హక్కుల సంఘాల్లోకి మామూలుగా మహిళా కార్యకర్తలు చాలా తక్కువగా వస్తారు. ఇటువంటి సంఘాల్లోకి వారిని తేవడానికి సంస్థ బాధ్యులు వాళ్ళను ప్రోత్సహించడం లేదని, కృషి చేయడం లేదని ఆరోపణ కూడా ఉంది. బాలగోపాల్ గారు కూడ ప్రతి మహాసభలో తన ప్రధానకార్యదర్శి నివేదికలో మహిళలను సంస్థలో చేర్పించడానికి ప్రయత్నాలు చేయడం లేదు అనేవారు. “మహిళా సమస్యలు చాలా కనబడుతుంటాయి, కాని మనం వరకట్న మరణాలపై కొంత పనిచేసి వదిలిపెట్టాం. మహిళా సమస్యలు మామూలు అంశాలుగా తీసుకుంటూ పురుషాధిక్య సమాజంలో ఇట్లానే ఉంటుందేమో అని అనుకుంటున్నాం. మహిళలు బాధ్యులుగా ఉన్న యూనిట్లలో స్త్రీల హక్కుల అంశాలపై కొంత పని జరుగుతుంది” అంటూ “మన ధోరణి మార్చుకోవాలి” అని కొంత కటువుగానే చెప్పేవాడు. ఈ విషయంలో అగస్టు నెలలో మరణించిన మానవహక్కుల వేదిక కడప కన్వీనర్ జయశ్రీ గారిని ఆయన ఉదాహరణగా చూపేవాడు.
కాకుమాని జయశ్రీ ప్రకాశించే భానుడిలా కిరణాలు ప్రసరించి అస్తమయం అయ్యింది. ఆమె బతికిఉన్నంత కాలం నిప్పుకణికలా మండింది. ముఠా తగాదాలతో, హింసతో అల్లకల్లోలంగా ఉండే రాయలసీమలో పెత్తందార్లను, రాజకీయనాయకులను, నిర్లక్షంగా వ్యవహరించే అధికారులను నిర్భీతితో ప్రశ్నించే గొంతుకైంది. ఆమె కుటుంబ నేపధ్యం, ఆమె కార్యక్రమాలు నిర్వహించిన ప్రాంతం గురించి ఆలోచిస్తే ఆమె ప్రదర్శించిన ధైర్యానికి, తెగువకు జేజేలు పలుకవలిసిందే. జయశ్రీ జీవితమంతా సాహసాలతో కూడుకుంది. ఒక సాధారణ వైశ్య కుటుంబంలో పదవ సంతానంగా జన్మించి, తాను ఇంటర్ చదువుతుండగా తన సీనియర్ అక్తాబ్ పాషా తో ఏర్పడ్డ స్నేహంతో ఆయనను జీవిత భాగస్వామిగా ఎంచుకొని సాంప్రదాయానికి భిన్నంగా కులాంతర, మతాంతర వివాహం చేసుకోవడం పెద్ద సాహసమే. పర్యవసానంగా కుటుంబ ఆదరణ కోల్పోయి జీవితంలో స్థిరపడటానికి చాలా కష్టపడవలసి వచ్చింది.
