ఒక వ్యక్తి స్వయంగా తన అనుభవాలను, జీవితాన్ని తానే ఉత్తమ పురుషలో కథనం చేస్తే అది ఆత్మ చరిత్ర.దానికి స్వీయచరిత్ర అన్నది లోక ప్రసిద్ధ వ్యవహార నామం. స్వీయ చరిత్ర ఆధునిక సాహిత్య ప్రక్రియ. బ్రిటిష్ వలసపాలనలో రాచరిక భూస్వామ్య అధికార సంప్రదాయానికి ప్రత్యామ్నాయంగా స్వేచ్ఛా సమానత్వ సంస్కృతి ప్రచారంలోకి వచ్చింది. కుల కుటుంబ అధికార వ్యవస్థలకు అతీతంగా వ్యక్తి ప్రాధాన్యతను కేంద్రంలోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో స్వీయ చరిత్రలు వచ్చాయి. స్వీయం, సామాజికం అనే ఒడ్డులను ఒరుసుకొంటూ పోయే జీవననదీ ప్రవాహ కథనం స్వీయ చరిత్ర. అనుభవాలు ఒక సామాజిక సందర్భంతోటి సంభాషణ నుండి ఆచరణ నుండి రాటుతేలి అవి పదుగురితో పంచు కొనవలసిన అనివార్యమైన ఒత్తిడి నుండి స్వీయ చరిత్రలు రూపొందుతాయి.
ఒక్కొకసారి అనుభవాలకు సామాజిక సందర్భం లేకపోయినా వ్యక్తిగతం కూడా రాజకీయమే అన్న ఎరుక, వ్యక్తిగతంలోని ఒంటరితనపు బాధను పంచుకోవాలన్న అంతరంగపు ఒత్తిడి స్వీయ చరిత్ర రచనలకు మూలం అవుతుంది. వాళ్ళు ఒక సమాజంలో జీవించే వాళ్ళు కనుక వాళ్ళ అనుభావాలకు సమకాలీన సమాజాన్ని నిర్దిష్ట దేశకాలాలను ఏదో ఒక పార్శ్వం నుండి వ్యాఖ్యా నించే స్వభావం ఉంటుంది. అందువల్ల స్వీయ చరిత్రలు ఎంత వ్యక్తిగతమైనవో అంతగా సామాజిక చరిత్రను అర్ధం చేసుకొనడానికి ఉపయోగపడతాయి. ఆ రకంగా అవి ఏకకాలంలో ఇటు వ్యక్తి జీవిత పరిణామ చరిత్రను, అటు సామాజిక ఆర్ధిక రాజకీయ పరిణామ చరిత్రను తెలుసుకొనటానికి ఉపయోగపడే సాధికార పత్రాలు.
అన్ని సామాజిక జీవన రంగాలవలెనే పురుషులది అయిన సాహిత్య ప్రపంచంలో పురుషుల అనుభవాల కథనాలు,స్వీయ చరిత్రలే ప్రముఖంగా ఉంటాయి. ఉన్నాయి. సాహిత్య సంస్కరణ వాదులు కావచ్చు, జాతీయోద్యమ అభ్యుదయోద్యమ విప్లవోద్యమ కాలాల క్రియాశీలురు కావచ్చు పురుషులే ప్రధానంగా స్వీయ చరిత్రలు వ్రాసుకున్నారు. అందువల్ల ఆయా సామాజిక జీవిత సంఘర్షణలు, చలనశీలత వాళ్ళ దృష్టి కోణం నుండి మాత్రమే నమోదు అయ్యాయి. ఆయా కాలాల సందర్భాల సామాజిక గమనాన్ని, గమ్యాన్ని స్త్రీలు తమ అనుభవకోణాలనుండి ఏ రకంగా నిర్వచించారో, ఎలా వ్యాఖ్యానించారో తెలియని పాక్షిక చరిత్ర మాత్రమే మనకు మిగిలింది.
పితృస్వామిక అధికార సంస్కృతి విస్తరించిన సమాజంలో గడప దాటటానికి అవకాశం లేని స్త్రీలు, సంసారం గుట్టుగా సాగించుకొనవలసినవాళ్ళుగా శిక్షణ ఇయ్యబడే స్త్రీలు సామాజిక ఆర్ధిక రాజకీయ సంబంధాలలోకి రావటమే కష్టం. వచ్చినా మా అనుభవాలు ఇవి, మా అభి ప్రాయాలు ఇవి, మేమిది ఆశిస్తున్నాం అని ధైర్యంగా చెప్పుకొనటానికి వీలియ్యని పితృస్వామిక సంస్కృతి పెద్ద అవరోధం అవుతుంది. ఏదో ఒక మేరకు ఈ అవరోధాలను అధిగమించి స్త్రీలు వ్రాసిన స్వీయ చరిత్రలు వీలైనన్ని సేకరించి అధ్యయనం చేయగలిగితే సామాజిక సమూహాల , సామాజిక చలానాల, సామాజిక ఆర్ధిక రాజకీయఉద్యమాల పాక్షిక చరిత్రను సమగ్రం చేయటం సాధ్యమవుతుంది. కౌటుంబిక సామాజిక సంబంధాలలో రావలసిన మార్పుకు సంబంధించిన వాళ్ళ ఆశలను, ఆకాంక్షలను, సామాజిక పునర్నిర్మాణంలో వాళ్ళ ఆదర్శాల భావజాల విశిష్ట చరిత్రను నిర్మించటం ఇప్పటి అవసరం. అలాగే స్త్రీల అనుభవ ప్రపంచ వైవిధ్యాన్ని, అభిరుచుల గాఢతను, వాటిని తీర్చుకొనటంలో పొందే సంతృప్తిని, సంతోషాన్ని నిరూపించటం ఇప్పటి స్త్రీలకు గొప్ప నైతిక ధైర్యం సమకూరుస్తుంది కూడా.
