సాయుధ ప్రజా జర్నలిస్టు దమయంతి (రేణుక)

కడవెండి మట్టిబిడ్డ గుముడవెల్లి రేణుక. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేని గ్రామం కడవెండి. పోరాటాల, త్యాగాల గ్రామంలో పుట్టిన రేణుక సహజంగానే పోరాటాల ప్రవాహాలకు ఎదురెక్కుతూ చివరికి దండకారణ్యం, బస్తర్‌కు చేరుకున్నది. ఆ ఉద్యమంలో భాగం అయింది. నాయకత్వం వహించింది. ఎడిటర్‌గా పత్రికలను నడిపింది. బి.డి. దమయంతి, మిడ్కో వంటి పేర్లతో రచనలు చేసింది రేణుక. ఇంకా కొన్ని పేర్లు ఉన్నట్లుంది. దారి పొడుగునా ప్రజల పోరాటాలను కథలుగా, వ్యాసాలుగా, పరిశోధనా పత్రాలుగా రికార్డు చేసింది. రేణుక యుద్ధభూమిలో కలబడుతూ, నిలబడి రచనలు చేసింది. తలపై హెల్మెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని, వెనకా, ముందు ప్రెస్ అని రాసి పెట్టుకున్నప్పటికీ ఎందరో జర్నలిస్టులు యుద్ధరంగంలో చంపబడుతున్నారు. రేణుక అటువంటివేమీ లేకుండానే, ప్రజలే రక్షణ కవచంగా నిలబడగా దండకారణ్యం, ఒరిస్సాలోని ఆదివాసీ ప్రజల జీవితాల లోతుల్లోకి వెళ్లి వాస్తవాలను తవ్వి తీసింది. పాలకవర్గాల తప్పుడు కథనాలను ఎండగట్టింది. ప్రతిక్షణం మృత్యువును గేలి చేస్తూ, జర్నలిస్ట్‌గా పనిచేస్తూ, చిందరవందర అయిన ఆదివాసుల జీవితాలను చిత్రించింది. చివరి వరకు కూడా ఆదివాసీ జీవితాలలో జరుగుతున్న మార్పుల గురించి, అన్యాయాల గురించి, తిరుగుబాట్ల గురించి లోకానికి చెప్పుతూనే ఉంది. పాలకుల, కార్పొరేట్ శక్తుల కుట్రలను, క్రూరమైన దమనకాండను ఎండగడుతూనే తుది శ్వాస విడిచింది రేణుక.

ఆదివాసీ పోరాటాల గురించి రేణుక రాసిన వ్యాసాలను “విముక్తి బాటలో” అనే పేరుతో విరసం పుస్తకంగా ప్రచురించింది. ఇందులో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బస్తర్ జిల్లాలో, ప్రభుత్వం, ప్రైవేటు మిలీషీయా పొత్తుతో జరిగిన సల్వాజుడుం అనే నిర్బంధం గురించి 22 వ్యాసాలు ఉన్నాయి. సల్వాజుడుం తరువాత ఇదే ప్రాంతంలో జరిగిన గ్రీన్ హంట్ అనే మరో నిర్బంధ క్యాంపెయిన్ గురించి ఒక వ్యాసం ఉంది. బస్తర్‌కే చెందిన ఆదివాసుల వలసల గురించి పరిశోధనా పత్రం ఉంది. ఇవి గాక ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లా, నారాయణపట్నా బ్లాక్ ఆదివాసుల పోరాటాల గురించి 15 వ్యాసాలు ఉన్నాయి. ఈ అన్ని వ్యాసాలు ఆదివాసుల పోరాటాల, త్యాగాల నేపథ్యం కలిగినవే.

