సీనియర్ జర్నలిస్టు, ఆత్మీయులు ఆలూరు రాఘవ శర్మ ముప్ఫై ఏళ్ళుగా ప్రశ్నించే గొంతులతో చేసిన ఇంటర్వ్యూల అపూర్వమైన పుస్తకం ఇది. మాట్లాడడమే నేరమైన సామ్రాజ్యవాద, దళారీ బ్రాహ్మణీయ ఫ్యూడల్ ఫ్యాసిజం అమలవుతున్న కాలంలో, మనుషుల్ని ఫలానా తేదీలోగా చంపేస్తామని, ఎన్నుకున్న ప్రజలముందు కార్పొరేట్లకు హామీపడుతున్న రోజుల్లో, ప్రశ్నించే గొంతులతో మూడు దశాబ్దాలుగా సంభాషిస్తూ, 1995 నుంచి 2025 దాకా, ఇంకా ఇట్లా ప్రశ్నిస్తున్న వారినే ప్రశ్నించి వారి నిర్మొహమాటమైన విప్లవ ప్రజాస్వామిక, ధిక్కార, విభిన్న స్వరాలను ప్రజలలోకి వెళ్ళాలని అనుకోవడానికి రెండు సందర్భాలు ఉన్నవి. ఒకటి తక్షణ సందర్భం, ఆయన స్వస్థలమైన తిరుపతిలో ఎపిసిఎల్సీ చరిత్రలోనే మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం 53వ రాష్ట్ర మహాసభలు జరుపుకుంటున్నది (2026 జనవరి 10,11తేదీల్లో). అక్కడి ఆ సభలు తిరుపతి జిల్లా ఎపిసిఎల్సీ కమిటీ సీనియర్ సభ్యులు, రెండు తెలుగు రాష్ట్రాల సిఎల్సీల సమన్వయ కర్త క్రాంతి చైతన్య ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆహ్వాన సంఘం అధ్యక్షులు రాఘవ శర్మ గారు కావడం యా దృ చ్చికం కాకపోవచ్చు.
ఎన్టీయార్ రెండవ సారి ముఖ్యమంత్రి అయ్యాక, సిపిఐఎంఎల్ (పీపుల్స్ వార్)పై 1992లో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని షరతులతో తొలగించినప్పుడు, ‘వర్తమానం’ అనే తెలుగు దినపత్రికకు రాఘవ శర్మగారు చేసిన తొమ్మిదిమంది ప్రముఖుల ఇంటర్వ్యూలను చిరుగుల నుంచి తీసి, మనను ఆ కాలంలోకి తీసుకుని పోయి, ఇవాల్టి సంక్షోభ కాలంలో ప్రశ్నించే జీవలక్షణాన్ని ఒక పత్రికా రచయితగా ఆయన ఇప్పటి పత్రికా రచయితలకు, బుద్ది జీవులకు గుర్తు చేయదలుచుకున్నారు. గోదీ మీడియా కాలంలో ఇది ఎంత గొంతెమ్మ గోరిక.
విప్లవ అవసరమైనా, విప్లవోద్యమ వత్తిడి (ప్రజలు ప్రతిహింస, వత్తిడి విప్లవానికి మంత్రసాని లాంటిది. ఫోర్స్ ఈజ్ ది మిడ్ వైఫ్ ఫర్ రెవల్యూషన్-మార్క్స్) అయినా, ఎటువంటిదంటే, చంద్రబాబు తన ప్రసంగాల్లో తాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నని చెపుతాడు. ఎన్టీఆర్ ను వైస్రాయ్ హోటల్ లో కుట్రపన్ని కూలదోసి, 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కేవలం పీపుల్స్ వార్ పై నిషేధం పెట్టినవాడు మాత్రమే కాలేదు. ప్రజల ఆకాంక్షల వల్ల ప్రజాస్వామ్య వాదులు, ప్రజాస్వామిక పత్రికలు, అందరినీ సమన్వయపరిచిన ఎపిసిఎల్సీ, పౌర ప్రజాస్వామిక వేదిక ప్రయత్నాలు, కృషివల్ల పీపుల్స్ వార్ పైన నిషేధం ఎత్తివేయకుండానే చర్చలకు సంసిద్ధం కావలసిన అవసరం ఏర్పడవలసిన పరిస్థితి ఏర్పడింది.
