జి.కళ్యాణరావు రాసిన ‘అంటరాని వసంతం’ నవల భారతీయ సాహిత్యంలో ఒక మలుపు. తెలుగు సాహిత్యాన్ని, మరీ ముఖ్యంగా దళిత సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకి ఎక్కించిన మహత్తరమైన రచన. ఇంగ్లీష్ తో బాటుగా తమిళం, మలయాళం,కన్నడ, హిందీ లాంటి ప్రధాన భారతీయ భాషల్లోకి అనువదించబడి విశేష ప్రాచుర్యం పొందింది. తమిళంలో వెనువెంటనే అనువాదం అవటమే గాక, దానిపై వచ్చిన సమీక్షా వ్యాసాల్ని అదే సంవత్సరంలో నవల సైజులో ఉన్న పుస్తకాన్ని తీసుకురావటం చూసాను. ఈ నవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్లు అల్లాడి ఉమ మరియు శ్రీధర్ Untouchable Spring గా అనువాదం చేశాక, అనేక విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్ సాహిత్య డిపార్ట్మెంటుల్లో Indian writing in English జాబితాలోనో, దళిత సాహిత్యం పేరనో పాఠ్యాంశంగా చేరబడింది. నేను పనిచేసిన/చేస్తున్న పాండిచ్చేరి , ఢిల్లీ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్ డిపార్ట్మెంటుల్లో విద్యార్థుల్లో ఈ Untouchable Spring కొత్త సాహితీ ఒరవడితో దళిత సాహిత్యం పట్ల గౌరవం ఏర్పడటం గమనించాను. నేను కూడా ఈ నవల పై ఈ యూనివర్సిటీల్లో విద్యార్ధులతో నా అభిప్రాయాల్ని లెక్చర్ల రూపంలో పంచుకోవటం కూడా జరిగింది. ఏదిఏమైనా ఒక తెలుగు నవల తెలుగు సమాజ సాహితీ రాజకీయాల్లో ఒక కుదుపుగానే గాక, అకడమిక్ స్థాయిలో జాతీయంగా కూడా విస్తృతమైన చర్చకు దారితీసింది.దేశవ్యాప్తంగా ఈ నవల్లోని పలు అంశాలపై పరిశోధన జరిగింది/జరుగుతుంది.గూగుల్ సెర్చ్ లో దేవులాడితే మనకు ఈ నవల మీద వచ్చిన అనేక అకడమిక్ వ్యాసాలు తారసపడతాయి.
భారతీయ సాహిత్యంలో అంటరాని వసంతం ఒక సాహిత్య వేడుకగా, దళితజీవిత ఆత్మని సౌందర్యాత్మకంగా ఆవిష్కరించి, మన సాహిత్యానికి, సౌందర్య శాస్త్రానికి కొత్తదనాన్ని పొదిగింది. దీనిని నవల అనే కన్నా, ఇది ఒక సంఘటిత దళిత సమాజిక జీవనపత్రంగా చెప్పావచ్చు. ఈ దేశంలో కులపరంగా,వర్గ పరంగా నిత్యదోపిడీకి గురవుతున్న ఉత్పత్తి కులాలైన దళితుల సాహిత్యం, సంస్కృతి, చరిత్ర, రాజకీయం, తాత్వికత, పోరాటం కలగలిసి పోయిన ఒక ఐతిహాసిక పోరాట నవల ఇది. లిఖిత సాహిత్యానికి భిన్నంగా మౌఖిక సంప్రదాయంలో విస్తారంగా ఉన్న సాహిత్యాన్ని ప్రోగుచేసి, ఎంతో సమర్థవంతంగా రచయిత కళ్యాణరావు ఈ రచన చేయడం జరిగింది. అంటరాని వసంతం ద్వారా తన జాతి అల్లిక వారసత్వాన్ని అందించినట్టు ఆయన చెబుతారు. ఈ నవల దళిత దృక్పథం నుండి సాహిత్యాన్ని పునర్నిర్వచించడమే గాక, భారతీయ దేశంలో చెలామణిలో వున్న అనేక సాహితీ, సాంస్కృతిక,చారిత్రిక, తాత్విక , రాజకీయ సూత్రాలని సవాలు చేస్తూ, ఒక ప్రత్యామ్నాయ చూపునందించింది. సాహిత్యమంటే ఇట్టుండాలహే అనే స్ఫూర్తిని నింపింది.
నిషిద్ధ వసంతగానం
అంటరాని వసంతం కోస్తా ఆంధ్రాలో ఉన్న ఏడు తరాల పైగా ఉన్న దళితుల జీవన చరిత్రను పొందుపరిచింది. దీన్ని చరిత్ర అనే కన్నా ఆయా పరిస్థితుల్లో, రకరకాల రూపాల్లో ఆకలి పై, ఆధిపత్యం పై, ఆత్మ రక్షణ కోసం , ఆత్మగౌరవం కోసం దళితులు చేసిన/ చేస్తున్న బతుకు పోరుగా చెప్పటం సబబుగా ఉంటుంది. అంతే కాదు, ఇది దళితుల సాహిత్యం, సంస్కృతి, కళలు, జీవితం, పోరాటం పెనవేసుకుపోయిన వసంతగానం.ఇది ఆగని వెన్నెల పిట్ట రొదలా సాగిపోయే అంటరాని జాతుల నిషిద్ధ జానపద సంగీతం.ఈ రచన మొదటి పేజీలోనే రచయిత చెప్పినట్టుగా వసంతం అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ నిషేధమే.పుట్టిన కులం, కోరుకున్న పోరాటం నిషిద్ధం.నిత్య అమలులోనున్నటువంటి సామాజిక నిషేధాజ్ఞలని ధిక్కరించిన బతుకుపోరుని సజీవ జ్ఞాపకాల్లోంచి భద్రంగా అక్షర రూపంలో అందించబడింది. అంటరాని వసంతం నవల రచయిత కల్యాణరావు వెలేయబడ్డ దళిత జీవిత లోతుల్లోకి చూసి, చిందర బందరగా పడి ఉన్న చైతన్య శకలాల్ని ఏరి ఒక పద్ధతిగా, ప్రతిభావంతంగా మలిచిన రచన.ఎటువంటి ఆధిపత్యానికీ లొంగని ఏడు తరాల దళిత హీరోయిజాన్ని ముద్దాడిన అసలుసిసలైన దళిత తాత్విక రాజకీయ విముక్తి నవల.
అనేక ప్రత్యేకతలువున్న ఈ రచన దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యతని సంపాదించుకున్నది. మరీ ముఖ్యంగా ఇది మా దళిత పాఠకుల గుండెల్ని పిండిన నవల.తెలుగులో నవలా ప్రక్రియ ప్రారంభమైన వందేళ్ళ తర్వాత మేము మా దళిత జీవితాల్ని గుండెకు హత్తుకునే జీవాక్షరాల్ని చదువుకోగలిగాం. ఎవడో రాసే సానుభూతి వాక్యాలుగా , మార్జిన్ మాటలుగా, అగ్రహారంలోంచి చూసిన ‘మాలపల్లి’గా, అగ్రకుల అభ్యుదయ హీరో ఎలివేషన్ కి పనికివచ్చే దుర్భరమైన కూలి బతుకులుగా, ప్రతోడి చేత నీతి బోధలు, సబ్బు స్నానం కబుర్లుగా కాక, మేమే హీరోలుగా మేమే రాసుకున్న నడుస్తున్న అంటరాని ఆగ్రహ చరిత్ర ఇది. ప్రతి అక్షరంలో భావుకత దట్టించిన ఎంత ధిక్కారం ఉంది! చదువుతున్నంతసేపూ, ఇది మేము నడిచి వచ్చిన దారేనా అన్నట్టుగా! తరిచి చూస్తే చిన్ని చిన్ని వాక్యాల్లో మా జీవితమే కాదు, ఎంత కవిత్వముంది! వెలేసిన మా జీవితాల్లో కూడా ఇంత సంగీత మాధుర్యముందా అన్నట్టుగా ఉంది. కృత్రిమ సాహితీ సంస్కృత పదబంధాల్లో ఇరుక్కోకుండా అచ్చంగా మా మాలపల్లెలో మేం మాట్టాడుకున్నట్టుగానే, సహజంగా, సరళంగా, సమ్మోహనంగా! ఇది కళ్యాణరావు అమ్మమ్మ లే కాదు, మా దళిత అమ్మలు, అమ్మమ్మలు, పేద రాశి పెద్దమ్మలుగా అలవోకగా ,అనేక రాత్రులుగా, రోజులుగా ఎప్పటికప్పుడు అల్లుకుపోతూ చెప్పుకుపోయిన కథా సంప్రదాయాన్ని అక్షరాల్లో నిలబెతినట్టే ఉంది. భారతదేశ జానపదులు పుంఖానుపుంఖాలుగా చెప్పిన కథాసాంప్రదాయానికి మరోసారి జీవం పోసినట్టుగానే ఉంది. అంటరాని వసంతకథని నడిపిన రూతు ఈ సంప్రదాయానికి ప్రతినిధిగా ఉండటంలో అర్థం కూడా అదే.
ఈ మిలీనియం మొదట్లో సెంట్రల్ యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థులుగా ఉన్న మేము ఈ అంటరాని వసంతం ఆవిష్కరణ సభ ఏర్పరిచాం. రచయిత కళ్యాణరావు గారు కూడా వచ్చారు. ఆ సభ విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిని, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ పుస్తకం తెచ్చుకుని మేం హాస్టల్లో చదువుకున్నంత సేపూ ఆగని మా జాతిసామూహిక కన్నీటి ధార. మమ్ముల్ని మేమే మొదటి సరిగా చదువుకుంటున్నామని. మహా గ్రంథాల్లో, యుగకర్తల గీతాల్లో ఇంతలా కనిపించని మమ్ముల్ని మేము ఇలా తడుముకుని ఎంత భావోద్వేగానికి లోనయ్యామో. అక్షరాలకి, చదువులకి దూరంగా ఉన్న జాతులు , మట్టిపొరల్లో దాచిపెట్టుకున్న జ్ఞాపకాల్ని నేటి మా తరానికి అందించిందుకేమో, పరవశంతో మేం ప్రతి పదాన్ని ముద్దుపెట్టుకున్నాం.ఇవి వట్టి అక్షరాలు కావు, మా ఆనవాళ్లు, మేం నడిచొచ్చిన గుర్తుల్ని వెతుక్కునే క్రమంలో ఈ వసంతాన్ని హత్తుకుని ఎంతగా భావోద్వేగంతో ఏడ్చేమో! పుస్తక జ్ఞానానికి, చెలామణి సాహిత్యానికి భిన్నంగా,ఈ బతుకు పోరాట పుస్తకంలో మమ్ముల్ని మేము వెతుక్కుంటూ. అందుకే ఇది నవల కాదు. జీవితం. జీవితమనే కన్నా , ప్రింటు పేజీల్లో, యూనివర్సిటీ పుస్తకాల్లో పొరపాటుగానైనా, అంచుల్లో కూడా కనిపించని మా అస్తిత్వ పోరాట చరిత్ర. పెద్దాయన అన్నట్టు తవ్వాల్సింది చాలా ఉంది, పూడ్చాల్సింది ఇంకాయేంతో అంటూ సాగిన అగ్గి లాంటి అంటరాని చారిత్రక సామాజిక ఆత్మావిష్కరణ. ఇది దళిత సమాజపు ఆటోబయోగ్రఫీ. ఇది అధికారికంగా నమోదు కాని నిషిద్ధ చారిత్రక పత్రం.ఇది ఈ దేశ జ్ఞానం పుట్టుక విప్పిచెప్పే రహస్య తంత్రం.శ్రమలో పుట్టిన సంగీత బతుకు బాణీ.చావడానికే పుట్టలా, బతకటానికి కూడా అని చెప్పిన బరోసా భావనిధి.ఈ వసంత ఊసుల్ని కళ్యాణరావు వడిసి పట్టుకుని ఎంత నేర్పుతో అల్లేడో . అందుకే అంటరాని జాతి ఎంతగా తమ గుండెలకి హత్తుకుందో కదా !