సల్వాజుడుం మూకలు చేసిన దాడులు, బస్తర్ ఆదివాసులలో ఎలాంటి భయానక వాతావరణాన్ని కల్పించినాయో మొదటి వ్యాసంలోనే రేణుక స్పష్టంగా చూపించింది. “పురుషులు భుజాలపై సామాన్లతో నిండిన కావిళ్ళు, మహిళల చంకల్లో పిల్లలు, నెత్తిన మూటలు, కొందరి నెత్తిమీద అప్పుడే వండిన అన్నం గిన్నెలు. తమ తల్లుల వెనకో, తండ్రుల వెనకో పరుగుపరుగున నడుస్తున్న చిన్నపిల్లల నెత్తిన సైతం వాళ్లు మోయగలిగిన బరువులు. ఇంతలో తండ్రి వెనకాలే గార నూనె సీసా పట్టుకుని నడుస్తున్న పాప. తండ్రి నడకనందుకోలేక ఆగిపోయి ఏడుపు లంకించుకుంది.” సల్వాజుడుం పేరుతో ప్రభుత్వ మద్దతు, ఆయుధాలు కల మూకల దాడులకు భయపడి ఆదివాసులందరు గ్రామాలను వదిలి అడవిలోనే ఉండడం మొదలు పెట్టారు. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు ఉరిమిన శబ్దానికే, సల్వాజుడుం మూకలు కాల్పులు జరుపుతున్నారనుకుని ప్రజలందరూ పడుతూ లేస్తూ పరుగెత్తారు. ఈ ఘటనను వివరిస్తూ, “అక్కడ నెలకొన్న పరిస్థితుల నుండి విడదీసి చూస్తే చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది. కానీ ప్రకృతి నాడిని పట్టుకోగలిగిన ఈ అడవి బిడ్డలు ఉరుముల శబ్దాన్ని ఫైరింగ్ అని భ్రమించి పరుగెత్తడం వెనక వారు పొందిన భయానక అనుభవాలు ఉన్నాయి” అంటుంది రేణుక.

సల్వాజుడుం మూకలు ఆదివాసీ గ్రామాలను తగలబెట్టి, గ్రామాలలో ఉండలేని పరిస్థితి సృష్టించి, ఆదివాసులందరినీ తమ నిర్బంధ శిబిరాలకు తరలించారు. లేదా బలవంతంగా చేరేలా చేశారు. వీటికి సహాయ శిబిరాలు అని పేరు పెట్టారు. కానీ నిజానికివి కాన్‌సెంట్రేషన్ క్యాంపులు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తమ వలసలలో స్వాతంత్ర్యం కోసం పోరాడే వారిని, ప్రజలతో సంబంధం లేకుండా చేసి నిర్మూలించడానికి ఈ కాన్‌సెంట్రేషన్ క్యాంపుల ఎత్తుగడలను అవలంబించారు. భారత ప్రభుత్వం కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సందర్భంగా, కాన్‌సెంట్రేషన్ క్యాంపుల ఎత్తుగడలను అవలంభించింది. ఇప్పుడు కూడా, అంటే సల్వాజుడుం క్యాంపెయిన్ సందర్భంగా కూడా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం దాన్నే అమలు చేసింది. అయితే, ఎంత హింసాకాండ జరిగినా కొన్ని కుటుంబాలు ఈ నిర్బంధ శిబిరాలకు వెళ్ళలేదు. అటువంటి కుటుంబ సభ్యులను ఎవరో ఒకరిని జుడుం మూకలు ఎత్తుకెళ్లి శిబిరాలలో పెట్టి, ఆ కుటుంబాలు కూడా శిబిరాలకు వచ్చేలా ఒత్తిడి చేశాయి. ఒకచోట రేణుక ప్రజలు చెప్పిన విషయం ఇలా రాసింది. “ఇలా ఎన్ని రోజులు ఉరకగలం, నా భర్తను పట్టుకెళ్లారు, నా బిడ్డను పట్టుకెళ్లారు, నా కొడుకుని పట్టుకెళ్లారు. మేం వెళ్లకపోతే వాళ్ళని చంపుతారని వెళ్ళాం అన్నారు” నిజానికి ఇవి అమానవీయమైన చిత్రహింసల నిర్బంధ క్యాంపులు. ఈ క్యాంపుల గురించి, క్యాంపులలో ఆదివాసీ ప్రజల బాధల కష్టాల గురించి కళ్లకు కట్టినట్లు చూపించింది. ఈ క్యాంపులలో దాదాపు లక్ష మంది ప్రజలను నిర్బంధించినారు. ప్రభుత్వం పైకి ఎన్ని ప్రచారాలు చేసుకున్నప్పటికీ, ఈ నిర్బంధ క్యాంపుల గురించి ప్రజలకు త్వరలోనే అర్థం అయ్యింది. ఈ నిర్బంధ శిబిరాల నుండి ప్రజలు పారిపోవడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని కూడా వివరంగా రాసింది రేణుక.