రెండవ విశ్వజనీన అంశం ప్రపంచంలోనూ దేశంలోనూ ఫ్యాసిస్టు టెర్రరిస్టు రాజ్యాలు ప్రజల ప్రజాస్వామిక స్వేచ్ఛాకాంక్షలను ఆక్రమణ యుద్ధాలకు నెట్టిన కాలంలో, ఇక పాలకులు ఆఖరి ఆక్రమణ యుద్ధానికి కగార్ కు మూడు నెలల కాలం కూడా మిగలలేదు.
బహుశా మనదేశ చరిత్రలోనే మొట్టమొదటి సారి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ దేశ మూల వాసులను, మూలవాసులను మావోయిస్టులనే నెపంతో వేల సంవత్సరాల చరిత్ర నుంచి తుడిచివేస్తానని ప్రతిజ్ఞ చేసింది. ఇది సాధ్యమేనా? హిడ్మా తల్లిని అడగండి. ఆమె కోసం కదిలివచ్చిన ఆమె వంటి తల్లులను, పిల్లలను అడగండి. హిడ్మాకు ముందు తరువాత ప్రత్యామ్నాయ ప్రజారాజ్య స్థాపనకు ఏ అర్థవంతమైన శాంతికోసం ప్రజాయుద్ధంలో ప్రాణాలర్పించిన బస్వరాజ్ మొదలు ఉడికి గణేష్( సాక హనుమంతు) అమరత్వాన్ని అడగండి. అందుకే ఈ సంపుటిలో ముప్ఫై ఏళ్ళ క్రితం నిషేధం గురించిన ఇంటర్యూలు మాత్రమే కాదు, రెండవ స్థానం 2004 చర్చలకు సంబంధించిన సాధికార గొంతుల ఇంటర్వ్యూలు ఉన్నాయి.
నిషేధం, శాంతి చర్చలు రెండు పరస్పర విరుద్ధాంశాల సంఘర్షణ పర్యవసాన పరిష్కారాలుగా ప్రజాస్వామిక వాదులకు కనిపించవచ్చు గానీ, విప్లవోద్యమానికి అదొక మజిలీ. దానిని మొత్తంగా ప్రపంచీకరణ కాలం నుండి ఈ నాటివరకు రాజకీయార్థిక దృష్టితో చూసిన కాకతీయ యూనివర్సీటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్ జ్యోతిరాణి ఇంటర్వ్యూ ఉంది. తన బాల్యం నుంచి ఎనిమిది దశాబ్దాల ప్రపంచ, దేశ, తెలుగు నేల గమనాన్ని చూసిన కాకరాల ఇంటర్వ్యూ ఉంది. మహిళానుభవంనుంచి మార్క్సిస్టు దృక్పథం దాకా ఎదిగి, ఏ మతగ్రంథమైనా విష వృక్షమే అని తేల్చిచెప్పిన రంగనాయకమ్మ. ఒక్క చోట మనకింత సమాచారమే కాదు, మనకింత వివేకవంత విరణనివ్వడం, మన ప్రాపంచిక దృక్పథాన్ని మెరుగుపెట్టుకోగల ఇంటర్వూలు లభించడం ఎంత అరుదైన అవకాశం. కొండను అద్దంలో చూపే కృషి. ముఖ్యంగా నాకు నిషేధ కాలంలోనూ, చర్చల కాలంలోనూ ప్రత్యక్షప్రమేయం ఉన్నందున రాఘవ గారు నన్ను దీనికి ముందు మాట రాయమని అడిగి ఉంటారు. అట్లా వర్గపోరాట దృష్టితో మనిషి అయినవాడు వస్తుగత (ఆబ్జెక్టివ్) దృష్టితో చెప్పగలడా?