అక్తాబ్ ఇంట్లో కాపురం చేస్తున్న సమయంలోనే వారి ఇంటి ఎదురుగా నివసించే విరసం సభ్యుడు, కార్మిక నాయకుడు, వక్తగా పేరున్న యం. వి. రమణారెడ్డి తో పరిచయం అయ్యింది. బెంగుళూరులో న్యాయవాద విద్య పూర్తి చేసిన జయశ్రీ ఆయన సహాయంతో ఒక చిన్న ఉద్యోగంలో చేరి కొంత కాలం పని చేసింది. 1986లో వీరారెడ్డి అనే లాయర్ ఆఫీస్ లో జూనియర్ గా చేరి ప్రొద్దుటూర్ లో లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. తన సీనియర్ ఆఫీసుకు వచ్చే యం.వి.ఆర్ కు సంబంధించిన కార్మికుల, ఇతర కేసులు కోర్టులో వాదిస్తూ యం.వి.ఆర్ లాయర్ గా పేరుతెచ్చుకుంది. ఆ దశలో మంచివక్త, తెలివికలవాడు, రచయిత, కార్మికనాయకుడైన యం.వి.ఆర్ ఆమెకి పెద్ద హీరోలా అనిపిస్తే ఆయనే తన ఆదర్శం అనుకుంది. తన న్యాయవాద వృత్తిక్రమంలో పరిచయమైన ఆ ప్రాంతంలోని రాడికల్స్, నక్సలైట్ పార్టీ అప్పటికే నిర్వహిస్తున్న కార్యక్రమాలు గమనించిన జయశ్రీ యం.వీ.ఆర్ కూడా ఒక మూఠా నాయకుడని, ఆయన చేసే ఆందోళనలు కడప ఫాక్షన్ సంస్కృతిలో భాగం అనే విషయం అర్థమైంది.
రాడికల్స్ పై పోలీసులు అమలుపరిచే నిర్బంధాన్ని, అక్రమ అరెస్టులను రెండు మూడు పర్యాయాలు పోలీసుస్టేషన్ లకు ధైర్యంతో వెళ్ళి ప్రశ్నించిడంలో ఆమె తెగువను గమనించిన రాడికల్ కార్యకర్తలు ఆమెను ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (APCLC)లో చేరడానికి ప్రోత్సహించారు. ఆ విధంగా ఆమె 1988లో ఏ.పి.సి.ఎల్.సి లో సభ్యురాలుగా చేరింది. అప్పటినుంచి బాలగోపాల్ తో ఏర్పడ్డ పరిచయం సంఘం కార్యకర్తలతో సమస్యలు, ఆలోచనలు పంచుకునే ప్రక్రియలో హక్కుల సంఘాలల్లో నిలదొక్కుకుని కార్యకర్తగా ఎదగడానికి దోహదం చేసింది. యం.వి.రమణారెడ్దిని హీరో అనుకున్న ఆమెకు బాలగోపాల్ ఆలోచనా సరళి, పని విధానం, ఆయన ధృడమైన దీక్షను చూసిన తర్వత ఆయననే తన ఆదర్శ హక్కుల కార్యకర్తగా ఎంచుకుంది. ఎం.వి.ఆర్ ఫ్యాక్షన్ రాజకీయాలను ఎండకట్టడం, ఆయన చేపట్టే కార్యక్రమాలలో ముఠా తగాదాల అంశాలతో పాటు పోలీసులు చేస్తున్న అరాచకాలను చట్టవ్యతిరేక కార్యకలాపాలను పత్రికా ప్రకటనల ద్వారా ఖండించడం పనిగా పెట్టుకున్న జయశ్రీ ఎం.వి.ఆర్ ఆగ్రహానికి కూడా గురి అయ్యింది. కడప ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలను అర్థం చేసుకుని వాటిలో మామూలు జనం ఎట్లా ఇబ్బందులకు గురి అవుతున్నారో విశ్లేషిస్తూ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి దురాగతాలను కూడ ఎండగట్టడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే హక్కుల సంఘం బాధ్యురాలిగా ఫ్యాక్షన్ నాయకులు చేసే హింసపై నిజానిజాలు సేకరించి దానివల్ల సాధారణ ప్రజలకు ఏర్పడే ఇబ్బందులు వాళ్ళు హక్కులు కోల్పోయే వైనాన్ని ఒక పనిగా పెట్టుకుని కడప ప్రాంతంలో జరిగే అన్ని రకాల అన్యాయాలను, పోలీసులు చేసే అకృత్యాలను నిలదీసే గొంతుకగా ఎదిగింది.
