నవ మన్మధుడిలా
తెల్లగెడ్డం నల్లగా మెరవాలి
నా పేరు జగమంతా పెరగాలి
ఈ ఫొటోషూట్ ప్రపంచంలో
నన్ను చూసి నేనే అసూయపడేలా!
నన్ను నేను చూసుకుంటూ
నేనో కెమెరానవుతా
నా ఫోటోఫ్రేమ్ లో
హీరోని నేనె విలన్నీ నేనే
కరుణామయిని కర్కశ హృదయిని
కవిని ,ఋషిని , కవిత్వాన్ని
కౌబాయిని,జేమ్స్ బాండుని
జంతు ప్రేమిని శత్రుసంహారిని
ప్రేమనీ నేనే, ద్వేషాన్ని నేనేగా !
కాసేపు నేనో దేవుడినవుతా
భక్తుడిగా భగవంతుడిగా
అన్ని అవతారల్లో నేనే దర్శనమిస్తా
కటౌటు అంతా పరుచుకున్న నేను
మూల్లో ముడుచుకున్న దేవుడి బొమ్మతో !
నేను తిరుగులేని హీరోగా
ప్రతిపక్షం లేని ప్రశ్నల్లేని ప్రపంచంలో
కాకుంటే నా వీరత్వ ప్రదర్శనకో
శత్రువు కావాలి నా అవసరానికి ఎదురుపడుతూ
వాడు నేనెప్పుడూ గెలిచే బలహీనుడిగానే
శత్రువులేని జీవితం ఎంత భారమో
కొలంబస్ !కొలంబస్! కావాలో శత్రువు నాకు!
మై డియర్ వందిమాగతుల్లారా
వంద నోళ్లతో నా కీర్తిని కొనియాడండి
ఈవెంట్ మేనేజ్మెంటీయులారా
టీవీ స్క్రీనుల్లో ఫేస్బుక్ లో వాట్సాప్లో
గ్రాఫిక్ బొమ్మల్తో ఫిల్టర్ మహిమలతో
నన్ను అందంగా అలంకరించండి
ప్రేక్షక మహాశయులు తరించేలా
డౌటనుమానంతో ఫేక్
అన్నోడి ఫేస్ చేరిపేయండి !
మసక బారుతున్న ప్రతిసారీ
నేనో సెన్సేషనల్ న్యూస్ గా ప్రసరిస్తా
నామీదెవడో రాయిసిరేశాడంటా
ఉత్తిత్తిగా కాసేపు చచ్చిపోతా
సానుభూతిని చప్పరిస్తూ
డబల్ ధమాకా పధకం
బ్రేకింగ్ న్యూస్ లో
ప్రత్యర్థుల అరెస్ట్!
నా మనో వీక్షకుల్లారా
ఆకాశాన్ని చూశారా
కాషాయి రంగు కప్పుక్కుని
ఎంత పవిత్రమగుందో!
ఎవడురా వాడు
ఆకాశం ఎండిపోయిన రక్తంరాయిలా ఉందా?
నీలి సముద్రములా ఉరుకలేస్తుందా?
వాణ్ణి వదలకుండా పట్టుకోండి
ఆకాశం ఆకుపచ్చ పైరులాగుందంట
నెలవంక నెలబాలుడుతో ఆడుకుంటుందంట!
ఆకాశానికి వాళ్ళు అతికించిన రంగులన్నీ ఓలిచేయండి
నా కంటి చూపే అందరి కళ్ళ మీద కనిపించాలి
కళ్లారా చూడండి !
ఆకాశం కుంకుపు పువ్వులాఎట్టా విచ్చుకుందో
ఏ రంగోడూ మిగిలికుండా!
ఇంతలోనే ఎంత కాల వైపరీత్యం
ఛీ! మీదీ ఒక బతుకేనా
దేశభక్తి లేని దేశీయుల్లా
దేవుడ్ని వదిలేసిన భక్తుల్లా
హీరో మీద దాడి చేసిన ఫ్యాన్స్ లా
ఏమిటీ సోషల్ న్యూసెన్స్ పోస్టులు
నేనో డిజిటల్ దిస్టిబొమ్మనా?
ఎటు చూసినా నమ్మకద్రోహులే!
ఎవరూ లేరేంటి నా పక్కన
నా సెల్ఫీ నన్ను చూసి నవ్వుతుందేంటి
ఏది కనిపించదే నిన్నటి దివ్య రాజసం
సూట్లోంచి వెక్కిరిస్తున్న చిరిగిన చొక్కా
నెరిసిన జుట్టూ ముడతలుబడ్డ వొళ్ళు
కురుపుల్లోంచి కారుతున్న రసిక
ఈ ముఖాన్ని నేను చూడలేను
టచ్ అప్ ప్లీజ్!
నన్ను చూసి
అద్దమేంటి అట్టా నవ్వుతుంది?
అద్దం అబద్ధం చెబుతుంది
ఈ అద్దాల్ని పగలగొట్టాల్సిందే!
సెల్ఫీని ముద్దడుతూ నేను!!
***
మానవత్వం పుట్టాలిగా
చెట్టయినంత మాత్రాన
అది ఆడవయిద్దా
నీటి చుక్కయినంత మాత్రాన
సముద్రమయిద్దా
నుప్పు వెలుగైనంత మాత్రాన
సూర్యుడయిద్దాయేంటి
మనిషయినంత మాత్రాన
మానవత్వం పుట్టాలిగా!
ఆడవంటే
చేట్టులన్నీ పెనవేసుకోవటం
సముద్రమంటే
నీటి చుక్కల అనంత అన్యోన్యం
సూర్యుడంటే
కోటి మిణుగురుల కాంతివనం
మానవత్వమంటే
విశ్వ మానవ కరచాలనం!
ఎక్కడో తెలియని
రసాయినిక రహస్యం
అడవిలా మనం
అల్లుకుపోవాలి
సముద్రపు హోరులో
సూర్య సంగీతంలో
మనిషిగా వెలిగిపోవాలి!
Nash HCU