందరు దుర్మార్గ పాలకులను చూపి, వారి గురించి అబద్ధపు చరిత్రలు ప్రచారం చేసి, లేదా ఆ మతంలోని కొందరు “తీవ్రవాదులను” చూపి, ఆ మొత్తం సమూహాన్నే శత్రువుగా చూపే ఒక క్షుద్ర పన్నాగం వంద సంవత్సరాలకు పైగా మన సమాజంలో కోరలు చాస్తున్నది. అలా కొందరిని చూపి, ఒక కల్పిత వ్యక్తిత్వం తయారు చేసి, అది ఆ సమూహానికంతటికీ ఆపాదించవచ్చుననే సూత్రమే తీసుకుంటే, సమాజంలో ఏ ఒక్క సమూహపు చేతులూ రక్తం అంటకుండా లేవు.
మధ్య యుగాలలో పాలకుల వ్యక్తిగత మత విశ్వాసాలు ఏవైనా, పాలకులందరూ ప్రజలను దాదాపు ఒకేవిధంగా పీడించారు. ఒకే విధమైన పన్నులు వేసి దోపిడీ చేశారు. ఒకే విధమైన వెట్టి చాకిరీ చేయించుకుని పీడించారు. ఆ కాలంలో పాలకులు-పాలితులు, పీడకులు-పీడితులు, రాజు-ప్రజలు అనే విభజనలే తప్ప మత విభజనకు ఆస్కారం చాలా తక్కువ. తమ మతానికి చెందినా, పరమతానికి చెందినా ప్రజలను పీడించని రాజులు లేరు. ఆలయాలు సంపదకు కేంద్రాలుగా ఉండేవి కాబట్టి ఆలయాలను ధ్వంసం చేశారు. ఆలయ ధ్వంసాలకు మతం కారణం కాదు. కాని ప్రస్తుత సంఘ్ పరివారం ఆ పాలకులలో కొందరిని మత ప్రాతిపదిక మీద వేరు చేసి, వారివి మాత్రమే దుష్ట పాలనలు అన్నట్టు విషం నూరి పోస్తున్నది. హిందూ పాలకుల దుర్మార్గమైన పన్నులను, దోపిడీ, పీడనలను కనబడకుండా, వినబడకుండా చేస్తున్నది. ఆలయాలు ధ్వంసం చేయడంలో, సంపద దోచుకుపోవడంలో హిందూ రాజులు ఏ పాపమూ ఎరగనట్టు అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. చివరికి చిన్నారి పిల్లల చరిత్ర పాఠాలలో కూడా ఈ విషాన్నీ విద్వేషాన్నీ నింపుతున్నది. ఆధిపత్య మతంలో అనాచారాలూ దురాచారాలూ మూర్ఖత్వమూ మౌఢ్యమూ ఎంతమాత్రమూ లేనట్టు, అది అవతలి మతంలో మాత్రమే ఉన్నట్టు ఒక బూచిని, ఒక దిష్టిబొమ్మను, ఒక అబద్ధాన్ని తయారు చేసి అమాయక మెదళ్లలో నింపుతున్నది.
ఈ నేపథ్యంలో, ఆ చరిత్ర చెరిపివేతకు, ఉమ్మడి చరిత్రలో ఒక సమూహపు భాగస్వామ్యం రద్దుకు, అబద్ధ ప్రచారానికి, చిన్నచూపుకు, వివక్షకు గురవుతున్న మతస్తుల పక్షాన నిలబడడం ఒక చారిత్రక అవసరం. చరిత్ర విద్యార్థులుగా ఇది మన బాధ్యత. వారిలో, మిగిలిన అన్ని మతాలు పాటించేవారిలాగనే మూఢ విశ్వాసాలూ, మూర్ఖత్వమూ, సంకుచితత్వమూ ఉండవచ్చు. మతాధిపతులుగా, భగవంతునికి అనుసంధానంగా చెప్పుకునే ముల్లాలను అమాయకంగా నమ్ముతుండవచ్చు, హిందువులు బ్రాహ్మణ పురోహితులను, క్రైస్తవులు ఫాదరీలను, యూదులు రబ్బీలను నమ్మినట్టుగానే. వారి మనుగడ కలిపిస్తున్న అసంతృప్తితో వారిలో కొందరు నిరర్థక, అనర్థ హింసను ఒక మార్గంగా చూస్తుండవచ్చు. అయినప్పటికీ, ఒక జాతిగా వాళ్లనూ, వాళ్ల చరిత్రనూ, వాళ్ల కానుకలనూ తుడిచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు వారి పక్షాన ఉన్నామని ఆశ్వాసం కలిగించడం హృదయమూ మేధా ఉన్నవారి బాధ్యత.
