అణచివేత వ్యవస్థలను ఎదిరించి పోరాడటానికి అవసరమైన ధైర్యం, పోరాట పటిమలకు ప్రతీకలుగా నిలిచే వ్యక్తులు చరిత్రలో చాలా అరుదు. ప్రాచీన ఈజిప్టులోని అలెగ్జాండ్రియాకు చెందిన గొప్ప మహిళా తత్వవేత్త హైపేషియా, పితృస్వామ్య అణచివేతను ధిక్కరించడం, జెండర్ అడ్డంకులను ఛేదించడం, మేధో స్వేచ్ఛను స్వీకరించడం వంటి వాటికి అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఆమె జీవనయానం భవిష్యత్ తరాల మహిళా విముక్తికి మార్గం వేయడమే కాకుండా సామాజిక నిబంధనలను సవాలు చేసి, మేధోపరమైన అభిరుచులను కొనసాగించాలని కోరుకునే వారందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
హైపేషియా క్రీ.శ. 4వ శతాబ్దపు చివరి (350-370 AD)లో జన్మించింది. ఈ కాలంలో మహిళలు సాధారణంగా సమాజంలో అధీన లేదా సహాయక పాత్రలకు పరిమితం చెయ్య బడ్డారు. ఈ పరిమితులు ఉన్నప్పటికీ, ఆమె తన తండ్రి థియోన్ నుండి నాణ్యమైన విద్యను అందుకుంది, అతను స్వయంగా ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త. అతని మార్గదర్శకత్వంలో హైపేషియా గణితం, ఖగోళ శాస్త్రం, తత్వ శాస్త్రం,సాహిత్యాలలో సమగ్ర విద్య ను పొంది,గుర్రపు స్వారీ లో కూడా తర్ఫీదు పొందింది. అతి తక్కువ సమయంలోనే అద్భుతమైన మేధో సామర్థ్యాలను, జ్ఞాన పిపాసను ప్రదర్శించింది (హైపేషియా తల్లి గురించి ‘సహజంగానే’ మనకేమీ తెలియదు).
ఒక తత్వవేత్తగా, హైపేషియా ప్లేటో, అరిస్టాటిల్ ఇంకా ఆమె కాలంలోని ఇతర గొప్ప తత్వవేత్తల బోధనలను పరిశోధించింది. ఆమె లోతైన జ్ఞానం, వాగ్ధాటి గొప్ప ఉపన్యాసకురాలిగా, పండితురాలిగా ఆమెకుపేరు తెచ్చాయి. ఆ సమయంలో అధ్యయన, మేధో కార్య కలాపాలకు కేంద్రంగా ఉన్న, అలెగ్జాండ్రియాలోని నియోప్లాటోనిక్ విశ్వ విద్యాలయంలో హైపేషియా పనిచేసేది; సుదూర ప్రాంతాల నుండి విద్యా ర్థులను,జ్ఞానాభిలాషులను ఆకర్షిస్తూ చివరికి అదే విశ్వవిద్యాలయానికి ఆమె అధిపతి కాగలిగింది. రాజకీయ నాయకులకు సలహాలు ఇవ్వడం అలాగే పౌర వ్యవహారాలలో నిమగ్నమై ఉండటంతో ఆమె ప్రభావం విద్యా రంగానికి మించి విస్తరించింది. ఆమె వాగ్ధాటి, లోతైన జ్ఞానసంపదలకు ముగ్ధులైన అనేక మంది స్త్రీ, పురుషులు, విద్యార్ధులు, సభికులు సహజంగానే ఆమె ఉపన్యాసాలకు బోధనలకు ఆకర్షితులయ్యారు. హైపేషియా గణితం, ఖగోళ శాస్త్రం, నీతిశాస్త్రం, మెటాఫిజిక్స్ (Metaphysics) తో సహా వివిధ తాత్విక విభాగాలను బోధించేది. దాదాపు ప్రతిరోజూ బహిరంగ ఉపన్యాసాలను ఇచ్చే ది.
తన జీవితకాలంలో తత్వశాస్త్రం, సైన్స్ రెండింటిలోనూ ఆమె గణనీయమైన కృషి చేసింది. తన రచనలలో ఎక్కువ భాగం కాలక్రమేణా నాశనమైనప్పటికీ, తరువాత తరాలపై ఆమె ప్రభావం, వివిధ రంగాలలో ఆమె చేసిన కృషి నేటికీ నిలిచే ఉంది.