కడప జిల్లాలో ముఠాపెత్తందారుల సంస్కృతి చాలా కాలం నుండి వారసత్వంగా కొనసాగుతూవస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా 1990 సంవత్సరంలో వై.ఎస్.రాజారెడ్డి (వై.ఎస్.ఆర్ తండ్రి) పులివెందుల ప్రాంతంలో రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా ఎరుకుల వాళ్ల గుడిసెలు తగులబెట్టిచ్చాడు. ఎరుకుల వాళ్ళపై దొంగలు అనే ఆరోపణ ఉంది కాబట్టి తాను చేసిన పని ఒక “మంచి” పనిగా ప్రదర్శించేందుకు వాళ్ళ గుడిసెలు తగులబెట్టించాడు. కాంగ్రెస్ నాయకులు, టి.డి.పి నాయకులు ఇదే ఎరుకల వాళ్ళతో దొంగతనాలు చేయించి దొంగ బంగారం అమ్మించి లబ్దిపొందుతుంటారని తెలుసుకున్న జయశ్రీ ఎ.పి.సి.ఎల్.సి బృందంతో పులివెందులకు నిజనిర్ధారణకు వెళ్ళినప్పుడు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వాళ్ళను ఇంటికి పిలిపించుకుని మాట్లాడాడట. జరిగిన సంఘటనపై వై.ఎస్.ఆర్ అసత్యాలు చెపుతుండటంతో జయశ్రీ ఆయనను ఖండిస్తూ వాదనకు దిగిందట. తరువాత చాలా కృషి చేసి బాలగోపాల్ ను రప్పించి ఎరుకల వాళ్ళపై జరిగిన అన్యాయమైన దాడి సంఘటనపై వై.ఎస్. ఇంటి ఎదురుగానే ఎ.పి.సి.ఎల్.సి బహిరంగ సమావేశం నిర్వహించడమే కాకుండా ఎరుకల వాళ్ళతో ధర్నా కూడ చేయించగలిగిందట. ఈ సంఘటన పెద్ద సంచలనం కలిగించడంతో జిల్లా కలెక్టర్ పై ఒత్తిడి వచ్చి ఎరుకల వాళ్ళకు పక్కాగృహాలు నిర్మించి ఇచ్చారట. ఈ సంఘటన జయశ్రీకి చాలా మనోధైర్యం ఇచ్చింది.
ఈ సంచలనాత్మక సంఘటనతో మొదులుకొని ఆమె పలు సందర్భాలలో ఫ్యాక్షన్ నాయకుల ఆగడాలను బహిర్గతం చేసి ప్రశ్నించడం ఒక ముఖ్యమైన కార్యక్రమంగా చివరివరకు కొనసాగించింది. ముఠాసంస్కృతి వల్ల సామాన్య జనం హక్కులు ఎట్లా హరించబడుతున్నాయి, వాళ్ళు ఎంత అభద్రతతో జీవిస్తున్నారు, ఫ్యాక్షన్ నాయకుల దగ్గర మెరిసినరీస్ గా పనిచేసే బోయ, ఎరుకల కులస్తులు ఎట్లా ప్రాణాలు వదులుతున్నారు అనే అంశాలను విశ్లేషిస్తూ ఎ.పి.సి.ఎల్.సి అనంతపూర్, కడప, కర్నూల్ జిల్లాలలో బాలగోపాల్ నేతృత్వంలో పర్యటించి మూడు పుస్తకాలు ప్రచురించింది. ఈ జిల్లాలలో పాలెగాండ్ల రాజకీయాల పట్ల బాగా అవగాహన ఏర్పరుచుకున్న జయశ్రీ తోడ్పాటు ఈ అధ్యయనానికి ఎంతో తోడ్పడింది.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి, ఆరోగ్యం సరిగాలేకున్నా హక్కుల అంశాలపై ఆమె కార్యక్రమాలు కొనసాగించింది. “ఉదయం” పత్రిక మూసివేయడం వల్ల భర్త అక్తాబ్ ఆదాయం పూర్తిగా లేని సందర్భంలో ఇంగ్లాండ్ లో స్థిరపడ్డ అక్క డాక్టర్ విజయశ్రీ తో బాటు ఇతర అక్కలు కూడ ఆమె కుటుంబానికి సహాయసహకారాలు అందించారు. మూఠా రాజకీయాల్లో నాయకుల బాగోతాలు బయటపెడుతుండటం వల్ల ఆమెకు కోర్టు కేసులు రాకుండా పోయినాయి. జయశ్రీ ధైర్యాన్ని, చొరవను గమనించి 1991లో ప్రొద్దుటూరులో లారీ కార్మికులు, సినిమా కార్మికులు ఆమెను గౌరవ అధ్యక్షురాలిగా పెట్టుకున్నారు. మూడు సంవత్సరాలు కార్మిక నాయకురాలిగా చాలా కృషి చేసి డ్రైవర్, క్లీనర్ కార్మికులకు జీవితభీమా పథకాన్ని వర్తింపచేయించి వాళ్ళ సంక్షేమం కోసం క్రియాశీలకంగా పనిచేసింది. ఆ క్రమంలోనే యం.