ఇటీవల సిస్కో అనే అమెరికాలోని అతి పెద్ద నెట్వర్కింగ్ కంపెనీలో పని చేసే ఒక దళిత వ్యక్తి తన సహ ఉద్యోగులు తన పట్ల కులవివక్ష చూపుతున్నాడని ఫిర్యాదు చేస్తూ కాల్ఫోర్నియా ఫెడరల్ కోర్టుకు వెళ్లాడు. అతను ఎవరి మీదయితే కంప్లయింట్ చేశాడో, ఆ వ్యక్తుల తరఫున హిందూ అమెరికన్ ఫౌండేషన్ (ఆర్ ఎస్ ఎస్ కి అనుబంధం) ఈ కేసులో కలగచేసుకోవటానికి అనుమతి అడుగుతూ సదరు కోర్టుకు అర్జీ పెట్టుకున్నది. ఇక్కడ విషయం ఏమిటంటే ఫిర్యాదు చేసిన దళితుడు రోజూ గుడికి వెళ్లే హిందూ భక్తుడు. అతను ఎవరికి కుల వివక్ష ఉందని చెబుతున్నాడో ఆ బ్రాహ్మణుడు నాస్తికుడు. హిందూ అమెరికన్ ఫౌండేషన్ వాళ్లు నాస్తిక బ్రాహ్మణుడి తరుఫున కోర్టుకి వెళ్లారు. ఆ నాస్తిక బ్రాహ్మణుడు క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నా కూడా హిందూ అమెరికన్ ఫౌండేషన్ వాళ్లు అతని తరఫునే నిలబడి ఉండేవారు. కులానికి, హిందుత్వకూ ఉన్న విడదీయలేని బంధాన్ని అర్థం చేసుకోవటానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు.
భారతీయులలో ఉన్నది కులమే, మతం కాదు అని గట్టిగా చెప్పే ఉదంతం ఇది. మనువాదం ప్రతిపాదించిన నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో అట్టడుగున ఉన్న దళితులు వారికి తుచ్చులు. ఆ మెట్టు నుండి పైకి ఎదగాలనుకొన్న దళితులు వారికి ప్రధాన శత్రువులు. హిందుత్వ ఆవహించిన నేటి భారత ఆల్ట్రా నేషనల్ పార్టీకి ముస్లిములు ఇప్పుడు రాజకీయ శత్రువులు. మతం పేరుతో మనుషులను విడదీయటానికి, రాజకీయ పబ్బం గడుపుకోవటానికి వాళ్లు ఉపయోగపడుతున్నారు. ముస్లిం బూచిని తామే తయారు చేసి దేశ ప్రజలను విడగొతున్నారు. అదే సమయంలో భారత ముస్లిములలో ఎక్కువభాగం ఒకప్పటి హిందూ అట్టడుగు కులాల వారేనని మనం మర్చిపోకూడదు.
హిందుత్వ భావజాలాన్ని పూనిన వాళ్లు ఇప్పుడు భారతదేశ పాలకులుగా ఉన్నారు. హిందుత్వను నేటి భారత పాలక వర్గాలకు పర్యాయపదంగా వాడితే అన్వయ లోపం ఏమీ ఉండదనుకోవచ్చు.
హిందుత్వ శత్రువుల్లో దళితులు, క్రిస్టియన్లు, ముస్లిములు, సిక్కులు, నాగాలాండీయులు, కశ్మీరీలు, మణిపురీలు, స్త్రీలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రజా కవులు, కళాకారులు, కార్మికులు, కర్షకులు, నిజాయితీపరులైన జర్నలిస్టులు, లాయర్లు, నూతన విద్యావిధానం వద్దు అంటున్న విద్యార్థులు, టీచర్లు, ప్రొఫెసర్లు, చరిత్రకారులు -పోరాటాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ హిందుత్వకు శత్రువులే. మిత్రులు మాత్రం దానికి తక్కువే. అగ్ర కుల బడా పెట్టుబడిదారులైన అంబానీలు, అడానీలు, టాటాలు లాంటి పిడికెడు మంది -అనివార్యంగా హిందుత్వ మిత్రులు. మనల్ని పరిపాలిస్తుంది బీజేపీ పాలకులా, కార్పొరేట్ శక్తులా అన్నంతగా వారి స్నేహం వర్ధిల్లుతుంది. గతంలో కంటే వాళ్లిద్దరి మధ్య రేఖ చెదిరిపోయింది. హిందూ సామాన్య ప్రజలు వాళ్ల అమ్ములో బాణాలే కానీ వారికి మిత్రులు కాదు.