తాత్విక రంగం:
నియోప్లాటోనిజం: హైపేషియా ఆలోచనలు నియోప్లాటోనిక్ స్కూల్ ఆఫ్ థాట్ తో ముడిపడి ఉన్నాయి, ఈ థాట్ ఇతర తాత్విక సంప్రదాయాల నుండి జోడించిన అంశాలతో ప్లేటో బోధనలను పునరుద్ధరించింది. ఆమె నియోప్లాటోనిక్ ఆలోచనలను విస్తరించి,సంక్లిష్టమైన మెటా ఫిజికల్ (Metaphysical) భావనలకు తన వివరణలను జతపరిచింది.
విద్యా బోధన: హైపేషియా ప్రముఖ ఉపన్యాసకురాలిగా ప్రసిద్ధి చెందటమే కాకుండా తత్వ శాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రాలలో నైపుణ్యాన్ని కోరుకునే విభిన్న శ్రేణి విద్యార్థులకు పాఠాలు చెప్పింది. అలెగ్జాండ్రియా లోని ఆమె విద్యా లయం మేధో, తాత్విక చర్చలకు కేంద్రంగా రూపొందింది.
శాస్త్రీయ రచనలు:
హైపేషియా గణిత శాస్త్రంలో ముఖ్యంగా బీజగణితం, సంఖ్య సిద్ధాంతం, జామెట్రీ రంగాలలో కృషి చేసింది; డయోఫాంటస్, అపోలోనియస్ వంటి గణిత శాస్త్రజ్ఞుల రచనలపై వ్యాఖ్యానాలు వ్రాసి, ఆ రచనల అంతర్దృష్టులను శోధించి, వివరణలను అందించింది.
హైపేషియా ఖగోళ శాస్త్రంలో కూడా ప్రావీణ్యం సంపాదించింది, ఖచ్చితమైన లెక్కలకు, అంచనాలకు అవసరమైన ఖగోళ పరికరాలు, పరిశీలనా పద్ధతులను అభివృద్ధి చేసింది. గ్రహ చలనం, ఖగోళ దృగ్విషయాల అధ్యయనానికి దోహద పడింది. ఆమె టోలెమీ భౌగోళిక నమూనా బోధనలను సూర్యకేంద్రక సిద్ధాంతాలతో పునరుద్దరించటానికి ప్రయత్నించింది.
మేధో వారసత్వం:
తన ముందు తరం తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు ప్రోది చేసిన జ్ఞానాన్ని సంరక్షించడం, ప్రచారం చేయడంలో హైపేషియా చాలా కీలక పాత్ర పోషించింది. యూక్లిడ్, టోలెమీ వంటి ప్రముఖ శాస్త్రవేత్తల రచనలను సంరక్షించడం, ప్రచారం చేయడం ద్వారా వారి రచనల భవిష్యత్తు మనుగడకు భరోసా ఇచ్చింది.
పితృస్వామ్య అణచివేత ధిక్కరణ :
హైపేషియా జీవన యానం సవాళ్లు లేని నల్లేరు పై నడక కాదు. తన జెండర్ కారణంగా పురుషాధిక్య సమాజంలో, ఆమె నిరంతరం పరిశీలనను, వివక్షను ఎదుర్కొంది. అయితే, ఈ అడ్డంకులు తన ప్రగతిని అడ్డుకోవడాన్ని , అరికట్టడాన్ని ఆమె నిరాకరించింది. అచంచలమైన సంకల్పంతో తన మేధో అభిరుచులను, తత్వ-విజ్ఞాన శాస్త్రాలలో తన కృషిని కొనసాగించింది.
హైపేషియా సామాజిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, మేధోపరమైన విశ్లేషణలు, సంభాషణలు, జ్ఞానాభివృధ్ధి కోసం తనదైన వేదికని సృష్టించడంలో ఆమె నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె నిర్భయంగా బహిరంగ చర్చలలో నిమగ్నమై, సమాజంలో పాతుకుపోయిన నమ్మకాలను సవాలు చేస్తూ విమర్శనాత్మ క ఆలోచనతో వాదించింది. ఆమె ధైర్యం, మేధో సామర్ధ్యం స్త్రీలు మేధస్సులో పురుషుల కంటే తక్కువ అనే భావనను నిర్ద్వందంగా తిరస్కరించాయి.
