క్వాంటమ్ మెకానిక్స్ థియరీస్ లోనో, సైన్స్ ఫిక్షన్ బుక్స్ లోనో, సినిమాలలోనో… అప్పుడప్పుడూ పారలల్ యూనివర్స్ గురించి చదవడమో చూడటమో జరుగుతూ ఉంటుంది. అలాంటివి చూసినప్పుడు చాలా కుతూహలంగా అనిపిస్తుంది. రెండు యూనివర్స్ లోని క్యారెక్టర్స్ అటూ ఇటూ మారిపోయి తెలియని కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ… మంచి డ్రామా పండుతూ… “అరే భలే ఉందే ఈ పాయింట్” అనిపిస్తుంది. కానీ అదంతా ఫిక్షన్ అని మనకి ముందే తెలుసు కాబట్టి దాన్ని అక్కడే వదిలేస్తాం.
కానీ నిజంగా కొన్ని పారలల్ లైఫ్స్, పారలల్ కల్చర్స్ మన ప్రపంచంలోనే ఉన్నాయని, అవి మనల్ని మనకి అద్దంలో చూపించినట్లు చూపిస్తాయని కొన్ని పుస్తకాలు చదివినప్పుడే అర్థం అవుతుంది.
భూమి ఎందుకు గుండ్రంగా ఉంది అంటే.. ఇదిగో ఇందుకు అన్నట్లుగా, భూమి అలా ఉంటేనే మీరెక్కడ ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి వెళ్లే దారిలో కనిపించేవన్నీ మీలాంటి కథలే అని మీకు అర్థమవుతుందని ఎవరో చెప్పకనే చెప్పినట్లుగా అనిపిస్తాయి కొన్ని జీవితాలు… కథలు కానీ జీవితాలు.
అలాంటి ఒక పుస్తకమే “వుయ్ షుడ్ ఆల్ బి ఫెమినిస్ట్స్ (We Should All Be Feminists).” పుస్తకం అన్నాను కదా అని పెద్ద పుస్తకం అని అనుకోకండి. నిజానికి ఇది ఒక పెద్ద వ్యాసం లాంటి మాత్రమే. అంతా కలిపితే మొత్తం ఇరవై పేజీలు కూడా ఉండదు. కానీ ఇది చదివాక మాత్రం మనసంతా ఏదో తెలియని బరువు… ఇందులో రాసినవేవీ మనకు తెలియనివి ఏమీ కాదు! ఇంతకు ముందు తెలిసినవే అయినంత మాత్రాన పుస్తకం విలువ తక్కువేమీ కాదు. ఎందుకంటే ఒక చిన్న పుస్తకం లో రాసిన కొన్ని కొన్ని సంఘటనలు చదువుతుంటే… మనదేశ సంస్కృతిని పుస్తకమని అద్దంలో చూసినట్లే అనిపిస్తుంది తప్ప కొత్త సంస్కృతి ఏదో పరిచయం అవుతున్నట్లు అనిపించదు.
“ఏ దేశ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
స్త్రీ జాతి చరిత్ర సమస్తం
సంఘపీడన పరాయణత్వం
స్త్రీ జాతి చరిత్ర సమస్తం
పురుష పాదాల కింద పాదరక్షలతత్త్వం
స్వేఛ్చ యెరుగని సతీత్వం
పంకజాక్షి వంటూ పంకంలోనే
స్థానాన్ని ఖాయం చేసిన లోకతత్త్వం”
అని రాయబడని కవితలో మనల్ని మనం తూచుకుంటున్నట్లు అనిపిస్తుంది.
“నీకు తెలుసా? నువ్వో ఫెమినిస్ట్ వి” అని ఎవరైనా మనల్ని అంటే మనలోపలెక్కడో కాస్తంత గర్వం తొంగి చూస్తుంది. మనల్ని మన హక్కుల కోసం పోరాడే వారిగా గుర్తించారని.
కానీ ఆ అన్న విధానం “నువ్వు ఉగ్రవాదానికి మద్దతు దారువి” అన్నట్లుగా ఉంటే ఏమనిపిస్తుంది మనకి?