ఈ హిందూ సామ్రాజ్యాన్ని కాపాడుతున్న వ్యవస్థల్లో పోలీసు, జుడీషియల్, నిఘా, గూఢాచారి వ్యవస్థలు ప్రధానంగా వున్నాయి. రోగ్ పోలీసు అధికారులు ఉత్తర ప్రదేశ్, ఢిల్లీల్లో ఇటీవల కాలంలో కనిపిస్తున్నారు. సీఏయే, ఎన్ ఆర్ సీ వ్యతిరేక ఉద్యమాల కాలంలోనూ, జెఎన్ యూ విద్యార్థుల పోరాటంలోనూ, ఈ ఏడాది హనుమాన్ జయంతి ఊరేగింపుల్లోనూ -పోలీసు దళాల పాత్ర అతి క్రూరంగా ఉండింది. ఈశాన్య ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లోని నగరాల్లో అమాయకులైన పేద ముస్లిములమీద కాల్పులు జరిపారు. బీజేపీ అనుయాయులు స్వయంగా చేస్తున్న హింసను ఉపేక్షించి ప్రేక్షక పాత్ర వహించారు. కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, ఇటీవల కాలంలో నరసింఘానంద్ విద్వేష ప్రసంగాల మీద ఎలాంటి చర్యలను తీసుకోకుండా -ముస్లిముల మీద ఎఫ్ఫైయ్యార్ లు నమోదు అయ్యాయి. పోలీసులే స్వయంగా కాషాయి మూకలతో కలిసి ‘జై శ్రీరామ్’ అంటూ దాడులు చేసిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఒక దగ్గర గాయపడి రక్తపు మడుగులో ఉన్న ముస్లిములను వందేమాతరం పాడిస్తున్న పోలీసులు కూడా వీడియోల్లో కనబడ్డారు.
పోలీసుల తరువాత హిందుత్వను అమలు చేయటంలో కీలక పాత్ర వహించింది మీడియా. ప్రజాభిప్రాయాన్ని తయారు చేయగల సత్తా ఉన్న న్యూస్ మీడియా పూర్తిగా హిందుత్వమయమయ్యింది కాబట్టే గోడి మీడియా హిందుత్వాకు మిత్రుడయ్యింది. నిజాన్ని అబద్దంలాగా, అబద్దాన్ని నిజంలాగా మసి పూసి మారేడు కాయ చేయగలిగిన మీడియాను మించి వాళ్లకు స్నేహితుడు ఎవరు ఉంటారు? స్వయంగా సంఘీ స్వభావం ఉన్న వ్యక్తులు యాజమాన్యం వహిస్తున్న న్యూస్ ఛానల్స్ పుట్టకొక్కుల్లాగా పుట్టుకొచ్చాయి. సంఘీ భావజాలం కాసులు కురిపించగలిగిన ముడిసరకు అయ్యింది. పరస్పరాధారిత ప్రయోజనాలతో హిందుత్వ, మీడియా అంటకాగుతున్నాయి. ఎన్. రామ్ లాంటి సెక్యులర్ వ్యక్తుల సారధ్యంలో ఎన్నో ఏళ్లు నడిచిన ‘ద హిందూ’ పత్రిక కూడా తన రంగును క్రమంగా మార్చుకుంటోంది. బొంబాయ్ ఎయిర్ పోర్ట్ ఓనర్ అయిన ఆడానికి -అది కట్టటానికి తీసుకొన్న అనేక వేల కోట్ల అప్పుల రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి. వెంటనే వచ్చిన వార్త ఎన్డీటీవీలో ఆడాని షేర్లు కొనటం. హిందుత్వ రాజకీయాలను నిర్మొహమాటంగా విమర్శిస్తున్న ఒకే ఒక టీవీ ఛానల్ ఎన్డీటీవీ ఇప్పుడు ఆడానిల చేతిలోకి -అంటే హిందుత్వ శక్తుల చేతిలోకి పోబోతుంది. చాలామంది ఇష్టపడే రవీష్ కుమార్ కి ఇక అందులో స్థానం ఉండక పోవచ్చు. అత్యంత ప్రతిభావంతంగా ముద్ర వేయగలిగిన టీవీ మీడియా మనదేశంలో హిందుత్వాకు అమ్ముడు బోయి చాలాకాలం అయ్యింది. తెలుగు మీడియానే ఉదాహరణగా తీసుకొంటే -గత పది సంవత్సరాలుగా అందులో వచ్చిన మార్పులు స్పష్టంగా అర్థం అవుతున్నాయి. ప్రధాన స్రవంతి పత్రికలన్నీ దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైట్ వింగ్ న్యూస్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నాయి. పొద్దున్నే పేపర్ చదవకుండా బయటకు రాని ప్రజలు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్లందరిని హిందుత్వకు దగ్గర చేస్తుంది ఇప్పటి మీడియా. కారవాన్, ద వైర్, కౌంటర్ కరెంట్స్ లాంటి కొన్ని అతి కొద్ది ఆంగ్ల న్యూస్ మీడియాలు మాత్రమే ఇంకా ప్రజా ప్రయోజనాల నిబద్ధతతో పని చేస్తున్నాయి. హిందుత్వ ఐడియాలజీని సవాలు చేస్తూ పని చేసిన కశ్మీర్ వాలా లాంటి డిజిటల్ న్యూస్ పోర్టర్ల యజమానులను, రిపోర్టర్స్ నూ, వ్యాసకర్తలను కూడా జైల్లో పెట్టి -భారత మీడియాకు ఒక ఉదాహరణ చూపించింది మీడియా.
ప్రభావం వేయగలిగిన ఇంకో వ్యవస్థ అయిన జుడీషియల్ ఇస్తున్న తీర్పులు హిందుత్వ పాలనకు ఉపయోగపడుతున్నాయి. మాజీ సుప్రీం కోర్టు జడ్జిలు రంజన్ గొగోయి, బొబ్దే దగ్గర నుండి ఇటీవల వింత వింత తీర్పులు ఇస్తున్న హేమంత్ గుప్తా దాకా చేస్తున్న వెలువరిస్తున్న తీర్పులు -న్యాయస్థానాలు మనువాద బాట పట్టినవని చెప్పటానికి దృష్టాంతాలు. హిజాబ్ విషయంలో వాదాలు వింటూ హేమంత్ గుప్తా హిజాబ్ వేరూ టర్బన్ వేరూ అనీ, సిక్కుల సంస్కృతి భారతీయ సంస్కృతిలో కలిసిపోయిందనీ వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతి అంటే ఇక్కడ హిందూ సంస్కృతి అని అర్థం చేసుకోవాలి. 20 కోట్ల పైన జనాభాతో, దేశ జనాభాలో దాదాపు 15 శాతంగా ఉంటూ, ఐదు శతాబ్దాలుగా కలిసిమెలిసి జీవిస్తున్న ముస్లిముల వేష భాషలను పరాయి చేసేస్తున్న సందర్భంలో న్యాయస్థానాల నోటి నుండి ఇలాంటి తీర్పులు రావటం కాకతాళీయం కాదు. తన దగ్గర పని చేసే మహిళ మీద లైంగిక అడ్వాంటేజ్ తీసుకొన్న జస్టిస్ రంజన్ గగోయ్ -అందులో నుండి బయట పడటానికి 20 కోట్ల ముస్లిముల పౌరసత్వాన్ని తాకట్టు పెట్టాడు. జైల్లో పెట్టిన ప్రజావైద్యుడు డాక్టర్ కఫిల్ ఖాన్ తన జైలు గదిని మార్చమని అడిగితే జైళ్లు బెడ్ రూముల్లాగా ఉంటాయా అని ప్రశ్నించిన జడ్జిలు, సాయిబాబా చదువుకోవటానికి పుస్తకాలకు అనుమతి అడిగితే జైలు మాన్యువల్ చదవమని చెప్పిన జడ్జీలు -ప్రజా ఉద్యమకారుల పట్ల, మేధావుల పట్ల శత్రువులుగా ఉన్నారని వారికి వారే పదేపదే రుజువు చేసుకుంటున్నారు. మేఘాలయకు చెందిన పాత్రికీయ ముఖుమ్ అనే జర్నలిస్టును ఒక ఫేస్ బుక్ పోస్ట్ చేసినందుకు అరెస్టు చేసి క్రిమినల్ కేసు పెట్టారు. పాకిస్తాన్ క్రికెట్ గెలిచినందుకు చప్పట్లు కొట్టారని అరెస్టు అయి ఏళ్ల తరబడి జైళ్లల్లో ఉన్న వాళ్లున్నారు.
