స్వేచ్చా హైకూల జపనీయ కవి -తనెద సంతోక

1882 లో జపాన్ లో జన్మించిన తనెద సంతోక, హైకూ నియమాలను పట్టించుకోకుండా స్వేచ్ఛగా హైకూలు రాసిన కవిగా ప్రసిద్ధుడు.

భూస్వాముల కుటుంబంలో జన్మించిన సంతోకకు పదకొండేళ్ల వయసు వున్నపుడు తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సంతోక డైరీలలో రాసుకున్న దాని ప్రకారం, తండ్రికి అనేక మంది స్త్రీలతో వున్న లైంగిక సంబంధాలను భరించలేక తల్లి ఆత్మహత్య చేసుకున్నది. ‘సంతోక’ అన్నది కలం పేరు. జపనీయ భాషలో ఈ మాటకు ఒక అర్థం ‘పర్వత పై భాగం మీది మంట’. మరొక అర్థంలో ‘దహన వాటిక మీది మంట’. జపనీయ సంస్కృతిలో పర్వతం పై భాగాన్ని దహన వాటికకు ప్రతీకగా వాడుతారు. తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తరువాత, బావిలో నుండి తీయబడిన ఆమె మృతదేహం తనను జీవిత కాలం వెంటాడిన పీడకల అని, ఆ పీడకల ప్రభావంతో జీవితంలో తారసపడిన ఏ స్త్రీతోనూ సవ్యమైన సంబంధాన్ని నెరపలేకపోయానని సంతోక చెప్పుకున్నాడు.        

1902 లో టోక్యో విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన సంతోక అక్కడ విపరీతమైన తాగుడుకు బానిసయ్యాడు. చివరికి, 1904 లో అనారోగ్య సమస్యలతో, అప్పుడే మొదలైన జపాన్-రష్యా యుద్ధంతో కుదేలైన తండ్రి ఆర్ధిక స్థితితో విశ్వ విద్యాలయం నుండి గెంటివేయబడ్డాడు. 1909 లో తన పొరుగు గ్రామ స్త్రీతో వివాహం జరిగినప్పటికీ తల్లి మరణంతో వెంటాడిన పీడకలల వలన సంసారం సవ్యంగా సాగలేదు.  

1911 లో తుర్గెనెవ్, మోపాసా ల రచనలను అనువాదం చేయడంతో ప్రారంభించిన సంతోక, అదే సంవత్సరం స్థానిక హైకూ క్లబ్బులో చేరిపోయాడు. 1913 లో నియామాల బంధనాలను తెంచుకుని రాసే స్వేచ్చా హైకూల సంస్కరణవాది ‘ఓగివర సీసెన్సుయి’ కి శిష్యునిగా చేరిపోయాడు. కొన్నాళ్లపాటు గురువుగారి హైకూ పత్రికకు వరుసగా రచనలు పంపుతూ వొచ్చిన సంతోక, 1916 లో ఆ హైకూ పత్రిక సంపాదకునిగా ఎదిగాడు. అదే సంవత్సరం, కొత్తగా పెట్టిన వ్యాపారంలో దివాళా తీయడంతో సంతోక తండ్రి ఊరుని విడిచి వేయవలసి వొచ్చింది. చివరికి, ఎక్కడా కుదురుగా పనిచేయలేని స్థితికి చేరిన సంతోక, భార్యకు విడాకులు యిచ్చాడు. 1924 లో ఒకనాడు విపరీతంగా తాగిన సంతోక రైలుకు ఎదురు వెళ్ళి, తృటిలో మరణం తప్పించుకున్నాడు. అక్కడ అతనిని చూసిన ఒక పత్రికా విలేఖరి, దగ్గర లోని గుడికి తీసుకు వెళ్ళాడు. ఆ గుడిలోనే పూర్తిగా జెన్ బుద్ధిజమ్ ప్రభావంలో  పడిపోయాడు. ఇక అక్కడి నుండీ దేశంలోని అన్ని గుళ్లూ కాలినడకన తిరుగుతూ హైకూలు రాయడమే అతడి జీవితంగా మారిపోయింది. ఆయనే ఒకచోట చెప్పుకున్నట్టు, దేశమంతా తిరగడం, నచ్చింది రాసుకోవడం తప్ప మరేదీ నీకు చేతకాదని నాకు అర్థమయింది”. ప్రయాణాల మధ్యలో ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసుకున్నాడు. 57 ఏళ్లపాటు బతికిన సంతోక, 1940 లో నిద్రలోనే మరణించాడు. చనిపోయేనాటికి 7 కవితాసంపుటాలు వెలువరించాడు.  

తనెదసంతోకహైకూలుకొన్ని       

1

ఒంటరిగా 

వింటున్నాను 

ఒక వడ్రంగి పిట్టని 

2

ఈ కొంచెం బూడిద 

మిగిలింది చివరికి 

నా డైరీలోంచి 

3

చీకటి 

తడిసిపోయింది 

గాలి శబ్దాలతో 

4

నాకు ఇల్లు లేదు 

శరదృతువు చిక్కబడింది 

మెత్తని పరుపు మీద పడుకున్నాను 

నా పల్లె గురించి కలలు కంటున్నాను 

6

నీటితో పాటు ప్రవహిస్తూ 

నేను పల్లెలోకి నడిచాను 

7

నేను చేయగలిగినదేమీ లేదు 

నేను నడుస్తూనే వుంటాను 

తెంపివేశాను 

ఒక పేరులేని పూవుని 

బుద్ధునికి సమర్పించాలి 

నీటిమీద 

ఒక దేశదిమ్మరి 

ప్రతిబింబం 

10 

రోజంతా మౌనంగా వున్నాను 

సముద్రాన్ని చూస్తూ 

అల ఒకటి వచ్చింది 

పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.

Leave a Reply