సాహిత్యంలో సంవాద కళ

‘సాహిత్యానికి స్థలాన్ని రచయితలు, పాఠకులు నిర్మిస్తారు. అది దుర్బలమైన స్థలమే కావచ్చు కానీ దాన్నెవరూ ధ్వంసం చేయలేరు. అది చెదిరిపోతే మనం మళ్లీ నిర్మించుకుంటాం.’
(అరుంధతీ రాయ్: 12 సెప్టెంబర్ 2023 న యూరోపియన్ ఎస్సే ప్రయిజ్ స్వీకార ప్రసంగం, అంతకుముందు 12 మే 2019 న న్యూయార్క్ ప్రసంగం)

చీకటిలో చూపు నిశితమౌతుంది. అణచివేతకు మాట పదునెక్కుతుంది. హింసకు ప్రతిఘటన సరైన జవాబిస్తుంది. విద్వేషానికి వివేకం సమాధానమౌతుంది. క్రౌర్యానికి ప్రేమ ప్రత్యామ్నాయమౌతుంది. వేదనకు సృజన పర్యాయమోతుంది. పాణి ‘ద్వేషభక్తి’ వ్యాసాలు చదువుతున్నప్పుడు అతను చిత్రించిన వర్తమాన దేశపటం నన్ను యెంతగానో కల్లోలపరచింది. వీటిలో సమకాలీన రాజకీయాలపై అతను చేస్తున్న సైద్ధాంతిక ప్రతిపాదనలు లోతుగా ఆలోచింప జేశాయి గానీ; అదే సమయంలో అతని వుద్వేగ భరితమైన కంఠస్వరం నన్ను మరింత యెక్కువ కలవరపరిచింది. తడిగా యెదను తాకింది. ఫాసిస్టు పాలనలోని చీకటినీ అణచివేతనూ హింసనూ క్రౌర్యాన్నీ యాతననూ అతను మనందరికంటే దగ్గరగా చూస్తున్నాడు. స్వయంగా అనుభవిస్తున్నాడు. సాహిత్యం కేంద్రంగా సాంస్కృతిక రంగంలో ప్రతిఘటిస్తున్నాడు. ఫాసిజాన్ని వందేళ్ల కిందటి యూరోపియన్ సమాజం నుంచి కాకుండా వర్తమాన భారతదేశ మతవాద రాజకీయ సందర్భం నుంచి అతను ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నాడు. అయితే దేశంలో యిప్పటి ఫాసిస్టు పాలకుల ఆలోచనలకు మూలాలు మధ్య యుగాల్లోనే వున్నాయనీ తమ వర్గ వర్ణ ఆధిపత్యాన్ని కాపాడుకోడానికి ధర్మ పరిరక్షణ పేరుతో మొత్తం దేశాన్ని మళ్ళీ అక్కడికి నడిపించి అంతిమంగా హిందూ రాజ్యాన్ని స్థాపించడమే వాళ్ళ ఆశయమనీ పాణి యీ వ్యాసాల్లో నిరూపించాడు. ఆధునిక మనువాదుల సాంస్కృతిక రహస్య వ్యూహాన్ని బహిరంగపరిచాడు.

ఆధునిక మనువాదుల సాంస్కృతిక జాతీయవాదం వైరుధ్యంతో కూడుకొని వుంటుంది. వారి భౌతిక ప్రపంచం సాంకేతికంగా ఆధునికంగా వుండాలని కోరుకుంటారు. మానసికంగా మాత్రం సనాతన ధర్మాన్ని (దాని రూపం వాళ్ళకీ తెలీదు) కౌగలించుకొని వుంటారు. అది సాధ్యమేనా అన్న అనుమానం వచ్చినా అణచిపెడతారు. అవరోధాలు వున్నాయేమో అన్న ఆలోచన రాకుండా జాగ్రత్తపడతారు. కులాధారిత భూస్వామ్య ఉత్పత్తి విధానం వైపు నడవడం పూర్తిగా అసాధ్యమే అని వాళ్లని గుడ్డిగా నడిపించే బాస్ కి తెలుసు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలోనూ, పెట్టుబడిదారి వ్యవస్థ (కార్పొరేట్ కాంప్రోడర్ ఎకానమీ) లోనూ ఉత్పత్తి సంబంధాలు యజమాని బానిస సంబంధాలుగానే వుండాలని ఆశిస్తారు. శాసిస్తారు. చట్టాల్ని రూపొందిస్తారు. రాజ్యాంగ వ్యవస్థల్ని వాడుకుంటారు. దానికి పార్లమెంటరీ రాజకీయాల్ని బాహాటంగానే దళారి పాత్రకు కుదిస్తారు. ఈ రెండు శక్తుల మధ్య ఘర్షణ వున్నట్టు కనిపించినా చక్కగా మిలాఖత్ అవుతాయి. వారి మధ్య సయోధ్య పి వి నరసింహారావు దగ్గరే మొదలైంది. అయితే మతవాదుల నాయకత్వంలో ప్రజల్ని అహేతుక మౌఢ్యంలో ముంచి గుట్టు చప్పుడు కాకుండా రాజ్యమే కార్పొరేట్ కి దోచిపెడుతుంది. కాదన్న మాదన్నలను హింసాత్మకంగా అణచిపెడుతుంది.