అర్బన్ నక్సలైట్లని బ్రాండ్ చేసిన వారితో సహా ఉమర్ ఖలీద్, మీరన్ హైదర్, షార్జీల్ ఇమామ్, గుల్ఫిషా ఫాతిమాలకు బెయిల్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. కశ్మీరీ జర్నలిస్టులు ఆసిఫ్ సుల్తాన్, ఫహాద్ షా, సాజీద్ గుల్, అబ్దుల్ ఆలా ఫజిల్ తో బాటు నిన్న మొన్న విడుదల అయిన తీస్తా శతల్వాడ్, జుబైర్ ఖాన్ మీద రాజ్యాంగ విరుద్ధంగా, కేవలం జర్నలిజం చేసినందుకు కేసులు పెడితే -న్యాయస్థానల స్పందన ఉదాసీనంగా ఉంది. 2010-20ల మధ్య 154మంది జర్నలిస్టులు అరెస్టు అయ్యారు. అందులో 40శాతం మంది 2020 లోనే అరెస్టు అయ్యారు. కశ్మీరీ జర్నలిస్టు గౌహర్ జిలానీ, ఫోటో జర్నలిస్టు మస్రత్ జహ్రా లాంటి వారి మీద ఊపా కేసులు ఉన్నాయి. వీళ్లకు బెయిల్లు, ముందస్తు బెయిల్లు రావటం చాలా కష్టంగా ఉంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించి మనం ప్రపంచంలో అట్టడుగు స్థానంలో ఉన్నాము. Bail, not Jail అన్న కృష్ణ అయ్యర్ మాటలను పై కేసుల్లో ఎక్కడా పట్టించుకోకుండా నిన్న మొన్న మహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ స్పోక్స్ పర్సన్ నూపుర్ శర్మకు ఆ మాటలను వర్తింపచేయటం యథాలాపంగా జరగలేదు. దళిత బాలుడి ప్రాణం తీసిన అగ్రవర్ణ టీచరు ఇంద్రన్ మేఘ్ వాల్ హంతకుడికి రెండోరోజే బెయిల్ వచ్చింది. ఇంకోపక్క సోహ్రాబుద్దీన్ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ షాకు శిక్ష వేయాల్సిన జస్టిస్ లోయ అనూహ్య పరిస్థితుల్లో మరణించారు.
హిందుత్వ ఎజండాను దూకుడుగా నిర్వహించటానికి కొత్త కొత్త సంస్థలు చురుగ్గా పని చేస్తున్నాయి. అందులో ఒకటి భారతీయ సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA). ఈ సంస్థ ఒకప్పుడు హిందూ టెర్రరిజాన్ని వెలికి తీసి సంస్థ ఇది. 2007-2008 మధ్య ఐదు రాష్ట్రాలలో అభినవ్ భారత్ నెట్వర్క్ పేరుతో 119 మందిని పొట్టన పెట్టుకున్న (అందులో ఎక్కువ మంది ముస్లిములు) ప్రజ్ఞ ఠాకూర్, ఆశీమానంద్ లాంటి వారి మీద నేర నిరూపణ చేసి జైలుకు పంపిన సంస్థ అది. ఈ రోజు అది హిందుత్వ జేబులో బొమ్మ అయ్యింది. అంతకు ముందే సిబిఐ చావ చచ్చి హిందుత్వ చిలక పలుకులు పలికింది. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టేట్ (ED) పేరుతో ఒక సంస్థ -ప్రతిపక్ష పార్టీల, వ్యక్తుల, కంపెనీల మీద దాడులు చేస్తూ వారి ఆర్థిక వనరుల మీద టెర్రరిస్టు ముద్ర వేస్తుంది. ప్రయోగ సంస్థలు, చరిత్ర పరిశోధన సంస్థలు, గణాంక విశ్లేషణ సంస్థలను కూడా వదలటం లేదు. హిందుత్వా అవసరాల కోసమే ఈ రెండు సంస్థలు నిబద్ధతతో పని చేస్తున్నాయని చెప్పటానికి సందేహించనవసరం లేదు.