హైపేషియా, ప్లేటో బోధనలచే ప్రభావితమైన ఒక తత్వవేత్తగా సాంప్రదాయ కుటుంబ నిర్మా ణం పట్ల వ్యతిరేకత, సమిష్టి పిల్లల పెంపకం, ప్రైవేట్ ఆస్తిని తొలగించడం లాంటి ప్లేటో ఆలోచనలతో సంబంధం కలిగి ఉంది. ఆమె జీవితం, ఆలోచనలు ప్లేటో భావనలను నిస్సందేహంగా ప్రతిబింబించాయి.
ప్లేటో, తన రచన “ది రిపబ్లిక్”లో, కుటుంబ నిర్మా ణం రద్దు చేయబడి, దాని స్థానంలో పిల్లలపెంపకం సమిష్టిగా సమాజం ఆధ్వర్యంలో సాగే ఆదర్శ సమాజం యొక్క ఆలోచనను ప్రతిపాదించాడు. ప్లేటో ప్రకారం, ఇది పిల్లల పెరుగుదలపై కుటుంబ బంధాలలోని విభజనల ప్రభావాన్ని తొలగించి, కేవలం జ్ఞానం, న్యాయం కోసం మాత్రమే దృష్టి సారించే సమాజాన్ని సృష్టిస్తుంది.
హైపేషియా, తన జీవితంలో నిర్ధేశిత సాంప్రదాయ పాత్రని, సామాజిక అంచనాలను ధిక్కరించింది. తన తండ్రి నుండి సమగ్ర విద్య ను పొంది, స్త్రీలు కేవలం ఇంటికి మాత్రమే పరిమితమనే భావనను సవాలు చేసింది. ఆమె విజ్ఞాన సాధన, మేధోసామర్ధ్యం, అలెగ్జాండ్రియాలోని నియోప్లాటోనిక్ విశ్వ విద్యాలయం అధిపతిగా ఆమె స్థానం పితృస్వామిక సంబంధాలను అధిగమించే ఒక మేధో సమాజాన్ని తనచుట్టూ సృష్టించుకునేందుకు ఉపయోగపడింది.
కాన్స్టాంటినోపుల్ కు చెందిన క్రైస్తవ చరిత్రకారుడు సోక్రటిస్ తన ఎక్లేసియాస్టికల్ చరిత్రలో ఇలా వర్ణించాడు.
“అలెగ్జాండియాలో ధియోన్ అనే తత్వవేత్త కుమార్తె హైపేషియా అనే మహిళ ఉంది. ఆమె తన కాలంలోని తత్వవేత్తలందరిని మించి సాహిత్యం, విజ్ఞాన శాస్త్రాలలో గొప్ప విజయాలు సాధించింది. ప్లోటినస్ విద్యాలయ భాద్యతలు స్వీ కరించిన తరువాత ఆమె తన సభికులకు తత్వ శాస్త్ర సూత్రాలను వివరించింది. చాలామంది ఆమె ఉపన్యాసాలు వినడానికి చాలా దూరం నుండి వచ్చేవారు. తన మేధస్సు ను పెంపొందించుకోవడం ద్వా రా సంపాదించిన స్వీయసామర్థ్యం, సౌలభ్యం కారణంగా ఆమె చాలా తరచుగా గొప్ప గొప్ప వారి సమక్షంలో బహిరంగ ఉపన్యాసాలను ఇచ్చేది. ఎక్కువగా పురుషులతో నిండిన సభలకు వెళ్లడాన్ని న్యూనతగా భావించలేదు. అసాధారణమైన ,మనోహరమైన ఆమె మేధస్సు, అద్భు త సంభాషణ కారణంగా పురుషులందరూ ఆమెను చాలా మెచ్చుకునేవారు.”