అది కూడా అన్నవాడు బాలుడు… అనిపించుకున్నది బాలిక ఐతే. అసలు ఫెమినిస్ట్ అంటే ఏమిటో కూడా తెలియని వయసులో అదేదో విపరీతమైన ప్రవృత్తేమో అనిపించదూ!
ఫెమినిస్ట్ గా ఉండటం అంటే ఉగ్రవాదిగా ఉండటంలాంటిదా? చిన్న వయసులోనే ఇలాంటి భావజాలం మనసులో పేరుకు పోయిందంటే దానికి కారణం ఎవరు?
చిమామంద ఞగోజి అడిచి (Chimamamda Ngozi Adichie) జీవితంలో తన బాల్య స్నేహితుడి ద్వారా ఎదురైన సంఘటన అది. ఇంతకీ ఈ అడిచి ఎవరంటే ఇందాక నేను చెప్పిన “వుయ్ షుడ్ ఆల్ బి ఫెమినిస్ట్స్” రచయిత.
నిజానికి ఇది మొదట పుస్తక రూపంలో రాయబడలేదు. చిమామంద ఒకానొక Ted show లో ఇచ్చిన ఉపన్యాసమే ఆ తరువాత పుస్తక రూపంలో మన ముందుకు వచ్చింది. ఆమె చెప్పిన విషయాలకి మనం ఎందుకు కనెక్ట్ అయిపోతామంటే… ఇందాక చెప్పానే పారలల్ లైఫ్స్ అని అదిగో ఆ లైఫ్స్ మన కళ్ళ ఎదురుగా కనబడతాయి. లేదంటే ఆ జీవితాల్లో మనం ఉండి ఉంటాం. ఆమె రాసిన చిన్న చిన్న సంఘటనలు అన్నీ… ఏ ఒక్కటీ వదలకుండా మన జీవితాల్లో మనం ప్రతి రోజూ చూస్తూ ఉంటాం. కాకపోతే ఆమెది నైజీరియా. మనది ఇండియా. అదొక్కటే తేడా! పుస్తకంలో నైజీరియా అనో, నైజీరియన్ అనో రాసిన చోట మనం ఇండియా అనీ, ఇండియన్ అనీ మార్చుకుంటే చాలు! అక్కడ మనమే ఉంటాం. మన చరిత్రలే రికార్డ్ చేయబడినట్లు ఉంటాయి.
తనకు దైనందిన జీవితంలో ఎదురైన సంఘటనల నుండి సమాజ ప్రవృత్తిని ఎత్తి చూపుతూ, సమాజం ఎలా మారితే బాగుంటుందో అని రాసింది చిమామంద. Purple Hibiscus అన్న పుస్తకం రాసాక, ఆమెకి బాగా దగ్గరి వాళ్ళే తన మీద ఫెమినిస్ట్ అన్న ముద్ర వేశారు.
ఫెమినిస్ట్ ల పట్ల తనకి ఎదురైన వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉండేవంటే…
ఫెమినిస్ట్ లంటే సంతోషమన్నది ఎరగకుండా ఎప్పుడూ ఉండేవాళ్ళు
ఫెమినిస్ట్ లంటే పెళ్లాడటానికి మగవాళ్లే దొరకని వాళ్ళు
ఫెమినిస్ట్ లంటే ఎప్పుడూ మగవాళ్ళని ద్వేషించే వాళ్ళు
ఫెమినిజం అంటే ఆఫ్రికన్ కల్చర్ కాదు
చిమామంద ఎక్కడికక్కడ ఆ అభిప్రాయాలు తప్పు అనే విధంగా ఒక “హ్యాపీ ఆఫ్రికన్ ఫెమినిస్ట్’” అనే ట్యాగ్ తో ముందుకు వెళ్ళింది.
అయితే ఇదంతా ఒక్క రోజులో జరిగింది కాదు. చిన్నప్పటి నుండి తనకెదురైన అనుభవాల నుండి రాటుదేలిన జీవితం ఆమెది. అలాంటి కొన్ని సంఘటనల సమాహారమే ఈ పుస్తకం.
