‘సృష్టికర్తలు’ కథ నేపథ్యం- 2

దాదాపు మూడేండ్లుగా జరుగుతున్న ఇలాంటి పోరాటాలల్లో నిండా మునిగి, కదిలిన ప్రజలేమనుకుంటున్నారు? జరుగుతున్న పోరాట క్రమం మీద వారి తాత్విక దృక్ఫథం ఏమిటి?

తిరుగంగ తిరుగంగ ఇట్లాంటివో రకరకాల ఆలోచనలు సాగుతూ ఉండేవి… అలాంటి పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న నాయకులు తలో రకంగా చెప్పేవాళ్లు.

భౌతికంగా జరుగుతున్న ఇలాంటి మహోధృతమైన ప్రజా పోరాటాలను తాత్వికంగా ఎట్లా అర్థం చేసుకోవాలి? కరీంనగర్ – ఆదిలాబాదు జిల్లాలల్లో జరుగుతున్న రైంతాంగ పోరాట నాయకులందరు దాదాపుగా నా క్లాసుమేట్సు, తెలంగాణ (మెుదటితరం) ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో(1969 -72) నాతో పాల్గొన్న సహచరులు- బయ్యపు దేవేందర్ రెడ్డి, పోరెడ్డి వెంకటరెడ్డి, శనిగరం వెంకటేశ్వర్లు, నల్లా ఆదిరెడ్డి, మా వీరన్న, నారాయణ క్లాసుమేట్లు, రూంమేట్లు. అప్పుడు దాదాపుగా మా అందరి కుటుంబాలు అందరికి తెలుసు. తిండి తిప్పలేకాక – ఒకల బట్టలు ఒకలం వేసుకునేంత దోస్తానే. మల్ల గీల్లే ఈ విప్లవోద్యమ నాయకులు. వీళ్లందరు, నాతరం వాళ్లందరు ప్రజలలాగే ఎక్కడో ఒకదగ్గర కలుస్తూనే ఉండేవారు. తెలంగాణలోనైతే విప్లవం ప్రతి కుటుంబంలో భాగమై పునాదులను కదిలించింది.

అట్లా మాస్ లైనును నిర్మించి – భూమార్గం పట్టించిన ఇలాంటి పోరాటకారులందరికి… పోరాటప్రాంతాలు- అక్కడి దొరలు, ప్రజలు – ఉత్పత్తివనరులు – తదితర అనేక విషయాలనుబట్టి- చైతాన్యాన్నిబట్టి – నాయకత్వ స్థాయినిబట్టి వేరువేరు అభిప్రాయాలుండేవి. కింది ప్రజలకేమో “గిదేదో అన్నలు జెప్పన సేత్తే బాగుండు” నని ఉండేది… పాలేర్ల స్థాయినుండి గొడ్డుకష్టం చేసివచ్చినవాళ్లు సంఘ నాయకులైనప్పుడు – మంచి బట్టలు, తీర్పాటం కోరుకునేటోల్లు. “దండుగలు వాపసులేంది? దొరలు డబ్బుదస్కం దాటిత్తండ్లు గుంజుకొంటేకాదా? గీ గవిరిమెంటు సెలుకలు, బంజరు భూములేంది? దొరల పట్టా భూములు ఆక్రమించుకోవాలని” కొందరు. “తొండలు గుడ్లు పెట్టని భూములు దున్నేం పాయిదా! గట్టుకు నెట్టెలు మోసినట్టు” అని మరికొందరు.