హైపేషియా తర్కం , విమర్శనాత్మక ఆలోచన ప్లేటో తాత్విక విధానంతో సమ్మిళితం చేయబడింది. ఇద్దరు తత్వవేత్తలూ సమాజంలో పాతుకుపోయిన నమ్మకాలను ప్రశ్నించడాన్ని , స్వతంత్రంగా ఆలోచించడాన్ని ప్రోత్సహించారు. హైపేషియా ఉపన్యాసాలు, రచనలు జ్ఞాన సాధనకై నిలిచి, సామాజిక నిబంధనలకు గుడ్డిగా కట్టుబడి ఉండడాన్ని తిరస్కరించి హేతుబద్ధతతో కూడిన సమాజం కోసం ప్లేటో ఇచ్చిన పిలుపును సమర్ధించాయి.
హైపేషియా ప్రైవేట్ ఆస్తి నిర్మూలన గురించి స్పష్టంగా చర్చించనప్పటికీ, ఆమె జీవితం, బోధనలు ప్లేటో ఆలోచనలతో ప్రతిధ్వనించే మేధో స్వేచ్ఛ కు నిబద్ధతను కలిగి ఉన్నాయి. సంపద, ఆస్తి కూడబెట్టడం న్యాయం మరియు సమానత్వ సాధనకు హానికరమని ప్లేటో వాదించాడు. సామాజిక నిబంధనలను తిరస్కరించడంతోపాటు మేధోపరమైన జ్ఞానం కోసం హైపేషియా చేసిన తిరుగులేని అన్వేషణ ప్రైవేట్ ఆస్తికి సంబంధించిన భౌతిక విలువలను తిరస్కరించడంగా మనం చూడవచ్చు.
కుటుంబ నిర్మాణాన్ని తొలగించడం, సమిష్టి పిల్లల పెంపకం, ప్రైవేట్ ఆస్తిని తొలగించడం లాంటి ప్లేటో ఆలోచనలను ఆచరణలో హైపేషియా ముఖ్యంగా వివాహాన్ని తిరస్కరించడం ద్వారా ఎత్తి పట్టింది. హైపేషియా,ప్లేటో ఇద్దరూ సమాజంలో పాతుకుపోయిన నియమాలను సవాలు చేయడానికి, విమర్శనాత్మ క ఆలోచనను ప్రోత్సహించడానికి, మరింత జ్ఞానవంతమైన , న్యాయమైన సమాజానికి మార్గం సుగమం చేయడానికి ప్రయత్నించారు.
హైపేషియా జీవితం, రచనలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి, మేధో స్వేచ్ఛ కోసం ఆమె సాధనలో అవి ఒకదానినొకటి బలపరిచాయి. తన ఉపన్యాసాలు, రచనల ద్వారా, మత, లింగ భేదం లేకుండా జ్ఞానం అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనను ఆమె సమర్థించింది. స్థిరీకరించబడి, సమాజంలో పాతుకుపోయిన సిద్ధాంతాలను ప్రశ్నించడానికి, స్వతంత్రంగా ఆలోచించడానికి అన్ని మతాల విద్యార్థులను ప్రోత్సహించింది. ఆమె బోధనలు అంధ విశ్వాసం లేదా సామాజిక నిబంధనలపై ఆధారపడకుండా, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సాధనాలుగా కారణం మరియు తర్కం యొక్క ప్రాముఖ్య తను నొక్కి చెప్పాయి.
హైపేషియా వారసత్వం ఆమె జీవిత కాలానికి మించి విస్తరించింది. సామాజిక పరిమితులు, పక్షపాతానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తులకు ఆమె జీవితం శాశ్వతమైన ప్రేరణగా నిలుస్తుంది. పితృస్వామ్య అణచివేతను సవాలు చేయాలనే ఆమె సంకల్పం, అణచివేత వ్యవస్థలను కూల్చి వేయడం మరియు అట్టడుగున ఉన్న గొంతులను వినిపించడం ద్వారా మాత్రమే నిజమైన పురోగతిని సాధించగలమని మనకు గుర్తుచేస్తుంది.