రేణుక కేవలం దహనాలు, అత్యాచారాలు, హత్యల గురించి మాత్రమే చెప్పి ఊరుకోలేదు. ఈ విధ్వంసం, మారణకాండలు ఆదివాసీ సమాజాన్ని ఎలా ప్రభావితం చేశాయో వివిధ కోణాలలో వివరించింది. ప్రతి చిన్న మార్పును రికార్డు చేసింది. సాధారణంగా చాలా మంది పెద్దగా పట్టించుకోని, అంత ముఖ్యమైనవి కావు అనుకునే ప్రతి విషయాన్ని వివిధ కోణాలలో వివరించి వాటి ప్రాముఖ్యతను నిరూపించింది. అలా రేణుక తన ప్రత్యేకతను కూడా చాటుకున్నది. సల్వాజుడుం మూకలు పదే పదే గ్రామాలపైన దాడి చేయడం వలన ఆదివాసులు, మిలిషీయా సెంట్రీలు చేస్తూ ఉంటే దున్నడం ఇతర వ్యవసాయ పనులు చేసుకోవలసి వచ్చింది. ఎప్పుడో 70వ దశకంలో అమెరికా సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడే కాలంలో వియత్నాం ప్రజలు తుపాకులు చంకలకు తగిలించుకునే వ్యవసాయ పనులు చేసుకునేవారని చదివాము. బస్తర్‌లో దాన్ని చూపిస్తుంది రేణుక . సల్వాజుడుం మూకలు దాడి చేస్తే రక్షణ ప్రాంతానికి త్వరగా వెళ్ళడానికి అడవి అంచున ఉన్న భూములలోనే వ్యవసాయం చేయడం అనివార్యం అయ్యింది. అడవికి దూరంగా ఉన్న భూములను వదిలేయడం ద్వారా సాగు చేసే భూమి తగ్గిపోయింది. నిల్వ ఉన్న ధాన్యాన్ని తగులబెట్టారు. మరోవైపు వ్యవసాయం తగ్గటంతో చేతికి వచ్చే పంట తగ్గిపోయింది.

అత్యాచారాల విషయంలో కూడా ఆదివాసీ సమాజం ఆలోచనలలో వస్తున్న మార్పును దాడుల సందర్భంగా రేణుక గుర్తించింది. సాధారణంగా ఆదివాసీ సమాజంలో స్త్రీలపై అత్యాచారాలు జరిగితే దాన్ని దానికి పాల్పడ్డ పురుషుల తప్పుగానే పరిగణిస్తారు. వివాహం కాని అమ్మాయిలపై అత్యాచారాలు జరిగితే బయటి సమాజంలో లాగ వారికి పెళ్లి కాకపోవడం అనే సమస్య ఆదివాసీ సమాజంలో లేదు. కానీ వివాహం అయిన స్త్రీలపై అత్యాచారాలు జరిగితే పురుషులనే దోషులుగా పరిగణించినా, వివాహం అయినందున కీడు నివారణ కొరకు పూజారులు చిన్న కర్మకాండ చేస్తారు. అంతే తప్ప భర్తలు వారి భార్యలను వదిలివేయడం ఉండదు. సల్వాజుడుం దాడుల సందర్భంగా వివాహం అయిన చాలామంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. ఆదివాసీ సమాజంపై బయటి సమాజం ప్రభావం పడడంతో కొందరు భర్తలు అత్యాచారాలకు గురైన తమ భార్యలతో కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదు అంటుంది రేణుక. ఆదివాసీ సమాజంపై బయటి సమాజపు భావజాలం అంత బలంగా ఉండకపోవచ్చు, కానీ అసలే లేదని చెప్పలేం అంటుంది. మరోచోట సల్వాజుడుం శిబిరాలలో అత్యాచారాలకు గురి అయ్యి గర్భవతులైన మహిళలు సిగ్గుతో తమ గ్రామాలకు వెళ్లకుండా అప్పట్లో ఆ శిబిరాల్లోనే ఉండిపోయారు. ఈ విషయం తెలిసినప్పుడు కూడా కూడా రేణుక మరోసారి “ఇవన్నీ విన్నప్పుడు నేను మొదట చెప్పినట్లు అత్యాచార బాధితులనే నేరస్తులుగా చూసే బయటి సమాజపు దృక్పథం ప్రభావం ఈ సమాజంపైన పడిందని తప్పకుండా అనిపిస్తుంది” అంటుంది.

