(తెలుగు సాహిత్య రంగంలో సుంకిరెడ్డి నారాయణరెడ్డి చిరపరిచితమైన పేరు. కవిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా, సృజనాత్మకమైన సాహిత్య కారుడిగా గత యాభై ఏళ్లుగా తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవ వెలకట్టలేనిది. ‘ఈ తరం యుద్ధ కవిత’, ‘బహువచనం’, ‘మత్తడి’, ‘ముంగిలి’ సుంకిరెడ్డి కృషితో వచ్చిన అత్యద్భుతమైన కవితా సంకలనాలు. ఈ పుస్తకాలు తెలుగు సాహిత్య ప్రపంచాన్ని ఒక ఊపు ఊపాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మహోన్నతమైనది. “తెలంగాణ చరిత్ర” రచయితగా చాలా వాస్తవాలను వెలికి తీసారు. నిత్య చైతన్యశీలిగా ఆయన సాహితీ ప్రస్థానం నేటి తరానికి ఆదర్శ నీయమైనది. ఎన్నో సాహిత్య సంస్థల నిర్వహణలో తానే అన్నీ అయి, కీలక పాత్ర పోషించారు. నేటి కాలపు సాహిత్య వైతాళికుడు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డితో… కవి, విమర్శకుడు డాక్టర్ పగడాల నాగేందర్ సంభాషణ ఇది.)
- కవిత్వమైనా విమర్శనయినా ప్రధానంగా ఎందుకు రాస్తారు?
రెటీనాల్లో ఒక నీటి ఛాయ కదిలినప్పుడు, పెదిమెల వెనుక అదిమిపెట్టలేని ఆగ్రహం, ఆవేదన ఆవహించినప్పుడు, అలాంటి అనేక ఉద్వేగాలు గుండె ఫంక్షనింగ్‌లో సవ్యాపసవ్యాలు సృష్టించినప్పుడు ఎవరితోనైనా షేర్ చేయాలనుకుంటం ఎవరమైనా. నేను స్వతహాగా అంతర్ముఖుణ్ణి కనుక అక్షరాలతో పంచుకుంటననుకుంట. ప్రజ్వలించే అలజడులను, సంఘర్షణలను పంచుకోలేక పంచన ఉంచుకోలేక పేరుకపోయి ఎప్పుడో ఒకప్పుడు కవితగా పటీల్మంటదనుకుంట. అస్తిత్వ ఉద్యమాలకు ముందు, తెలంగాణ ఉద్యమానికి ముందు విమర్శనా వ్యాసాలు పెద్దగా రాయలేదు ఎం.ఫిల్ కోసమో, పి.హెచ్.డి కోసమో రాసినవి చాలా ఉన్నా అవి ప్రైమరీ లెవల్, లెక్కకు రానివి. అస్తిత్వోద్యమాలకు పూర్వం ఉన్న విప్లవ దృక్పథంతో బాధ్యతతో రాసినవి ఒకటి రెండున్నవి. ‘‘శేషేంద్ర విప్లవ కవి కాడు’’ అనేది, గురజాడ, శ్రీశ్రీ, శివారెడ్డి మీద రాసినవి అవి. 1992లో ఆంధ్రప్రభలో రాసిన వ్యాసం సాహిత్య పరిణామంలో ఒక ముఖ్యమైన వ్యాసమనుకుంట. అస్తిత్యోద్యమాల (దళిత బహుజన, ముస్లిం, తెలంగాణ)తోనే సీరియస్‌గా నేను రాయవలసిన అవసరమేర్పడిందనిపించిందేమో? ఈ దశలోనే నేను విమర్శ రంగంలోకి నాది కాని రంగంలోకి – ఎందుకు అడుగుపెట్టాననే ప్రశ్న తలెత్తుతుందనుకుంట.
ఉస్మానియా యూనివర్సిటీ వాతావరణం, మార్క్సిజం నన్ను బాధితుల పక్షాన నిలబడేటట్టు చేసింది. బహుశ దాని కొనసాగింపుగానో, తాత్విక దృక్పథంలో వచ్చిన మార్పు కారణంగానో బాధితుల్లో భాగమైన దళిత, బహుజన, ముస్లింల పక్షం వహించిన. ‘బహువచనం’, ‘జల్జలా’ ‘జగ్నేకా రాత్’ ముందు మాటల్లో, ‘ఆజ్రా’ సమీక్షలో తీవ్రంగానే స్పందించిన. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ‘‘గనుమ’’ వ్యాసాలు అనంతర వ్యాసాలు. ఎవరైనా వచ్చి నన్ను రీప్లేస్ చేస్తారని ఎప్పట్నించో ఆశిస్తున్న. నాగేందరో, నారాయణ శర్మనో… నన్ను విముక్తం చేస్తరని ఆకాంక్షిస్తున్న.
- తెలుగు సాహిత్యంలో కవిగా గుర్తింపు కోరుకుంటారా? విమర్శకుడిగానా? పరిశోధకుడిగానా? మీ కిష్టమైన ప్రక్రియ ఏది?
గుర్తింపు కోరుకుంటే రాదు. కాంట్రిబ్యూషన్‌ను బట్టి వస్తది. దాని ప్రాధాన్యతను బట్టి వస్తది. కోరుకోకుంటనే మహాస్వప్నకొచ్చింది. ఐదు దశాబ్దాలు కవిత్వానికి దూరంగా ఉన్నా వచ్చింది. కొందరికి అదే వస్తది. కొందరు తెచ్చుకుంటురు. అనేకానేక కారకాలుంటవి.
చేసిన పనికి తగిన ప్రతిఫలం ఆశించడం సహజ న్యాయం. సహజ న్యాయం అన్ని వేళల్లా ఒకే విధంగా జరుగదు. పారవేసేవాడికి, తట్టమోసేవాడికి పెద్ద కూలీ ఉండదు. పరిశోధకుడు, విమర్శకుడు ఇలాంటి వాళ్ళే. ‘‘మత్తడి’’ వేస్తున్నపుడు ‘ముంగిలి’ రాస్తున్నప్పుడు గమనించిన. ఎంతో గొప్ప పండితులూ, ఎంతో విశ్లేషణా ప్రతిభ ఉన్న విమర్శకులూ వాళ్ళు కవిత్వం రాయకపోతే పై గ్రంథాల్లో చోటు లభించలేదు. నిజానికి వాళ్ళ కృషి చాలా గొప్పది. కొన్ని పద్యాలు, కొన్ని కవితలు రాసిన వారికి చోటు దొరికింది. కవికుండే గ్లామరది. కవి ప్రజలతో నిత్య సంవాదిగా ఉంటడు. వాళ్ళ మధ్య ఏదో రసాయనిక స్పందన ప్రతి స్పందన ఉంటది. పరిశోధకుడికి, విమర్శకుడికి కొంతమందితోనే చర్య, ప్రతిచర్య ఉంటది. నా ప్రేయసి కవిత్వమే.
