మూలం: మోసబ్ అబూ తోహా
తెలుగు: ఉదయమిత్ర
డాక్టర్ సాబ్
నా చెవిని తెరిచేటప్పుడు
సున్నితంగా పరీక్షించండి
లోలోపలి పొరల్లో
మా అమ్మ గొంతు తచ్చాడుతుంటది
అప్రమత్తత వీడి
సోమరితనాన మగ్గే సమయాన
అందులో
ఆమె హెచ్చరికలు ప్రతిధ్వనిస్తుంటవి
ఈ చెవిలో
అరబ్ పాటలు తారసపడ్తాయి
నాకై నేను పాడుకున్న
ఇంగ్లీషు కవితలు వినబడ్తాయి
మా పెరట్లోని
పక్షుల కిలకిలారావాలు అలరిస్తాయి
డాక్టర్ సాబ్..
గాయాన్ని కుట్టేసేటప్పుడు
అన్నింటినీ
నా చెవిలో కూరడం మరువొద్దు
షెల్ఫ్ లో పుస్తకాలు పేర్చినంత భద్రంగా
జ్ఞాపకాలు పేర్చాలి
డ్రోన్లు రొదలూ
FIG విమాన గర్జనలూ
ఇళ్ళు మీదా, భవనాల మీదా
పేలుతున్న బాంబులచప్పుళ్ళూ
ఎగురుతున్న రాకెట్ల చప్పుళ్ళూ
అన్నింటినీ
నా కర్ణభేరి నుండి దూరం చేయండి
గాయాల మీద
నవ్వుల ములాము పూయండి
చిట్లిన నరాల్లో
జీవన సంగీతం నింపండి
డాక్టర్ సాబ్
నామనసు నీతోపాటు
పగలూ రాత్రీ నృత్యం చేయడానికి
మృదంగాన్ని మృదువుగా వాయిచండి.
*
పిల్లల ముఖాలే దేశపు ముఖచిత్రాలై నప్పుడు
మూలం: మౌమితా ఆలం
తెలుగు: ఉదయమిత్ర
కేవలం
ముఖం మీద 55 కుట్లు
గొంతులో పైపు
అంతే .
పిల్లల ముఖాలే
దేశపు ముఖచిత్రాలైన చోట
దేశపు రేఖలు
చెంపల నుండి దంతాలను
కుడికన్ను నుండి ఎడమ కన్నును వేరు చేస్తాయి.
గొంతులో పైపు
అన్నవాహిక అవుతుంది
కేవలం
55 నుండి 75 కుట్లు మాత్రమే
దుర్భర మారణకాండలో
పిల్లల కుట్లేసిన ముఖాలే
దేశపు ముఖచిత్రాలైనప్పుడు
ఎవరు
ఎంతగా లెక్కిస్తారూ…