రెండు, చరిత్ర నుంచీ, సామాజిక భాగస్వామ్యం నుంచీ తొలగించడం ఒక ఎత్తు అయితే, ఈ అబద్ధ ప్రచారం ఫలితంగా వాళ్ల మీద విపరీతమైన హింస జరుగుతున్నది. సంఘ్ పరివార్ పాలనలో గత పది సంవత్సరాలకు పైగా హింసకూ, వేధింపులకూ, వ్యాపారాల మీద దాడులకూ, ఆహారం మీదా, ఆహార్యం మీదా దాడులకూ, అవమానాలకూ, హత్యలకూ, హత్యా ప్రయత్నాలకూ, బుల్డోజర్ విధ్వంసానికీ గురవుతున్న బాధిత సమూహం అది. విస్తరిస్తున్న అసహన విష విద్వేష సంస్కృతిలో ఆ మతస్తుల మీద హింసా దౌర్జన్యమూ విస్తారంగా నిష్పూచీగా నిర్లజ్జగా, చాలా సందర్భాలలో అధికార మద్దతుతో జరిగిపోతున్నాయి. ఒక మొత్తం సమూహాన్నే భయభ్రాంతులను చేయడానికి, మొత్తంగా వారి వ్యక్తీకరణను, వారి స్థానాన్ని, వారి సామాజిక పాత్రను, వారి చరిత్రను, సంస్కృతిని తుడిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బహిరంగ ప్రజాజీవనం నుంచి వారిని అంచులలోకి నెట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఆ సమూహం ఇంకా ఇంకా ముడుచుకుపోయి, ఇంకా ఇంకా ముల్లాల గుప్పిటిలోకీ, మౌఢ్యం లోకీ వెళ్లిపోయేలా చేసే ప్రయత్నం జరుగుతున్నది.
ఒక పెద్ద సమూహాన్ని లక్ష్యంగా చేసుకుని మన కళ్ల ముందర ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించడం, ధిక్కరించడం మనుషులుగా మన మానవీయ బాధ్యత. బలవంతులకూ బలహీనులకూ మధ్య బలహీనుల పక్షం తీసుకోవడం, పీడకులకూ పీడితులకూ మధ్య పీడితుల పక్షం తీసుకోవడం, దౌర్జన్యకారులకూ బాధితులకూ మధ్య బాధితుల పక్షం తీసుకోవడం, హంతకులకూ మృతులకూ మధ్య మృతుల పక్షం తీసుకోవడం ఒక మానవీయ స్పందన. ఇవాళ మన సమాజంలో ఒక సమూహాన్ని బలహీనులుగా, పీడితులుగా, బాధితులుగా, హతులుగా మార్చడానికి ప్రయత్నం జరుగుతున్నది గనుక ఆ సమూహం పక్షం తీసుకోవడం, ఆ పక్షానికి ఆశ్వాసాన్ని అందించడం, ఆ పక్షం ఒంటరులు కాదని నమ్మకం ఇవ్వడం ఒక మానవీయ బాధ్యత.
అందులో భాగమే వారి పండుగ సందర్భాన వారికి శుభాకాంక్షలు తెలపడం.
ఇప్పుడు ఈద్ ముబారక్ చెపుతున్నవారు రేపు శ్రీరామనవమికి శుభాకాంక్షలు తెలుపుతారా అనేది తెలివైన ప్రశ్న కావచ్చు, తాము మత రహితులమనీ, అన్ని మతాలనూ సమానంగా చూస్తున్నామనీ అనుకుంటూ ఆ అమాయకపు పోటీ పెడుతుండవచ్చు. కాని చరిత్రా వర్తమానమూ సరిగా అర్థం చేసుకుంటే ఆ రెంటినీ సమానం చెయ్యడం కుదరదని తెలుస్తుంది. అన్ని మతాలూ సమానమే అయినప్పటికీ, మిగిలిన మతాలు కాలక్రమంలో రాజ్యంతో, సంపదతో హింసతో చేరి ఎంత చెడిపోయినప్పటికీ, అవి కనీసం మౌలికంగా భగవంతుని ఎదుట అందరూ సమానమే అని చెప్పాయి. హిందూ మతం (అనేదొకటి ఉంటే, ఎందుకంటే ఉన్నది బ్రాహ్మణాధిక్య, మనుభావజాల మతమే) మాత్రం అసమానతను దైవదత్తం అని పవిత్రీకరించింది. కొందరు ముఖం నుంచీ, కొందరు భుజాల నుంచీ, కొందరు తొడల నుంచీ పుట్టారనీ, వారికి సేవ చెయ్యడానికే ఇతరులందరూ పాదాల నుంచి పుట్టారని స్వయంగా భగవానువాచ. ఇంతగా అసమానతను జీర్ణించుకున్న మతం మరేదీ లేదు. అలాగే ఆయా మతాలు కాలక్రమంలో హింసకు పాల్పడిన చరిత్ర ఉంది గాని, స్వయంగా భగవంతుని అన్ని రూపాలూ చేతుల నిండా ఆయుధాలు ధరించి ఉండడం, హింస చేయడానికి వెనుకాడకు అని స్వయంగా భగవంతుడే చెప్పడం ఈ మతంలోనే ఉంది.