- ఎందుకు మీరు సాహిత్యంలో ఇన్ని ప్రక్రియల్లోకి విస్తరించారు? వివరంగా చెప్పండి?
ప్రవేశమే మనిష్టం. విస్తరించడం మనిష్టం కాదు. కాలం డిమాండ్. సమాజం డిమాండ్. తెలంగాణ సమాజంలో తొలి నుంచీ అదే పరిస్థితి. కవిత్వంతో కరచాలనం చేసిన సురవరం అనేక ప్రక్రియల లోతులు చూడవలసి వచ్చింది. బూర్గుల, ఆదిరాజు, రామరాజు, వరవరరావు అదే పరంపర. ఒక్కరే సహస్ర కిరణాలతో చుట్టి రావలసి వచ్చింది. నాటికే కాదు నేటి దాకా. ఇన్ని అనడంలో కవిత్వం, సంపాదకత్వం, విమర్శ, పరిశోధన, సంస్థల నిర్వహణ అని నీ ఉద్దేశం కావచ్చు. మళ్ళీ అదే అంటున్న ణవఎaఅస శీట షశీఅ్‌వఞ్
- కీలకమైన దశల్లో మీరు అనేకమైన పుస్తకాలకు సంపాదక బాధ్యతలు వహించారు కదా! మీకు తృప్తినిచ్చిన వర్క్ ఏది?
ఏ బిడ్డ యిష్టం అంటే తల్లి ఏం చెప్తది? ఏ కొమ్మ ఇష్టం అంటె చెట్టు ఏం చెప్తది? యానగాలి, బహువచనం, మత్తడి, సురవరం వ్యాసాలు… అన్ని పేగుబంధాలే. Escalated from me, by me. Escalations to me. Esclations to Telangana,dalith,bahujana,muslim. అన్ని పార్శ్వాలను స్పృషించిన. నాలోని అన్ని పార్శ్వాలను అవి స్పృషించినవి. my life work ”Matthdi” but live work ‘Bahuvachanam’ as an editor.
- మీ బాల్యం, చదువు, సాహిత్యం వైపు రావడం ఎలా జరిగింది? వివరంగా చెప్తారా?
మా వాళ్ళలో చదువుకున్న వారే లేరు. మా అమ్మ నిరక్షరాస్యురాలు. మా నాయిన పక్క వూళ్లో ఇబ్రహీం పంతులు దగ్గర గిద్దెలొరుసు,బొట్లొరుసు కొద్దిగా చదివడం రాయడం నేర్చుకున్నాడట. మా వూళ్లో ఆ మాత్రం చదువొచ్చిన ముగ్గురు నలుగురులో ఆయనొక్కడట. అయితే మా అమ్మ వినికిడి జ్ఞానంతోటి గొప్ప కథా రచయితలాగా జానపద కథలు చెప్పేది. బతుకమ్మ దినాల్లో పదాలు పాడేది. మా అమ్మ వెంట బాగోతాలకు శారద గాండ్ల కథలకు వెళ్లేవాణ్ణి. మా వూ ం్ల మల్లారెడ్డి అనే నిరక్షరాస్యుడు అశువుగా పదాలు అల్లేది శిరుతలాటల్లో కోలాటాల్లో. ఆ నృత్య రూపాల్లో నేను పాల్గొంటూ అందరితోపాటు వంతపాడేది.
బాల్యం నుంచి నా రంగు, రూపం కారణంగా పొందిన అనాదరణ, అవహేళనలతో పొందిన బాధ నన్ను అంతుర్ముఖుణ్ణి చేసినది. ఆత్మన్యూనతకు లోనుజేసినది. బహుశా దాన్ని అధిగమించటానికి, జయించటానికి పుస్తక పఠనంలోకి వెళ్ళి ఉంటాను. ఆ పఠనం నన్ను సాహిత్యంలోకి నడిపించి ఉంటుంది.
8వ తరగతి నుంచి 10 వరకు సత్యనారాయణ ండ్డి, కనకాచారి, సోమేశ్వర్రావు లాంటి తెలుగు సార్లు నన్ను కల్టివేట్ చేసి ఉంటరు. సైన్స్, ఇంగ్లీషు, లెక్కల సబ్జెక్ట్‌లలో ఫెయిలయినా తెలుగులో ఫస్ట్ వచ్చేవాడినని అందుకని సత్యనారాయణ రెడ్డి సార్ నన్ను క్లాస్ లీడర్ చేసిండని అప్పటి నా క్లాస్‌మెట్ ఇటీవల నాకు చెప్పిండు. అట్లా తెలుగుపట్ల ఆసక్తి ఏర్పడి ఉంటుంది. నేను టెన్త్‌లో ఉన్నపుడే మా రూంమేట్స్ అయిన బి.ఏ వాళ్ళకు తెలుగు వ్యాకరణం, ఛందస్సు చెప్పేవాడిని. ఆ ఆసక్తి కారణంగానే మా నాయిన డాక్టర్‌కు సంబంధించి చదవమని చెప్పినా బి.పి.సి.లో సీట్ వచ్చినా ` ఇంటర్లో స్పెషల్ తెలుగు గ్రూప్ తీసుకున్న. బి.ఏలో స్పెషల్ తెలుగు తీసుకున్న. మా నాయిన చదువు ఆపేసి వ్యవచేసుకుంటూ కాంట్రాక్టులో ఏవో చేసుకొమ్మని చెప్పినా వినకుండా, మిత్రులు పెద్దలు పనికిమాలిన తెలుగుతో ఎందుకు పొలిటికల్ సైన్స్‌తో ఎం.ఏ చేయమని సలహా ఇచ్చినా వినకుండా ఆ పనికి మాలిన తెలుగు ఎంఏలోనే చేరిన. బహుశా ఇదంతా సాహిత్యం పట్ల గల ఆసక్తితోనే జరిగిందనుకుంట. కాకతీయలో సీట్ వచ్చినా సి.నా.రె. మీది ఆకర్షణతో ఉస్మానియాలో చేరింది కవిత్వం పట్ల ఆసక్తితోనే అనుకుంట. చిన్నప్పుడే పుస్తక పఠనంలో పడిన అని పైన చెప్పిన బహుశా అది ఎనిమిదో తరగతి నుంచి మొదలైంది. అప్పట్నుంచి నల్లగొండ జిల్లా గ్రంథాలయంలోని పుస్తకాలు, మామేనమామ దగ్గరి పుస్తకాలు, మా ఊరి దొరోల్ల దగ్గర ఉన్న పుస్తకాలు మా కాలేజి గ్రంథాలయంలో పుస్తకాలు, కిరాయిషాపులోని పుస్తకాలు-ఇన్ని వనరుల నుండి ఎన్నో పుస్తకాలు చదివిన అట్లా చదివిన వాటిలో చందమామ కథలు, డిటెక్టివ్ నవలలు సెక్స్ నవలలు, జానపద నవలలు, చారిత్రక, సాంఘిక నవలలు ఠాగూర్ లాంటి వాళ్ళ కథలు, పత్రికలలో వచ్చే సీరియల్స్ గీతాంజలి లాంటి కొన్ని కవిత్వ పుస్తకాలు చదివిన.
