హాలాహలం

ఔను
నేను వారించి వుండాల్సింది
నల్ల రేగడి మట్టి నాలుకకి అడ్డు పడ్డది
నేను కుండని

నేనైనా వారించి వుండాల్సింది
నాలోని నలకలు గొంతులో పడి
మాట పెగల్లేదు
నేను నీరు

దప్పికై నా ముందు తచ్చాడుతుంటే
నేనైనా వారించాల్సింది
నీ కుండ ఇది కాదని
నేను అగ్ర వర్ణ అధ్యాపక గదిని

అక్షరం నేర్పాల్సిన వాడు
నిచ్చెన మెట్ల మీద పైనున్నోడు
వాడి కోసం ఆ కుండ వుందని ఎరుగను
తడారి పోతున్న గొంతులో నీళ్ళు పోసుకున్నా
అవి గొంతులోకి దిగాయో లేవో
గూబ గుయ్యిమంది
చెవిలో సిర పగిలింది వాడి జేబులో కలం కింద పడి ఒలికిన సిరా సాక్షి గా

ఏం జరిగిందో తెలిసే లోపు కన్ను వాపు
రక్త స్రావం చెవి నుండి
దవాఖానా మంచంపై
చావుతో పోరాటంలో ఓడి పోయా
అనాదిగా నా జాతి ఓడిపోతూనే వుంది
బతుకులో చావులో
ఐనా జాతి మనుగడ నిరంతరం

నా జాతి చేయని నేరానికి శిక్షించబడుతుంటే
రాజ్యాంగ పుటలు టపటప కొట్టుకుంటూ
నిరసిస్తున్నాయి
అనాదిగా నా లాంటి సమిధలెన్నో

పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. విద్యార్థి దశలో ఎస్. ఎఫ్. ఐ. లో పని చేశారు. సామాజిక ఆర్థిక సమస్యలను కవితా వస్తువులు గా తీసుకుని  కవిత్వం రాస్తున్నారు.  వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

One thought on “హాలాహలం

Leave a Reply