దేశంలో దుర్భరమైన పేదరికం అనుభవిస్తూ గనిలో వనిలో కార్ఖానాలో శ్రమించే వుత్పత్తి శక్తులైన బీసీలూ దళితులూ ఆదీవాసీలూ ముస్లింలే రాజ్యానికి మొదటి శత్రువులు. ఎందుకంటే తమ నెత్తిన దారిద్ర్యాన్నీ బానిసత్వాన్నీ రుద్దిన పీడకవర్గంపై తిరుగుబాటు చేయాలనే అనివార్యమైన ఆలోచన వారిలో పుట్టవచ్చు. అందుకే ప్రతినిమిషం వారి ఆలోచనపై పారా. వారి కదలికపై నిఘా. వారి నెత్తిపై కత్తి. పోరాడి సాధించుకున్న హక్కులపై అణచివేత. న్యాయస్థానాలపై అదుపు. అందుకు అవసరమైతే అమల్లో వున్న చట్టాల సవరణ లేదా కొత్త చట్టాల నిర్మాణం. రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం. ఇంకా కాదంటే కిరాయి హంతక మూకల దాడులు. ఈ బరితెగింపే ఫాసిజం. దానికి ముసుగు జాతీయ వాదం. అలంకారం దేశభక్తి. ఇప్పుడు బాధితుల తరపున మాట్లాడేవాళ్లంతా దేశద్రోహులే. రచయితలు జర్నలిస్టులు న్యాయవాదులు హక్కుల కార్యకర్తలు ప్రశ్నించే ప్రతి వొక్కరూ పాలకులకు కంటిలో నలుసులే.

భారత దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయమే ఫాసిజం బలపడటానికి దోహదపడుతుంది. అది పార్లమెంటరీ నియంతృత్వమే. ఎన్నికలు దాని గోదా. ఏ పోరాటాన్నైనా ఆ గోదాలోకి దించడం కుదించడం దాని వ్యూహం. ఆ గోదాలోనే WWF పోటీలు జరుగుతాయి. పాలకపక్షం ప్రతిపక్షం రెండూ కొట్టుకున్నట్టు నటిస్తాయి. ఒకదాన్ని మరొకటి ఖతం చేయడానికి పూనుకున్నట్టు భ్రమ కలిగిస్తాయి. కార్పొరేట్ రిఫరీ తనకు అనుకూలమైన యేదో ఒక పక్షాన్ని ముందే విజేతగా నిర్ణయిస్తాడు. ఓటర్ ప్రేక్షకులు పరవశులై తన్మయత్వంతో వొక పక్షాన్ని తెలిసో తెలీకో సపోర్ట్ చేసి గెలుపు వోటములకూ ఆట జరిగిన తీరుకూ ముగ్ధులై ఆమోద ముద్ర వేస్తారు. 1980 ల నాటి శిలాన్యాస్ దగ్గరనుంచి బాబరీ మసీదు విధ్వంసం మీదుగా రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు యిచ్చిన న్యాయాధిపతిని రాజ్యసభకు నామినేట్ చేసేవరకూ అన్నీ పార్లమెంటరీ క్షుద్ర క్రీడలో భాగమే. ఇవన్నీ మతతత్వ వర్గ రాజకీయాలకు పరాకాష్ట. చివరికి దేశ ప్రజలందరూ మౌనసాక్షులుగా చూస్తూండగానే ఫాసిజం చట్టబద్ధతని సాధించుకొనే దిశగా పయనిస్తోంది. తన దుర్మార్గానికి జన సమ్మతిని సాధిస్తోంది.