సజీవ జ్ఞాపకాల ధారావాహిక
అంటరాని వసంతం ఈ దేశంలో ఒక ఏన్నెలదిన్నె పల్లె కథ. ఏన్నెల దిన్నె కల్పిత ఊరు కాదు, కోస్తా ఆంధ్రా దేశంలో ఏ మాల/ మాదిగ పల్లె అయినా కావొచ్చు. కథని నడిపించిన రూతు మిషన్ కాంపౌండ్ లో నర్సు , ఒక జాతి బతుకు పోరాట జ్ఞాపకాల్ని చెప్పుకుంటూ పోయిన అల్లిక వారసత్వ రచయిత్రి. మిషనరీ నీడలో కాస్తంత అక్షరాలు నేర్చుకుని, చిన్న చిన్న ఉద్యోగాల్లోకి ప్రవేశం చేసిన మొదటి తరం దళిత అక్షరాసులకు రూతు ఒక విధంగా ప్రతినిధిగా చెప్పుకోవచ్చు. ఆ పాత్ర ద్వారా రచయిత కనీసంగా నూట యెబయ్యేళ్లలో దళితుల్లో
సామాజిక,రాజకీయ,ఆర్థిక ,సాంస్కృతికంగా వచ్చిన మార్పుల్ని నమోదు చేసిన అచ్చమైన దళిత పక్షపాత రచన. రూతు అనే రచయిత పాత్ర ద్వారా జాతి అపరూపమైన జ్ఞాపకాలని నమోదు చేసిన జ్ఞానవాహిక.అదే మిషన్ ఆసుపత్రిలో మత ప్రబోధకుడిగా ఉన్న తన అందమైన రూబేను తెరిపిలేకుండా చెప్పిన జ్ఞాపకాల గొంతుకగా రూతు. కరువు కాలంలో తరిమివేయబడ్డ సీమోనుగా మారిన తన తండ్రి శివయ్య తల్లి శశిరేఖల గురించి రూబేను గుర్తుంచున్న గాయాల గాథ. మహా కళాకారుడిగా,జానపద వీరుడిగా, మాల బైరాగిగా పేరున్న తన తాత ఎల్లన్న సృజించిన సాహితీ సాంస్కృతిక పోరాట వీరగాధని తవ్విన రూబేను. చరిత్రకందని తన తండ్రి జ్ఞాపకాల్ని, తన తండ్రి ద్వారా తెలుసుకున్న మహా తాత్విక పోరాట కళా యోధుడు తన తాత ఎల్లన్న అందించిన జాతి వారసత్వాన్ని రూతుకి , ఈ దేశానికి తెలిసేలా ఎంత గొప్పగా చెప్పాడో కదా! ఒక తరం నుండి మరొక తరానికి అందజేసిన జ్ఞాపకాలు, ఙ్ఞానం, కళలు ఇందులో కనిపిస్తాయి. చంద్రప్ప నుండి నాగన్నకి, నాగన్న నుండి ఎల్లన్నకి ఇలా సాగుతుంది ఈ కళావారసత్వం. పురాణ రహస్యాలు, దేశీయ కళల మెళుకువలు, వీధి భాగోతం గురించి చంద్రప్ప నాగన్నకి సాధన పరుస్తాడు.
ఉరుములనృత్యం, బయలాటల కళాతపస్విగా పేరున్న నాగన్న తనలానే ఏన్నెల దిన్నె వదిలొచ్చిన ఎల్లన్నని చేరదీసి ఒక గొప్ప కళాకారుడిగా మలుస్తాడు. ఎల్లన్నకి వీధి భాగోత కళా సాహితీ పాఠాలు ఒక ధిక్కారంగా నేర్పి తన ఊరిలోనే,ఒక మహాద్భుతమైన ప్రజాకళా ప్రదర్శనకి సమాయత్తం చేస్తాడు. ఎల్లన్నతో ఈ జానపద కళా సంస్కృతి పరాకాష్టకి చేరుకుంటుంది. ఎల్లన్న సొంతంగా ఎప్పటికప్పుడు పాటలు అల్లుతూ పాడుతూ ఒక బైరాగిలా ఊళ్ళు తిరుగుతూ తన తత్వాలు/ పాటలు ప్రజల్లో ఉన్నాయి. తర్వాత వీధి భాగోతాలు ద్వారా, వీర గాథల ప్రదర్శనల ద్వారా ప్రజలమధ్య నిలిచాడు. పాట, ఆట, అభినయం, ఆవేశం కలిసిపోయిన ఎల్లన్న తననో అద్భుత కళారూపంగా సృష్టించుకొన్నాడు. కేవలం అది కళ గానే గాక, తన జాతి అస్తిత్వంతో,ఆత్మగౌరవంతో భూమి పోరుతో ముడిపడి ఉంటుంది.సాహిత్యానికి, జీవితానికి ఒక సజీవ సంబంధం ఏర్పడటమేగాక, ఆధిపత్య ధిక్కారంగా దానికి ఒక సామాజిక ప్రయోజనం ఉండటం చూస్తాం. ఈ అంటరాని కులాల జానపద సాహిత్యం సాంస్కృతిక సాంప్రదాయ ప్రవాహంగా, గుళ్లలో బందీయైన బ్రాహ్మణీయ సాహితీ సంప్రదాయానికి సవాలుగా ఈ గోతుల్లో బతికింది. నాగన్న, ఎల్లన్న, రూబేను,రూతు, జ్ఞాపకాల ప్రవాహంగా పరవళ్ళు తొక్కిన అంటారని వసంతం.వలవలా కురిసే వెన్నెల వానని , జలజలా పారే సెలయేటి కదలికని , అంటారని వసంతాన్ని అందించిన కల్యాణరావు ఎంతటి భావుకుడు! మహత్తర మార్పు కోసం పరితపించిన విప్లవీకుడు! ఒక జాతి కష్టాన్ని ,బాధల్ని,సంతోషాల్ని నింపుకున్న ఎంతటి అంటరాని ప్రేమికుడో !
కుల ఆధిపత్యం తొక్కిపెట్టిన దళిత చరిత్ర
ఈ దేశంలో దళితుల్ని అంటరానితనం పేర వెలేయటమే గాక, వాళ్ళ చరిత్ర కనీసం మార్జిన్లో కూడా లేకుండా చేశారు. ఉత్పత్తి కులాలుగా నాగరిక నిర్మాతలుగా ఉన్నవాళ్ళని, మరీ ముఖ్యంగా ఈ దేశ సాహిత్యాన్ని, సంస్కృతిని, కళల్ని సృష్టించినటువంటి వాళ్ళ ఉనికిని లేకుండా చేయడటమంటే చారిత్రకంగా కులం పేర ఎంత ఎత్తున మోసం జరిగిఉండాలి!
చిన్నప్పటి స్కూల్లో నుండి యూనివర్సిటీ దాకా మేము చదువుకున్న చదువుల్లో మా ఊసేక్కడా కనిపించదు. చరిత్రకి ,జ్ఞానానికి అంటరాని బతుకులుగానే, ఒక వేళ ఎక్కడైనా పొరపాటుగా ఆగుపించినా, అగౌరవంగా, అవమానకరంగా, పుట్టు బానిసలుగానే. అకడమిక్ చరిత్రలో, అధికారిక పత్రాల్లో ఎక్కడా నమోదుకాని ఈ మోటు మనుషులు చదువుకు దూరంగా ఉండవొచ్చేమో కానీ, ఈ దేశ చరిత్ర, సంస్కృతి, నాగరికత నిర్మాణంలో
ప్రతి మలుపులోనూ ఉన్నారురా అని మనకు తెలియని మన చరిత్రను ప్రతి పేజీలోనూ ప్రత్యక్షమవడం ఈ నవలలో చూస్తాం.ఇప్పటి వరకు చెలామణిలో ఉన్న చరిత్ర ఎవరిది, ఎవరు రాసారు లాంటి ప్రాథమిక ప్రశ్నల్ని లేవదీయడమే కాక, చరిత్ర ప్రామాణికతను, బ్రాహ్మణీయ చరిత్ర లో జరిగిన కుట్రలు, సామాన్యులు లేని ఖాళీ పేజీలని ఎత్తి చూపుతుంది. అసలైన చరిత్రంటే ఇదేరా, ప్రజా బహుళ్యంలో గూడుకట్టుకుని సజీవ జ్ఞాపకాలుగా, పోరాట గాధలుగా ఇప్పటికే నిలిచే ఉన్నాయి చూడండిరా అన్నట్టుగా అంటరాని వసంతాన్ని దళిత జాతుల చారిత్రక రచనగా తీర్చిన తీరు అద్భుతం. ఇది సామాజిక దుర్మార్గాన్ని, చరిత్రగా కీర్తిస్తున్న దాన్ని ప్రశ్నించడమే గాక, చరిత్ర రచన చేసే పద్ధతితో బాటు కొత్త పరికరాలను, ఇంత వరకు చూడ నిరాకరించిన ఆధారాలను చరిత్ర రచనకి పరిచయం చేయటం చూస్తాం. తరాలుగా చదువు నిరాకరించబడినవాళ్ళ మౌఖిక సంభాషణలలోంచి, సామూహిక జ్ఞాపకాలను చరిత్రగా చెప్పే ఈ ప్రక్రియ అక్షరాస్యులుగా, పండితులుగా ఉన్నవాళ్ళు రాసుకున్న చరిత్ర రచనకి భిన్నమైనది. ప్రింటులో అటు మిషనరీల ఖాతాలోనూ, ఓరియెంటలిస్టుల ఆసక్తి లోనూ, జాతీయుల మనోన్నత చరిత్రలోనూ నామమాత్రంగానైన కనిపించని చారిత్రక ఆధారాలను ఈ మౌఖిక సంప్రదాయంలోంచి రచయిత రాబట్టాడు.చరిత్రంటే ఒక పోరాటమూ, మార్పు దిశగా జరిగే పయనము. ఆ విధంగా సామాన్యులు వేర్వేరు సందర్భాల్లో తమను మనుషులుగా గుర్తించేందుకు చేసిన అనేక బతుకు పోరాటాలు ఈ నవల్లో నిక్షిప్తం చేయడం జరిగింది. పురాణ కట్టుకథల నుండి సమకాలీన ఆధునిక కాలం దాకా దళిత, శ్రామిక కులాల పుట్టుకని, ఉనికిని, అనుభవాల్ని వక్రీకరించినవైనాన్ని ఎత్తిచూపుతుంది. పీడిత కులాలు దోపిడీదారులకు వ్యతిరేకంగా చేసిన మనోన్నత మానవీయ ఆత్మగౌరవ పోరాటాలు ఈ దేశ అసలైన చరిత్రలో భాగంగా గుర్తించాల్సిన అవసరాన్ని పదేపదే చెప్పటం చూస్తాం. అణిచివేయబడ్డ, అసహ్యించుకోబడ్డ, గుర్తించ నిరాకరించబడ్డ వాళ్ళ చరిత్రని వెలుగులోకి తీసుకొస్తాడు. గుడ్డి నమ్మకముగా, ఆహేతుక విలువలుగా,అశాస్త్రీయ సామాజిక ధోరణాలుగా చూడబడ్డ అంటరాని సామాజిక వర్గాల జ్ఞాన పరంపరకి, జీవన సౌందర్యానికి శాస్త్రసమ్మతిని, గౌరవాన్ని తీసుకొస్తాడు. దళిత జాతుల అనుభవాలు, ఆకాంక్షలు, జ్ఞానం ఎందుకు గుర్తింబడలేదో, చరిత్ర కాలేదో తెలుసుకునేందుకు, ఈ సందర్భంగా మిచెల్ ఫూకో అనే తాత్వికుడు చెప్పిన విషయాన్ని చూద్దాం. కళ్యాణరావు తవ్వాల్సింది చాలా ఉంది, అట్లాగే పూడవాల్సింది ఇంకెంతో ఉంది అని చెప్పటంలోను, సజీవ జాతి జ్ఞాపకాల్లోంచి ఙ్ఞానాన్ని నిర్మించడంలోనూ ఫూకో అనుసరించిన ఆర్కియాలజికల్, జెనియలాజికల్ పద్ధతులకి దగ్గరగా ఉంటుంది. ఫూకో ఈ పద్ధతుల ద్వారా ఒక కాలంలో ఙ్ఞానం ఎలా నిర్మితమైందో, మనం సత్యాలుగా అనుకున్నవి చారిత్రకంగా ఏ అధికారిక సంబంధాల ద్వారా ఏర్పడ్డాయో విశ్లేషణాత్మకంగా చెబుతాడు. జ్ఞానానికి, అధికారానికి వున్న విడదీయరాని సంబంధం చెబుతూ, అవి రెండూ ఒక దానికొకటి అనుసంధానంగా ఉంటాయి అంటాడు. ఎవరి అనుభవాలు జ్ఞానంగా, హేతుబద్ధ ఆలోచనలుగా చెలామణి అయ్యాయో, ఈ ప్రక్రియలో కొన్ని సామాజిక సమూహాల అనుభవాలు, ఆలోచనలు నియంత్రణకి, తిరస్కారానికి గురయ్యేయో చెబుతాడు. ఈ తిరస్కారానికి గురైన ఆలోచనలను ఈ నవల గట్టిగా పట్టుకుంది. చరిత్రంతా అంటరాని కులాలని అణిచివేయడమమేగాక, అన్ని సందర్భాల్లోనూ అవమానకర చిత్రణలే కదా! అందుకు ప్రతిగా అంటరాని వసంతమంతా అణగారిన ఆలోచనల ఊసులే.
