పలక మీద
అక్షరాన్ని తుడిచినంత సులువా
పసిపిల్లల హృదయాల్లో
ప్రేమను తుడవడమంటే
ఆకు మీద
నీటి బిందువును తుడిచినంత సులువా
అమ్మల మాటల్లో
ఆకలి తీర్చే పాలను తుడవడమంటే
అద్దం మీద
మానవరూపాన్ని విరగొట్టినంత సులువా
బాధితుల ఊహల్లో
మొక్కలను విరచడమంటే
నేల మీద
స్థూపాలను విరగొట్టినంత సులువా
ఆలోచనల్లో
అరుణతారను విరచడమంటే
ప్రియుడు రాసిన ప్రేమలేఖలను
నీ చేతులతో చింపినంత సులువా
స్త్రీలు దాల్చిన గర్భాలను
నీ రక్కసి పళ్ళతో చీరినంత సులువా
మనిషి మీద
మరో మనుషికున్న ప్రేమను చీరడమంటే