ప్రభుత్వం కల్లు లొట్టి మీది కాకి
గ్రాఫిక్స్ లో అరిచే అభివృద్ధిలా
ఎదుగుదలను అందంగా కత్తిరించిన
క్రోటన్ మొక్కల్ని దిగాలుగా చూస్తూ
రోడ్డు వెంట ఉదయపు నడక
పోలీస్ స్టేషన్ కరెంట్ ఆఫీసు
గాంధీ చౌక్ దాటి మున్సిపల్
ముందుకు వచ్చి చూశాను
అదే దృశ్యం అదే బతుకు చిత్రం
చలికి ఎండపొడను
వేడి చాయ్ లా తాగుతూ
పని కోసం ఊరు ఊరంతా కదిలి
సద్దిముల్లె పట్టుకొని నిలబడ్డది
ఇంటికి వచ్చాను
పిల్లలు నిద్ర నుంచి ఇంకా లేవలేదు
నెల ఖర్చులు తీసుకురాను
బ్యాంకుకు పోయాను తలుపులు తీయలేదు
మా ఆవిడ మాత్రం
పిల్లలు లేచి ఏమైనా తింటారని
చేత కాకున్నా ఉగతో శక్తిని
కూడగట్టుకొని పని చేస్తూనే ఉంది
మనుమలు మనుమరాండ్రు వచ్చిన సంతోషమని
అందమైన లేబుల్ ను
ఆమె పేరుకు మనం అతికిస్తామ్
ఇంత పొద్దెక్కినా పిల్లలు
ఇంకా లేస్తలేరెందుకని అడిగాను
ఈరోజు ప్రభుత్వం సెలవు ఇచ్చింది కదా
వంటింట్లోంచి మా ఆవిడి ముభావంగా
సమాధానం రొటీన్ గా చెప్పింది
పనికి సెలవు ఎవరు ప్రకటిస్తారు
ఒకవేళ ఇస్తే గిస్తే
ఈ మనుషులూ, ఇల్లూ, భూమీ
నానా బూజూ దుమ్ము తో
దిక్కూ దివానం లేక పాడుపడిపోతుంది
వెంటాడుతున్న ప్రశ్న
ఇవాళ్ళ నన్ను తొలుస్తుంది
సూర్యునికి లేబర్ అడ్డాకు ఆమెకు
రెండు చేతులా చేతులు జోడించాను