ఇరాన్‌పై అమెరికా యుద్ధం

[ఈ వ్యాసం యుద్ధ సాన్నహక కాలంలో (అంటే వారం క్రితం) “కొలిమి”కి అందింది. ప్రచురించే సమయానికి అమెరికా-ఇజ్రాయిల్ కూటమి ఇరాన్ మీద సామ్రాజ్యవాద యుద్ధాన్ని మొదలుపెట్టాయి]

నైతిక ప్రమాణాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటానంటూ తాజాగా సెలవిచ్చిన‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను గొప్ప ధర్మమూర్తిగా అభివర్ణించుకున్నాడు. కానీ, ఆయన మాటలకూ చేతలకూ పొంతన ఉండదన్నది జగమెరిగిన సత్యం. ట్రంప్ ప్రపంచ ఆధిపత్య విధానాల్లో భాగంగా అనేక దేశాల్లోని సహజ వనరులను తరలించుకుపోవడానికి అడ్డంకిగా ఉన్న ఆయా దేశాల పాల‌కులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు చేస్తున్నాడు. చమురు నిక్షేపాలను కొల్లగొట్టడమే లక్ష్యంగా వెనిజులాపై దండెత్తిన ట్రంప్-అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించి ఆ దేశాధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని అమెరికా జైళ్లో బంధించాడు. తద్వారా పశ్చిమార్ధ గోళం అమెరికా హక్కుభుక్తమని, చైనా రష్యా సహా మరెవరికీ అక్కడ తావులేదని తేల్చి చెప్పాడు. తన ఏలుబడిలో అమెరికా అంటే అందరూ భయపడే లా చేశానని జబ్బలు చరుచుకుంటున్న ట్రంప్ ఆధిపత్య భావజాలంతో ప్రపంచాన్ని మళ్లీ వలసవాద యుగంలోకి లాక్కుపోతుండటం కలవరపరుస్తున్న‌ది.

ట్రంప్ చేస్తున్న యుద్దోన్మాద చ‌ర్య‌ల‌తో మ‌ధ్య ప్రాచ్యంలో యుద్ధ ఛాయలు అలుముకుంటున్నాయి. వెనిజులాపై దురాక్రమణకు పాల్పడటమే కాదు. ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన ట్రంప్ తన ఆధిపత్యం చాటడానికి సంకేతాలు పంపాడు. వెనిజులా డ్రగ్స్ సరఫరా చేస్తున్నదంటూ… అక్కడి చమురు నిక్షేపాలపై కన్నేసిన ట్రంప్‌ ఇప్పుడు ఇరాన్ యురేనియం శుద్ధి మొదలుపెడితే దాడి చేస్తామని బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పెద్దసంఖ్యలో అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ దిశగా కదులుతున్నాయని ట్రంప్ వెల్లడించగా, తమ వేలు ట్రిగ్గర్‌పైనే ఉందని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జిసి) హెచ్చరించింది. మ‌రో వైపు గాజా ఇంకా తల్లడిల్లుతూనే ఉంది. యుక్రెయిన్ వాసులు ఎప్పుడేమి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియక భయం భయంగా బతుకీడుస్తున్నారు. ఇవి సద్దుమణగకుండానే ఇరాన్‌పై సైనిక దురాక్రమణకు దిగి పశ్చిమాసియాలో మరో యుద్ధక్షేత్రాన్ని తెరవాలని అమెరికా అధ్యక్షుడు తహతహలాడుతున్నాడు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తన మాట విననందుకు పగబట్టారు. ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను రెచ్చగొడుతున్నాడు. ప్రభుత్వం మారాలంటున్నాడు. ఇరాన్‌లో నిరసన కారులను అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆపకపోతే సైనిక చర్య తప్పదని ట్రంప్ ఇదివరకే హెచ్చరించాడు. నెలరోజులుగా ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల్లో ఇంతవరకూ 2,500 మంది మరణించినట్టు అమెరికా పేర్కొన్న‌ది. అయితే, అమెరికా ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఈ నేప‌థ్యంలోంచే ఇరాన్‌పై ఏ క్షణంలోనైనా దాడి చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇరాన్ సరిహద్దుల్లో నౌకల‌ను మోహరించింది. పైగా అతిపెద్ద యుద్ధ బ‌ల‌గాన్ని ఇరాన్ దిశగా కదిలించినట్లు స్వయంగా ట్రంప్ ప్రకటించాడు. కాగా, ఇరాన్ కూడా అమెరికా దాడిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఈ రెండు దేశాలు యుద్ధానికి దిగితే మొత్తం ఈ ప్రాంతం నాశనం అయ్యే ప్రమాదం ఉంది.