1
స్త్రీలను వ్యక్తులుగా గుర్తించి వాళ్ళ విద్యావికాసాలకోసం, సంతోషకరమూ ,గౌరవకరమూ అయిన జీవితం కోసం పనిచేసిన సంస్కరణోద్యమ ప్రభావంతో స్త్రీలు ఆ ఆదర్శాలను తమవిగా చేసుకొని 1880ల నాటికి తమ అనుభవాలను, అభిప్రాయాలను వ్యక్తీకరించటానికి రచనను మాధ్యమంగా చేసుకొన్నారు. ఆ క్రమంలో స్టీలకు స్వీయచరిత్రల రచనకు అవకాశాలు కలిసి వచ్చాయి. స్త్రీల స్వీయ చరిత్రల చరిత్ర ప్రారంభం ఎక్కడినుండి? ఎక్కడ మొదలై ఎలా కొనసాగింది? తెలుగు సమాజ సాహిత్య భావజాల రంగం లో ప్రజాస్వామిక చింతనకు, పురోగమనానికి అవి చేసిన దోహదం ఏమిటి ? అనే ప్రశ్నలతో శోధన, అధ్యయనం సాగాలి.
స్వీయ చరిత్ర కథనం పుట్టుక నుండి మొదలు కావచ్చు కానీ మరణ పర్యంతం కొనసాగేదికాదు. జీవితంలో ఏదో ఒక ఘట్టం దగ్గర అది ముగుస్తుంటుంది. అయినా వాళ్ళ జీవితంలోని మలుపులకు , అనుభవాలకు , ఆశలకు , ఆరాటాలకు , భంగపాట్లకు , ఆదర్శాలకు , సామాజిక చింతనకు ఎంతగా అందులో ప్రాతినిధ్యం లభిస్తే అంతగా అవి ఆయా వ్యక్తుల సమగ్ర జీవిత కథనాలు అవుతాయి.అలాంటి స్త్రీల స్వీయ చరిత్రల చరిత్ర ఇప్పటికి తెలుస్తున్నంతవరకు 1934 లో సత్యవతి వ్రాసిన ఆత్మచరితము తో మొదలైంది. దీనితో కలిపి 25 స్వీయచరిత్రలు తెలుస్తున్నాయి. మళ్ళీ వీటిలో లిఖితాలు మౌఖికాలు అని రెండు రకాలు కనిపిస్తాయి.
అంతే కాదు, స్వీయ చరిత్రలు అన్నీ సమగ్ర జీవిత చిత్రాలు కాకపోవచ్చు. జీవితంలో ఏ ఒక సందర్భానికో , ఘటనకో పరిమితమైన అనుభవ కథనాలు కూడా స్వీయాత్మకమైనైట్లయితే వాటిని స్వీయ చరిత్రలలో భాగంగానే పరిగణించాలి వాటిలో యాత్రాచరిత్రలు ఒక రకమైతే అనుభవాల జ్ఞాపకాల కథనాలు మరొకరకం.
స్త్రీల యాత్రాచరిత్ర రచనకు ప్రారంభం 1875 లో వచ్చిన పోతం జానకమ్మ రచన Pictures Of England. పోతం జానకమ్మ తన యాత్రానుభవాల తొలిభాగాన్ని తెలుగులో లేఖ రూపంలో ఒక వ్యాసంగా వ్రాసి ‘శ్రీ ఆంధ్ర భాషా సంజీవని’ పత్రికలో 1874 ఫిబ్రవరి లేదా మార్చ్ నెల సంచికలో ప్రచురించింది. ఆ వ్యాసానికి ఇంగ్లిష్ అనువాదం మద్రాసు నుండి వచ్చే ‘ఎథినీయం అండ్ డైలీ న్యూస్’ పత్రికలో 1874 ఏప్రిల్ 15 సంచికలో విపులమైన సమీక్షతో ప్రచురించ బడింది. అందువల్ల ఆమె దానిని తెలుగులోనే వ్రాసింది అనుకోవచ్చు. ప్రచురించిన పన్నెండు అధ్యాయాల ఇంగ్లీషు ప్రతికి వ్రాసిన ముందుమాటలో అవసరమైన చోట్ల ఇతర గ్రంధాల నుండి యథాతథంగా స్వీకరించి చేర్చిన ఇంగ్లీష్ పేరాలను తెలుగు లోకి అనువదించి ఒరిజినల్ రచనను ప్రచురిస్తానని ఆమె చెప్పిన మాటలు ఒరిజినల్ రచన తెలుగులోనే జరిగిందని సూచిస్తాయి. ఆ ప్రతి అలభ్యం. కానీ కాళిదాసు పురుషోత్తంగారి తెలుగు అనువాదం ఇప్పుడు లభిస్తున్నది. దీనితో కలిపి 2025 వరకు 150 సంవత్సరాలమీద లభిస్తున్న స్త్రీల యాత్రాచరిత్ర గ్రంధాలు తొమ్మిది. 1930 నుండి వివిధపత్రికలలో ప్రచురించబడుతున్న స్త్రీల యత్రానుభవ వ్యాసాలు కూడా ఉన్నాయి.
వంగల వాణీ బాయి భర్తతో కలిసి చేసి వచ్చిన యూరప్ యాత్రానుభవాలు( 1930 మార్చ్ భారతి) 1946 లో యెన్. కామేశ్వరి సింహాచల యాత్ర అనుభవాలు, అదే సంవత్సరం సారనాధ్ వెళ్లిన కె. సుశీలాదేవి అనుభావాలు, ఎల్లోరా చూచిన పి. రమణమ్మ అనుభవాలు 1950 లో మహోంజొదారో చూసి వచ్చిన ఆదుర్తి భాస్కరమ్మ అనుభవాలు వంటివి ఆ కోవలోవే. యాత్ర నెపంగా చరిత్రలో, ఆధ్యాత్మిక విషయాలలో, ప్రకృతి ఆరాధనలో స్త్రీల ఆసక్తుల, అభిరుచుల అనుభవ వ్యక్తీకరణ ఆకాంక్షలను తెలుసుకొనటానికి వీలవుతుంది.
