వలసవాదానికి ఉన్న అమానవీయ ముఖాల్లో ఒప్పంద కార్మిక వ్యవస్థ ఒకటి. అది బానిసత్వానికి మరో చట్టబద్ధమైన రూపం. పీడన స్వరూపం మారింది గాని సారాంశం ఒక్కటే. స్వభావం ఒక్కటే. సాధారణంగా మనం సామ్రాజ్యవాదం చేసిన దోపిడీల్లో భౌతిక సంపద దోపిడీ గురించే ఎక్కువగా మాట్లాడతాం. పారిశ్రామిక విప్లవంలో అదనపు విలువ గురించి, అది సామ్రాజ్యవాదానికి వేసిన దారుల గురించి, వ్యాపార వాణిజ్య రంగాల్లో సంపద తరలింపు గురించి పాఠాలు చదువుతాం. పరిశోధనలు చేస్తాం. కానీ వ్యవసాయపు పనుల కోసం శ్రామికుల వలస ద్వారా జరిగిన శ్రమ దోపిడీ గురించి గానీ అతి తక్కువ వేతనాలతో మానవ వనరుల తరలింపు గురించి గానీ అంతగా ఎక్కడా ప్రస్తావించుకోం. అగ్రరాజ్యాల వలసవాద చరిత్రలో అది విస్మృత కోణం. చీకటి అధ్యాయం. నెత్తుటితో తడిసి నలిగిన పుట. చెమటతో చెరిగిన అక్షరం.
ప్రపంచంలోని అగ్రరాజ్యాలు అనుభవిస్తున్న సంపదలో భారతీయ కార్మికుల వాటా గణనీయమైనది. బ్రిటిష్ సామ్రాజ్య దేశాల మధ్య మానవ వనరుల తరలింపు దౌర్జన్యపూరితంగా హింసాభరితంగా అమలైంది. దాదాపు నూరేళ్లు శ్రమశక్తి దోపిడీ నిరాఘాటంగా జరిగింది. భిన్న ప్రాంతాలకు వివిధ సముదాయాలకు చెందిన ప్రజలు ఆకలి నుంచి కరువు నుంచి తప్పించుకోవటానికి గతిలేని వలస బాటలు పట్టి రోగాలు చావులు ఎదుర్కొన్నారు. బానిసత్వాన్ని కొనితెచ్చుకున్నారు. స్వేచ్ఛను కోల్పోయారు. జంతువుల కన్నా హీనంగా జీవించారు. వలసలు ఎన్నో మోసాలతో బలవంతాలతో జరిగేవి. నెలల తరబడి చేసిన సముద్ర ప్రయాణాలు నరకపు దారులే. గమ్యస్థానాలకు చేరాకా తోట యజమానుల చేతుల్లో కార్మికులు తీవ్ర హింసలు అనుభవించారు. కొత్త ప్రాంతంలో సరైన సదుపాయాలుండేవి కావు. భాష ప్రధానమైన అడ్డంకిగా ఉండేది. రెండు నాల్కల దుబాసీలు దాన్ని తమకు, యజమానులకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. ఓడ దిగిన మరుక్షణం నుంచే పరాయీకరణ మొదలయ్యేది. యజమానులు, సూపర్వైజర్లు చేతిలో కొరడాలతో బానిసల్ని అజమాయిషీ చేసినట్లే ఒప్పంద కార్మికుల్ని నియంత్రించారు. మనుషులు మనుషుల్లా కాకుండా సంఖ్యలుగా మారారు. సంపదను ఉత్పత్తి చేసే యంత్రాల్లా మారారు. గానుగ చక్రానికి కట్టిన పశువులుగా మారారు.