ఫాసిజం జన సమ్మతిని కూడగట్టే పని వద్దే ఆగిపోదు. జనాన్ని క్రియారహితంగా మార్చుతుంది. జ్ఞాన శూన్యులుగా తయారు చేస్తుంది. కొంతమందికి కూలి కూడా ఇవ్వనవసరం లేని ఉన్మత్త సైనికులుగా సేవకులుగా శిక్షణ యిస్తుంది. వారితో హత్యలు అత్యాచారాలు మూకదాడులు చేయిస్తుంది. ఏ లౌకిక ప్రజాస్వామిక ఆచరణ గురించైనా కనీసం ఆలోచించడానికి వీల్లేని భయానక వాతావరణాన్ని కల్పిస్తుంది. మీడియాని కబళించి పచ్చిఅబద్ధాలు అర్ధసత్యాలు ప్రచారం చేస్తుంది. వెరసి దేశంలో మొత్తం మానవ చైతన్యమే అణచివేతకు గురవుతోంది. సాంస్కృతికంగా ఫాసిస్టు భావజాలం ఆహారం అభిరుచులు భాషా కట్టూ బట్టా వాటి మీద నిఘా ఆంక్షలు నిషేధాలూ దగ్గర ఆగిపోదు. మనుషుల వునికిలో సున్నితమైన సకల జీవ పార్శ్వాలనూ అది కబళిస్తుంది. మనిషిని అమానవీయంగా తయారుచేస్తుంది. ఈ క్రమాన్నంతటినీ పాణి యీ వ్యాసాల్లో వుదాహరణలతో క్రోడీకరించాడు. అయితే అదే సమయంలో జరుగుతున్నదాని పట్ల అందరికీ ఆమోదం లేదని కూడా తెలియజేస్తాడు. దీన్ని వ్యతిరేకించే బలమైన స్వరాలు కొన్నైనా వున్నాయి అన్న ధైర్యాన్ని యిస్తాడు. ఎదుర్కోటానికి కావలసిన స్థైర్యాన్నీ అందుకు అవసరమైన సైద్ధాంతిక దృక్కోణాన్నీ అందిస్తాడు. ఆ క్రమంలో అతను పార్లమెంటరీ రాజకీయాలకీ మతతత్వ పాసిజానికీ ప్రాకృతిక వనరుల, సామాజిక సంపదల దోపిడీకీ మధ్య వున్న ముక్కోణపు రహస్య అనైతిక సంబంధాన్ని విప్పి చెబుతాడు. ఈ వ్యాసాల్లో వున్న అంతస్సూత్రం యిది. అందువల్ల కేవలం బిజెపి పాలన మాత్రమే ప్రజా వ్యతిరేక పాలన అని అతను అనడం లేదు. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే ఫాసిజానికి, బూర్జువా వర్గానికి అనుకూలమైనది అని నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పాడు. అదే సందర్భంలో రాజ్యాంగబద్ధ పాలన, ఉదారవాద ప్రజాస్వామ్యం వంటి మాటల్లోనూ ఆలోచనల్లోనూ వున్న డొల్లతనాన్ని బహిర్గం చేశాడు.

ఫాసిస్టు ఘటనల గురించి విద్వేష శక్తులు సపరివారంగా బలపడి చేస్తున్న దాడులు గురించి వ్యాఖ్యానించడం దగ్గరే పాణి ఆగిపోవడం లేదు. సంఘపరివార్‌కు సమాజమంతా విస్తరించగల భావజాలం, ఆమోదం పొందగల సాంస్కృతిక వాతావరణం వున్నాయని గుర్తిస్తూనే వాటికి విరుద్ధంగా తమ తమ పరిధిలో పెనుగులాడుతున్న భిన్న ప్రజా సమూహాల చైతన్యాన్ని యెత్తిపట్టాడు.

అయితే ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజా సమీకరణ జరగాల్సినంతగా జరగడం లేదు. అందుకు అవసరమైన వ్యూహాత్మక కార్యాచరణ గురించి, అది నిర్మాణాత్మకంగా రూపొందాల్సిన అనివార్యత గురించి దాదాపు ప్రతి వ్యాసంలోనూ పాణి ప్రస్తావించాడు. అది పరోక్షంగా సూచనప్రాయంగా ఉండదు. సూటిగా నిర్దిష్టంగా ఉంటుంది; గమనించండి. అంతే కాదు; ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలు ఉదారవాద పార్లమెంటరీ బూర్జువా రాజకీయాలను యథాతథంగా బలపరిచే వైపు జారిపోకుండా విప్లవశక్తులు అప్రమత్తంగా వుండాలని కూడా అతను హెచ్చరిస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైన హెచ్చరిక.