ఇక స్త్రీల ఏదో ఒక జీవిత పార్శ్వానికి సంబంధించిన ఆత్మీయతను వ్యక్తీకరించే రచనలు గత పాతికేళ్లుగా వస్తున్నాయి. తురగా జానకీ రాణి వ్రాసిన మా తాతయ్య చలం ( 2002) అలాంటి రచనలలో మొదటిది.
ఇలా 1. స్వయం లిఖితాలు, 2. మౌఖికం నుండి లిఖితరూపం తీసుకొన్నవి 3. యాత్రాచరిత్రలు 4. స్వీయ జీవిత ప్రత్యేక సంఘటనల, సందర్భాల అనుభవ కథనాలు – అని నాలుగు ఉప విభాగాలకింద స్త్రీల స్వీయచరిత్రల చరిత్రను సమీక్షించవచ్చు. లభిస్తున్నంతవరకు స్త్రీల స్వీయాత్మక అనుభవ కథన ప్రాచీనత యాత్రాచరిత్రలో కనబడుతున్నది కనుక యాత్రాచరిత్రల సమీక్ష ముందు చేయటం సముచితం. స్త్రీలు వ్రాసుకొన్న స్వీయచరిత్రలు, స్త్రీల మౌఖిక స్వీయానుభవకథనాల లిఖిత రూపాలు, స్త్రీల స్వీయ జీవిత ప్రత్యేక సంఘటనల, సందర్భాల అనుభవ కథనాలు అన్న వరుసలో పరిశీలన, విశ్లేషణ కొనసాగుతుంది.
- స్త్రీల యాత్రాచరిత్రలు
యాత్రాచరిత్ర ఒక ప్రత్యేక సాహిత్యప్రక్రియ. దేశ విదేశ ప్రయాణాలు చేసినవాళ్లు ప్రారంభం నుండి ఆ ప్రయాణం పూర్తిచేసుకొని ఇంటికి తిరిగివచ్చేవరకు తాము చూసిన ప్రాంతాల ప్రత్యేకతలను, ఆహారవిహార సంస్కృతీ సంప్రదాయాలను, ప్రయాణ విశేషాలను వివరిస్తూ చేసే ఆసక్తికర కథనాలు యాత్రాచరిత్రలు. యాత్రాచరిత్రలు సంపూర్ణ జీవిత చిత్రాలు కాకపోయినా వ్యక్తి జీవితంలో యాత్రలు ఒక భాగం. వ్యక్తి అభిరుచుల, అనుభవాల, అభిప్రాయాలవ్యక్తీకరణకు వేదిక అవుతూ పాక్షికంగానైనా రచయితల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి కనుక అవి స్వీయ చరిత్రలలో ఒక భాగం అవుతాయి.
1.1. ఆ రకంగా చూసినప్పుడు భర్త రాఘవయ్యతో కలిసి 1873 లో ఇంగ్లండ్ వెళ్లి 1874 ఫిబ్రవరి 1 న తిరిగివచ్చిన పోతం జానకమ్మ వ్రాసిన యత్రానుభవ కథనం ( Pictures Of England 1875 అక్టోబర్) తొలి తెలుగు స్త్రీ ఆత్మ కథనం అవుతుంది.
ధనికులకు, విస్తృతంగా వ్యాపారంచేయాలను కొనేవాళ్లకు, తమ విదేశీ భాషా పరిజ్ఞానంతో లోకోత్తరవిజయాలను కాంక్షించే వాళ్లకు సముద్రాలు దాటి విదేశాలకు వెళ్ళటం అవసరం, అనివార్యం అని తెలియచేయటానికి, విదేశయానం ప్రయాసకరం కాదు, ప్రమాదకరం కాదు అన్న నైతిక ధైర్యాన్ని ఇయ్యటానికి జానకమ్మ ఈ యాత్రాచరిత్రను రచించింది. బ్రిటిష్ పాలకుల జీవన విధానం, మతం, వైజ్ఞానిక పురోగతి, పాలనా దక్షతలను మాత్రమే కాక వివిధప్రాంతాలను వాళ్ళు ఆక్రమించుకున్న చరిత్రను కూడా ఆమె ఏవిధమైన ఫిర్యాదీ స్వరం లేకుండానే ప్రస్తావించింది.
పంజరం విడిచిన పక్షిలాగా తనవంటి వాళ్ళు విసుగు , ఆకలి లేకుండా లండన్ అద్భుతాలను చూడటానికి రోజంతా తిరగటానికి ఇష్టపడతారని అంటుంది. స్వదేశంలో ఎప్పుడూ తన ఆలోచనకే రాని శారీరక వ్యాయామం వైపు ఇక్కడ తన దృష్టి మళ్లిందని హైడ్ పార్క్ లో అనుదినం ఎంతెంతో దూరాలు నడిచే అవకాశాన్ని సంపూర్ణంగా వాడుకొన్నాని చెప్పింది. అదే సమయంలో ఇంగ్లండ్ ప్రత్యేకత దేశంలో దాదాపుగా స్త్రీలందరూ విద్యావంతులు కావటం అనిపేర్కొన్నది జానకమ్మ. అలాంటి విద్యావంతులైన స్త్రీలలో కొందరు భారతీయుల సంక్షేమం కోసం పనిచేశారని చెబుతూ లేడీ వాటర్ లూ , మిస్ మేరీ కార్పెంటర్, మిసెస్ ఆర్నాల్డ్ , మిస్ మన్నింగ్ తదితరులను కృతజ్ఞతతో తలచుకొన్నది. (వీళ్ళలో మిస్ మేరీ కార్పెంటర్ జీవిత చరిత్రను వీరేశలింగం తెలుగులో వ్రాసాడు.)దేశంలో స్త్రీలు కోల్పోయిన స్వీయ శరీరాల గురించిన స్పృహ , దేశీయ స్త్రీల అభ్యుదయకోసం బ్రిటిష్ స్త్రీలు చేస్తున్న ప్రయత్నాల గురించిన ఎరుక జానకమ్మ ఆధునిక మహిళా లక్షణాన్ని సూచిస్తాయి.
