స్వాప్నికుడు

అతడు…
మట్టిని మనిషిని స్వేచ్ఛ‌ను
గాఢంగా ప్రేమించినవాడు…
యుద్ధాన్ని తన భుజం మీద మోస్తూ
మండే డప్పులా మూల మూలలో
“ప్రతి”ధ్వనించిన వాడు..

నెత్తురు మొగ్గలై రాలుతున్న
“సూర్యుళ్ల” మధ్య నిలబడి
పున్నమి రాత్రుల వంటి ”ఆ రోజుల్ని”
కలగన్నాడు…
కలగంటూనే నేలను… నీటిని… గాలిని… వెలుగుని
తన భా”స్వర” స్పర్శతో
జ్వలింప జేశాడు…

యుద్ధ పరదాలను ధ్వంసిస్తూనే
నెత్తురు కారుతున్న వర్తమానాన్ని
రేపటితో గుణించి కొన్ని ఆశలను, కొన్ని విశ్వాసాలను
మనచేతుల్లో పోసి
ఎన్నిసార్లు మన”దారి”ని
సజీవం చేసాడో….

కులమూ, మతమూ
మార్కెట్టూ, రాజ్యమూ చేత
పీడింప బడని కొత్త మనిషొక‌ణ్ని
నిర్మించేందుకు రాజీ తెలియని
కెరటమై పొoగుతూనే ఉన్నాడు…

అతనొక పురాతన స్వాప్నికుడు
అస్తమయ తీరాల్లో బంధించి
గొంతునొక్కినా
రేపు పొద్దుటిపూట వెలుగులో
పూల సవ్వడిలా స్వే చ్ఛ‌ను
గానం చేస్తాడు.

శత్రువా…!
అంతమే లేదు అతడికి
నక్సల్బరీ శ్రీకాకుళ నిప్పులా…
ఇంద్రవెల్లి దండులా
దండకారణ్య పోరులా
నిరంతర కొనసాగింపు తప్ప…

(వ‌ర‌వ‌ర‌రావు కోసం…)

      

Leave a Reply