వి.రమణారెడ్డి అసలు స్వరూపం, రాయలసీమ ప్రాంతంలో అప్పటి విప్లవ పార్టీలో జరుగుతున్న అనూహ్య పరిణామాలు గమనించి అవాక్కు అయ్యింది. ఆమెను అపఖ్యాతి పాలు చేయడానికి ఎం.వి.ఆర్ చేసిన ప్రయత్నాలను ఎదుర్కొంటూ కొంత కాలం బాధలు అనుభవించింది. కేబుల్ ఆపరేటర్స్ సంఘానికి సలహాదారుగా పనిచేసింది. సారా, మద్యం, వ్యాపారం నిర్వహించే శాసనసభ్యులు, రాజకీయ నాయకులు చేస్తున్న ఆగడాలను కప్పిపుచ్చుతూ అమాయక పేదలపై యస్.పి ఉమేశ్ చంద్ర దుందుడుకు చర్యలను ఎ.పి.సి.ఎల్.సి ద్వారా బహిర్గతం చేయగలిగింది. బాలగోపాల్, సంధ్య, చంద్రశేఖర్ రెడ్డి ల సారధ్యంలో ఏర్పడ్డ “రాయలసీమ ప్రజాసమితి,” తర్వాత ఏర్పడ్డ “రాయలసీమ మూఠా వ్యతిరేక పోరాట కమిటీ” లలో క్రియాశీలకంగా పనిచేసింది. నక్సలైట్ పార్టీల రాజకీయ కీచులాటల్లో ఈ కమిటీలు నిర్వీర్యం కావడంతో బాలగోపాల్ తో సహా జయశ్రీ కూడ తీవ్ర మనోవేదనకు గురైంది.
1998 లో ఆం. ప్ర. పౌరహక్కుల సంఘంలో హక్కుల అవగాహన అంశాలపై జరిగిన చర్చకు పర్యవసానంగా ఏర్పడ్డ మానవహక్కుల వేదికలో చేరింది. అప్పుడు ఆ సంస్థనుండి బయటకు వచ్చిన ముప్పైమూడు మంది సభ్యుల్లో జయశ్రీ ఒకరు. మానవ హక్కుల వేదిక ఏర్పడ్డ తర్వాత సంస్థ అవగాహన ప్రణాళికను క్షేత్రస్థాయిలో ప్రయోగానికి పెట్టి చూపెట్టిన వారిలో జయశ్రీని ఒకరుగా మేము గర్వంగా చెప్పుకుంటాం. జిల్లా కన్వీనర్ గా ఆమె చేపట్టని అంశం లేనేలేదు.
పులివెందులలో యురేనియం కోసం తవ్వకాలు ప్రారంభం అయినప్పటినుండీ దాన్ని వ్యతిరేకిస్తూ దాని దుష్ప్రభావాలను బహిర్గతపరుస్తూ విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. మా సంస్థ నగర అధ్యక్షుడు, ప్రముఖ పర్యావరణవేత్త డా. బాబూరావు సహకారంతో సమావేశాలు నిర్వహించింది. ఆయనతో కరపత్రాలు రాయించి పంచింది. ఈ సందర్భంలో జరిగిన పబ్లిక్ హియరింగ్ లో బాబూరావు గారితో కలిసి వాదనలు వినిపించింది. ప్రముఖ యురేనియం వ్యతిరేక ఉద్యమకారుడు ఉదయ కుమార్, పర్యావరణవేత్త సాగర్ ధారా లను ఆ ప్రాంతానికి రప్పించి యురేనియం ప్రభావాలపై పెద్ద కాంపేయిన్ నిర్వహించింది. ఎప్పటికప్పుడు మైనింగ్ వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న పరిణామాలు కాలుష్య నియంత్రణ మండలి దృష్టికి తెచ్చి ఈ సమస్యపై కలిసివచ్చిన ప్రతిఒక్కరి సహకారం తీసుకుంటూ కాలుష్య సమస్యలు అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీ వేసేవరకు ఆందోళన చేయించింది.