అరెస్సెస్ ఆదేశాల మేరకు బిజెపి అమలుచేస్తున్న హిందుత్వ ఫాసిజాన్ని యెదుర్కోవాలంటే ముందుగా దేశంలో హిందుత్వ ఫాసిస్తు శక్తులు విజృంభించిన చరిత్రను, దళారీ బూర్జువా శక్తులు యెదిగిన తీరునూ విడివిడిగా గాక కలిపి చూడాలి. వాటి అవినాభావ సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. ఇవ్వాళ దేశంలో యీ రెండు అభ్యుదయ ప్రతీప శక్తులూ బూర్జువా ప్రజాస్వామ్యపు నాలుగు స్తంభాల మంటపానికి పునాదిగా మారిన వైనాన్ని గుర్తించాలి. అదానీ పై హిడెన్ బర్గ్ రిపోర్ట్ ని ఆర్ఎస్ఎస్ బహిరంగంగా నిర్లజ్జగా ఖండించింది. అదానీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహంగా పరిగణించింది. అది దేశ పాలకుల గొంతే. రాజ్యం హిందుత్వ ఫాసిజం కార్పొరేట్ తో నడి బజారులో పరవశిస్తోంది అనడానికి యింతకంటే పెద్ద నిదర్శనం లేదు. నిరూపణలు అవసరం లేని నిజం యిది. అందువల్ల ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడటమంటే రాజ్యాన్ని సైతం శాసిస్తున్న మార్కెట్ కి వ్యతిరేకంగా పోరాడటమే అన్న స్పృహ అవసరం. ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగే ప్రజాస్వామిక పోరాటాలకు ఎన్నికల రాజకీయాల పట్ల విశ్వాసం లేని ప్రగతిశీల, పీడిత అస్తిత్వ, విప్లవ శక్తులు తమ ఐక్యతను సంఘీభావాన్ని తెలియజేస్తున్నాయి. అయితే ఐక్యత పేరున విప్లవోద్యమ శక్తులు ఉదారవాదానికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఉదారవాద శక్తులతో కలిసి వుమ్మడి కార్యాచరణలో వున్నప్పటికీ మౌలికమైన వర్గపోరాటాన్ని వదులుకొని నేలవిడిచి సాము చేయకూడదు. ఈ అంశాన్ని పాణి యీ వ్యాసాల్లో బలంగా ప్రస్తావించాడు.

తాము హిందూ బంధువులం అనో మేమే అసలైన హిందూ ఛాంపియన్స్ అనో సంఘ పరివార శక్తులు ప్రచారం చేసుకుంటారు. కానీ వాళ్ళు మసీదులనే కాదు; మందిరాల్ని సైతం కూల్చగలరు. గౌరీ కలబుర్గీలపైనే కాదు స్వామీ అగ్నివేశ్ వంటి ‘ఋషితుల్యుల’పై సైతం దాడి చేయగలరు. తరాలుగా యుగాలుగా తాము అణచివేసిన జాతులనుంచే పంచమాంగ దళాల్ని సృష్టించి హంతక ముఠాల్ని తయారుచేయగలరు. మన వేలితోనే మన కన్ను పొడవగలరు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే ఆరెస్సెస్సే హింస పునాది మీద నిర్మాణమైంది. ధార్మికత దాని కవచం. అబద్ధాలు కుట్రలు దాని ఆయుధాలు. రాజకీయ అధికారం సాధించిన ప్రతిసారీ అది తన బలం పెంచుకొంటుంది. బలం పెరుగుతోన్న కొద్దీ బరితెగింపు తనం ప్రబలింది. భావజాల రంగంలో అతాత్విక భావనల్ని మౌఢ్యాన్నీ పెంచి పోషిస్తూ విద్వేషాన్ని రెచ్చగొడుతూ చివరికి భౌతిక దాడులకు తెగబడుతోంది. సృజనాత్మకంగా ఆలోచించే మానవ సమూహాల్ని టార్గెట్ చేస్తోంది. ఆలోచించే మెదళ్ళని చీకటి కొట్టులో బంధిస్తోంది. సాయిబాబాపై దొంగ కేసు గానీ భీమకోరేగావ్ కుట్ర కేసులో రచయితలపై జర్నలిస్టులపై న్యాయవాదులపై అక్రమ నిర్బంధం గానీ దళిత విప్లవ పురోగామి శక్తుల సమైక్య వారసత్వ చైతన్య స్ఫూర్తిని నాశనం చేయడానికి ‘సంఘ్ రాజ్యం’ పన్నిన కుట్రలో భాగమే. ‘ద్వేషభక్తి’ రాజ్యమే కుట్రదారు అని విడమరచి చెప్పి అసలైన దోషుల్ని ప్రజా న్యాయస్థానం బోనులో విచారణకు నిలబెట్టింది. అది యిప్పుడు తీర్పుని కోరుతోంది.