ఈ మతంలో చాలా పండుగలు ఆ అసమానతను, హింసను ఎత్తిపట్టేవే. తప్పకుండా ఈ మతంలో కూడా చాలా పండుగలు సామూహిక వేడుకలుగా, సంస్కృతీ పరంగా మొదలయ్యే ఉంటాయి. వ్యవసాయోత్పత్తులు ఇల్లు చేరే వేడుక, ఆహ్లాదకరమైన వసంత రుతు ఆగమన వేడుక వంటి నైసర్గికమైన సాంస్కృతిక పండుగలు ఉన్నాయి. శత్రు సంహారాన్ని వేడుకగా జరుపుకునే పండుగలున్నాయి. (అక్కడ ఆ శత్రువులు, అసురులు ఎవరి శత్రువులు, ఆనాటి ప్రజల శత్రువులా, పాలకుల శత్రువులా, వారి సంహారాన్ని ప్రజలందరి సంస్కృతీ పరమైన వేడుకగా ఎవరు మార్చారు అనే ప్రశ్నలు ఉండనే ఉంటాయి). ఏదో ఒక సందర్భాన్ని కల్పించి పురోహితవర్గాలు సృష్టించిన పండుగలున్నాయి. వీటన్నిటిలో తప్పనిసరిగా ఆదిమకాలాన సామూహిక కలయిక, వేడుకలు మాత్రమే ఉండి ఉంటాయి. కాని కాలక్రమంలో వాటికి చెరపడం అసాధ్యమూ కష్టసాధ్యమూ అయినంత బ్రాహ్మణ్యపు మకిలి అంటుకుని ఉంది. ఆ సంస్కృతీపరమైన వేడుకల నుంచి మత మురికిని వదిలించడం చాలా పెద్ద పని. అది చేయవలసిన పనే అనడంలో సందేహం లేదు. ప్రజల సామూహిక సాంస్కృతిక వేడుకలను గౌరవిస్తూ వాటిలోని మత ప్రమేయాన్ని తొలగించ వలసిందే. కాని అది ఇవాళ్టికివాళ సాధ్యమయ్యే పని కాదు. ఈ వివరణంతా ఉగాది, సంక్రాంతి వంటి నైసర్గిక పండుగలకు, దసరా, దీపావళి వంటి మతపరమైన పండుగలకు సరిపోవచ్చు గాని, మిత్రులు అడిగిన శ్రీరామనవమి, వినాయక చవితి వంటి కాల్పనిక, ‘గోబ్రాహ్మణ ప్రీత్యర్థం’ జరిపే పండుగలకు, వరలక్ష్మీ వ్రతం వంటి పురుషాధిపత్య పండుగలకు సరిపోయేది కాదు.
నిజానికిది సంస్కృతికీ మతానికీ మధ్య సంబంధం అనే విశాల చర్చలో భాగం. మన జన జీవన సంస్కృతిని మతమూ మూఢనమ్మకాలూ ఆధిపత్య శక్తుల ఆర్భాటాలూ మోసాలూ కమ్మేశాయి. ఆ పని ప్రపంచమంతా జరిగింది. మన సమాజంలోనూ జరిగింది. అశేష జన బాహుళ్యం నిత్యజీవితంలో అనుసరించే సంస్కృతిలో పాలకవర్గాలు రుద్దిన మతమూ, ఆచారాలూ, తంతులూ, మూఢ నమ్మకాలూ, హేతు రహితమైన అంశాలూ ఎన్నో వచ్చి చేరాయి. జన సంస్కృతిని దురాక్రమించాయి. ప్రజా సంస్కృతి అనే అమాయక శిశువు ఇవాళ మతం మురికి నీటి, నిలువ నీటి గుంటలో ఊపిరి సలపని స్థితిలో ఉన్నది. ఇంగ్లిష్ నుడికారంలో చెప్పినట్టు ఈ స్నానపు మురికి నీటిని పారబోసి శిశువును కాపాడగలమా, మురికి నీటితో పాటు శిశువును కూడా పారేద్దామా అనేది అసలు సమస్య.