లండన్ లో ఉన్న కాలంలో జానకమ్మ అక్కడి నుండి మాంచెస్టర్ కు , పారిస్ కు వెళ్లివచ్చింది. ఆ ప్రయాణ కాలపు ఆమె అనుభవాలు, ఆలోచనలు, అభిప్రాయాలు, మొత్తంగా లండన్ ప్రపంచం ఆమె మీద వేసిన ముద్ర ఈ యాత్రాచరిత్రలో కీలకమైనవి. ఇంగ్లండ్ సాధించిన పారిశ్రామిక ప్రగతికి అబ్బురపడుతూ ఆరాధనా భావంతో చెప్పుకుపోయిన జానకమ్మలో అదే సమయంలో భారతీయ అస్తిత్వం మేల్కొనటం కూడా చూస్తాం. భారతదేశ మార్కెట్ లో విస్తృతంగా అమ్ముడవుతున్న మాంచెస్టర్ ఉత్పత్తులను తలచుకొని దానిని బట్టి మాంచెస్టర్ వర్తకులు రెండింతలు లాభాలు పొందుతున్నట్లు తెలుసు కోవచ్చు నంటుంది. ముడిసరుకు- పత్తిని కొని- తీసుకుపోవటం, తయారైన వస్తువును తెచ్చి అమ్మటం – ఈ రెండింటి ద్వారా లాభపడుతున్న బ్రిటిష్ వారి వ్యాపార రాజకీయం ఆమెకు అర్ధమైనట్లుగానే కనబడుతుంది.
మాంచెస్టర్ లో పెట్టుబడిని ప్రేమించి,పారిశ్రామిక వేత్తలను ఆరాధించిన జానకమ్మ పారిస్ లో కమ్యూనిస్టుల పట్ల అసహనం ప్రకటించటం చూస్తాం. పెట్టుబడికి అదిసృష్టించే అసమానతలకు మధ్య ఉండే వైరుధ్యాల పరిష్కారంగా వచ్చిన కమ్యూనిజం పట్ల అసహనం ఆమె వర్గ స్వభావాన్ని సూచిస్తుంది. ఏమైనా 1874 నాటికి ఒక తెలుగు మహిళ రాజకీయాల గురించి , చరిత్ర గురించి గొప్ప విశ్వాసంతో మాట్లాడగలగటం అపురూపమే. క్రైస్తవ మతంలోని సారళ్యతను గుర్తించి హిందూమతంలో సంస్కృత భాషలో సాగే కర్మకాండల తంతు అందరికీ తెలిసే సులువైన భాషలో ఉండాలని ఆకాంక్షించింది. లౌకిక ప్రజాస్వామిక చూపు ఇది.
విదేశయానం\, మరీ ముఖ్యంగా ఇంగ్లండ్ యాత్ర జీవితంలో అభివృద్ధి వికాసాలకు అవసరమైన సంస్కార వివేకాలను కలిగిస్తుందని దృఢంగా విశ్వసించింది ఆమె.ఒక తెలుగు మహిళ 1875 నాటికి ఇంగ్లండ్ వెళ్లిరావటం అదేదో భర్తచాటు భార్య చర్యగా కాక ఒక స్వతంత్ర వ్యక్తిత్వంతో దేశ ఆర్ధిక రాజకీయ అభివృద్ధి ఆకాంక్షలను ఏర్పరచుకొని వ్యక్తీకరించ కలిగిన మేధో చర్యగా ఉండటాన్ని జానకమ్మ యాత్రాచరిత్ర రచన ‘పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లండ్’ నిరూపించింది.
1912 లో కాంచనపల్లి కనకాంబ కాశీయాత్రా చరిత్ర వ్రాసినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చిన యాత్రాచరిత్రలు ఎనిమిది. నాయని కృష్ణ కుమారి రచన కాశ్మీర దీపకళిక( 1978) డ్. కామేశ్వరి రచన నా విదేశ యాత్రానుభవాలు(1997), అబ్బూరి ఛాయాదేవి రచన చైనాలో ఛాయాచిత్రాలు (2002),జయప్రభ రచన శిశిరంలో మాస్కో (2005), కురుగంటి శ్రీలక్ష్మి రచన షంఘై నింగిలో అనుభవాల హరివిల్లు (2005) దర్భా భాస్కరమ్మ రచన నా ఉత్తర దేశ యాత్ర.( 2013), కంభంపాటి సీత విశ్వవిహారం(2022),గిరిజ పైడిమర్రి రచన గిరిగమనం(2025). కాంచనపల్లి కనకాంబతో సహా అందరూ విద్యావంతులు, కవిత్వం, కథ, నవల, విమర్శ మొదలైన ప్రక్రియలలో రచనలు చేసినవాళ్ళే.