రుతు భర్త రూబేను, తన తాతకి వాళ్ళ తాత చెప్పిన కట్టుకతని చెబుతాడు. దళిత కులాలైన మాలా మాదిగల పుట్టుక గురించి ప్రస్తావిస్తూ, మన పుట్టుక కట్టుకతలో ,శాపంలో, దేవతల ఆగ్రహం లో తన పుట్టుకని దుర్మార్గంగా చిత్రించిన దానికి నిరసనగా నవ్వు.’ దేవుని శాపంతో చచ్చిన గొడ్లుని తిని,రోడ్లు వూడ్చుకుని బతకమని జాంబబతుడ్ని, చెన్నయ్యను ఆదేశించినట్టు, వాళ్ళే కలియుగంలో జాంబవంతుడి సంతానం మాదిగలు గా, చెన్నయ్య సంతానం మాలలుగా నమ్మించే myths ని ప్రశ్నిస్తారు. మరో చోట, అసమాన సామాజిక వ్యవస్థను బలపరిచే ధర్మ శాస్త్రాల్ని , అవి ప్రభోదించే నైతిక విలువలును శాస్త్రీయ దృష్టితో ఎండగడతాడు. అంటరాని కులాల ఆలోచనలు ఎంత హేతుబద్ధమైనవో, నైతికంగానూ ఎంత న్యాయబద్ధమైనవో అనేక ఉదాహరణలతో చెబుతూ దళిత చరిత్రకు సాధికారతను చేకూరుస్తాడు. దళితుల చరిత్రని హుందాగా వాస్తవికంగా చెప్పుకునే ప్రయత్నం కనిపిస్తుంది. అలా వలవలా కురిసే వెన్నెల వానని , జలజలా పారే సెలయేటి కదలికని అంటరాని వసంతమంతా కుమ్మరిస్తాడు.
పోరాటం మాకు ఆదర్శం కాదు, అవసరం
ఈ నవల దళితుల బతుకు చిత్రాన్ని చిత్రీకరించాడు అనే కన్నా, భారత దేశంలోని అతి సామాన్యులు, నిస్సహాయులు, అంటరాని కులాలుగా ముద్రపడి నిత్య దోపిడీకి గురవుతున్న వాళ్ళు చేసిన పోరాటాలను పొందుపరిచిన మహా కావ్యంగా (epic) చెప్పుకోవచ్చు.
రచయిత నవలలో చెప్పిన మాటల్లోనే – చరిత్ర కందని, అందినా పట్టించుకోని అంటరాని వాళ్ళ తిరుగుబాట్లు, పోరాటాలు,త్యాగాలు,సాహసాలు, వెలుగుకి నోచుకోకుండా చీకట్లోనే కలిసిపోయాయి. తెలిసీ తెలియక మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారుగాని , మాలామాదిగలకి పోరాటం ఆదర్శం కాదు. అవసరం. అవసరం కాబట్టే నారిగాళ్ళు, మాతయ్యలు అంత సాహసాలు చేశారు. జీవితాల్ని త్యాగం చేశారు.చరిత్ర అట్టాగ సాగింది.శంభూకుడి తల, ఏకలవ్యుడి బొటనవేలు అవి మాత్రమే కాదు.వాటితోనే దళిత చరిత్ర ఉదాహరణలు ఆగిపోలేదు.చరిత్ర కందని, అందినా పట్టించుకోని అంటరాని వాళ్ళ తిరుగుబాట్లు, పోరాటాలు,త్యాగాలు, సాహసాలు,వెలుగుకి నోచుకోకుండా చీకట్లోనే కలిసిపోయాయి. ఈ దేశం పోరాట చరిత్రలో వాళ్ల నెత్తురుతో తడవని పుట లేదు.వాళ్ళ సాహసాలతో ముడిపడిలేని సందర్భం లేదు. భూమి కోసం పోరాడారు.భుక్తి కోసం పోరాడారు.ఆత్మ గౌరవం కోసం పోరాడారు.వర్తమానం కూడా అదే.వర్తమాన పోరాట జీవితం కూడా అదే.అది ఆదర్శం కాదు.అవసరం. (పేజీలు 81-82)
మారుతున్న కాలంలోనూ మారని పీడన
అంటరాని వసంతం సగటు భారతీయ గ్రామం కథ. రేఖా చిత్రంగా అక్కడి సామాజిక , ఆర్థిక సంబంధాలు, చారిత్రికంగా అవి మారిన క్రమాన్ని చూద్దాం. భూమి, అధికారం, ఆధిపత్యం అగ్రకులాలో మారుతూ వచ్చిన వైనం ఒక పక్క, మరో వైపు దళితులు బహుజన కులాలు భూమి కోసం, ఆత్మగౌరవం కోసం, ఆధిపత్య అగ్రకులాలతో బానిసత్వానికి వ్యతిరేకంగా అనేక రూపాల్లో చేసిన పోరాటాలు ఏన్నెల దిన్నె కేంద్రంగా చెప్పటం జరిగింది. వలస కాలం పూర్వం నుండి, స్వాతంత్రానంతర కాలం దాకా జరిగిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ మార్పుల్ని రికార్డు చేసింది. బ్రాహ్మణ కరణం చేతిలోని భూమి , అధికారం అగ్ర కుల శూద్ర కులాల్లోకి మారటం, వలస పాలకులకు దగ్గరగా ఉండి, అవసరమయితే క్రైస్తవ మతం లోకి మారి ఆధిపత్య పట్టుని కాపాడుకోవడం చూస్తాం. దళితులతే అటు ప్రకృతి తోనూ, ఆకలితో పోరాటం. బానిసత్వానికి, కుల ఆధిపత్యానికి ఎదురొడ్డి మనిషిగా నిలబడేందుకు అలుపెరగని పోరాటం.
వలస కాలంలో క్రైస్తవ మిషనరీల ప్రభావంలో మనిషిగా గుర్తించబడేందుకు , క్రైస్తవ మతం లోకి మారిన క్రమం, చదువులకి దగ్గరవుతూ చిన్న చిన్న ఉద్యాగాల్లోకి వచ్చిన దళిత కులాల సామాజిక కదలిక, చైతన్యంను వివరించిన క్రమమును చూస్తాం. మతం మారినా అంతగా మారని బతుకులు, ఆ తర్వాత స్వాతంత అనంతర కాలంలో కమ్యూనిస్టులుగా, నక్సలైట్లుగా మారిన దళిత చైతన్య క్రమాన్ని చెబుతూ ఈ నవల ముందుకెళ్తోంది.
ఎన్నెల దిన్నె వూరు స్వరూపాన్ని చూసినట్లయితే, చాతుర్వర్ణ కుల భాగాలుగానే ఎన్నెలదిన్నె.ఇక సంపద విషయానికొస్తే, ‘ఎక్కువ భూమి కరణం చేతిలోనే.అతి తక్కువ భాగం మిగతా కులాలకుంది.రెడ్లకు కొద్దిపాటి భూమి ఉన్నా అతని పాలెకాపులే. మిగతా కులాలకు సెంటో కుంటో ఉంటే అదికూడా కరణం చెప్పుచేతల్లోనే ఉండేది. మాలా మాదిగలకు అసలు భూమే లేదు. ఎర్రెంకడికి ఉంటే ఒక మడి చెక్క భూమి ఉండేదనేవోళ్ళు. ఈనం భూములన్నీ కరణం ఆధీనం లోనే. చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి , ఎట్టి ఈనాముల్లో ఎక్కువభాగం కరణం పొలాల్లో కలప బడిందన్న సంగతి కూడా ఆ కులాల్లోకి తెలియదు.’
కరణం భూస్వామ్యానికి ప్రతీకగా ఉంటాడు. ఆస్తి, అధికారంతో బాటుగా, అతని ఆలోచనా ధోరణి కూడా భూస్వామ్యంలోని క్రూరత్వంగానే ఉంటుంది.కరణం జాలీ దయ లేని అతి క్రూరుడు.ఒక కొడుకు,కూతురు. కూతురు కడుపులో పిండాన్ని కూడా చంపిన క్రూరుడు. కరణం గారి అరకలు కట్టటానికి మాల మాదిగ పల్లె నుండి ఇంటికొకరు రాండ్ర అని అంటే, పల్లంతా కరణం పనిలోనే. అందుకు ప్రతిఫలంగా ఇంటికో మూడు చాట్ల వడ్లు ‘కరణం దానం’ కొలిసేవోళ్ళు. ఇక్కడ శ్రమని వెట్టి చాకిరిగా మార్చి దోపిడీ చేయటం మాములుగా జరిగే తంతే. దోపిడీ కాబడుతున్న వాళ్ళు సంఘటితం కాకుండా ఉండే విధంగా మాదిగల్ని కొట్టడానికి మాలల్ని, మాలల్ని కొట్టడానికి మాదిగల్ని వుసిగోల్పేవోడు కరణం. మీ కులం అంత గొప్పది,ఇంత గొప్పది అని వుబ్బేసే కబుర్లు చెబుతూ, మీ సత్తా చూపించు అంటూ అంతర్గతంగా అంటరాని కులాలమధ్య ఆరని మంటని రాజేస్తుంటాడు. అంతే కాకుండా, తనకు నచ్చిన స్త్రీలని లోబరుచుకోవడం కూడా పరిపాటే. సుబ్బిరెడ్డిని చంపి , పాము కాటుకు చనిపోయాడని ప్రచారం చేసి అతని భార్య రంగాయిని వశపరచుకోవడం లాంటి విషయాల ద్వారా అన్ని విధాల జూలు విదుల్చుకునే భూస్వామ్య క్రూరత్వాన్ని కళ్ళకు కట్టేలా కనిపిస్తుంది. కరణం తర్వాత మారిన ఊరు క్రమాన్ని గమనిస్తే, కరణం కొడుకు ఆ వారసత్వం మోసుకొస్తున్నట్టు కనిపిస్తుంది. ఆస్తి పరంగా అయ్యిన బదలీని చూస్తే – కరణం కొడుకుకి వారసత్వంగా ఇచ్చింది ఏభై ఎకరాల మాగాణి, రెండు మామిడి తోటలు,అయిదు ఎకరాల ఎరుసెనగ దిబ్బ,ఇరవై బార్ల తాటితోపు,బీడెంతుందో లెక్కలేదు, ఐదూల్ల కరణికం.
మెల్లగా చిన్న కరణం నుండి ఆస్తి, అధికారం ఇతర అగ్ర కులాలలోకి వెళుతున్న మార్పు. ఆ ప్రాంతంలో రెడ్ల ఆధిపత్యం లోకి పోవడం. ఆనకట్టల ద్వారా, నదీ జలాల ద్వారా మరింత భూమి సాగులోకి రావటం జరుగుతుంది.
కానీ, వెన్నలదిన్ని లో మాలా మాదిగలు మారింది లేదు. వెట్టి చేయనిదే బతకలేడు. ఎర్రెంకడు పెద్ద కరణం మామిడి తోపు కాపలా ఉండేవాడు. కొడుకు నారిగాడు జీవితం తాటితోపులతోనే గడుస్తుంది. ఒకరో ఇద్దరో చిన్న వృత్తుల్లో ఉండేవారు. వెంకటనర్సు మగ్గాలు మానేసి బట్టలు అమ్మేవాడు. పిట్టోడు బాడిస పని, ఇల్లు కట్టడం.