9వ తరగతిలో నర్సింహాచారితో కలిసి ‘అతి రహస్యం’ అనే జానపద కథ రాసిన. అది స్కూల్ గోడపత్రికలో చోటు చేసుకుంది. దాన్ని అచ్చైన మొదటి రచనగా అనుకోవాలె. ఇంటర్లో సురేందర్ (ఇప్పుడాయన కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఇంగ్లీషు ప్రొఫెసర్) నేను కొన్ని కవితలను రాసినం కాని అవి ఏమైనవో గుర్తులేదు. డిగ్రీ ఫస్టియర్‌లో వీరారెడ్డి నేను పద్యాలు రాసినం. సీరియస్‌గా రాసింది ఎం.ఏ. కొచ్చిన తర్వాతే మా క్లాస్‌మెట్స్ తేలీవార్ సుభాష్, మర్రి విజయ రావు, నేను కవితలు రాసి వినిపించుకునే వాళ్ళం. మాకు ఒక సంవత్సరం సీనియర్ అయిన నందిని సిధారెడ్డి పరిచయంతో నా సాహిత్య ప్రపంచం విశాలమయింది.
అగో అట్లా ఇన్ని వైపులనుండి సాహిత్యంలోకి వచ్చిన
- కమ్యూనిజం ప్రభావం మీ మీద ఉందా? కమ్యూనిస్టు ఉద్యమాల వల్ల ఏమైనా మేలు జరిగిందా?
మా అమ్మమ్మ ఊరు కమ్యునిష్టు (అప్పటి సి.పి.ఐ.) గూడెం. అక్కడ నా బాల్యం చాలా గడిచింది. తెలిసీ తెలియని వయసులో మా మేనమామ (తెలుగు టీచర్) పుస్తకాలు తిరగేసి వాడినేమో. కాని నల్లగొండలో 7,8 తరగతుల్లో ఆర్.ఎస్.ఎస్. అదేదే గొలుసు చెక్క విన్యాసాల్లో విన్యాసాన్నయిన. ఆ ప్రభావంతోనే ఏమో లెనిన్ పుస్తకాల గట్టి అట్టల్ని చించి నా నోట్ బుక్కులకు అతికించుకున్న. మా నాయిన కాంగ్రేసు. ఒరిజినల్ కాంగ్రేసు. అయినా అప్పటి తెలంగాణ (1969)ఉద్యమంలో కాంగ్రెసు పోస్టర్లను చించేసి పార గుర్తు పోస్టర్లను అతికించిన. చకిలం శ్రీనివాసరావు హెచ్చరికలవల్ల నాయినతో చావుదెబ్బలు తిన్న. ఇంటర్. బి.ఏ.లో ఏం జరిగిందో యాదికొస్తలేదు. ఎం.ఏ. కోసం ఉస్మానియాలో చేరిన గదా అప్పుడు నండూరి ప్రసాదరావు ‘‘మానవ పరిణామం’’ పుస్తకం హేతువాదిగా మార్చింది. అదే క్రమంలో మార్క్సిస్టు పుస్తకాలు చదివిన. అక్కడ్నించి మార్క్సిజం ప్రభావం నా మీద ప్రగాఢంగా పడింది. చాలా ఏళ్ళు నేను వీర మార్క్సిస్టును. ప్రభుత్వ ఉద్యోగాలు చేయొద్దు. యూనివర్సిటీ ఉద్యోగాల్లో చేరొద్దనేంత వీర మార్క్సిస్టును. అప్పటి నుండి నన్ను వీడని ప్రేయసి అది.
ప్రశ్నలో రెండవ భాగం విస్తృతంగా సమాధానం చెప్పాల్సినది. ప్రపంచ వ్యాప్తంగా చూపిన కమ్యూనిస్టు ప్రభావం అందరికీ తెలిసిందే. తెలంగాణకు సంబంధించి విప్లవాత్మకమైన మార్పులకు అది దోహదం చేసింది. 1940 దశకం ప్రారంభంలో మొదలైన కమ్యూనిష్టు ప్రభావం 1946 సాయుధ పోరాటంతో ఉచ్ఛ స్థితికి చేరింది. భూస్వామ్య ఆధిపత్యాన్ని బద్ధలు చేసింది. రాచరికాన్ని తుదముట్టించింది. దున్నేవాడికి భూమి దక్కేట్టు చేసింది. ఆ దిశగా ప్రభుత్వం చట్టాలు చేసే అనివార్య స్థితిని కల్పించింది. గ్రామాల్లో జాగీర్దారీ విధానాన్ని రద్దు చేసింది. అయితే, 1) అనేకానేక కారణాలవల్ల సాంస్కృతికంగా భూస్వామ్య శేషాన్ని ధ్వంసం చేయలేక పోయింది. 2) ఇదంతా ప్రధానంగా దక్షిణ తెలంగాణకు పరిమితమైంది.