చిన్నప్పుడు తన క్లాస్ లో క్లాస్ లీడర్ గా ఉండటం కోసం బాగా చదివి క్లాస్ లో ఫస్ట్ వచ్చాక, సెకండ్ రాంక్ వచ్చిన ఏ మాత్రం నాయకత్వ లక్షణాలు లేని మగ పిల్లాడే క్లాస్ లీడర్ గా ఉండాలని టీచర్ అన్నప్పుడు ఆమెకి మొదటి సారిగా అర్థం అయ్యింది ఈ ప్రపంచం మగవాళ్లదని. క్లాస్ లో లీడర్ గా మొదలయ్యే ప్రస్థానం దేశ నాయకుడిగా ముగిసే అవకాశం మగవాడి జీవితంలో చాలా సహజమైన విషయం. అంతే కదా మరి! ఒకే విషయాన్ని మనం పదే పదే చూస్తుంటే ఏమనిపిస్తుంది. అది సహజమైన విషయం అనిపిస్తుంది. దానికి అలవాటు పడిపోతాం కూడా. క్లాస్ లీడర్స్ గా మగపిల్లలు మాత్రమే ఉండాలన్న భావన పెరిగి పెద్దదై దేశ నాయకత్వం కూడా మగవాళ్లే చేయాలన్న స్థితికి అలవాటు పడిపోతాం
ఒకసారి ఆమె కార్ పార్కింగ్ చేయడానికి తంటాలు పడుతుంటే. కార్ పార్కింగ్ నే వృత్తిగా చేసుకున్న ఒకతను ఆ కార్ ని పార్కింగ్ చేస్తాడు. ఆమె సంతోషంగా అతనికి కొంత టిప్ ఇస్తే, అతను ఆమెకి థాంక్స్ చెప్పకుండా ఆమెతో ఉన్న ఆమె స్నేహితుడికి థాంక్స్ చెప్తాడు. ఎందుకంటే డబ్బులు ఆమె ఇచ్చినా సంపాదన అతనిదే అయి ఉంటుంది అన్న అభిప్రాయంతో. దేశం మారిందే కానీ మన దగ్గర అభిప్రాయాలూ అలానే ఉంటాయి కదా!
అమెరికా లాంటి దేశంలో కూడా ఒకే పని చేస్తున్న స్త్రీ పురుషుల్లో పురుషుడికే వేతనం ఎక్కువ! ఎందుకంటే అతను పురుషుడు కాబట్టి!
ఒక వెయ్యేళ్ళ క్రితం ఐతే ఇది పర్లేదు ఎందుకంటే ఆ రోజుల్లో శారీరక సామర్ధ్యమే బ్రతుకు గడవడానికి ప్రధాన వనరు. మగవాళ్ళు సహజంగానే శారీరకంగా బలవంతులు కాబట్టి వాళ్ళ మాట చెల్లిందనుకోవచ్చు. కానీ ప్రస్తుతం మనం జీవిస్తున్న ప్రపంచం వేరు. ఇప్పుడు శారీరక సామర్ధ్యాల కన్నా తెలివి తేటలే ప్రధానం. సృజనాత్మకత, వినూత్నమైన ఆలోచనలే మనల్ని ముందు వరసలు ఉంచే రోజులివి. అయినా సరే అవి స్త్రీలవైతే ఆమెని వెనక వరసలో ఉంచడమే సంఘ ఆచారం గా మారిపోయింది.
అన్ని విషయాలలో ప్రపంచం ఎంత ముందుకు వెళ్లినా జెండర్ విషయంలో మాత్రం ఎలాంటి బుద్ధి వికాసమూ లేదు. ఒకసందర్భంలో తన స్నేహితురాలి ఎక్సపీరియన్స్ చెపుతుంది ఆమె. తన స్నేహితురాలు ఒక మేనేజీరియల్ క్యాడర్ లో ఉన్నప్పుడు, తన సబ్ ఆర్డినేట్ టైం షీట్ విషయంలో చేసిన ఫోర్జరీని చూసి, ఇంతకూ ముందు తన ప్లేస్ లో మేనేజర్ తీసుకున్నట్లుగానే అతని మీద యాక్షన్ తీసుకుంది. అతను ఆమె వర్కింగ్ స్టైల్ గురించి, ఆమె అగ్రెస్సివ్ నేచర్ గురించి టాప్ మేనేజ్ మెంట్ కి కంప్లైంట్ చేశాడు. మేనేజ్ మెంట్ కూడా ఆమె పనిలో స్త్రీత్వం కనిపించాలని హితబోధ చేసింది తప్ప ఆమెని సమర్ధించలేదు. ఎందుకంటే ఆమె స్త్రీ కాబట్టి. మన దగ్గర వర్కింగ్ విమెన్ ని అడిగితే ఇలాంటివి కోకొల్లలుగా చెబుతారు.