*

వక్తగా కథకుడిగా నవలా రచయితగా విమర్శకుడిగా భావజాల రంగంలో బహుముఖీనంగా పనిచేస్తున్న పాణి వ్యాస రచనా శిల్పం గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సి వుంది. అలాగే సాహిత్య విమర్శకూ రాజకీయ విశ్లేషణకు తత్తదనుగుణంగా యెంచుకునే భాషా శైలీ శిల్పాల్ని అంచనా వేయాలి. ‘జనతన రాజ్యం’, అంతకన్నా ముందు నుంచీ ‘వ్యక్తిత్వమే కవిత్వం’ (వరవరరావు కవిత్వ విశ్లేషణ), ‘కల్లోల కాల ప్రతినిధి’ (దృక్పథాల సంభాషణ) మీదుగా యివాళ్టి ‘ద్వేషభక్తి’ వరకూ సాహిత్యంలో సంవాద కళని అతనొక శాస్త్రంగా అభివృద్ధిపరుస్తున్నాడు. శస్త్రంగా సానబడుతున్నాడు. సమకాలీన సామాజిక రాజకీయ విశ్లేషణకు చారిత్రిక భౌతికవాద దృక్పథం జోడించి సాహిత్య పరిమళం అద్దుతున్నాడు. వాస్తవానికి, కాల్పనిక సాహిత్యం చదివేవారి కంటే కాల్పనికేతర రచనలు చదివే సాధారణ పాఠకుల సంఖ్యే యెక్కువ. కాల్పనిక సాహిత్యం కల్పించే సాంద్రమైన అనుభూతిని కాల్పనికేతర సాహిత్యం కలిగించినప్పుడు పాఠకులు వ్యాసానికి అది అందించే సారానికి సైతం దగ్గరవుతారు. సమాచారం అందించడం దగ్గరే ఆగిపోయే వ్యాసాల గురించి కాదు; నేను మాట్లాడేది – అనుభవాల రాపిడి నుంచి భావాల ఘర్షణ నుంచి వొక చేతననూ యెరుకనూ అందించే వ్యాసం గురించి. అది సాహిత్య వ్యాసం కావొచ్చు సామాజిక వ్యాసం కావొచ్చు రాజకీయ వ్యాసం కావొచ్చు; అనుభవానికీ ఆలోచనకీ పరిశీలనకీ సరైన దృక్పథాన్నీ సౌందర్యాన్నీ జోడించాలి. అప్పుడు అది హృదయానికి తాకుతుంది. సృజనాత్మక సాహిత్యం లాగానే స్వచ్ఛమైన భావోద్వేగాలని వికసింపజేస్తుంది. సమాజంలో హేతు చింతనని పెంచుతుంది. ఆలోచనను ట్రిగ్గర్ చేస్తుంది. వ్యాస రచయిత వాడే భాష ద్వారా వ్యక్తీకరణ పద్ధతి ద్వారా అది సాధ్యం అవుతుంది. వ్యాసాన్ని కళాత్మకంగా రూపొందించడం పెద్ద ఛాలెంజ్. వందేళ్ల కాలం నాటి సాక్షి, వదరుబోతు వ్యాసాలు సృజనాత్మక సాహిత్య గౌరవం పొందాయి. వ్యాసాన్ని సృజనాత్మకం చేయాలంటే దాని అంతర్గత నిర్మాణం పట్ల కళాత్మక అభివ్యక్తి పట్ల జాగరూకత అవసరం. వాస్తవాల్ని యథాతథంగా గుమ్మరించడం కాక సూత్రబద్ధంగా వొక పద్ధతిలో కూర్చే నేర్పు అవసరం. దృక్పథ ప్రసారానికి భావ వినిమయానికి అనుగుణమైన భాషనూ శైలినీ పునర్నిర్మించుకోవాలి. పునర్నిర్వచించుకోవాలి. ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలి. పాఠకుల మేధని స్పృశించి చైతన్య పరచడానికి అవసరమైన వ్యూహాన్ని విరచించుకోవాలి. ఈ పని చాలా కాన్షియస్ గా చేస్తున్నాడు పాణి.