1983లో మొదటి సారి తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ నర్సంపేట, ములుగు, ఏటూరు నాగారం ఏజెన్సీ ఏరియాలో తిరిగినప్పుడు నక్సలైట్లే దేశ భక్తులు, నక్సలైట్లకు జోహార్లు, నక్సలైట్లు మేము చేతులు కలిపితే ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరేస్తాం అన్నది ఎంత నిజమో, టాడా ప్రయోగం, ప్రజాస్వామ్యవాదులను, ముఖ్యంగా ఎపిసిల్సీ నాయకుడు గోపిరాజన్నను ఆర్ ఎస్ ఎస్ శక్తులు హత్య చేసిన దానికి తొలి ఉదాహరణ 1985 జనవరి 12. ఇంకా డాక్టర్ రామనాథం, జాపా లక్ష్మారెడ్డిలను ఆయన ప్రభుత్వంలోని మఫ్టీపోలీసు అధికారులే చంపేశారు. మిస్సింగ్ కేసులు గోపగాని బాలయ్య, రాజమ్మలు, వెంకటేశ్వర్లు(ప్రకాష్) మొదలు 75మంది ఆయన హయాంలోనే. గ్రేహౌండ్స్ గా ప్రకటించుకున్న రక్తం రుచిమరిగి మనుష్య రక్త వేటలో బయల్దేరిన కె.ఎస్.వ్యాస్ రక్షక భటుల ఆచరణ ఆయన కాలంలోనే మొదలైంది. రామలింగారెడ్డి వంటి జర్నలిస్టును, బాలగోపాల్, ఎస్.ఏ రవూఫ్ లను మీసా కింద కుట్రకేసుల్లో నిర్బంధించింది ఆయన కాలమే. రాంనగర్ కుట్రకేసు పెట్టింది ఆయన కాలమే.
ఇంక మామిడాల హరిభూషణ్ తో ప్రారంభమై ఆయన కాలంలో జరిగిన ఎన్కౌంటర్ల చరిత్ర దేనికదే గ్రంథమవుతుంది. కనుక ఆయన మొదటి పాలన 1995 దాకా చరిత్రకారులందరూ ఆట-మాట-పాట బందయిన కాలంగా గుర్తించారు. బాలగోపాల్ ఎకనమికల్ అండ్ పొలిటికల్ వీక్లీలో గానీ, తెలుగులో రాసిన ప్రతి రచన అందుకు తిరుగులేని ప్రత్యక్ష వ్యాఖ్య. ఇది ప్రజల్ని, ప్రజాస్వామ్యవాదులను, విప్లవాభిమానులను నిశ్శబ్దంలోకి నెట్టిందా? నిరాశలోకి తోసిందా? కాదన్నదే గద్దర్ అజ్ఞాత జీవితం నుంచి బయటికి రావడం మొదలు వరంగల్ పద్నాలుగు లక్షల మంది హాజరైన కూలీ సంఘం మహాసభలు. మళ్ళీ 1990 నుంచి నిర్బంధం. కాంగ్రెస్ పాలనలో నిర్బంధం రాజ్యహింస-నేదురుమల్లి నుంచి విజయభాస్కర్ రెడ్డి దాకా. ఈ నేపథ్యం నుంచి రెండో సారి ముఖ్యమంత్రి అయ్యాడు, 1994 డిసెంబర్ లో ఎన్టీఆర్ సారా నిషేధం, రెండు రూపాయలకు కిలోబియ్యం, సబ్సిడీలు, పీపుల్స్ వార్ పై నిషేధం ఎత్తివేత వాగ్దానాలతో మిగతా విషయాలన్నీ అలా ఉంచుదాం. పీపుల్స్ వార్ పై నిషేధం ఎత్తివేస్తానన్నాడు కదా, అందుకు పార్టీ గడ్డివేళ్ళ స్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మిస్తుంది. (నక్సలైట్ ఖైదీల విడుదల కోసం జైళ్ళలో ఉన్న పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావు, మొడెం బాలకృష్ణల నాయకత్వంలో లోపల నుంచి, అంధ విద్యార్థి పవన్, జె.