ప్రతి చోటా జండర్ అనేదే ప్రపంచాన్ని శాసిస్తుంది అంటుంది ఆమె. అందుకే ప్రపంచాన్ని మరో పార్శ్వం నుండి పునఃసృష్టి చేయాలంటుంది ఆమె. అక్కడ ఆడా, మగా అందరూ తమలా తాముంటూ అందరూ ఒకే స్థాయిలో సంతోషంగా ఉండేలా చూసుకోవాలంటుంది ఆమెది. అందుకోసం మనం మన కూతుళ్లని మాత్రమే కాదు మన కొడుకులని కూడా ఇప్పటిలా కాకుండా మరోలా పెంచాలని అంటుందామె.
అసలు మనం మన కూతుళ్ళని ఎలా పెంచుతున్నామో ఆమె మాటల్లోనే చూడండి
“We teach girls to shrink themselves, to make themselves smaller.
We say to girls: You can have ambition, but not too much. You should aim to be successful but not too successful, otherwise you will threaten the man. If you are the breadwinner in your relationship with a man, pretend that you are not, especially in public, otherwise you will emasculate him.”
అమ్మాయి అబ్బాయి బయటకి వెళ్ళినప్పుడు అబ్బాయిలే డబ్బు చెల్లించడం మన దగ్గర సహజం. మన దగ్గరే కాదు నైజీరియాలో కూడా అంతే అని ఆమె చెప్పిన దాన్ని బట్టి అర్థం అవుతుంది. అబ్బాయే ఖర్చు పెట్టాలనే సంస్కృతి పోయి ఎవరిదగ్గర ఉంటె వాళ్ళు పెట్టుకునేలా ఉండాలంటుంది ఆమె. అబ్బాయే ఖర్చు పెట్టాలని అనుకోవడంలోనే తెలియకుండా మనమే వాళ్ళ ముందు చిన్నవాళ్లమైపోతున్నాం. అందుకే మన పిల్లలని కొత్త ఆలోచనలతో పెంచితే ఇప్పటికిప్పుడు కాకపోయినా వచ్చే యాభై ఏళ్ళకో వందేళ్లకో ఒక కొత్త ప్రపంచాన్ని చూడవచ్చు అంటుందామె.
అసలు ఒక స్త్రీ విజయం పురుషుడికి ఏ విధంగా ప్రమాదకరమవుతుంది అని ప్రశ్నిస్తుంది చిమామంద. అలానే పెళ్లి అనేది మంచి విషయమే. ఆనందాన్ని, ప్రేమని పరస్పరం పంచుకునే అవకాశమిస్తుంది అది. కానీ మనం ఆడపిల్లకి మాత్రమే పెళ్లి గురించి ఆశపడేలా సిద్ధం చేస్తాం తప్ప మగ పిల్లలని అలా ఎందుకు సిద్ధం చేయం అంటుంది ఆమె. ఒక వయసు వచ్చాక అమ్మాయికి పెళ్లి అవకపోతే అది ఆమె ఫెయిల్యూర్ గానే చూస్తారు. అదే మగవాడికి పెళ్లి అవకపోతే అతనింకా పెళ్లి చేసుకోవడానికి ఎవరినీ ఎంచుకోలేదని మాత్రమే అంటారు. ఎందుకీ తేడా అని ప్రశ్నిస్తుంది చిమామంద.