బుల్డోజర్ల సంస్కృతికి పురుడు పోసిన ఘనత కూడా ఈ రాజకీయాలదే. మాట వినని, తమకు ప్రమాదం అనుకున్న వాళ్ల ఇళ్లను బుల్డోజర్లను పెట్టి కూల్చేసే పద్దతి ఇజ్రాయిల్ ఫార్ములా. ఆ ఫార్ములాను అచ్చంగా అనుసరించటమే కాదు. బుల్డోజర్లతో ప్రదర్శనలు చేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తమకు లొంగని వాళ్లకు పట్టబోయే గతిని సచిత్రంగా ప్రదర్శిస్తున్నారు.
ఇంటింతై వటుడింతై అన్నట్లు హిందుత్వ ఈ రోజు ప్రపంచం అంతా పాకుతోంది. నూతన ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చాక ఎక్కువగా, అంతకు ముందు కాస్త తక్కువగా భారతీయులు చాలామంది దేశవిదేశాలలో స్థిరపడ్డారు. హిందుత్వ విదేశాల్లో పాదుకోవటానికి గ్రౌండ్ వర్క్ చాలాకాలం క్రితమే జరిగింది. అమెరికాలోని కొంతమంది రాజకీయ నాయకులు అక్కడి హిందుత్వ గ్రూపులతో స్నేహం చేస్తున్నారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్లు చాలా సులభంగా ఆ భావజాల ప్రభావంలో పడ్డారు. హిందుత్వను విమర్శనాత్మకంగా చూస్తున్న విద్యావేత్తల మీద కూడా వాళ్లు దాడులు చేస్తున్నారు. ఇటీవల ‘Dismantling Global Hindutva’ అనే కాన్ఫరెన్స్ బోస్టన్ లో జరుగుతుండగా దాని మీద దాడి చేశారు. భారతదేశంలో జరుగుతున్న విషయాలనే వాళ్లు తమ తమ దేశాల్లో అనుకరిస్తున్నారు. 2020లో ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ లో 13మంది విద్యావేత్తలు రాజీనామా చేశారు. భారత హై కమిషన్ ఎక్కువగా జోక్యం చేసుకోవటం వలన మేధో ఆవరణ కుంచించుక పోవటం దానికి కారణమని వాళ్లు చెప్పారు.
సెప్టెంబర్ లో లండన్ దగ్గర ఉన్న చిన్న పట్టణం లైసిస్టర్ లో జై శ్రీరామ్ అంటూ ముఖానికి మాస్కులు ధరించిన కుర్రవాళ్లు ముస్లిముల వ్యాపారాల మీద దాడి చేశారు. భారతదేశంలో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాలు ఆస్ట్రేలియాలో సిక్కుల వ్యతిరేక దాడులను ప్రోద్బలించాయి. ఈ దాడులు హింసారూపం తీసుకోవటంతో ఆస్ట్రేలియా అధికారులు ఒక భారతీయ హిందువును ఇండియాకు పంపించివేశారు. బిల్కిస్ బానో నేరస్తులకు ఘనంగా ఆహ్వానం పలికినట్లుగా, అతగాడిని భారతదేశంలో ఆహ్వానించారు. న్యూజెర్సీలో కూడా ఇటీవల బుల్డోజోర్ ల ప్రదర్శన జరిగింది.
భారతీయ హిందూ అస్తిత్వాన్ని నిరూపించుకోవటానికి ముస్లిముల మీద దాడి చేయటమే మార్గంగా విదేశాల్లో భారతీయ మూలాలు ఉన్నవాళ్లకు కనిపిస్తోంది. భారతదేశంలో అఖండంగా వాళ్లకు కనిపిస్తున్న హిందూ నేషనలిజం తమను రక్షిస్తుందని అనుకుంటున్నారు. ఇస్లామిక్ ప్రమాదం నుండి రక్షణ పొందటానికి ఆంగ్లో సాక్సన్ క్రిస్టియన్ ప్రపంచం అని పిలవబడే వెస్ట్ కి హిందూ ఇండియా సహాయం కావాలనే సిద్ధాంతం ఒకటి నడుస్తోంది. భారతీయ సంస్కృతిని ప్రచారం చేస్తామనే పేరుతో విలసిల్లుతున్న అనేక సంస్థలు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులను బ్రైన్ వాష్ చేయటం వలన హిందుత్వ మంట ఆరకుండా మండుతూనే ఉంది. విదేశాల్లో కూడా నాట్యం, సంగీతం నేర్చుకోవటానికి వెళ్లే వీళ్ల పిల్లలకు వాటితో బాటు మతపరమైన బోధనలు కూడా జరుగుతాయి. అందులో ప్రధానంగా ముస్లిముల మీద ద్వేష ప్రచారం ఉంటుంది. నరేంద్ర మోడి ప్రధానమంత్రి అయ్యాక ఈ ధోరణి పెరిగింది. అంతర్జాతీయంగా ఫార్ రైట్ ప్రభుత్వాలు రావటం కూడా ఒక కారణం. అమెరికా, యుకె, కెనడాలలో నరేంద్ర మోడి మీటింగ్స్ ని పెద్ద పెద్ద స్టేడియంలలో నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ప్రతిష్ఠ తెచ్చి పెట్టే మెస్సయ్య లాగా నరేంద్ర మోడిని వాళ్లు చూస్తారు. విదేశాల్లో ఉండే ఇండియన్ మిషన్ -యోగులనూ, సాద్వీలను పిలిచి ప్రసంగాలు ఇప్పిస్తుంది.