సామాజిక ఆర్థిక సాంస్కృతిక సంక్షోభాన్ని అర్థం చేసుకోడానికీ విశ్లేషించడానికీ పరిష్కరించుకోడానికీ మార్క్సిజం అనితరమైన ఆయుధంగా యెలా వుపయోగపడుతుందో తెలుసుకోడానికి ‘ద్వేషభక్తి’ పుస్తకం గొప్ప నిదర్శనం. ఫాసిస్టు పాలన తమ ఆర్థిక రాజకీయ దుర్మార్గాలకు మతాన్ని అడ్డుపెట్టుకొని సామాజిక ఆమోదం పెంచుకున్న కాలంలో నిటారుగా నిలబడి రాసిన వ్యాసాలివి. వర్తమాన సామాజిక రాజకీయ చరిత్రని విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించే యీ వ్యాసాల్లో పాణి ఎవర్ని అడ్రస్ చేస్తున్నాడు? అన్నది ముఖ్యమైన ప్రశ్న. రచయితా పాఠకుల మధ్య చెదిరిపోయిన సాహిత్య స్థలాన్ని పునర్నిర్మించుకునే క్రమంలో సాహిత్యంలో వర్గ పోరాట భావనకి దూరం జరిగిన భద్ర జీవులను వుద్దేశించి రాసిన అచ్చమైన రాజకీయ వ్యాసాలివి. ఇన్నాళ్లూ పోరాటంలో అండగా నిలబడ్డ మధ్యతరగతిని వుద్దేశించి కూడా అతను మాట్లాడుతున్నాడు. సమాజంలో గుణాత్మకమైన మార్పుకు దోహదం చేసే చోదక శక్తుల్ని మరింత అప్రమత్తం చేస్తున్నాడు. అందుకు అనుగుణమైన స్వరాన్ని రూపొంచుకున్నాడు. హేతుబద్ధమైన వాదాన్ని నిర్మిస్తున్నాడు. అది యెదిరిని సైతం వొప్పించేలా వుంటుంది. అది వొక డిస్కోర్స్. కానీ ప్రవచనం కాదు. డెలిబరేషన్. క్రియాశీలమైన వ్యాఖ్య. సరైన సిద్ధాంతం వైపు నడిపించే ప్రమేయం (వ్యాసాన్ని తొలి రోజుల్లో ప్రమేయం అనడం గుర్తుకొస్తుంది). ఒక సంభాషణ. ఆప్త వాక్యం (తార్కిక పరిభాషలో ఆప్తుడు యథార్థవాది). ఆలోచన ధార. దగ్గరగా వొద్దికగా నేసిన అల్లిక. అందువల్ల అతని వచనం చిక్కగా వుంటుంది. శాస్త్రీయమైన చర్చ అయినందువల్ల వొక్కోసారి గాఢంగా వుంటుంది. అందులోకి ప్రవేశించి శ్రద్ధగా ఆలకించాలి. సారాన్ని పూనికతో పట్టుకోవాలి. అతని వాదనలో వొక్కోసారి వ్యంగ్యం వుంటుంది. దాని చురుకు చదువరులకు అనుభూతమౌతుంది. అయితే అందులో వాడి కంటే వేడి యెక్కువగా వుంటుంది. దానిలో విమర్శనాత్మకమైన నిక్కచ్చితనం వుంటుంది. గతిశీలత వుంటుంది.