ఎస్. సాయిబాబాల నాయకత్వంలో బయట నుంచి జరిపిన ప్రజాపోరాటం ఒక ఉదాహరణ) ‘‘మీరిద్దరు మొత్తం మంత్రివర్గాన్ని రాజ్యాంగేతర అధికారంలో ఉన్న లక్ష్మీ పార్వతితో కూడా కలిసి పీపుల్స్ వార్ అంటే ఏమిటో వివరించండి. ఇది ఎట్లా ప్రజల ఆకాంక్షల స్వరమో కూడా చెప్పండి. దీనిపై నిషేధం ఎత్తివేయడం ఒక న్యాయమైన ప్రజా డిమాండని చెప్పండి’’ అని అనాడు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు శ్యాం (నల్లా ఆదిరెడ్డి) ఆ వివరాలన్నీ చెప్పడానికిది స్థలం కాదు గానీ, మొదటి సారి ప్రభుత్వంలో మంత్రి ప్రణయ భాస్కర్, ఈ ప్రభుత్వంలో మంత్రి కడియం శ్రీహరిలను వెంటబెట్టుకుని మేము స్పీకర్ రామచంద్రరావును, రెవెన్యూ మంత్రి దేవేంద్ర గౌడును, హోం మంత్రి మాధవ రెడ్డిని కలిశాం. ఆర్థిక మంత్రి చంద్రబాబు నాయుడును, లక్ష్మీ పార్వతిని కూడా కలిశాం. దేశంలో భూస్వామ్యం ఎక్కడుందని అడిగాడు మాధవరెడ్డి. ఇప్పటికీ ఫ్యూడల్ అణచివేతను నేను కూడా అనుభవిస్తున్నానన్నాడు దేవేందర్ గౌడ్. తన హెరిటేజ్ పాల డెయిరీ కేంద్రానికి బాలగోపాల్ ను వెంటబెట్టుకుని రమ్మని కోరాడు చంద్రబాబు. ఆ ఒక్క కోరిక తీర్చలేకపోయాం. ఇక అన్ని పత్రికల సంపాదకులను కలిశాం. అందరూ ఎంతో సుముఖత ప్రదర్శించారు. మద్దతు ప్రకటించారు. దక్కన్ క్రానికల్ ఎడిటర్ జయంతి పీపుల్స్ వార్ హింస, వసూళ్ళు తప్ప ఏదీ గుర్తించడానికి నిరాకరించింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్-నేను గద్దర్ ఆయన చేంబర్ ముందు ఆఫీసు బయటనే నిరీక్షిస్తుంటే తెలిసి బయటికి వచ్చి మమ్మల్ని చూసి-పీపుల్స్ వార్ లాబీయింగ్ చేయడం ఎప్పటి నుంచి మొదలు పెట్టింది అని నా మొహాన అడిగి, గద్దర్ను మాత్రం లోపలికి సాదరంగా పిలుచుకుపోయాడు.
ఈ మొదటి దశ తర్వాత ఇక ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నే పదిమంది ప్రజాస్వామ్యవాదులయిన ప్రముఖులతో పాటు కలవాలని ఆ బాధ్యతను కె.జి.కన్నాభిరాన్ గారు తీసుకున్నారు. వారిలో గద్దర్ తో ఇంటర్వ్యూ ఇందులో ఉంది. 1993లోనే ‘అన్నావంచ్చిండు రామన్నా వచ్చిండు’ పాటతో మొదలు పెట్టి-ఆయన పాలకవర్గ వంచనాపూర్వక రాజకీయ వ్యక్తిత్వం గురించి పాట రూపంలో చెప్పిన అభిప్రాయాలు దీనిలో ఉన్నాయి. పీపుల్స్ వార్ వ్యవస్థాపకులు కె.ఎస్. చెప్పిన ఎన్టీ ఆర్ డ్రామా కూడా ఇందులో ఉంది. ఇందులో నేను చెప్పదలించిందల్లా-పార్టీ- ఈస్టిండియా కంపెనీ కాలం నుంచి ఇప్పటి కార్పొరేటీకరణ కాలం దాకా నిర్వహించిన భారతీయ సామాజిక వ్యవస్థలో, రాజ్యాంగంలో భాగమైన బ్రాహ్మణీయ దళారీ బ్యూరోక్రటిక్ నియంతృత్వం గురించి మాత్రమే. 