పెద్దకరణం చనిపోయాక(చంపబడ్డాక), చిన్న కరణం చేతిలోని అధికారం వచ్చేనాటికి , మెల్లగా అచ్చిరెడ్డి హోదా పెరుగుతున్న క్రమం, మాలాడి దిబ్బ మాలా మాదిగలు తలో చెక్క పంచుకుని సేద్యం మొదలు పెట్టటం. ఈ సందర్భంలో చిన్న కరణం , ఈ దెయ్యం దిబ్బని వాళ్ళనే సాగు చేసుకోనీలే అంటాడు. నిజానికి మాలాడి దిబ్బ సేద్యం ఒక్క రోజు అనుకుని జరిగింది కాదు.అందుకు ఎంతో పోరాటం, త్యాగం ఉంది.
పల్లె వరద పోటుతో బతకడం కోసం ఊరిని దాటుకుంటూ మాలాడిదిబ్బ వైపు నడిచిన రోజు నుండి ‘మనం సావటానికే పుట్టలా. సంపటానికి కూడా పుట్టినాం’( పేజీ 37) అనే సంకల్పం నుండి మాల నారిగాడు , మాదిగ మాత్తయ్యల త్యాగం ఉంది. వాళ్ళ సాహసం ఉంది. చిందించిన నెత్తురు ఉంది. తీర్చుకున్న నెత్తుటి బాకీ ఉంది.
తరతరాలు రోజు వారీ కుల ఆధిపత్యం, బానిసత్వంతో సాగే బతుకు పోరుతో బాటు దళితులు ప్రకృతితో కూడా నిరంతర పోరాటం చేయాల్సివచ్చింది. మొత్తంగా దళితులది ఎటువంటి ఎదుగుదల లేని నిలకడలేని బతుకు. దక్షిణ భారతంలో 1876- 78 ముంచుకొచ్చిన పెద్దకరువు . కరువు కాలంలో ఆకలి చావులు, దూపుతో మరింత దుర్భరమైన దళిత పల్లెలు. బతికి బట్ట కట్టినోళ్ళు పొట్టకూటి కోసం వలస పోయారు. వలస పయనంలో పని కోసం వెతుకులాటలో శివయ్య -శశిరేఖలు. బకింగ్ హామ్ కాల్వ తవ్వకం పనులు కోసం వలసలు. కూలిపని లోనూ వదలని కుల వివక్ష, అంటరానితనం. బకింగ్ హామ్ కాల్వ కూలి పనిలో , తాము చేసేది కూలిపని అయినా అగ్రకులాల కూలీలు మాలా మాదిగలతో కలిసిపని చేయడానికి ఒప్పుకోలేదు. అట్లా అంటరానితనం వల్ల తరిమివేబడ్డ శివయ్య మార్టీన్ చేరదీతలో క్రైస్తవంలోకి రావడం. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్, లోన్ స్టార్ వలన అంటరాని జనాంగం క్రైస్తవం లోనికి మారిన వైనం. కనిగిరి ప్రాంతంలో, మాదిగ చిన్నోడు @ మార్టిన్ – శారమ్మలు మొదటి రోజులలో క్రైస్తవంలోకి మారిన జంట.’ మార్టిన్ లు శివయ్యలు అంటరానితనం పోగొట్టుకోటానికి క్రీస్తుని నమ్మారు. ఆకలి తీర్చుకోవటానికి నమ్మారు. అన్నింటికన్నా ముందు మనుషుల వేట నుంచి తమని తాము రక్షించుకోవటానికి క్రీస్తుని నమ్మారు. చిన్నోడు మార్టిన్ అయినా, శివయ్య సీమోను అయినా అందుకే చేశారు.’(పేజీ.148). క్రింద కులాల వాళ్ళు ఆకలి తీరడం కోసం, కనీస ఆత్మగౌరవం కోసం క్రైస్తవంలోకి మారితే, అగ్రకులంలోని కొందరు ఆధిపత్యం నిలుపుకోవడం కోసం క్రైస్తవానికి దగ్గరయ్యారు. తెల్ల దొరల అండ కోసం పెద్ద కరణం (అగ్రకులం) అల్లుడు ఎప్పటిలానే తమ ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం క్రైస్తవుడవుతాడు. ఇక్కడ గమనించదగిన విషయమేమిటంటే , మాలా మాదిగలు క్రైస్తవంలో చేరటం ఉద్యమంలా సాగుతున్నపుడు వాళ్ల మీద అగ్ర కుల హిందువుల దాడులు ఎక్కువైనాయి. ఏ పనీ దొరకక బతుకు దుర్భరంగా ఉన్న రోజుల్లో, దొరలు సాయంతో వలసపాడు దళితులు బంజర్లు సాగుచేసుకోటానికి అనుమతి. ఆ తర్వాత మార్టిన్ శివయ్యల మీద దాడి. ‘రూతు జ్ఞాపకాల్లో మిగిలిన నెత్తుటి జ్ఞాపకం మార్టిన్, శారమ్మ్, శశిరేఖలని దాడి చేసి చంపటం.
బిడ్డ రూబేనుని తీసుకుని సీమోను పరిగెత్తటం.
ఆసుపత్రి బోధకుడు రూబేను రాసుకున్న డైరీ పేజీలు.1920.’
సీమోను కొడుకు రూబేను, రూతు భర్త మిషన్ హాస్పిటల్ లో మత బోధకుడు, అతని భార్య రూతు అక్కడే నర్సుగా పనిచేస్తోంది. మార్టిన్, రూబేను, ఫ్రాన్సిస్, రూతులు దళితుల్లో అక్షర జ్ఞానానికి నోచుకున్న మొదటి తరం. మిషనరీల వల్ల చిన్న చిన్న ఉద్యోగాల్లోకి, మెలమెల్లగా పట్టణ జీవితాల్లోకి వచ్చిన తరమది. రాత పరంగా మొదటి తరం మేధావి వర్గం కూడా వీళ్ళే. వాళ్ళు తమ అస్తిత్వం కోసం ప్రయత్నించే క్రమంలో తమ జాతి ఆనవాళ్ళ కోసం కూడా వెతినట్టు తెలుస్తుంది. రూబేను తన తల్లితండ్రుల ఆనవాలు కోసం దొనకొండ, మార్కాపురం, కనిగిరి, దర్శి, ఒంగోలు చుట్టుపక్కల నుండి వలస పాడు వచ్చిన వాళ్ళ ఆచూకీ వాకబు చేసి రూబేను రాసిన డైరీ పేజీలు. కనీసంగా చరిత్రలో ఎక్కడా నమోదు కాని తమ బతుకుల్ని చర్చి డైరీలలో వెతికి పట్టుకునే ప్రయత్నం కనిపిస్తుంది. ‘ఓ పాస్టర్ డైరీలా లేదు అది. దాన్నిండా ఆత్మగౌరవ తాలూకూ పదాలు. భూమి తాలూకు అన్వేషణలు.’ ఇక్కడ మార్టిన్, సీమోను, రూబేను, రూతు క్రైస్తవం లోకి మారినా, అది ఒక గౌరవ ప్రదమైన బతుకు కోసమే. అయినా వాళ్ళని కులం వెంటాడుతూనే ఉంటుంది.అందులోనూ వాళ్ళ ఆత్మగౌరవ ఆరాటం అట్లనే ఉంది.
తర్వాత కాలంలో గాంధీ నాయకత్వంలో జాతీయ ఉద్యమం ఊపందు కోవటం. ఆ సందర్భంలో వర్ణాశ్రమ ధర్మాన్ని బలపరిచే గాంధీని అంబేద్కర్ విమర్శించడం చూస్తాం . గాంధేయ హరిజనోద్ధరణఉద్యమం ఇది నిజంగా హరిజనోద్డరణ ఉద్యమం గూర్చి మాట్లాడుతూ , ‘హిందూ మతాన్ని రక్షించుకోవడం.బలమైన వర్ణాల్ని, వర్గాల్ని దానికి దూరం కాకుండా కాపాడుకోవటం. అక్కడా మాలా మాదిగలపైపై ఆంక్షలే.శుద్ధి పేరుతో చట్రంలో బిగించడమే.(పేజీ.172) . ఈ సందర్భంలో, గాంధీ ఉన్నారు జాగ్రత్త! -అంబేద్కర్ హెచ్చరిక.
ఎన్నెల దిన్నె ప్రాంతంలో జాతీయ ఉద్యమంలో అగ్రకులాలు నాయకత్వం వహించడం, గాంధీ హరిజన సేవాసంఘంలో శివారెడ్డి, గాంధీ శిష్యుడుగా శివారెడ్డి మనవడు మునగా లింగా రెడ్డి – ఇలా కరణం, చిన్న కరణం, అచ్చిరెడ్డి నుండి భూమి, అధికారం అగ్రకులాల మధ్య మారిన వైనం చూస్తాం. రచయిత ఒక చోట అంటాడు- ‘కృష్ణా నది పొలాలు కమ్మవాళ్ళ హక్కు.పెన్నా నది పొలాలు రెడ్ల హక్కు. అక్కడా ఇక్కడా చచ్చిన గొడ్డు మాత్రం మాదిగల హక్కు.’ వలస పాలకులకు వ్యతిరేకంగా గాంధీ నాయకత్వంలో జాతీయ ఉద్యమం, స్వాతంత్రానంతర పరిణామాలు. క్రింది కులాల్లో కొంత బానిసలు, పాలేర్లు లాంటి ఎట్టి బతుకుల నుంచి కూలీలుగా, క్రైస్తవ మిషనరీల ప్రభావంతో చదువువుకునే అవకాశం, అతి కొద్దిమందిగా అయినప్పటికీ ఆర్థికంగా, ఆలోచనాత్మకంగా కాస్త పైకి ఎదిగే అవకాశాలు ఏర్పడటం చూస్తాం. నర్సులుగా, బట్లర్లుగా, టీచర్లుగా, మతబోధకులుగా చిన్న చిన్న ఉద్యోగాల్లోకి రావటం, చిన్న చిన్న పనులకోసం నగరాలకి వలస పోవటం. స్వతంత్రం తర్వాత ప్రభుత్వం విద్యలో, ఉద్యోగాల్లో కల్పించిన అవకాశాల వల్ల దళిత కులాల్లో వచ్చిన చైతన్యంతో చిన్నదయినప్పటికీని ఆయా కులాల్లో ఆలోచించగలిగే మేధావి వర్గం ఏర్పడటం, కమ్యూనిటీ ప్రయోజనాల మేర సంఘటిత ఉద్యమాల్లో, పోరాటాల్లో పాల్గొనటం. శ్రామికులుగా, కూలీలుగా ప్రగతిశీల కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొనటం, ఆ తర్వాత కాలంలో నక్సలైట్ పోరాటాలకి ఆకర్షితులై శ్రీకాకుళ సాయుధ పోరాటం, నల్లమలప్రాంత నక్సలైట్ పోరాటం లోనూ, స్వతంత్ర దళిత ఉద్యమాల్లోనూ దళితులు ఉద్యమాలకి ఆయువుపట్టుగా ఉన్నారు. ఈ క్రమాన్ని రచయిత సృజనాత్మకంగా వివరిస్తూ, ఆ యా సందర్భాల్లో దళితులు వేర్వేరు రూపాల్లో వ్యక్తులుగా, సంఘటితంగా చేసిన పోరాటాలు, త్యాగాలు ఒకదాని తర్వాత చెప్పటమే గాక, ఇవి వాళ్ళ ఆకలి కోసం, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటాలుగా, వాటిని ఒక చైతన్య ప్రవాహంగా రచయిత మన ముందుంచుతాడు.
అదే ఆధిపత్యం, అలుపెరగని ప్రతిఘటనా పోరాటరూపాలెన్నో !