ఇలాంటి విషయాల వెనుకనున్న ప్రజల కోపం, కసిని అర్థం చేసుకోవాడానికి, రకరకాలుగా వ్యక్తమౌతున్న స్పాంటేనియస్ పోరాటాల స్వభావాన్ని అర్థం చేయించడానికి మావో “ఎనాన్ రైతాంగ పోరాటం నివేదిక” అందరం చదివేవాళ్లం. అందులో భూస్వామి ఇంటిమీద దాడిచేసిన ప్రజలు -పందిరి మంచం విరగొట్టిన రైతు గురించి వివరణ ఉంది. భూస్వాములు తమ నెత్తురు, శ్రమ దోచుకొని – నిర్మించుకున్న సౌకర్యాలు- విలాస వస్తువుల పట్ల ప్రజలకు ఎంతటి కోపం ఉండగలదో వివరిస్తుంది. ఈ ఘటనను విధ్వంసంగా చూడాలా? తరతరాల క్రోధంగా చూడాలా? వ్యవసాయ విప్లవంలో ఒకచోట అప్పటి విప్లవోద్యమ నాయకులు కొండపల్లి సీతరామయ్య రాస్తాడు “ప్రతి రూపాయికి ఎవరిదో ఒక శ్రామికుడి నెత్తురంటి ఉంటుంది” అని. ఏది హింస? అదనపు విలువ హింస. సంపాదన హింస. స్వంత ఆస్తి హింస. అంతిమంగా సమస్త ఉత్పత్తి దానిని ఆవరించి ఉన్న సాంఘిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలన్నీ హింస కేంద్రంగా పుట్టిపెరిగి కొనసాగుతున్నాయి. రైతుకూలీ సంఘం నాయకత్వంలో – భూ ఆక్రమణ, ప్రజా పంచాయితులు, దొరల సాంఘిక బహిష్కరణ – వేలాదిమంది అరెస్టులు, జైల్లు, కేసులు సాగుతుండగానే క్రూరులైన దొరలను వాని గుండాలను హతమార్చడం, దొరల పంటలు హస్తగతం చేసుకోవడంలాంటి పోరాట రూపాలు ముందుకు వచ్చాయి. క్రూరమైన హింసతో కొనసాగుతున్న భూస్వామిక సమాజపు పునాదులు కదలసాగినవి. 1979 మే నెల నుండి దొరలు సంఘటితపడి కార్యకర్తల పైన, సంఘం ముఖ్యులపైన పెద్ద ఎత్తున కేంద్రీకరించి దాడులకు సిద్దపడ్డారు. వర్షాకాలం పూనడంతో జూన్, జూలై కల్లా గ్రామాలన్నిమసులుతున్నాయి. చందాలు వేసుకొని దొరలు కార్యకర్తలను చంపడానికి ఏజెంట్లను, గుండాలను ఉసిగొల్పారు. చావోరేవో తేల్చుకునే దశకు చేరుకున్నారు. వారికి తోడు అన్ని గ్రామాలల్లో పోలీసు పికెటింగులు ఏర్పాటుచేసి పారా మిలటరీ దళాలతో గ్రామాలు వణకిపోయాయి.

జూలై 11, 1979 నాడు మా వూరి పక్కనేగల రామయ్య పల్లెలో – దారి విషయంలో జరిగిన తగాదా ఆసరా చేసుకొని భూస్వాములు, పోలీసులు కలిసి కుట్రపన్ని దాడి చేసి అనేక మందిని నిర్భందించి – ప్రజలందరిని స్త్రీ పురుషులని చూడకుండా, వయోభేదం లేకుండా రక్తాలు కారేదాక కొట్టారు. అనేక రోజులు స్త్రీలు, పురుషులు మా ఊరి గుడిమెట్టు అడవిలో తలదాచుకున్నారు. చాలామందిని, లాకప్పులలో పెట్టారు. రెండు రోజుల తర్వాత నేను ప్రజలను కలుసుకున్నాను. ఆ సంఘటన అరుణతారకు క్రాంతి పత్రికకు రిపోర్టు రాశాను. పేపర్లలో రామయ్యపల్లె ప్రజలు దోపిడి దొంగలుగా, దౌర్జన్యకారులుగా వార్తలు రాశారు.