ఈ రెండు కర్తవ్యాలను పూర్తి చేసింది నక్సలైట్ పేరుతో రెండవ విప్లవోద్యమం. ఇది రెండవ కర్తవ్యాన్ని ఉత్తర తెలంగాణలో పూర్తి చేయగా, మొదటి కర్తవ్యాన్ని తెలంగాణ అంతటా పూర్తి చేసింది. ఫలితంగా అగ్రవర్ణ ఆధిక్యత క్రమేపి తగ్గు ముఖం పట్టి వెనుకబడిన కులాల చైతన్యం ముందుకొచ్చింది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మా వూర్లో రెడ్ల ప్రాబల్యం తగ్గడం బిసి కులాల ప్రాముఖ్యత పెరగడం. ఈ మార్పును కమ్యునిస్టులు ఉపయోగించుకోలేక పోవడం వల్ల ‘తెలుగు దేశం’ పార్టీ ఉపయోగించుకుంది. ఇది కమ్యూనిష్టుల వైఫల్యం. ఫలితంగా పోరాటంలోకి రావల్సిన వర్గం ‘‘ప్రధాన స్రవంతి’’ రాజకీయాల్లోకి వెళ్ళింది. అది అట్లా ఉంచితే ఇలా బి.సి.కులాలు ‘‘ఎదగడానికి’’ నక్సలైట్ ఉద్యమం అంటే కమ్యూనిజం దోహదం చేసింది. మొత్తంగా చూసినపుడు కమ్మ్యూనిస్టు ఉద్యమంలో ఎన్ని వైఫల్యాలున్నా అది పీడితులకు బాధితులకు గొంతుకనిచ్చింది. ఆ రకంగా దాని పాత్ర కాదనలేనిది.
- ‘‘ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్ సర్కిల్’’ ఈ తరం యుద్ద కవిత తీసికొచ్చిన వాడి రోజుల గూర్చి వివరిస్తారా?
ఈ విషయం గురించి చాలా వ్యాసాల్లో చెప్పిన. ఈ తరం యుద్ధ కవిత రెండో ముద్రణ ముందు మాటలో చెప్పిన. ఇంటర్వ్యూల్లో చెప్పిన. మళ్లీ చెప్పడం, చర్వితచర్వణం అవుతుంది. పాడిందే పాడడమవుతుంది. రైటర్స్ సర్కిల్ నడవడం గానీ ‘‘ఈ తరం యుద్ధ కవిత రావడం గానీ తొంబై శాతం నా పూనిక వల్లనే అని గర్వంగా చెప్పుత. అది చరిత్ర నా కిచ్చిన సదవకాశం. దాన్ని అందుకొని చరిత్రలోకి నడవడం నా చొరవ. తిరిగి చరిత్ర క్రమమే నా చొరవకు మూలం.
- మీ ఆలోచనా ధోరణికి, సాహిత్య రంగంలో ఇంతగా ఎదగడానికి నగ్జల్బరీ ఉద్యమం తల్లివేరా? మీ యువ హృదయాలపై నక్సలైట్ ఉద్యమం గాఢమైన ముద్రను వేసిందా? వివరించండి?
నా కెరీర్‌ను భ్రష్టు పట్టించిందీ, నా అస్తిత్వాన్ని శిఖరాయమానం చేసిందీ అదే. నాకు అంటుకున్న సిఫిలిస్ వ్యాధి కవిత్వం, కమ్యూనిజం. నా దేహంతోనే ఆ వ్యాధి అంతమవుతదేమో.
సూటిగా చెప్పాలంటే 6వ ప్రశ్న మరో రూపం ఈ ప్రశ్న. అది తాత్విక సంబంధి అయితే ఇది క్షేత్ర సంబంధ తొలి పఱంఱశీఅ ను ఇచ్చింది, ఈ ంండిరటి మిశ్రిత దృక్పథమే. బాధితుల పక్షాన నిలబడేటట్టు చేసిందది. అప్పటి మా తరాన్నంతా ఆక్రమించిందది. తెలంగాణ ఉద్యమంలో మిలిటెంట్‌గా భావజాల వ్యాప్తిని చేసింది అ తరమే. సాహిత్య రంగంలోనూ నిటారుగా నిలబడిరది ఆ తరమే. కోదండరామ్, గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, నారదాసు లక్ష్మణ రావు, రామలింగా రెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, నందిని సిధారెడ్డి, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, జయధీర్ తిరుమలరావు, కె. శ్రీనివాస్, అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, దేశపతి శ్రీనివాస్ ఎన్.వేణుగోపాల్, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, ఆయాచితం శ్రీర్, కె. ముత్యం, జింబో, వారాల ఆనంద్, కాసుల ప్రతాపరెడ్డి, గుడిపాటి, జగన్ రెడ్డి, ఇలా ఎందరెందరో… ఆ తరం.
- విపశ్యన కవిత్వం గాని ‘తోవ ఎక్కడ?’ కవితా సంపుటి గాని, ఏ సామాజిక తాత్విక సంఘర్షణలోంచి వచ్చినవి?
10.1985ల తరువాత అస్తిత్వ ఉద్యమాల వైపు ఎలా మొగ్గు చూపారు?
9,10. ప్రశ్నలు పరస్పర సంబంధం గలవి కాబట్టి రెండింటికి కలిపి జవాబు చెప్పే ప్రయత్నం చేస్త. 1985ను తెలుగు సాహిత్యంలో ఒక మలుపుగా సరిగ్గా గుర్తించినవు. ప్రభావరీత్యా మార్క్సిస్టు సాహిత్య ప్రభావం తగ్గుముఖం పట్టి, కొత్తగొంతులు పైకి లేస్తున్న కాలం అది. ప్రశ్నలు, సందిగ్ధతలు, సంశయాలు, నూతన ఆలోచనలు తలెత్తుతున్న కాలం అది.
‘‘ఇంకా తిమింగలాల్ని పట్టలేని జాలర్లుగానే ఉన్నాం’’.