మళ్లీ ఇండియాకు వస్తే భారత ప్రభుత్వం ఈ వారంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధించింది. ఆ సంస్థ నాయకులను 100 మందిని స్వల్పకాల వ్యత్యాసంతో అరెస్టు చేసింది. షాహిద్ బాగ్ ఉద్యమంలో, సిఎఎ వ్యతిరేక ఉద్యమంలో, హిజాబ్ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించి -హిందుత్వాను దూకుడుగా ఎదుర్కొంటున్న సంస్థ అది. ఆ సంస్థ కింద ముస్లిములు సమీకృతం అవుతున్నారు. వెన్ను చూపక పోరాటం చేస్తున్నారు. హిందుత్వ బండారాన్ని గల్లీ గల్లీకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. వాళ్ల మార్గం వాళ్లకు తెలుసు.
మత రాజకీయాలు తార్కికతకు లొంగవు. రాజ్యాంగానికి తలవంచవు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించవు. ప్రజాభిప్రాయాన్ని తులనాడుతాయి. ప్రజా ఉద్యమాలు మాత్రమే వాటిని ప్రతిఘటిస్తాయి. ఆ సత్తా వాటికే ఉంటుంది. అందుకే ఆ ప్రజా ఉద్యమాలు చేసే ముస్లిములు, ఆదివాసీలు, దళితులు కమ్యూనిష్టులు వాటికి శత్రువులు. హిందుత్వాకు లొంగుబాటు ప్రదర్శించని ఈ శక్తుల మీదనే ఇప్పుడు వాటి దృష్టి ఉంది. ఈ రోజు అది ముస్లిములను మొదటి టార్గెట్ గా పెట్టుకొని ఉండవచ్చు. కొంతమంది విప్లవకారులను జైళ్లలో పెట్టవచ్చు. అరుంధతీ రాయ్ అన్నట్లు మిగతా వారికి కూడా జైళ్లలో స్థానాలు రిజర్వ్ అయి ఉన్నాయి. కొద్దిగా వెనుకా ముందు అంతే.
భారతదేశంలో,మెల్లగా ప్రపంచ దేశాలకు చాప కింద నీరులా పాకుతున్న హిందుత్వ ను అర్థం చేయించే ప్రయత్నం ఇది.జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే ప్రజల కాళ్ల కింద నేల కదిలిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది.
అరుంధతీ రాయ్ అన్నట్టు హిందుత్వ ప్రమాదకర పడగనీడ ఇప్పటికే మన మధ్య ప్రగతిశీలుర మీద కి వచ్చేసింది.ఇప్పటికే సామాన్య ప్రజల ఆర్థిక పటిమను చూర్ణం చేస్తున్న నేటి ప్రభుత్వ విధానాలు..మనల్నీ సగం మింగేసాయన్న వాస్తవం గ్రహించేప్పటికి కాలం మించిపోవచ్చు.
ఏ దేశ మేగినా, ఎందు కాలిడినా
హిందూత్వ మాయలో పడే ఇంటర్నేషనల్
వెర్రి వెంగలాయిల సంఖ్య పెరుగుతోంది.
హిందుత్వ కి లొంగే విద్యాధికులే ఎక్కువ. హేతువు లేని ఆ చదువు కన్నా నిరక్షరాస్యులు జ్ఞానం మెరుగు. కొద్దో గొప్పో ప్రశ్న సజీవం గా వుంది
చాలా ఆలోచనాత్మక వ్యాసం. చదివించింది.