మనకు చరిత్రంటే రాజులు, రాజ్యాల మధ్య యుద్ధాలు, ఆధిపత్య వర్గాల మధ్య జరిగిన పోరాటాలు గానే గుర్తు. లేక మార్పు కోసం జరిగిన ప్రముఖ సంఘటనలు చుట్టూనే తిరుగుతుంది. మార్పు కోసం జరిగే పోరాటాలు, ఆధిపత్యంకి వ్యతిరేకంగా జరిగే ప్రతిఘటన పోరాటాలు ఒక్క సారిగా జరగవు. అవి ప్రజల్లో ఉన్న చైతన్యం బట్టి అనేక రూపాల్లో జరుగుతుంది, కొన్ని సార్లు ఆలోచనా రూపాల్లో, మరికొన్ని సార్లు బయటకు బద్దలై ఒక భౌతిక రూపం తీసుకోవటం జరుగుతుంది. మార్పుని మనం మానవ సంబంధాల్లోనూ, రోజువారీ జీవితంలో మనం చేసే ఘర్షణల్లోనూ చూడగలగాలి. ఆ విధంగా చరిత్ర రచనని చేసే విధానం ఈ అంటరాని వసంతంలో చూస్తాం. జేమ్స్ స్కాట్ అనే మేధావి ‘వెపన్స్ ఆఫ్ ది వీక్’ అనే గ్రంథంలో దోపిడీకి గురవుతున్న వాళ్ళు, పేదలు , బలహీనులు అన్నిసార్లూ హింసతో తలబడే ,స్పష్టంగా కనిపించే ప్రతిఘటనా ఉద్యమాలు చెయ్యరు, అట్లని పూర్తిగా లొంగి ఉండరు. రకరకాల రూపాల్లో ఆధిపత్యానికి వ్యతిరేకంగా తమ ప్రతిఘటనను, నిరసనను తెలుపుతారు అంటాడు. గ్రామీణ పేదలు,రైతులు ప్రత్యక్ష తిరుగుబాట్లు చేయకుండా రోజువారీ జీవితంలో నిశబ్దంగా, చిన్న చిన్న చర్యల ద్వారా ప్రతిఘటన తెలుపుతారని అంటాడు. తప్పుడు విధేయత, దొంగతనం, వ్యంగ్యం, చాటుమాటలు, అజ్ఞానాన్ని నటించడం చేస్తుంటారు అంటాడు. తమ పరిస్థితిని, పేదరికాన్ని, పెద్ద పెద్ద బహిరంగ పోరాటాలు చేయలేని సమయాల్లో తమ భద్రతకి లోపం లేకుండా ఆచితూచి అడుగులు వేసే క్రమంలో ఈ పద్ధతుల్ని అవలింబాల్సి వస్తుంది. అంటరాని వసంతంలో దళిత కులాలు ఆధిపత్యాని ప్రతిఘటిస్తూ చేసిన అనేక సంఘటలని ఈ దృక్పథం లోంచి చూసినపుడు అది సామాన్యమైన విషయంగా కాక, మార్పు దిశగా, ఒక మంచి సమాజం కోసం జరిపిన పోరాటంగా కనిపిస్తుంది.దళిత చైతన్యం రకరకాల రూపాల్లో ఉండి, భిన్న పద్ధతుల్లో వ్యక్తపరచినట్లు కనిపిస్తుంది. నిశబ్దంగా, కానీ నిరంతరంగా అధికారాన్ని కుదిపేస్తూ. ఈ పుస్తకం నిండా అటువంటి ప్రతిఘటనా సంఘటనలు అనేకం. వ్యక్తులుగా అసంఘటిత వీరోచిత సాహసాలనుండి సంఘటిత ఉద్యమాలుగా రూపుదిద్దుకున్న రాజకీయ పోరాట పరిణామాన్ని ఇందులో చూడొచ్చు. వరదలొచ్చి పల్లెను ముంచేసినప్పుడు తమను తరాలుగా తమును నిషేధించిన వూరి దారిలో నడుచుకు వెళ్ళటం, ఆకలి నుండి బయటపడటానికి షావుకారు కొట్టు బద్దలుకొట్టి బియ్యం తీసుకెళ్లటం, అదే అదునుగా మాలాడి దిబ్బ సేద్యం మొదలెట్టాలనుకోవడం, మిత్రుడు నారిగాడ్ని చంపినందుకు ప్రతీకారంగా ఎవరికీ తెలియనీకుండా రహస్యంగా కరణాన్ని మాదిగ మాతయ్య చంపడం, పొలాలు తడవటం కోసం నీళ్ళ దొంగలుగా పిట్టోడు-పోలడు, దేవత ఆవహించి పూనకమిచినట్టుగా పార పట్టుకుని నీళ్ళ కాల్వ తెంచి దమ్ముంటే నన్ను కదల్చమని సవాలు విసిరిన సుభద్ర , ఊరిలో ఏర్పరిచే ఎటువంటి సాంస్కృతిక ప్రదర్శనకైన ఆనవాయితీగా అగ్ర కుల పెద్దల్ని పిలిచే దానికి భిన్నంగా కళాకారులైన ఎల్లన్న- నాగన్నలు ఘనత వహించిన పెద్దమాల , అంతే ఘనత వహించిన పెద్ద మాదిగ వచ్చి తమ స్థానాలని అలంకరించారంటరా అని ప్రదర్శన ముందు అనడం. నరసిమ్మని కొట్టినందుకు ప్రతీకారంగా నాయుడు చేను పీకడం, బాలకోటడు మామిడికాయలు కోసుకున్నాడని కొట్టినందుకు చౌదరి కోటయ్య దున్నకుర్ర మాయం చేయటం, అవలపాడు చెరువులో దిగి నీళ్లు తీసుకోటానికి అగ్రకులాల వాళ్ళు దాడిచేస్తే ఎదురుదాడి చేసిన పల్లె . ఆ సందర్భంలో పోలీసులు వచ్చినపుడు పెంచలి పోలీసు తుపాకీ దాచిపెట్టడం కూడా ఈ తోవ లోనిదే. ఆ తర్వాత జరిగిన సంఘటనల్ని గమనిస్తే, దళితులు కుల వర్గ ఆధిపత్యాన్ని ప్రతిఘటిస్తూ స్పష్టమైన భావజాలంతో సంఘటిత విప్లవ పోరాటాల్లో భాగస్వాములైన రాజకీయ పరిణామక్రమాన్ని చూస్తాం. ఈ నవలలో అంతక ముందు వేర్వేరు సందర్భాలలో రకరకాల రూపాల్లో వ్యక్తిగతంగా/సామూహికంగా, ప్రత్యక్షంగా/ పరోక్షంగా , సాంస్కృతికంగా/ మత పరంగా, సామాజికంగా/ రాజకీయంగా, భూమికోసం/ ఆత్మగౌరవం కోసం జరిపిన చిన్న/పెద్ద పోరాటాలకి కొనసాగింపుగా చైతన్యవంతమైన దళిత సామాజిక వర్గ పోరాటాలను చెప్పుకుపోవటం చూస్తాం. రామానుజం, ఇమ్మానియేలు, జెస్సీలు శ్రీకాకుళ పోరాటం లోనూ, ఆ తర్వాత ఏనబయ్యో దశకం తర్వాత కారంచేడు దళిత ఉద్యమాల్లోంచి బయలుదేరి నల్లమల ప్రాంతంలో సాగిన నక్సలైట్ పోరాటాల్లోకి సాగినట్టుగా రచయిత ఈ నవలను ముగిస్తాడు.
దళిత విప్లవం ఆదర్శంగా
తెలుగు సమాజంలో, విప్లవోద్యమం, దళిత ఉద్యమం రెండు బలమైన ప్రత్యామ్నయ ఉద్యమాలుగా ముందుకొచ్చాయి. భావజాలపరంగా, ఎత్తుగడల. విషయంలోనూ భిన్న ధోరణాలుగా ఉన్నాయి. విప్లవోద్యమం మార్క్సిస్ట్ వర్గ దృక్పథంతో సాయుధ పోరాట పంథాలో శ్రామిక విముక్తిని చూసింది.చారిత్రకంగా, అరవయ్యో దశాబ్దం చివర్లోని శ్రీకాకుళ సాయుధ గిరిజన పోరాటం నుండి నేటి నక్సలైట్ పోరాటాలుగా సాగుతున్నాయి. దళిత ఉద్యమాలు అంబేద్కర్ భావజాలంతో కుల రహిత సమాజం కోసం రాజ్యాంగ పరిధిలో ప్రజాస్వామిక పోరాటాలతో ముందుకొచ్చాయి. ఎనబయ్యో దశకం మధ్య నుండి దళిత ఉద్యమాలు స్వయంప్రతిపత్తి కలిగి బ్రాహ్మణిజం పై యుద్ధాన్ని ప్రకటించాయి. కారంచేడు, చుండూరు సంఘటనలలో దళితులపై అగ్రకులాలు జరిపిన మారణహోమానికి ప్రతిఘటనగా దళితులు సంఘటితమై ఉద్యమించిన నేపథ్యంలో విప్లవ ఉద్యమాలకి, మార్క్సిస్ట్ వర్గ పోరాటాలకి కొంత భిన్నంగా స్వతంత్ర దళిత ఉద్యమాలకి దారులు పడ్డాయి. ఈ సందర్భంలో తొంబయ్యో దశకం నుండి బలమైన దళిత సాహిత్యం కవిత్వంగా, కథలుగా, ఆత్మకథలుగా, పాటలుగా వెలువడి తెలుగు సాహితీ సాంస్కృతిక వాతావరణాన్ని మార్చివేసింది. రెండు వేల నాటికి దళిత నవల ఆవిర్భావం జరిగింది. స్పార్టకస్ (జి.మోహన రావు) ‘ఖాకీ బతుకులు’ ,చిలుకూరి దేవపుత్ర ‘ పంచమం’ , వేముల ఎల్లయ్య ‘ కక్క’ నవలలు వచ్చాయి. అదే కాలంలో కళ్యాణరావు ‘అంటరాని వసంతం’ నవల వచ్చింది. అంటరాని వసంతం మిగిలిన నవలకి కొంత భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఖాకీ బతుకులు పోలీసు కానిస్టేబుల్ గా మొదటి తరం దళిత ఉద్యోగులు పాలన యంత్రాంగంలోకి ప్రవేశం, కుల వివక్షతతో బాటుగా ఒక యాంత్రికంగా అధికారుల చెప్పినట్టు నడుచుకుంటూ సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోయే సంఘర్షిత వాతావరణం , ఆత్మగౌరవం కోసం ఆరాట పడటం కనిపిస్తుంది. అచ్చ తెలంగాణ మాండలీకం లో రాయబడిన కక్క నిస్సహాయ దళిత శ్రామికుడు కథ, అగ్ర కులంతో బాటుగా, ఒంటరి కుటుంబంగా వున్న తను, తన కులంలోనూ వివక్షత ఎదుర్కోవటం, అంతిమంగా మాదిగీకరణ ఆదర్శంగా కక్క అనే మాదిగ యువకుడు చేసే పోరాటం. రాయల సీమ ప్రాంతం నుండి వచ్చిన పంచమం నవలలో చైతన్య వంతుడైన దళిత యువకుడు డిప్యూటీ కలెక్టర్ అయినా వెంటాడే కుల వివక్షత, ఈ వ్యవస్థ మారనిదే తానేమీ చేయలేననేనిస్సహాయత. చివర ఈ నవలలో ముగింపు పౌర హక్కుల నాయకుల ప్రవేశంతో శాంతియుతంగా రాజ్యాంగ పరిధిలో సమాధానాలు ఉంటాయి. ఆధిపత్య కులాల మీద, వ్యవస్థ పైన తిరగబడి పోరాటం చేసే విధంగా ఉండవు.