ఈ నిర్బంధ కాలంలో తల్లులు, పిల్లల కష్టాల గురించి ప్రత్యేకంగా చూపించింది. సాధారణంగా ఏ ఉద్యమ ప్రాంతంలోనైనా నిర్బంధం మీద పడ్డప్పుడు ఎక్కువగా కష్టాలపాలు అయ్యేది మహిళలు, పిల్లలే. పురుషులు జైల్లోకి అయినా వెళతారు లేదా అజ్ఞాతంలోకి వెళ్తారు. మహిళలు పిల్లలే సమాజాన్ని నిలబెడతారు ఉద్యమాన్ని కాపాడుతారు. నిర్బంధంలోనూ మహిళలు ఎదుర్కొనే ప్రత్యేక సమస్యలను వివరంగా పేర్కొన్నది. జూడుం మూకలు గ్రామాలపై దాడి చేసినప్పుడు, చిన్నపిల్లలను మహిళలే ఎత్తుకొని పరుగెత్తే వారు. కొద్దిగా పెద్ద పిల్లలే మగవాళ్లతో పరుగెత్తే వారు. సమస్య చిన్న పిల్లలను ఎత్తుకొని పరుగెత్తడంలోనే కాదు, చిన్న పిల్లలను ఏడవకుండా చూడవలసిన బాధ్యత కూడా మహిళలపైనే ఉంటుంది. కొంతమంది మహిళలు పిల్లలను ఎత్తుకొని పరుగెత్తలేక పడిపోయి జూడుం మూకలకు దొరికిపోయారు. పిల్లలను ఎత్తుకొని పరుగెత్తినా మహిళలు మరో సమస్యను కూడా ఎదుర్కొన్నారు. భయపడి పోయిన పిల్లలు పెద్దగా ఏడుస్తూ ఉంటే మగవాళ్ళు మహిళలనే కోప్పడే వారు. పిల్లల ఏడుపులు వింటే జూడుం మూకలకు అందరం దొరికిపోతాము అని భయపడేవారు.

ఈ నిర్భంధ కాలంలో, కొత్త వారసుల కొరకు సంతోషంగా ఎదురు చూసే ప్రసవాలు కూడా మహిళలకు పెద్ద సమస్యగా మారిపోయాయి. రేణుక ఇంటర్వ్యూ చేసిన 209 మహిళలో 96 మంది మహిళలు గర్భిణీలే. జూడుం మూకలు వచ్చినప్పుడల్లా పరుగెత్తడం వల్ల, సరైన తిండి లేకపోవడం వల్ల, గర్భంతో ఉన్నప్పుడు దెబ్బలు తినడం వలన పిల్లలు నెలలు నిండకుండానే పుట్టడం, కడుపులోనే చనిపోయి పుట్టడం, పుట్టగానే చనిపోవడం జరిగింది. బతికిన పిల్లలు సరైన ఆహారం లేకుండా బలహీనంగా తయారయ్యారు. గతంకంటే శిశు మరణాల రేటు పెరిగిందని ప్రజలు చెప్పారు. గోర్నం గ్రామానికి చెందిన మంగ్లి గర్భవతి అయిన కారణంగా పరుగెత్తలేక పోలీసులకు దొరికిపోయింది. విచక్షణారహితంగా కడుపు మీద కొట్టడం వలన బిడ్డ కడుపులోనే చనిపోయి పుట్టింది. రెండవసారి గర్భవతి అయ్యింది కానీ గర్భస్రావం జరిగింది. ఈసారి తల్లి చనిపోయింది. అవునార్ గ్రామానికి చెందిన వేముల లచ్చి చెప్పిన ప్రకారం “పొట్టతో ఉన్నప్పుడు ఒకసారి పోలీసులు కొట్టారు. కడుపులో ఉన్న బిడ్డ చనిపోతే నేను కూడా చనిపోతానని తర్వాత నుంచి పోలీసులు వస్తే ఉరికే దాన్ని. పొట్టను ఎక్కడ చూసుకోనూ, ముందే ఉన్న చిన్న పిల్లను ఎక్కడ చూసుకోను?” అంటుంది. చిల్నార్ గ్రామానికి చెందిన మాడివి ఊరే అనుభవం ఇంకా బాధాకరం. గర్భంతో ఉండటంవలన పోలీసులు వచ్చినప్పుడల్లా పరుగెత్తి, పరుగెత్తి ఇక తన వల్ల కాదని శిబిరానికే వెళ్ళింది. అక్కడ ఆమెను బాగా కొట్టారు. కడుపు మీద తన్నారు. దాంతో అక్కడ నుండి పారిపోయి వచ్చింది. నెల రోజులకు ప్రసవించింది. బిడ్డ పుట్టి చనిపోయింది. కాని కడుపులో ఇంకో బిడ్డ ఉన్నట్లు అర్థం అయ్యింది. ఇంతలో పోలీసులు రావడంతో ఆమెను అలాగే మంచం మీద వేసుకొని పక్క గ్రామం మన్కేలికి పరుగెత్తారు. వెళ్తూ, వెళ్తూ మొదట చనిపోయిన బిడ్డను ఖననం చేసి వెళ్లారు. మన్కేలిలో మరో బిడ్డ పుట్టి చనిపోయింది. “ఒకే గర్భంలో, ఒకేసారి ఊపిరి పోసుకొని 9 నెలలు కలిసి ఉండి, కొద్ది గంటల వ్యవధిలోనే పుట్టిన ఇద్దరు కవల శిశువుల జన్మ స్థలాలు, ఖనన స్థలాలు వేరు వేరు అయిపోయాయి” అంటుంది రేణుక ఎంతో బాధతో. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. సల్వాజూడుం కాలంలో పిల్లల్ని కన్న వాళ్ళందరూ అడవిలోనే కన్నారు. పిల్లలు పుట్టినప్పుడు ఎంతో సంబరంగా చేసుకునే వేడుకలు అన్ని బంద్ అయ్యాయి.