చరిత్రలో ‘గొప్ప ప్రయోగం’గా వలసవాద దేశాలు అభివర్ణించుకొనే ఒప్పంద కార్మిక వ్యవస్థ Human dignity పై జరిగిన అమానుషమైన దాడి. పేదరికం కారణంగా, జాతి పేరున, ప్రాంతీయ అసమానతల మూలంగా సాటి మనుషుల్ని హీనంగా చూసిన క్రూరత్వానికి పరాకాష్ట యిది. వర్ణ వివక్షతో పాటు కొన్ని చోట్ల మతం కూడా మనుషుల్ని కించపరచడానికి హేతువైంది. తోటల్లో యజమానులు కార్మికుల్ని కట్టు పుట్టు బానిసల్లానే భావించారు. వారి నుంచి లాభం పిండుకోవడం తప్ప యజమానులకు మరో ఆలోచన లేదు. లాభం కోసం కార్మికుల్ని మరో యజమానికి అమ్మిన దాఖలాలు సైతం ఉన్నాయి. పుట్టిన నేల మీద ఆకలి నుంచి, సామాజిక అవమానాల నుంచి తప్పించుకోడానికి మెరుగైన జీవితాన్ని ఆశించి చేసిన సుదూర వలసలు పెను శాపంగా పరిణమించాయి. ఆకలి తీరిందేమోగానీ అవమానాలు ఆగలేదు. కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. స్త్రీ పురుష సంబంధాలు పెళుసుబారాయి. స్త్రీలపై అమలైన హింసకు అంతులేదు. వారిపై పాశవికంమైన లైంగిక దాడి జరిగింది. వారి నైతికత మీద పెద్ద పెద్ద తీర్మానాలు చేశారు. కడుపు చేతబట్టుకుని సముద్రాలు దాటి వచ్చిన శ్రమజీవులపై శీలహీనలు కులటలు పతితలు వ్యభిచారిణులు అని ముద్రలు వేశారు (ఆధిపత్య చరిత్రకారులు అదే ప్రచారం చేశారు). నవమాసాలూ మోసి కన్న బిడ్డలకు సరైన పోషణ కూడా కరువైంది. చదువులకు దిక్కే లేదు. వ్యవసాయ క్షేత్రాల్లో పంటలు పండించడానికి వెళ్ళినవాళ్ళు తెల్లదొరల ఇళ్ళలో పని మనుషులయ్యారు. వంట చేశారు. వారి బిడ్డల్ని పెంచే ఆయాలయ్యారు. మరుగుదొడ్లు కడిగారు. సమస్త సేవలూ చేశారు. తమ జీవితంపై పడ్డ కశాఘాతాలను గుర్తు చేసుకోవటానికి గానీ ఆత్మీయులతో పంచుకోడానికి కూడా వారు ఇష్టపడలేదు.
రైల్వే నిర్మాణం వంటి పనుల్లో తప్ప పరాయి దేశాల్లో ఒప్పంద కార్మికులు అసంఘటితరంగంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా అనాథలుగా జీవించారు. దళారుల, యజమానుల దాష్టీకానికి బలయ్యారు. ఎటువంటి హక్కులూ లేక వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవచ్ఛవాలుగా కాలం వెళ్లదీశారు. స్థానికుల ఈర్ష్యా ద్వేషాలకు గురయ్యారు. కొన్ని చోట్ల భౌతిక ఘర్షణలు కూడా తలెత్తాయి. నిజానికి స్థానిక శ్రామికులకూ వలస కార్మికులకూ మధ్య వ్యూహాత్మకంగా శత్రుత్వాన్ని పెంచి పోషించి యజమానులు తమ పబ్బం గడుపుకున్నారు. చౌక శ్రమశక్తితో లాభాలు గడించారు. సంపద పోగేసుకున్నారు. పని స్థలాలు నిర్బంధ శిబిరాలయ్యాయి. కాలనీలు బహిరంగ జైళ్లు అయ్యాయి. బతుకులు బండలై హత్యలకు ఆత్మహత్యలకు నెలవయ్యాయి.
ఉత్పత్తి సేవా రంగాల్లో ఒప్పంద కార్మికులు చేయని పని లేదు. పొలాల్లో పంటలు తీశారు. పరిశ్రమల్లో వస్తువులు తయారు చేశారు. రహదారులు వేశారు. వంతెనలు నిర్మించారు. తమ చెమటతో రక్తంతో అపార సంపద సృష్టించారు. 1850 – 1913 మధ్య ప్రపంచ వాణిజ్యం 10 రెట్లు పెరిగిందని వొక అంచనా. అందులో ప్రధాన భాగం ఒప్పంద కార్మికుల శ్రమశక్తి సృజించినదే. కార్మికుల శ్రమ నుంచి పెంపొందిన అదనపు విలువ ద్వారా సామ్రాజ్యవాదులు మరింత బలపడ్డారు. అభివృద్ధి చెందారు. సంపద కాపాడుకునే, సామ్రాజ్యాలు విస్తరించుకునే యుద్ధాల కోసం, వలస దేశాల్లో తిరుగుబాట్లు అణచివేయడానికి సైనిక శక్తిని సమకూర్చుకున్నారు.
పొట్టకూటికోసం వలస పోయిన వాళ్ళు ఆ యా దేశాల్లో స్థిరంగా ఉండలేరు, వెనక్కి రాలేరు. తిరిగి వచ్చిన వాళ్ళు సామాజికంగా సాంస్కృతికంగా ఎదుర్కొన్న సవాళ్లు ఒక ఎత్తైతే అక్కడ ఉండిపోయిన వారు భయంకరమైన పరాయికరణకు గురయ్యారు. స్వదేశంలో నిర్లక్ష్యానికి గురయ్యారు. మాతృదేశమే వారిని సవతి బిడ్డలు గాని భావిస్తే దిక్కులేని దీనులయ్యారు. హేళనలు భరించలేక ఉన్మాదులయ్యారు. ఆ నాటి వారి శ్రమ పరాయికరణ సామాజిక పరాయికరణ సాంస్కృతిక పరాయికరణల గురించి అధ్యయనం చేస్తే వివిధ దేశాల్లో భారతీయ ఒప్పంద కార్మికులకు మాత్రమే ప్రత్యేకమైన డయాస్పోరా వెలుగులోకి వస్తుంది.
వలసపోయిన ఒప్పంద కార్మికులు ‘కూలీల’ని అవమానాలను ఎదుర్కొన్నారు. ఎంతోమంది తలవంచి భరించారు. కొందరు వాటిని ఎదిరించారు. జీవించే హక్కు కోసం గౌరవం కోసం సరైన వేతనాల కోసం పోరాడారు. కొన్నిసార్లు ఓడిపోయారు, కొన్నిసార్లు గెలిచారు. ఓడినా గెలిచినా తప్పని పరిస్థితుల్లో ఆ కొత్త సమాజాల్లో యిమిడిపోయారు. పరాయి దేశాల్లో పౌరసత్వాన్ని పొంది ఆ యా దేశాల ఉన్నతికి దోహదం చేశారు. తర్వాతి కాలంలో సామాజికంగా ‘భారతీయ డయాస్పోరా’ సమూహంగా ప్రత్యేక ప్రతిపత్తి సాధించి గౌరవంతో తలెత్తుకొని నిలబడ్డారు. రాజకీయంగా ఆర్థికంగా ఎదిగి కొన్ని దేశాల్లో దేశాధిపతులయ్యారు. అయితే అభివృద్ధి సోపానాధిరోహణంలో పైకి ఎగబాకింది ఎంతమంది? ఎటువంటి ఎదుగుదలకీ నోచుకోకుండా మట్టిలో కలిసిపోయింది ఎందరు? లెక్కలు లేవు. ఉన్నా అవి నిజాలు చెప్పవు. అందువల్ల ఇదంతా ఎవరికీ పట్టని నమోదు కాని చరిత్ర. భారతదేశంలో వారి గురించి ఆలోచించే వారే తక్కువ. తెలుగు నేలకు చెందిన వాళ్ళు వేలాదిమంది ఈ వలస కార్మికుల్లో ఉన్నారు. ఇటీవలి కాలంలో ప్రపంచీకరణ దరిమిలా వాళ్ళు తమ మాతృభూమితో సంబంధ బాంధవ్యాలని పునరుద్ధరించుకుంటున్నారు.
ముకుంద రామారావు తాతగారు మరి కొందరు కుటుంబ సభ్యులు ఒప్పంద కార్మికులుగా దక్షిణాఫ్రికాకు వలసపోయారు. కొందరు తిరిగి వచ్చారు. మరి కొందరు అక్కడే ఉండిపోయారు. తన మూలాల గురించి అన్వేషిస్తూ వెళ్లిన ఎలెక్స్ హేలీ లాగా రామారావు గారి తవ్వకపు పనిలో పుట్టినదే ‘అగమ్యగమ్యాలు’. మూలాలను వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో ఆయన తన వాళ్లకి దగ్గరయ్యారు. వారి సంవేదనను సొంతం చేసుకున్నారు. ఆత్మఘోషలో పూర్తిగా లీనమయ్యారు. అయితే తన పూర్వికుల దగ్గర ఆయన ఆగలేదు. వెతుకులాటలో ఎదురైన ఉద్వేగాల్ని అధిగమించి పరిశోధకుడయ్యారు. మొత్తం భారతదేశానికి చెందిన ఒప్పంద కార్మికుల చరిత్రను తవ్విపోశారు. స్వదేశాన్ని విడిచి వెళ్లిన లక్షలాది వలస కార్మికుల జీవన వేదనను వొడిసిపట్టారు. నిజానికి ఇది ఏ ఒక్కరి వల్లో అయ్యే పని కాదు; కానీ 80 ఏళ్ల వయసులో రామారావు ఈ పనికి పూనుకున్నారు. చరిత్ర నమోదు చేస్తూ ఆయనకున్న సాహిత్య ఆసక్తుల కొద్దీ ఆ యా దేశాల్లో భారతీయ డయాస్పోరాను రికార్డ్ చేసిన కవితల్ని సైతం సేకరించి అనువదించారు. ఆ కవితల ద్వారా పాటల ద్వారా తెలిసే సామాజిక సాంస్కృతిక చరిత్రను కూడా వెలికి తీశారు. తన తాతా అవ్వల జీవితాల్లో ఎదురైన వేదనకు చలించిపోయారు. దాన్ని కాగితమ్మీకు తెచ్చే ప్రయత్నంలో నిద్రలేని రాత్రులు గడిపారు. లభించిన యే చిన్న ఆధారాన్నీ వదల్లేదు. ఇదంతా చెప్పుకోలేని పెద్ద యాతన. దాన్ని ముకుంద రామారావు స్వచ్ఛందంగా స్వీకరించారు. చరిత్రను సాహిత్యం ద్వారా రికార్డ్ చేయడం వల్ల ఇతర ఒప్పంద కార్మికుల వలసల చరిత్ర కంటే ఇది విలక్షణమైనదీ విశిష్టమైనదీ. ఆ పుస్తకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒప్పంద కార్మిక వలసల మార్గాల్ని (Indentured Labour Route) నిర్వచించవచ్చు.
ఒప్పంద కార్మికుల్లో దళారుల ద్వారా వెళ్లే వాళ్ళే కాకుండా స్వచ్ఛందంగా శ్రీలంక బర్మ వంటి దేశాలకు వెళ్లిన వాళ్లు కూడా లక్షల్లో ఉన్నారు. ఈ చరిత్రని నిర్మించే దిశలో ముకుంద రామారావు గారు అందించిన గణాంకాలు చాలా ఆశ్చర్యం గొల్పుతాయి. చాలాసార్లు నమోదైన గణాంకాలు పరస్పరం విభేదిస్తాయి. నిజమే, సంఖ్యలు సాపేక్షికాలే. కానీ అంకెల వెనక దాచేస్తే దాగని సత్యాలు ఎప్పటికైనా వెలికి వస్తాయి. అగాథాల అడుగున పడి కాన్పించని నిష్ఠుర నిజాలు బహిరంగమౌతాయి. పుక్కిటబట్టి దాచుకున్న మౌఖిక ఆధారాలు సైతం చరిత్ర విప్పి చెబుతాయి. వాటిని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. చరిత్రకారులు అటువంటి కష్టతరమైన పని కూడా చేయాలని ముకుందరామారావు యీ పుస్తకం ద్వారా నిరూపించారు.
దేశం బయట ఉన్న ఈ లక్షలాది బిడ్డలతో మాతృభూమి ఎటువంటి సాంస్కృతిక బాంధవ్యాన్ని నిలుపుకోగలుగుతుంది అన్నది తరచి చూడాల్సిన మరో ప్రధానమైన అంశం. సంస్కృతికి బహుళార్థాలు ఉండవచ్చు. అందువల్ల వలసపోయినవాళ్లు ఆ యా దేశాల్లో ఏ సంస్కృతిని కాపాడుకున్నారు, దేన్ని వదిలించుకున్నారు? ఒక నీటిలో నుంచి తీసిన చేపలు మరో నీటిలో బతకడానికి చేసే ఘర్షణ నుంచి ఏ పాఠాలు నేర్చుకోవాలి? దాదాపు రెండు శతాబ్దాలుగా తమ నేలకు దూరమైన వీరు పౌరసత్వం రీత్యా భారతీయులు ఎంత మాత్రం కారు. కానీ అక్కడి సమాజంలో వారి స్థానం ఏంటి అన్నది పెద్ద ప్రశ్న. ఇక్కడి సమాజంలో వారికి ఇచ్చే విలువ ఏంటి అన్నది మరొక ప్రశ్న. పొట్ట చేత పట్టుకొని వెళ్లిన వీళ్ళను ఎవరు తమ వారిగా స్వీకరించగలరు? ఏ పేగు బంధంతో మన సహోదరులను ‘మెయిన్ ల్యాండ్’తో తిరిగి ముడివేయగలమో ఆలోచించడానికి ‘అగమ్య గమ్యాలు’ దోహదపడుతుంది.
‘అగమ్య గమ్యాలు’ చరిత్ర గ్రంథం. రచయిత యింతకు ముందు రాసిన వాటికంటే భిన్నమైనది. సాహిత్య చరిత్ర రచనకు చరిత్ర రచన కంటే భిన్నమైన ప్రణాళిక అవసరం. అందుకే పుస్తకం సంపాదకుడిగా నా కారణంగానే చాలా ఆలస్యమైంది. రోజుల తరబడి మథనం. చర్చలు. వాదోపవాదాలు. స్వభావరీత్యా వాదనకు రామారావుగారు విముఖులు. కానీ చేయక తప్పలేదు. ఆ క్రమంలో నా కాఠిన్యంతో ఆయన్ని నొప్పించానేమో! ఇంతా చేసి యీ రచన సమగ్రంగా నిర్దుష్టంగా రూపొందిందో లేదో గానీ ఈ రంగంలో కృషి చేసే భావి పరిశోధకులకు ఇది ఒక మంచి ఆకర గ్రంథంగా అయితే ఉపయోగపడుతుందని మాత్రం గట్టిగా చెప్పగలను.
ఇవాళ ప్రపంచీకరణ నేపథ్యంలో అమెరికా యూరోప్ ఆస్ట్రేలియా లాంటి ఖండాలకు వలస పోతున్న సాంకేతిక నైపుణ్యం గల కార్మికోద్యోగుల పట్ల స్థానికుల వైఖరి ఏంటి, అందుకు కారణాలు ఏమిటి? ఆ యా దేశాల్లో వారి సామాజిక సంక్షేమం, ఉద్యోగ భద్రతా, పౌరహక్కులు, గౌరవప్రదమైన అస్తిత్వం, రాజకీయ ఆర్థిక ప్రమేయాలు, స్వదేశంతో నిలుపుకోగల సంబంధ బాంధవ్యాలు, ఇక్కడి రాజకీయాల్లో నిర్వహిస్తోన్న పాత్ర, అప్పటి ఇప్పటి డయాస్పోరాలో కనిపించే తేడాలు వంటి ఎన్నో విషయాలకు చెందిన ఆలోచనలు యీ పుస్తకం చదువున్నంతసేపూ కలగక మానవు. చదివిన తర్వాత కూడా వదలవు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఖండాల మధ్య దూరాల్ని అధిగమించిన ఆధునికానంతర కాలంలో ఏ గమ్యమూ అగమ్యం కాకపోవచ్చు. కానీ 21 వ శతాబ్దం మొదటి పాదంలో సైతం వివక్షలు తొలగిపోలేదు. మూడో ప్రపంచ దేశాల ప్రజలు కలల తీరాలుగా భావించే అగ్రరాజ్యాల్లో సైతం జాతి మత ప్రాంత వైరుధ్యాలు వైషమ్యాలుగా పరిణమిస్తున్నాయి. పాలకులే వాటిని పెంచి పోషిస్తున్న వికృత చేష్టలు గమనిస్తున్నాం. ఈ మానవదూరాల్ని అధిగమించే మార్గాల్ని అన్వేషించడమే మన ముందున్న కర్తవ్యమని ‘అగమ్య గమ్యాలు’ పరోక్షంగా గుర్తుచేస్తుంది. మనుషుల మధ్య గోడలు నిర్మించే అగాథాలను పెంచే ఫాసిస్టు పోకడల పట్ల అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తోంది.
చరిత్ర దానికదే స్వతంత్రం కాదు. వర్తమానానికి అన్వయించుకుందాం. భవిష్యత్తును నిర్మించుకుందాం. అందుకు ఆహ్వానిస్తూ, సెలవ్.
- హైదరాబాద్, 21 అక్టోబర్ 2025.