విప్లవ సాహిత్య నవలలకు ఇచ్చే ముగింపులకు, ఉద్దేశ్యపూర్వకంగానే దూరంగా జరిగినట్టు చూస్తాం. అంటరాని వసంతం నవల దళితుడైన కళ్యాణరావు, కనీసం నూట యాభయేళ్లుగా పరుచుకున్న దళిత జీవితం, సాహిత్యం, సంస్కృతి, చైతన్యం, పోరాటం నవల కాన్వాస్ గా ఉంటుంది. మొత్తంగా దళిత కమ్యూనిటీ ఆకలికి వ్యతిరేకంగా, ఆత్మగౌరవం కోసం వీరోచితంగా చేసే పోరాటం వుంటుంది. అయితే , ఈ క్రమంలోనే ముగింపు విషయానికొస్తే, నవలలో విప్లవ నక్సలైట్ రాజకీయ పోరాటాలనే ఆదర్శంగా ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. ఒక విధంగా ఇటువంటి ముగింపు పైన కొంత చర్చ జరగటమే గాక, ఈ నవలను దళిత నవలగా పరిగణించాలా లేక విప్లవ నవలగా పరిగణించాలా అనే తర్జన భర్జనలు కూడా జరిగాయి. రచయిత సుదీర్ఘంగా విప్లవ రచయితల సంఘంలో నిర్ణయాత్మక పాత్రలో ఉంటూ విప్లవ రాజకీయాల్ని నమ్ముతూ, దళిత ఉద్యమాలు రాడికల్ తిరుగుబాటు ఉద్యమాలుగా ఉండాలని కోరుకున్నట్టు కనిపిస్తుంది. బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా వర్గ పోరాటాలకి భిన్నమై దళిత బహుజన కులాలు సంఘతీతమై దళిత ఉద్యమాలు ఒక కొత్త ఒరవడిలో ఊపందుకున్న సమయంలో దళితులు విప్లవ పంధా వైపు పరిగెడటం కొంత ప్రశ్నార్ధకంగా అనిపిస్తే, అందుకు రచయిత సాయుధ విప్లవ రాజకీయ పోరాటాలతోనే దళిత సమస్యకు పరిష్కారముందని నమ్మటంతో బాటుగా, తన కుటుంబంలో కారంచేడు సంఘటన తర్వాత విప్లవ పోరాటాల్లోకి వెళ్లిన వాస్తవ సంఘటనలోంచి రాసినట్టుగా రచయిత చెబుతాడు. ఈ నవల ఎంతగా అంటరాని కులాల సామాజిక జీవన పోరాటాలను అక్షరబద్ధం చేసినట్టుగా ఉన్నా, ఇది తన కళాకారులుగా, వీధిభాగోతికులుగా, క్రైస్తవులుగా, దళిత పోరాట యోధులుగా, విప్లవకారులుగా అంటరాని వసంతంగా సాగిన తన వంశీయుల చరిత్రగా రాసుకున్న నవల అని రచయిత చెప్పటం జరిగింది. ఈ సందర్భంలో అంటరాని వసంతం నవలని ఒక లేబుల్ వేసి చూడటం ఇబ్బందికరంగానే ఉంటుంది. బ్రాహ్మణీయ ఆలోచనా ధోరణి పడగవిప్పి దళితుల్ని వివక్షకు గురిచేస్తూ , అన్ని రంగాల్లోనూ కులాధిపత్యం రాజ్యమేలుతున్న సమయంలో అధికారం కోసం, ఆత్మగౌరవం కోసం దళితులు చేస్తున్న పోరాటాలు ఎంతో న్యాయబద్ధమైనవి , అవసరమైనవి. రాజ్యాంగ బద్ధంగా ఉండాల్సిన ప్రభుత్వాలు అగ్రకుల పక్షపాతిగా వుంటూ, పౌరుల హక్కులని ,ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కులతత్వానికి లోనైన సందర్భంలో దళిత విముక్తి కోసం ఎటువంటి పోరాటాలు చెయ్యాలి అన్నది మనముందు సమస్య. దళితులు సంఘటితమై ఆధిపత్యం మీద తిరగబడటం సమంజసంగానే ఉంటుంది. అవసరమయితే వ్యవస్థంతా హింసాత్మకంగా ఉన్నప్పుడు, ప్రతిఘటనా హింస తప్పని సరవుతుంది. ఈ రోజు మనం రాజ్యాంగాన్ని అమలు పరచమని చెప్పటానికి కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే, కళ్యాణరావు ముగింపులో చెప్పిన విప్లవోద్యమం దళిత సమస్యను అర్ధం చేసుకున్న తీరు పైన, ఉద్యమం నడుస్తున్న విధంపైన దళిత ఉద్యమాలు చేస్తున్న విమర్శలు కొన్ని సహేతుకంగా ఉండవచ్చు. నేడు మనం చూస్తున్న విప్లవ ఉద్యమాలతో పేచీ ఉండొచ్చు, కానీ దళితులు తమదైన రీతితో సంఘటితమై విప్లవించాల్సిన అవసరమైతే ఉంది. ఆ విధంగా చూసినప్పుడు అంటరాని వసంతం నాకు దళిత విప్లవ నవలగా అనిపిస్తుంది. ఇది బ్రాహ్మణీయ భావజాలానికి ధీటైన సమాధానంగా ఉంది. అంబేద్కర్ స్పూర్తి తో బాటు మనం తిరగబడి యుద్ధం చేయాలన్న మార్క్సిస్ట్ ఎత్తిగడ కూడా ఉంది.కుల వర్గ మరియు ఇతర వివక్షతలు లేని అందమైన సమాజాన్ని కోరుకున్నట్టు ఉంది. ఆ సమాజం మన రోజువారీ జీవితం, సామాజిక జీవనం, సాంస్కృతిక వారసత్వం,తాత్విక ఆలోచనలతో ముడిపడి ఉంది.
జానపదీయుల కళా సాంస్కృతిక సౌందర్యం
అంటరాని వసంతం ఒక మనోన్నత సాంస్కృతిక భాండాగారం. అంటరాని కులాల జీవితాలతో, అనుభవాలతో, శ్రమతో, ఆనందాలతో, ఆవేశాలతో, సంఘర్షణలతో, రోజువారీ పోరాటాలతో విడదీయలేన్నంతగా ముడిపడిపోయిన జానపదీయుల కళా సంస్కృతే ఈ దేశ అసలైన సంస్కృతిగా సాగే సృజన ప్రవాహం ఈ అంటరాని వసంతం. కళని, సాహిత్యాన్ని శ్రామికుల జీవనం నుండి నిర్వచిస్తూ, అధికారికంగా భారతీయ సంస్కృతి /సాహిత్యంగా చెలామణి అవుతున్నదానిని జీవం లేని నకిలీ కళగా ఎండగడతాడు. ఈ దేశంలో కళల పుట్టుకను వివరిస్తూ, అంటరాని శ్రామిక కులాల్లోంచి విలసిల్లన కళ ఎలా దోపిడీకి గురై, బ్రాహ్మణీయ సంస్కృతిలో బందీ అయిందో సవివరంగా అనేక సంఘటనల ద్వారా వివరించడం జరిగింది. ‘భూమ్మీద జరిగే ప్రతి మార్పు కళని మారుస్తూ ముందుకొచ్చింది. ప్రతి మూలలో సంఘర్షణే చరిత్రగా నిలిచింది. అలజడి , ఆందోళన తిరుగుబాటు. ఆ అలజడే కళ. ఆ ఆందోళనే పాట. ఆ తిరుబాటే ఆట’ అంటాడు. (పేజీ.86) ఒక్క మాటలో, ఈ భూమ్మీద జరిగిన ప్రతి పనిలోంచి పాట పుట్టింది.
మరొక చోట రచయిత అన్నట్టుగా, ‘అసలు జానపదం లోనే ఆ స్వచ్ఛత, నిజాయితీ ఉంది. నిర్మలత్వం, సహజత్వం ఉంది. అందుకే అది విసిరేయబడ్డా, వెలివేయబడ్డా సజీవంగా ఉంది.’ (పేజీ.93). కళ్యాణరావు సాహిత్యం, సంస్కృతి, కళా సౌందర్యంపై స్పష్టమైన అవగాహనతో భారతీయ సంస్కృతి చారిత్రికంగా మారిన క్రమాన్ని ఈ నవలలో ఆధారాలతో వివరించే ప్రయత్నం చేస్తాడు. మానవ నాగరికతలో మౌఖిక సంప్రదాయం నుండి లిఖిత సంప్రదాయం, జానపద సాహిత్యం/సంస్కృతి నుండి (బ్రాహ్మణీయ) శాస్త్రీయ సాహిత్యం/ సంస్కృతి, ప్రకృతిలో ఆరుబయట సాగిన సృజన నుండి మతంతో ముడిపడి దేవాలయాల్లో బందీ కవించబడ్డ సాహితీ/ సాంస్కృతిక చారిత్రిక పరిణామాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు చెబుతాడు. ఈ క్రమంలోనే, నిరక్షరాస్యుల అల్లిక సాహిత్యం నిరాదరణకు, హేళనకు గురై, అదే విషయాన్ని చాలా శాస్త్రీయం పేర, వ్యాకరణ శుద్ధి పేర తిరగరాసి లిఖిత సంస్కృతిగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ పరిణామ క్రమాన్ని చెబుతూ, ‘ఆలయం బయట కళ అంతా,సాహిత్యమంతా,సంస్కృతి అంతా అలగాజనానిదైపోయింది. ఆలయం లోపలి జీవం లేని పెనుగులాటంతా కళయి ముందుకొచ్చింది.’(పేజీ. 90). మాలల ఉరుముల నృత్యం అగ్రవర్ణాలు దొంగిలించి దేవాలయంలో దాచుకున్న పేరని నృత్యంలా చెలామణి అయింది అని ఒక చోట అంటాడు.
జానపదం నుండి పండిత సాహిత్యం వరకు జరిగిన సాహితీ సాంస్కృతిక పరిణామాన్ని ఎంతో స్పష్టతతో, బాధతో, కసితో రచయిత వివరిస్తాడు. ఈ ప్రక్రియలో కోల్పోయిన దళిత సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి సొంతం చేసుకోవాలన్న తహ తహ కనిపిస్తుంది. మా అయ్య అల్లింది అంటరానిదయింది, దాన్ని వాళ్ళ రాస్తే, రాతేమో రాజై కూర్చుంది అంటాడు రచయిత. అంటరాని కులాల్లో ఎంత కళ దాగుంది, కానీ అదెప్పుడూ గుర్తింపుకు నోచుకోలేదని చెబుతూ ఒక సూత్రీకరణ చేస్తాడు రచయిత- ఆధునిక తెలుగు నాటకం మూలాలు అంటరాని కులాల వీధిభాగోతంలో ఉన్నాయని. ‘నాటకానికి తెరలు కట్టారు. మనం జనం మధ్యలోనే.
అసలు గీతం, సంగీతం, నృత్యం, అభినయం కలిసిన వీధిభాగోతమే ఓ గొప్ప రూపకం. ఓ సమాజం. ఓ సంస్కృతి. దేవతల్ని ,దేవుల్ని అచ్చం పల్లెటూరి వాళ్ళలా మలుచుకుంటూ, మాటాడుతో నడిచిన జనం మధ్య అడ్డతెరలు లేని ఓ సజీవ ప్రక్రియ.’(పేజీ.74)
సామాన్యుల్లోని కళ గురించి, సృజన గురించి ప్రస్తావిస్తూ, ‘సామాన్యుల బతుకుల్లో దాగుంది చిన్నాచితక కళ కాదు. గొడ్డు చర్మాన్ని అతి లాఘవంగా నైపుణ్యంగా వలిచే పోలడు, కొయ్య చెక్కే పిట్టోడు, నార తో నానా విధాలు నాట్యం ఏంకటనరుసు ఎంత గొప్ప సజీవ కళాకారులు.’(పేజీ.100) అంటాడు. అది కళ మాత్రమే కాదు, శ్రమ లోంచి పుట్టిన జ్ఞానం కూడా. కళ్యాణరావు ఈ నవలంతటా దళిత కులాల సంస్కృతిక వారసత్వాన్ని గానం చేసేడు. చంద్రప్ప, నాగన్న, ఎల్లన్న, కుమ్మరి పెద్ద కోటీశ్వరుడు లాంటి సాహితీ సాంస్కృతిక కళాకారుల గొప్పతనాన్ని కీర్తించాడు. ఉరుముల నృత్యం, మాలా-మాదిగ-ఎరుకల- యానాదుల వీధి భాగవత కళారూపాల్ని,కుమ్మరి కోటీశ్వరుడి ద్విపదలు, ఇలా చదువులేకున్నా అప్పటికప్పుడు అల్లేసి తెరలు లేకుండా ప్రజల మధ్యలో ప్రదర్శించిన వారి ఔచిత్యాన్ని తెలియచేయడం గమనిస్తాం. ఇందులో కళాకారుడు ఎల్లన్న అద్భుత ప్రతిభ, అతని పాటల్లో, ప్రదర్శనలో జీవితం, పోరాటం, ప్రతిఘటన, ఆత్మగౌరవం, మంచి సమాజం గురించి ఓ కొత్త ఊహని బహుగొప్పగా చెబుతాడు. బతుకు సౌందర్యం ఉట్టిపడే సృజనతో ఈ దేశంలోంచి పుట్టుకొచ్చిన ఒక అపరూప జానపదీయ దేశీయ గొంతుకను పరిచయం చేసిన రచయిత యొక్క రాజకీయ సాహితీ దృక్పథాన్ని కొనియాడాల్సిందే.