గండిపేట రిజర్వాయర్ బ్యాక్ వాటర్ వల్ల నీటిలో మునిగిన ఎనిమిది గ్రామాల ప్రజల విషయంలో పెద్ద పోరాటం చేసింది. అవార్డు ప్రకటించినా కూడా నష్టపరిహారం అందని ఆ గ్రామ ప్రజల వెంట వాళ్ళు న్యాయమైన నష్టపరిహారం పొందేవరకు నడిచింది. అధికారులపై, రాజకీయ నాయకులపై, ఆ గ్రామ ప్రజల స్థితిగతులను పట్టించుకోమని వత్తిడి తెచ్చింది. నష్టపరిహారం పొందిన విషయంలో జయశ్రీ చేసిన కృషిని జీవితాంతం మరువలేమని ఆమె మరణం తర్వాత గ్రామస్తులు దుఃఖిస్తూ టీవీ చానెళ్లలో మాట్లాడారు.
మహిళల సమస్యలపై జయశ్రీ ఒక్కతే దాదాపుగా పెద్ద నిర్మాణం ఉన్న మహిళాసంఘం కన్నా ఎక్కువ పని చేసిందంటే అతిశయోక్తి కాదేమో! చాలా స్త్రీల సమస్యలను మనం పురుషాధిక్య సమాజంలో ఇవి మామూలే అనే ధోరణితో వ్యవహరిస్తాం. కానీ జయశ్రీ చేపట్టిన స్త్రీల అంశాల వివరాలు మంచిర్యాల మహాసభల జెనరల్ బాడీకి సమర్పించిన నివేదికలో వివరించినప్పుడు మేమంతా అవాక్కు అయిపోయాం. వరకట్నపు హత్యలు, కానుకల కోసం వేధింపులు, మద్యంకు అలవాటై భార్యలను సతాయించడం, ప్రేమ పేరుతో దగా పడ్డ స్త్రీలు, భర్త అక్రమ సంబంధం వల్ల నరకాన్ని అనుభవించే స్త్రీలు, బాలికలపై విద్యాసంస్థల్లో లైంగిక అకృత్యాలు, పనిచేసే ప్రదేశాల్లో మహిళా ఉద్యోగులపై అధికారుల వేధింపులు, భర్త మరణించిన తరవాత భార్యలకు రావలసిన ఆస్తి, జీవనోపాధి అంశాలు… ఇట్లా ఎన్ని విషయాలు పట్టించుకుందో జాబితాగా రాయడం కష్టం. ఎవరైనా బాధితురాలి నుంచి ఒక ఫోన్ కాల్ లేక మెసేజ్ చాలు, జయశ్రీ అక్కడ వాలేది. ఇంకా ఆమె చాలా వైవిధ్యమైన అంశాలపై పనిచేసింది. ప్రజారోగ్య వ్యవస్థ, ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భూసేకరణ, అభివృద్ధి పేరుతో జరుగుతున్న పలు విధ్వంసాలు, కాలుష్యం సమస్యలు, పర్యావరణ భద్రత కోసం చెట్లను రక్షించుకోవడం లాంటి అన్నీ అంశాలు ఆమె తన ఎజెండా లో చేర్చుకుని పనిచేసింది.