ప్రతికూల పరిస్థితులలో, హైపేషియా జ్ఞానం, హేతువు, మేధో సామర్థ్యం యొక్క శక్తిని ప్రదర్శించింది. సామాజిక అంచనాలకు అనుగుణంగా నడుచుకోడానికి నిరాకరించింది. బదులుగా తన స్వంత మార్గాన్ని స్వీకరించి, భవిష్యత్ తరాల మహిళా తత్వవేత్తలు, ఉద్యమకారుల కోసం ఒక దేదీప్యమానమైన మార్గాన్ని నిర్మించింది. హైపేషియా, మిలేటస్ కు చెందిన అస్పాసియా, మాంటినియా కు చెందిన డియోటిమా, చైనాకు చెందిన బాన్జావో, ఇండియా కు చెందిన గార్గి లాంటి కేవలం అతి కొద్దిమంది స్త్రీ తత్వవేత్తలకు మాత్రమే ఆ కాలం పరిమితం అవడానికి తీవ్రమైన పితృస్వామ్య అణిచివేత మాత్రమే కారణమని మనం అర్థం చేసుకోవచ్చు.
విషాదకరమైన ముగింపు:
హైపేషియా జీవితం క్రీ.శ. 415 లో విషాదకరంగా ముగిసింది. ఆమె క్రూరంగా హత్య చేయబడింది. ఈ హత్య ఆ సమయంలోని రాజకీయ, మతపరమైన ఘర్షణల కారణంగా జరిగింది. అలెగ్జాండ్రియాలో క్రైస్తవులు, క్రైస్తవేతరుల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో, ప్రముఖ అన్యమత తత్వవేత్తగా హైపేషియా ఒక లక్ష్యంగా మారింది. రాజకీయ అశాంతికి కారణమైందని, అన్య మతవాదాన్ని పెంచి పోషిస్తోందని, ఆమె ఒక మంత్రగత్తె అని తప్పు డు ఆరోపణలు చేశారు.
పీటర్ అనే క్రైస్తవ సన్యాసి నేతృత్వంలోని ఒక గుంపు హైపేషియాపై దాడి చేసింది. ఆమెని వివస్త్రను చేసి, వీధులగుండా ఈడ్చుకెళ్లి, శరీరం ఛిద్రం చేసి, దారుణంగా చంపారు. (బహుశా బహిరంగ ఉపన్యాసం ఇవ్వడానికి వెళుతున్నప్పుడో లేదా ఉపన్యాసం ఇచ్చి తిరిగి వస్తున్నప్పుడో ఆమె బంధించబడి ఉండవచ్చు). ఆమె హత్య మేధోపరమైన హింసకు,స్వేచ్ఛా ఆలోచనను అణచివేయడానికి చిహ్నంగా మిగిలిపోయింది. క్రిస్టియన్ మతోన్మాదుల చేతిలో ఆమె హత్య ఒక అసంబద్ధం ఎందుకంటే, హైపేషియా పేగన్ మతంలో జన్మించినప్పటికీ దానిని ఎప్పుడూ ప్రచారం చేయలేదు, ఆచరించనూ లేదు, పైగా ఆమె చాలా మంది క్రైస్తవ విద్యార్థులకు బోధించింది. నిజానికి ఆమె ప్రతిభాపాటవాలను గురించి ప్రపంచానికి జరిగిన పరిచయం ముఖ్యంగా ఆమె క్రైస్తవ విద్యార్థుల ద్వారానే జరిగింది.
5వ శతాబ్ధంలో హైపేషియాని నగ్నంగా ఈడ్చుకెళ్లి చంపడంలోనూ, 2023 లో మణిపూర్ లో ఇద్దరు కుకీ స్త్రీలను నగ్నంగా ఊరేగించి అత్యా చారం చేయడంలోనూ ఉన్న సామాన్యమైన విషయం ఏమిటంటే స్త్రీల శరీరాలను యుద్ధభూమిగా మార్చే పితృస్వామిక దురహంకారమే. వేల సంవత్సరాలనుండి స్త్రీలపై అప్రతిహతంగా సాగుతున్న పితృస్వామిక అణచివేతకు ఇలాంటి ఘటనలన్నీ ప్రతిరూపాలే. చిత్రం ఏమిటంటే, 5వ శతాబ్ధంలో దాడిచేసిన మతం, 21వ శతాబ్ధంలో మణిపూర్ లో దాడికి గురయ్యింది. క్రైస్తవ మతానికి సంబంధించి దాడి చేసిన, దాడికి గురైన పాత్రలు తారుమారైనా అప్పుడూ, ఇప్పుడూ స్త్రీల శరీరాలే యుద్ధ భూములు అయ్యాయి.