సల్వాజుడుం పరుగెడుతూ, పరుగెడుతూ పిల్లల్ని కనాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టి ప్రశాంతమైన పుట్టుకలనే కాదు, ప్రశాంతమైన చావులను కూడా లేకుండా చేసింది. అంతే కాదు, అది ప్రశాంతమైన అంత్యక్రియలను కూడా లేకుండా చేసింది. ఆదివాసుల జీవితంలో చావుకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. అంతిమ సంస్కారం ఘనంగా కాకపోయినా, గౌరవపూర్వకంగా జరగాలని మాత్రం తప్పకుండా కోరుకుంటారు. తమ కుటుంబం, బంధువులు, గ్రామ ప్రజల సమక్షంలో, తమ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగాలని కోరుకుంటారు. ఎవరి అంతిమ సంస్కారమైనా గౌరవపూర్వకంగా జరగకపోతే చనిపోయిన జంతువును పారేసినట్లుగా పారేశారని అంటారు. సల్వాజుడుం మూకలు గ్రామాలపైన దాడులు చేసి ప్రజలను ఇష్టం ఉన్నట్లుగా చంపేస్తున్నప్పుడు, ఆదివాసులు అంతిమ సంస్కారాలు సరిగా చేయలేక పోయారు. నిర్బంధ శిబిరాలలో చంపిన వాళ్ళ శవాలను ఇవ్వనే లేదు. ఎప్పుడైనా ఇచ్చినా కూడా సొంతూళ్లకు తీసుకెళ్లనివ్వలేదు.

హేముల పైకి అనే సంఘం నాయకురాలు చనిపోతే ఆమె అంత్యక్రియలు చేయడానికి గ్రామ ప్రజలందరూ స్మశానానికి చేరుకున్నారు. శవాన్ని బొందలోకి దించగానే పోలీసులు వచ్చారు. దానితో హడావుడిగా శవంపై గుడ్డ కప్పి, చెట్ల కొమ్మలు వేసి పరుగెత్తారు. రెండవ రోజు మంచిగా చేద్దామని వెళ్లేసరికి మళ్లీ పోలీసులు వచ్చారు. మళ్లీ పరుగెత్తారు. మూడోరోజు కానీ ఆమె అంత్యక్రియలు పూర్తి కాలేదు. జూడుం మూకల భయానికి అడవిలో ఉంటుండగా బుద్రాం చిరుత పులి దాడిలో చనిపోయాడు. శవాన్ని మొదట ఇంటికి, ఆ తరువాత స్మశానానికి తీసుకెళ్లారు. అప్పుడే పోలీసులు వచ్చారు. దాంతో శవాన్ని అక్కడే వదిలేసి అందరూ పారిపోయారు. పగలంతా శవం అక్కడే ఉండిపోయింది. సాయంత్రం తిరిగి వచ్చి అంత్యక్రియలు చేశారు. రేగడిగట్ట గ్రామానికి చెందిన తాతి సుక్కి కొడుకుకు రక్త విరేచనాలు అయ్యాయి. అదే సమయంలో పోలీసులు వచ్చారు. చేసేదేం లేక పిల్లవాణ్ణి అలాగే ఎత్తుకొని పరుగెడుతుంటే, కొండమీద చనిపోయాడు. చనిపోయిన కొడుకును ఊర్లోకి తీసుకెళ్లలేని పరిస్థితి. దాంతో శవాన్ని పక్క గ్రామానికి తీసుకెళ్లింది. పక్క గ్రామం వాళ్లే అంత్యక్రియలు చేశారు. ఆమె దగ్గర కప్పడానికి గుడ్డలు కూడా లేవప్పుడు. శవం మీద గుడ్డలు కప్పకుండా అంత్యక్రియలు చేయడం అంటే చనిపోయినవారిని అవమానించడంగా భావిస్తారు ఆదివాసులు. అవునార్ గ్రామానికి చెందిన హేముల సోమిలి పరుగెడుతూ, పరుగెడుతూ బిడ్డను కన్నది. ఆ తరువాత ఆ బిడ్డను తీసుకొని పరుగెడుతుంటే పాప చనిపోయింది. బొంద పెడదామంటే కప్పడానికి చిన్న గుడ్డ ముక్క కూడా లేదు. గుడ్డ కప్పకుండా ఎలా బొంద పెట్టాలి అని ఘర్షణ పడుతున్న సమయంలో పార్టీ కార్యకర్త ఒకరు లుంగీ ఇవ్వడంతో దాన్ని కప్పి బొంద పెట్టింది. ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే.