1951లో చౌఎన్ లై తటస్థదేశాల బాండుగ్ సమావేశం మొదలు భారత చైనా భాయి భాయీ పంచశీల సూత్రాల దాకా నెహ్రూతో ఉన్న పరిచయాలను, సంబంధాలను టిపికల్ బ్రాహ్మనికల్ , బ్యూరోక్రటిక్ పర్సనాలిటీ అన్న నిర్వచనం నుంచి ఇప్పటి బ్రాహ్మణీయ దళారీ ఫ్యాసిజం దాకా ఎట్లా వ్యవహరిస్తోందనడానికి ముఖ్యమంత్రి కార్యదర్శి ఐ.ఎ.ఎస్. జయప్రకాష్ నారాయణ్ ఎన్టీఆర్ కు చెవిలో చెప్పిన బహిరంగమైన షరతులు-అవి ప్రకటన తడి ఆరకముందే సిటీకి కూతవేటు దూరంలోని నల్గొండ జిల్లాలో నలుగురిని నక్సలైట్ల పేరుతో కాల్చివేసిన ఉదంతంతో ముగిశాయి. ఈ తొమ్మిది మందిలో ఎం.టి.ఖాన్ అప్పుడు ఎపిసిఎల్సీ అధ్యక్షుడు కనుక. ఆ పరిధి, పరిమితులకు కట్టుబడి నిషేధాన్ని పాక్షికంగానే షరతుల మీద మాత్రమే తొలగించడం సరికాదన్నారు. కె.ఎస్, ఎస్.ఎం, జ్వాలా ముఖి మొదలు సిపియం నాయకుల వరకు, న్యూడెమొక్రసి డి.వి.కె కూడా 95లో పీపుల్స్ వార్ తో అనుకూల సంబంధాలు ఉన్న వాళ్ళు కాదు. ఆగ్రహం కక్ష మొదలగు వ్యతిరేకత కూడా ఉన్న వాళ్ళు అయినా, సిపియం కొరటాల వరకు ఆ మేరకు నిషేధం ఎత్తివేసేందుకు అనుకూలమైనా, షరతులతో ఎత్తివేయడాన్ని విమర్శించారు. అదికూడా ఆచరణలోకి రాకపోవడం తప్పుపట్టారు.
అయితే, ఇక్కడ ఇవ్వాల్టి పరిస్థితులతో పోల్చుకుందాం. నిషేధం గురించి ఎన్నికలైపోగానే విరసం ఒక్కటే మావోయిస్టు పార్టీతోపాటు నిషేధించిన ప్రజాసంఘాలపై నిషేధాన్ని ఎత్తివేయాలనే డిమాండును ముందుకు తెచ్చింది. నిషేధం ఎత్తివేయడమే కాకుండా, మొదటి దఫా శాంతి చర్చలు కూడా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ-ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వంలో ఉండి ఆ ఊసే ఎత్తలేదు. ఆ డిమాండుకు స్పందించలేదు. పెద్ద ఆపద వచ్చి, చిన్న ప్రమాదం, ఆపద మరచిపోయినట్లుగా, శాంతి చర్చల డిమాండు ముందుకు వచ్చి ఛత్తీస్ గడ్ లో, కేంద్రంలో కూడా అదే డిమాండు బలంగా ముందుకు వచ్చి, పౌర ప్రజాసమాజం బీజేపీయేతర పార్టీలన్నీ ఈ నాటికీ తమతమ స్థాయిల్లో ముందుకు తెస్తున్న, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలైట్లది శాంతి భద్రతల సమస్య కాదంటూనే, పోలీసులు సాయుధ లొంగుబాట్లకు ప్రలోభాలుచూపుతూ మావోయిస్టుల విషయంలో కేంద్రం విధానమే మా విధానమంటున్నారు. 2026 మార్చి 31 తరువాత కూడా మావోయిస్టు పార్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరే తెలంగాణా ప్రభుత్వానిది అంటున్నారు. డి.జి.పి. శివధర్ రెడ్డి ప్రకటనను, ముఖ్యమంత్రి అవుననలేదు, కాదన లేదు. మౌనం ఒక్కొక్క సారి అర్ధంగీకారమే కాదు, ఆచరణలో అంగీకారం అవుతుందనేది ఆరంభంలోని లొంగుబాట్లు ఇప్పటి లొంగు బాట్లు సందర్భంలో వివక్షను మనం గమనించవచ్చు.