1.2. నాయని కృష్ణకుమారి ఉస్మానియాయునివర్సిటీ తెలుగు ఆచార్యులు. YMCA అఖ్ఖిల భారత స్థాయిలో కాలేజీలనుండి విద్యార్థులనుఎంపిక చేసి నిర్వహించే విజ్ఞానవినోద యాత్రలో తన కాలేజీ నుండి వెళ్లే అమ్మాయిలతో కలిసి చేసిన కాశ్మీరు యాత్రానుభవాల కథనం కాశ్మీర దీపకళిక. తనలో ఉన్న సౌందర్య దృష్టి ఈ రచనకు కారణం అంటుంది ఆమె. రైలు కిటికీ నుండి కదిలే ప్రకృతిని , వింధ్యపర్వతాలను, చూస్తూ పొందిన భావోద్వేగాల వర్ణనలో ఆమె భావుకత ఆహ్లాదకరంగా ఉంటుంది. గంపులుగా పెరిగిన పెద్దపెద్ద చెట్లను, గాలికి ఊగే చెట్ల చలనానికి ముగ్ధురాలవుతూ తీగలను వర్ణించినంతగా కవులు చెట్లను వర్ణించలేదు అని అనుకొనటం ఆమె విస్తృత సాహిత్య అధ్యయనాన్ని సూచిస్తుంది. రైలు ప్రయాణం పొడుగునా కదిలే రైలు కిటికీ నుండి కృష్ణకుమారి కెమెరా కన్ను కనబడిన మేరా వేరు వేరు రాష్టాల భూ భాగాల ప్రత్యేకతలను,వ్యవసాయ జీవన విధానంలోని విశేషాలను,ప్రజల శరీర ఆకృతులను అందాలను , దుస్తులను, ప్రత్యేకించి స్త్రీల జీవిత నిత్యకృత్యాలను పట్టుకొని కదిలే వర్ణ చిత్రాలుగా మనకు అందిస్తుంది. భూమితో మనిషికి ఉండే అనుబంధం, విద్యార్థుల తత్వం ఆమెను కదిలించి , మనసును మురిపించటం చూస్తాం.
మూడురోజుల రైలు ప్రయాణం తరువాత పఠాన్ కోట నుండి మూడువందల మైళ్ళ అవతల వున్న శ్రీనగర్ బస్సు ప్రయాణంలో కాశ్మీరాన్ని గురించి మొదటిసారిగా తన ప్రయాణానుభవాలను లిఖిత రూపంలో నమోదు చేసిన 17 వ శతాబ్దికి చెందిన బెర్నియర్ అనే ఫ్రెంచ్ వ్యక్తి గురించి, కాశ్మీర్ చరిత్రగురించిన రచయిత్రి తలపోతలు ఆత్మచరిత్రకు చరిత్రతో బంధాన్ని కలిపాయి. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల, ప్రజల వివరణాత్మక సంస్కృతీ కథనంగా ఈ యాత్రా చరిత్ర కనబడుతుంది. కాశ్మీర్ యాత్ర చేయదలచుకొన్నవాళ్లకు ఒక రూట్ మ్యాప్ గా దోహదపడుతుంది.
కాశ్మీర్ లో అది ఇండియాలో భాగమన్న స్పృహ ఎక్కడా కనబడదని నొచ్చుకొన్నది. నెహ్రూజీ కాశ్మీర్ మనుగడకు ఎంత స్వంతత్ర ప్రతిపత్తిని కలిగించినా అది ఇండియాలో భాగమే కదా అని అంటుంది. హైదరాబాద్ హిందూ దేశంలో కలిసిపోయినట్లుగా కాశ్మీరం కూడా ఈ పాటికి కలిసి పోయి ఉండాలి అని ఆమె అభిప్రాయం.
1.3. రచయిత్రిగా సంపాదన కలిగి కాస్తో కూస్తో డబ్బు కూడబెట్టుకున్న నేపథ్యంలో విదేశాలు తిరిగి రావాలన్న కోరికను తీర్చుకొన్న డి. కామేశ్వరి రచన నా విదేశ యాత్రానుభవాలు. అక్క చెల్లెళ్ళతో కలిసి ఒక సంస్థ నిర్వహించిన సామూహిక యాత్ర సమూహంతో చేరి చేసిన యూరప్ యాత్ర అనుభవాలు, దానికి కొనసాగింపుగా చేసిన అమెరికా యాత్రానుభవాలు ముందు వనిత మాసపత్రికలో సీరియల్ గా ప్రచురించబడ్డాయి. 1997 లో పుస్తకరూపంలోకి వచ్చాయి. ఆర్గనైజ్డ్ టూర్స్ పద్ధతి గురించి వాటివల్ల ప్రయోజనాలా గురించి చెప్పటం దగ్గర ప్రారంభించి రోజువారీగా తాము తిరిగి చూసిన ప్రాంతాల విశేషాలను చెప్పటమే కాక శుచిశుభ్రతల గురించి, విద్యా వ్యవస్థ గురించి, ఇళ్ల నిర్మాణం, కార్ల ఉపయోగం,పార్కింగ్ విధానం వంటి అంశాలను కూడా వివరించింది. మనదేశానికి , ఆ దేశాలకు ఉన్న తారతమ్యాల గమనింపు కూడా చూస్తాం.
1.4. కేంద్ర సాహిత్య అకాడెమీ భారతదేశం నుంచి పంపించే పదిమంది రచయితల బృందం లో సభ్యురాలిగా అబ్బూరి ఛాయాదేవి 2002 జూన్ 24 నుండి జులై 8 వరకు చేసిన చైనా యాత్రానుభవాల కథనం ‘చైనాలో ఛాయాచిత్రాలు’ ఈ యాత్ర చేయటానికి ఆమె చైనా యాత్రాచరిత్ర పుస్తకాలు, చైనా సాహిత్యం, చైనా సంస్కృతి, చైనా భాష మొదలైనవాటికి సంబంధించిన పుస్తకాలు, వ్యాసాలు సేకరించి అధ్యయనం చేసిన పద్ధతి, తెలుగుసాహిత్యం గురించి ఆంగ్లంలో వచ్చిన వ్యాసాలను చదువుకొని తయారైన పద్ధతి చాలా అసక్తి కరంగా ఉంటుంది. పూర్తి శాఖాహారులు ఇలాంటి విదేశీ యానాలు చేయాటానికి ప్రత్యేకమైన ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించుకోకుండా అందరిలో ఒకరిగా ఉంటూ చేసుకోవాల్సిన సర్దుబాట్లు ఎలా ఉండాలో ఈ యాత్రాచరిత్ర చెబుతుంది. చైనాలో ఆహారసంస్కృతి, వడ్డన విధానం , తినటానికి వాడే వస్తువుల విశేషాలు మొదలైనవి నమోదు చేసింది.