జానపదీయుల కళాత్మకతని భావుకతా తన్మయంతో మెచ్చుకుంటూ, వాళ్ళు నాగరికతా నిర్మాతలుగా వర్ణిస్తాడు. ఎన్నెల దిన్నెలో ఒక సంఘర్షణా వాతావరణంలో ఉద్వేగంతో నాగన్న పాటల ప్రవాహగానం గురించి చెబుతూ – నాగన్న గంగ పాటలు కొత్తగా పాడేడు. గంగను భూమ్మీదకు తెచ్చింది భగీరథుడు కాదు, ఉరుములోళ్ళు. భగీరథుడు ఆనందం. ఉరుములోళ్ళు నిజం. ప్రళయం ఉరుములొల్ల శబ్దంలో పుట్టింది.’ పాటే కాదు, ఙ్ఞానం, నాగరికత వీళ్ళతోనే పుట్టింది అంటాడు.
‘ఈ భూమ్మీద మొదట నీటి కయ్యలు కట్టింది మాదిగోళ్ళు, మాలోళ్ళు, ఎరుకలోళ్ళు ఏనాదోళ్లు , గిరుల గుండెల్లో నిద్రపోయే గిరిజనులు. నిప్పు చేశారు.నీళ్లు తెచ్చేరు. భూమి దున్నేరు. బువ్వ వండేరు. ఆ తర్వాత ఎవ్వరొచ్చినా. నోటి కాడ కూడు కొట్టేయడానికి ఎవరొచ్చినా. అట్లా పాడేడు.’
అంటరాని వసంతంలో రూతు సూత్రధారి అయి, తన కుటుంబం గురించి, తన జాతి గురించి అనేక సంఘటనలను, చారిత్రక ఘట్టాలను, వీరోచిత పోరాటాలను పోగుచేసి చెప్పుకుంటూ పోయినా, ఎల్లన్నే ప్రధాన పాత్రగా, ఒక విధంగా కథానాయకుడిగా,అటు కళాకారుడిగా, పోరాట యోధుడిగా, మాల బైరాగిగా, గొప్ప తాత్వికుడిగా ఆవిష్కరించబడ్డాడు. వీర గాధలకి ప్రాణం పోసిన ఎల్లన్న జీవితమే ఒక వీరగాధ. రూతు చెప్పిన ఈ కతలో ఎన్ని ఉపకతలో, ఎందరు హీరోలో. ఎన్నెల దిన్నె భూపోరులో సుభద్ర ఒక వీర నాయకి. చరిత్రలో అదో అపరూపమైన సన్నివేశం.
ఎన్నెల దిన్నె , ఎన్నెల పిట్ట, ఎల్లన్న
ఎన్నెల దిన్నె ఆటెల్లడు, పాటెల్లడు ఎల్లన్న. రూతు భర్త రూబేనుకి తాత. రూబేను ఎంతో శ్రమతో వెలికి తీసిన కళాశకలం ఎల్లన్న. ఎల్లన్న తండ్రి ఎర్రెంకడు, తల్లి లింగాలు, భార్య చుక్కల ముగ్గుకర్రగా పిలుచుకునే సుభద్ర , కొడుకు శివయ్య అలియాస్ సీమోను, మేనత్త భూదేవి గారాల బిడ్డ ఎల్లన్న.బావమరిది వెంకటనర్సు.
ఊర్లో ప్రదర్శన కొచ్చిన ఎర్ర గొల్లల గుడారాల్లోకి దూరిన మాల ఎల్లన్న , తాటి మట్టలతో తన్ని తరిమేయబడ్డ అంటరాని కుర్రోడు. అట్లా తరమబడ్డ ఎల్లన్నను చేరదీసిన కళాకారుడు నాగన్న . నాగన్న కూడా ఒక విధంగా ఎల్లన్నలా ఎన్నెల దిన్నె వదిలివచ్చినోడే. ధర్మారం చంద్రప్ప దగ్గర పురాణ రహస్యాలని, కళకు సంబంధించిన మెళుకువలు తెలుసుకున్నవాడు. అన్నీ ఎల్లన్నకి నూరిపోసి ఒక మహోన్నత కళాకారుడిగా తీర్చిదిద్ది, ఆ కళకి ప్రయోజనాత్వకంగా ఉండేలా చివరకి తమ సొంత ఊరు వెన్నల దిన్నిను ముద్దాడుతూ కళా ప్రదర్శనలు ఏర్పరచడం. తమ ఊరిలో తమ వాళ్ళు భూమి కోసం ఆత్మగౌవరం కోసం చేసిన పోరాటాన్ని మలాడి దిబ్బ వీరగాధగా మలిచి ప్రదర్శించడం ఒక సాహసం, సృజనాత్మకతకు అది ఒక పరాకాష్ట కూడా.
అది నాటకం కాదు, ఒక ప్రతిఘటన. నాటకం మొదలయ్యే ముందు ఘనత వహించిన పెద్ద మాల, పెద్ద మాదిగ వచ్చారంట్రా.ఆహ్వానించే సన్నివేశం ఒక విప్లవాత్మక నిరసన. ఎర్ర గొల్లల్ని దగ్గరగా చూసే ప్రయత్నం చేసిన మాల కుర్రోడు ఎల్లన్నని తరిమిన క్రూర సామాజిక సన్నివేశానికి భిన్నంగా. అగ్రకులానికి తల కొట్టేసేలా. కరణం గారు వచ్చారా, కాపులు వచ్చారా అనే అనవాయితీకి వ్యతిరేకంగా. ఇది కేవలం నాటకీయ సన్నివేశం కాదు, ఇందుకు ఎంత సాహసం కావాలి. సృజనాత్మకంగానైనా, ఈ ఊహే ఒక విప్లవాత్మక సందేశం.
చంద్రప్ప, నాగన్న, ఎల్లన్న గొప్ప కళాకారులు. వీళ్ళు చరిత్రలో గుర్తింపుకు నోచుకోలేదు. వీళ్ళు నవల లో పాత్రధారులు మాత్రమే కాదు. అంటరాని కులాల్లోంచి వచ్చిన ఇటువంటి అనేకమైన అద్భుత కళాకారులకు ప్రతీకలు. చంద్రప్పకి జానపదం మీద మంచి పట్టుంది. వీధి భాగోతం తెలుసు. నాగన్నకి ఉరుములు నృత్యంతో బాటు బయలాట తో కూడా పరిచయముంది. ఆట పాటల ఎల్లన్నే ఒక గొప్ప సాంస్కృతిక సన్నివేశం.ఈ అంటరాని శరీరం ఎంత అద్భుతమైన సజీవ కళకు నిలయం. ఎల్లన్న వాడిన భాష పుస్తకాల్లో లేదు. ఈ మాల బైరాగి గాలి పాట జీవితమంత సహజమైనది. ఈ దేశ కళా రంగంలో ఈ అంటరాని కులాల కళా సృష్టి ముందు అంతా దిగదుడుపే అంటాడు.‘తోలు బొమ్మల మరాఠీ వాడు మనోడే. రాధ, కృష్ణుడు మన కేతిగాడు, బంగారక్కల ముందు ఎందుకు పని కొస్తారు’ అని చురకేస్తాడు. కుమ్మరి పెద్ద కోటేశ్వరుడు అయితే ద్విపదలు కుమ్మరి చక్రంలో జీవిత చక్రంగా మలిచాడు. వీర బ్రహ్మాన్ని, బసవన్ని కలిపితే అదే ద్విపద రూపమన్నాడు. ఆ అంటరాని శరీరంలోనే ఒక మెరుపు ఉంది అని భావోద్వేకతతో అంటాడు. యానాదుల ఆటల్లో వున్న వొడుపు నాకు ఎక్కడా కనపడలా. ఇలా జానపద కళాకారుల మహోన్నతిని కొనియాడుతూ, వాళ్ళని గుర్తించక పోవడం, వాళ్ళ రచనలు గ్రంధస్తం కాకపోవడం విచారకరం అంటాడు. ఈ కళాకారుల గొప్పతనం గురించి ఎక్కడా గ్రంధస్తం కాలేదు. వాళ్ల రచనలు ఎప్పుడూ ప్రింట్ కి నోచుకోలేదు. మిగిలిన బ్రాహ్మణీయ సాహిత్యాన్ని పట్టించుకున్నట్టుగా, వాటిని వెలికితీసే ప్రయత్నమెవరూ చేయలేదు. ఎల్లన్న పాటల్ని రాత ద్వారా భద్రపరుద్దామనుకున్న కుమ్మరి కోటేశ్వరుడ్ని అగ్ర కులం దాడి చేసి చంపివేసే సంఘటన ప్రతీకాత్మకంగా వీళ్ల ప్రతిభని వెలుగు చూడనీయకుండా ఉండటానికి జరిగిన కుట్రకి నిదర్శనంగా చూడొచ్చు.అట్లా అగ్రకుల దాడిలో చితి మంటల్లో ఎల్లన్న రాత ప్రతులు. ఆశ్చర్యకర విషయమేమిటంటే, పుస్తకాల్లో ఈ అంటరాని గొంతులు కనిపించకపోయినా, ప్రజల్లో ఇప్పటికే సజీవ గొంతుకలుగానే ఉన్నాయి. రూబేను హమకొండలో ఎల్లన్న మాలాడి దిబ్బ వీరగాధ సాంబయ్య నాన్న దిబ్బయ్య ద్వారా పాడించుకుని భద్రపరిచే ప్రయత్నం చేస్తాడు. అట్లా ప్రజానీకంలో ఈ సాహిత్యం, సంస్కృతి ప్రవహిస్తునే ఉంది. ‘అసలు జానపదం లోనే ఆ స్వచ్ఛత, నిజాయితీ ఉంది.నిర్మలత్వం, సహజత్వం ఉంది.అందుకే అది విసిరేయబడ్డా, వెలివేయబడ్డా సజీవంగా ఉంది.’ (పేజీ.93)
దళిత కులాల శ్రమలో పుట్టిన కళకి, కళాకారులకు ఎంత ప్రతిభ ఉన్నా గుర్తించకపోవడం, కళని, సాహిత్యాన్ని నిర్ధారించడానికి పాశ్చాత్యులనుండి, వలసవాదుల నుండి తెచ్చుకున్న ప్రమాణాలతో భారతీయ సాహిత్యాన్ని బేరీజు వేసుకున్న వాళ్ళు తమ కళ్ళ ముందున్న ఈ అంటరాని వాళ్ళ అద్భుత కళా సంపదని చూడలేక పోయారు అంటాడు కళ్యాణరావు. ప్రతిదీ కులం కళ్ళతోనే చూడటం వల్ల ఈ గొప్ప భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని చూడలేక పోయారు. ‘ఎంతో సత్తా ఉంటే తప్ప ఆ కులాల వాళ్లు గుర్తింపు పొందరు. పరిచయానికి నోచుకోరు.ఎందరో కళాకారులు కాలగర్భంలో కలిసిపోయారు. చరిత్ర వాళ్ళని తన పేజీల్లో రాసుకున్నట్టు దాఖలాలు లేవు. ఈ దేశంలో కళ కన్నా కులం ముఖ్యంమైంది. కళని కూడా కులం తక్కెట్లో తూచారు. వీళ్లని మాత్రం తుకానికే కాదు అసలు తక్కెట దాకా రాకుండానే చేశారు.’(పేజీ .43)
సాహితీ విమర్శలో దళిత దృక్కోణం నుండి కల్యాణరావు ఈ అంటరాని వసంతంలో కళా తాత్విక సిద్ధాంతం చెప్పినట్టు కనిపిస్తుంది. సాహిత్యం, చిత్రలేఖనం, నాటకం గురించి తీర్మానాలు, తీర్పులు అన్నీ చేసింది భగవద్గీతలే, వలస హృదయాలే. రవివర్మకి, రాజమన్నార్ కి ఈ భూమి మీద కురిసి వెలసిన వెలి కదలికలు కనిపించవు ఈ వెలి కదలికల్లో తెలుగు నాటకం మూలలు చూడటానికి ఇష్టపడని రాజమ్మన్నార్. యూరోపియన్ తెరల వెనక తెలుగు నాటకాన్ని వెతుకుతున్న ఈ ‘ఆశ్వీరదించబడ్డ తీర్పర్లకు ‘ ఎల్లన్నల నటనలో, నర్తించిన పాదాల లయలో నాటకం కన్పించదు.( పేజీ.63 ). రచయిత ఒక చోట వ్యంగంగా అంటాడు- మాలలు ,మాదిగలు, ఎరుకలు, యానాదులు, చాకల్లు, అట్లా అనేకులు చెప్పేది అలగా మాటలు, సిద్ధాంతాలు మేధావులే చెప్పాలి.