స్త్రీల శరీరాలను యుద్ధభూమిగా ఉపయోగించడం పితృస్వామ్య లక్షణం. పితృస్వామ్యానికి స్త్రీ శరీరం అధికార పోరాటాలకు, సామాజిక గతిశీలతలకు ప్రతీకాత్మ క యుద్ధభూమి. పితృస్వామ్యం మహిళల శరీరాలను తరచుగా శత్రు శిబిరంపై సంఘర్షణకి, నియంత్రణకి అలాగే వారిపై ఆధిపత్యాన్ని సాధించడానికి ఉపయోగిస్తుంది.
హైపేషియా జీవితం, రచనలు కాలాన్ని అధిగమించి, స్ఫూర్తిదాయకమైన మానవ మేధస్సు కు నిదర్శనంగా నిలుస్తాయి. పితృస్వామ్య అణచివేతను ఆమె ధిక్కరించడం, మేధో స్వేచ్ఛ పట్ల ఆమెకున్న తిరుగులేని నిబద్ధత , తత్వశాస్త్రానికి ఆమె చేసిన విశేషమైన దోహదం ఈనాటికీ మనల్ని ఉత్తేజ పరుస్తూనే ఉంది.హైపేషియా వారసత్వం మనకి ఒక ఆశాకిరణం; యథాతథ స్థితిని సవాలు చేయడానికి, అడ్డంకులను అధిగమించడానికి , మరింత సమగ్రమైన, జ్ఞానపూరితమైన సమాజం వైపు ఒక మార్గాన్ని రూపొందించడానికి అది మనందరినీ ప్రోత్సహిస్తుంది. ఆమె జీవిత విషాదకర ముగింపు మేధో స్వేచ్ఛ కోసం, భావ స్వేచ్ఛ కోసం సాగాల్సిన నిరంతర పోరాటాన్ని మనకు గుర్తు చేస్తుంది, మరీ ముఖ్యంగా భారత ఉపఖండంలో మేధస్సు పై ఫాసిస్ట్ దాడి జరుగుతున్న కాలంలో, దభోల్కర్, పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేష్ లాంటి మేధావులను హతమారుస్తున్న ఈ ప్రస్తుత సందర్భంలో అటువంటి నిరంతర పోరాటాల ప్రాముఖ్యతను మరింతగా తెలియజేస్తుంది.
“కల్పిత కథలను కల్పితాలు గా బోధించాలి. పురాణాలను పురాణాలుగా, అద్భుతాలను కవిత్వ కల్పనలు గా బోధించాలి. మూఢనమ్మకాలను సత్యాలుగా బోధించటం అత్యంత భయంకరమైన విషయం. పిల్లల మనస్సు వాటిని అంగీకరించి నమ్ముతుంది. గొప్ప బాధ , విషాదం పొందిన తర్వాత, తర్వాత కాలంలో దీని నుండి వారు ఉపశమనం పొందవచ్చు. తరచుగా మనుషులు చాలా త్వరగా మూఢనమ్మకం కోసం సజీవ సత్యం కోసం కంటే కూడా ఎక్కువగా పోరాడుతారు. మూఢనమ్మకం మూఢ నమ్మకం లా కనిపించదు కాబట్టి మీరు దానిని తిరస్కరించ లేరు, కానీ నిజం అనేది ఒక దృక్కోణం కాబట్టి అది మారగలదు.” – హైపేషియా
(నాలుగవ శతాబ్దంలో హైపేషియా ప్రసరించిన నాటి జ్ఞాన దీపికలు వేల సంవత్సరాల తర్వా త ఈ 21వ శతాబ్దంలో మరింతగా ప్రకాశించినప్పటికీ మన మూఢ పాలకుల అజ్ఞానమనే చీకటిని పారద్రోల లేకపోవడం ఒక విచిత్రం.)