త్యాన్ ఆన్ మన్ స్క్వెర్ వైశాల్యం, అందులోని రాజప్రాసాద నిర్మాణాలు, చైనా భవన నిర్మాణ వాస్తులో స్త్రీపురుష వివక్ష భాగమై ఉండటం, నిర్మాణానికి చెక్కను ప్రధానంగా వాడటం మొదలైనవన్నీ గమనించి తెలుసుకొని పేర్కొనటం విశేషం. బీజింగ్, హునాన్, షాంఘై వంటి నగరాలలో లో గ్రేట్ వాల్, మీన్గ్ టామ్బ్స్ , టెంపుల్ ఆఫ్ హెవెన్, నేషనల్ ఆర్కైవ్స్, మ్యూజియంలు, వైట్ హార్స్ టెంపుల్ వంటి బౌద్ధ దేవాలయాలు దర్శిస్తూ వాటి పురాచరిత్రను, సంస్కృతీ విజ్ఞానాల ప్రత్యేకతలను పేర్కొంటూ ఆయా ప్రాంతాల సాహిత్యసంస్థలతో , రచయితలతో సమావేశాల విశేషాలను వివరిస్తూ, సందర్భానుసారంగా స్ఫురణకు వచ్చిన తెలుగు సాహిత్యంతో పోలికలను చెప్తూ సాగిన ఈ యాత్రా కథనం చైనాతో మనకు ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరుస్తుంది.
1.5. అబ్బూరి ఛాయాదేవి లాగానే రష్యాలో జరగనున్న భారత సాంస్కృతిక ఉత్సవాలలో పాల్గొనటానికి భారతప్రభుత్వం – కేంద్రసాహిత్య అకాడెమీ ఎంపిక చేసిన రచయితల బృందంలో ఒకరిగా 1996 సెప్టెంబర్ లో రష్యా వెళ్లివచ్చిన జయప్రభ యాత్రానుభవాల కథనం శిశిరంలో మాస్కో. ఆంధ్రప్రభ పత్రికలో సీరియల్ గా వచ్చి 2005 లో ప్రతికూల పవనాలు పుస్తకం తో కలిపి పుస్తకంగా వచ్చింది. రష్యాను ఆవాహన చేసుకొన్న తెలుగు సాహిత్యప్రపంచాన్ని గురించిన రచయిత్రి అవగాహన, ఆ నాటి ఆదర్శాలను వదిలేసి చాలా దూరం వచ్చేసిన సమకాలపు రష్యా గురించిన ఆ వేదన, రష్యా ఘనచరిత్ర పట్ల, సాహిత్యం పట్ల , రచయితల పట్ల అపారమైన ప్రేమ , గౌరవాలు అన్నీ కలగలసిన గాఢమైన భావోద్వేగాల సమ్మేళనంగా ఈ యాత్రా రచన పాఠకులను తనతో లాక్కుపోతుంది.
లెనిన్ నాయకత్వంలో రూపొందిన సోషలిస్టు రష్యా గ్లాస్ నొస్తా తరువాత అమెరికాను ఆవాహన చేసుకొనటానికి ఉత్సాహపడుతున్న స్థితిలో రష్యా ను దర్శించిన జయప్రభ ఆ పరిస్థితిని చూసి ఆవేదన పడుతూనే సోషలిస్టు ప్రభుత్వంలోని నియంతృత్వ పోకడను అందుకు కారణంగా చూడటం ఈ యాత్రా చరిత్రలో కనబడుతుంది. టాల్ స్టాయ్, చెహోవ్ మొదలైన రచయితల ఇళ్లను, జీవిత కాలపు వస్తుసముదాయాన్ని, వాళ్లకు సంబంధించిన సకల సమాచారాన్ని భద్రపరచటంలో రష్యాప్రభుత్వం తీసుకొన్న శ్రద్ధకు ముగ్ధురాలై మనదేశంలో కవుల గురించి రచయితల గురించి ఈ పట్టింపు లేకపావటానికి దిగులుపడుతుంది. దేశంలో బెంగాల్ వాళ్ళు కొంత నయం. తెలుగు వాళ్ళు మరీ అధ్వాన్నం అన్నది ఆమె పరిశీలన. అలాగే ఢిల్లీ నుండి మాస్కో కు విమానంలో ప్రయాణిస్తూ భారతదేశంలో చెట్ల పట్ల మానవ నిర్లక్క్ష్యం ఆకాశంలో స్వచ్ఛతను హరించి బూడిదరంగుతో నింపుతున్న తీరు గురించి దిగులుపడిన పర్యావరణ ప్రేమికురాలిగా కూడా జయప్రభ ఇందులో కనబడుతుంది. శశిరం మంచుకురిసే కాలం. ప్రకృతి లోని ఆ అతిశీతలత వ్యక్తిని తనలోకి తాను ముడుచుకొని, ఒక దిగులుమేఘం కప్పేసిన స్థితిలో నిశ్శబ్దం లోకి జారిపోయేలా చేస్తుంది అన్న స్పృహ నుండే జయప్రద తన యాత్రాచరిత్రకు శిశిరంలో మాస్కో అని పెట్టివుంటుందని యాత్రాచరిత్రలో భిన్న సందర్భాలలో వ్యక్తమైన ఆమె మనోభావాలను బట్టి అనుకోవచ్చు.