రైతుకూలీ సంఘం నాయకుని భార్యను నేను అడిగాను. ఇట్లా పేపర్లలో రాసిండ్లుకదా అని “రాసినోడెవ్వడో? సూసినోడెవ్వడో – ఆని కాడుగాల- కాలికూలి కామునిపెంట గాను. లంగలు, దొంగలు, లఫంగులు మడత నలుగని సలువ బట్టలేసుకునేటోల్లు, సేతికి సెత్తకు మట్టంటకుంట తిర్గినోడు ఎకరాలకెకరాల భూములు ఎడ్లు ఎవసాయం సాకర్లు, పాలేర్లు సంపాయించిండ్లు. వాళ్లనేమనరు ఆళ్ల సంకనాక్కుంట కిందికుండ కిందుండంగనే మీదికుండ మీదుండగనే నడిమికుండ తప్పదీసే సదువుకున్న గాడ్ది కొడుకులు గది తప్పనరు. మట్లె మన్నయి బుక్కెడు బువ్వకోసం, కాసంత నీడకోసం, ఇగో గిన్ని పుల్లెందులు బడితె – అగో పెయ్యన్ని దెబ్బలు.” ఎర్రతేలులాంటి ఆమె శరీరం నిండా వాతలు – ఆమె ఇంకా మాటలు రాక ఏడుస్తూ- పిల్లపిల్ల తరాలను సాపిచ్చింది. ఆని ఇంటిమీద మన్నువొయ్యనని దొరలను తిట్టింది… నాకుసరీగ చెప్పరాక నాకు కళ్లల్లో నీళ్లు… ఇప్పటికీ ఆ దుఃఖం నాలో నుండి ఇంకా పోలేదు. దేశమంతా తిరుగుతూ ఉంటే ఇంకా పెద్దదయ్యింది. మల్ల ఇసంపేట కుక్కలగూడూరుకు పోయిన. అక్కడ మా సడ్డకునింట్ల అనుకోకుండ బయ్యపు దేవేందర్ రెడ్డి కన్పిచ్చిండు. నా మనసుల మెదులుతున్న సంగతులన్ని ఆయనకు చెప్పిన… ఆయన నాయకత్వంలో జరిగిన పోరాటాలన్ని అప్పటికి దేశవ్యాప్తంగా ప్రచారమయ్యాయి. ప్రాలెం, రాఘనేడు లాంటి అనేకచోట్ల ఇప్పటికి కథలు, కథలుగా చెప్పుతరు…

“అసలు మీ పోరాటంల ముందున్న ప్రజలేమంటండ్లు? మీరు సెయ్యవట్టె సెక్కర్లవడ్డమంటండ్లా! బయట దొంగలు, ఉగ్రవాదులుగా పేపర్లు రాత్తండ్లు గదా” అన్న.

“ఔనా! ఎవల ఫాయిదాబట్టి వాళ్లంటరు” అని, “సుల్తానాబాదు కోర్టుల ఒకరైతు జడ్జితో అన్నమాట ‘దొరా! మేం పంట పండిచ్చెటోల్లం కని నాశిడం చేసేటోల్లంగాదు. మా నెత్తురంత దారవోసి పంటల బెంచినట్టుగనే దొరలను బెంచినం. దునియకంత బువ్వబెట్టెటోల్లంగని సంపెటోల్లంగాదు’ అన్నడు” అని చెప్పి అయన పనిమీద వెళ్లిపోయిండు. నేను అట్లాగే కూర్చుండి పోయిన. ఆ రాత్రి నిదురపోలేదు. తెల్లందాక ఆ రైతే గుట్టలు ధనలిచ్చెటట్టు ఆ మాట చెప్పుతున్న కలలు. గీ మాట నాకెందుకు దోసకపాయె. మర్సిపోతనేమోనని కల్సినోల్లకల్ల చెప్పిచెప్పి నోటికచ్చింది.

గట్లనే ఎక్కన్నో తిరగంగ మరో పది దినాలకు ఇంకో నాయకుడు గల్సిండు. ఇగో గీనే నీకు జెప్పుతడన్నడు రైతుకూలీ సంఘ నాయకుడు ముంజం రత్నయ్య… అయినె పేరు రఘు అని చెప్పిండ్లు. అయినె నన్నుచూసి నవ్విండు. అయినె నాకెరుకే – మా తమ్మునితోని సదువుకున్న నల్లా ఆదిరెడ్డి.