సాధారణంగా వాదం రెండు విధాలు. ఒకటి: తన నేల మీదే నిలబడి తొట్రుబాటు లేకుండా స్థిరంగా అభిప్రాయాలు ప్రకటించడం. రెండు: ప్రజాస్వామిక తలంలో పరస్పరం అభిప్రాయాలను వినిమయం చేయడం. శత్రు వైరుధ్యాలని ఖండించే సందర్భంలో పాణి మొదటి పద్ధతిని ఆశ్రయిస్తాడు. అప్పుడు అతని పలుకు నిశితంగా దృఢంగా కటువుగా వుంటుంది. సూటిగా బల్లెమై తాకుతుంది. గుచ్చుకోవాల్సినవారికి అది బలంగా గుచ్చుకుంటుంది. అసత్యాల పునాది మీద నిర్మితమైన వైరి వాదాన్ని పూర్వపక్షం చేయడానికి అతనెన్నుకున్న ఆయుధం పదునైనది. సత్యాన్ని సృజనాత్మకంగా ఆవిష్కరించడం ద్వారా ప్రతివాదికి సమాధానం చెప్పడంలో అది గురి తప్పదు. వారిని నిరుత్తరుల్ని చేస్తుంది. అయితే మిత్ర వైరుధ్యాల్ని పరిష్కరించుకునే సందర్భాల్లో పాణి వచో వైఖరి సున్నితంగా వుంటుంది. అతని మాట మృదువుగా భుజం కలిపి నడుస్తుంది. తాను ఆచరించే వుద్యమావసరాల రీత్యా వాళ్ళని దూరం చేసుకోకుండా బ్యాలెన్సింగ్ చేసే సంయమనం అతని వాక్యంలో చూడగలం. అప్పుడు అతని వాదంలో inclusive స్వరాన్ని వింటాం. అది ‘మీరూ – మేమూ’గా కాక ‘మనం’గా మారుతుంది. సుహృద్భావ పూరితమైన సంభాషణకి అవకాశం వుండే వుమ్మడి జాగాని అతను నిర్మిస్తాడు. ఆలోచనకు పురిగొల్పే వ్యవధిని కల్పిస్తాడు. ‘ద్వేషభక్తి’ వ్యాసాల్లో పాణి అవసరానుగుణంగా యీ రెండు పద్ధతుల్నీ అనుసరించాడు. వాటితోపాటు విశాలమైన ప్రజానీకానికి దగ్గరయ్యే సంవాద శైలిని ఆశ్రయించాడు. భిన్న సమూహాలకు వ్యాసాన్ని చేరువ చేసే విద్య యిది.

‘ద్వేషభక్తి’ని చదువుతుంటే కొన్ని చోట్ల అరుంధతీ రాయ్ రాజకీయ వ్యాసాలు గుర్తొచ్చాయి. కానీ అరుంధతీ రాయ్ రచనలో అలంకారిక శైలి యెక్కువ. ఆమె వాదంలో నిర్దిష్టత పాలు కూడా యెక్కువ. పాణి వచనంలో ఆలంకారికత తక్కువ. నిరలంకారత కూడా రచనకు శోభనిస్తుంది. సైద్ధాంతిక ప్రతిపాదనలతో కూడిన వ్యాసంలో భాషాపరమైన ఆలంకారికత వేరు, ప్రమేయపరమైన ఆలంకారికత వేరు. వచన రచయితకు దీని పట్ల స్పష్టత అవసరం. అది బాలగోపాల్ తెలుసు. పాణికి తెలుసు. పాణి వాదంలో నిర్దిష్టత కంటే సాధారణీకరించిన సైద్ధాంతికత యెక్కువ. ఒక్కోసారి నిర్దిష్ట విషయం అతని మనసులో వుంచుకుని దాన్నుంచి డిరైవ్ చేసిన సారాన్ని మాత్రమే పాఠకులకు అందిస్తాడు. అటువంటి సందర్భాల్లో పాణి వాక్యం గూఢంగా మారుతుంది. కొంతమంది పాణి లేవనెత్తే రాజకీయ సామాజిక అంశాల పట్ల మౌనంగా వుంటూనే అతని రచనలో స్పష్టత గురించి ప్రశ్నిస్తారు. ఈ వ్యాసాలు వాళ్లని కూడా అడ్రస్ చేస్తాయి. తన వాదాన్ని బలంగా వినిపించడానికి తగిన వాక్యశైలిని యెంచుకుంటాడు. ఆ సందర్భంలో అతనిలోని సాహిత్యకారుడు పక్కకు తొలగి జర్నలిస్టు ముందుకువస్తాడు. అయితే మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టుల్లా అతను యెవర్నీ నొప్పించకూడదని తీర్మానించుకుని కూర్చోలేదు. అనవసరపు డిప్లొమాసీనీ పాటించలేదు. నికార్సుగా వున్నాడు. నిర్మోమాటంగా అభిప్రాయాల్ని ప్రకటించాడు. వాదనలో హుందాతనం వుంది. స్వీయ నియంత్రణ వుంది. సంపాదకీయ వ్యాసాల రూపంలో పాణి వచన రచనలో సాధించిన యీ ప్రత్యేకత గమనించాల్సిన అంశం అని నాకు అనిపించింది.