‘‘లక్ష్యం చేదించకుండానే/అమ్ము బూమెరాంగ్‌లా వాపసొస్తుంది…
లక్ష్యాన్ని ఛేదించే బాణం కోసం/అన్వేషించక తప్పదు’’
‘‘లాంగ్ మార్చ్’’ దారితప్పి…/ ‘‘నెలబాలుడు’’ కరిగిపోయి
‘‘దారికడ్డంగా సాలెగూడు అల్లుకున్నమాట నిజం’’
‘‘మిస్సైల్ యుగంలో రెండు తుపాకులు ధరించిన వాడా…
రథాన్ని వదిలి అశ్వం పరి గత్తడం నీ పోరాటం. గమ్యం మారిపోయింది’’.
‘‘ఎటు చూసినా సూర్యుళ్లే/కానయితే ఎటుపాదం కదిపినా చీకటే’’…
‘‘అన్ని వేదనల్ని పలికిందా? మన రక్త గీతం’’
”Observing things as they actually are there”
ఇట్లా ఒక సందిగ్ధత, ఒక అన్వేషణ, ఒక వేదన, ఒక ప్రశ్న ఈ నేపథ్యంలోంచి
‘‘ముల్లుగుచ్చుకున్న పాదమే గొంతువిప్పాలి
అరిటాకే ముల్లుగురించి తీర్పుచెప్పాలె’’
‘‘దళం దళితం ఆయుధాని కిరువాదరలు కావాలె
‘‘ పలు పార్శ్వాలున్న అస్త్రం నేటి అవసరం’’
ఇట్లా అస్తిత్వవాదాల్లోకి పయనం. అయితే అప్పటికి కూడా విప్లవోద్యమం పట్ల మమకారం ఏదో మూలన ఉండే ఉంటుంది.
- ఈ పుస్తకాలు వచ్చిన తర్వాత వివిధ వర్గాల నుంచి మీపై వచ్చిన విమర్శలు ఏమిటి?
వీటిని స్వాగతించినవాళ్ళు ఉన్నరు. విమర్శించిన వాళ్ళూ ఉన్నరు. బాలగోపాల్ మీద వచ్చినట్టే నా లాంటి వాళ్ళందరి మీద వివిధ వర్గాల నుంచి తీవ్రంగానే విమర్శలు వచ్చినవి. విప్లవోద్యమం లోపలున్నవారు ఏ విమర్శ చేసినారో బయటకు తెలియలేదు గాని, విప్లవ రచయితల నుండి, విప్లవ సానుభూతిపర రచయితల నుండి, రచయితలు కానివారి నుండి విమర్శలు అనేకం వచ్చినవి. బాలగోపాల్‌ను APCLC నుంచి తప్పించడం ఆ విమర్శకు తుదిమెట్టు. అట్లాగా మమ్మల్ని సాహిత్య బహిష్కారం చేసినంత పని చేసినారు. ఒకాయన నా ‘‘తోవ ఎక్కడ’’ను హేళన చేస్తూ ‘‘తోక ఎక్కడ’’ అన్నాడు. జగ్గకవి అన్నాడు. ఒక ప్రముఖ కవి ఒక రచయితకు ఉత్తరం రాసిండు నాతో కలవొద్దని. మరొక ప్రముఖ కవి నాకు పెద్ద ఉత్తరం రాసిండు దారి తప్పినవని. ‘మార్క్సిస్టు వ్యతిరేకులు అనే ముద్ర వేసిండ్రు,గాని మేం ఎప్పుడూ ప్రజా వ్యతిరేకులం కాము. ఒక ఇంటర్వ్యూలో వీటి గురించి వివరంగా చెప్పిన కాబట్టి ఇక్కడ ఇక చాలు.
మేం వేసిన ప్రశ్నలు తాత్విక అన్వేషణ గురించి అనేది వాళ్ళు గ్రహించలేదు. నిర్ధిష్టంగా వాళ్ళ గురించే అని అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆలోచిస్తే, వాళ్ళ దృష్టితో చూస్తే వాళ్ళ కోణం నుంచి సహజమే అన్పిస్తుంది. క్షేత్ర స్థాయిలో అప్పటికప్పుడు తమ నిర్మాణాన్ని వినిర్మించుకోవడం సాధ్యం కాదు కాబట్టి అలా విమర్శించి ఉంటారు. అనంతర కాలంలో ఈ ప్రశ్నల్ని ఏదో మేరకు వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నారు. అందుకే తొలుత ఈ కొత్త ఆలోచనలను దానిలో భాగంగా వచ్చిన అస్తిత్వ ఉద్యమాలను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ క్రమంగా వాటిని ఏదో మేరకు ఆమోదించినరు. అది చాలు.
- యూనివర్సిటీలు, అకాడమీలు, పరిశోధనా కేంద్రాలు చేయలేని పనిని, తెలుగులో తెలంగాణలో మీరు చేసి చూపారు. అది మీకు ఎలా సాధ్యమైంది?
తలచుకుంటె అవి చేయలేని పనేం కాదు. తలచుకోవటానికి వాటికి సంస్థాగత పరిమితులుంటవి. వ్యక్తిగా నాకుండే స్వేచ్ఛ, స్వతాహాగా నాకున్న పట్టుదల ఈ పనులు చేయడానికి కారణం కావచ్చు.
‘ఈతరం యుద్ధ కవిత’ విరసం వేయాల్సిన సంకలనమన్నడు నగ్నముని. కాని అందులోని కొన్ని కవితలు వేయటానికి విరసం చట్రం అనుమతించదు. నాకుండే విశాల ప్రగతిశీల భావన అందుకు అవకాశమిచ్చింది. వ్యక్తిగత పట్టుదల సరేసరి.
‘‘మత్తడి’’ ఇంకెవరేసినా దాని స్వభావం అలా ఉండదు. సురేంద్రరాజుకు, నాకు తెలంగాణ కాన్వాసు మీద ఎన్ని దృశ్యాలున్నయో అన్నీ సంకలనంలో ఉండాలనే ప్రజాస్వామిక దృష్టి ఉన్నందువల్లనే వందేళ్ళ తెలంగాణ హృదయంగా ఆవిష్కృతమయింది. యధావిధిగా వ్యక్తిగత పట్టుదల… సంస్థలకు ఉద్యమాలతో, ఉద్యమావసరాలతో ఉద్వేగ సంబంధముండదు. ఎకడమిక్ సంబంధముంటుంది. అందుకని అవి Advanceగా స్పందించజాలవు. ఉద్యమాలు స్థిరపడిన తర్వాత మాత్రమే అవి స్పందించగలవు. అంతేగాని వాటికి శక్తి సామర్థ్యాలు లేక కాదు.