ఇరాన్‌పై యుద్ధమేఘాలు :
ఇజ్రాయెల్ భద్రత, గల్ఫ్ చమురు మార్గాలు, ప్రపంచ ఇంధన ధరలు ఈ ఉద్రిక్తతతో నేరుగా ముడిపడి ఉన్నాయి. అణ్వస్త్రాల ముప్పు పేరుతో ఇరాన్‌పై ఒత్తిడి పెడుతున్న అమెరికా వైఖరి వెనుక ప్రాంతీయ ఆధిపత్య చమురు రాజకీయాలున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ఒకసారి యుద్ధం మొదలైతే అది ఇరాన్‌తో మాత్రమే ఆగదన్న భయం ప్రపంచాన్ని వెంటాడుతోంది.

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (డబ్య్లూఈఎఫ్) సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరే ముందు మీడియాకు కీలక వివరాలను వెల్లడించాడు. అమెరికా సైన్యం పెద్దసంఖ్యలో యుద్ధ నౌకలు గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ వైపుగా కదులుతోందని అన్నారు. ఏమీ జరగకుండా ఆపడమే తనకు ఇష్టమని, తాము ఇరాన్‌ను చాలా నిశితంగా పరిశీలిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నాడు. ఇరాన్‌ను కట్టడి చేయడానికి ఈ మోహరింపు తప్ప, సైనిక చర్య కోసం కాదని అంటున్నాడు. ఒకవేళ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఇరాన్ మళ్లీ మొదలుపెడితే, అమెరికా తప్పక స్పందిస్తుందని ఆయన అంటున్నాడు. ఇరాన్‌లోని ఏ ప్రదేశంలో యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించినా, అక్కడికి వెళ్లి దాడి చేస్తామని హెచ్చ‌రిస్తున్నాడు.

అమెరికా ఇరాన్ మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు ఆచరణలోకి రానుంది. అమెరికాకి చెందిన భారీ నౌకాదళం ఇప్పటికే ఇరాన్ సరిహద్దులకు చేరుకుంది. ఇదంతా ట్రంప్ ఆదేశాల ప్రకారమే జరుగుతోంది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఏం జరుగుతుందో చూద్దామని ఆయన పరోక్షంగా దాడి సమాచారాన్ని వెల్లడించారు. ఇరాన్‌లో వందలాది మందికి ఉరి శిక్షలు విధించారనీ, త‌మ‌ ఒత్తిడి కారణంగానే ఆ శిక్షలను రద్దు చేశారని ఆయన చెప్పుకొస్తున్నాడు. ఇరాన్ ప్రజలపై అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న కిరాతక విధానాలకు వ్యతిరేకంగానే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తున్నట్టు ఆయన బొంకుతున్నాడు. తాను ఎనిమిది యుద్ధాలను ఆపానని ట్రంప్ చెప్పడంలో ఎంత నిజముందో, ఇరాన్‌లో 800 పైగా ఉరిశిక్షలను ఆపానంటూ చేస్తున్న ప్రకటనల్లో కూడా అంతే నిజం ఉందని ఇరాన్ ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేశాయి. అమెరికాలో పరిస్థితులు యావత్ ప్రపంచం గమనిస్తోందని ఖొమేని అన్నారు. తమ ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో ఎవరి సలహాలు, సహాయం తాము తీసుకోదల్చుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