అయితే ప్రజలు క్రమంగా తేరుకుని ప్రతిఘటించడంతో సల్వాజుడుం వెనుక పట్టుపట్టింది. జూడుం మూకలు చేసిన అమానుషాల గురించి ప్రపంచానికి తెలవడం వల్ల ఈ నిర్బంధ క్యాంపెయిన్ కావలసినంత చెడ్డ పేరు మూటగట్టుకుంది. “భయంతో దాక్కుంటున్న, భయంతో పారిపోతున్న, భయంతో లొంగిపోతున్న ప్రజల మధ్యనే తెగించి పోరాడుతున్న ప్రజానీకం ఇక్కడ కనబడుతుంది. బీభత్సానికి మొదట దాక్కున్న ప్రజలు క్రమంగా తేరుకుని ప్రతిఘటనకు దిగుతున్నారు. జూడుం మూకలు ఎత్తుకపోయి శిబిరాల్లో బంధించిన వారు కూడా పారిపోయి వచ్చి ఉద్యమంలో భాగం అవుతున్నారు” అంటుంది రేణుక.

సల్వాజుడుం నిర్బంధం విఫలం కావడంతో, 2009లో గ్రీన్ హంట్ అనే మరో నిర్బంధ క్యాంపెయిన్ను ప్రభుత్వం ప్రారంభించింది. గ్రీన్ హంట్‌పై రేణుక రాసిన వ్యాసం పరిశీలిస్తే, సల్వాజుడుం నిర్బంధంలో జూడుం మూకలు గ్రామాలపై దాడులు చేయడం విధ్వంసం సృష్టించడంలో ప్రధాన పాత్ర వహిస్తే, ప్రభుత్వ బలగాలు వారికి వెన్నుదన్నుగా నిలబడి ఉన్నాయి. గ్రీన్ హంట్‌లో ప్రభుత్వ బలగాలు గ్రామాలపై దాడులు చేసి మారణకాండ సృష్టించడంలో ప్రధాన పాత్ర పోషిస్తే, జూడుం మూకలు సహాయక పాత్ర వహించాయి. ఈ తేడా తప్పితే ఈ వ్యాసం ప్రకారం, సల్వాజుడుంలో జరిగినన్ని దారుణాలు ఇందులో కూడా జరిగినాయి. అదే ప్రాంతం, అవే గ్రామాలు, అదే ప్రజలు.