వ్యక్తిగా నాకు పరిమితులు లేవు గనుక, ఉద్యమంలో ఉద్వేగ భాగస్వామిని గనుక ఉద్యమావసరాలను ముందుగా దర్శించగలిగాను గనుక ‘‘ముంగిలి’’ని ‘‘తెలంగాణ చరిత్ర’’ను తేగలిగినాను. ‘‘గనుమ’’ వ్యాసాలు రాయగలిగినాను. (వాటి వెనుక ఎంత కఠోర శ్రమ ఉందో, ఎంత స్వసుఖ త్యాగం ఉందో కొందరైనా గుర్తించినారు.) ఆ కారణంగా ఈ అంశాల మీద ఎన్నో సంస్థలు ఎందరో వ్యక్తులు (కొందరు దొంగలు కూడా) దృష్టి సారించడం సాధ్యమయింది. అనేక పుస్తకాలు వ్యాసాలు వచ్చినవి. వాటిని కూడా ఏదో మేరకు కాంట్రిబ్యూషన్గానే పరిగణించాలి.
- ముఖ్యంగా ‘ముంగిలి’కి ‘‘తెలంగాణ చరిత్ర’’కు ముందు, తరువాత వున్న పరిస్థితులను వివరిస్తారా? కె.సి.ఆర్ మిమ్మల్ని ఎలా అభినందించారు?
1969 ఉద్యమం అన్ని ఆయుధాలను సిద్ధం చేసుకుంటనే యుద్ధంలోకి దిగినందువల్ల దాన్ని ఓడించడం సులభమయ్యింది. ఈ సారి అట్లా కాకూడదు అనే స్పృహ అందరికీ కలిగింది. జాతీయోద్యమ సందర్భంగా ఆంగ్లేయులు కలిగించిన ఆత్మన్యూనతను తుడిచివేసి ఆత్మ విశ్వాసాన్ని కలిగించాలనుకున్నారు ఆ నాటి నాయకులు. గతంలోకి వెళ్ళి గత ఘనవైభవ చరిత్రను వెలికితీసి ఆ ఆత్మ విశ్వాసాన్ని కలిగించినారు. నెహ్రూ Discovery of India అందులో భాగమే. చరిత్ర అధ్యయనంలో అలాంటి రచనలెన్నో చదివి వున్నందువల్ల ఆ స్మృహ ఈ సందర్భంగా నా Sub-conscious mind లో పనిచేసి ఉండొచ్చు. సరిగ్గా ఆంగ్లేయుల మాదిరిగానే ‘‘ఆంధ్రా’’ వాళ్ళు తెలంగాణ వాళ్ళకు చరిత్ర లేదని సంస్కృతి లేదని భాష అప్రామాణికమని, తెలంగాణ భావనకు చారిత్రకు పునాది లేదని చేసిన అవహేళనను పూర్వపక్షం చేయటానికి,ప్రజల్లో ఆత్మన్యూనతను పోగొట్టి,ఆత్మవిశ్వాసాన్ని నింపటానికి పత్రికల్లో వ్యాసాలు రాసిన. ఈ పుస్తకాలు రాసిన.
స్త్రీ దళిత ముస్లిం వాద ఆస్తిత్వోద్యమ మద్ధతు సందర్భంగా-ఎవరి చరిత్రను వాళ్ళే రాసుకోవాలని చెప్పిన పోస్ట్‌మోడర్నిజం, విస్మృత చరిత్రను బయటకు తేవాలని చెప్పిన సబాల్ట్రన్ స్టడీస్-‘‘మత్తడి’’తో ఈ పని పరిపూర్ణం కాలేదని భావించడం బహుశా‘ముంగిలి’,‘తెలంగాణ చరిత్ర’ల రచనకు నేపథ్యం. అప్పటి ఉద్యమానికి తక్షణావసరమైన ఈ కృషిని Speed grasping శక్తి గల కె.సి.ఆర్. గుర్తించిండు. ఆఘమేఘాలమీద నా ఫోన్ నెంబర్ తెప్పించుకొని ‘‘ముంగిలి’’ కృషి గురించి ప్రశంస కురిపించిండు. దేశపతి చొరవతో ‘‘తెలంగాణ చరిత్ర’’ను ఆవిష్కరించిండు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తొలి వార్షికోత్సవంలో ‘‘తెలంగాణ ఉత్తమ సాహితీవేత్త’’ తొలి పుసరస్కారాన్ని బహుకరించిండు.
- తెలంగాణ ఉద్యమంలో, ముఖ్యంగా సాహిత్య రంగంలో మీరు పోషించిన పాత్రను వివరిస్తారా?
1991లో శ్రీకాకుళం నుంచి నల్లగొండకు బదిలీ మీద రాంగనే నా సహజ ఉద్యమశీల స్వభావం కారణంగా అప్పటికే దుశ్చర్ల సత్యనారాయణ నడుపుతున్న ‘‘జలసాధన సమితి’’లో భాగస్వామినైన (ఒకవైపు ‘‘నీలగిరి సాహితి’’ స్థాపన, నిర్వహణ చేస్తూనే) SLBC పర్యాప్త క్షేత్ర పర్యటనలో భాగమైన. ఆ ఉద్యమంలోని కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణకు బలవనరుల్లో జరిగిన అన్యాయాన్ని జగపతిరావురాసిన పుస్తకాల ఆధారంగా అనేక సభల్లో ఉపన్యసించిన. ఆ సందర్భంలో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి తెలిసి ఒళ్ళు మండేది. నా తెలంగాణ స్మృహకు అది తొలిమెట్టు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఇలాంటివే తెరతీసినవి. మలిదశ ఉద్యమంలో తాదాత్మ్యతకు, ఆవేశానికి అది తొలిమెట్టు. పార్లమెంటు ఎన్నికల్లో వందల మంది నామినేషన్లు వేయడంలో నా వంతు పాత్ర కూడా ఉంది.
