స్వరాజ్యం

ఏమో అనుకున్నా గాని
చాన్నాళ్ళేబతికావు స్వరాజ్యం
చస్తూ బతుకుతూ
బతుకీడుస్తునే వున్నావ్

ఏడాదికేడాది
వయస్సు మీదపడుతున్నా
నిన్ను చీల్చి చెండాడుతున్నా
ఏమీ ఎరుగనట్టు
సాఫీగా ఏళ్ళు మీదేసుకుంటున్నావు

తలని మూడుముక్కలు
జేసినా
మెదడు ఛిద్రమౌతున్నా
మౌఢ్యాన్ని నింపుకుంటూ
నింపాదిగానే సాగుతున్నావు

నీ నేల తవ్వకాల్లో
చరిత్ర సమాధౌతున్నా
కళ్ళకి గంతలు కట్టుకుని
శబ్ద వ్యుత్పత్తిలో దృశ్యానుభూతిలో
తేలిపోతున్నావు కదూ!

వైరస్ సంపుతుంటే
మూఢనమ్మకాల వల్లెలో
సావటానికైనా సిద్ధమవుతూ
శాస్త్రాన్ని సంపుతూ నిద్రిస్తున్నావు

పునాదుల్లో
ప్రశ్నలు బలంగా ఉన్నాయని
మరువకు స్వరాజ్యం
భూమి పుత్రులు కాగితాలే అనుకోకు సుమీ
మండితే కాగడాలే !

ఈడ పుట్టినోడ్ని ఆధారమడిగితే
నువ్వేమైనా అక్షరాలు దిద్దించావా
నువ్వైనా దిద్దావా ఇన్నేళ్ళ నీ బతుకులో
ఈ నేల నీది మాత్రమే కాదు స్వరాజ్యం
నా భాష నా యాస నా వలస నా ఆహార్యమే సాక్ష్యం

నువ్వు డెబ్బై నాలుగో పుట్టిన రోజు వేడుకల్లో
నీ కంటే పెద్దోళ్ళు
చెరసాలల్లో కంటైన్మెంట్ ల్లో నిర్బంధ శిబిరాల్లో
బందీలుగా


జయహో స్వరాజ్యమా!
సంబరపడకు నీకో రోజొస్తది
గా రోజు నేటి బందీలే
నీ విముక్తి ప్రదాతలౌతారు

పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. విద్యార్థి దశలో ఎస్. ఎఫ్. ఐ. లో పని చేశారు. సామాజిక ఆర్థిక సమస్యలను కవితా వస్తువులు గా తీసుకుని  కవిత్వం రాస్తున్నారు.  వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

Leave a Reply