అమెరికాకు చెందిన అతి పెద్ద విమాన వాహక నౌక ఇరాన్ చేరనున్నట్టు అంతర్జాతీయ మీడియా వర్గాల కథనం. అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా ఇరాన్ సరిహద్దులకు తరలించన్నుట్టు వైట్‌హౌస్ వర్గాలు తెలియజేశాయి. ఇరాన్‌పై దాడికోసమే ఈ నౌకల తరలింపు జరుగుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అతి పెద్ద విధ్వంసక నౌక యూఎసఎస్ అబ్రహాం లింకన్ ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి ముందుకు సాగినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నౌకను పశ్చిమాసియాకు పంపడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కూడా పేర్కొన్నాయి. తాను ఎన్ని హెచ్చరికలు చేసినా ఇరాన్‌లో ఆందోళనకారులపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నందుకు ట్రంప్ కోపానికి కార‌ణ‌మ‌ట‌! ఇరాన్‌లో ఖొమేని నాయకత్వం వైదొలగితే కానీ, అక్కడ శాంతి నెలకొనదని ఆయన చెప్పుకొస్తున్నాడు.

మధ్యప్రాచ్యంలో అమెరికా తన సైనిక బలగాలను మరింతగా పెంచింది. ఫిబ్రవరి 17న రెండవ దఫా చర్చలు జరుపుతూనే ఇరాన్ ప్రాంతానికి యాభై ఫైటర్ జెట్ విమానాలను పంపింది. ఒకవైపు ఇరాన్ అణు కార్యక్రమంపై జెనీవాలో చర్చలు జరుగుతున్న సమయంలోనే మరోవైపు అగ్రరాజ్యం యుద్ధ సన్నాహాలు చేసుకుంటోంది. మధ్యప్రాచ్యంలో వైమానిక, నౌకా సామర్థ్యాన్ని పెంచేందుకే ఈ చర్య తీసుకున్నామని అమెరికా అధికారులు తెలిపారు. ఎఫ్-22, ఎఫ్-35, ఎఫ్-16 యుద్ధ విమానాలు ఆ ప్రాంతం దిశగా కదులుతున్నాయని స్వతంత్ర ప్లయిట్ ట్రాకింగ్ డేటా, సైనిక ఏవియేషన్ మానిటర్స్ చెబుతున్నాయి. వీటితో పాటు యుద్ధ విమానాలకు అవసరమైన ఇంధనాన్ని నింపుకొని కొన్ని ట్యాంకర్లు కూడా ఆ ప్రాంతానికి చేరుకుంటున్నాయి. ఒక్క రోజులో యాభైకి పైగా యుద్ధ విమానాలు మధ్యప్రాచ్యానికి తరలి వెళ్లాయని అమెరికా అధికారి ఒకరు ఆక్సియాస్ వార్తా సంస్థకు తెలియజేశారు. ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన యూఎసఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్ యుద్ధ విమాన వాహక నౌక కరేబియన్ నుంచి బయలుదేరింది. ఈ నౌకతో పాటు మూడు క్షిపణి విధ్వంసక నౌకలు.. యూఎస్ఎస్ మహాన్, యూఎస్ఎస్ బెయిన్‌బ్రిడ్జ్, యూఎసఎస్ విన్‌స్టన్ చర్చిల్ కూడా ప్రయాణిస్తున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని నౌకాదళ అధికారి ఒకరు చెప్పారు. యుద్ధ విమాన వాహక నౌక యూఎసఎస్ అబ్రహం లింకన్‌తో పాటు మరికొన్ని నౌకలు, విమానాలు ఇప్పటికే మధ్యప్రాచ్య జలాలలో మోహరించి ఉన్నాయి.