1.6 కురుగంటి శ్రీలక్ష్మి ఉద్యోగరీత్యా చైనా వెళుతున్న కొడుకు కుటుంబంతో కలిసి వెళ్లి 2004 జూన్ నుండి 2005 జనవరి వరకు అక్కడ గడిపిన ఆరునెలల కాలంలో చైనా గురించి వినీ, చూసి తెలుసుకొని పొందిన అనుభవాలను అందరితో పంచుకొనటానికి చేసిన రచన ‘షంఘై నింగిలో అనుభవాల హరివిల్లు’.ఎక్కడికెళ్లినా ‘నా’ అన్నది దూరం చేసి ‘మన ‘ అని కలుపుకొన్నప్పుడు పొందే ఆనందంలో భాగంగా వచ్చిందీ రచన అంటారామె. హాన్ కాంగ్ లో, షంఘై లో తాను చూసిన ప్రతిప్రాంతంలోకి తనవెంట మనల్ని తిప్పుకొంటూ విశేషాలు వివరిస్తున్నట్లుగా ఉంటుంది ఆమె కథనం.
అక్కడ అన్ని పనులలో స్త్రీలు చురుకైన భాగస్వాములుగా ఉండటం, టాక్సీ డ్రైవర్ల నుండి ఇంట్లో వస్తువులను రిపేర్ చేసే నిపుణులలో ఇంటిపనిలో సాయపడే వాళ్ళలో పనితనం, సహృదయత, నిజాయితీ ఆమెను ఆకర్షించిన విషయాలు. చైనా పరిస్థితులు, సమస్యలు మనదేశంతో సరిపోలుతున్నాయి కనుక కొత్తదేశానికి వచ్చినట్లు అనిపించలేదు అంటుంది శ్రీలక్ష్మి.
ఆమె తెలుగు భాషా సాహిత్య విద్యార్థి. అధ్యాపకురాలు. పరిశోధకురాలు. చైనా భాష సంస్క్రుతు లకు సంబంధించిన పుస్తకాలు చదవటమే కాదు స్థానిక ప్రజలతో భావాలను పంచుకొనటానికి అవ రోధంగా ఉన్న భాషా సమస్యను పరిష్కరించుకొనటానికి నేర్చుకొనటమే మార్గం అనుకొన్నది . ఒక పంతు లమ్మను ఏర్పరచుకొని మరీ చైనా భాష నేర్చుకొన్నది. ఆ సందర్భంగా ధ్వని ప్రధానమైన చైనా భాషా కుటుంబంలోని ఎనిమిది విభాగాలను తెలుగు భాషా విధానాలతో పోలుస్తూ చెప్పిన తీరు , లిపి విధానాన్ని, పేర్లలలో ఇంటిపేరుకు ఉండే ప్రాధాన్యాన్ని, తెలుగులోలాగానే చైనా లో బంధుత్వ సంబంధ వాచకాలు ఉండటాన్ని, స్వర స్థాయిని బట్టి అర్ధం మారటాన్ని , భావం అర్ధం అవటం అన్నది ప్రధానంగా వాక్య నిర్మాణం ఉండటం – మొదలైనవి ఆసక్తికరంగా చెప్పబడ్డాయి. మంచి పాఠం వంటి కథనం ఇది .
దస్తూరి ద్వారా మనిషి మనస్తత్వాన్ని , తెలివితేటలను అంచనావేసే విధానం చైనాలో ఎక్కువ అన్నది మరొక పరిశీలన. అలాగే ఆమె జానపద సాహిత్య పరిశోధనా దృష్టి కూడా చైనా సాహిత్య సంస్కృతుల పరిశీలలో భాగమై కనబడుతుంది. షంఘై పర్వదినాలను గురించి చెప్తూ సెప్టెంబర్ నెలాఖరులో వచ్చే పెద్ద పండుగ వెనక ఉన్న కథ తెలుసుకొని దానిని చెప్పిన తీరు, విశ్లేషించిన విధం అందుకు నిదర్శనం. ఆ కథలో చైనీయుల జీవనవిధానం అంతా ఇమిడి ఉంది అంటారామె. చైనావారి పండుగలు చాలావరకు పౌర్ణమితో ముడిపడి ఉంటాయని, పెద్దలను గౌరవించటానికి, చనిపోయిన పెద్దలను తలచుకొనటానికి వీరులను తలచుకొనటానికి వేరువేరుగా పండుగలు ఉన్నాయని శ్రీలక్ష్మి ఇచ్చిన సమాచారం, వ్యాఖ్యానం జనజీవన సంస్కృతి మీద ఆమెకు ఉన్న ఆసక్తిని సూచిస్తాయి. బుద్ధుడి గుడులను చూస్తూ చైనీయుల మత తాత్విక చరిత్రను, భౌద్ధంతో ముడిపడిన జానపద కథలను ప్రస్తావిస్తూ చెప్పిన సందర్భాలను కూడా కలుపుకొని చూస్తే ఇది సాంస్కృతిక యాత్రా చరిత్ర అనిపిస్తుంది.
1.6. నిడదవోలు నుండి శారదా యాత్రా స్పెషల్ లో 80 మంది సహప్రయాణీకులతో పూరీ జగన్నాథ్ నుండి ప్రారంభించి కాశీ, గయా ప్రయాగలు, ఋషీకేశ్ బదరీ కశ్మీర్ జమ్మూ చూసుకొని ఢిల్లీ మీదుగా బొంబాయి, షోలాపూర్, పండరీపురం వరకు చేసిన ప్రయాణాల కథనం ‘నా ఉత్త్ర దేశ యాత్ర.’ రచయిత్రి దర్భాభాస్కరమ్మ. 1988 మే 2 నుండి జూన్ 10 వరకు నెలకు పైగా చేసిన పర్యటనలో రోజువారీ కార్యక్రమం తేదీలవారీగా కూర్చిన ఈ రచన 2013 లో వచ్చింది.
