తెలుగు: పద్మ కోండిపర్తి
7/11 ముంబయి రైలుపేలుళ్ళ కేసులో ఫర్జానా భర్త ఉగ్రవాది అనే ఆరోపణలతో అరెస్టు అయ్యాడు.
2006 జులై ముంబై రైలు పేలుళ్ల కేసులో ఉన్న 13 మంది నిందితులలో తొమ్మిది సంవత్సరాల జైలు జీవితం గడిపిన తర్వాత ఒక్కడే నిర్దోషిగా విడుదలైన అబ్దుల్ వాహిద్ షేక్ నిర్వహించిన బహిరంగ సభలో 2017ప్రాంతంలో కోల్‌కతాలో నేను మొదటిసారి ఫర్జానాను కలిశాను.
అబ్దుల్ వాహిద్ షేక్ తన పూర్వసహచరుల విడుదలకు సంబంధించి న్యాయసలహాలనందించడం కోసం “ఇన్నోసెన్స్ నెట్వర్క్”ను ఏర్పాటు చేశాడు. ఆప్పటికింకా జైలులో ఉన్న 12 మందిలో ఫర్జానా భర్త ఒకరు. ఆమె ‘ఇన్నోసెన్స్ నెట్వర్క్’ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడటానికి వచ్చారు. ఆ సమావేశంలో ఫర్జానా ధైర్యం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఆ రోజు ఆమెతో మాట్లాడటానికి నాకు అవకాశం దొరకలేదు.
అయితే, కొన్ని నెలల తరువాత, , ఫర్జానా భర్త ఉన్న మహారాష్ట్రలోని అదే జైలులో మరొక కేసులో జీవిత ఖైదీగా ఉన్న, రాజకీయ కార్యకర్త అయిన ఒక స్నేహితుడు నాతో మాట్లాడినప్పుడు అతని కుటుంబానికి, కేసులో ఏమైనా సహాయం చేయగలవా అని అడిగినప్పుడు ఫర్జానాతో, ఆమె కుటుంబ సభ్యులతో నా పరిచయం మొదలైంది.
కొద్ది రోజుల తరువాత నేను రాజబజార్ వీధిలో ఉన్న ఫర్జానా ఇంటికి వెళ్లాను. ఉత్తర కోల్‌కతాలో ఉన్న రాజబజార్ ప్రాంతంలో ఎక్కువగా మధ్యతరగతి, కార్మిక వర్గాల ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నారు. రాజబజార్‌లో తిరిగే ప్రతి ఒక్కరికీ “గెట్టో” అనే పదానికి అర్థం ఏమిటో తెలుస్తుంది. వేలాది కుటుంబాలు మురికి గదుల్లో ఇరుక్కుపోయిఉంటాయి. వీధులు చెత్తతో నిండిపోయి ఉన్నాయి. పుస్తకాల బైండింగ్, బూట్ల తయారీ లాంటి చిన్న తరహా పరిశ్రమలు అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా చాలా శక్తివంతమైన జీవితం ఉంది!
తన 10 ఏళ్ల కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి ఫర్జానా ఉంటున్న చిన్న ఇల్లు నాలుగో అంతస్తులో ఉంది. భర్త అరెస్టు అయిన తరువాత, ఆమె ఇక్కడికి వచ్చి తన తల్లిదండ్రులు, అన్నదమ్ములతో కలిసి ఉంటోంది. ఒక అసాధారణ మహిళ అని రాబోయే కొద్ది సంవత్సరాలలో తెలిసిన ఫర్జానా అక్కడ పరిచయమైంది.
ఫర్జానా కుటుంబం ఒక మధ్యతరగతి ముస్లిం సముదాయానికి చెందినది; ఆస్తిపాస్తులు కలిగిన కుటుంబం కాకపోయినప్పటికీ, విద్యను విలువైనదిగా భావించింది. ఆమె తండ్రి కోల్‌కతా సివిల్ కోర్టులో న్యాయవాది; ఆమె సోదరులు పుస్తకాల బైండింగ్ వ్యాపారంలో ఉన్నారు. ఆమె హోమియోపతిలో ఎమ్‌డి చేసింది; ఒక హోమియోపతి డాక్టరుగా వృత్తిపరమైన జీవితాన్ని ఆశించింది. 21 ఏళ్ళ వయసులో రాజబజార్‌లో వృద్ధిచెందుతున్న బూట్ల వ్యాపారం చేస్తున్న వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ యువ జంట ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం ఎదురు చూసింది.