*
మరొక వివాదం నిఖిల్ సచాన్ హిందీ కవితకు నేను చేసిన అనువాదం. కొందరు కళాకారుల, ప్రముఖుల పేర్లతో బురిడీ కొట్టించి, ఒక మత ఛాందసాన్ని సమర్థించే ప్రయత్నమని, తీవ్రవాదాన్ని సమర్థించే ప్రయత్నమని విమర్శలు వచ్చాయి. కవి మీదా అనువాదకుడి మీదా విరుచుకుపడ్డారు, వారికి సహజమైన బూతులు కూడా తిట్టారు. అలాగే “భగవంతుడు సృష్టించిన ముసల్మాన్లు” అనడం సరైనదేనా అని కొన్ని వ్యక్తీకరణలను కూడా మిత్రులు ప్రశ్నించారు. మిత్రులొకరు మరి కొంత ముందుకు వెళ్లి, “హిందూ” కళాకారులు, ప్రముఖుల పేర్లతో ఒక పారడీ కూడా రాశారు.
ఆ కవితను గాని, ఆ కవిత చెప్పదలచిన భావాన్ని గాని విమర్శించడానికి ఎవరికైనా ప్రజాస్వామిక అధికారమూ హక్కూ ఉన్నాయి. కాని ఆ పని చేయడానికి ముందు ఆ కవిత మౌలిక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. మన సమాజంలో చాపకింద నీరులా వ్యాపించిన సంఘ్ పరివార భావజాలపు ప్రభావం వల్ల ముస్లింలు అనగానే ఒక అనుమానం, భయం, వ్యతిరేకతతో కూడిన అభిప్రాయం ఉందనేది ఒక వాస్తవం. ఆ అభిప్రాయం హేతుబద్ధమూ వాస్తవమూ కాదని చెప్పడమే ఇక్కడ కవి ఉద్దేశం. ముఖ్యంగా సిఎఎ – ఎన్ ఆర్ సి ఉద్యమ నేపథ్యంలో వారి మీద ఉండిన ఆ నిర్హేతుక అభిప్రాయం ఎంత బోలు సరుకో చెప్పడానికి కవి ప్రయత్నించారు.
నిజానికి ఆ కవిత సాధారణ ముస్లింలకూ, పత్రికలూ ఛానళ్లూ రాజకీయాలూ సృష్టించిన “ముస్లిం” అనే ప్రతీకకూ మధ్య ఉన్న అంతరాన్ని చెప్పడానికి, అసలు వాస్తవానికీ ఈ కల్పిత ప్రతీకకూ సంబంధమే లేదని చూపడానికి ప్రయత్నించింది. ఎవరైనా ఒకరు తమ జీవితంలో తమకు కలిసిన, పరిచయమైన పది మంది ముస్లింలను, వారి పట్ల ప్రచారంలో ఉన్న ప్రతీకను పోల్చి చూస్తే ఆ కవిత ప్రాసంగికత అర్థమవుతుంది. ఎవరికి వారికి తమ పరిచయస్తులలో పోల్చి చూస్తే బైట పడే ఈ అంశాన్ని, ఆ పరిచితుల పేర్లతో చెపితే అందరికీ అందదు గనుక, కవి ఎంచుకున్న ప్రక్రియ అందరికీ తెలిసిన పేర్లతో చెప్పడం.
హిందువుల గురించి అటువంటి ప్రతీక సృష్టియే జరగలేదు గనుక “హిందూ ప్రముఖుల” పేర్లతో చెప్పే ఆ పారడీకి అర్థమే లేదు. హిందువులలో కూడా భయపడవలసిన వ్యక్తులూ సంస్థలూ ఉన్నప్పటికీ, సమాజంలో హిందువులంటే భయపడే పరిస్థితి ఏమీ లేదు. అటువంటి ప్రతీకల సృష్టి ఏమీ జరగలేదు. కాని కొందరు వ్యక్తులనూ కొన్ని సంస్థలనూ చూపి, ముసల్మాన్లంటే భయపడే పరిస్థితి, ఒక ముసల్మాన్ బూచి తయారు చేసి పెట్టారు. అందువల్ల ఈ కవిత అత్యవసరమూ ప్రాసంగికమూ అవుతున్నది.
చాలా బాగా రాసారు. నాకు ఓపిక లేక వదిలేసాను.