ఆం. ప్ర. మైనింగ్ డెవలప్మెంట్ కార్మికుల ఉద్యోగ భద్రత విషయంలో చాలా కృషి చేసింది. వాళ్ళ కార్మిక సంఘానికి అధ్యక్షురాలిగా ఉన్న జయశ్రీ అన్యాయంగా తొలగించబడ్డ 276 మంది ఆదివాసీ కార్మికులకు నియామకం ఇచ్చే విషయంలో కోర్టులతో సహా అన్ని సంస్థల ద్వారాలను తట్టింది. వాళ్ళ సమస్యని జాతీయ ఎస్ సీ, ఎస్ టీ కమీషన్ దృష్టి కి తేవడానికి కార్మిక నాయకులతో ఢిల్లీ కి ప్రాయాణమైన జయశ్రీ హైదరాబాదులో విమానం ఎక్కడానికి పన్నెండు గంటల ముందు తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూసింది.
బాలగోపాల్ సార్ రిజర్వ్డ్ గా ఉంటాడని సీరియస్ గా ఉంటాడని చాలా మంది కార్యకర్తలు ఆయనతో మాట్లాడటానికి జంకేవారు. జయశ్రీ మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా ఆయనను సంభాషణ లోకి లాగేది. ఆయనపై జోకులు కూడా వేసేది. ఆయన ఎంత సీరియస్ గా అనిపించినా ఆయనలో ఉన్న హ్యూమర్ కొందరు సన్నిహితులకు మాత్రమే తెలుసు. మేము ఏ.పి.సీ.ఎల్.సీ లో ఉన్న రోజుల్లో ఒకసారి కార్యవర్గ సమావేశంలో నేను జయశ్రీ పక్కన కూర్చున్నాను. అప్పుడు ఆమె కడప లారీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షురాలు. బాలగోపాల్ నావైపు చూస్తూ, “జీవన్ జాగ్రత్త! జయశ్రీ బ్యాగులో బాంబులుంటాయి.” అని నవ్వుతూ అన్నాడు. వెంటనే జయశ్రీ, “అయినా జీవన్ వరంగల్ వాడు కదా, వాళ్ళ గ్రేనేడ్ లు మా కడప బాంబుల కంటే బాగా పేలుతాయి. మా బాంబులు అప్పుడప్పుడూ తుస్సుమంటాయి.” అని ఠక్కున సమాధానం చెప్పింది.
గండికోట గ్రామాల రిజర్వాయర్ నీళ్ళు గ్రామాలకు వచ్చినప్పుడు ఆ గ్రామాల ప్రజలు నీళ్ళలో నిలబడి దీక్ష చేస్తుంటే జయశ్రీ ని వెళ్లనివ్వకుండా ఆమెని హౌజ్ అరెస్ట్ చేశారు. ఆమె ఇంటి వెనక కాంపౌండ్ గోడ దూకి పోయి దీక్షలో నిలబడింది. నాకు ఫోన్ చేసి, “జీవన్! పోలీసులు హాయిగా మా ఇంటికి కాపలా కాస్తున్నారు. నేను తప్పించుకుని దీక్ష దగ్గరకు వచ్చాను. ఫోటో పెట్టాను. వాట్సాప్ లో చూస్కో” అని గలగలా నవ్వింది. ఆమె నవ్వుకు ఒక ప్రత్యేకత ఉంది. స్వచ్ఛంగా గలగలా నవ్వేది.