సరే రామయ్యపల్లె నుంచి మొదలేసి చెప్పిన. ఆయనకు టైంలేదు. అయినా మధ్యమధ్య మన వివరాలు అడుక్కుంట విన్నడు. “నిజమే” అన్నడు. ఏది నిజమో నాకు తెలువలేదు. “తెలంగాణ సాయుధ పోరాట కాలంలో లాగా అన్ని ఊళ్లల్లో సమస్యలున్నయి గనుక మనం విప్లవోద్యమంలో భాగంగా అంచెలంచెలుగా ఆర్గనైజు చేసినం గన్క పోరాటాలు లేచినయి. అవి అనేక సమస్యలను మందుకు తెచ్చినయ్. దాదాపు మూడు సంవత్సరాలు అనేక పోరాటాలు రకరకాలుగా నడిచినయ్. ప్రజా సంఘాల పోరాటాలు వెనకటి పద్ధతిలో, స్థాయిలో మరింక కొనసాగలేవు. దొరలు ఊళ్లు విడిచిపోక తప్పదు. వాళ్ల ప్రయత్నంలో వాళ్లున్నరు – ఇదంతా ఇట్లానె నడిస్తే దేశవ్యాపితం అవుతుందని ప్రభుత్వం అన్ని రకాలుగా రంగంలకు దిగింది. దీంట్లోనుంచి ఎదిగచ్చిన నాయకులను కాపాడుకోవాలె. గ్రామాలను కాపాడుకోవాలె. అంటె స్పాంటేనియస్ పోరాటాలు, రాజకీయ పోరాటాలు కావాలి. రైతుకూలీ సంఘాల స్థానే ప్రజా రాజ్య కమిటీలు రావాలె… ఏమిలేదు. గుణాత్మకంగ గెంతు. ఆర్థిక పోరాటాల స్థాయి నుండి రాజకీయ పోరాటాలుగా అభివృద్ధి చేయాలి. ఆర్థిక రాజకీయ తాత్విక సాంప్రదాయిక భావజాలాన్ని ఎదుర్కొని ఓడించాలె” నన్నడు.

ఆయన వెళ్లిపోతున్నడు. నాకేదో తోచింది.

“సృష్టికర్తలు” అన్న.

“సంస్కృతమా” అన్నడు నవ్వి.

నాకు షేకండిచ్చి వెళ్లిపోయిండు… నేను చూసిన గాయాల నొప్పుల మనుషులందరు ఒక్కటైపోయి సృష్టికర్తలైనట్టు ఏవేవో కలలు కల్పనలు…

7.

ఆగస్టు నెలంతా కన్పించినోల్లకల్లా చెప్పుకుంట తిర్గిన పిస్సలేసినోని తీర్గ – మా జగదాంబ హోటల్ నారాయణ నాయర్ కు అర్థంగాకున్న కౌగలించుకున్నడు. డ్రైవర్లు, రైతులు, కార్మికులు, వాచ్ మన్ లు – ఎవరికి పడితె వారికి చెప్పుడే చెప్పుడు “అరె భయ్ వీళ్లు పంటలు దీసేటోల్లు” అని… ముదిపోయింది. రాయకపోతే, ఆ వొత్తిడిలనే ఉంటే… ఇగో అట్ల కథ రాయాలనుకున్న. కథ చెప్పుడు వీజీగాని రాసుడంటే మాటలుగాదుగదా!.. మళ్లా తిప్పల్లు మొదలైనవి…

ఇవ్వన్నీ నిజ సంఘటనలు. ఇయ్యన్నీ రాస్తే వ్యాసం అవుతుంది గాని కథ కాదు కదా… పైగా కిరికిరి. అప్పటికే చానా కథలు రాసినగని మళ్ల ఏ కథ రాయలన్నా అదే తిప్పలు…