మేధో వాతావరణాన్ని పలుచన చేయడం,ఆర్థికం కేంద్రంగా వ్యక్తులను,సంస్థలను బలహీన పరచడం,బలోపేతం చేయడం ఇవ్వాళ హిందుత్వం చేస్తున్న హిట్లారిజం.
రాజ్యాధికారం పాలనరాంగాలను తమ అదుపులో పెట్టుకొని దేశ విదేశాలలో సాగిస్తున్న మూక దాడులు ప్రజల మస్తిష్కాలను మేల్కొలిపే వరకు మన ప్రయత్నం కొనసాగాలి.అదే అంతిమ పరిష్కారం.
ఏక పక్ష ఆలోచనా ధోరణి
A researched and Fact finding essay. I wonder to read all your essays and how hard work and efforts are behind making these reports. These facts are proving with documentary evidence that country is moving towards Uncivilisation. Bigger efforts are needed to stop it. Unity of all anti-communalist institutions and persons ( may be socialist thinkers with dialectic thoughts and communist sympathisers) coming with strong leadership can only stop this centripetal forces towards uncivilised axis.
One may belong to any caste or religion or country, one should follow every second honest, every second hardwork ,equality, unbias , help others ,do not harm any one . This is the way to keep world peace. Jai every second honest jai every second hardwork.
దేశీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న హిందుత్వ భావజాలవ్యాప్తికి చెందిన ప్రమాదకర, భయానక పార్శ్వాన్ని ఉదాహరణలతో సహా ప్రదర్శించిన వ్యాసం ఇది. చదువుతుంటే ఒళ్ళు
గగుర్పొడిచింది. సమస్య ఎంత తీవ్రమైనదో రమాసుందరి కళ్ళకు కట్టించారు. ఈ ప్రమాద తీవ్రతను అందరూ గుర్తించడం ఒక ఎత్తయితే, దానిని ఎదుర్కోవడం ఇంకొక ఎత్తు. ఆవిధంగా ఇది దీర్ఘకాలికమైన సవాలు అన్న సంగతిని ఈ వ్యాసం ఎరుక పరిచింది. ధన్యవాదాలు రమాసుందరి గారూ…
అమొఘమైన భారత న్యాయ్యవస్థ కూడా మతం రంగు పులుముకోడం దురదృష్టకరం…
కడుపులోంచి బయట పడ్డప్పటినుండి పాలిచ్చినట్లే, మత ఆచారాలు తాగిస్తున్నారు.15 సంవత్సరాలు దాటిన తరువాతకదా ఆలోచించేది, అప్పటికే నరనరానా వెక్కిన విషం ఎలాతగ్గుతుంది, గుడి నుండి,బడినుండి,కళాశాలల వరకు, rss జాడలు ఉంటూనే ఉంటాయి.
బయటికి లగాలంటే ఎంతో శ్రమ అవసరం, ఇంతకాలం చదువుకూడా వీల్లేదన్నారు, ఇప్పుడున్న చదువుకుడా అదే దారిలో.. ఎక్కడైనా నోరిప్పితే కేసులు జైళ్లు…
ప్రస్తుతం నెలకొంటున్న ఈ భయానక పరిస్థితులు మానవత్వానికి మాయని మచ్చ. అధికార దాహంతో వ్యవస్థల విలువలను దిగజార్చుతూ అమానవీయకృత్యాలను అద్భుత విజయాలుగా చిత్రించుకుంటూ లేత మెదళ్లను కలుషితం తున్న ఈ రాక్షస క్రీడ…. భావితరాలను అంధకారంలోకి నెట్టి వెయ్యడం తథ్యం. కావున దీనికి అడ్డుకట్ట వేయాలి. మహాత్మా గాంధీతో మొదలైన ఈ మారణ హోమం ఎంత మందిని బలి తీసుకుంటుందో…
కొన్ని ఏళ్ళ తరబడి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని పోలీసు ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చి పంపిస్తుంది. ఇప్పటికే దేశంలో 10 లక్షల మందికి పైగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పోలీసు ఉద్యోగులు చేస్తున్నట్టు సమాచారం. సమయం వచ్చినప్పుడు ముస్లింలు, దళితుల మీద దాడులు చేయడం వారికి పరిపాటు. అలాగే అనేక కీలకమైన ప్రభుత్వ శాఖల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తిష్ట వేసి ఉన్నారన్నది వాస్తవం.