ఆ తర్వాత 2006 జూలైలో ఫర్జానా జీవితం తలక్రిందులైంది. రైళ్లలో పేలుళ్లు జరిగిన కొన్ని నెలల తర్వాత ముంబై పోలీసుల బృందం వచ్చి ఫర్జానా భర్తను ఈ కుట్రలో పాల్గొన్నట్లు ఆరోపించి అరెస్టు చేసింది. అది ఒక ఊహించని అకస్మాత్తు ఆశనిపాతం. ఫర్జానా భర్త ముంబైకి ఎన్నడూ వెళ్లనేలేదు. ఈ కేసులో అరెస్టు అయిన ఇతరులు కూడా ఆయనకి తెలియదు. బాంబు పేలుళ్ల నేపథ్యంలో ముంబైలో జరిపిన యాదృచ్ఛిక దాడుల్లో ఒక బంగ్లాదేశీయుల కుటుంబ సభ్యులు అతని పేరు చెప్పారని, కోల్‌కతా నుంచి ముంబైకి వెళ్లే మార్గంలో అతన్ని కలిసారని ముంబై పోలీసుల కథనం.
బాంబు పేలుళ్లతో బంగ్లాదేశ్‌కు సంబంధాలు ఉన్నాయని నిర్ధారించుకోడానికి ఫర్జానా భర్తను అరెస్టు చేసి, ఈ కేసులో పెట్టారు. 1999లో అమల్లోకి వచ్చిన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (ఎంసీఓసీఏ) కింద ఈ కేసును విచారణకు తీసుకున్నారు. ఆయనను అరెస్టు చేసినప్పుడు, వారి పాపకు 38 రోజుల వయస్సు. ఆ తరువాత పాప జైలు నుండి నిర్దోషిగా విడుదలయేంత వరకు తన తండ్రిని చూడలేదు.
ఇంతకు ముందెన్నడూ ఊహించని జీవన పోరాటం ఫర్జానాకు ప్రారంభమైంది. ఒక వైపు కేసు కోసం చట్టపరమైన అవసరాలకు హాజరు కావడానికి ముంబైకి తరచూ చేసే ఉద్రిక్త ప్రయాణాలు, ఆపైన తన భర్తను ఉంచిన మారుమూల అమరావతిలోని జైలుకు వెళ్ళిరావడం; మరోవైపు తన పాపను చూసుకోవడమూ. వీటన్నింటివల్లా ఆమె హోమియోపతి వైద్యాన్ని, తన కోసం ఎదురుచూస్తున్న ఉజ్వలమైన వృత్తిని వదులుకోవాల్సి వచ్చింది. ఆమె తన, తనకు మద్దతుగా నిలిచిన తల్లిదండ్రులు, సోదరులతో కలిసి ఉంటూ, జీవితమూ దేశ న్యాయ వ్యవస్థా తనపై విసిరిన సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగడానికి ప్రయత్నించింది.
అయితే, ఆమె జీవితంలో మరిన్ని కష్టాలు ఎదురయ్యాయియి. 2015లో ముంబై కోర్టు ఆమె భర్తను దోషిగా తేల్చి, మరో ఏడుగురు నిందితులతో పాటు జీవిత ఖైదు విధించింది. మరో ఐదుగురికి మరణశిక్ష విధించింది. అదే సంవత్సరంలో, ఫర్జానా అకస్మాత్తుగా అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి, ఎస్ఎల్ఇ లేదా లూపస్ వ్యాధితో బాధపడింది.
ఈ వ్యాధి శరీరంలోని అనేక అవయవాలపైన దాడి చేస్తుంది. వాటిలో ప్రత్యేకించి క్రమంగా మూత్రపిండాలు ప్రభావితమై, రక్తపోటు, చివరకు మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. చట్టపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమవుతున్న ఆమె కుటుంబ సభ్యులు సరైన చికిత్స చేయించలేకపోయారు. ఆ వ్యాధిగురించి ప్రత్యేకంగా అధ్యయనం చేసిన నాకు ను 2017 లో ఫర్జానాను కలిసినప్పుడు, ఆమె వ్యాధి చాలా ముదిరిపోయింది అనే విషయం అర్థమైంది. ఆమె మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రక్తపోటు కారణంగా ఆమె కంటి చూపు కూడా దెబ్బతింది. అయినప్పటికీ, ఆమె ప్రశాంతతకు, ఉల్లాసానికి నిదర్శనంగా ఉండింది.
నేను, నా సహోద్యోగులు ఆమె ఇంటికివెళ్ళినప్పుడల్లా వారిచ్చిన ఆతిథ్యం ఎనలేనిది. ఫర్జానా తల్లి, లేదా కొన్నిసార్లు ఫర్జానానే స్వయంగా మా కోసం భోజనం తయారు చేసేది. ఆమె భర్త కేసు స్థితి, కుమార్తె చదువు, సాధారణంగా జీవితం గురించి చాలా మాట్లాడుకునేవాళ్ళం. ఆమె కుమార్తెకు సాధ్యమైనంతవరకు సాధారణ జీవితం లభించేలా చూసుకున్నారు: ఆమె కోల్‌కతాలోని ఒక కాథలిక్ మిషనరీ పాఠశాలలో చదువుతోంది; తనతోటి ఇతర బాలికల మాదిరిగా సాధారణ పాఠ్య ప్రణాళికతో పాటు భరత నాట్యం, కరాటే నేర్చుకుంటోంది. కానీ ఆమె తోటి ఇతర పిల్లల మాదిరిగా కాకుండా, తన తండ్రిని ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే జైలు కటకటాల వెనుక చూసింది.
ఆమె భర్త కేసుకు సంబంధించిన సవాళ్లు కొనసాగాయి. తీర్పుపై అప్పీల్ హైకోర్టులో ముందుకుసాగలేదు. ఆరోగ్యం క్షీణించడం వల్ల మహారాష్ట్రకు వెళ్లడం ఫర్జానాకు సాధ్యం కాలేదు. ఇంతలో, ఆమె భర్తా, ఈ కేసులో దోషులుగా తేలిన ఇతరులను హింసించి పోలీసులు ఎలా ఒప్పుకోలు పొందారు; అన్ని ఆమోదయోగ్యమైన న్యాయశాస్త్ర నియమాలను ఉల్లంఘించి, కుఖ్యాత ఎమ్‌సిఒసిఎ చట్టం కింద వారికి వ్యతిరేకంగా సాక్ష్యంగా ఎలా ఉపయోగించారు అనే వివరాలను తెలుసుకున్నాం.
జైలు శిక్ష పడుతుందనీ, హింసకు గురిచేస్తామని బెదిరించి ఫర్జానా భర్తకు వ్యతిరేకంగా సాక్ష్యమివ్వమని తనను బలవంతం చేసినట్లు చెప్పిన ఆమె భర్త ఇంటి పొరుగువాడు, వ్యాపార భాగస్వామి అయిన వ్యక్తిని కూడా కలిసాం. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భార్యను, వృద్ధురాలైన తల్లిని చూడడానికి ఆమె భర్తకు రెండుసార్లు పెరోల్ మంజూరు చేయమని అడిగినా తిరస్కరించారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు మమతా బెనర్జీ ‘అల్పసంఖ్యాక వర్గాల స్నేహపూర్వక’ ప్రభుత్వంలో పెరోల్ దరఖాస్తు కోసం పంపిన పోలీసు నివేదిక కూడా ఆయన కేసుకు అత్యంత హానికరంగా తయారైంది; పూర్తిగా ఎటువంటి ఆధారమూ లేకుండానే “ఆమె భర్తను పెరోల్ కింద విడుదల చేస్తే ఆ ప్రాంతంలో ‘లా అండ్ ఆర్డర్ సమస్యలు’ తలెత్తుతాయని” ఆ నివేదిక పేర్కొంది.
భారతదేశంలో ఎవరినైనా ఒకసారి ‘ఉగ్రవాది’ అని ముద్ర వేస్తే ఇలాగే జరుగుతుంది.
ఫర్జానా తన భర్తను మళ్లీ చూడలేదు. 2019 సంవత్సరం ముగియడంతో, కోవిడ్-19 విపత్తు కాలం మొదలైంది; ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఆమె శరీరంలో తయారవుతున్న ద్రవాలను తొలగించడానికి వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయాల్సి వచ్చింది. చివరగా, 2020 ఏప్రిల్ లో ఒక ఉదయాన్నే, లాక్ డౌన్ ప్రారంభమైనప్పుడు, ఫర్జానా మరణించినట్లు నాకు సమాచారం తెలిసింది; తన యువ, ఆశాజనక జీవితాన్ని చాలా తేలికగా తీసుకున్న భారతీయ న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆమె పోరాట జీవితాన్ని ముగించింది. ఆమెకు కేవలం 35 సంవత్సరాలు.
2006 ముంబై పేలుళ్ల కేసులో 19 ఏళ్ల జైలు శిక్షను అనుభవించిన ఫర్జానా భర్త గత వారం విడుదలయ్యాడు. ఫర్జానా కుమార్తె ఈ ఏడాది 12వ తరగతి పరీక్షలలో అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణురాలై వైద్య, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలకు తయారవుతోందని తెలిసింది. కానీ వాటిని చూడటానికి ఫర్జానా అక్కడ ఉండదు.
ఫర్జానా కథ భారతదేశంలోని వందలాది ముస్లిం మహిళల కథ; వారి భర్తలు లేదా ఇతర కుటుంబ సభ్యులను ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టు చేసారు; జైలు శిక్ష అనుభవించారు. ఫర్జానా లాంటి మహిళలు న్యాయం పొందే ప్రక్రియ చివరికి వారి జీవితాలను, వృత్తిజీవితాన్ని నాశనం చేసే శిక్షగా మారుతుంది. భారతదేశంలో అల్పసంఖ్యాత సముదాయానికి చెందిన మహిళలు ఎదుర్కొంటున్న అన్యాయాల జ్ఞాపకాలను మాత్రమే మిగిల్చివేస్తుంది.
Buchireddy gangula-
——————————
OUR SYSTEM FAILED – MUSLIMS —THEY ARE ALSO INDIAN CITIZENS –
NEEDS EQUAL LAW -EQUAL JUSTICE TO ALL