ఆ తరువాత వచ్చిన యాత్రాచరిత్రలు విశ్వవిహారం, గిరిగమనం ప్రధానంగా ప్రకృతి ప్రయాణ గాథలు.
1.7.విశ్వవిహారం రచించిన కంభంపాటి సీత వృత్తిరీత్యా జువాలజీ లెక్చరర్. సహచరుడు శ్రీనివాస్ వృక్షశాస్త్ర అధ్యాపకుడు. ఇద్దరూ వరంగల్ కళాశాలలోనే పనిచేశారు. యాత్రా వ్యసనం ఇద్దరికీ సమానధర్మం. వృత్తిగత ఆసక్తులతో ఆయా ప్రాంతాల వైవిధ్యభరితమైన వృక్ష జాతుల, పక్షి జాతుల జంతు జాతుల పరిశీలన వాళ్ళ యాత్రలలో భాగం అయింది. దానితోపాటే అరుదైన జీవ జాతులను సహజ సందర్భాలనుండి ఫోటోలు తీసి భద్రపరచడం.వాళ్ళ కార్యక్రమం అయింది.
పాతికసార్లకు పైగా హిమాలయాలలోని వివిధప్రాంతాలు తిరిగి వచ్చారు. కొండలు, గుట్టలు, జలపాతాలు, లోయలు, నదులు మంచునిండిన హిమ శిఖరాలు , హిమనీ నాదాల అద్భుత సౌందర్యాలు కలిగించిన అనుభవాలు, ఆనందాల కథనాలను వ్రాసి వివిధపత్రికలలో ప్రచురించింది సీత. వాటినుండి ఎంపిక చేసిన కొన్ని రచనల సంపుటి ‘విశ్వవిహారం’ . ఫ్లోరెన్స్ , రోమ్, వెనిస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మొదలైన విదేశ పర్యటనానుభవాలు కూడా ఇందులో ఉన్నాయి. రాహుల్ సాంకృత్యాయన్ రచనలలో లోక సంచారి, విస్మృత యాత్రికుడు తమను బాగా ప్రభావితం చేశాయి అంటుంది సీత. యాత్ర లేదా సంచారవ్యసనం అభిలషణీయమైన లక్షణమని , ప్రతిక్షణాన్ని అర్ధవంతంగా, ఉత్సాహంగా జీవించటానికి అది ఉపయోగపడుతుందని ఆయన వల్ల తెలుసుకున్నామని చెప్పింది ఆమె .ఆయా ప్రాంతాల ప్రజల జీవనరీతులతో భాషా సంస్కృతులతో జ్ఞానాన్ని విస్తృతం చేసుకొనటం యాత్రల వల్ల ప్రయోజనం అంటుంది సీత.
వరవరరావు ఈ పుస్తకానికి వ్రాసిన ముందు మాటలో దక్షిణాఫ్రికా ను చూసినప్పుడు రచయిత మానవులకే ఆద్యులైన తొలి మానవుల ను తలచుకొని రచయిత్రి వాళ్ళ పట్ల గౌరవాన్ని, ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తం చేసిన సందర్భాన్ని , అలెక్స్ హేలీ రచన ‘ఏడుతరాలు ‘ గుర్తుచేసుకొని ఆఫ్రికా బానిసత్వ చరిత్ర తలచుకొని దుఃఖపడ్డ సందర్భాన్నీ ప్రస్తావిస్తూ నరజాతిచరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న చారిత్రక అవగాహన సీతకు ఉండటటం జాతుల వలస వ్యతిరేక పోరాటాల చరిత్రతో కొనసాగే వర్తమానం తో ఉన్న సంబంధం వల్లనే సాధ్యమైంది అన్నారు.
1.8.సీతకు లాగానే గిరిజది కూడా సంచారవ్యసనమే. పర్వతాలు, లోయలు చుట్టివచ్చే ట్రెక్కింగ్ తో కూడిన సాహసయాత్రలు ఆమెవి. పలు ప్రదేశాలకు ఆమె చేసిన అనేక ప్రయాణాల కథనాల సంపుటి ‘గిరిగమనం’ జీవితాన్ని ఆనందంగా , సంతృప్తిగా గడపడమనేది ప్రయాణాలవల్ల వస్తుంది అంటుందామె. ఆధ్యాత్మిక చారిత్రక యాత్రలకన్నా ప్రకృతిలోకి ప్రయాణం ఆమెకు ఇష్టం. ఆ ప్రయాణంలో తటస్థపడే ఆధ్యాత్మిక చారిత్రక ప్రత్యేకతలను గమనించటం , తెలుసుకొనటం, అనుభవించటం అందులో భాగమే. 1.9. 2023 లో స్వర్ణ కిలారి సంపాదకత్వంలో వచ్చిన ‘ఇంతియానం’ కూడా ఈ కోవలో చేర్చదగినదే. ఇది ఒక స్త్రీ అనుభవ కథనం కాదు. 45 మంది రచయిత్రుల అనుభవాల కథనాలు. ఇంతులు అంటే స్త్రీలు చేసిన ప్రయాణాల అనుభవాల కథనాలు సమకాలపు స్త్రీలు, సాహిత్యరంగంలో ఉన్నవాళ్లు ఒంటరిగానో , కుటుంబాలతోనో, స్నేహ సమూహాలతోనో చేసిన యాత్రల అనుభవాలు .ఇందులో చూస్తాం .. ప్రకృతితో , సాహిత్యంతో, చరిత్రతో , సంస్కృతితో స్త్రీలు చేసిన సంభాషణగా వీటికి ప్రాధాన్యత ఉంది.