సాహిత్య విమర్శ కూడా వర్గ పోరాటంలో భాగమే అన్న టీఎమ్మెస్ మాటను పాణి రాజకీయ సంపాదకీయ వ్యాసాలకు సైతం అన్వయించుకొని దాన్ని మరింత అర్థవంతం చేస్తున్నాడు. ఫాసిస్టు వ్యతిరేక భావజాల రంగంలో అనుసరించాల్సిన యుద్ధవ్యూహాల్ని అందిస్తున్నాడు. నేర్చుకోవాల్సిన వర్గ పోరాట పాఠాల్ని బోధిస్తున్నాడు. పోరు దారిలో కలిసొచ్చే అనుకూలించే కొత్త ఆలోచనలను స్వాగతిస్తూనే మార్క్సిస్టు మౌలిక సూత్రాలకూ దృక్పథానికీ కట్టుబడి వున్నాడు. అదే సందర్భంలో తరాలుగా వాడి అరగదీసిన పడికట్టు పదాలకు విరామమిచ్చి నేటి సందర్భానికి అవసరమైన కొత్త డిక్షన్ ని రూపొందించుకున్నాడు. సాంస్కృతిక రంగంలోకి కొత్తగా వస్తున్నవాళ్లకి కూడా దగ్గరయ్యే వాక్యాన్ని అలవరచుకున్నాడు. తత్కాలీనంగా తక్షణ స్పందనలు ప్రకటిస్తున్నప్పుడు కూడా తన యెరుకకు దూరం కాలేదు. కేవలం ప్రచార లక్ష్యంతో సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేసే వ్యాఖ్యల్లో లాగా యెక్కడా తొందరపాటు లేదు. హేళన లేదు. ఏకపక్షత లేదు. భిన్న అభిప్రాయాలు కలిగి వుండటమే దేశ ద్రోహంగా పరిణమించిన విద్వేష కాలంలో సడలని నిబద్ధతతో నిలకడగా పాణి రాస్తున్న యీ వ్యాసాలు లౌకిక ప్రజాస్వామ్యవాదుల భావైక్యతకి గొప్ప స్ఫూర్తినిస్తాయి అనడంలో సందేహం లేదు.

*

నిజానికి మతతత్వవాదుల బలం లౌకిక ప్రజాస్వామ్య శక్తుల అనైక్యతే. ఉమ్మడి పోరాటాలు లేకపోవడమే. మన మౌనమే నిర్లిప్తతే ఆధిపత్య శక్తులు బలపడటానికి తోడ్పడతున్నాయి. గొంతు సరాయించుకొని యిప్పుడు మాట్లాడకుంటే మరి యెప్పటికీ యెలుగు విప్పలేం. సాంస్కృతికంగా దేశం అఖండమైనది కాదు, విభిన్నత శిలా సదృశంకాదు – అని ప్రచారం చేయాలి. వైవిధ్యం మన జీవశక్తి – అని వుద్ఘోషించాలి. భిన్నత్వ స్పృహ దేశద్రోహం కాదు – అని ప్రకటించాలి. అల్పసంఖ్యాకుల అస్తిత్వ పరిరక్షణ మెజారిటీ ప్రజల బాధ్యత – అని తెలియజేయాలి. పోరాటంలో ప్రత్యామ్నాయ ప్రజా సాంస్కృతిక చిహ్నాలు రూపొందించుకోవాలి. బాహుళ్యానికి పెద్దపీట వెయ్యాలి. బాహుళ్యం విచ్చిపోడానికి కాదు; బలానికి అని విప్పిచెప్పాలి. సాంస్కృతిక అసమానతలపై ఆధిపత్యలపై వుమ్మడి పోరుకి తయారు కావాలి. వైవిధ్య భరితమైన యీ దేశపు లౌకిక స్వభావం గురించి సృజనాత్మకంగా ఆలోచించాలి. ద్వేషానికి విరుగుడు ప్రేమ అని నిండు గుండెతో చాటాలి. అందుకు చీకటి రోజుల్లో పాణి లాంటి వేకువ పిట్టలు పాడుతున్న వెలుతురు గానాలు తోడ్పడతాయని నమ్ముతూ… యీ పాట ఫాసిస్టు పాలనకు చరమ గీతం కావాలని కోరుకుంటూ…

సెలవ్!

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

One thought on “సాహిత్యంలో సంవాద కళ

  1. రాసిన వ్యాసాల మీదనే కాదు, రాసిన రచయిత మీద కూడా సమగ్రమైన లోతైన అవగాహన కల్పించే వ్యాసం ఇది ..పాణి గారికి, ప్రభాకర్ గారికి అభినందనలు.

    ముకుంద రామారావు

Leave a Reply