ఉద్యమ క్రమంలో, తెలంగాణ భావనను తుంచివేయటానికి చాలామంది ప్రయత్నం చేసిండ్రు. పోతనను పాల్కుర్కిని తెలంగాణకు చెందకుండా కుట్రలు చేసిండ్రు. వీళ్ళందరినీ అనేక వ్యాసాలు, కరపత్రాలు, లేఖల ద్వారా ఎదుర్కొన్న, ఆ రకంగా భావజాల రంగంలో వాళ్ళు కిక్కురుమనకుండా చేయడంలో నా వంతు పాత్ర పోషించిన. 1969 ఉద్యమంలో తెలంగాణ వ్యతిరేకులదే భావజాల రంగంలో పై చేయిగా ఉండేది. ఈ సారి మాలాంటి వారి రాతల వల్ల తెలంగాణది పై చేయి అయ్యింది. ఈ సందర్భంగా మిగతా నా కృషి గురించి మరొక ఇంటర్వ్యూ (పాలపిట్ట, ఫిబ్రవరి/మార్చ్ 2014)లో చెప్పిన. మళ్ళీ చెపితే పునరుక్తిదోషం అంటుకుంటుంది.
- ‘నల్లవలస’, ‘దాలి’ లాంటి అద్భుతమైన దీర్ఘ కవితల్ని మీరెలా రాయగలిగారు?
కోస్తాంధ్రుల మీద దశాబ్దాలుగా మసులుతున్న ఆగ్రహావేశాలే వాటిని రాయించినవి. తెలంగాణ ప్రజల మనస్సుల్లో దశాబ్దాలుగా రగులుతున్న మంటకు అభివ్యక్తే ఆ కావ్యాలు. ఇప్పుడు రాయడం అసాధ్యం.
- తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర స్థాయి ప్రథమ పురస్కారం (జూన్ 2) మీకు వచ్చినప్పటికీ, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డ్ ఇప్పటికీ రాకపోవడానికి కారణం?
‘‘తెలంగాణ చరిత్ర’’ ఒకసారి ‘‘ముంగిలి’’ రెండు సార్లు ఫ్రీ ఫైనల్‌కు వచ్చినవని, అప్పుడు జడ్జీలుగా ఉన్నవారిద్వారాను, ఇతరత్రాను తెలిసింది. కొందరు అడ్డుపడ్డారని కూడా తెలిసింది. వాళ్ళను కలవమని కొందరు మిత్రులు సూచించిండ్రు కూడ. అలా చేయడం నాకు మనస్కరించలేదు.
- అసలు అవార్డ్‌లపై మీ అభిప్రాయం?
దానంతట అది వస్తే మంచిదే. చాలా తక్కువ సందర్భాలలోనే అలా వస్తది. దానివెనుక కూడా కనిపించని రాజకీయాలుంటయి. అవార్డ్ స్మృహ కవుల్ని కలుషితం చేస్తయి. ఆ క్రమంలో అవార్డ్ వచ్చినవాళ్ళూ, దాన్ని ఆశించిన వాళ్ళు మెత్తబడడం చూస్తం. నిప్పులు చెరిగిన దళిత పాంథర్ కవులు, విప్లవ కవులు అవార్డ్ అనంతరం ఏమైనరో చూసినం. ఒక కవి గొప్పదనానికి అవార్డు కన్నా జనాదరణ గొప్ప గీటురాయి.
- ‘మార్క్సిస్టు సిద్ధాంతం’ మీద ప్రజల్లో గౌరవం ఉంది. మార్క్సిస్టుల్లో అధ్యయనం ఉంది, సిన్సియారిటీ ఉంది. ఈ రెండూ అస్తిత్వ ఉద్యమాల్లో లోపించలేదా?
అధ్యయనం, సిన్సియారిటీ అస్తిత్వ ఉద్యమాల్లోలోపించినవనే దానితో ఏకీభవించడం కష్టం. ఒక్క మాటలో దీనికి జబాబు చెప్పలేం. అధ్యయనలేమి ఇరు చోట్లా ఉంది. సంఖ్య ఎక్కువ తక్కువల్లో తేడా ఉండొచ్చు. మార్క్సిస్టుల్లో మధ్యతరగతి వారెక్కువ కావడం, అస్తిత్వ ఉద్యమాల్లో ముఖ్యంగా దళిత బహుజనులు ఎక్కువ కావడం ఈ తేడాలకు కారణం కావచ్చు. అధ్యయనశీలత కమిట్మెంటుకు సూచిక కావచ్చు, కానీ నిజాయితీకి సూచిక అని చెప్పలేమనుకుంట. మార్క్సిస్టుల్లో`దానిని క్యాష్ చేసుకునే కొందరిని మినహాయిస్తే నిజాయితీ ఎక్కువ అనేది నూటికి నూరుపాళ్ళు సత్యం. అస్తిత్వ ఉద్యమాల్లో అది లోపించిందని అనిపించడానికి ఏది ప్రమాణం? బహుశా దీన్ని తాత్వికంగా చూడాలనుకుంట. ఉనికిలో ఉన్న విలువల చట్రాన్ని మార్క్సిస్టులు నిరాకరిస్తరు గనుక దాని ఏ ప్రలోభాలకు లొంగరు గనుక వారిది నిజంగా సిన్సియారిటే. అస్తిత్వ ఉద్యమాలు ఉనికిలో ఉన్న చట్రం పరిధిలో జరిగే ఘర్షణలు కనుక, తక్షణ ప్రయోజనాలు, అంతిమ ప్రయోజనాలు అందులో ఉంటయి గనుక, తక్షణ ప్రయోజనాలను ఆశించేవారిని ఉద్దేశించి నిజాయితీ లోపం అంటున్నం. దీర్ఘకాలిక లక్ష్యాలకోసం పోరాడుతూనే తక్షణ ప్రయోజనాలను పొందాలనుకోవడం నిజాయితీ లోపమవుతుందా? అన్నది చర్చనీయాంశమే.
- ‘‘కవిత్వం కేంద్ర స్థానం నుంచి తప్పుకుంది’’ అనే విమర్శకుల వాదనపై, మీ కామెంట్ ఏమిటి?