ఈ పుస్తకం చివరలో బస్తర్‌లోని ఆదివాసుల వలసల గురించి ఒక పరిశోధనా వ్యాసం ఉంది. పాలకులు అవలంబిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల ఆర్థిక విధానాల వల్లనే వలసలు పెరుగుతున్నాయి అంటుంది రేణుక. ఈ సూత్రీకరణ అన్ని ప్రాంతాలకూ వర్తించినా, ఆదివాసీ ప్రాంతాలలో ఎందుకు వలస పోతున్నారో అధ్యయనం చేయాలనుకున్నది రేణుక. కొండగావ్ జిల్లాలో వలస వెళ్లి వచ్చిన వారిని దాదాపు 100 మందిని ఇంటర్వ్యూ చేసింది. 2013లో ఈస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ వాళ్ళు వలసల మీద ఒక వర్క్ షాప్ నిర్వహించారు. అందులో వలస వెళ్లి వచ్చిన 80 మంది పాల్గొన్నారు. వాళ్లను కలిసింది. ఆ వర్క్ షాప్ విశ్లేషణలను కూడా తీసుకున్నది. ఇంతకు వలసలకు కారణం ఏమిటి అని ప్రశ్నించి, మూడు కారణాలు చెప్పుతుంది రేణుక. ప్రధానమైనది ఆర్థిక కారణం. వ్యవసాయం అభివృద్ధి చెందకపోవడం, ఇతర పనులకు సరైన వేతనం, పంటలకు, అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించక పోవడం వల్ల కనీస అవసరాలు తీరడం లేదు. అందుకే ఆదివాసులు వలసల బాట పడుతున్నారు. తను మాట్లాడిన వారిలో మూడవ వంతు మంది వ్యవసాయంలో పెట్టుబడి కొరకు వెళుతున్నాం అని చెప్పారట. రెండవ కారణం పెట్టుబడిదారీ వినిమయ సంస్కృతి యువతలో మంచి బట్టలు, మొబైల్ ఫోన్లు, గడియారాలు, సైకిల్ మోటార్‌లు లాంటివి కొనుక్కోవాలనే కోరికలను పెంచుతున్నది. పెట్టుబడిదారీ విధానం పెంచుతున్న వస్తు వ్యామోహంతో పోల్చితే, ఆదివాసీ సమాజంలో వస్తు వ్యామోహం, వినిమయం తక్కువే అయినప్పటికీ, కూలికి బయటకు వెళ్లడానికి ఇదీ ఒక ముఖ్య కారణమే. ఇక మూడవ కారణం పోలీసు నిర్బంధం. దీన్ని రాజకీయ కారణంగా చెప్పుకోవచ్చు. నిర్బంధాన్ని తట్టుకునే సంసిద్ధత లేని వాళ్ళు దాన్ని తప్పించుకునే మార్గంగా వలస దారిని ఎంచుకుంటున్నారు.

ఈ వ్యాసంలో కూలీ కొరకు ఇతర ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగింది. అడవి జీవితానికి అలవాటు పడి ఉన్నవారు ఇతర ప్రాంతాల పరిస్థితులను, పని స్థలం వద్ద ఉండే పరిస్థితులను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అన్నిటికంటే పెద్ద సమస్య ఏజెంట్లు. బయటి ప్రాంతపు కాంట్రాక్టర్లు ఆదివాసీ ప్రాంతాలలో కొంతమందిని ఏజెంట్లుగా చేసుకుంటారు. వీరు జనాన్ని కూలి కొరకు బయటకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తుంటారు. వీరికి కమిషన్ ఉంటుంది. నెలకు ఇన్ని వేలు ఇస్తారని చెప్పి ఏజెంట్లు పంపిస్తారు. కానీ వారు చెప్పిన దగ్గరికి వెళ్లిన తర్వాత తెలుస్తుంది, ఏజెంట్లు చెప్పినంత కాదని. ఏజెంట్లు కేవలం కూలీలను సరఫరా చేసినందుకు కమిషన్ తీసుకోవడమే కాకుండా, కూలీలకు చెల్లించే వేతనాలు నుండి కూడా రకరకాలుగా డబ్బులు కొట్టేస్తూ ఉంటారు. ఆదివాసులకు కొత్త ప్రాంతాల్లో అక్కడి భాష తెలువదు. అక్కడి కూలి రేట్లు తెలవవు. హక్కులు తెలవవు. దానితో ఒక లెక్క లేకుండా పని చేయించుకుంటారు. ముందు నెల నెలకు వేతనం ఇస్తామంటారు తర్వాత, నెల, నెలా జీతం ఇస్తే మీరు పారిపోతారు. మొత్తం పని అయ్యాకే ఇస్తామంటారు. రోజువారీ ఖర్చులకు మాత్రమే ఇస్తారు. చివరిలో ఇవ్వాల్సినంత ఇవ్వరు. సగం వెట్టి చాకిరే చేయించుకుంటారు. ఆదివాసీ ప్రాంతాల నుండి వలస వెళ్లే కూలీల సమస్యలను చాలా వివరంగా సేకరించి, వివరించడమే కాదు ఇలా వలస వెళ్ళడం వలన ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి పైన పడే ప్రభావం గురించి కూడా రేణుక చర్చిస్తుంది. వలసల నివారణకు మార్గాల గురించి కూడా చెబుతుంది.