హార్ముజ్ జలసంధిలో ఇరాన్, రష్యా సైనిక విన్యాసాలు :
అమెరికా దూకుడుకు విరుగుడుగా.. రష్యా, చైనా ఇరాన్ దేశాలకు చెందిన నౌకా దళాలు హార్ముజ్ జలసంధి చుట్టూ ఉన్న జలాలలో యుద్ధ నౌకలను మెహరించి సైనిక విన్యాసాలకు సిద్ధమయ్యాయి. ఈ జలసంధి పర్షియన్ సింధుశాఖ నుంచి మహా సముద్రాలలోకి దారితీసే ఏకైక సముద్ర మార్గం. ఇది ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మక ప్రాంతాలలో ఒకటి. దీనికి ఉత్తర తీరంలో ఇరాన్, దక్షిణ తీరంలో యూఎఇ, ముసందమ్, ఒమన్ ఉన్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన సైనిక బలగాలను మోహరిస్తున్న నేపథ్యంలో రష్యా, చైనా, ఇరాన్ ఈ మూడు దేశాలు హార్ముజ్ జలసంధిలో విన్యాసాలు జరపబోతున్నాయి. సముద్ర కార్యకలాపాల సమన్వయాన్ని బలోపేతం చేసుకునేందుకు, వాణిజ్య నౌకా మార్గాలను రక్షించుకునేందుకు ఇరాన్ నేతృత్వంలో విన్యాసాలు చేపడతామని రష్యా అధ్యక్షుని సలహాదారు నికొలే పాత్రుషెవ్ చెప్పారు. రష్యాకు చెందిన ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాత్రుషెవ్ మాట్లాడుతూ వైమానిక సిబ్బంది, లాజిస్టిక్ నౌకలు, నౌకాదళ విమానయాన దళాలు విన్యాసాలలో భాగస్వాములవుతాయని తెలిపారు.

క‌మ్ముకొస్తున్న యుద్ధ‌మేఘాల‌ను ప్రపంచం మౌనంగా వీక్షిస్తూ ఉండగలదా? ఇది అమెరికా సొంత వ్యవహారం కాదు. యుద్ధం వల్ల నష్టపడేది కేవలం ఇరాన్ ఒక్కటే కాదు. యుద్ధానికి అమెరికా చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇరాన్ దగ్గర అణ్వాయుధానికి తోడ్పడే శుద్ధి చేసిన యురేనియం నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నది అందులో ఒకటి. ఇది ప్రపంచ శాంతికి ముప్పు తెస్తుందని అమెరికా వాదన. ఇజ్రాయెల్ దగ్గర అమెరికా మోహరించిన అణ్వాయుధాలున్నాయి. అది ఇరుగు పొరుగు దేశాలపై అమెరికా కోరుకున్నప్పుడల్లా దాడులు చేస్తోంది. గాజాను వల్లకాడు చేసింది చాలక, అక్కడి వార్తలు బయటి ప్రపంచానికి తెలియకుండా వందల సంఖ్యలో పాత్రికేయులను హతమార్చింది. అందుకే అక్కడేం జరుగుతున్నదో ప్రస్తుతం తెలియటం లేదు. ఇరాన్‌పై దాడులకు తన సైనిక స్థావరం వాడుకోవద్దని బ్రిటన్ చెప్పింది. గల్ఫ్ దేశాలు, వేరే దేశాలు సైతం ఆ మాటే చెప్పాలి. రష్యా, చైనాలు సైతం ఇరాన్‌కు అనుకూలంగా ఈ వివాదంలోకి దిగితే మున్ముందు ఇది ప్రపంచయుద్ధంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే అమెరికా ప్రతినిధుల సభ మౌనం వహించకూడదు. దాని అనుమతి లేనిదే ట్రంప్ అడుగు ముందుకేయలేరు. కాగల కార్యం ట్రంప్ నెరవేరుస్తారని కలగంటున్న డెమోక్రాట్లు మౌనం వీడకపోతే చరిత్ర క్షమించదు.