కవిత్వాన్ని, కళని నిజంగా చూడాలంటే, ఈ దేశ అంటరాని బతుకుల్లో, శ్రామికుల్లో నుండి వచ్చిన కళల లోంచే అని అంటరాని వసంతం పదే పదే గుర్తు చేస్తుంది. ‘మాల బైరాగి గొంతు యానాది రమణయ్య డప్పుపై పుల్ల లయ,కుమ్మరి పెద కోటేస్వరుడి రాత.కురిసే వెన్నెల. తడిసే ప్రకృతి, కలిసే పిల్లగాలి, సత్యం శివం సుందరం’ అంటాడు రచయిత.
ప్రత్యామ్నాయ తాత్విక దారిదీపం
అంటరాని వసంతం దళితుల జీవిత అనుభవాలు, ఆవేదనలు,నమ్మకాలు, చరిత్ర, సంస్కృతి, పోరాటాల్లోంచి పొర్లి వచ్చిన తాత్విక ధార. ఇది ఆధిపత్యాన్ని ప్రతిఘటించే ఆలోచనా ధోరణి. యధాస్థితిని తిరస్కరిస్తూ మార్పు దిశగా నడిచే ప్రవాహ ధ్వని. బానిసత్వాన్ని సవాలు చేస్తూ సాగే ఆత్మగౌరవ లాంగ్ మార్చ్. ఇది అణిచివేతకు, దోపిడీకి గురవుతున్న జాతుల విముక్తి తత్వశాస్త్రం. ఇది ప్రాకృతికమైనది మరియు శ్రమ లోంచిపుట్టిన జీవన తత్వం. మొత్తంగా ఇది భారతీయ ప్రధాన తాత్విక ధోరణులకు భిన్నమైనది. కులవ్యవస్థని బలపరిచే బ్రాహ్మణీయ తాత్వికతకు సవాలుగా నిలిచిన ప్రత్యామ్నాయ తాత్విక స్రవంతి. భారతీయ తాత్వికతను ప్రజాస్వామీకరించే ప్రక్రియకు పూనుకున్నది. తత్వశాస్త్రాన్ని కొత్తగా నిర్వచిస్తూ,కుల వ్యవస్థను, కర్మ సిద్ధాంతాన్ని, మను వాదాన్ని తిరస్కరించే సామాన్య ప్రజల తత్వశాస్త్ర పద్ధతిని పరిచయం చేసింది. ఇది వాస్తవ జీవితాల మీద నుండి విముక్తి వైపు సాంస్కృతికంగా రాజకీయంగా పయనించిన ఎల్లన్న తాత్విక సంగీతం. ఎల్లన్న భారతీయ ఆత్మగౌరవ తాత్విక ప్రతినిధి.
ఈ దేశ అగ్రకుల సాహిత్యమూ, సంస్కృతీలానే, ఆధిపత్య తత్వ శాస్త్రమూ ఒక మోసపూరితమైన కుట్ర సిద్ధాంతంగానే రచయిత చూస్తాడు. ఒక చోట కసిగా అంటాడు, ‘ఈ దేశం సంస్కృతికి సిగ్గులేదు. ఉన్నదల్లా కుట్ర. ఈ దేశం సంస్కృతికి నిజాయితీ లేదు. ఉన్నదల్లా మోసం. ఇక్కడ వేదం, మతం, మనువు, సహనం, సామరస్యం అన్నీ కుట్రకి మోసానికి పర్యాయపదాలు.’(పేజీ.130). అంతే గాక ఈ బ్రాహ్మణీయ తత్వం అవాస్తవిక పునాది మీద నిలబడినదిగా, కొన్ని పదాల జిమ్మిక్కుగా ఉన్నట్టు చెబుతూ, ‘ఇదంతా వేదాంతం. నొసటి గీత సిద్ధాంతం. ఆది లేనిది. అంతం లేనిది. అనంతమైంది. అర్ధం చేసుకోలేనిది. కేవలం కొందరు మాత్రమే అర్ధం చేసుకోగవలిగేది. వాళ్లు మాత్రమే చెప్పగలిగేది.’
నవలలో ఇటువంటి తాత్వికత పట్ల రూతు యొక్క వైఖరిని చెబుతూ, ‘రూతుకి ఇవన్నీ అక్కర్లేదు.
ఈ వేదాంతాలూ, మోసాలు, చిలకలు, బొమ్మలు, రంగస్థలాలు అక్కర్లేదు. ఆమెకు కావాల్సింది వాస్తవాలు. తన జ్ఞాపకాల్లో ప్రాణాలు చేతల్లో పట్టుకుని పరుగుగెత్తే ఎల్లన్నలు.’( పేజీ.19). బ్రాహ్మణీయ భారతీయ తాత్వికత ధర్మం పేర, మతం పేర, దేవుడి పేర ఒక దుర్మార్గమైన అసమాన సామాజిక వ్యవస్థను చెక్కుచెదరకుండా ఉండే తాత్విక ప్రణాళికగా గుర్తించాడు కళ్యాణరావు. విశేష ధర్మాలు, వర్ణధర్మాలు చెప్పిన మనువు అందరి మానవుల్ని పుట్టించిన వాడు, ఎల్లన్నని మనిషిగా ఎందుకు చూడలేకపోయాడు అని నిలేస్తాడు. బ్రాహ్మణుల్ని చంపితే చండాలుడుగా పుడతాడని చెప్పిన మనువు చెప్పేది నిజమైతే ఎంతమంది బ్రాహ్మణుల్ని చంపితే ఎన్నలదిన్ని లో మాలా మాదిగలు పుట్టారు అని హేతు బద్ధమైన ప్రశ్నని సంధిస్తాడు. అంతటితో ఆగక ఎల్లన్న చంపిన బ్రాహ్మణుడి పేరుని మనువు చెప్పి తీరాల్సిందే అని నిలదీశాడు. వాడు చెప్పకపోతే వాడి ధర్మాన్ని కాపాడుతున్న వర్ణాలు చెప్పాలి. అగ్రవర్ణాలు చెప్పాలి అని కోపంతో, తిరస్కారంతో రగిలి పోతాడు.
మొత్తంగా, ఈ దేశ సాహిత్యానికి, సంగీతానికి, సంస్కృతికి, కళలకి, తాత్వికతకి కులం ఇరుసుగా వున్నదని చెబుతాడు. కులం సోకని విభాగం, జీవన పార్శ్వం లేదని గమనిస్తాడు. ‘అంటరాని తనం, అది ఎప్పుడూ ఒకేలా ఉంది. అన్ని కాలాల్లో ఉంది. అన్ని తరాలలో ఉంది. అది తాకకుండా, అది కలవకుండా వాళ్ళ జీవితం లేదు. వంశం లేదు.’ (పేజీ.166) ఈ దేశంలో పీల్చే గాలికి,తాగే నీటికి, పారే పంటకాలవకి, పండే పంటకు, గుడికి, బడికి, రచ్చబండకి, తినే తిండికి, కట్టే బట్టకి, ఉండే ఇంటికి, మాట్లాడే మాటకి, సాహిత్యానికి, సంస్కృతికి, రాజ్యానికి, దాని చట్టానికి, న్యాయానికి, న్యాయస్థానానికి, శవానికి, శ్మశాన వాటికకి, దేవుడికి, దార్శనికతకి కులం ఉందన్న నిజాన్ని ఈ నవల బద్దలు కొట్టి చెబుతుంది. అంటరాని వసంతం ఈ ముళ్ళను నెట్టుకుంటూ అందమైన భవిష్యత్తును వాగ్దానం చేసిన ఒక దారిదీపం. ఇది స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం జరిగిన రాజకీయ నీతి శాస్త్రం. ఇందులో ఎందరో గుర్తు తెలియని మనుషుల సాహసాలు, త్యాగాలు, వసంత గానాలున్నాయి.
అంటరాని వసంతం ఓ భారతీయ ఇతిహాసం
అంటరాని వసంతం సుమారు నూట ఏబయ్యేళ్ళ పైన ఏడు తరాల వంశ చరిత్ర. వంశ చరిత్ర అనేకన్నా దళిత జాతి జన జీవితం. అంటరాని కులాలుగా పరిగణించబడి బానిసత్వానికి, వివక్షతకి, అణిచివేతకి గురైన సామాజిక సమూహాల అనుభవాలు, ఆవేదన, ఆకాంక్ష, ప్రతిఘటన, ఆత్మగౌరవం నవల అంతటా అల్లుకుపోయి ఉంది. ఇందులో దళిత జాతుల అస్తిత్వం ప్రధాన ఇతివృత్తంగా మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలతో, ఆయా సందర్భాలకు అనుగుణంగంగా మార్పు దిశగా దళితులు చేసిన పోరాటాలు ఉన్నాయి. అనేక సంఘటనల సమాహారంగా, అనేక పాత్రలతో, వ్యక్తులుగా, సంఘటితంగా చేసిన వీరోచిత సాహసాలు, పోరాటాలు ఉన్నాయి. ఈ పోరాటాలు ఒక చారిత్రక గతికి కొనసాగింపుగా ఒకదానికొకటి ముడిపడి ముందుకు నడుస్తాయి. ఇందులో దళితుల బాధలు, అణిచివేతని వర్ణిస్తూ పాఠకుల నుండి సానుభూతిని ఆశించేదానికి భిన్నంగా దళితులు ఎదుర్కొన్న కష్టాలని మాత్రమే ఏకరువు పెట్టకుండా, ఆనంద సన్నివేశాలు, సంఘటిత ఆత్మావిష్కరణ ఘట్టాలు, ఆధిపత్యాన్ని ఎదిరించే పోరాటాలు ప్రధానంగా కనిపిస్తాయి. మనం చావడానికే పుట్టలా, చంపడానికి కూడా అనే సాహసం, త్యాగం కూడా ఉన్నాయి. ప్రతి దళిత పాత్ర ఒక కథానాయకుడు / కథానాయకిలా వీరోచితంగా ఉంటుంది. ఇది దళితులు ప్రకృతితోనూ, అగ్రకులంతోనూ, ఆధిపత్యంతోనూ అలుపెరుగక చేసిన పోరాటం. కొన్ని సార్లు అది చిన్నదిగా, మరికొన్ని సార్లు మరింత సంఘటితంగా ఎంతో ప్రాముఖ్యత కలిగివుండొచ్చు. అయితే అన్నిసార్లూ ఆ పోరాటం ఒక ఆదర్శంగా కాక, అవసరంగానే సాగింది. మాలాడి దిబ్బ సాగు చేసే ఆలోచన నుండి విప్లవ పోరాటాల్లో మమేకంవరకూ సాగిన దళిత చైతన్య పరిణామ క్రమం ఇందులో రికార్డు చేయబడింది. వాస్తవం సమాజంలో కూడా జరిగిన ఇటువంటి సంఘటనలు ఎక్కడా చరిత్రగా నమోదు చేయక పోవడం భారతీయ చారిత్రక విషాదం! అంటరాని వసంతం అణిచివేయబడ్డ, కనీసంగా గుర్తించబడని దైనందిక దళిత ఆత్మగౌరవ పోరాటాలను చరిత్రీకరించింది. చరిత్ర రాసే పద్ధతిని మార్చేసింది. మార్పు దిశగా సామాన్యులు చేసిందే అసలైన చరిత్రగా చెబుతూ దళిత జాతుల చరిత్రకి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది. ఈ చరిత్రలో దళితుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, పోరాట ఆకాంక్షలతో బాటుగా దళితుల సాహిత్యం, సంస్కృతి, కళలు నిక్షిప్తమై ఉన్నాయి. మరీ ముఖ్యంగా జీవితం, సాహిత్యం, సంస్కృతి, పోరాటం ఒకదానికొకటి విడదీయరానిదిగా కలిసిపోయిన మహా కావ్యమిది. అంతేకాకుండా బ్రాహ్మణీయ ఆధిపత్యమే భారతీయ చరిత్ర, సంస్కృతి, తాత్వికతగా చెలామణి అయిన విధాన్ని సవాలు చేస్తూ చరిత్రని, సాహిత్యాన్ని, సంస్కృతిని, కళల్ని, తాత్వికతని చూసే కొత్త చూపునందించింది. మరో విధంగా చెప్పాలంటే దళిత/ సామాన్య ప్రజా దృక్కోణం నుండి వీటిని పునర్నిర్వచించింది. ఇన్ని లక్షణాలతో ప్రత్యేకమైన ఈ అంటరాని వసంతం భావితరాలకు స్ఫూర్తినిచ్చే ఒక భారతీయ ఐతిహాసిక నవలగా నిలబడుతుంది.