మనిషి రోబో కానంతవరకు ఉద్వేగాలు బతికుంటయి. ఉద్వేగాలు బతికున్నంతకాలం కవిత్వం బతికుంటది, ఉద్వేగాల తొలి అభివ్యక్తి వాహిక కవిత్వం కనుక. అభివ్యక్తి తీరు ఏకకాలంలో భిన్న ప్రక్రియల సమ్మేళనంగా అంటే వ్యాసం, కథ, మ్యూజింగ్స్, స్వీయగాథ, థాట్స్ సమ్మేళనంగా ఉంటుందనే ఆధునికానంతర వాదం దృష్ట్యా ఆ విమర్శకుల వాదన కావచ్చు. కాని ఆ మొత్తం అభివ్యక్తి కవిత్వమే అని నేనంట.
- సాహిత్యానికి ప్రాంతీయత ఉంటుందా? ‘‘శ్రీశ్రీ కవిత్వం, రావిశాస్త్రి కథలు మాకు అర్ధం కావు, అవసరం లేదని’’ ఈ మధ్య కొందరు అస్తిత్వ వాదులు అంటున్నారు. మీ కామెంట్?
నిర్ధిష్ట స్థల, కాలాలకు (Particular) చెందకుండా ఏదీ సార్వజనీనం (Universal) కాదు. అది సాహిత్యానికి కూడ వర్తిస్తుంది. రావిశాస్త్రి పాత్రలు మొదట ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందుతవి కాని వాటి ఆగ్రహం, వేదన సార్వజనీనం. (అయితే ఈ సార్వజనీనతను కూడా వినిర్మాణ వాదులు అంగీకరించడం లేదు. వాటి వేషభాషాదులు Particular అయినట్టే వాటి వేదన కూడా ప్రత్యేకమైనదేనని వారంటారు) రావిశాస్త్రి, శ్రీశ్రీలు తమ గొంతుకలు కాజాలరని అస్తిత్వవాదులు అనవచ్చుగానీ, అవసరం లేదని ఎలా అనగలరు. ఒక షేక్స్పియర్, ఒక గోర్కి, ఒక గిన్స్బర్గ్, ఒక గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్ లను ఎట్లా చదువుతామో అట్లా వీళ్ళని గూడా చదువుతాం.
- విశ్వవిద్యాలయాల్లో, అకాడమీల్లో-అన్ని రంగాల్లో పైరవీల ద్వారా, డబ్బుల ద్వారా అసమర్థులని నియమిస్తున్నారు కదా? దానివల్ల సాహిత్యానికి, సమాజానికి నష్టం కాదా? మీరు నష్టపోయారా? మీ కామెంట్?
అట్లా జరుగుతున్నదనేది అందరికి తెలిసిన సత్యమే. నష్టం కూడా సత్యమే. ఆ వ్యవస్థల్లోకి నన్ను నిరాకరించినందుకు తొలుత బాధపడింది నిజమే. ఆ Exclusion వల్ల నాకిప్పుడు ఏ బాధాలేదు. లేకపోగా సంతోషంగా ఉన్న. నా Exclusion తెలంగాణ Inclusion గా మార్చుకోగలిగిన. లోపలివారికంటే ఎక్కువ చేసిన.
- యువ కవులకు, సాహితీ విమర్శకులకు మీరిచ్చే సందేశం?
ఇందులోకి ఎవరూ రావద్దు. రావాలనుకుంటే రెండుమూడు సంవత్సరాలు కాదు. రెండు మూడు దశాబ్డాలు-అన్నీ విదిలించుకొని-సాహిత్యమే ఉచ్ఛ్వాస, నిశ్వాసలుగా భావించగలిగితే రండి. లేకపోతే ప్లాట్ల బిజినెస్ మరేదో చేసుకోండి. చింతలేకుండా సమాజ చింత లేకుండా లక్షలాది మందిలా ఈ ప్రపంచం మీద ఏ ముద్ర విడువకుండానే నిష్క్రమిస్తారు.
- ఎంత చదువుకున్నా, ఉపాధి కల్పించని సాహిత్యాన్ని నేటి యువతరం ఎంచుకోవాలంటారా?
చాలా వేదనతో అడిగిన ప్రశ్న. అనేకమంది యువకులు ఆవేదనను ప్రతిబింబించే ప్రశ్న. చదువుకు సంబంధించి నాటి నుంచి నేటి దాకా ‘‘సదసద్వివేకం కలుగు’’లాంటి ఆదర్శాలు ఎన్ని ఎవరు చెప్పినా అత్యధిక శాతం అది బువ్వ బెట్టేదానికి పనికొస్తుందా? అన్నది చర్చనీయాంశంగానే ఉన్నది. అన్ని భావజాలాల సర్కిల్స్‌లో ఈ చర్చ ఉన్నది. ఉపాధి వ ం్సస్ అభిరుచి ఏది ముఖ్యమో వాళ్ళే నిర్ణయించుకోవాలె.
- ఇప్పుడు ఏం రాస్తున్నారు? ఏ పరిశోధనలు చేస్తున్నారు?
తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర నిర్మాణం పనిలో ఉన్న
- ఇప్పుడు సాహిత్య రంగంలో స్తబ్ధత ఆవరించిందా? ఆశాజనకంగా పరిస్థితులు ఉన్నాయా? మీ కామెంట్?
స్తబ్ధత అంటే ప్రతిష్ఠంభన. ఆగిపోవడం. సామాజిక సాహిత్య పరిణామంలో నిరంతర చలనమే ఉంటుంది. అగడం ఎప్పుడూ ఉండదు. సాహిత్యంలో ఏదో ఒక పాయనుద్దేశించి (ఉదాహరణకు అభ్యుదయ కవిత్వం) వాడే మాట అది. ఆ అర్థంలోనైతే కొన్ని పొయల్లో స్తబ్ధత ఉన్న మాట నిజం. అయితే సమాజం నిత్య చలనశీలం నిత్య సంఘర్షణాయుతం. దాన్ని కవులు సరిగ్గా పట్టుకోగలిగితే స్తబ్ధత లేనట్టే.
(నడుస్తున్న తెలంగాణ ప్రత్యేక సాహిత్య సంచిక (29 జూన్-2019) కోసం చేసిన సాహిత్య సంభాషణ ఇది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సంచిక రాలేదు. తర్వాత ఆ పత్రిక ఆగిపోయింది.)