అణు ఒప్పందం చేసుకుని తీరాలి :
అమెరికా- ఇరాన్ మధ్య ఉన్న వివాదం నానాటికీ ముదురుతున్న‌ది. తమతో అణు ఒప్పందం చేసుకుని తీరాల్సిందే అని ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. అయితే, ఈ అంశంపై ఇరాన్ కొన్ని షరతులు విధించింది. ఒకవైపు ఒప్పందంపై చర్చలు అంటూనే… రెండు దేశాలూ యుద్ధ సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. 10 రోజుల్లో ఇరాన్ తమతో అణు ఒప్పందం చేసుకుని తీరాలని అల్టిమేటమ్ ఇచ్చాడు. ఒకవేళ ఈలోగా ఒక ఒప్పందానికి రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. “ఇరాన్‌తో అణు ఒప్పందం అంత సులభం కాదని కొన్నేళ్లుగా అర్థమైంది. అయితే, మేం తప్పకుండా అణు ఒప్పందం చేసుకుని తీరాలి. లేకుంటే ఇరాన్ విషయంలో ఎలాంటి పరిణామాలైన జరగవచ్చు. పది రోజుల్లో సరైన ఫలితం కనిపించాలి” అని ట్రంప్ వ్యాఖ్యానించాడు. ఇదే సమయంలో ఇరాన్ కూడా తన ఆయుధాల్ని సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అణ్వాయుధాల విషయంలో ఇటీవలే జెనీవాలో ఇరాన్ అమెరికా మధ్య కొన్ని చర్చలు జరిగాయి. ఇరాన్ అణ్వాయుధాల తయారీని ఆపాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. కానీ, దీనిపై చర్చించేందుకు ఇరాన్ నిరాకరించింది. ఇదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్‌పై దాడి చేస్తాయనే ప్రచారం జరుగుతోంది.

అటు చర్చలు – ఇటు యుద్ధ సన్నాహాలు :
ఓ పక్క చర్చ‌లు… మరోపక్క దేనికైనా సిద్ధమన్నట్లు అమెరికా, ఇరాన్ వ్యవహార శైలి ఉంది. జెనీవా వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 27న 3వ దఫా చర్చలు జరిగాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాప్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చలు మూడు గంటల్లోనే ముగిశాయి. ఇవి ఒమన్ మధ్యవర్తిత్వంతో జరిగినట్టు సమాచారం. మరోవైపు చర్చలు జరుగుతున్న సమయంలోనే హార్ముజ్ జలసంధిలో ఇరాన్ సైనిక విన్యాసాలు చేపట్టింది. అందుకోసం కొన్ని గంటల పాటు జలసంధిని మూసివేసింది. అంతేకాకుండా లైవ్ క్షిపణులను ప్రయోగించింది. తద్వారా ఎన్నో దేశాల ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన అంతర్ౙాతీయ జలమార్గం హార్ముజ్‌పై తమకు పట్టు ఉందనే పరోక్ష సందేశాన్ని అమెరికాకు ఇరాన్ పంపింది. హార్ముజ్ జలసంధి వద్ద తాము చేస్తున్న సైనిక విన్యాసాల ప్రభావం అమెరికాతో జరుపుతున్న చర్చలపై పడుతుందని ఇరాన్ భావిస్తోంది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి.

తాజా అణు చర్చలు మిశ్రమ ఫలితాలు ఇచ్చాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇరానియన్లు అంగీకరించడానికి సిద్ధంగా లేని కొన్ని కఠినమైన షరతులను ట్రంప్ నిర్దేశించినట్లు తెలిపారు. అమెరికా ఇంకా దౌత్యపరమైన పరిష్కారాలనే ఇష్టపడుతుందని అంటూనే.. తమ అధ్యక్షుడి వద్ద మరిన్ని ఎంపికలు ఉన్నాయంటూ హెచ్చరికలు చేశారు. చర్చలకు ముందే రెండు దేశాల అధినేతలు హెచ్చరికలు చేసుకున్న సంగతి విధితమే. తదుపరి దశలో జరిగే చర్చల్లో సహేతుక వైఖరి అవలంబించాలని ఇరాన్‌కు సూచించారు. గతేడాది జూన్‌లో జరిగిన బి-2 బాంబు దాడిని గుర్తు చేశారు. దీనికి ప్రతీగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేని కూడా ఘాటుగా స్పందించారు. ప్రపంచంలో బలమైన సైన్యానికైనా ఒక రోజు దెబ్బ తగిలితే తిరిగి లేచే అవకాశం ఉండకపోవచ్చని ఆయన హెచ్చరించారు. అమెరికా నౌకాదళ ఉనికిపై వ్యాఖ్యానిస్తూ, సముద్రంలో యుద్ధనౌకలు ఉన్నా వాటిని ముంచగల ఆయుధాలు మా దగ్గర ఉన్నాయని హెచ్చరించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా వరుసగా పోస్టులు చేశారు.