ఆదివాసులు స్వేచ్ఛాజీవులు. శ్రమలలో కూడా వాళ్లకు స్వేచ్ఛ ఉండాలి. వెసులుబాటు ఉండాలి. యంత్రాల్లాగా పనిచేయడం వాళ్లకు నచ్చని విషయం. తమ గడ్డమీద ఆదివాసులు స్వేచ్ఛగా శ్రమ చేస్తారు. వలస జీవితంలో వాళ్లు ప్రధానంగా కోల్పోయేది స్వేచ్ఛనే అంటుంది రేణుక. ఇంకా ఎన్నో రకాలుగా తమ సహజాతాలను వదులుకొని, స్వేచ్ఛగా, స్వచ్ఛంగా సౌరభాలు వెదజల్లే అడవిమల్లెలు ప్లాస్టిక్ పువ్వులుగా మారడం లాంటిదే ఇది అంటుంది. వలసలు పెరగడం, వలస కూలీలు అనుభవిస్తున్న బాధలు నిర్బంధాలు పత్రికలలో రావడం ప్రభుత్వానికి కూడా తెలుసు. అయితే ప్రభుత్వాల వద్ద, ఆదివాసుల వలసలను ఆపి ఆదివాసీ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఏమైనా పథకాలు ఉన్నాయా? లేవనే అంటుంది రేణుక. వలసలను నియంత్రించడానికని పేరుకు ఒక చట్టాన్ని చేసింది ప్రభుత్వం. ఈ చట్టం వలస కూలీలకు ఉపయోగపడిందేమీ లేదు కానీ, పోలీసులు జేబులు నింపుకోవడానికి ఉపయోగపడింది. అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం కొరకు, ఆదివాసులను అడవుల్లో నుండి తరిమేయాలని చూసే ప్రభుత్వాలకు వలసలను ఆపే ఉద్దేశం ఎలా ఉంటుందని ప్రశ్నిస్తుంది రేణుక. ఆదివాసులు వలస వెళ్లి కూలి చేసి తెచ్చిన డబ్బుతో ఆదివాసీ ప్రాంతాలు ఏమైనా అభివృద్ధి చెందాయా అంటే అది కూడా లేదు. ఇక్కడి శ్రమ బయటకు వెళ్లడం వల్ల లోకల్‌గా వ్యవసాయం అభివృద్ధి ఎక్కడిదక్కడే ఆగిపోయింది. ముందే వెనకబడిన వ్యవసాయం. “కూలికి పోవడం ద్వారా లభించే ఆదాయం ఇక్కడి ఆర్థిక వ్యవస్థకు చేకూర్చే నష్టాన్ని పూడ్చలేదు కూడా” అంటుంది రేణుక.

ఇన్ని రకాలుగా దుష్ప్రభావాన్ని వేస్తున్న వలసలను ఆపే మార్గం ఏమిటి? అని ప్రశ్నించి దానికి ఉపాధి అవకాశాలు పెరగడమే అని జవాబు చెబుతుంది. ఇక్కడి ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, సాగునీటి వసతి కల్పించడం, వ్యవసాయ ఆధారిత, అటవీ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడం మాత్రమే ఉపాధి అవకాశాలు పెంచి వలసలను ఆపగలుగుతాయి. వలసల మూలంగా ఈ ప్రాంతానికి ప్రజలకు జరుగుతున్న ముప్పును గుర్తించి, బయటి సమాజపు ప్రజలు, ప్రజాస్వామికవాదులు పాలకవర్గాల ఆదివాసీ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించినప్పుడే ఇక్కడ వ్యవసాయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం సాధ్యం అవుతుందని అంటుంది రేణుక అంతిమంగా. నిజానికి గుముడవెల్లి రేణుక రాసిన “విముక్తి బాటలో” పుస్తకంపైన పి.హెచ్.డి.నే చేయవచ్చు. అంత విస్తృతమైన విషయం ఉంది.

(అక్టోబర్ 14 గుముడవెల్లి రేణుక జయంతి)

2009 నుండి వివిధ తెలుగు దినపత్రికలకు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ విషయాలపై వ్యాసాలు రాస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు ఐదు ఆరు పుస్తకాల సమీక్షలు, పరిచయాలు రాసారు.

Leave a Reply