హైపేషియా గురించిన మూలాధారాలు :
హైపేషియా గురించి మన జ్ఞానం ప్రధానంగా ఆమె సమకాలీనులచే వ్రాయబడిన చారిత్రక రచనల నుండి, తరువాతి తరాల రచనల నుండి వచ్చింది. ఈ రచనలలో కొంత పక్షపాతం లేదా కొన్ని అజెండాల ప్రభావం ఉండవచ్చు, అయినప్పటికీ ఇవి ఆమె జీవితం, వారసత్వంపై విలువైన అంతర్దృష్టులను అందిస్తాయి. హైపేషియా గురించి మన అవగాహనకు దోహదపడిన కొన్ని కీలక మూలాధారాలు ఈ క్రింది విధంగ ఉన్నా యి:
సోక్రటీస్ స్కొలాస్టికస్: 5వ శతాబ్దపు బైజాంటైన్ చరిత్రకారుడు- సోక్రటీస్ స్కొలాస్టికస్ “ఎక్లెసియాస్టికల్ హిస్టరీ”ని వ్రాశాడు, ఇందులో హైపేషియా జీవితం, మరణాల వృత్తాంతం కూడా ఉంది. సోక్రటీస్ స్కొలాస్టికస్ హైపేషియా తర్వాత జీవించినప్పటికీ, అతని ఈ రచన ఆమె గురించి ముఖ్య మైన సమాచారాన్ని అందిస్తుంది.
డమాస్కియస్: 5వ, 6వ శతాబ్దానికి చెందిన నియోప్లాటోనిస్ట్ తత్వ వేత్త డమాస్కియస్, హైపేషియా విద్యార్థి అయిన అలెగ్జాండ్రియాకు చెందిన తన గురువు ఇసిడోర్ జీవిత చరిత్రను రాశాడు. డమాస్కియస్ రచన ప్రధానంగా ఇసిడోర్ కి సంబంధించినదైనప్పటికీ, ఇందులో హైపేషియా బోధనలు , ప్రభావం గురించిన ప్రస్తావనలు కూడా ఉన్నాయి.
జాన్ ఆఫ్ నికియు: 7వ శతాబ్దపు కాప్టిక్ బిషప్, చరిత్రకారుడు అయిన జాన్ ఆఫ్ నికియు తన రచనలో హైపేషియా గురించి ప్రస్తావించాడు. అతనందించిన విషయం క్లుప్తంగా ఉన్నప్పటికీ, ఆమె కీర్తి , ఆమె మరణం చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి వివరాలు మనకు తెలియడానికి ఇది దోహదపడుతుంది.
క్రైస్తవ రచయితలు: అలెగ్జాండ్రియాకు చెందిన సిరిల్ వంటి కొంతమంది క్రైస్తవ రచయితలు తమ రచనలలో పరోక్షంగా హైపేషియా ని సూచిస్తారు. ఆమె గురించి వారి ప్రస్తావనలు తరచుగా విమర్శనాత్మ కంగా ఉంటాయి, ఆ సమయంలో క్రైస్తవ అధికారులను వ్యతిరేకించిన అన్యమత తత్వవేత్తగా ఆమె చిత్రీకరించబడింది.
తరువాత ఆధారాలు: కాలక్రమేణా హైపేషియా బలిదానం తత్వశాస్త్రానికి క్రైస్తవ మతానికి మధ్య ఘర్షణకు చిహ్నంగా మారింది. ఆమె కథ ఆకర్షణీయంగా మారింది. వివిధ రచయితలు , కవులకు ఆసక్తిని కలిగించింది. ఫలితంగా, సాహిత్యం, కవిత్వం, పరిశోధనలలో ఆమె ఇతివృత్తం అయింది. ఆమె జీవిత కథతో ఒక హాలీవుడ్ సినిమా కూడా నిర్మించారు ( Agora;2008)(తెలుగు సమాజానికి ఆమె గురించి పెద్దగా తెలియదనేది ఒక వాస్తవం).
ఆ రచనలు వ్రాసిన సందర్భం, వారి చిత్రణను ప్రభావితం చేసిన పక్షపాతాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ మూలాలను విమర్శనాత్మకంగా అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం.
References/Further Reading:
1.”Hypatia of Alexandria” by Maria Dzielska
2.”Hypatia: The Life and Legend of an Ancient Philosopher” by Edward J. Watts
3.”The Murder of Hypatia: The Life and Death of a Classical Scholar” by Jane DeRose Evans
4.”Hypatia: Mathematician, Philosopher, Myth” edited by Michael Deakin
5.”The Cambridge Companion to Hypatia” edited by Alison P. More and Helen P. Bruder
6.Wikipedia page on Hypatia https://en.wikipedia.org/wiki/Hypatia