ట్రంప్ హెచ్చరికలకు బెదరని ఇరాన్ :
అమెరికా బెదిరింపులకు ఇరాన్ ఏ మాత్రం లొంగటం లేదు. అమెరికాకు దీటుగానే బదులిస్తోంది. యుద్ధం తప్పదనుకుంటే దానిని ఎదుర్కోవడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ ప్రతిస్పందిస్తోంది. సవాళ్లు, ప్రతిసవాళ్ల నడుమ ఇరు దేశాలు ఇప్పటికే యుద్ధానికి దాదాపు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా యుద్ధ సామాగ్రిని ఇరాన్ సమీపంలో మోహరిస్తుండగా యూఎస్ ఆయుధాలకు గట్టి జవాబిస్తామని ఖొమేని అంటున్నారు. “ఈసారి మా దేశంపై అమెరికా దాడి చేస్తే ఊరుకోం. పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న అన్ని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తాం. అమెరికా ప్రభావం కలిగిన అన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటాం. అమెరికా విషయంలో మా ప్రతిదాడిని ధర్మబద్ధమైందిగా, సక్రమమైందిగా పరిగణించాల్సి ఉంటుంది. అమెరికా ఆచితూచి స్పందిస్తే మంచిది” అని ఇరాన్‌కు చెందిన హై ర్యాంగింగ్ మిలిటరీ అధికారి జనరల్ అలీ అబ్దుల్లాహీ ఆలియాబాదీ హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమేని నుంచి ఆదేశాలు అందిన మరుక్షణమే తాము శత్రువులపై విరుచుకుపడతామని తేల్చి చెప్పారు.

ముగింపు :
ఇరాన్‌తో యుద్ధం మధ్యప్రాచ్యంలోనే కాదు.. దాని ప్రభావం అమెరికా పైనా ఉంటుందని యూఎస్ జనరల్ డాన్ కెయిన్ హెచ్చరిక చేసినట్టు లీకులు వచ్చాయి. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్, ఎయిర్ ఫోర్స్ జనరల్ డాన్ కెయిన్ ఇరాన్‌పై దాడులు ప్రమాదకరమని చెప్పినట్టు యూఎస్ మీడియా కథనాలు వెలువర్చింది. అది అమెరికాను దీర్ఘకాలిక సంఘర్షణలోకి లాగవచ్చని హెచ్చరించారని కూడా వివరించింది. జనరల్ కెయిన్‌తో పాటు ఇతర పెంటగాన్ అధికారులు అంతర్గత సమావేశాలలో ఇరాన్‌పై యూఎస్ సైనిక చర్య ప్రమాదాల గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తారని ఆక్సియోస్, ది వాషింగ్టన్ పోస్ట్‌తో సహా పలు మీడియా సంస్థలు నివేదించాయి. అందువల్ల ఇరాన్‌పై అమెరికా నిర్ణీత మెరుపు దాడులకు పరిమితం కావడం, ఈ క్రమంలో ఇరాన్ నేత అయతుల్లా ఖొమేనిని, ఆయన కుమారుడు మొజ్తాబాను అంతం చేయడం ట్రంప్ వ్యూహాత్మక ఎత్తుగడ అని అమెరికా వార్తా సంస్థ ఆక్సియోస్ తెలిపింది. ఈ వార్తలను మొదట నివేదించిన ఆక్సియోస్.. ట్రంప్ అంతర్గత వర్గాలలోని అనేక మంది వ్యక్తులలో కెయిన్ ఒకరని పేర్కొంది. కెయిన్‌తో పాటు పెంటగాన్ అధికారులు అధ్యక్షుడిని జాగ్రత్తగా ముందుకు సాగాలని కోరారని కథనాలు వివరించాయి. ఈ యుద్ధ స‌న్నాహాలు, బెదిరింపుల మాట‌లు, ప్ర‌తి స్పంద‌న‌లు అన్నీ చూస్తే.. యుద్ధం త‌ప్ప‌ని ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి. ఈ స్థితిలో శాంతికాముక ప్ర‌పంచ‌మంతా ఏక‌మై అమెరికా యుద్ధోన్మాద చ‌ర్య‌ల‌ను నిలువ‌రించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉన్న‌ది.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply