‘విశాఖ విద్యార్థులు’ పేరుతో వెలువడిన నాలుగు పేజీల ‘రచయితలారా మీరెటు వైపు?’ కరపత్రం చదివిన వెంటనే సదస్సులో నిప్పురవ్వ లాగ చిటపటలు రగిలించడం మాత్రమే కాదు, ఆ తర్వాత మూడు నాలుగు నెలలపాటు తెలుగుసాహిత్య లోకంలో దావానలం లాగ విస్తరించి స్పష్టమైన విభజన రేఖ గీసింది. ఈ కరపత్రాన్ని సదస్సు వేదిక మీది నుంచి ఒక వైద్య విద్యార్థి చదివి వినిపించడం, ఆ వెంటనే శ్రీశ్రీతో సహా సభలో ఉన్న ప్రముఖులందరూ తమ అభిప్రాయాలు ప్రకటించడం ఇప్పటికే చరిత్రకెక్కి ఉన్నాయి. అప్పటికే శ్రీకాకుళ విప్లవోద్యమంతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారు ఈ కరపత్ర రచన వెనుక ఉన్నారని అంతర్గత సాక్ష్యాలూ, బైటి ఆధారాలూ కూడ ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థులు గానో, పూర్వ విద్యార్థులు గానో ఉన్నవాళ్లు, అక్కడే చదివి శ్రీకాకుళ విప్లవోద్యమంలోకి వెళ్లి అప్పటికే అమరుడైన పంచాది కృష్ణమూర్తితో సంబంధాలలో ఉన్నవాళ్లు, శ్రీకాకుళ విప్లవోద్యమ నాయకులు వెంపటాపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసం, సుబ్బారావు పాణిగ్రాహి, ఎంవి రమణమూర్తి, చాగంటి భాస్కరరావులతో సంబంధాలు ఉన్నవాళ్లు ఈ కరపత్ర రచనకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించారు. వెల్చేరు నారాయణ రావు, ఐవి సాంబశివరావు వంటి వారు ఈ కరపత్రానికి మెరుగులు దిద్దారు. ఈ కరపత్రం నేరుగా శ్రీకాకుళ విప్లవోద్యమాన్ని సమర్థిస్తున్నదని, సమర్థించమని రచయితలను కోరుతున్నదని స్పష్టంగా తెలిసే శ్రీశ్రీ షష్టిపూర్తి సన్మాన సంఘం, ప్రధానంగా తుమ్మల వేణుగోపాల రావు, చలసాని ప్రసాద్ ఆ కరపత్రం సభలో చదవడానికి ఆమోదం తెలిపారు. అంటే తెలుగు సాహిత్య ప్రపంచంలో పెనుతుఫాను సృష్టించిన ఈ కరపత్రం విప్లవోద్యమంలోని, సాహిత్య రంగంలోని ఎందరో వ్యక్తుల సమష్టి కృషిగా వెలువడింది. అది అత్యవసరమైన ప్రశ్నలు సంధించి రచయితలను నిలదీసింది. వర్తమాన పోరాట జ్వాలల్ని చూపి రచయితలకు కర్తవ్యాన్ని నిర్దేశించింది.
“తెలుగు కవిత్వాన్ని ప్రబంధాల బంధాల్లోంచి బయటకు లాగి, ఊర్వశుల ఊహల్లోంచి తప్పించి, శనిదేవత రథచక్రపు టిరుసులలో పడి నలిగిన దీనుల కోసం, దగాపడిన తమ్ముళ్ల కోసం, ఆయుధంగా చేసి అందించిన మహాకవికి ఆయన ముప్పై ఏళ్ల క్రితం ప్రారంభించిన మరో ప్రపంచపు యుగానికి ఈ వేళ సన్మానం చేయడానికి వచ్చిన అందరు ఆంధ్ర కవులకూ, రచయితలకూ స్వాగతం. ముప్పై ఏళ్లుగా సాహిత్యం ఏం చేస్తోంది? ఎటు వెళ్తోంది? మీరంతా ఎందుకోసం రాస్తున్నారు? ఎవరి కోసం రాస్తున్నారు? అని చూసుకోవడానికి మీరంతా సమావేశం అవుతున్నందుకు మరీ సంతోషం.
సాహిత్యం ఆనందం కోసమనీ, ప్రభువులకీ, మంత్రులకీ, తారలకీ అంకితాలివ్వడం కోసమనీ, అందలాలెక్కడం కోసమనీ, సన్మానాలు, బిరుదులూ పొందడం కోసమనీ ఒకప్పుడు కొందరు అనుకునే వారనీ, వారినందరినీ శ్రీశ్రీ వచ్చి నడ్డి విరగ్గొట్టాడనీ సంతోషించాం. అభ్యుదయ కవిత్వం అనగానే కవులూ, రచయితలూ ప్రజల సంగతి పట్టించుకుని వాళ్ల కన్నీళ్ల కారణం తెలుసుకొని, ఆ కారణం వాళ్లకి చెప్పి, అసలు దొంగల్ని బయట పెడతారని అందరమూ అనుకున్నాం. మత్తు మందు సాహిత్యాన్ని మసిచేసి, కన్నీటి సాహిత్యాన్ని వదిలేసి, కళ్లని తెరిపించే కొత్త నెత్తురిచ్చే సాహిత్యాన్ని సృష్టిస్తారని ఎదురు చూశాం.
కానీ, అభ్యుదయం పేరుతో గొంతు చించుకొని అరిచిన వాళ్లంతా ఆ పేరుతో కవిత్వాన్ని cash చేసుకుంటున్నారు. సాహిత్యాన్ని సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ప్రజా కవిత్వం సినిమాలకు Passport మాత్రమే అయింది. అభ్యుదయం ఆకాశవాణికి అడ్డుదారి మాత్రమే అయింది. భావకవిత్వపు భోగం కవుల్లా ప్రజాకవులమని చెప్పుకునేవాళ్లు కూడా ఒకరికన్నా మరొకరు పేరు తెచ్చుకోడానికి నానా గడ్డీ కరవడం, ఒకర్ని చూసి ఒకరు ఈర్ష్య పడ్డం, అధికారంలో ఉన్న ప్రతీ అడ్డమైనవాడి కాళ్లు పట్టుకోవడం, అకాడమీలో ఆధిపత్యం కోసం నానా అగచాట్లు పడ్డం – ఇది కాక యింకేమన్నా చేస్తున్నారా?
అభ్యుదయ సాహిత్యంకన్నా ‘మదన’లూ, ‘మన్మథ’లూ నిత్య పారాయణ గ్రంథాలు కావడం, నాగేశ్వర రావులూ, రామా రావులూ ఆదర్శ దైవాలు కావడం ఎందుచేత జరుగుతోంది? శ్రీ శ్రీ అంటే ఎవరు? ఆ డబ్బింగ్ సినిమాలకి రాస్తారూ ఆయనేనా? అని అడిగే దుస్థితికి ప్రజలు దిగజారిపోవడం ఎందుకు జరుగుతోంది? ఈ వేళ శ్రీశ్రీ మొదలు పెట్టిన ప్రచండోద్యమానికి సన్మానం జరపడం అంటే వీటన్నిటికీ సమాధానాలు వెతకడం. మిమ్మల్ని మీరు తిరిగి చూసుకోండి. “దొంగ లంజకొడుకులసలే మెసిలే ఈ లోకంలో” మీరు కూడా భాగస్వాములై పోతున్నారు జాగ్రత్త.
జీవిత వాస్తవాల్లోంచి పుట్టి తిరిగి జీవితాన్ని చైతన్యవంతం చేయగలిగేదే సాహిత్యం. కదిలేదీ కదిలించేదీ, మారేదీ మార్పించేదీ, పెనునిద్దర వదిలించి మున్ముందుకు నడిపించేదే సాహిత్యం. సామాజిక జీవితంలోని కాలుష్యాన్నీ, అవ్యవస్థనీ ఎత్తిచూపి విప్లవకర మార్పుల్ని ఆహ్వానించేదే సాహిత్యం. ఇలాంటి సాహిత్యాన్ని సృష్టించి – పదివేల సంవత్సరాల క్రితం విశృంఖలంగా ఉన్న వర్ణవ్యవస్థలో నిజమైన సాహిత్యం ఉందనే హాహాహూహూల్నీ, ప్రేయసి కన్నుల నీలినీడల్లో నిజమైన సాహిత్య విలువలున్నాయనే పడుపు కవుల్నీ, దేశభక్తి గీతాలతో ప్రజల్ని మభ్యపెట్టి ప్రక్కతోవలు పట్టించే కవితా వంచకుల్నీ – చీల్చి చెండాడవల్సిన తరుణంలో మీలో ఎందుకింత స్తబ్దత?
“భావ విప్లవం రాకుండా సాంఘిక విప్లవం రాదు” అన్నారు కుటుంబరావు గారు. శ్రీశ్రీ తన ప్రచండ కవితాశక్తితో ఆంధ్ర సాహిత్యంలో భావ విప్లవానికి ముప్పై ఏళ్ల క్రితమే నాంది పలికాడు. అదృష్టవశాత్తూ దేశంలో యిప్పటికి నిజమైన సాంఘిక విప్లవ పరిస్థితులు ఏర్పడ్డాయి. తుపాకీ దెబ్బకి వెరవకుండా, విప్లవ పంథాలో జనం వెల్లువలా విరుచుకు పడుతున్నారు. ధైర్యంగా చెరసాలలకీ, ఉరికొయ్యలకీ ఆహుతి అవుతున్నారు. గోడల్ని పగులగొడుతున్నారు. ఇంతటి ఉత్సాహపూరితమైన సమయంలో శ్రీశ్రీ కలలుగన్న మరో ప్రపంచాన్ని వాస్తవం చేసే ఈ ప్రయత్నంలో ఆభ్యుదయం పేరుతో commit అయిన మీ సాహిత్య కంఠం ఎందుకు నిశ్శబ్దంగా ఉండిపోయింది?
స్పానిష్ విప్లవంలో ప్రాణాలు పోగొట్టుకున్న సాహిత్యకారుడు క్రిస్టఫర్ కాడ్వెల్ లా, తను రాసిన ప్రతి పద్యం గిరిజనుల నోట ఊతపదంగా చేసి శ్రీకాకుళ విప్లవ పోరాటంలో వీరమరణం చెందిన సుబ్బారావు పాణిగ్రాహిలా, సాహిత్యాన్ని జీవితాన్ని మార్చే శక్తిగా మీరెందుకు చెయ్యలేరు?
నమ్మిన ఆదర్శాలకోసం పట్టుదలగా నిలబడిన ఓ కుటుంబరావులా, ఓ రావిశాస్త్రిలా, ఓ కాళీపట్నంలా, ఓ బీనాదేవిలా విప్లవాన్ని రెండు చేతులా ఆహ్వానిస్తూ జనాన్ని మేల్కొల్పగలిగేది మీలో ఎంతమంది?
“సాయుధ విప్లవమే మా లక్ష్యం”, “హింస విప్లవానికి నాంది” అని ధైర్యంగా ప్రకటించి, విప్లవ కవులుగా శ్రీశ్రీ వారసత్వాన్ని తీసుకుని, సాహిత్య సందేశాన్ని ముందుకు తీసుకుపోయే దిగంబర కవుల సాహసం మీలో కన్పించదేం?
ఈ దినం శ్రీశ్రీకి ప్రశంసోత్సవ దినం. అందుచేత ఈ వేదికను నిజమైన విప్లవ వేదికగా మేం భావిస్తున్నాం. ఈ వేదిక మీదనుండి యువకులు మీనుండి తక్షణం స్పష్టమైన సమాధానాన్ని అడుగుతున్నారు. మీరు ఎటున్నారు? ముందుకు నడిచేవాళ్లలోనా? వెనక్కి పోయేవాళ్లలోనా? “అభిప్రాయాలకోసం బాధలు లక్ష్యపెట్టని వాళ్ల”లోనా? “అభిప్రాయాలు మార్చుకొని సుఖాలు కామించే వాళ్ల”లోనా?
ఈవేళ వీటికి గుండెమీద చెయ్యి వేసుకొని సమాధానం చెప్పుకోండి. చేతనయితే రండి. నిజాన్ని నిర్భయంగా రాయండి. మేం వున్నాం. మీవల్ల ఉత్తేజితులమై, మీరు చూపించే దారిపట్టి, మీరూహించే మరో ప్రపంచాన్ని వాస్తవం చేస్తాం.
లేదా వెళ్ళండి. వారపత్రికల మోచేతుల కింద గంజి తాగండి. పెద్దింటివాళ్ల ఉంపుడు కవులుగా, సినిమా హీరోల బూట్లు తుడుస్తూ కూర్చోండి. మిమ్మల్ని మేమూ, చరిత్ర కూడా క్షమించం.”
యాబై సంవత్సరాల తర్వాత కూడ చదువుతుంటే ఒళ్లు గగుర్పొడిచే, ఉత్తేజపరిచే ఈ కరపత్రం అక్కడ వేదిక మీద చదివిన వెంటనే, ఆ కరపత్రాన్ని సభలో పంచిన వెంటనే ఎంత సంచలనం కలిగి ఉంటుందో ఊహించవచ్చు. స్పానిష్ అంతర్యుద్ధాన్నీ, క్రిస్టఫర్ కాడ్వెల్ త్యాగాన్నీ, సుబ్బారావు పాణిగ్రాహి త్యాగాన్నీ ప్రస్తావించడం ద్వారా ఈ కరపత్రం సాహిత్యకారుల ముందు ఒక స్పష్టమైన మార్గాన్ని సూచించింది. బుద్ధిజీవులుగా సాహిత్యకారులు తప్పించుకోలేని ప్రశ్నల్ని విసిరి తేల్చుకొమ్మని బరిగీసింది.
అందుకే అది విన్నవెంటనే కె వి రమణారెడ్డి “ఈ సవాల్ విన్న తరువాత నా మనసు ఈ క్షణంలో నాది కాకుండా పోతూంది. ఒక అగ్నిపర్వతం ఏదో ముందు హెచ్చరిక లేకుండా ఉన్నట్టుండి నా మనసులో రగిలింది…” అన్నారు. అయితే అప్పటికి ఇరవై సంవత్సరాలుగా అభ్యుదయ రచయితల సంఘంతో ఉన్న సంబంధాలు, భారత కమ్యూనిస్టు పార్టీ నుంచి చీలి ఏర్పడిన మార్క్సిస్టు పార్టీ పట్ల సానుభూతి, నక్సలైట్ ఉద్యమం పట్ల ఇంకా పూర్తిగా రూపొందని అవగాహన ఆయన తర్వాతి మాటల్లో ప్రతిఫలించాయి: “…కాబట్టి ఈ మిత్రుడు వేసిన సవాల్ కు నాకు నేను చెప్పుకున్న జవాబు – నేను ముందుకు పోయేవారిలో ఒకడుగా ఉంటాను గాని, ముందుకు పోబోయి దూకి పడి గాయాలు తగిలి మోచేతులు మోకాళ్లు విరగ్గొట్టుకోను” అని జాగ్రత్తగా జవాబిచ్చారు.
“సమాజం, సాహిత్యం అనే మాటలు వాడుతున్నాం. ఒకటి క్లారిఫై చేయాలి. నేను చెపుతున్నది ప్రత్యేకంగా విశాఖ విద్యార్థులకి. సమాజం అంటే ఎవడి సమాజం వాడికుంది. వియత్నాంలో ఏదో జరుగుతోంది అంటే ఏడ్చేవారి సమాజం, నీగ్రోలను వేటాడుతుంటే బాధపడేవాళ్ల సమాజం, శ్రీకాకుళంలో చంపేస్తున్నారు అంటే పోన్లే అనే వాళ్లది ఒక సమాజం. సమాజం అనేది అందరికీ ఒకటి కాదు…” అని కొడవటిగంటి కుటుంబరావు గారు రెండు సమాజాల మధ్య విభజనరేఖను చూపడానికి ప్రయత్నించారు.
విద్యార్థుల సవాల్ ను “ముందు హెచ్చరిక లేకుండా భూకంపమో అగ్నిపర్వతపు ప్రేలుడో అలాంటిదేదో” అని వ్యాఖ్యానించిన సోమసుందర్ “…విప్లవం విప్లవం అని నన్నరవమంటే నేను సిద్ధంగా ఉన్నాను గాని అదే కవిత్వం అని నా సోదరులు భ్రమించరని నేను మరొకసారి నన్ను నేను హెచ్చరించుకొంటున్నాను. నామటుకు నేను విప్లవం వర్ధిల్లాలి అని నినదించడానికి సిద్ధంగా ఉన్నాను. కాని అదే కవిత్వమనమని ట్రిగ్గర్ దగ్గిర వేళ్లు పెట్టిన తుపాకిని వీపుమీద పెట్టి అడిగితే సంసిద్ధంగా లేను” అని దిగంబర కవిత్వం పట్ల, విప్లవ కవిత్వం పట్ల తన చిన్నచూపును ప్రకటించారు.
దానికి జవాబుగా జ్వాలాముఖి, “అభ్యుదయ కవులమని పోజు పెడ్తూ ఇంకా మానసిక భావకవితా యుగంలోనే బృహన్నల అవతారం వేసి మాట్లాడేటటువంటి నైతికంగా దిగజారిపోయిన వారి వాక్కుల్ని మనం వింటున్నాం” అని సోమసుందర్ ను, “ప్రజలక్కడ చస్తూంటే ముందుకు అంచనా లేకుండా పరుగెట్టి మోకాళ్లు పగుల గొట్టుకుంటున్నారని రమణారెడ్డిలా వాపోదామా” అని కె వి రమణారెడ్డిని విమర్శిస్తూ, “నన్నయనైనా మనం సరిగా అర్థం చేసుకోలేదు. లేదా ఎర్రజెండానైనా అర్థం చేసుకోలేదు. శాస్త్రీయమైన దృక్పథం కావాలి. స్పష్టంగా సమకాలీన రాజకీయ పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి” అని నిప్పులు కురిపించారు.
“ఇందులో సవాల్ ఉంది. మీరు ఏ విషయాలకు కమిట్ అవుతున్నారో వాటికి నిలుస్తారా? అసలు కమిట్ అవుతారా? ప్రజల్లోకి వస్తారా? వెనక్కి వెళ్లిపోతారా? మేం తప్పకుండా ప్రజలతో ఉంటాం. ప్రజలతో పాటు వస్తాం. వెనుక పడిపోం. అయితే మాకు ఈ సవాల్ చేసిన విద్యార్థులారా, మరి మీరు కూడ ముందుకు వస్తారా, ఈ కరపత్రాల్లో చూపిన ఉత్సాహాన్ని, ఆవేశాన్ని నిజజీవితంలో ప్రదర్శిస్తారా, నిలబెట్టుకుంటారా? మీరైతే వెనుక పడిపోరు కదా? రచయితను ఒంటరివాణ్ని చేసి ఊరుకోరుకదా?” అని వరవరరావు అన్నారు. అప్పటికే అచ్చయి వచ్చిన తిరుగబడు సంకలనంలోని మాటలు ఉటంకిస్తూ, “తిరుగబడు కవుల్లో ఒకడిగా సమాజం సాహిత్యం అనేదానికి నా జవాబు రాతలో కమిట్ మెంట్ గా చెప్తున్నాను. ‘అరణ్యాల్లో, కొండకోనల్లో, చెట్లల్లో, పొదల్లో, కార్చిచ్చులా రాజుకుంటున్న ఈ జ్వాలల్ని పంచడానికే మా తిరుగుబాటు హస్తాలను అందిస్తున్నాం” అని ప్రకటించారు.
నిఖిలేశ్వర్, “కవి లేక రచయిత తన సమాజంలో ఉంటూ ఎక్కడా కూడా అన్యాయానికి అవినీతికి లోబడకుండా రాజీ పడకుండా రానున్న తరాన్ని ముందుకు తీసుకెళ్లాలి. సాగుతున్న పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి” అని ప్రకటించారు.
ఈ చర్చకు ముగింపుగా వెల్చేరు నారాయణరావు, “ఈ రకమైన చర్చలన్నిటికీ దీన్ని వేదిక చేసినందుకు సంతోషిస్తున్నాం. దీనివల్ల ఎవరు కమిట్ అయ్యారో, ఎవరు ఎటువైపు ఉన్నారో, ఎవరు సరదాకోసం, ఆనందం కోసం రాస్తున్నారో స్పష్టపడడం చాలా ఆనందింపదగిన విషయం. ఇకముందు కవిత్వం ఎటు పురోగమిస్తుందో ఏ కవిత్వాన్ని ప్రజలు ఆదరిస్తారో ఈ హర్షధ్వానాల వల్ల కవులు గుర్తిస్తారనుకుంటున్నాం” అన్నారు.
మొత్తానికి రెండు రోజుల షష్టిపూర్తి కార్యక్రమంలో మిగిలిన అంశాలన్నీ పక్కకు పోయి విశాఖ విద్యార్థులు విసిరిన ‘రచయితలకు సవాల్’, దానికి జవాబు ఇవ్వడంలో రెండుగా చీలిపోయిన సాహిత్య సమాజం చరిత్రలో నిలిచిపోయాయి. ఆంధ్రప్రభ 1970 ఫిబ్రవరి 2 సంచికలో ఈ సభ మీద నివేదికలో, “విశాఖ విద్యార్థుల సవాలుపై పాల్గొన్న కవులు విభిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. నిఖిలేశ్వర్, జ్వాలాముఖి (దిగంబర కవులు), శ్రీ వరవరరావు, ఈ సవాలును సమర్థించగా, శ్రీ సోమసుందరం వంటి వారు వ్యతిరేకించారు” అని రాసింది.
ఈ కార్యక్రమం మీద హిందూ దినపత్రికలో ఫిబ్రవరి 6న వచ్చిన రిపోర్టుకు స్పందనగా రామలక్ష్మీ ఆరుద్ర రాసిన లేఖను హిందూ ఫిబ్రవరి 10న అచ్చు వేసింది. ఆ లేఖలో ‘షష్టిపూర్తి కార్యక్రమంలో ఆరుద్రకు అవమానం జరిగింద’ని ఆరోపిస్తూ, దిగంబర కవుల కవిత్వాన్ని ఈసడిస్తూ, “విశాఖ సభ విషయానికి వస్తే, అది కేవలం శ్రీశ్రీని గౌరవించడానికి మాత్రమే కాదు, నక్సలైట్ ఆశయం పట్ల ఆయనను కమిట్ చేయించడానికి జరిగిన సభ” అని ఆమె వ్యాఖ్యానించారు.
అలా విశాఖ విద్యార్థుల కరపత్రంతో ప్రారంభమైన విభజన ఆ తర్వాత నాలుగు నెలల్లో నానాటికీ మరింతగా స్పష్టమవుతూ, పెద్దదవుతూ వచ్చింది. ఈ విభజనలో నక్సల్బరీ శ్రీకాకుళ విప్లవోద్యమాలను సమర్థిస్తూ, సాహిత్యం ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలవాలని కోరుకునే రచయితలు ఒకవైపు నిలవగా, యథాస్థితివాద, వ్యవస్థా సమర్థక, ప్రభుత్వానుకూల సాహిత్యకారులు, సినిమా సాహిత్య కారులు, అభ్యుదయ రచయితల సంఘం నాయకులుగా భారత కమ్యూనిస్టు పార్టీని సమర్థిస్తున్న రచయితలు, ఒక సాహిత్య సంస్థగా రూపొందనప్పటికీ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ను సమర్థిస్తున్న రచయితలు అందరూ మరొకవైపు నిలిచారు.
ఇప్పుడు వెనక్కి తిరిగి, చారిత్రక సమాచారం వెలుగులో ఈ వివరాలు పరిశీలిస్తుంటే ఒక ఆశ్చర్యకరమైన యాదృచ్చికత కనబడింది. ఫిబ్రవరి 1 సభ శ్రీశ్రీని నక్సలైట్ రాజకీయాలకు నిబద్ధుణ్ని చేయడానికి జరిగిన ప్రయత్నమని ఒక వర్గం తరఫున రామలక్ష్మి భావించగా, సరిగ్గా ఆ ఫిబ్రవరి 1 శ్రీశ్రీ షష్టిపూర్తి సభ వార్త వచ్చిన దినపత్రికలోనే ‘శ్రీకాకుళంలో నక్సలైట్ల ఆటకట్టినట్లే’ అని వెంగళరావు చేసిన ప్రకటన కూడ సమాన ప్రాధాన్యతతో వెలువడింది.
అప్పటి రాష్ట్ర హోం మంత్రిగా జలగం వెంగళరావు అంతకు ముందు రెండు రోజులు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి, ఫిబ్రవరి 1ననే విశాఖపట్నం తిరిగివచ్చి పిటిఐ విలేఖరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, “నక్సలైట్లలో ముఖ్యులైనవారు సుమారు ఒక పది మంది మాత్రమే మిగిలిపోయారని, అందువల్ల ఒరిస్సా సరిహద్దులోని శ్రీకాకుళం జిల్లాలో నక్సలైట్లు తమ విధ్వంస కార్యకలాపాలకు స్వస్తి చెప్పడానికి ఇక ఎంతో కాలం పట్టదని” అన్నారని ఆంధ్రపత్రిక దినపత్రిక రాసింది. “నక్సలైట్ నాయకులు వెంపటాపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసం, డాక్టర్ మల్లికార్జునుడు ప్రభృతులు కొద్దిమంది తప్ప మిగిలినవారు అందరినీ పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని ఆయన చెప్పార”ని ఆరోజే ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది.
శ్రీశ్రీని నక్సలైట్ల వైపు తిప్పడానికి దిగంబరకవులూ తిరుగబడు కవులూ చేస్తున్న ప్రయత్నమని అంటున్న సాహిత్యకారులు, అసలు నక్సలైట్ల పనే అయిపోయిందని అంటున్న ప్రభుత్వమూ ఇద్దరూ కూడ శ్రీశ్రీని దిగంబరకవుల నుంచి. తిరుగబడు కవుల నుంచి, నక్సలైట్ల నుంచి విడదీయడానికి అన్ని రకాల ప్రయత్నాలూ ప్రారంభించారు. ఆ ప్రయత్నాలలో దిగంబరకవుల మీద, వాళ్ల కవిత్వం మీద అన్యాయమైన విమర్శల దగ్గరి నుంచి, శ్రీశ్రీని కొనివేసే ప్రయత్నాల దాకా ఎన్నెన్నో ఉన్నాయి.
“శ్రీశ్రీ సన్మానం పేరుతో కొందరు సెక్టేరియనిస్టులు తమ అల్పత్వాన్ని ప్రదర్శించుకునేందుకు తుచ్ఛమైన సాహిత్యేతర వేదికగా మార్చడంలో కృతకృత్యులు కావడం శోచనీయం” అనీ, “ఏమైనా శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భాన్ని వినియోగించుకొని ఇటు రాజకీయపరంగాను, అటు సాహిత్యపరంగాను ఉగ్రవాదులు తమ స్వీయ ప్రయోజనాల ఆవరణలోనికి చాల దూరం లాక్కుపోయారు” అనీ, “ఈ దిగంబరులు నక్సలైటు విప్లవకారులు శ్రీశ్రీ నడుం పట్టుకొని తమకు కావలసిన ధోరణిలో పిల్లికూతలు పెట్టిస్తున్నారు. ఆచరణలో వితంతు సాహిత్యాన్ని సృష్టిస్తున్న కుటుంబరావు గారు కేవలం అవకాశవాదిగా వ్యక్తి హుందాతనాన్ని నిలుపుకునేందుకు చౌకబారు విప్లవ నినాదాలు ఇస్తున్నారు” అనీ సోమసుందర్ రాసిన వ్యాస పరంపరను భారత కమ్యూనిస్టు పార్టీ దినపత్రిక విశాలాంధ్ర అచ్చువేసింది. ఈ చర్చలోకి ఆరుద్ర, రామలక్ష్మి, తుమ్మల వెంకటరామయ్య వంటివారు కూడ దిగారు. శ్రీశ్రీ, కెవి రమణారెడ్డి చర్చలో వచ్చిన ప్రశ్నలకు, ఆరోపణలకు జవాబులు చెప్పారు. రాచమల్లు రామచంద్రారెడ్డి, మోటూరు హనుమంతరావు వంటి సిపిఐ, సిపిఎం సాహిత్యకారులు, విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహశాస్త్రి వంటి సాంప్రదాయిక సాహిత్యకారులు కూడ ఈ వివాదంలో దిగంబరకవుల మీద, శ్రీశ్రీ మీద, “నక్సలైట్ సాహిత్యకారుల” మీద విమర్శలు గుప్పించడం ప్రారంభించారు.
ఒకవైపు ఇటువంటి వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు జరుగుతుండగానే, తెలుగు సాహిత్యలోకంలో సమాజ సాహిత్య సంబంధాలపై లోతైన చర్చలు కూడ మొదలయ్యాయి. ప్రజాతంత్ర వారపత్రిక 1970 ఏప్రిల్ 30 సంచికలో ‘అభ్యుదయ కవి విధిగా మార్క్సిస్టు కానవసరం లేదు’ అనే చర్చనీయాంశం మీద కాళోజీ, వే నరసింహారెడ్డి, వరవరరావు, సంజీవరావు, సుదర్శన్, రాంభట్ల కృష్ణమూర్తి, బొల్లిముంత శివరామకృష్ణ, మహాస్వప్నల అభిప్రాయాలు ప్రకటించింది. ఆ చర్చలో “సాయుధ పోరాటాన్ని సమర్థించకపోతే అభ్యుదయ కవి కాలేడా” అని ప్రజాతంత్ర ప్రతినిధి అడిగిన ప్రశ్నకు వరవరరావు, “…నిరంతరం దోపిడీకి గురవుతున్న పేదల బ్రతుకులను బాగుపరచడానికి సాయుధ పోరాటం ఒక్కటే శరణ్యమని నమ్మిన కార్యకర్తలు ప్రాణాలను ఒడ్డి అడవులలో విప్లవ జ్వాలలను రగిలిస్తున్నారు. వారిపట్ల మధ్యతరగతి ప్రజలకు భయం-అసహ్యం ఏర్పడకుండా, వారు దొంగలు దోపిడీగాళ్లు, అరాచకవాదులు అన్న తప్పుడు అభిప్రాయాలు కలుగకుండా మధ్యతరగతి మనస్తత్వాన్ని సాయుధ పోరాటానికి అనుకూలంగా తిప్పడమే కవులుగా మాకు చేతనయ్యేది” అని జవాబు చెప్పారు.
ఈ చర్చలో మహాస్వప్న వ్యక్తం చేసిన అభిప్రాయాల ఫలితంగా దిగంబర కవుల్లో చీలిక వచ్చి, మహాస్వప్నకూ మిగిలిన దిగంబరకవులకూ మధ్య బహిరంగ వివాదం చెలరేగింది.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో సెవెన్ స్టార్స్ సిండికేట్ అనే సంస్థ మే మూడో వారంలో సమావేశమై, జూలై 3-4 తేదీల్లో హైదరాబాద్ లో అభ్యుదయ సాహిత్య సదస్సు నిర్వహించాలనీ, శ్రీశ్రీకి సన్మానం చేయాలనీ, ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా శ్రీశ్రీకి మనీపర్స్ బహూకరించాలనీ నిర్ణయించింది.
మొత్తం మీద తెలుగు సాహిత్యకారుల్లో ఫిబ్రవరి 1న ప్రారంభమైన పోలరైజేషన్ అలా జూలై మొదటి వారంలో బద్దలు కావడానికి రంగం సిద్ధమైంది.