ఏదయినా విషయం జయశ్రీ దృష్టికి వస్తే ఏదో మాటర్ ఆఫ్ ఫాక్ట్ గా కాకుండా దాని పరిష్కారానికి చాలా శ్రమ పడేది. అన్ని దారుల్ని వెతికేది. ఎప్పుడయినా ఆమె ఫోన్ చేస్తే భయం వేసేది. ఏ విషయం చెప్తుందో, మనతో ఆ పని అవుతుందో లేదో అనే భయం. ఒకసారి ఎవరో రాయచోటి కి చెందిన యువకుడు ఒకమ్మాయితో ప్రేమ పేరుతో సంబంధం పెట్టుకొని ఆమెకు గర్భం వచ్చిందని తెలుసుకొని తప్పించుకొని పారిపోయి హైదరాబాదు వచ్చాడు. జయశ్రీ రాయచోటికి వెళ్ళి ఆ అమ్మాయితో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేయించింది. రెండు మూడు సార్లు పోలీసులతో ఫోన్ లో కేసు గురించి మాట్లాడింది. హైద్రాబాదులో ఆ అబ్బాయి అడ్రెస్ దొరకడం లేదని అనాసక్తిగా పోలీసులు సమాధానం ఇచ్చారు. జయశ్రీ నాకు ఫోను చేసి “జీవన్! మీ రామంతాపూర్ పక్కనే అంబర్పేట ఉంటుందంట గదా! ఒక అడ్రెస్ కనుక్కోవాలి” అని వివరాలు చెప్పింది. ఆమె పంపింది పాత ఇంటి నంబర్. నేను వెళ్ళి విచారిస్తే దొరకలేదు. ఫోన్ చేసి సంగతి చెప్పాను. “అట్లా ఎట్లా? ఎట్లాగయినా తెలుసుకోవాలి” అంది. నేను అంబర్పేట పోస్టాఫీసు కి వెళ్ళి పోస్ట్ మ్యాన్ సహాయంతో కరెక్టు అడ్రెసు తెలుసుకొని పంపాను. అంటే జయశ్రీ నాతో పోలీసు శాఖ వాళ్ళు చేసే విచారణ లాంటిది చేయించిందన్నట్టు.
ఇంకొక పర్యాయం పులివెందుల దగ్గర నెలకొల్పిన ట్రిపుల్ ఐటీ కాలేజీ విద్యార్థులకు ఫీజుల విషయంలో ఏదో సమస్య వచ్చింది. ఈమె వెళ్ళి ప్రిన్సిపల్ ను కలిసి మాట్లాడింది. సంతృప్తి చెందలేదు. ఆ కాలేజీ కార్యనిర్వాహక బోర్డులో చుక్కా రామయ్య గారు ఉన్నట్టు తెలుసుకుని నాకు ఫోన్ చేసి రామయ్య సార్ తో చర్చించి సమస్య పరిష్కారానికి ప్రయత్నించు అంది. నేను సారుతో ఆ విషయం ఫోన్ లో సంప్రదిస్తే ఆయనేదో సమాధానం చెప్పాడు. జయశ్రీ కి ఆయన చెప్పిన విషయం చెప్పాను. మళ్ళీ అదే అసంతృప్తి. “ఏదయినా చేయు” అని తను ఒక సూచన చేసి రామయ్య గారిని కలిసి ఆ సూచనను ఆయనతో ప్రిన్సిపల్ కు చెప్పించగలవా అంది. నేను సార్ ఇంటికి వెళ్ళి జయశ్రీ కి ఫోన్ చేసి సారుతో మాట్లాడించవలసి వచ్చింది. ఇట్లా ఉండేవి ఆమె ప్రయత్నాలు. మనం కొంచెం అనాసక్తి ప్రదర్శిస్తే హైదరాబాదు రాజధానిలో ఉంటావు, ఇంత సీనియర్ కార్యకర్తవు, ఈ పని చేయలేవా అంటుందేమో అనే భయం.
బాలగోపాల్ మరణం తరువాత వసంతలక్ష్మి గారిని, కృష్ణను, సుధను, కోర్టుల్లో కేసుల విషయంలో వసుధా నాగరాజ్ గార్లను, ఇదే విధంగా పర్స్యూ చేసేదని వసంతలక్ష్మి నాతో అన్నారు. ఆమె ఢిల్లీ కి బయలుదేరే ఒకరోజు ముందు ఢిల్లీలో సుప్రీం కోర్టు ప్రముఖ లాయర్ కోలిన్ గాంజాల్వెస్ కు ఒక మెసేజ్ పెట్టిందట. “నేను హెచ్.ఆర్.ఎఫ్ కార్యకర్తను. జీవన్ కుమార్ స్నేహితురాలిని. రేపు ఢిల్లీకి వస్తున్నాను. కార్మికులకు సంబంధించిన ఒక సమస్య మీతో మాట్లాడాలి. నాకు సమయం ఇవ్వండి.” అని మెసేజ్. జయశ్రీ మరణం తర్వాత ఆయనకు ఫోన్ చేస్తే ఆయన నాకీ విషయం చెప్పాడు.