1990 ఫిబ్రవరి 18న గద్దర్ అజ్ఞాత జీవితం నుంచి బైటికి వస్తాడని ప్రకటించినప్పుడు, విజయవాడ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి, డిజిపి హెచ్.జె.దొర విమానం దిగినప్పుడు ‘‘మరి గద్దర్ మీద కేసులు ఎత్తివేస్తారా’’ అని విలేఖరులు ముఖ్యమంత్రిని అడిగారు. కేసులెందుకు ఎత్తివేస్తాం అని డిజిపి చొరవతీసుకుని చెప్పాడు. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి-అది పోలీసుల వైఖరి, రాజకీయ వైఖరి అట్లా ఉండదు. అది ఎట్లా ఉంటుందో ఆయన పాలనను జగిత్యాల, సిరిసిల్లాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించినప్పుడు మొదటిసారి చూశాం. తానే తిరిగి అవిమాత్రమే కాదు శ్రీకాకుళ పోరాటం నుంచి ఇప్పటిదాకా అమలవుతున్న కోటి మంది ప్రజలు నివసించే తెలుగు ప్రాంతమంతా చూసాం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చూసాం. అంతిమ సారాంశంలో పాలకవర్గ ప్రభుత్వాల పాలసి-కర్ర-కందం(లాఠీ-క్యారెట్) నుంచి ఈడెన్ ఆఫ్ మార్చ్ 31 గానే ఉంటుంది.
కాకరాలను చేసినట్లే హరగోపాల్ గారిని చేసిన ముఖ్యమైన రెండుభాగాల ఇంటర్వ్యూ కూడా ఇందులో ఉంది. అందులో ఆయన నుంచి అర్ధశతాబ్దపు పౌరహక్కుల పోరు గురించి, తెలంగాణాలో రాజ్యపు పౌరహక్కుల ఉల్లంఘన గురించి ఉన్నప్పటికీ హరగోపాల్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు శాంతి చర్చల ప్రస్తావన రాకుండా ఉండదు కదా! అందులో పౌర ప్రజాస్వామిక శక్తులు, సంఘాలు, వ్యక్తులు అందరూ చేసినదానికన్నా ఎపిసిఎల్సీ, సిసిసి చేసిన కృషి ‘పీపుల్స్ వార్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్యన చర్చలు జరగడమనేది ఒక ప్రయోగం. బహుశా ప్రపంచ చరిత్రలోనే చాలా అరుదైన ఒక ప్రయోగం.’ ఇది చెప్పడానికి అందులో ప్రభుత్వంతో, విప్లవ పార్టీ నాయకత్వంతో ప్రత్యక్షంగా మాట్లాడిన వారిలో అందులో సిసిలో గాని, ఎపిసిఎల్సీలో గాని ఆయనొక్కరే మిగిలి ఉన్నారు. చర్చల్లో పార్టీ ఎన్నుకున్న మధ్యవర్తుల్లో ఒకరు ఎపిసిఎల్సీ అధ్యక్షులు శేషయ్యగారు కూడా అమరులయ్యారు. తెలుగు దేశం చంద్రబాబు పాలనలో పార్టీ ప్రతినిధిగా పాల్గొన్న వానిగా నేను, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పాలనలో కళ్యాణరావుగారు మాత్రమే మిగిలి ఉన్నాం. తక్కువకు తక్కువ ప్రాణ నష్టం జరగడానికి భవిష్యత్తులో సమాజం నించి వత్తిడి వచ్చినప్పుడు చర్చలు జరగవచ్చు. తక్కువ హింసతో సమాజం ముందుకు పోవచ్చు అని హరగోపాల్ ఆశించారు గానీ, శాంతి చర్చల ప్రతిపాదనకు 1 జనవరి 2025న పసిపాప మంగ్లీని తల్లి ఒడిలో ఎన్ కౌంటర్ చేసిన బ్రాహ్మణీయ ఫ్యాసిస్టు