అచ్చం మన దేశంలోనూ అంతే కదా… ఆడపిల్ల పెళ్లి… మగవాడి ఉద్యోగం… ఈ రెండు మాత్రమే భవిష్యత్తరాల పౌరులు జీవితంలో స్థిరపడే విషయాలు అనేది మనం రోజూ చూసేదే కదా! పెళ్లి తో రావాల్సింది పార్టనర్ షిప్ తప్ప ఓనర్ షిప్ మాత్రం కాదు. కానీ నిజంగా అలానే జరుగుతుందా? పెళ్లితో ఆడపిల్ల మీద సర్వాధికారాలూ భర్తవే. అంటే ఆమెకి యజమాని అతను. అందుకే కదా… ఎంత చదువుకున్నా పెళ్లి తరువాత ఉద్యోగం చెయ్యాలో లేదో డిసైడ్ చేసేది మాత్రం భర్తగా వచ్చే అతనే తప్ప మనకి మనం మాత్రం కాదు. ఖండాలు వేరైనా సంఘజీవనపు తీరు మాత్రం ఒక్క లానే ఉంది కదా అనిపిస్తుంది ఆమె రాసింది చదివాక.
ఒక చోట ఇలా అంటుందామె “We are all social beings. We internalize ideas from our socialization”
నిజమే కదా! మనం ఎలా పెంచబడుతున్నామో అలానే పెరుగుతాం. మనం ఎలా పెరిగామో అలానే పెంచుతాం. మరి ఈ సైకిల్ కి బ్రేక్ పడేది ఎక్కడ?
మన కూతుళ్ళకి మగ స్నేహితులు ఉంటే మనం కలవర పడతాం. రకరకాల ఆరాలు తీస్తాం! అది తప్పు అని వాళ్ళని దండిస్తాం. అదే మగ పిల్లలకి ఆడ స్నేహితులు ఉంటే మనం పట్టించుకోము. ఇది మన దగ్గర మాత్రమే కాదు. ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న నైజీరియాలోనూ అంతే…
అదే చెబుతూ ఇలా అంటుంది ఆమె.
“We police girls. We praise girls for virginity but we don’t praise boys for virginity (and it makes me wonder how exactly this is supposed to work out, since the loss of virginity is a process that usually involves two people of opposite genders).
ఇలాంటివాటన్నిటికీ పరిష్కారం మనం పిల్లల్ని పెంచే విధానంలోనే ఉండాలి అంటుందామె. పిల్లలని సామర్ధ్యాన్ని బట్టి పెంచాలి తప్ప జండర్ ని బట్టి వద్దు అంటుంది.
హ్యూమన్ బీయింగ్ అనకుండా వుమన్ అనడం ఎంతవరకూ కరెక్ట్ అని అడిగేవాళ్ళకి ఆమె ఇచ్చిన సమాధానం చూడండి.
“Why does it have to be you as a woman? Why not you as a human being?” This type of question is a way of silencing a person’s specific experiences. Of course I am a human being, but there are particular things that happen to me in the world because I am a woman. This same man, by the way, would often talk about his experience as a black man. (To which I should probably have responded: Why not your experiences as a man or as a human being? Why a black man?)”
“ఎప్పుడైనా ఎక్కడైనా సంస్కృతి ప్రజల్ని తయారు చేయదు. ప్రజలే సంస్కృతిని ఏర్పాటు చేసుకుంటారు.” అనే చిమామంద చెప్పిన విషయాల్లో కొత్తేముంది అనుకోవచ్చు కానీ… అచ్చం నీలాగా.. నాలాగా… మన దేశం కానీ దేశంలో మన సంస్కృతి తెలియని సంసృతిలో మనందరికీ అద్దాల్లా ఉన్న వాళ్ళ జీవితాలు మనకి పరిచయం అయ్యాయంటే అది ఆమె రాతల వల్లనే…
బాగా రాసేవారు ఎందరో ఉండవచ్చు… మనసుతీరా అక్షరాన్ని హత్తుకుని రాసేవాళ్ళు కొందరే! ఆ కొందరిలో ఒకరే చిమామంద ఞగోజి అడిచి.
చిమామంద ఞగోజి అడిచి ఆఫ్రికా ఖండంలోని నైజీరియాకు చెందిన రచయిత్రి. Purple Hibiscus అన్న ఒక పురుషాహంకారికి సంబంధించిన నవలతో బాగా పేరు తెచ్చుకుంది ఆమె. ఆ నవల రాసేనాటికి ఆమెకి కేవలం 26 ఏళ్ళు మాత్రమే.
Good introduction
Good article
GANESH
9290025519