విషయం ఖాయమయ్యింది. అదేమంటే సృష్టికర్తలు… గద్దర్ అన్నట్టు భూమిని తలకిందు జేసి బువ్వ పంచిపెట్టెటోళ్లు… వాళ్లెవరో నాకు తెలుసు. పాత్రలు తీసుకోవాలంటే మా వూరివాళ్లే చాలా మంది లైనుగా నిలుసున్నరు. రామయ్యపల్లె ఇసంపేట, కుక్కల గూడూరు, మద్దునూరు, వెన్నంపల్లి, కునారం, ఎంతో మంది… బాపురే! వనికి పోయిన. వీళ్లందరిని నేను రాయగలనా? ఎవరి గురించి రాయాలి? పైగా వీళ్లంతా యుద్ధరంగంలో ఉన్నారు. ఆగమాగంగ గుట్టలు, అడవులు బట్టి ఉన్నారు. కోపంగా ఉన్నారు. దుఃఖంగా ఉన్నారు. మారే నావల్లకాదు… వాళ్లు ఒకల మాట ఒకలకు తెలువకుండా మాట్లాడుతున్నారు. వీళ్లందరి కోపాలను, దుఃఖాలను కడుపుల బెట్టుకొని- నొప్పితో తిరుగంగ యస్. దేవేందర్ రెడ్డి చెప్పిన రైతు కన్పించిండు. ఆయన ఆ మాటైతే చెప్పిండుగని మిగతా రైతులందరికి ఆ మాట చేరుతుందా? లేదు. కొసా మొదలు లేని ఆ మాట చేరదు. దానికి కొసా మొదలు కావాలి.

అలాంటి కొసా మొదలు ఎరిగి – విఫలమై కూడా- నిలబడినవాడు కావాలి… అంటే లోపల కూలిపోతున్న దానిలో దాన్నికూల్చి కొత్తగా నిర్మాణమౌతున్నదాన్ని అనుభవించినవాడు కావాలి. అదనుకోగానే రత్నయ్య నామదిలో మెదిలిండు. ముంజం రత్నయ్య. కుదిమట్టంగా లోలోపల ఎన్నున్నా తొనకకుండా, బెనకకుండా నిలబడిన రత్నయ్య. కాని ఈ సందర్భంలో ఈ స్థలంలో ఆయన చెప్పడు. చెప్పినా “పోవయ్యా అయినె నక్సలైటు – గా మాటలు చెప్పకుంట వేరే చెప్పుతడా?” అంటరు మంది.

అయిపోయింది… మరింక నాకు కథ రాయడం వశం గాదనుకున్న. అప్పుడు గుర్తొచ్చిండు. గాలం చేపలు పట్టడానికి రోజల తరబడి వెన్నంపల్లి చెరువు అలుగుల్ల ఇద్దరం – ఊడలుదేలిన బొమ్మేడి చెట్లకింద – తన సమస్త కుటుంబం చెల్లాచెదురై (‘చేపలు’ కథలో చిత్రించిన) తన కండ్ల ముంగటనే తన సహచరిని ఇంకోడు ఉంచుకొని- అతని కంఠంలో బాధ ధ్వనించేది కాదు… అనుముల సమ్మయ్య, కొట్టె ఓదెలు… వీళ్లంతా కలిసి” బర్ల ఓదన్నగా” రూపు కట్టారు. మొదట ఓదన్న కన్పించే సరికి నా కండ్లు బైర్లు కమ్మినయ్. ఆయన మళ్లా రకరకాలుగా కన్నించేటోడు. ఒకసారి ముంజం రత్నయ్య లాగా, మా నాయిన అల్లం నర్సయ్యలాగా, మా పిస్స చిన్నాయినె అల్లం రామన్నలాగా! ఓరినాయినో! మరోసారి దేవేందర్ రెడ్డి, నల్లా ఆదిరెడ్డి, హోటల్ నాయర్, గజ్జెల గంగారాం… ఆఖరుకు కొండపల్లి సీతారామయ్య లాగా కన్పిచ్చాడు. లోపల ఒత్తిడి పెరిగింది. గిన్ని తీర్ల కనిపిస్తే ఎట్లా చిత్రించేది. ఇట్లాంటి కథలు కాయిదం మీద పెట్టకపోతే, అవి ఎన్ని రూపాంతరాలు చెంది – అనతి కాలంలోనే పిచ్చిలోకి మారడం ఖాయం.

పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

Leave a Reply