సామ్రాజ్యవాద దళారీ సూరజ్ కుండ్ వ్యూహమైన కగార్ అంతిమ యుద్ధాన్నే ఎంచుకున్నాడు. బహుశా ఈ సారి సమాజం అంత వత్తిడి పెట్టలేదు. ‘వార్’తో చర్చలు కొనసాగాలని త్రిపురనేని మధుసూదనరావు గారు కూడా ఆశించారు. తన అవగాహన, పరిశీలన, సూచనలతోపాటు పీపుల్స్ వార్ చర్చల్లో ప్రాధమ్యాలు ఏముండాలని నిర్దిష్టంగా చపుతూ ‘‘ నిష్పక్షపాతంగా ఎవరు పరిశీలించినా ఈ చర్చల్లో ప్రభుత్వం కంటే పీపుల్స్ వార్ మాత్రమే చిత్తశుద్ధితో ప్రవర్తించగలదని అర్థమవుతుంది. ఇప్పటికైనా ఈ చర్చలు కొనసాగించడానికి ప్రజాస్వామిక వాదులంతా ప్రభుత్వంపై వత్తిడి తేవాలి’’ అన్నాడు(2002 ఆగస్టు 11) అంటే, ఇది చర్చల ప్రతినిధుల స్థాయిలోనే ఆగిపోయిన కాలం. తెలుగు దేశం ప్రభుత్వంతో చర్చలు జరిపిన కాలం.
రెండవ సారి చర్చలు ప్రారంభమయ్యే తరుణంలోనే ఆయన అమరుడయ్యారు. చర్చల ప్రతినిధులైన గద్దర్, కళ్యాణరావు, నేను చిన ఆరుట్ల నల్లమల అడవిలో రెండు విప్లవ పార్టీల నాయకత్వంతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఆర్.కె. నోటినుంచే విన్నాం. ‘‘కామ్రెడ్ టి.యం.ఎస్. అమరుడయ్యాడు. మీరు వెంటనే వెళ్ళి విరసం, జెఎన్ఎం జెండాలే కాదు, మావోయిస్టు పార్టీ జెండా కూడ కప్పి మీ సంస్థల తరపున మాత్రమే కాదు, పార్టీ శాంతి చర్చల ప్రతినిధులుగా కూడా నా తరపున జోహార్లు చెప్పండి’’ అని శ్రీశైలం నుంచి తిరుపతి పంపించారు. తిరుపతి మావో అని జ్వాలాముఖి పరిచయం చేసిన టి.యం.ఎస్. మావోయిస్టు సిద్ధాంతకర్తగా, విరసం సాహిత్య సాంస్కృతిక రంగాల్లో చేస్తున్నది కూడా వర్గపోరాటమేనన్నాడు. కగార్ యుద్ధనేపథ్యంలో రాజ్యం దాడి అంతర్గత సాయుధ విద్రోహంగా కూడా ముందుకు వచ్చినపుడు ఇదే జనవరి 2026లో విరసం మహాసభలు ‘సాహిత్యంలో వర్గపోరాటం’ చర్చనీయాంశంగా ఎన్నుకోవడం యాదృచ్చికం కాదు.
వకుళాభరణంతో రాఘవ శర్మ చేసిన ఇంటర్వ్యూ నాకు వకుళాభరణం రాఘవశర్మను ఇంటర్వ్యూ చేసినట్లుగా అనిపించింది. ఇటువంటి ఇంటర్వ్యూనే జర్నలిజంలో ‘స్కూప్’ అంటారని నన్ను పత్రికారచనకు ప్రవేశ పెట్టిన జనధర్మ ఎంఎస్ ఆచారి గారు 1972లో చెప్పారు. అందుకే నేడు రాజకీయాలు పెరిగి సామాజిక అంశాలను వెనక్కి నెట్టాయన్నది ఇంటర్వ్యూ శీర్షిక కూడా అయింది. చరిత్ర అధ్యాపకుడిగా, జెఎన్ యూ పరిశోధక విద్యార్థిగా, అందులో మా కావలిపై అరుణతార కెవిఆర్ నుంచి చెంచయ్య గారు కళ్యాణరావు గార్లతో సహచర్యం ఉన్న వకుళాభరణం సామాజిక అంశాలను పట్టించుకోవడానికి రాజకీయాలు ఇవాల్టి సంక్షోభ సమాజంలో సంఘర్షిస్తున్నాయని చెప్పేవారు. చరిత్ర, సైన్స్, వర్గపోరాటం అంటే ప్రజలు నిర్మించే చరిత్రగమనంలోనే పురోగమిస్తాయి.