జయశ్రీ కి స్థానిక పత్రికా విలేఖరులతో, టీవీ ఛానెళ్ల రిపోర్టర్ల తో స్నేహపూరిత సంబంధాలు ఉండేవి. వాళ్ళు ముఠా రాజకీయ ఒత్తుళ్లలో పని చేస్తుంటారు కాబట్టి పత్రికల్లో మనం చెప్పే అంశాలు ఒక్క లైన్ లో వచ్చినా చాలు అని చెప్పేది. ఆమె జీవిత భాగస్వామి అక్తాబ్, కుమారుడు అనోష్ ఆమెకు చివరి వరకూ సహకారం అందించారు. “నేను బయట తిరిగి వస్తే ఎంతో బాధ్యతతో అక్తాబ్ కూరలు, అన్నం వండి తయారుగా పెడ్తాడు.” అని నవ్వుతూ ఆయనను అభినందించేది.
జయశ్రీ మరణించిన రోజు ఇంగ్లండ్ లో డాక్టర్ గా స్థిరపడ్డ ఆమె అక్కయ్య విజయశ్రీ గారు నాకు ఫోన్ లో జయశ్రీ ఆరోగ్య పరిస్థితుల గురించి చాలా విషయాలు చెప్పారు. ఆమెది చాలా ఫ్రెజైల్ ఆరోగ్య పరిస్థితి అని చిన్నప్పుడే గుండెకు రంధ్రం ఉన్న విషయం నిర్ధారణ అయిందని, చాలా సార్లు ట్రీట్మెంట్ జరిగిందని చెబుతూ అసలు ఇంతకాలం జీవనం కొనసాగించడమే డాక్టర్ గా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అని అంది. “ఆమెలో ఉన్న పట్టుదల, బాలగోపాల్, వసంతలక్ష్మి, సుధా, కృష్ణ, మీ అందరితో ఉన్న హక్కుల అనుబంధం, కార్యక్రమాల్లో లీనం కావడం వల్ల జీవితాన్ని బాగానే లాక్కొచ్చింది,” అని చెప్పింది. “ఆమె ఆరోగ్య పరిస్థితి అర్థం అయి ఢిల్లీ ప్రయాణం మానుకో అని సలహా ఇచ్చాను. ఆమెది చాలా మొండి మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఒత్తిడి చేయలేకపోయాను” అంది డా. విజయశ్రీ గారు.
జయశ్రీ హక్కుల స్ఫూర్తి, ఆమె జ్ఞాపకాలు ఎప్పుడూ మా వెంట ఉంటాయి. మా తరంతో సహా మా తర్వాత తరం కార్యకర్తలు జయశ్రీ నడిచిన బాటలో నడుస్తుంటాం. హక్కుల జయశ్రీ కి మానవ హక్కుల సెల్యూట్!
1988-89 సంవత్సరాల్లో ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ లో చదువుతున్నాను. అప్పుడు మా మండల్ వుద్యమానికి మద్దతు ఇచ్చేదానికి వచ్చేది. అప్పుడే ఆమెను చూడడం. “ఆమె అగ్రకుల వైశ్య స్త్రీ అయినా మనకు మద్దతు ఇస్తోంది చూడండి” అని మేము మరింత గొప్పగా ఆమె గురించి గుసగుసలు పోయేవాళ్లం.
మళ్ళీ దాదాపు పాతికేళ్ళ తర్వాత ఫేస్బుక్ ద్వారా పరిచయం. ఈసారి వెళ్ళినపుడు ఆమెను తప్పక కలవాలి అనుకునేవాన్ని. మొన్న వేసవిలోనే మా వూరికి వెళ్ళి మా తోటలో మామిడి పళ్ళు కొనుక్కుని తీసుకెళ్ళింది అని తమ్ముడు చెప్పాడు. నాకు మాత్రం అమెను మళ్ళి కలిసే భాగ్యం లేకనేపోయే!