స్వేచ్ఛకు మృత్యువు సంకెళ్ళా!?

పల్లవి:

స్వేచ్ఛా నీకెందుకీ మరణపు సంకెళ్ళు
స్వేచ్ఛా నీ మెడకు బిగిసె ఎవ్వరివీ ఉరితాళ్ళు
ప్రగతిని కాంక్షించే జంటకు
ప్రేమగ జన్మించావు
గోడలు లేనింటా పెరిగి
స్వేచ్ఛగా విహరించావు
పలు చూపులనెరిగిన జర్నలిజానికి
బహురూపాలున్న ఈ లోకానికి
నీ వీపును ఎందుకు చూపించావు
ఏ మృత్యువుకెందుకు బలైనావు

అనుపల్లవి:

స్వేచ్ఛా నువు ప్రశ్నవు కాదు
జవాబువే తల్లీ
స్వేచ్ఛా నువు బిక్షవు కాదు
శాసనంగా రా మళ్లీ ||స్వేచ్ఛా||

1)
స్వేచ్చా నీకై తపిస్తూ- ఈ
ప్రపంచమే ఉంది
స్వేచ్ఛను సాధించడానికి
పోరాడుతా ఉంది
నువ్ ఆడబిడ్డవయ్యి
సర్వనామం కాలేవా
నువ్ ఈడ బిడ్డవయ్యి
కల్సి జీవించలేవా
స్వేచ్ఛా సమానత్వం లేకే కులవర్గ సమాజం
చీకటిచీల్చా కలగందా స్వేచ్ఛా సమీరం ||స్వేచ్ఛా||

2)
సుడులై తిరిగిన నీ మనసులో
ముడి వీడని ప్రశ్నేంటీ
కల్లోలాన్ని జయించినింట్లో
కష్టము నీకేంటి
నిను చుట్టుముట్టినా మగరాజ్యం
నట్టేట ముంచిన పితృస్వామ్యం
అందాలంటూ తిరిగింది
కాళ్ళకు బందాలేసింది
తెల్సుకదా ఈ ప్రపంచమంతా వంచనతో ఉంది
చచ్చి కాదు దాన్నే చంపేస్తేనే స్వేచ్ఛగా బతికేది

స్వేచ్ఛా మగ ఆయుధం
ఉరితాడయి బిగిసిందా
తెగిపడినా సంకెళ్ళతో
ఎదిరించగా రావమ్మా

(కామ్రేడ్స్ శంకరన్న-శ్రీదేవిల కూతురు స్వేచ్ఛ బలవన్మరణం హత్య లాంటిదని ఘోషిస్తూ, పితృస్వామ్యం లేని స్వేచ్ఛా సమానత్వాలకై తపిస్తూ…. స్వేచ్ఛ అంతిమయాత్రలో పాల్గొన్న సందర్భంగా)


• 28/06/2025

పుట్టింది కరీంనగర్ జిల్లా వేములవాడ. కవి, రచయిత, గాయకుడు. విప్లవోద్యమ నాయకుడు. అసలు పేరు కూర దేవేందర్. కలం పేరు మిత్ర. అమర్ పేరుతో సీపీఐ(ఎం.ఎల్.) జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రచనలు : 1. మిత్ర తెలంగాణ పాటలు, 2. పొదుగు, 3. వరుపు, 4. మిత్ర జనం పాటల సవ్వడి (పాటలు); 5. చితాభస్మంలోంచి...(కవిత్వం); 6. తెలంగాణ డప్పు దరువు, 7. తెలంగాణ ధూం ధాం, 8. తెలంగాణ కోలాటం పాట, 9. ముంబై తెలంగాణం, 10. బహుజన బతుకమ్మ, 11. వీరతెలంగాణ (నృత్యరూప గానాలు).

Leave a Reply