ఆ విషయంలో చెంచయ్యగారి ప్రశ్నలు నాకు అభిప్రాయాలను ప్రశ్నల ద్వారా ప్రవోక్ చేసేలా రాఘవ శర్మ సంధించినవి. హిందుత్వ శక్తులు ఒక్క తెలుగు సమాజానికి మాత్రమే కాదు, భారత సమాజానికంతా ఎదురవుతున్నాయి. దీనికి కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకం కావాలి. అది జరగదు. నిజాయితీగా పనిచేసే కమ్యూనిస్టు పార్టీ బలపడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చాలా కమ్యూనిస్టు పార్టీలు ప్రజాఉద్యమాలను నిర్వహించే ఓపిక కోల్పోయాయి. ఆదివాసీల సహకారంతో ఖనిజ సంపదను కాపాడుతున్న, దండకారణ్యంలో పనిచేస్తున్న కమ్యూనిస్టు పార్టీయే ఈ సమస్యను పరిష్కరించగలదు అని నిర్మొహమాటంగా చెప్పాడు.
ఏ మత గ్రంథమైనా విషవృక్షమేనన్నది రంగనాయకమ్మ. అయితే అది రామాయణ విషవృక్షం అని అది వచ్చిన కాలంలో అనవలసిన మాట అన్నాడు 1940లోనే రామాయణంలో ఉన్నదంతా ఫ్యాసిజం అన్న కొడవటిగంటి కుటుంబరావు. జండర్ పరమైన అభ్యంతరం అయినా రాముడి రాజనీతి అంతా స్త్రీలను శంకించి రాక్షసులను సంహరించడంలోనే ఉంది. (రామాయణం రంకు అన్నాడు శ్రీశ్రీ) సరిగ్గా ఇవాళ మనదేశంలో జరుగుతున్నది. కాబట్టి ఇవాళ కులం మతమై, మతం జాతియై, దేశంలో భారతీయాత్మతో తాదాత్మ్యం చెంది రామమందిర నిర్మాణమే బానిసత్వం నుంచి విముక్తి మార్గ మంది. బానిసత్వం నుంచి విముక్తి మార్గం అని చెప్తున్న సామ్రాజ్యవాద కార్పొరేట్ దళారీ బ్రాహ్మణీయ ఫాసిజం ఇవాళ చర్చనీయాంశం మాత్రమే కాదు, వీధుల్లోకి వచ్చి ప్రజలు ప్రశ్నించ వలసిన ఎదిరించవలసిన సంఘర్షణ సందర్భం.
రాహుల్ సాంకృత్యాయన్ ను చదవడం వల్ల తనలో వచ్చిన మార్పు గురించి చెప్తూ, ఓల్గాసే గంగ మళ్ళీ మళ్ళీ చదివిన తర్వాత భుజానికున్న జంద్యం నడుమకు వచ్చేసిందని, తీరుబడిగా కూర్చుని జీవితాన్ని గడిపే తరగతుల వారి తాత్విక సమర్ధన కోసం వచ్చిన రచనలు యజ్ఞంవాదం(వేదాలు) బ్రహ్మవాదం(ఉపనిషత్తులు) రాజవాదం(భగవద్గీత) అంటారు కాకరాల. కౌశాంబి భగవద్గీతను వర్గ దృష్టితో చూశాడు. కె.మురళి గీతారహస్యం క్రిటిక్ రాయడానికి మరాఠీ నేర్చుకుని మావోయిస్టు దృక్ఫథంతో రాశాడు. ఈ పుస్తకం ఇన్ని తీర్ల ఆలోచనలకు నాకు ప్రేరకమైనట్లే పాఠకులకు అవుతుందని ఆశిస్తూ…
-19 డిసెంబర్, 2025.